11, ఫిబ్రవరి 2012, శనివారం

రెండు మాటలూ...రెండు ఊహలూ...


                            
నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు మానాన్నగారు తరచూ మాఊరినుంచి శ్రీకాకుళం వెళ్ళి వస్తూండేవారు. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా మర్నాడు కమాను వెళ్ళాలి అంటూ ఉండే వారు. తిరిగి వచ్చేక కూడా ఎవరైనా మీరు నిన్న ఊళ్లో లేరా అని అడిగితే కమాను వెళ్లి వచ్చేను అంటూ ఉండేవారు. కమాను వెళ్లడమంటే ప్రయాణమై వెళ్లడమని అప్పుడు నాకర్థమైంది. కానీ తర్వాత ఈ మాట ఎక్కువ మంది నోటంట విని ఉండలేదు. నాకు కొంచెం వయసొచ్చేక, నేను కన్యాశుల్కం చదువుతున్నప్పుడు మళ్ళీ ఈ మాట నా కళ్లబడింది. గిరీశం వెంకటేశాన్ని జామచెట్టెక్కి పళ్లు కోసుకు రమ్మన్నప్పుడు, అగ్నిహోత్రావధాన్లు అదేమిటని అడిగితే అది దొరల విద్యలో ఒక భాగమనీ, పెద్దయ్యాక వెంకటేశానికి గుణుపురం లో తాసీల్దారీ అయితే కమాన్లు వెళ్లాల్సి ఉంటుందనీ, అడవుల్లో ప్రయాణించేటప్పుడు చెట్లక్కడం నేర్చి ఉంటే పనికి వస్తుందనీ అంటాడు. ఎందుకో నాకీ పదం తెలుగు పదంలా అనిపించేది కాదు. నిఘంటువులు చూస్తే సూర్యరాయాంధ్ర నిఘంటువులో కమాను అంటే విల్లు ధనుస్సు అని మాత్రమే ఉంది. శ.ర. నిఘంటువు లో మాత్రం ఇది అన్య దేశ్యమనీ  ప్రయాణము విల్లు అనే అర్థాలున్నాయనీ తెలిసింది. విద్యార్థి కోశమనే నిఘంటువులో మాత్రం విల్లు అనీ ఫిడేలు వాయించు కొడుపు ( ఫిడేలు వాయించు సాధనం) అనీ ఉంది. హిందీ కమాన్ నుంచి వచ్చిన ఈ పదానికి ప్రయాణమనే అర్థం లేదు. మరి ప్రయాణ మనే అర్థమున్న కమాను అనే పదం ఏ అన్యదేశ భాష నుంచి వచ్చి ఉంటుంది? అని ఆలోచిస్తే నా ఊహకి తట్టిన విషయమేమిటంటే దొరల ఏలుబడిలో వారు ప్రయాణం చేయాల్సి  వచ్చినప్పుడు తమ గుమస్తాలనో బంట్రోతులనో వారితో రమ్మనడానికి Come On అటూ ఉండే వారేమో అలా ప్రయాణ మవడాన్ని దొర కమానంటే వెళ్లడం వలన కమానంటే ప్రయాణమని అనుకుని  ప్రయాణానికి అది ఇంగ్లీషు మాటగా వారి మాటల్లో స్థిర పడిఉంటుందనుకుంటాను. లేక పోతే ఏ పరభాషా పదం ఈ అర్థంతో ఉన్నదీ నాకు తట్టలేదు. మరో మంచి వ్యుత్పత్తి దొరికే వరకూ ఈ ఊహ బాగానే ఉంటుందనుకుంటాను.

కన్యాశుల్కం నాటకంలోనే ద్వితీయాంకం ప్రథమ స్థలంలో వెంకటేశం తల్లి, వెంకటేశం రాక కోసం ఎదురు చూస్తున్నప్పుడు, అగ్ని హోత్రావధాన్లు తాను వద్దంటూంటే వెంకమ్మ కొడుకుని ఇంగ్లీషు చదువులో పెట్టిందనీ, ఇంగ్లీషు చదువు తమకు అచ్చిరాదనీ తన పెద్దన్నదిబ్బావధాన్లు కొడుకుని ఇంగ్లీషు చదువుకి పార్వతీపురం పంపించే సరికి వూష్టం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేసిందనీ, బుచ్చబ్బి కొడుక్కి ఇంగిలీషు చెప్పిద్దామనుకుంటుండగానే చచ్చినంత ఖాయిలా చేసిందనీ అన్నప్పుడు వెంకమ్మ“ మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంటూ వుంటా”రని అంటుంది. అగ్రహారపు ఛాందస బ్రాహ్మణ స్త్రీ అయిన వెంకమ్మనోటంట ఓఘాయిత్యమనే వినిపించినా ఇది అఘాయిత్యం అనే మాటే. అయితే ఈ అఘాయిత్యం అనే మాట కూడా మన నిఘంటువుల్లో ఎక్కడా కనిపించదు. మొదట్లో ఇది అగత్యం అనే మాట అయి ఉంటుందనీ అగత్యం అంటే గత్యంతరం లేక పోవడం కనుక అలాంటి పరిస్థితుల్లో చేసే పనిని అఘాయిత్యం అంటారనీ అనుకునే వాడిని. కానీ ఈ ఊహ నాకు సంతృప్తి కలిగించ లేదు. తర్వాత ఆలోచించగా తట్టిందేమిటంటే ఇది అఘాయితము అయి ఉంటుందని. అఘము అనే పదానికి పాపము దుఃఖము అనే అర్థాలున్నాయి.ఇతము అనే ప్రత్యయానికి పొందినది కూడుకున్నది అనే అర్థం ఉంది.(నిందితుడు, బాధితుడు వంటి మాటలు చూడండి). పాపము లేక దుఃఖము కలిగినది లేక కూడుకున్నది. అఘాయితము. ఇదే అఘాయిత్యము లేక వెంకమ్మగారు చెప్పిన ఓఘాయిత్తం. ఇంగిలీషు చదువులకి పిల్లల్ని పంపిస్తే చనిపోతారని అగ్నిహోత్రావధాన్లనడం ఓఘయిత్తపు మాటలే కదా మరి?
నా దగ్గర ఏ వ్యుత్పత్తి పదకోశాలూ లేవు. ఈ రెండూ నా ఊహలు మాత్రమే. ఎక్కడైనా ఇంతకంటే సరియైనవీ ప్రామాణికమైనవీ వ్యుత్పత్తులు ఉంటే ఎవరైనా తెలియజేస్తే సంతోషిస్తాను. సెలవు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

మాయగాళ్ళకు మాయగాడు....మాయమైన సంవత్సరం


                           
                                      చిన్నతనంలో మన వూళ్లలో చూసే ఉంటారు పాముల్నాడించుకుంటూ చిన్న చిన్న మేజిక్కులు చేసుకుంటూ పాముల మందుల్నీ తావీజుల్ని అమ్ముకునే వారిని. అవి మామూలు మేజిక్కులే అయిఉండవచ్చుగాని వారిలో కొందరికి కనికట్టు విద్యలుంటాయని చెప్పుకునే వారు. పెద్దవూళ్లలో పి.సి.సర్కార్ వంటివారు  మనల్ని సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తే విద్యల్ని ప్రదర్శిస్తారు. మా నాన్నగారు చెప్పారు వారు వయసులో ఉండగా సీనియర్ సర్కార్ చేసిన ఒక మేజిక్ గురించి. అ రోజు ఆయన షో ప్రారంభానికి లేటుగా వచ్చాడట. వస్తూనే చాలా ముందుగా వచ్చినట్టున్నాను మనకింకాటైముంది కదా? అన్నాట్ట. అందరూ గోల పెడితే వాచీలు చూసుకోండి. సరిగా పదీ ఇరవయ్యే అయింది. ఇంకా పది నిమిషాలు టైముంది కదా అన్నాట్ట. అదేం విచిత్రమో కానీ ఏనాడూ ఏరెండు వాచీలు ఒకే టైము చూపక పోయినా అప్పుడు  మాత్రం అందరి చేతి వాచీలు పదీ ఇరవయ్యే చూపించాయట. మిగిలిన మేజిక్కుల సంగతేమో కానీ ఇలాంటివి కనికట్టు విద్యలుంటేనే సాధ్యమౌతాయి కాదా?.ఈమధ్య టీవీలో చాలా మేజిక్కులు ఎలా చేస్తారో చూడడం జరిగింది. అవి చూసేక ఓస్ ఇంతేనా అనిపించినా కొన్ని మాత్రం ఇంకా మనకి వింతగానే ఉంటాయి. కదిలే ట్రైన్ని  విమానాన్ని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా మాయం చేసే వారున్నారు. ఇతర దేశాల సంగతి ఇప్పుడు మనకొద్దు గానీ మన దేశం ఇటువంటి మాయలకీ మంత్రాలకీ పుట్టినిల్లని పిస్తుంది. మేజిక్కుల గురించి చెప్పుకున్నప్పుడు  The Great Indian Rope Trick  గురించి చెప్పుకు తీరాలి.. ఇందులో ఐంద్రజాలికుడు ఒక మందమైన తాడు తీసుకుని దాని చివరని గాలిలోకి విసురుతాడు. అప్పుడది ఒక స్తంభం మాదిరిగా నిటారుగా నిల్చుంటే ఆయన సహాయకుడు దాన్ని పట్టుకుని పాకుకుంటూ చివరి వరకూ వెళ్లి మాయమై పోతాడు. కొద్ది సేపటికి హాహాకారాలు వినిపిస్తూ నేలమీదికి రక్తం కారుతుందట. చూపరులందరూ నిశ్చేష్టులై ఉండిపోతే ఆ సహాయకుడు  ఏమీ జరగనట్టుగా కిందకి దిగి వస్తాడట. ఎటువంటి Technical Support లేకుండా ఇటువంటి ప్రదర్శన ఎలా సాధ్యమో తెలియదు. కనికట్టు అనే విద్య ఏమైనా ఉందేమో?  ఏది ఏమైనా ఇటువంటి విద్యలకి పుట్టినిల్లయిన మనదేశం లోనే చాలా కాలం కిందటే మాయగాళ్లకి మాయగాడైన మహనీయుడొకడు పుట్టేడు. ఆ వివరాలేమిటో  తెలుసుకుందాం..
                                                   ***
 మనం భాగవత కథలు విన్నప్పుడు శ్రీ కృష్ణుని లీలలు చాలా విన్నాము కదా?  ఆ కృష్ణుడు తాను నెలల బాలుడిగా ఉన్నప్పుడే తనని చంపడానికి కంసుని చే పంప బడ్డ పూతన  తన స్తన్యం ద్వారా విషమివ్వబోతే ఆమె  చనుబాలతో పాటు ఆమె రుధిరాన్ని కూడా త్రాగి ఆమె ప్రాణాల్నితోడేసి ఆమెని చంపి వేసిన వైనం మనకు తెలుసు. అలాగే తృణావర్తుడ్నీ వత్సాసుర బకాసురుల్నీ కూడా సంహరిస్తాడు. ఇవన్నీ ఆయనకి ఐదేళ్లు కూడా నిండకుండానే ( కౌమారంలోనే) జరిగాయి. తన ఐదవ ఏట, ఒక రోజు తన సంగడీ (స్నేహితు)లతో కలసి చల్దులున్న చిక్కాలను పట్టుకుని లేగ దూడల్ని మేపడానికి అడవికి వెళ్తాడు. వారు ఆలా వెళ్తుండగా దారిలో కంసుని పంపున అఘాసురుడనే రాక్షసుడు కొన్ని యోజనాల పొడవున్న పెద్దపాము రూపంలో భయంకరంగా దారికడ్డంగా పడుక్కుని నోట్లోంచి మంటలు కక్కుతుంటాడు. అయితే బాలకృష్ణుడు  పక్కనుండగా భయమనే మాటే తెలియని గోపబాలురు దాన్ని దాటి వెళ్లడానికే సిధ్ధపడతారు. అది ఒక్కసారిగా వారినీ లేగ దూడల్నీ కబళిస్తుంది. కానీ ఆది నోరు మూసుకునే లోపే బాలకృష్ణుడు దాని నోట్లో ప్రవేశించి ఒక్కసారిగా పెరుగుతాడు. అప్పుడా పాము ఊపిరాడక చనిపోతే తన మిత్రులందర్నీ  తీసుకుని బయటికి వస్తాడు. ఈ దృశ్యాన్ని గమనించిన దేవతలు హర్షధ్వానాలు చేస్తారు .
 తర్వాత ఒక చోట దూడల్ని పచ్చిక మేయడానికి వదలి,  ఒక కొలని గట్టున బాలకృష్ణుడు మధ్యలో కూర్చుండగా చుట్టూ కూర్చొని చల్దులు తినడం ఆరంభిస్తారు. ఉరుకులూ పరుగులూ లేని జీవితం కాబట్టి ఆడుకుంటూ పాడుకుంటూ మెల్లమెల్లగా తింటుంటారు. అప్పుడు బాలకృష్ణుడు లేగదూడలు మేత మేసుకుంటూ దూరంగా పోవడం గమనించి తన మిత్రుల్ని తింటూ ఉండమని తాను లేగల్ని వెతికి తీసుకు వస్తానని బయల్దేరతాడు. ఆ సమయంలో భూమి మీదకి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఈ బాలుడు చాలా చిన్నవాడు కదా అంత పెద్ద అఘాసురుణ్ణి ఎలా  చంపగలిగి ఉంటాడని ఆశ్చర్యపోతూ ఆ బాలుని శక్తి పరీక్షిద్దామనుకొని లేగదూడల్నీ గోపబాలుర్నీ ఒక మాయాగుహలో దాచిపెడతాడు. లేగల్ని వెతుక్కుంటూ వెళ్లిన కృష్ణుడు వాటి అడుగుల గుర్తులు చూసుకుంటూ ఇటు వెళ్లాయని ఇక్కడ మందగా నిలిచాయని అనుకుంటూ చాలాదూరం వెళ్లాడు.  దూడలు కని పించక తిరిగి వచ్చేసరికి చల్దులు తింటూ ఉండాల్సిన తన సంగడీలు కూడా కని పించలేదు. ఆయన సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారం కనుక అది బ్రహ్మదేవుడి మాయ అని గ్రహిస్తాడు. బ్రహ్మమాయని తొలగించేయడం తనకి చాలా తేలికైన పని అయినా ఆ లీలా పురుషుడు బ్రహ్మకే బుధ్ధి రావాలని ఊరుకుంటాడు. కానీ ఇంటికి వెళ్లగానే గోపబాలుర సంగతీ లేగదూడల సంగతీ అందరూ అడుగుతారని తానే వారందరి రూపాలూ కూడా ధరించి ఇంటికి మరలుతాడు. ఇళ్లదగ్గర పిల్లల్ని చూసిన తల్లులూ లేగల్ని చూసిన గోమాతలూ వారి వారి సంతానమే అనుకుని ఎప్పటిలాగే ఆప్యాయంగా చూసుకుని మురిసి పోతారు. ఈ విధంగా కృష్ణుడు ఇందరి రూపాలలో అందరికీ ఆనందం కలిగిస్తూ సుమారు ఒక సంవత్సరం పాటు గడుపుతాడు. సంవత్సరం కాలం ఇంక ఐదారు రోజులలో ముగుస్తుందనగా బ్రహ్మదేవుడు ( ఆయనకది ఒక తృటి కాలం)  ఏ మయిందో చూద్దామని వస్తాడు. మహాశ్చర్యకరంగా తను మాయాగుహలో దాచి ఉంచిన గోపబాలురూ లేగదూడలూ అక్కడే ఉండగా ఇక్కడ కృష్ణుని చుట్టూచేరి వారంతా ఆనందంగా ఉండడం కనిపిస్తుంది. తన మాయని మించిన మాయ ఏమిటో తెలియక విస్తుపోతాడు. అప్పుడు కృష్ణుడు  తన మాయని సడలించగా బ్రహ్మదేవునికి గోపబాలురందరూ హార కుండల కిరీటాలూ వైజయంతీ వనమాలికలు ధరించిన మేఘ శ్యామల మూర్తులుగా కనిపించారు. వారి తేజస్సు బ్రహ్మకు భరింపనలవి కాకుండా పోయింది. అప్పుడు  ఈ శ్రీకృష్ణుడు తనను కన్న తండ్రియైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని తెలిసికొని, పశ్చాత్తప్తుడై ఆయన కాళ్లమీద పడి చాలా సేపు స్తోత్రం చేస్తాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు బ్రహ్మను క్షమించి,  తాను సృష్టించిన మాయా రూపాల్ని తనలోనే కలిపేసుకుంటాడు.  బ్రహ్మ తన మాయాగుహలో దాచిన గోపబాలురనూ లేగలనూ తిరిగి యథా స్థానాల్లో ఉండేట్లు చేస్తాడు.  కొలని ఒడ్డున చల్దులు పట్టుకుని కూర్చున్న గోప బాలురు  కృష్ణుణ్ణి చూసి చెలికాడా వచ్చేవా, రా, మన లేగలన్నీ అరణ్యంలోంచి తిరిగి వచ్చేసాయి. నీవు లేవని మేమెవ్వరమూ చల్దులు తినలేదు. కలిసి తిందాము, రావయ్యా అని పిలుస్తారు. వారందరూ కలిసి చల్దులు తిన్న తర్వాత చనిపోయిన కొండచిలువ రూపంలో ఉన్న అఘాసురుడి శరీరాన్ని చూసి ఇళ్లకు వెళ్లాక తమవారికి శ్రీకృష్ణుడు కొండచిలువను చంపి  తమను రక్షించిన వైనాన్ని తెలుపుతారు.                                           శ్రీ కృష్ణుడు అఘాసురుణ్ణి చంపింది తన ఐదవ ఏటనే అయినా, గోపబాలురందరూ ఇళ్లకు రాగానే  అది అప్పుడే జరిగిన సంఘటనగా తమవారికి చెప్పడం వలన, అప్పటికి శ్రీ కృష్ణునికి ఆరేళ్ల (పౌగండ) ప్రాయం కనుక అతడు అఘాసురుణ్ణి ఆరేళ్ల ప్రాయంలో చంపేడనే అందరూ అనుకుంటారు. ఆవిధంగా ఆ గోప బాలుర జీవితాల్లో ఒక సంవత్సర కాలం మాయమయ్యింది. సృష్టికర్తయైన బ్రహ్మదేవుడికి దిమ్మతిరిగేలా చేసిన మాయగాళ్లకు మాయగాడి కథ ఇది.
                                                        ***
చదివారుగా. విష్ణుమూర్తికి మాయ పుట్టినిల్లట. ఆయన అవతారమైన శ్రీ కృష్ణుడు మనదేశంలో పుట్టాడు. మరి మనకి మాయలకి కొదవేమిటి?  కాకపోతే ఈ కలియుగ కృష్ణుల మాయలకి ప్రజల సొమ్ములూ, గవర్నమెంటు వారి ఆస్తులూ మాయం అవుతున్నాయి. అంతే తేడా.
                                             ***
P.S.—భాగవతంలో ఈ కథ చదివిన వారికీ, విన్నవారికీ వారి సమస్త కోరికలూ తీరుతాయని వ్రాసి ఉంది.
అందుచేత ఈ పోస్టు చదవడం మీ అదృష్టం గా భావించండి. సెలవు.
                                                           ***
                               

26, జనవరి 2012, గురువారం

ఇదేమి లోకం...లోక రీతి కందాలు...



లోకరీతి కందాలు...
దైవమ్మనుకూలింపక
ఏవేళను జరుగదు పని ఎవ్వరికైనా
దైవమ్మనుకూలించిన
ఆవేళనె  అలవడునది  అలవోకంగా 
                        
 అక్కర కలిగిన వేళల
చక్కగ మనచెంత జేరు  చతురులు వారే
అక్కర తీరిన పిమ్మట
లెక్కను జేయరు మనలను లేశమ్మైనన్
                        
తనతప్పుతాను గానక
కనుమని దోషము లితరుల కార్యములందున్
గుణహీనుడు చూపెట్టును
తన పృష్ఠము గాన లేడు తానై యెవడున్                      

అర్థమెపరమార్థంబని
వార్థక్యము మీద పడిన వయసున గూడా
వ్యర్థమగు శ్రమను బొందెడి
మూర్థరహితులుండెదరది మూర్ఖత గాదే                           

చెల్లును తన మాటయె,కొ
త్తల్లుని కత్తింటను,అదిమరి యటులుండంగా
ఇల్లరికపుటల్లుని గతి
ఉల్లమునకు శాంతి లేని ఊడిగమేగా      
                       
హరి యేమి చేసె పుణ్యము
తరుణీమణియైన లక్ష్మి తనదే కాగా
హరునిది పాపంబేమొకొ
గరళము తన కంఠసీమ కాల్చగ దాల్చెన్      
      
పసగల జీతంబుండగ
కొసరుగ లంచంబడుగుచు గొణుగుచు,  ఆపై
రుస రుస లాడెడి అయ్యలు
కసవును మెసవెడి పసులకు  కారే పోటీ    
  
పిల్లికి బిచ్చము పెట్టక
తల్లికి నేమియ్యకుండ  దాచిన దంతా
కొల్లరు లెత్తుకు పోగా
గొల్లున యేడ్చుటె మిగిలెను  గోవింద హరీ              

ఎంతయొ చదువులు చదివి మ
రెంతయొ నేర్చిన మగనికి ఏకాంతమునన్       
వింతగ మతి పోగొట్టగ
కాంతామణి చేయు బోధ కర్టెన్ లెక్చర్                 

నీతులకేమిటి తక్కువ
నేతలు వల్లించుచుంద్రు నిత్యం, కానీ
చేతలలో కనిపించక
రోతను కలిగించునవియె రోజూ మనలో !  

సెలవు.         

20, జనవరి 2012, శుక్రవారం

ఓ మంచికథ.... రాజుగారి బాకీ కథ...


                      
 అబ్బో ఈ ముచ్చట ఇప్పటిది కాదు. సుమారు వంద సంవత్సరాలక్రితం 1918లో జరిగినది. అప్పుడు శ్రీ శాస్త్రిగారు విద్వాన్ పరీక్ష ప్యాసయి విజయనగరం మహారాజావారి కళాశాలలో తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు. ఒక రోజు వారి ఊరు (కాకినాడకి 20 మైళ్లదూరంలో గోదావరి ఒడ్డున ఉన్న) మసక పల్లి నుంచి ఉత్తరం వచ్చింది. రెండు మూడు రోజులు సెలవు పెట్టి రమ్మని. ఆ ఉత్తరం రాసిన వాడు అతనికి షడ్డకుడు (తోడల్లుడు) అయిన బాల్య స్నేహితుడు. ఏదో అవసరం ఉండి ఉండక పోతే ఉత్తరం రాయడని కాలేజీకి మూడు రోజులు సెలవు పెట్టి శాస్త్రి గారు  వారి ఊరికి వెళ్ళారు. వెళ్లగానే ఏమిటి సంగతని అడిగితే ఆ స్నేహితుడు “ఎవరో నరస రాజు గారట, ఈవూరి వారే కాని వూరు వదలి పెట్టి 40 సంవత్సరాలవుతుంది. వారు నీ కేదో బాకీ ఉన్నారని ఆవిషయమై పిలిపించమంటే నీకు రాసేను. రేపు పొద్దున్నే ఆయన వస్తారు”అని చెప్పేడు.
ఈ రాజుగారి కథ ఏమిటంటే  ఆయన ఆ ఉళ్లో బాగా గౌరవంగా బ్రతికిన క్షత్రియకుటుంబంలోని వాడు. కుటుంబం ఆర్థికంగా చితికి పోతే అక్కడి బ్రాహ్మణుల వద్ద చేబదుళ్లు తీసుకుంటూ వ్యవసాయం చేసేవాడు. అది కలిసిరాక అప్పుల పాలయ్యాడు. చేసిన అన్ని అప్పులూ లెక్కచూసుకుంటే వెయ్యి పన్నెండు వందలదాకా తేలాయట.ఇక ఆ ఊళ్లో బ్రతక లేక భద్రాచలం దగ్గర ఎక్కడో ఏజెన్సీ ప్రాంతానికి పోయి అక్కడ బ్రతుకు వెళ్లదీస్తూ ఉన్నాడు.ఒకటి రెండేళ్లలో చిల్లర అప్పులన్నీ తీర్చేసినా ప్రోనోట్లు వ్రాసి తీసుకున్న అప్పులు 380 రూపాయలు తేలాయట. అవి తీర్చే స్తోమత ఆయనకు లేకపోయింది. అవి ముగ్గురు బ్రాహ్మణుల దగ్గర తీసుకున్నమొత్తాలు రూ. 250, 50, 80 కి సంబంధించిన 3 ప్రోనోట్లు. అవి కాలదోషం పట్టే రోజులు సమీపించేసరికి , ఏదో కొంత చెల్లు వేయించి కాలదోషం పట్టకుండా చూద్దామనుకున్నా అప్పు తీసుకున్న రాజుగారు ఎక్కడికో వెళ్లి పోవడం చేత కుదరలేదు. అప్పుడు 250, 50 రూపాయలు అప్పులిచ్చిన ఆసాములు ఆ వూళ్లో లౌక్య వ్యవహారాలు తెలిసిన రమణయ్యగారికి ప్రోనోట్లిచ్చి కాకినాడలో దావాలు వేయించ వలసిందిగా కోరారు. ఆయన ఆవిధంగా దావాలు వేయించిన కొద్ది నెలల్లోనే ఒక సారి ట్రైన్లో రాజుగారికి తారస పడడం జరిగింది. మన ఊరివారు నామీద దావాలు తెచ్చారటగా అని రాజుగారు అడిగేసరికి రమణయ్యగారు  అప్పులిచ్చిన వారు కోరగా తానే దావాలు వేయించినట్లు తెలిపాడు. అప్పుడు రాజుగారు మరి  లింగయ్య శాస్త్రుల ప్రోనోటు విషయంలో దావా తేలేదేమని అడిగితే
రమణయ్యగారు చెప్పినదేమిటంటే—తాను ప్రోనోట్లగురించి దావాలు తేవడానికి కాకినాడ వెళ్లేటప్పుడే లింగయ్య శాస్త్రులని కూడా కలిసి ప్రోనోటుగురించి గుర్తు చేసాననీ  కాలదోషం పట్టిపోకుండా అది కూడా ఇస్తే  ఒకే సారి దావాలు వేయవచ్చునని అన్నాననీ కాని దానికి శాస్త్రిగారు “రాజుగారి కంఠంలో ప్రాణ ముండగా నోటుకు కాలదోషం పట్టటమేమి”టని అన్నారనీ తాను దావా వేయదల్చుకో లేదని చేప్పారనీ.
దావాలు వేసిన వారు రాజుగారి దగ్గర ఏమి వసూలు చేసుకోగలిగారో తెలియదు గాని లింగయ్య శాస్త్రులగారి ప్రోనోటు బాకీ లింగయ్య శాస్త్రులు బ్రతికుండగా కాని, వారి కుమారుని జీవిత కాలంలో కాని తీరనే లేదు.అసలా ప్రోనోటు ఉందో లేదో ఉంటే ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలీదు. ఉన్నా ఎప్పుడో కాలదోషం పట్టే ఉంటుంది కదా?  రాజు గారికిప్పుడు 70 ఏళ్లు. తన 30 వ ఏట తీసుకున్న బాకీ ఇది. దానిగురించి మాట్లాడడానికే ఇప్పుడు రాజుగారు వస్తున్నది.
                  మరునాడు ఉదయమే శాస్త్రిగారు వారి దగ్గర బంధువులూ వీధి అరుగు మీద కూర్చుని ఉండగా రాజు గారు వచ్చేరు. కుశల ప్రశ్న లయేక రాజుగారు ఇలాఅన్నారు:
“అయ్యా మీతాతగారు లింగయ్యశాస్త్రులుగారూ నేనూ మంచి స్నేహితులం. అవసరమై రెండు సార్లు నలభై రూపాయల చొప్పున మొత్తం ఎనభై రూపాయలు మీ తాతగారి వద్ద చేబదులు పుచ్చుకోవడం జరిగింది. తీర్చే అవకాశం లేక 80 రూపాయలకూ ప్రోనోటు వ్రాసి ఇచ్చేను. నోటైతే వ్రాసి ఇచ్చేనుగాని అది తీర్చడానికి మీ తాతగారి జీవిత కాలంలోగాని మీ నాయనగారి జీవిత కాలంలో గాని నాకు వెసులుబాటు కలుగ లేదు. వయసు మీరి పోతోంది కనుక ఋణగ్రస్తుడిగా పోవడం ఇష్టంలేక వారి వారసులకైనా బాకీ తీర్చేద్దామని ఇక్కడ వాకబు చేస్తే తమరు విజయనగరంలో ఉన్నట్టు తెలిసింది. అదైనా విజయనగరం పోస్టుద్వారా పంపించవచ్చుకదా అంటారేమో? ఆప్త మిత్రులైన లింగయ్య శాస్త్రి గారి మనుమలైన మిమ్మల్ని ఓసారి చూసి, ఏ అరుగు మీదైతే అప్పులు తీసుకుని ఋణపత్రం రాసి ఇచ్చేనో అక్కడే దాన్ని తీర్చి ఋణవిముక్తుణ్ణవుదామనిపించి మీకు లేఖ వ్రాయించాను. శ్రమ అనుకోకుండా తమరు వచ్చేరు. నేను తీసుకున్న అప్పు ఇప్పటికి వడ్డీలతో కలిపి ఎన్ని రెట్లో అయిఉంటుంది. తమరు ఎంత ఇమ్మంటారో చెప్తే దాఖలు చేసుకుంటానని అన్నారు. దానికి శాస్త్రిగారు మీకెంత తోస్తే అంత ఇవ్వండి. నేను ఎక్కువ తక్కువ అనకుండా తీసుకుంటాను అని అన్నారు. రాజుగారు అలా కాదని, శాస్త్రిగారు చెప్పిన మొత్తం ఇచ్చినప్పుడే తాను ఋణవిముక్తుడనౌతానని అన్నారు. వెంటనే శాస్త్రిగారు “అయ్యా మీరు మా తాతగారి వద్ద తీసుకున్న ఎనభై రూపాయలూ ఇవ్వండి. చాలు.మీరు ఋణ విముక్తులైనట్లే భావిచండి” అన్నారు.
రాజుగారు పై మీది కండువాలో కట్టిన మూట ముడి విప్పి  తాను తెచ్చిన వెండిరూపాయలు అక్కడ దొంతులుగా పెట్టి స్వీకరించండి అన్నారు. అవి సరిగ్గా 80 రూపాయలే ఉన్నాయి.
శాస్త్రిగారు వాటిని స్వీకరించడంతో రాజుగారు ఋణ విముక్తులయ్యారు.
                                                    *****
అయ్యా, ఇదీ కథ. ఇది నిజంగా జరిగిన కథ. దీనిలో రాజుగారి పూర్తి పేరు శ్రీ కాకర్లపూడి నరసరాజుగారు. శాస్త్రిగారు కళా ప్రపూర్ణ శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు. ఈ ఉదంతాన్ని విపులంగా శ్రీ శాస్త్రిగారు తమ స్వీయ చరిత్రలో వ్రాసేరు.
(దానిని శ్రీ రాజాచంద్ర ఫౌండేషన్ 482, శాంతినగర్, కె.టి.రోడ్, తిరుపతి-517507 వారు ప్రచురించేరు. వారికి నా కృతజ్ఞతలు.)
 మాటకి కట్టుబడి ఉండే మహనీయులు ఏ కాలంలోనైనా ఉంటారు. కాకపోతే వారిగురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈ మంచి కథని మీకందిస్తున్నాను.
మరో సారి మరో మంచి కథతో మీముందుకు వస్తాను. సెలవు.

13, జనవరి 2012, శుక్రవారం

రెండును నొకటియే కదా?....




ఎమెస్కో వారు ప్రచురించిన మను చరిత్ర ప్రబంధానికి పీఠికలో అనుకుంటాను,శ్రీ విశ్వనాథ వారిలా ప్రారంభిస్తారు. మనము ఆంధ్రులము,అనగా తెలుగు వారము—రెండును నొకటియే అని. రెండును నొకటియే అయినచో మనమాంధ్రులము అనుట ఏల? అది వారి శైలి.
తెలుగువారము అంటే తేలికగా ఉంటుంది.ఆంధ్రులము అని ఒత్తి పలికితే లేని గంభీరత వస్తుంది. సామాన్యార్థక పదాలలో తేలిక వాటిని వదిలి పెట్టి కొంచెం క్లిష్టోచ్చారణ కలిగినవి వాడడం పండిత లక్షణం. పండితులే కాదు సామాన్యులు కూడా ఇలా చేస్తూంటారు వారి వారి పరిధిలో వారికున్న భాషా జ్ఞానాన్ని నలుగురికీ తెలియజేయాలన్న తపనతో.ఇటువంటి భాషాడంబరాన్నియెద్దేవా చేయడానికే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో గిరీశం లుబ్దావధాన్లుకి వ్రాసిన ఉత్తరంలో మీరు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను అనడానికి “అమందానంద కందళిత హృదయారవిందుడనైతిని” అనిపిస్తాడు.
 ఒకటి రెండు ముచ్చట్లు చెబుతాను.నా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా తాతగారి ఊరికి వెళ్లినప్పుడు మా దొడ్డమ్మ పిల్లలు కూడా వస్తుండే వారు.ఒక సారి మేము అన్నం తింటున్నప్పుడు మా అమ్మమ్మ ఇంకేం కలుపుకుంటావని నన్నడిగితే మరేమీ వద్దు చల్ల పోయి అన్నాను.నాకప్పుడు ఏడెనిమిదేళ్లుంటాయేమో? నాకంటే ఒక యేడాదే పెద్దవాడయిన మా అన్నయ్య (దొడ్డమ్మ కొడుకు) పగల పడి నవ్వుతూ మా మేన మామలతో చూడండి వీడు మజ్జిగని చల్ల అంటున్నాడు అని వెక్కిరించాడు.నాకప్పుడు దానిలో తప్పేమిటో బోధ పడలేదు. మాయింట్లో మా నాయనమ్మ చల్ల అనే అంటుంది.ఆవిడ వడ్డిస్తే తినే వాళ్లం మేము కూడా అలాగే అనడం నేర్చుకున్నాము. వాడికేం జవాబు చెప్పాలో నా కప్పుడైతే ఏమీ తెలియలేదు, కానీ పెద్ద వాడనయినాక తెలిసింది. చల్ల అనే పదమే తెలుగుదనం ఉట్టిపడుతూ తెలుగునాట విస్తారంగా వాడబడే అచ్చతెలుగు పదమనీ మజ్జిగ అనేది మార్జిక అనే సంస్కృత పదానికి వికృతి అనీ.మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లు ఉన్నాయట.1.తక్రం 2.ఉదశ్విత్తు
3. మధితం అనీ. తక్రం హ్యుదశ్విన్మథితం పాదాంబర్థాంబు నిర్జలం అని అమరకోశం చెబుతుంది, అంటే పావు వంతునీరుకలిపి చిలికినది తక్రం-సగానికి సగం నీళ్ళు పోసి చిలికినది.ఉదశ్విత్తు అసలే నీరు కలపకుండా చిలికినది మథితం.మథితం ఆరోగ్యానికి మంచిది కాదట.ఉదశ్విత్తు సగం నీరే కనుక రుచిగా ఉండదు.తక్రం రుచికరమూ శ్రేష్టమూను.( మజ్జిగకి పధ్నాలుగు పర్యాయ పదాలున్నాయి మన నిఘంటువుల్లో. మజ్జిగ చేసే విధానాన్ని బట్టి, దాని చిక్కదనాన్ని బట్టి,  ఇలా వేరు వేరు పేర్లతో వ్యవహరింప బడతాయని,అసలు పాలు తోడు పెట్టే విధానం ఏమిటో వివరంగా నవ్య వీక్లీ లో శ్రీ రమణ గారు ఒక సారి రాసేరు.) మన సామెతల్లో చల్లకొచ్చి ముంత దాచడమనే చక్కటి సామెత ఒకటుంది. ఏదో ఉపకారం కోరడానికి వచ్చి,రాగానే అడగడానికి మొహమాటపడి ఆ కబుర్లూ ఈ కబుర్లూ ఆడుతుంటే చల్లకొచ్చి ముంత దాస్తున్నాడంటారు. ఒక పౌరాణిక చిత్రం లో నారదుడు రాక్షసుల చేతుల్లో బాధలు పడుతున్న దేవతల్ని వెంటతీసుకొచ్చి విష్ణుమూర్తిని కాసేపు పొగిడిన తర్వాత  చల్లకొచ్చి ముంత దాచనేల అంటూ అసలు విషయానికొస్తాడు.ఆంధ్ర పత్రికలో ఈ సినిమా రివ్యూ రాస్తూ ముళ్లపూడి ఒక ఆట ఆడుకున్నాడు. నారదుల వారికి పాడిలేదా? చల్లకోసం రోజూ విష్ణుమూర్తి గారింటికి వెళ్లడం రివాజా? దానికోసం ముంత పట్టుకు వెళ్లేవాడా?  అంటూఏమేమో రాసేడు.శాఖా చంక్రమణం (చూసేరా నేనుకూడా ఎలాంటి పదం వాడేనో—డొంకతిరుగుడు అని ఉండొచ్చుకదా? ఉహూఁ... నాకు చాలా తెలుగు, సంస్కృతం వచ్చని మీకు తెలియాలిగా?) కాకుండా మరో రెండు ముచ్చట్లు చెప్పి ముగిస్తాను.
మేం హైద్రాబాదు వచ్చిన కొత్తల్లో మా యింట్లో పనిచేసే నడివయసు పని మనిషిని మా ఆవిడ అవ్వా అని పిలిచేది.అదేం అలా పిలుస్తావంటే ఇక్కడ చిన్న పిల్లలయినా పని మనుషులందర్నీ అలానే పిలుస్తారని చెప్పింది. అవ్వ అనే పదం సామాన్యంగా వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీలందరికీ వర్తిస్తుంది. మన భారతంలో ప్రబంధాలలో ఈ పదం అదే అర్థంలో వాడబడింది. తెలంగాణా ప్రాంతంలో ఈ పదం ఇప్పటికీ ఆ అర్థంలోనే వాడుకలో మిగిలి ఉంటే మిగిలిన ఆంధ్ర ప్రాంతంలో వయసుడిగిన స్త్రీ అనే అర్థసంకోచం పొందింది.మరో విషయం ఇక్కడ బాలికల్ని పోరి అని పిలుస్తారు. తెలంగాణేతర ప్రాంతాలలో కుమారి అని వ్యవహరిస్తారు.కానీ నేను చాలా పాతకాలపు శిలాశాశనంలో ఒక రాజకుమారి పేరు వసంతపోరి అని చదివేను.ఇప్పుడు వసంతకుమారి అని పెట్టుకున్నట్లన్నమాట. భాష అనేకానేక కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో మార్పులకు లోనవుతుంటుంది.మార్పులకి లోనుగాని రూపాలు కొన్ని ప్రాంతాల్లో అలాగే మిగిలి ఉంటాయి. ఒకే అర్ధాన్నిఇచ్చే వేరు వేరు పదాలు వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంటాయి. అందువల్ల ఏ పదం వాడిన వారినీ మనం సంస్కారహీనులనీ వారి భాషని వెక్కిరించాల్సిన పని లేదు.
 ఇక్కడ చివరిగా మరో ముచ్చట చెప్పి తీరాలి. శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఇల్లాలి ముచ్చట్లలో ఒకచోట ఇలా రాస్తారు.“మగాళ్లు భోజనాలు చేస్తే ఆడాళ్లు అన్నాలు తింటా”రని.  తేడా ఏముంది? రెండును నొకటియే కదా?
( మహానుభావులుశ్రీ విశ్వనాథ వారి శైలిని ఓ సారి తల్చుకుందామని వారి పేరుతో మొదలెట్టాను కాని వారికీ ఈవ్యాసం లోని విషయాలకీ ఎంత మాత్రం సంబంధం లేదు.)
బ్లాగ్మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలతో..
మరికొన్ని విషయాలు మరోసారి. సెలవు.

8, జనవరి 2012, ఆదివారం

నీతి కందాలు... ముచ్చటగా... మూడు పుంజీలు





మంచి పనులు తల పెడుతూ
పంచాంగం చూడకండి,  పనులను ఆరం
భించుడు, వెంటనె, ఏకీ
డెంచక, మంచిది,  శుభదిన మేదినమైనా   

జాతక ఫలముల నమ్ముచు
చేతల నుడిగియు మసలెడి చెనటుల దెంతేన్
ధాత్రిని పుట్టుక దండుగ
ధాతయు వారిని క్షమింప దలపడు యెపుడున్           
              
అరకొర యత్నము చేయుచు
దొరకదు ఫలితమ్మటంచు  దురపిల్లకనే
తిరిగి ప్రయత్నము చేసిన
సరగుననే కార్య సిధ్ధి జరుగును సుమ్మీ                   

తలచిన పని నెరవేరగ
వలయును కాస్తంత శ్రధ్ధ పనిలో ఎపుడున్
సులభమ్మిదియని తలచుచు
అలసత్వము పనికిరాదు ఆవంతైనా

ఆలస్యమమృతము  విషం
పాలైనా నిలువజేయ పాడైపోవున్
మేలే ఒనగూరు నెపుడు
కాలం వృధ చేయకున్న కార్యములందున్  
           
నేల విడిచి సాము వలదు
నేలను  కాళ్ళూని యున్న  నిలకడ కలుగున్
గాలిలొ మేడలు కట్టకు
మూలాలను మరచి పోవ ముప్పే కలుగున్      

      
కోరికలే గుర్రాలై
స్వారీ చేస్తేను మీకు శాంతియె శూన్యం
కోరికలు త్రుంచ గలిగెడు
వారికె సుఖశాంతులుండు  వసుధలొ యెపుడున్ 

పరిహాసము కొరకైనను
పరులను బాధించు మాట పలుకక యెపుడున్
ఒరులకు మేలొనగూర్చెడి
నరుడిల నారాయణుండె నమ్ముడు మీరల్             

మరచియు నిన్నటి వెతలను
అరుదెంచని రేపటి భయమది తలపకనే
నరుడుండదగును, వానికె
దొరకును శాంతియు  సుఖములు తోడై రాగన్  
      
నరకము నాకము లనుచును
పరలోకము లేమి లేవు  పరికింపంగా
దొరకును తమ కర్మ ఫలము
నరులకు  ఈ లోక మందె  నమ్ముడు మీరల్ 
      
మంచిగ బ్రతకాలంటే
పెంచుకు తీరాలి మనము ప్రేమలతల్నే
ఇంచుక స్వార్థాన్ని వదలి
పంచుకు తాగాలి మనము  పాలో నీళ్ళో
    
కులమత భేదాలు మరచి
కలిసే ఉండాలి జనము  కష్ట సుఖాల్లో
కలిసుంటే కలదు సుఖం
విలసిల్లును శాంతి అపుడు విశ్వం నిండా                  

(ఈ క్రొత్త సంవత్సరంలో ఇది మొదటి టపా.
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో—సెలవు.)

31, డిసెంబర్ 2011, శనివారం

కన్యాశుల్కంలో సారాయంగడి సీను....




   

క్రితం సారి కన్యాశుల్కంలో పేకాట సీను శ్రీ గురజాడ ఎందుకు  వ్రాసి ఉంటారనే విషయం చెప్పాను. ఈ సారాయంగడి సీను కూడా అలాంటిదే. నిడివి గురించి పట్టించుకోకుండా నాటక పురోగమనానికి పెద్దగా తోడ్పడని ఈ సీనులు వ్రాయడంలో  మహాకవి ఉద్దేశం సమగ్ర సమాజ జీవన చిత్రణే. ఆంధ్ర దేశంలో ఏ  మారుమూలనైనా సారాయంగడి లేని ఊరులేదు. కప్పు కాఫీయో శుభ్రమైన తాగునీరో దొరకని ఊళ్ళున్నాయేమో కానీ, సారాయి దొరకని ఊరుండదు. నాడూ నేడూ ఇదే పరిస్థితి.(ఇదే విషయాన్ని సరదాగా ఓ కంద పద్యంలో ఇలా చెప్పేను నేను:
నీరే దొరకదుగానీ
సారాయికి లోటులేదు సర్వం సిధ్ధం
ఊరూరా వెలసిన ఆ
సారాయంగళ్లలోన స్టాకులు ఫుల్లే ! )
అందు చేతనే తన నాటకంలో ఈ సారాయంగడి సీను అవసరం ఉందనుకున్నాడు మహాకవి. అంతే కాదు ఈ సీనులో వచ్చే పాత్రలు వ్యవహరించే తీరు ద్వారా వారి సంభాషణల ద్వారా ఎంతో హాస్యాన్ని సృష్టించేడు. ఈ సీను చివర్లో లుబ్దావధాన్లు పెళ్లాడిన మాయగుంట మధురవాణి కంటె తీసుకుని ఎక్కడికో పారిపోయిందనీ వెతికించమనీ పోలీసు హెడ్డుని అడగడానికి  రామప్పపంతులు వస్తాడు తప్పితే నాటకానికి సంబంధించిన ప్రధాన పాత్రలేవీ  దీనిలో రావు. దీనిలో వచ్చే సారాయి దుకాణం యజమాని రాందాసు బైరాగి పాత్రలను దొంగ సాక్ష్యమివ్వడానికి పిలుచుకు పోవడం తప్ప వారికీ నాటక ప్రధాన ఇతివృత్తంతో ఏ మాత్రమూ సంబంధం లేదు. ఈ విధంగా నాటక ప్రయోజనానికి కథాపురోగమనానికీ ఏవిధంగానూ ఉపయోగ పడని ఇంత పెద్దసీనుని, ఇన్ని అప్రధానమైన పాత్రలతో మహాకవి ఎందుకు వ్రాసేడయ్యా అంటే ఆయన హాస్య రసపోషణ సమగ్ర సమాజ జీవన చిత్రణ ధ్యేయంగా కలిగి ఉండడమే తప్ప మరోటి కాదు. శ్రీశ్రీ గారు  కన్యాశుల్కంలో అన్ని రకాల పాత్రలూ ఉన్నాయి కాని ముస్లిం పాత్ర కనిపించ లేదని అనుకున్నాను కానీ , అగ్నిహోత్రావధానులు  రామచంద్ర పురం అగ్రహారం చేరగానే “ బళ్ళుదింపండి. సాయిబూ ఏనుక్కి కావలసినంతరొడ్డ”  అంటాడనీ, ఆవిధంగా తెరపైకి రాక పోయినా సాయిబు  పాత్ర కూడా ఉన్నట్టేనని అంటాడు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఒరిస్సాని ఆనుకుని ఉన్న ఊళ్లలో పండాలు (ఒరియా బ్రాహ్మలు) కూడా ఎక్కువే. అందుచేతనే ఈ నాటకంలో పండా పాత్రకూడా కనిపిస్తుంది. ఈ విధంగా సమాజ సమగ్ర జీవన చిత్రణకి పూనుకున్నందునే ఈసారాయంగడి  సీను కూడా మహాకవి నాటకంలో చేర్చాడు. ఆయన లక్ష్యం ఏ విధంగా నెర వేరిందో చూద్దాము:
ఈ సీను తెర లేచే సరికి  కాళీ మండపంలో  మధ్యలో సారాయిసీసాలు గళాసులుండగా పక్కన యోగ దండమును ఆనుకుని సమాధిలో ఉన్న (ఉన్నట్టు నటిస్తున్న) బైరాగి, చిలుం పీలుస్తున్న మునసబు సోమి నాయుడు, సాతాని మనవాళ్లయ్య, జంగం వీరేశం, దుకాణదారు రాందాసు- వీళ్లందరికీ సారాయి అందిస్తున్న యోగినీ ఉంటారు. మునసబు ఆకాశం ముందు పుట్టిందా? భూమి ముందు పుట్టిందా? అనే ప్రశ్న లేవనెత్తుతాడు. దీనికి సరైన జవాబు చెప్పకుండా  సుత్తి ముందా కారు ముందా అని అడ్డు ప్రశ్న వేస్తాడు మనవాళ్లయ్య. దీనికి మునసబు వెంటనే—పంగనావాఁలు ముందా? పట్టె వొర్దనాలు ముందా?  నామాలోడా నా సవాలేటి? నీజవాబేటి? అంటూ వెక్కిరించి ఆకాశానికి మట్టా బూఁవి?  బూఁవికి కప్పా ఆకాశం? సదూకున్నోడెవడో సెప్పండోస్సి- అని రెట్టిస్తాడు. ఇక్కడ  మన వాళ్లయ్య వైష్ణవులకీ, వీరేశం శైవులకీ ప్రతినిధులు కాబట్టి పంగనామాలు పట్టె వర్దనాలలో ఏదిముందని వారిని  వెకసక్కెం ఆడతాడు. ఈ చర్చ కొంత సేపు సాగిన తర్వాత వీరేశం “ఆకాశం బొక్కడ్డది అంటారు కదా ? ఆకాశమే లేకుంటే బొక్కడ్డ  వెఁలాగ? అని రీజనింగు తీసే సరికి మన వాళ్లయ్య మాట్లాడడం మానేస్తాడు. వెంటనే వీరేశం శంఖం పూరిస్తాడు. విజయం చేకూరి నప్పుడు శంఖం పూరించడం ఆనవాయితీ. ఈ శబ్దానికి తనసమాధికి భంగం కలిగి నట్టు నటిస్తూ బైరాగి, శివబ్రహ్మం. శివోహం అంటాడు. బైరాగి శివ స్మరణ చేయగానే ఆనందించిన వీరేశం చూడండి అందరూ అన్నట్టు పొంగి పోతాడు.  ఆదొంగ బైరాగి పక్కనున్న మనవాళ్ళయ్యని కూడా చూసేడేమో రామబ్రహ్మం..రామోహం అనికూడా అంటాడు. దీనికి ఆనందించిన మనవాళ్లయ్య మొదటి మాటను రెండవ మాట రద్దు చేస్తుందంటాడు. వీరిద్దరి కాట్లాట చూసిన దుకాణదారు రాముడూ శివుడూ ఇద్దరూ నిజమే నని వారిని సముదాయిస్తాడు. (తన గిరాకీ లలో ఏ ఒక్కరినీ వదులుకోలేడు కదా?)  మరికొంత చర్చ జరిగాక, మునసబు బైరాగిని “ గురూ ! బంగారం సేస్తారు కదా, అదెట్టి హరిద్దోరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందుకడుగుతా” రని ఓ చక్కటి ప్రశ్న వేస్తాడు. బంగారం చెయ్యగలగడం అబధ్ధమే కనుక దీనికి జవాబివ్వలేని దొంగ బైరాగి “మేం చేశే స్వర్ణం మేమే వినియోగిస్తే తల పగిలిపోతుం”దని డొంక తిరుగుడు జవాబిస్తాడు. “అవి వేరే రహస్యాలు ఊరుకోండి మామా అంటూ హెడ్డుగారు మాట మారుస్తాడు. ఆ తర్వాత తాను ఖేచరీ గమనమ్మీద ఆకాశ మార్గాన పోతూ ఉంటే  ఆ వూరి అమ్మవారి విగ్రహం కింద ఆరు నిలువుల లోతున స్థాపితమైన మహాయంత్రమొకటి కనిపించి అమ్మవారిని సేవించి పోదామనుకుంటుండగా  ఈ భక్తుడు (దుకాణదారు రాందాసు) తనని పోల్చి నిలిపేసాడంటాడు. వెంటనే దుకాణదారు   “ చూడగానే నేను సిధ్ధుల్ని పోలుస్తాను గురూ” అంటాడు. దానికి మునసబు   “ చుక్కేసే వాళ్లని  మా బాగా పోలుస్తావు” అంటూ ఓ చురకేస్తాడు. ఆ తరువాత “ ఆత్మ శుధ్ధి లేని ఆచారమదియేల అని మా తాతగారు చెప్పలేదా?” అని బైరాగి అన్నప్పుడు హెడ్డు వేమన తమ తాతగారా అని ప్రశ్నిస్తే “అవును ఆయన పోయి ఆరు వందల సంవత్సరాలయింది అంటాడు. అయితే తమ వయసెంత అని ప్రశ్నిస్తే “ ఆదీ అంతూ లేని దానికి లెఖ్ఖేమిటి నాయనా? పరమాత్మ కెన్నేళ్లో అన్నేళ్లు అంటూ బుకాయిస్తాడు. ఈ మాటలు విన్న వారికెవరికైనా బైరాగి మాటలన్నీ పూర్తిగా అబధ్ధాలని తెలిసిపోతుంది.  అయితే అక్కడ ఉన్న వాళ్లెవరికీ ఈ గుర్తింపు ఉండదు. పైపెచ్చు హెడ్డుగారు ఆ బైరాగికున్న సిధ్ధులు స్తానాల్చేసి ముక్కు బిగించే బ్రాహ్మలకి కూడా లేవంటాడు.  ఆ తరువాత బైరాగి రెండు వందల యాభై ఏళ్లక్రితం జరిగిదంటూ తానుగంగను సారాయిగా మార్చిన ఉదంతం చెప్తాడు. అదంతా చాలా హాస్యభరితంగా ఉంటుంది.  రామప్ప పంతులు  అవధాన్లు పెళ్లి చేసుకున్న పిల్ల రెండో పెళ్లి పిల్ల అంటున్నాడనే మాట వచ్చినప్పుడు హెడ్డు “ ఈరోజుల్లో బ్రాహ్మణ్యం ఎక్కడుంది ఎటుచూసినా పిల్లల్ని ముసలాళ్లకి అమ్ముకోడాలూ రండా గర్భాలే కదా” అని అంటే హవల్దారు వెంటనే “  ఎంతచెడ్డా బ్రాహ్మలు మనకి పూజ్యులు” అంటాడు. ఆ రోజుల్లో మనుషుల నైతిక ప్రవర్తనకి కాకుండా జన్మించిన కులాన్ని బట్టి గౌరవించబడడం అనేది సూచించే మాటలివి. మనవాళ్లయ్య యోగినిని  మూలకి తీసుకెళ్లి ముద్దెట్టుకుంటున్నాడని మునసబంటే సిగ్గుతో మనవాళ్లయ్య చెయ్యి విడి పించుకొని వచ్చిన యోగిని “ ఏకాంత ఉపదేశం చేస్తున్నా” రని అంటుంది. దీనిని పట్టుకుని మునసబు   “  పిల్లా ఆ ఉప్పుదేశం ఏదో మాక్కూడా కాసింత  చెయ్యరాదా” అంటూ హాస్యమాడుతాడు. ఈ ఉప్పుదేశం అంటూ మునసబు పాత్ర ద్వారా గురజాడ మంచి హాస్యాన్ని అందించేడు. ఆ తరువాత రామప్ప పంతులొచ్చి హెడ్డుగారిని  లుబ్దావధాన్లని బెదిరించి తమ కంటె తమకిప్పించడంలో హెడ్డుగారి సాయంకావాలని కోరినప్పుడు హెడ్డు నోటంట వచ్చిన మొదటి మాట “డబ్బేమైనా పేల్తుందా” అని. ఎంత సహజంగా ఉందో చూడండి. పోలీసులు నాడూ నేడూ ఇంతే కదా?
ఆతర్వాత బైరాగిని దొంగ సాక్ష్యం చెప్పమని అడిగినప్పుడు సాక్ష్యం అంటే మావంటి వారే
చెప్పాలి .. నిజవేఁవిటి?అబ ధ్ధవేఁవిటి! మేం సిధ్ధులం అబధ్ధం నిజం చేస్తాం. నిజం అబధ్ధం చేస్తాం. లోకవేఁపెద్ద అబధ్ధం. పదండి. అంటూ ముక్తాయిస్తాడు.
ఈసీనులో వచ్చే పాత్రలన్నీ అప్రధానమైనవే ఐనా ప్రతి ఒక్క పాత్రా సజీవమైన పాత్రగా మనకు అనిపించేంత శ్రధ్ధగా వాటిని తీర్చిదిద్దిన మహాకవిని మెచ్చుకోకుండా ఉండలేము. ఈ పాత్రల నోటంట పలికించిన మాటలు ( దేహాన్ని ద్రేహం అనడం, జ్ఞానాన్ని ఘానం అనడం) నవ్వు పుట్టిస్తాయి. ముఖ్యంగా, కాశీ ఉదంతంలో తనతో పాటే తెగతాగిన బ్రాహ్మణునిగురించి బైరాగి చెప్పినప్పుడు “బ్రాహ్మల్లో కూడా మహానుభావులుంటా”రనడం ఒక  Quotable Quote గా మిగిలి పోయింది.
నాటకంలో ఈసీను చదువుతున్నప్పుడు కాని, సమర్థులెవరైనా ప్రదర్శిస్తున్నప్పుడు కాని నాటకంలో ఈ సీను అవసరం గురించి ఎవరికీ ఆలోచనే రాదు. ఈ సీనుకి ఈ సీను మాత్రమే చూసినా ఒక ప్రహసనాన్ని చూసిన రక్తి కలుగుతుంది. నాకైతే , సమాజ చిత్రణా హాస్యోత్పాదనా ధ్యేయంగా తాను రచించిన ఈ సీను విషయంలో గురజాడ పూర్తిగా కృతకృత్యుడయ్యేడనే అనిపిస్తుంది.
ఆఖరుగా ఒక్కమాట చెప్పి ముగిస్తాను. ప్రఖ్యాత రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబ రావు కన్యాశుల్కం గురించి తాను రాసుకున్న నోట్సులో  “ఈసారాదుకాణం సీనులు.. ఈ శాల్తీల మధ్య రామప్ప పంతుల్ని కూడా పెట్టి ఒక సీను లేక పోవడం ఎంత దురదృష్టం”  అన్నాడంటే ఈ సీను రచయితల్నీ రసికుల్నీ ఎంత రంజింప జేసిందో కదా?

వీలయితే కన్యాశుల్కం నాటి సంఘాన్ని తన నాటకంలో గురజాడ చిత్రించిన తీరు గురించి  కొంచెం ముచ్చటించాలని ఉంది. మరోసారి చూద్దాం. ఇప్పటికి సెలవు.