4, డిసెంబర్ 2011, ఆదివారం

అసలు కంటె వడ్డీ ముద్దు ..కదా..



అసలు కంటే వడ్డీ ముద్దంటారు .అది నిజమే కదా? అసలు మనం కష్టపడి సంపాదించుకుంటే అది మనం కష్టపడకుండా మనకి వడ్డీల్ని తెచ్చిపెడుతుంటుంది. ఆ వడ్డీ అసలు కంటె బహు ముద్దుగా ఉంటుంది. అలాగే మనం కష్టపడి పిల్లల్ని కని పెంచితే వారు మనకిచ్చే మనుమలో మనుమరాండ్రో బహు ముద్దొస్తారు. అదీ కాక మనం మన పిల్లల్ని ఎక్కువ ముద్దు చెయ్యం. ఎక్కడ పాడయి పోతారోనని. కొంత వయసు వచ్చాకనే పిల్లల్ని ఎలా ముద్దు చెయ్యాలో తెలుస్తుంది. జీవన సంధ్యలో మనుమలో మనుమరాళ్ళో మనకిచ్చే ఆనందం అనుభవిస్తే కాని తెలియదు. సరదాగా మా చిన్న మనుమడిమీద రాసుకున్న ఓ పుంజీడు  కందాలు మీ ముందు ఉంచుతున్నాను. ఇవి మీ మనుమడికీ వర్తిస్తాయి.





మాచిన్నమనుమడింటను
గోచీ లేకయె తిరుగును గోలను చేస్తూ
పేచీలకు లేదు కొదువ
ఏంచేసిన గాని వాడు ఎపుడున్ ముద్దే                              

బుడి బుడి  తడబడు నడకల
ఎడనెడ లేచుచు పడుచును నిలకడ లేకన్
గడబిడ చేసెడి మా మను
మడి చెయిదము మా మనసుల మక్కువ   పెంచున్                   

హద్దులు మీరిన అల్లరి
పెద్దగ చేస్తూ వదలని పెంకితనంతో
ఒద్దిక లేకయు నున్నను
ముద్దేకద మాకు వాని మోమును చూడన్                         

చిన్నా యని నే పిలువగ
నన్నేనాయని పరుగున నన్నుంజేరే
అన్నెము పున్నెము నెరుగని
కన్నడు మా కనులనింపు కాంతిని వేడ్కన్  

( మొదటి పద్యం నాలుగో పాదంలోప్రాసాభంగం అయిందని భావించే వారు  " ఆ చేష్టలు అన్ని మాకు హాయిని గూర్చున్"  అని చదువుకో వచ్చును)

సెలవా మరి..

30, నవంబర్ 2011, బుధవారం

సరదా..సరదాల కందాలొక రెండు పుంజీలు..


చిక్కని కాఫీ కప్పుతొ
ప్రక్కను చేరిన నిజసతి పాటల గంధిన్
అక్కున చేరిచి సొగసుగ
చెక్కిలి ముద్దాడ వలదె చెలిమి దలిర్పన్               
  
కందర్పుడేయు బాణము
సుందరి నీ వాలుచూపు సూటిగ నాటెన్
డెందము గాయంబాయెను
మందుగ అందీయరాదె  మధురాధరమే           

అందం నీకే సొంతం
సుందరి నీ సాటి దాన్ని  చూడగ లేదే
ఎందుకు ఈ బ్రతుకెందుకు
పొందక నీతోటి పొందు పూర్ణేందు ముఖీ            

పెళ్ళికి ముందరి  వలపులు
పెళ్ళైన పిదప కుదరవు పిసరంతైనా
పెళ్ళము తోడిది సరసము
కాళ్ళా వేళ్ళా పడుటయె కాముని కైనన్             

రాజీవాక్షులతోడను
రోజూ గొడవలు పడుచును రుక్కుట కంటెన్
రాజీ పడుచును మనమే
హాజీయనుచును గులాము లౌటయె మేలౌ       

సిరిమంతుని పెండ్లాడగ
తరుణులు పోటీ పడుదురు తమలో తామే
దొరకరు నిర్భాగ్యునకున్
పరిణయమాడగ పడతులు  పృధ్వీ స్థలిలో  
  
ఎంతయొ చదువులు చదివి మ
రెంతయొ నేర్చిన మగనికి ఏకాంతమునన్       
వింతగ మతి పోగొట్టగ
కాంతామణి చేయు బోధ కర్టెన్ లెక్చర్                 

తనసతి యుండగ వేరొక
వనితను తెచ్చిన యగునది భారము తలకున్
తనసతి గలిగియు శివుడా
మినుగంగను తేగనదియు  మెట్టెను తలపై    

ఇప్పటికింతే...సెలవు...                   

28, నవంబర్ 2011, సోమవారం

అనగనగనగా ఒక తాడి....తాటిచెట్టు కథ





      భూలోక కల్ప వృక్షంతాటిచెట్టు
                                మనవాళ్లు తాటిచెట్టుని భూలోక కల్ప వృక్షంగా భావించే వారట. దానికి ప్రధాన కారణం అది బహు ప్రయోజనకారి కావడమైనా  అది మన ప్రాంతాల్లో  విస్తారంగా పెరగడం దాన్నిపెంచడంలో గల సౌలభ్యం మిగిలిన కారణాలు కావచ్చు.
                                       పూర్వం ఆంధ్ర దేశంలో తాటితోపులు ప్రతి గ్రామంలో పెంచడం ధర్మకార్యంగా భావించే వారట. యెనభై తొంభై యేళ్ల ముసలి వానిని పట్టుకుని వాని చేత తాటిగింజలు నాటించే వారట. అట్లా నాటిన గింజలు మొలకెత్తి చెట్లై కాపుకు వచ్చే సరికి ఆ ముసలాయన హరీమంటాడని ప్రతీతి. ఎందుకంటే నాటిన తాటిచెట్టు ఇరవై అయిదేళ్లకు గాని కాపుకు రాదు. మూడు తరాల తాటి చెట్లను చూసిన వాడిని ముత్తాడిఅనే వారట. అంటే తన యెరుకలో నాటిన తాటి చెట్టు పెరిగి పెద్దదై పళ్లు కాచి వాటిగింజలు మళ్లా నాటితే అవి పెరిగి వాటికి పళ్లు కాస్తే వాటిననుభవించిన వాడు దీర్ఘాయుష్మంతుడే కదా.
ఈ తాటిచెట్లను నాటించడం ధర్మకార్యంగా భావించే వారని చెప్పాను కదా? వాటిని వేలూ లక్షల సంఖ్యలలో నాటించేవారట. ఒక శిలా శాసనం ప్రకారం ఒక పుణ్యపురుషుడు పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి సన్నిధి ప్రాంతంలో  నాలుగు లక్షల అరవై వేల తాటిచెట్లు నాటించేడట.
                                     తాటి చెట్లను పెంచడంలోని సౌలభ్యం ఏమిటంటే వాటిని నీటి వసతి లేని, పంటలకు పనికి రాని, ఎగుడు దిగుడు నేలల్లో కూడా హాయిగా పెంచుకో వచ్చు. దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు. మొక్కలు ఎదిగే దాకా కాపు కాయనక్కర్లేదు. ఆవిధంగా ఖర్చు లేని పంట. అయితే  తాటి చెట్ల ప్రయోజనాలు మాత్రం బహుళం. అవేమిటో కొద్దిగా వివరిస్తాను.

                                        తాటి మాను గుడిసెలు వేసుకుందికి నిట్రాటగానూ మిద్దె ఇళ్లలో స్తంభాలు,దూలాలు, వాసాలు గానూ పనికి వస్తుంది. తాటి ఆకులు పైకప్పుగా పనికి వస్తాయి. కట్లు కట్టడానికి తాటినార పనికి వస్తుంది . చిన్న చిన్న కాలువలు దాటడానికి వాటిమీద తాటి దూలాల్నివేసి బ్రిడ్జీల లాగా వాడుకునేవారు. ఇంట్లో వాడుకకి తాటి చాపలూ బుట్టలూ తయారు చేసుకోవచ్చు. నూతుల్లో నీళ్లుతోడుకోవడానికి తాటాకు బొక్కెనలు చేసుకోవచ్చు. మా ప్రాంతంలో వీటిని రేకలంటారు. తాటినారతో తాళ్లు పేనుకుంటారు. తాటి మాకులను నిలువుగా చీల్చివాటిని నీళ్లు పారించుకునే దోనెలుగా తయారు చేస్తారు. తాటి ఆకులతో విస్తళ్లు కూడా కుడతారట గాని నేనెప్పుడూ వాటిని చూడ లేదు.  తాటిముంజెలూ, తాటితేగలూ తాటిబెల్లం తాటికల్కండ తాటిపానకము తాటికల్లు ఆహార పానీయాలుగావాడుతారు. తాటి ఆకులతో గొడుగులను తయారు చేస్తారు. వీటిని మా ప్రాంతంలో గిడుగులనే వారు. వీటిల్లో పెద్దా చిన్నా సైజులవి ఉండేవి. వర్షా కాలంలో వీటిని వేసుకుని తిరిగే వాళ్లం. వీటితో సుఖమేమిటంటే  వీటిని చేత్తో పట్టుకోనక్కర లేదు. హెల్మెట్ లాగా దానికి వేలాడే తాడుని తగిలించుకోవడమే. తాటి ఆకుల ఈనెలు చీపుళ్లు గానూ ఎండుమట్టలూ మొదలైనవి వంటచెరకుగానూ పనికి వస్తాయి. తాటాకులతో విసన కర్రలు తయారు చేస్తారు. ఉష్ణ దేశమైన మన ప్రాంతంలో ఇవి  నేటి సెల్ ఫోన్ల లాగా అందరి చేతుల్లోనూ హస్త భూషణాలుగా విరాజిల్లేవి.  పెళ్లిళ్లలో అరుగుల మీద చాపలు పరచి చేతికి  విసన కర్రలు ఇచ్చేవారు. ఇవన్నీ జన బాహుళ్యానికి ఒనగూరే ప్రయోజనాలు.
                                            తాటి చెట్టు మరో ముఖ్య ప్రయోజనం నాడు మన విద్యా విజ్ఞానాల్ని పెంపొందించుకోవడానికి అవసరమైన  తాటాకుల్ని మనకందించడం. ఈ తాటాకుల మీద వ్రాసిన గ్రంథాలు శతాబ్దాల పాటు చెడిపోక నిలిచాయి. చక్కగా ఈనెలు తీసిన తాటాకుల్ని చుట్టలు చుట్టి పేడనీళ్లలో  కొంచెం సేపు ఉడకబెట్టి నీడ పట్టున ఆరబెట్టి భద్రపరచి గ్రంథాలు వ్రాసుకునేందుకు  దాచుకునే వారు. వీటినే అలేఖాలు అనే వారు. ( గుర్తుందా-- కన్యాశుల్కంలో రామప్ప పంతులు మా ఇంట్లో తాటాకుల అలేఖాలు అటకనిండా ఉన్నాయంటాడు. అవి ఇవే. కన్యాశుల్కం ఊసెత్తాను కనుక ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. నాటకం ద్వితీయాంకంలో ఒకటో స్థలంలో వెంకటేశం మా నాన్న నాక్కూడా పెళ్లి చాస్తాడు అన్నప్పుడు గిరీశం యివాళో పెద్ద పెళ్లి నీకు తల వెంట్రుక వాసి లో తప్పి పోయింది. యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్ పూరా ప్రయోజకుడివే..”   అంటాడు. ఇక్కడ తాళాధ్యాయం అంటే తాటి పట్టతో చెమ్డాలెక్కగొట్టడమన్న మాట.)
                                                     మరో ముఖ్యమైన విషయంమన తెలుగు స్త్రీలు ఎంతో పవిత్రంగానూ మంగళప్రదంగానూ భావించే తాళిబొట్టు తాటాకుతో తయారు చేసినదే. అందుకే దానికా పేరు వచ్చింది. అదే కాదు చెవులకు కూడా తాటాకులని భూషణాలుగా వాడేవారు. అందుకే  అవి చెవి కమ్మలయేయి.  నా చిన్నప్పుడు తాటాకులతో చేసిన బొమ్మల పెళ్ళిళ్లు చేయడంచూసేను.
                                                     ఎత్తులూ లోతులూ కొలతలు చెప్పడానికి చిన్నవైతే మనిషి నిలువుతో పోల్చినట్టుగా మరీ పెద్దవైతే తాటిచెట్టు పొడవుతో పోల్చి చెప్పేవారు. రెండు తాటిచెట్ల ఎత్తనీ మూడు తాళ్ల లోతనీ అంటూ. ఇదే తాళ ప్రమాణమంటే.  ఎంతో బాధలో ఉన్నప్పుడు పెద్ద నిట్టూర్పులు విడుస్తాం కదా? అలాంటి దుఃఖాన్ని సూచించడానికి  మాకు నిశ్వాస తాళ వృంతాలు గలవుఅంటారు కృష్ణ శాస్త్రి గారు.
    మన మహా భారతంలో భీష్మునికీ బలరామునికీ తాళ ధ్వజులనే పేర్లున్నాయి. వారి జెండాలపై తాటిచెట్ల గుర్తులండేవన్న మాట
 తాటి చెట్లు మన జీవితాల్తో ఎంతగా పెన వేసుకున్నాయంటే చాలా ఊళ్ల పేర్లు వాటి వల్ల వచ్చినవే. ఉదా  తాడిగిరి, తాడికొండ, తాళ్లవలస, తాటిపూడి, తాళ్లరేవు ఒంటితాడి మొదలైనవి. ఈపేర్లే కొందరికి ఇంటి పేర్లగానూ స్థిర పడ్డాయి. మాహైదరా బాదులో తాడ్ బన్ అనే ప్రదేశం ఉంది. ఆఫ్గనిస్తాన్ లో అరాచకానికీ విధ్వంసానికీ పేరు పడ్డ తాలిబన్ పేరు ఇలా వచ్చిన దేమో తెలుసుకోవాలి . ఇంతగా తెలుగు వారి జీవితాలతో పెన వేసుకున్న తాటిచెట్టు మన సామెతల్లో ఎలా దర్శనమిస్తుందో చూడండి:-
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురునా?
తాటిచెట్టుకింద పాలుతాగినా కల్లే అంటారు.
తాడితన్నే వాని తలదన్నే వాడుంటాడు.
తాటిచెట్టు ఎక్కా లేవు, తాటిగెల కొయ్యాలేవు, తాతా నీ కెందుకోయి పెండ్లాము
తాటి చెట్టు నీడ నీడా కాదు తగులుకున్న వాడు మొగుడూ కాదు. (తగులుకున్నది పెండ్లామూ కాదు.)
 తాగిన వాడే కడతాడు తాళ్ల పన్ను.       ఇత్యాది

(ఈ వ్యాసంలో తాటి చెట్లగురించి చెప్పిన దానిలో కొన్ని విశేషాలు కీ.శే. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ఆంద్ర కల్ప వృక్షము అనే వ్యాసం నుంచి గ్రహించేను. వారికి  నా కృతజ్ఞతలు.)
సెలవు.

17, నవంబర్ 2011, గురువారం

శ్రీ సాయి కి కందాల నీరాజనం


శ్రీ సాయి నామ మంత్రము
ఆశ్రయ మని మదిని తలచి ఆరాధించన్
ఆసాయి గురుడు  భక్తుల
బాసట గా నిలచి పరమ పదమును చేర్చున్                

షిరిడీ నాథుని దయకై
కరములు మొగిడిచి మనమును కరుణాత్ముని పై
తిరముగ నిలుపుచు సతతము
పరమాత్మా యనుచు పిలిచి ప్రార్థింపదగున్                       

ప్రణవ స్వరూప పావన
గుణసాంద్ర సకల మునిగణ ఘోషిత చింతా
మణి, యగణిత సాధుసుజన
గణ వందిత, మా ప్రణతులు గైకౌను స్వామీ                

అమృతానంద ప్రదాతా
సమధిక భక్తజన హృదయ సంవాసీ, ఓ
విమలాత్మా విమలచరిత
సమస్త దురితాపతహార  సద్గురు సాయీ  
   
శ్రీ పాద వల్లభా,మా
పాపాలన్నియు హరించు బాబా సాయీ
ఓ పావన చరితా, మము
కాపాడగ కోరుకొందు కావుము సాయీ                         

కోరను కోరికలను, కడ
తేరని నాబాధల కథ  తెలియును నీకే
చీరను వేరొక దైవము
కారుణ్యము జూపి నన్ను కావుము సాయీ    

           
గడచిన దినముల నన్నియు
గడపితి నీ సేవ మరచి గరువము తోడన్
కడచితి తిమిరపు సంద్రము
విడువను నీ పాద సేవ వేళెంతైనన్  
                            
పిలిచిన పలికే దైవమ
కలలను సాకారపరచు కరుణామయుడా
కొలిచెద నీ పదయుగళము
తలపుల నిన్నే నిలుపుచు ధ్యానము వీడన్   

కలుగని   సిరులను కోరను
కలలవి నెరవేరకున్న క్రాగుచు నుండన్
కలిగిన కలుముల తృప్తిని
కలిగించిన సద్గురు, గుణ గానము చేతున్                               

అడుగక నెన్నడు అమ్మయు
కుడువగ బెట్టదు అదెంత కూరిమి యున్నన్
అడుగకనే వరమిచ్చెడి
కడుకరుణామయుడు సాయి కాచెడు జనులన్   
       
సాయిని  కొలిచెడి జనులకు
ఏ యాపద కలుగ బోదు యెన్నండైనన్
పాయక భక్తుల గాచెడి
సాయికి జేజేలు పలికి సాగిల బడుదున్                              

సద్భావన  మదినిండగ
సద్భాషణములనె వినుట  ఆపై నీపై
సద్భక్తి కలిగియుండుట
మద్భాగ్యము గానె తలతు మదిలో  సాయీ  ! 

              శుభం.
      





14, నవంబర్ 2011, సోమవారం

నన్నయనుండి...నానీ కవులదాకా..కవులకు కందాల వందనాలు



 తెనుగున భారత కావ్యము
మునుపెన్నడు లేని దారి పోవగ నైనన్
తనదగు శైలిని నన్నయ
మన భాగ్యము కలిసి రాగ మనకందించెన్                  

తిక్కన కవి యొక్కండే
చిక్కని మన తెలుగు భాష చేవను చూపెన్
తక్కిన కవులకు చిక్కని
అక్కజమగు నతని శైలి   అనితర సాధ్యం                 

తీరుగ నన్నయ పోలిక
భారతమందున అరణ్య పర్వపు శేషం
పూరించెను, ఘన కవితా
పారగుడెఱ్ఱన, ప్రబంధ పరమేశ్వరుడై          

ఇమ్ముగ  చక్కని తెలుగున
కమ్మని కన్నయ్య కథలు కమనీయంగా
ముమ్మరమగు భక్తి కలుగ
బమ్మెర పోతన్న చెప్పె   భాగవతంబున్             
   
చవులూరెడు చాటువులను
అవలీలగచెప్పెనతడు ఆశువుగానే
కవిసార్వభౌముడాతడు
శివభక్తి పరాయణుండు  శ్రీనాథుండే  
                                    
 జంకేమి లేక పలికెద
ఇంకేదియు సాటి రాని ఇంపగు కావ్యం
శృంగారపు రస శిఖరం
వెంకట కవి చేమకూర విజయ విలాసం                   

వేమాయను మకుటముతో
వేమన పద్యాల యాట వెలదులు అన్నీ
సామాన్యుల నాల్కలపై
వేమరు నర్తించు చుండు వేయేండ్లయినన్   
          
చిరుత ప్రాయపు పాపల
పరువము సడలిన ముదుసలి  బాపల తోడన్
పరిణయముల ఖండించిన
పరశువు గురజాడ యనుట పాడియు గాదే    

సరసుల మనసుల దోచియు
కరమగు ఖ్యాతిని బడసిన కన్యా శుల్కం
విరచించె మన మహాకవి
గురజాడను నే నుతింతు గురుభావముతో          

ఆది కవులందు తిక్కన
ఆ తదుపరి కవులయందు నా వేమనయున్
ఆధునికులలో గురజా
డే తగుదురు యుగ కవులను యెంపిక చేయన్      
   
తిరుపతి వేంకట కవులును
కురిపించిరి తెలుగువారి గుండెల నిండా
సరసపు కవితా  వర్షం
మురిపెము తో తడిసి వారు ముద్దై పోవన్          

ఒకశ్రీ నింకొక శ్రీయును
ఒకచో చేర్చుచును పల్కు డొమ్మిక తోడన్
సుకవీంద్రుండే కనపడు
నగణిత ఖ్యాతిని బడసిన యతడే శ్రీశ్రీ    
                   
కవి చూడా మణి ఆరుద్ర
కవితా సంద్రము తరచిన  కౌశలమెంతేన్
చవి చూడగ వలయును కద
కవులకు నది తప్పని సరి కార్యము కాగా                   

విధి వంచిత లై వందెడు
విధవల చీకటి బ్రతుకుల వెలుగులు నింపెన్
విధవా వివాహ శుభకా
ర్యధురీణుడు, కందుకూరి యనఘుడు కాడే                 

ముని మాణిక్యం చూపెను
మనమెరుగని మన కుటుంబ మాధుర్యమునే
తనివార చదివి మీరలు
కనుడా రచనల సొబగులు కాంతం కథలన్  
         
కొంచెపు బుధ్ధులు కొందరు
పంచముడని పరిహసింప పాటింపకనే
మంజుల కవితల మనకం
దించిన జాషువ మనకవి తిలకుడు కాడే   
                        
అమృతం కురిసిన రాతిరి
గమనించని జనము నిద్ర  క్రమ్మియు నుండన్
తమిగొనుచు సుధను త్రావిన
అమరుడు మనకవి తిలక్కు  నభినందింతున్                          
 
చిరు చిరు నానీలందున
గురుతర భావాల గూర్చి గొప్పగ చెప్పే
చిరు నానీ కవులతొ నే
కర నిష్పీడన మొనర్తు కంగ్రాట్సంటూ                                


                      ***

8, నవంబర్ 2011, మంగళవారం

నా చాటువులు...ఓ డజన్...







                                   

నవ్వే జీవన మంత్రము
నవ్వక యుండెడి బ్రతుకులు నవ్వుల పాలే
నవ్వొక చక్కని యోగము
నవ్వే పరమౌషధమ్ము నరులకు జూడన్   

 మగలను నమ్మరు  మగువలు
ముగురమ్మల తీరు చూడ ముచ్చట గొలుపున్
మగలను నమ్మకనేకద
తగిలేయున్నారు వారు తమతమ మగలన్  

మాచింగ్ చీరలు లంగాల్
మాచింగ్  జాకెట్లు బొట్లు  మాచింగ్  జోళ్లున్
మాచింగ్ నగలును  కుదిరెను
మాచింగ్ మగడే దొరకడు  మహిళా మణికిన్  

రాజును చూసిన కళ్ళకు
మోజెట్టుల కలుగునయ్య మొగుడిని చూడన్
రోజూ ఉండేవాడీ
వాజమ్మేయనుచు తలచి వగతురు జాణల్             
           
కాశికి పోయిన కూడా
చేసిన పాపాలు పోవు చిడుగంతైనా
కాసింతైనా పుణ్యము
చేసిన పాపాలు కడుగు జీవితమందున్    

పిడికెడు మెతుకులు పెట్టిన
విడువదు మన గడప కుక్క విశ్వాసంతో
కడుపార పెట్టి పెంచిన
కొడుకులె మనవారు కారు  గోవింద హరీ    

అడ్డాల నాటి బిడ్డలు
గడ్డం మీసాలు మొలిచి కండలు పెంచీ
ఎడ్డెం తెడ్డెం అంటూ
అడ్డం తిరిగితె మనగతి అయ్యో రామా  

కందకు లేదే దురదా
ఎందుకు మరి కత్తి పీట కెట్లా వచ్చెన్ ?
కొందరి నైజంబంతే
అందరితో తగవులాడు అవలక్షణమే !  

 నీరే దొరకదు గానీ
సారాయికి లోటులేదు  సర్వం సిధ్ధం
ఊరూరా వెలసిన ఆ
సారాయంగళ్ళ లోన  స్టాకులు ఫుల్లే 

దివిటీ పట్టుకు వెదికిన
అవినీతే లేనిచోటు అగుపడదయ్యో
చివరకు కాటికి పోవగ
శవదహనమునకును కూడ చాతురు చేతుల్   

పేకాట  ఆడువారికి
ఆకలి దప్పులును లేవు ఆటలొ మునుగన్
పేకాటలొ బంధుత్వము
లాకేత్వము దాకు కొమ్ము  లాభమె ధ్యేయం    
         
పగలే మద్యము గ్రోలుచు
తగరుల మాంసము భుజించి తనియక నాపై
మగువల పొందును గోరెడి
జగమెరిగిన బ్రాహ్మణునకు జందెంబేలా    

(  ఈ పద్యాలు నా కందాలు మకరందాలు  కవితాపుష్పకం లోనివి.  ఈ బ్లాగు ప్రారంభించిన కొత్తలో  అనుభవ రాహిత్యం చేత వాటిని సరిగా పెట్టక పోవడం  లింకులు ఇవ్వక పోవడంతో మిత్రులు వాటిని చూడ లేక పోయారని తెలిసింది. అందుకే వాటిని తొలగించి  మళ్లా కొద్ది కొద్దిగా పెట్టాలని సంకల్పించాను మరోసారి మరికొన్ని...సెలవు.)


28, అక్టోబర్ 2011, శుక్రవారం

సోఁవులప్ప చెప్పిన సామెతలు


సామెత  లేని మాట ఆమెత లేని ఇల్లు అన్నారు.  ఆమెత అంటే విందు. సామెత లేని మాట చారూ అన్నం అయితే సామెత తో కూడిన మాటలు విందు భోజనం లాంటిదన్నమాట. ఏ భాషకయినా ఆ భాషలోని సామెతలే అలంకారాలు. ఒకొక్కప్పుడు పది మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క సామెత అవలీలగా విశదీకరిస్తుంది. నా చిన్నతనంలో సామెతలు  అందరినోటా తరచూ వినిపిస్తుండేవి. ఇప్పుడవి అపురూపాలయిపోయేయి.  పుస్తకాలకే పరిమితమైపోయేయి.
  
                        మొన్నామధ్య సోఁవులప్ప కథ చెప్తూ ( సోఁవులప్పకి జేజే పోస్ట్   ఇక్కడ నొక్కి చూడండి )  ఆమెకి కడుపునిండా సామెతలే. సామెత లేకుండా  ఒక్క ముక్కయినా మాట్లాడదని చెప్పేను. అయితే ఆవిడ సామెతల్ని వేరుగా పరిచయం చేద్దామనే సంకల్పంతో అప్పుడు ఒక్క సామెత కూడా మీకు నేను పరిచయం చేయలేదు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మా ప్రాంతపు సామెతల్ని  మీకు రుచి చూపిస్తాను. మా ప్రాంతపువి అన్నంత మాత్రాన  ఇతర ప్రాంతాలలో ఇవో ఇలాంటివో ఉండవని కాదు. ఒకే భావాన్ని వెలిబుచ్చే సామెతలు వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రాంతపు నుడికారాన్ని  సంతరించుకుని వింత పరిమళాలతో గుబాళిస్తాయి. చాలామట్టుకు అందరికీ అర్థమయ్యేటట్లే ఉంటాయి. అవసరమనుకున్న చోట వివరణలు ఇస్తున్నాను.
సోలెడు బియ్యం కూలికెళ్తే కుంచెడు బియ్యం కుక్క తినీసిందట.

పాత రోజుల్లో కొన్ని ప్రదేశాల్లో శేర్లు అనే కొలమానం ఉన్నట్టుగానే ఉత్తరాంధ్రలో  గిద్దలు సోలలు తవ్వలు అడ్డలు కుంచాలూ అనే కొలపాత్రలుండేవి. గిద్దలు అన్నిటికంటే చిన్నవి.  అంతకంటే పెద్దవి  సోలలూ,తవ్వలూ..  ఆ తరువాత అడ్డలూ కుంచాలూ..  ఈ సామెత కర్థం చిన్నదానికాశపడి పెద్దది పోగొట్టుకోవడం.
(pennywise pound foolish  అన్నమాట.)
కుంచాల సంగతి వచ్చింది కనుక  మరో సామెత..కుంచమంత కూతురుంటే అన్నీ మంచంమీదనే.--- కుంచమంటే పెద్దది కదాఅంటే ఎదిగిన కూతురింట్లో ఉంటే తల్లిని మంచం దిగనివ్వకుండా సేవ చేస్తుందని…( నమ్మకమేనా?)
కుంచాల గురించే మరో సంగతి. మా వేపు షావుకార్లు  వారే మైనా అమ్మిన ప్పుడు చిన్నమ్మీ కుంచంతే అంటారట. వారే ఏదైనా కొనుక్కునేటప్పుడు పెద్దమ్మీ కుంచంతే అంటారుట. అమ్మినప్పుడు చిన్నకుంచం కొన్నప్పుడు పెద్దకుంచం అన్నమాట చూడండి వారి గడుసుదనం.

అప్పబతుకు అడగక్కర్లేదు.. సెల్లి బతుకు సెప్పక్కర్లేదు.
ఒక దాని కంటే మరొకటి ఇంకా అధ్వాన్నమని చెప్పడం.

ఒంతునొచ్చింది గెంతితే తప్పుతుందా 
కర్మ వశాన జరగాల్సింది జరిగే తీరుతుంది కాని తప్పించుకోలేమని.        

ఎద్దెప్పుడూ ఒక పక్కనే తొంగోని ఉండిపోద్దా?
తొంగోవడమంటే పడుక్కోవడం.కాలమెప్పుడూ ఒకేలాగ ఉండదని చెప్పడం

లోపల ఊష్టం... పైకి నేస్తం..
ఊష్టమంటే ఉష్ణము. లోపల ఉడికి పోతూ పైకి స్నేహం నటించడమన్నమాట

సుడొక దెగ్గిర... సురకొక దెగ్గిర
సురకంటే చుట్టకాల్చి వాత పెట్టడం.  కొన్ని వ్యాధులకి  చురక పెట్టడమే మందు అని భావిస్తారు. వ్యాధి ఒకటైతే మందు మరోదానికి వేసినట్టు.
జరిగినమ్మ జల్లిడితోని నీళ్లు మోసిందట
జల్లిడి అంటే జల్లెడ ( seive)  కన్నాలుంటాయి కనుక నీళ్లు నిలవ్వు. కొందరేంచేసినా చెల్లుతుంది. అడిగే వాళ్లుండరు. అలాంటి అమ్మే జరిగినమ్మ.
ఈ సందర్భంలోనే మరో సామెతజరిగితే జొరమంత సుఖం లేదు.--  చేసే వాళ్లుంటే వెచ్చగా కప్పుకుని పడుక్కోవచ్చు కదా ?
పెసరగుడ్డిల పారీసి ఉప్పు దాకల ఎతకడం.
గుడ్డి అంటే పొలం. దాక అంటే  వెడల్పు మూతి కుండ.. ఒకచోట పారేసి మరోచోట వెతుక్కోవడమన్నమాట, వృథా ప్రయాస అని అర్థం.

గడియ తీరదు... గవ్వరాదు
క్షణం తీరిక లేకుండా పని చేసినా రాబడి లేక పోవడం.. గవ్వలు మరీ పాతకాలంలో చిన్న డబ్బుకింద చెలామణీ అయేవి.

కరువుకి దాసర్లైతే పాట కుదరొద్దా?
కరువు వచ్చి భుక్తి గడవక  దాసరి వేషం వేసుకున్నాడట. ఎవరైనా ఇన్ని గింజలు వేయక పోతారా అని. వేషమైతే వేయొచ్చు కాని దాసరి పాడే పాట పాడడం రావొద్దా?  దాసర్లు పాడుకుంటూ వెళ్తుంటే అడక్కుండానే ఆయన జోలి నింపుతారు ఊరివాళ్లు.
నాలిక మీదే బూరెలు వండడం.
లేని ఆశలు కల్పించడం. నాలిక మీదే బూరెలు వండితే తినడమే తరువాయి అన్నట్టు. ఆది జరిగే పని కాదు కదా?
ఈక పండితే అందరూ ఇల్లాళ్లే
వృద్ధ నారీ పతివ్రతా అన్నది ఆర్యోక్తి. ఈక పండడం అంటే తల నెరియడం. వయసు మీరడం. Compulsive chastity అన్న మాట.
సరసుడ్ని నమ్మి పురుసుడ్ని పొయిలో పెట్టేసినట్టు
పురుషుడంటే మగడు.. సరసుడి మాయలో పడి మొగుణ్ణి వదిలించుకున్నట్టు
ముల్లుకి మొనలెవరు దిద్దుతారు.
ముల్లు మొనదీరి ఉండడం దాని సహజగుణం. కొన్ని విషయాలు సహజంగానే అబ్బాలనీ నేర్పిస్తే వచ్చేవి కావనీ చెప్పే సందర్భంలోనిది.
కొకిలమ్మకెవడు పాట నేర్పెనూ.. చేప పిల్లకెవడు ఈత నేర్పెనూ అని కదా సినీ కవిగారన్నారు?
దండుక్కి ఒప్పుకుంతారు గానీ దరమానికి ఒప్పుకోరు.
దండుగ అంటే పన్ను.(Tax-levy)  ధర్మం చేయడానికి చేతులు రాక పోయినా పన్ను కట్టక తప్పదు కదా?
ఇంటి మునోకట సూత్తే ఇల్లాల్ని సూడక్కర్లేదు.
 మునోకట అంటే ముని వాకిటఇంటిముందరి వాకిలిలో. అక్కడ చక్కగా అలికి ముగ్గు పెట్టి ఉంటే ఇల్లాలు పనిమంతురాలని తెలిసి పోతుంది.
కూటిల పాలు పోయనోడు కాటిల గేదని కట్టేసినాడట.
బ్రతికుండగా ఏమీ చేయని వాడు చచ్చేక ఏంచేస్తాడని ఎగతాళి.
కనపడిందానికి గట్టెక్కి సూడ్డమేల?
ముంజేతి కంకణానికి అద్దమేల అని అనడం. ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా ఎత్తుకి పోయి చూడాల్సిన పనేముంది?
బతికి సెడినోల్లకి బాదలు లావు. సెడి బతికినోల్లకి సేస్టలు లావు.
ఉత్తరాంధ్రలో లావు అంటే ఎక్కువ అని అర్థం.  బాగా బ్రతికి చెడిన వారికి బ్రతుకు దుర్భరమేకదా?    సెడి బతికినోల్లకిఅంటే హీన స్థితి నుంచి పైకొచ్చిన వారికి నడమంత్రపు సిరితో షోకులు ఎక్కువే అవుతాయి.  ( అర్థ రాత్రి గొడుగు పట్టమన్నాడని సామెత కదా?)
ఇదంసెడి ఈటీవోడికిస్తే సచ్చీదాకా సాపలమోతే.
విధము చెడి అంటే గత్యంతరం లేక ఈటీ వోడికి అంటే వీటివిద్యలు చేసుకుని బ్రతికే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె బ్రతుకంతా చాపలు మోసుకుంటూ ఊళ్లు తిరగడమేనని భావం.

ఇలా మరికొన్ని సామెత లున్నాయి గానీ ఓ రెండు కొత్త సామెతలు చెప్పి ఆపేస్తాను.
 ఆఫీసోల్లు పని చెయ్యడమంటే అసిరమ్మ పిల్లలు కాసినట్టే
రెండూ జరగని పనులే అని చెప్పడం. గవర్నంటు ఆఫీసుల పని తీరుపై చురక.
పోలీసు కేసు... కోడి పియ్య బంక
పియ్య అంటే మలం. కోడి పియ్య కోడి విసర్జించిన మలం.  బంక అంటే Gum. కోడి పియ్య Sticky గా Fevicol లాగుండి ఒకంతకి వదలదన్న మాట. పోలీసుల కేసులూ అంతే కదా. ఒక సారి ఇరుక్కుంటే బయట పడ్డం కష్టం
( పియ్య అనే పదం మా ఉత్తరాంధ్ర పదం అనుకోవద్దు.పియ్య తినెడి కాకి పితరుడెట్లాయెరా అంటాడు కడప జిల్లా వాసి యైన వేమన గారు.)
ఆఖరుగా ఓ చిన్న ముచ్చట చెబుతాను. మా చిన్నప్పుడు మేము ఎవరితో నైనా స్నేహం చేసినప్పుడు  “ నువ్వూ నేనూ జట్టు..కోడి పియ్యట్టు అనుకుంటూ ఉండేవాళ్లం.  చిన్నప్పుడనుకునే వాణ్ణి ఛీ కోడి పియ్యతో అట్టేమి టని, కాని దానర్థం  ఇప్పుడు  బోధ పడింది.   కోడి పియ్యతో అట్టు వేస్తే దాన్ని  ఎవరూ పెనం నుంచి వేరు చేయలేరు. ఆ విధంగా మా స్నేహం (జట్టు) విడదీయరాని బంధ మన్నమాట. చూసేరా ఒక్క సామెతతో ఎంత గట్టి బంధాన్ని ఏర్పరచుకున్నామో? అదీ సామెతల సొగసు.

మా ఉత్తరాంధ్ర పలుకుబళ్ల గురించి మరోసారి రాస్తాను. ఇప్పటికి సెలవు.