3, అక్టోబర్ 2012, బుధవారం

శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు?


శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు?
ఈ ప్రశ్నకి కాన్వెంటులో చదువుకునే మా మనుమడు “ I think it is Navami…Sri Rama Navami is a holiday for us” అంటాడు తెలుగు తిథుల పేర్లన్నీ సరిగా తెలియక పోయినా, స్కూల్ డైరీలో ఉన్న holidays list  అంతా క్షుణ్ణంగా కంఠతా వచ్చుకనుక.
“చైత్ర శుధ్ధ నవమి కదండీ..ఉగాది తర్వాత మనకొచ్చే తొలి పండుగ అదే కదా?” అంటుంది మా శ్రీమతి
ఏఏ పండుగలకు ఏఏ పిండివంటలు వండి వార్చాలో ఎరిగిన ఉత్తమాఇల్లాలు కనుక.
సరే. సినిమా తారలు తమ Birth days మాత్రం అందరికీ తెలియజేసి పుట్టిన సంవత్సరం మాత్రం గోప్యంగా ఉంచినట్లు,శ్రీ రాముని పుట్టిన రోజు మాత్రం అందరికీ తెలిసినా పుట్టిన సంవత్సరం మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండి పోయింది. మనందరికీ అయితే Date of birth certificate లో అవీ లేని వారికి వారి పెద్దలు నువ్వు ఫలానా సంవత్సరం పుట్టావురా అబ్బాయ్ అని పెద్దలు  చెప్పడం వల్లో పుట్టిన సంవత్సరం తెలిసే ఉంటుంది. మరి ఇవేమీ లేని శ్రీ రాముని సంగతేమిటి? ఎవరు చెప్తారు? చెబితే గిబితే ఆ వాల్మీకి మహర్షే చెప్పాలి కదా?ఎక్కడైనా చెప్పాడా? ఏమని చెప్పాడు?
చెప్పాడండీ. తన రామాయణ కావ్యంలోనే చెప్పాడు. అయితే అప్పటి కాలమానం లో ఇప్పటిలా  క్రీస్తుకు ముందో తర్వాతో అనో శక సంవత్సరాలో లేవు కనుక మనకు తెలిసే రీతి లో చెప్పలేదు.కాని చాలా నిర్దిష్టంగానూ,నిర్దుష్టంగానూ చెప్పాడు.అదెలాగంటే శ్రీ రాముని జనన కాలమందు ఏఏ రాశులు ఎక్కడున్నాయో,ఏ గ్రహాలు ఎక్కడున్నాయో జన్మరాశి ఏమిటో నక్షత్రమేమిటో తిథి ఏమిటో స్పష్టంగానే చెప్పాడు.అయితే వీటినుండి మనకు అర్థమయ్యేలాగున ఇంగ్లీషు తారీఖు కనుక్కోవడమెలాగ? ఈ సమస్యకి పరిష్కారం ఆధునిక విజ్ఞానం సాధించిన ప్రగతి రూపం లో ఆ శ్రీరామ చంద్రుడే మనకు ప్రసాదించేడు.
ముందుగా శ్రీ రామ చంద్రుడు పుట్టినప్పుడు ఉన్న గ్రహరాశుల గురించి వాల్మీకి ఏం చెప్పాడో చూద్దాం.
శ్రీ రామచంద్రుని జనన కాలమందు సూర్యుడు (Sun) మేష రాశి(Aries) లోనూ,గురుడు( Jupiter) కర్కాటక రాశి (Cancer)లోనూ కుజుడు(Mars) మకర రాశి (Capricorn)లోనూ శని (Saturn)తులారాశి (Libra) లోనూ,శుక్రుడు (Venus)మీన రాశి (Pisces)లోనూ ఉఛ్ఛ స్థితిలో కొలువై ఉన్నారు. ఇంతే కాదు ఆ రోజు చైత్ర శుధ్ధ నవమి అనీ కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం లోనూ స్వామి జన్మించాడని వాల్మీకి తెలిపి ఉన్నాడు. ఆ సమయంలో పునర్వసు నక్షత్ర యుక్తమైన చంద్రుడు బృహస్పతితో కలసి  అప్పుడే క్షితిజ రేఖ మీద ఉదయిస్తున్నకర్కాటక రాశిలో వెలిగి పోతున్నాడనీ చెప్పాడు.ఇన్ని వివరాలు ఇచ్చాడు సరే,దీనిని బట్టి ఆ సమయం ఫలానా అని ఇతమిథ్థంగా తెలుసు కోవడమెలాగ? ఇదిగో ఇక్కడే మన ఆధునిక శాస్త్ర విజ్ఞానం అందించిన ఆకరాలు మనకు అక్కరకు వచ్చాయి. ఈ వివరాలనన్నిటినీ ఉపయోగించి Planetarium Gold  అనే Software సాయంతో కంప్యూటర్ ద్వారా ఆ సమయం సరిగ్గా క్రీస్తు పూర్వం 5114 సంవత్సరం జనవరి నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలని కనిపెట్టారు.అంటే శ్రీ రాముడు జన్మించి ఇప్పటికి 7126 సంవత్సరాలైందన్నమాట. అయితే ఇక్కడ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చును. ఆయా నక్షత్రం గ్రహాలు రాశులు అవే స్థానాల్లో గతంలో వేరే రోజు కూడా ఉండి ఉండవచ్చుకదా అని.నిజమే, కాని ఇవన్నీ అచ్చంగా అవే స్థానాల్లో ఉండడమన్నది 25690 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే జరుగుతుందట. కాని నాలాటి వాడికి మరో సందేహం కూడా వస్తుంది.అదేమిటంటే గడచిన పాతిక వేల సంవత్సరాలలో కాకుండా అంకు ముందు ఎప్పుడైనా ఈ గ్రహస్థితులిలాగే ఉన్నప్పుడు శ్రీ రాముడు జన్మించి ఉండ వచ్చుకదా? అని. కాని మన భూమి మీద ఆఖరి హిమయుగం గడచి నాగరికత వర్థిల్లడం జరిగి నేటికి 12000 సంవత్సరాలు మాత్రమే అయిందని శాస్త్ర విజ్ఞానం చెబుతోంది.ఇక్కడ మరో విషయం కూడా గమనించాల్సి ఉంది.శ్రీ రాముడు ఐతిహాసిక పురుషుడు కాడు. చారిత్రక పురుషుడు.మానవ జన్మనెత్తి ఈ భరత ఖండంలో ఆ సేతు హిమాచలం నడయాడిన వాడు. మన దేశంలో శ్రీ రాముడు తిరుగాడిన ప్రదేశాలనీ సీతమ్మ వారు మెట్టిన స్థలాలనీ పూజలందుకుంటున్న తావులకు కొదువ లేదు. ఇవి మన దేశం లోనే కాదు శ్రీ లంకలో కూడా ఉన్నాయి. ఈ చిహ్నాలు మనం గుర్తించే విధంగా ఇంకా ఉన్నాయంటే ఇప్పుడు మనం గుర్తించిన 7126 సంవత్సరాలకంటే మరొక పాతిక వేల సంవత్సరాల పూర్వపువై ఉండే అవకాశం లేదు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అందుచేత మన శాస్త్రజ్ఞులు పరిశోధించి నిక్కచ్చిగా చెప్పిన క్రీ. పూ.5114 సంవత్సరంలో జనవరి 10 తేదీనే మన శ్రీ రామచంద్రుని జన్మదినం గా అంగీకరించి ఆనందిద్దాం. ఆరోజు మన చాంద్రమానం ప్రకారం సరిగ్గా చైత్ర శుధ్ధ నవమే అయింది. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలను జనన కాలంగా  శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మనం ప్రతియేటా శ్రీ రామనవమి నాడు ఇదే సమయంలో వేడుకలను జరుపుకుంటాము కదా?
శ్రీ రాముడు జన్మించిన తేదీయే కాదు,రామాయణంలో జరిగాయంటున్న మరికొన్ని సంఘటనలు కూడా అవి ఎప్పుడు జరిగాయో శ్రీ వాల్మీకి ఇచ్చిన వివరాల ఆధారంగా నిర్దిష్టంగా కనుక్కున్నారు. ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవన్నీ మరోసారి వివరిస్తాను.
బహుముఖీయమైన శాస్త్రీయ పరిశోధనల అనంతరం ఈ విషయాల్ని మనకు వెల్లడించినవారు Institute of Scientific Research on Vedas (I-SERVE) Delhi Chapter Director శ్రీమతి సరోజ్ బాల గారు.కీ.శే.శ్రీ పుష్కర్ భట్నాగర్ గారు USA నుంచి సంపాదించిన Planetarium Gold అనే సాఫ్ట్ వేర్ ద్వారా ఇది సాధ్యమయింది.ఈ శాస్త్రజ్ఞులబృందానికి అభినందనలు తెలుపు కుంటూ ఈ విషయాలను అందరితో పంచుకునే అవకాశాన్ని కలుగజేసిన I-SERVE-Delhi Chapter  వారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.ఈ పరిశోధనా కృషి అంతా వారిదే. నేను అరటి పండు ఒలిచి పెట్టానంతే. ఆస్వాదించండి.సెలవు.

27, సెప్టెంబర్ 2012, గురువారం

చరిత్ర చెప్పని కథలు...థగ్గుల కథ..


       
నేను 1957 లో కాలేజీలో ప్రీ యూనివర్శిటీ కోర్సు లో చేరాను.(అదే మొదటి బాచ్). మా అదృష్టమో దురదృష్టమో గాని (మమ్మల్ని సర్వ జ్ఞాన సంపన్నులని చేయాలనే సదుద్దేశం తోనే కావచ్చు)మా సైన్సు విద్యార్థులకు కూడా ఆర్ట్స్ పాఠాలు చెప్పడం ప్రారంభించారు.ఆ విధంగా మేము హిస్టరీ కూడా చదువుకోవలసి వచ్చింది.అప్పుటి మా హిస్టరీ లెక్చరర్ గారు గంటకొడుతూనే వచ్చి కుర్చీలో కూర్చొని కదలకుండా చూపులైనా అటూ ఇటూ మరల్చకుండా( ప్రముఖ గాయని జానకి గారు ఏ మాత్రం కదలకుండా నిల్చుని పాట పాడినట్లు) ఏకబిగిని మళ్లా గంట కొట్టే పరకూ లెక్చర్ దంచి లేచి వెళ్లి పోయేవారు.మేం వింటున్నామో లేదో కూడా ఆయన పట్టించుకునే వారు కాదు.అప్పటికే చరిత్ర పాఠాలంటే సదభిప్రాయం లేని నాకు ఆయన పాఠం చెప్పే తీరుతో విసుగు కూడా కలిగేది.ఇదిగో అలాంటి తరుణం లోనే నేను శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదవడం,దానిలోని దేశ చరిత్రలు గేయం నన్ను విశేషంగా ఆకర్షించడం జరిగాయి.ఏ రాజులు ఎప్పుడు ఏలారో, వారి వంశావళి,ఏ యుధ్ధం ఎప్పుడు జరిగిందో తారీఖులు దస్తావేజులు--ఇవన్నీ అసలైన చరిత్ర కాదు. “క్రోమాన్యాన్ గుహా ముఖాల్లో మానవ కథ వికాసమెట్టిది” అంటూ నిజమైన చరిత్రకర్థం చెప్పాడు శ్రీశ్రీ. గతంలో జన సామాన్యం ఎట్లా బ్రతికేరు?వాళ్ల కష్ట సుఖాలేమిటి?వారి రక్షణ కోసం ప్రభువులేం చేసారు?ఇలాంటి వన్నీ తెలుసు కోవాలనీ అదే నిజమైన చరిత్ర అనీ అప్పుడు నాకనిపించింది.అందుకే జీవిత చరిత్రలు చదువుతాను. వాటిలో ఏ మాత్రమైనా ఆనాటి సంఘ స్వరూపం కన్పించక పోతుందా అని..అందుకే నాకు చరిత్ర కన్నా చరిత్ర చెప్పని కథలే ఇష్టం.( చరిత్ర చెప్పని కధలెలా ఉంటాయో మీరే చూడండి.)
                                                            ***
దేశ చరిత్రలు గేయం లోనే ఒక చోట “పిండారులు థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన” అంటాడు శ్రీశ్రీ. ఆ రోజుల్లో ఈ పిండారులు,థగ్గులు ఎవరో నాకు తెలియక పోయినా వారెవరో దోపిడీ దారులై ఉంటారని Context ని బట్టి అర్థం చేసుకుని ఊరుకున్నాను.ఈ మధ్య వరకూ కూడా పిండారులంటే ఆయుధ పాణులై గుంపులు గుంపులుగా ఊళ్ల మీద పడి దోచుకునే దండులని తెలుసుకాని ధగ్గుల గురించే సరిగా తెలియదు.వారు కూడా పిండారుల వంటి వారే అనుకుంటూ ఉండే వాడిని. కాని ధగ్గుల కథ చాలా విచిత్రమైనది.వారి కథ వింటే మనలో ఒకే సారి ఆశ్చర్యమూ అసహ్యమూ క్రోథమూ ముప్పిరి గొంటాయి. వారి కథ వినండి:
                                                               ***
థగ్గులనే వారు మనదేశంలో ఎప్పటినుంచి ఉన్నారో సరిగా తెలియదు గాని,19వ శతాబ్దం నాటికి వారు అనేక వేల సంఖ్యలో ఉన్నట్లు,ఆశేతు హిమాచలం వ్యాపించినట్లు తెలుస్తోంది.అందువల్ల వారు కనీసం అంతకుముందు రెండు మూడు వందల ఏళ్లనుంచయినా మన దేశంలో చాలా చోట్ల ఉండి ఉంటారనిపిస్తోంది. ధగ్గులనే వారు ఒక మతానికో ఒక కులానికో చెందిన వారు కాదు.వారిలో అన్ని మతాల వారూ అన్నికులాల వారూ ఉన్నారు.అయితే వీరి మూల పురుషులెవరో కాని వారు హిందూమతావలంబులైనట్టు తోస్తోంది. కారణం వారు ఏ మతంవారైనా వారి  వారి మతాచారాలను పాటిస్తున్నా,వారందరూ కూడా దుర్గా మాత లేక భవానీ మాత భక్తులు.ఆ మాత యెడల అచంచలమైన విశ్వాసం కలవారు.ఆమెను ప్రార్థించనిదే వారు ఏ పనీ మొదలు పెట్టరు.వారు దోపిడీలతో పాటు హత్యలకు పాల్పడడానికి వారు చెప్పే కారణం చిత్రంగా ఉంటుంది.
వారు చెప్పేదేమిటంటే,భగవంతుడికి రెండు పార్శ్వాలున్నాయనీ ఒక పార్శ్వం సృష్టి కార్యానికి నిర్దేశించబడిందయితే,రెండవ పార్శ్వం సృష్టిని నాశనం చేయడానికి నిర్దేశించబడిందనీను. సృష్టి కార్యం త్వరత్వరగా జరుగుతూ ఉంటే వినాశనం మెల్లగా జరుగుతోందనీ,అందువల్లనే భగవంతుడు మానవులను సంహరించడానికే తమను సృష్టించాడనీ.ఆ విధంగా తాము భగవన్నిర్దేశం ప్రకారమే హత్యలు చేస్తున్నామని భావిస్తారు.అందుచేతనే వారు ఎన్ని హత్యలు చేసినా ఏ మాత్రం బాధ పడరు. పైగా భగవత్కార్యాన్ని నెరవేర్చామని సంతోషిస్తారు.కేవలం దోచుకోవడం వారి అభిమతం కాదు.హత్య చేయడం వారి ప్రధానోద్దేశం.హత్య చేసి దోచుకోవడం వారి లక్ష్యం. కొన్ని వందల సంవత్సరాల పాటు వారు ఈ వృత్తిని నిరాటంకంగా కొనసాగించినా జన సామాన్యానికో ప్రభుత్వాలకో వారి ఆనుపానులన్నీ తెలియకుండా ఉండడానికి వారి కట్టుబాట్లూ రహస్య వ్యవహార శైలీ కారణాలై ఉంటాయి. అక్బరు పాదుషా కాలంలో వీరిలో చాలా మంది పట్టుబడడం శిక్షింపబడడం జరిగిందట.ఈ విధంగా అడపా దడపా వారిలో కొందరు పట్టువడడం శిక్షింప బడడం జరిగినా వారి గురించిన పూర్తి సమాచారం కాని  వారి ఆచార వ్యవహారాలు కాని హత్యలు చేసే పధ్ధతుల గురించి కాని 1830 వరకూ లోకానికి తెలియలేదు. ఈ వ్యవస్థని రూపుమాపడానికి తగిన ప్రయత్నాలూ జరుగ లేదు.
వీరు మామూలు సమయాలలో వ్యాపారాలు చేసుకుంటూనో వారి వారి ఇతర వ్యాపకాలలోనో జనజీవనంలో కలిసి మెలిసే ఉంటారు.ఉన్నట్టుండి వారు నిర్దేశిత సమయాలలో వారి వారి గృహాలనుంచి మాయమై పోతూంటారు.ఎక్కడికి వెళ్లేదీ ఏ పని మీద వెళ్లేదీ తిరిగి ఎప్పుడు వచ్చేదీ ఎవ్వరికీ తెలియనివ్వరు. అలా మాయమైన వారందరూ నిర్దేశిత స్థలంలో కలుసుకుంటారు. ఇలా కొన్నికొన్నిగుంపులు ఒకచోట కలుసుకుంటారు.సాధారణంగా ఇది దసరాల సమయంలో ఉంటుంది.అప్పటికి వర్షాలు కట్టిపెట్టి వారి వృత్తికి అనుకూలంగా ఉంటుందని కాబోలు ఈ సమయాన్ని ఎంచుకుంటారు.వారి ఆరాధ్యదైవం అమ్మవారి పూజాసమయం అనికూడా కావచ్చు.ఆ విధంగా కలుసుకున్నవారందరూ ఏ ఏ గుంపులు ఎటువెళ్లాలో నిర్ణ యించుకుంటారు.ఆ విధంగా నిర్ణయించుకున్న తర్వాత అమ్మవారి పూజ చేసి శకునం కోసం ఎదురు చూస్తారు. వారు ఎదురు చూసిన శకునం కన్పించగానే భవానీ మాత ఆశీస్సులు తమకు లభించాయనే తృప్తి చెంది వేరు వేరు గుంపులుగా బయలు దేరుతారు.ఆతరువాత వీరు ఎవరిని హత్య చేసి దోచుకోవాలో ఎంచుకునే విధానమూ వారిని హత్య చేసే పధ్ధతీ చాలా చిత్రంగా ఉంటాయి, ఒకొక్క గుంపు వారు ఎన్నుకున్న మార్గాన పయనించి ఏదో ఒక ఊరి బయట డేరాలు వేసుకుని మకాం చేస్తారు. అప్పుడువారిలో ఒకరిద్దరు పెద్దమనుషుల్లాగా తయారై ఊళ్లోకి వెళ్తారు. వీళ్ల పని ఆ వూరినుంచి ఎవరైనా పనిమీద గాని వ్యాపారనిమిత్తంగాని ఎక్కడికైనా వెళ్ల బోతున్నారా?ఎప్పుడు బయలు దేరబోతున్నారు? వారిని చంపి దోచుకుంటే లాభసాటిగా ఉంటుందా?మొదలైన పూర్తి వివరాలు సేకరిస్తారు. ఆతరువాత వారితో మాటలు కలిపి తాము సైనికులమనీ తామూ అటే ప్రయాణిస్తున్నామనీ వారికి దారిలో దొంగల భయంలేకుండా రక్షణ కల్పించగలమనీ వారిని నమ్మించి వారిని తమతో ప్రయాణించేటట్లు చేస్తారు.ఈ పని వారు అత్యంత సమర్థవంతంగా చేయగలవారై ఉంటారు.థగ్గులు వీరిని “సోథా” లని పిలుస్తారు.ఆ విధంగా సోథాలు తీసుక వచ్చిన వారిని మిగిలిన వారు ఏ అనుమానం రాకుండా వారితో సన్నిహితంగా మెలుగుతూ ప్రయాణిస్తూ వారికి నమ్మకాన్ని పెంచుతారు.ఈ విధంగా కొంత దూరం ప్రయాణించాక వారిని ఎక్కడ మట్టు పెట్టాలో ముందే నిర్ణయించుకుని తమలో కొంత మందిని ముందుకు పంపుతారు.వీరి పని హత్య చేయబడిని వారిని పూడ్చడానికి అనువైన ప్రదేశం వెతికి అక్కడ అవసరమైన సైజుల్లో గోతులు తీసి తయారుగా ఉంచడమే. వీరు తీసే గోతులని “భిల్లు”లనీ వీరిని “లఘా”లనీ అంటారు. ఈ విధమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాక నిర్దేశిత స్థలానికి చేరుకోగానే అక్కడ విడిది చేసి డేరాలు వేసి తమతో వచ్చిన ప్రయాణీకులను కూర్చోపెట్టుకుని పిచ్చాపాటీయో,గానా భజానానో ప్రారంభిస్తారు.తాము చంపదలచుకున్నవారి ప్రక్కనే ముఠాలోని సభ్యులు చేరి కూర్చొని ఉంటారు. వారిని “భుట్టోటు”లంటారు. వీరి చేతుల్లో పొడుగాటి రుమాళ్లు ఒక చివర వెండి కాసు కట్టి ముడి వేసి ఉంటాయి. ఆ విధంగా వీరు సర్వ సిధ్ధంగా  తమ నాయకుడి సైగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.వారి నాయకుడైన “జమేదారు” వారికి తెలిసిన సంజ్ఞ “తంబాకు లావో” అనో “పాన్ లావో” అనో అనగానే భుట్టోటులు తమ చేతిలోని రుమాళ్ళను తమకు నిర్దేశించ బడిన వ్యక్తి మెడచుట్టూ బిగించి లిప్త కాలంలో హతమారుస్తారు.హతునికి నోరు తెరిచి అరిచే అవకాశం కూడా ఇవ్వరు.ఏ కొద్దిమందో కొంచెం సేపు గిలగిల కొట్టుకుని మరణిస్తారట.వారు మరణించగానే వారిబట్టలూడదీసి వారి సంపదనంతా దోచి మూటకట్టుకుంటారు. వారి శవాలను ముందుగా తీసి పెట్టిన గోతుల వద్దకు తీసుకు పోయి వాటిల్లో పూడ్చి పెడతారు.అలా పూడ్చి పెట్టేముందు శవాల పొట్టలను చీల్చుతారట.లేక పోతే పూడ్చిపెట్టిన శవాలు ఉబ్బి ఆ ప్రదేశంలో మట్టి పైకి ఉబ్బినట్లయి నక్కలకీ వాటికీ వాటి ఉనికి తెలిసిపోతుందని ఈ జాగ్రత్త తీసుకుంటారు.ఈ పనయిపోగానే అక్కడనుంచి వెంటనే బిచాణా ఎత్తివేసి మరో చోటికి తరలి పోతారు.తర్వాత తీరిగ్గా దోచుకున్నసోమ్ముని వారి వారి పధ్ధతుల్లో పంచుకుంటారు.అలా కొన్ని హత్యలూ దోపిడీలు చేసాక తిరిగి వారి వారి స్వస్థలాలు చేరుకుని ఎవరికీ ఏ అనుమానం రాకుండా మరలా వారి మామూలు జీవనం కొనసాగిస్తారు. కొన్ని చోట్ల వీళ్లతో ఆ యావూళ్ల జమీందారులూ పటేళ్లూ పెద్దపెద్ద భూస్వాములూ కొంతమంది మిలాఖత్ అయి ఉండేవారు.వారు ధగ్గులకి రక్షణ కల్పించేవారు.అటువంటివారికి ఈ ధగ్గుల దోపిడీల సంపాదనలో వాటా ఉండేది.
ధగ్గులు ఏటా తమ పని మీద బయలు దేరే టప్పుడే కాదు,ఎవరినైనా హత్య చేసాక కూడా కృతజ్ఞతా సూచకంగా వెంటనే దేవిని పూజించడం బెల్లం ప్రసాదంగా పెట్టి దాన్ని స్వీకరించడం చేస్తారు.శకునాలు చూసి కాని బయలు దేరరు.మంచి శకునం కనిపిస్తే భవానీ మాత ఆశీర్వాదాలు లభించినట్లే భావిస్తారు.మంచి శకునం లేక పోతే అడుగు ముందుకు వేయరు. అలాగే బయలు దేరిన తర్వాత ఒక హత్యైనా చేయకుండా ఎవరూ గడ్డం కాని క్షవరం కాని చేసుకోరు. పాన్ వేసుకోరు. వరో విషయమేమిటంటే వీరు స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం గాని వారి మానహరణం చేయడం గాని ఎప్పుడూ చేయరు. ఎప్పుడైనా తప్పని సరి పరిస్థితుల్లో స్త్రీలనూ పిల్లలనూ చంపడం జరిగినా అది వీరి మతం కాదు.అలాగే సంఘంలో కొన్నిజాతులు కులాల వారిని (చాకళ్లు పూజారులు దర్జీలు,వడ్రంగులు,కంసాలులు తెలకులవారు, శిక్కులు,ఫకీర్లు మతప్రచారకులు,నటగాయకులు భంగీలు( Sweepers) మెదలైన వారిని) చంపడం వీరికి నిషిధ్ధమట. చిత్రంగా ఉంది కదా.
ఇంత ఘోరమైన హత్యలు చేసి బ్రతికే వారికి తాము తప్పు చేస్తున్నామని ఎన్నడూ అనిపించక పోవడమే కాకుండా తాము చేస్తున్నది పవిత్రమైన దైవకార్యమనే భావన ఉండడమే చిత్రం. ఒక ధగ్గు తాను 719 హత్యలు చేశాననీ, 12 ఏళ్లపాటు జైలు జీవితం గడపాల్సి రాకపోతే వెయ్యిమందిని సునాయాసంగా చంపగలిగి ఉండేవాడిననీ చెప్పుకున్నాడంటే,వారికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని తెలుస్తుంది. ఈ ధగ్గుల సంగతి కనిపెట్టి బ్రిటిషువారు ప్రత్యేక పోలీసు దళాలతో వీరిని ఎదుర్కొని 1930-36 ప్రాంతంలో కొన్ని వేలమందిని పట్టుకుని మరణ శిక్షలో ఇతర శిక్షలో వేసారు. ఆ విధంగా క్రమేపీ ఈ దుర్మార్గాలకు భరతవాక్యం పలకడం జరిగింది.
                                                            ***
(మెడోస్ టైలర్ వ్రాసి 1839 లో ప్రచురించిన Confessions of A Thug అనేనవల ఆరోజుల్లో Best seller గా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగాచదువబడింది. Dy.Commissioner  గా పని చేసిన టైలర్ మహాశయుడు తమకు బందీలుగా దొరికిన ధగ్గుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వ్రాసిన గ్రంధమిది.దీనిలోని ధగ్గుల ఆచారవ్యవహారాలకు సంబంధించిన కొన్ని విశేషాలను మాత్రం మీముందు ఉంచాను.గతంలో మన తాతలు నిర్భీతిగా హాయిగా జీవించే వారనే అపోహతో ఆరోజులు మళ్లా రావని అనుకుంటారు చాలా మంది. “గతమంతా తడిసె రక్తమున.. కాకుంటే కన్నీళులతో” అన్నాడు శ్రీశ్రీ. కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రజలను దుర్మార్గంగా చంపిన ఈకిరాతక ముఠాలనుగురించి గాని వీరినుంచి ప్రజలను రక్షించడానికి ప్రయత్నించని రాజులగురించి కాని ఏ  చరిత్రలు మనకు చెబుతాయి? అందుకే చరిత్ర చెప్పని కథలు అన్నీ ఎక్కడున్నా చదువుకోవాలని నా కోరిక. మిత్రులకీ చెప్పాలని ఆశ. సెలవు.)
                                                           ***

























  

26, సెప్టెంబర్ 2012, బుధవారం

కళా ప్రపూర్ణుడు, సాహితీ చక్రవర్తి శ్రీ చిలకమర్తి..



యాభై అరవై ఏళ్ల క్రితం తెలుగు దేశాన్ని సినిమా ముంచెత్తని రోజుల్లో పద్యనాటకాలు తెలుగు నాట ఓ వెలుగు వెలిగాయి. అంతవరకూ మరఠ్వాడా థార్వాడ్ నాటక సమాజాల నాటకాలు చూసి చూసి విసుగెత్తిన ప్రజలకు 19 వ శతాబ్దపు చివరి దశకంలో ఆవిర్భవించిన తెలుగు పద్యనాటకాలు వారిని విశేషంగా ఆకర్షించ నారంభించాయి. తెలుగు పౌరాణిక పద్య నాటకాల్లో అత్యంత ప్రజాదరణకి నోచుకున్న తెలుగు నాటకంగా గయోపాఖ్యానాన్ని పేర్కొనక తప్పదు. ఆ రోజుల్లోనే ఈ నాటకం లక్షా యాభై వేల ప్రతులు అమ్ముడు పోయిందంటే దాని ప్రాచుర్యాన్ని గురించి చెప్పవలసిందేముంది? .ఈ నాటక రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆ కవిగారి జన్మదినం (26 September) సందర్భంగా వారినోసారి సంస్మరించుకోవడం మన విధిగా భావిస్తున్నాను.
1867వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా లోని ఖండవల్లి గ్రామంలో మేనమామ శ్రీ పురాణపండా మల్లయ్యశాస్త్రిగారింట్లో జన్మించారు శ్రీ లక్ష్మీనరసింహం గారు. వారి బడి చదువులు వీర వాసరంలోనూ,నరసాపురంలోనూ రాజమండ్రిలోనూ జరిగాయి. చిన్నప్పటినుంచి కనుచూపులో ఇబ్బంది ఉండేది. ఈ కారణంగానూ ఆర్థికమైన కారణాలవల్లనూ అతడి చదువు కుంటువడినా 1820లో మెట్రిక్యులేషన్ పరీక్ష ప్యాసయ్యారు.తన చిన్న వయసులోనే (21 సంవత్సరాలు) హిందూ నాటక సమాజం కోసం ఏడెనిమిది నాటకాలను వ్రాసి ఇచ్చారు. ఈయన వ్రాసిన తొలినాటకం కీచక వథలో ద్రౌపది వేషాన్నిశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు ధరించడం విశేషం.తన 22వ యేటనే రచించిన గయోపాఖ్యానం నాటకం వీరికి చిరకీర్తిని సంపాదించిపెట్టింది. ఈ నాటకంలోనే శ్రీకృష్ణుని అథిక్షేపిస్తూ అర్జునుడు ఏమంటాడో చూడండి:
సీ.అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వ
  బంపు మామను బట్టి చంపగలమె
జలకేళి సవరించు జవరాండ్ర కోకల
నెత్తుక పోయి చెట్లెక్క గలమె
యిల్లిల్లు దిరిగి వ్రేపల్లెలో మ్రుచ్చిలి
మిసిమి ముద్దలు దెచ్చి మింగ గలమె
గొల్ల పొట్టెల గూడి కోల సేకొని యాల
కదుపుల నేర్పుతో కాయగలమె

తలిగదండ్రులు పరులకీదలచు కన్య
బలిమిమై దెచ్చి భార్యగా బడయగలమె
దుష్టులను వంక వీరుల ద్రుంప గలమె
అనపరాధుల దండింప నరుగ గలమె.
గయో పాఖ్యానమే కాక ప్రసన్న యాదవము, ప్రహ్లాద చరిత్రము, ద్రౌపదీ పరిణయము మొదలైనవే కాకుండా  అనేక అనువాద నాటకాలను కూడా రచించారు. ఇవే కాక అనేక చారిత్రక నవలలు,సాంఘిక నవలలూ వ్రాసారు. వీరి గణపతి నవల వీరికి హాస్య వాజ్ఞ్మయ నిర్మాతగా పేరుతెచ్చి ఇప్పటికీ ప్రచురణలు పొందుతూనే ఉంది. వీరు రచించిన ప్రహసనాల్లో సంఘంలోని దురాచారాలపై ఘాటైన విమర్శఉంది. కొన్ని కథలు,హాస్య రచనలు జీవిత చరిత్రలే కాక తన స్వీయ చరిత్ర కూడా వ్రాసుకున్నారు. దేశభక్తిపరుడైన ఈయన ఒక సభలో ఆశువుగా చెప్పిన పద్యం ఆంధ్ర దేశమంతా మార్మ్రోగింది. అది ఇధి :
తే. భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు మూతులు బిగియబట్టి.
వీరు స్వంతంగా పాఠశాలలు నడిపారు. పిల్లలకు తెలుగు వాచకాలు వ్రాసేరు. పత్రికా సంపాదకత్వం వహించడమే కాకుండా స్వయంగా మనోరమ పత్రికను స్థాపించి నడిపించారు. ఆ విధంగా సమకాలీన సాహిత్య చైతన్యానికి దోహదం చేసారు. తమ రచనల ద్వారా,పత్రికల ద్వారా,దేశభక్తిని పెంపొందిచే కృషి చేసారు. వీరు మూడు శతకాలను కూడా వ్రాసేరు. అష్టావధానం చేసారు. బాల్యం నుండే చూపు మందగిండంతో పాటు తన 43 సంవత్సరాల వయసు నాటికే పూర్తి అంధత్వం సంప్రాప్తించినా,ఈ మహనీయుడు ఆ తర్వాత కూడా విశేషమైన సాహీతీ కృషి చేయడం చాలా అభినందనయం. వీరి శతకాలలో ఒకటైన కృపాంబోనిధీ శతకం 1933 లోనే అచ్చయినా ఇప్పుడు అలభ్యం కనుక దానిలోని ముచ్చటైన మూడు పద్యాలను పరిచయం చేస్తాను:
మ. జలమందుండుట తిండిమానుటయు నిస్సంగత్వముం బొందుటా
కలముల్ మెక్కుట మోక్ష సాధనములా? యట్లైననం జేపల్ దరి
ద్రులు షండుల్ మఱి వానరంబులును సద్యోమోక్షముంగాంచవే
తెలియం జాలని వారిత్రోవ లివియే దేవా! సత్కృపాంబోనిధీ!
(అదే పనిగా నదుల్లో మునకలిడడం,ఉపవాసాలుండడం ,స్త్రీ సాంగత్యాన్ని వదులుకోవడం, ఆకులు అ లములు తిని కాలం గడపడం—ఇవేవీ మోక్ష సాధనాలు కావు. నిజంగా వీటివలననే మోక్షం వచ్చేటట్లయితే చేపలకూ దరిద్రులకూ నపుంసకులకూ కోతులకూ సద్యోమోక్షం వచ్చి ఉండాలికదా? ఇవన్నీ తెలివి లేని వారి అజ్ఞానపు చేష్టలనీ ఇది నిజమైన భక్తిమార్గం కాదనీ అంటాడు కవి.)
శా. ఆకారంబులు లేని నీకు మనుజుండాకారమిచ్చున్,నినున్
లోకవ్యాపకు గోవెలన్ నిలిపి తల్పుల్ మూయు,నిస్సంగుడౌ
నీకుం బెండిలి జేయు,నాకలితృషానిద్రల్ ప్రకల్పించు,మో
హాకృష్టుండయి బేల యయ్యెనరుడన్నన్నా! కృపాంబోనిధీ!
(నిరాకారుడవైన నీకు అనేక రూపాల్ని కల్పించాడీ మానవుడు. అంతటితో ఊరుకోలేదు. సర్వ వ్యాపకుడవూ సర్వాంతర్యామివీ అయిన నిన్ను కోవెలకట్టి తలుపులు మూసి అందులో బంధించాడు. నిస్సంగుడవైన నీకు ప్రతియేటా పెళ్లిళ్ళు చేయడం మొదలు పెట్టాడు. తనలాగే నీకు కూడా ఆకలి దప్పులను నిద్రనూ కల్పించి ప్రసాదాలు పెట్టడం మేలుకొలుపులు పాడడం మొదలు పెట్టాడు. మాయలో పడి నరుడు అసహాయుడై ఈ వెఱ్ఱి పనులన్నీ చేస్తున్నాడు.)
మ. కలకండంబులకన్న నవ్య కదళీ ఖర్జూర ద్రాక్షా ఫలం
బులకన్నం బువుదేనె కన్న మధురాపూపాదులౌ పిండివం
టల కన్నన్ నవనీతపుంజములకన్నన్ జిహ్వకున్ నీదు ని
ర్మల నామంబు రుచించుచున్నది మహాత్మా! సత్కృపాంబోనిధీ
( దయామయుడవైన ఈశ్వరా!కలకండ,అరటిపండు,ఖర్జూరము ద్రాక్షపళ్లు,పువ్వుతేనె,తియ్యని పిండివంటలు,వె న్న ముద్దలు—వీటన్నిటి కంటె కూడా నీ నామామృతమే మధురాతిమధురమైనది కదా?)
చిలకమర్తి వారి కవితారసాన్ని గ్రోలాలంటే ఆయన శతకాలూ ఇతర రచనలూ చదివి తీరాల్సిందే.
ఈ మహనీయునికి “కళా ప్రపూర్ణ” బిరుదాన్ని,“సాహిత్య చక్రవర్తి” బిరుదాన్ని ఇచ్చి ఆంధ్ర జాతి తనను తాను గౌరవించుకుంది.
( వీరు 17.6.1946 న నిర్యాణం చెందారు.)
సెలవు.



18, సెప్టెంబర్ 2012, మంగళవారం

మళ్ళీ ఒక సారి వెళ్ళి రావాలి సురపురం...



సురపురమా? అదెక్కడుంది? మళ్ళీ వెళ్ళి రావడమేమిటి? ఇంతకు ముందెప్పుడైనా వెళ్లామా? ఇంతకీ అక్కడేముందని? ఏమిటా కథా కమామిషూ?
అదేనండి.అదే చెప్పబోతున్నాను.ఇంతకు ముందు నా బ్లాగులో “నేను చదివిన ఓ మంచిపుస్తకం. ఒక పరిచయం” అన్న పోస్టు చదివిన వారికి మెడోస్ టైలర్ బ్రిటిష్ ఆడ్మినిష్ట్రేటర్ గా సురపురం సంస్థానంలో పని చేసాడనీ ఆ సంస్థానం మన తెలంగాణా ప్రాంతానికి చెందినదనీ తెలిసే ఉంటుంది. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు గుల్బర్గా ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లో చేరిందనీ గుల్బర్గా మండలానికి చెందిన సురపురం కూడా దానితోపాటే కర్ణాటక లో చేరిపోయిందనీ తెలుసు. టైలర్ జీవిత చరిత్ర చదివిన దగ్గరనుంచీ నాకు ఈ సురపురం ఎక్కడుందో తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగింది. గుల్బర్గా ప్రాంతంలో ఉంటుందని గూగుల్ మేప్ లో సురపురం కోసం వెతికాను కానీ దొరక లేదు. ఆ మధ్య కొన్నాళ్లక్రితం హైదరాబాదునుంచి షిరిడీ వెళ్తున్న మన వోల్వో బస్సు షోలాపూర్ కి పాతిక మైళ్లు ముందరగా ఉన్న నల్ దుర్గ్ వద్ద అర్థ రాత్రి ప్రమాదానికి లోనై చాలా మంది చని పోయిన వార్త చదివినప్పుడు మళ్లా టైలర్ మహాశయుడు గుర్తుకు వచ్చేడు. ఎందుచేతనంటే సురపురం తర్వాత బ్రిటిష్ పాలనలో ఈ నల్ దుర్గ్ జిల్లా కే టైలర్ డిప్యూటీ కమిషనర్ గా పని చేసాడు. ఇది గుర్తుకు రాగానే మళ్ళా నా మనసు సురపురం మీదికి పోయింది. చిన్న పాటి పరిశోధన తో ఎలాగైతేనేం సురపురాన్ని పట్టుగో గలిగాను.
ఆనాటి సురపురం సంస్థానం రాజులు నివసించిన కోట,ఊరు ఉన్న ప్రదేశాన్ని ఇప్పుడు షోరాపూర్ అనే వ్యవహరిస్తున్నారు. ఈ పేరు ఇంతకు ముందు కూడా ఉంది. సూరా పూర్ షోలాపూర్ షోరాపూర్ అని కూడా పిలిచే వారట. సురపురం అన్న పేరు మాత్రం కనుమరుగై షోరాపూర్ అన్న పేరు మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉంది. 2011 లో ఈ ఊరి జనాభా 45000 ట. ఒకప్పుడు గుల్బర్గా జిల్లాలో ఉన్నసురపురం ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ యాద్గిర్ జిల్లా లో ఒక తాలూకా కేంద్రంగా ఉంది.
టైలర్ మహాశయుడు బ్రిటిష్ ప్రతినిధిగా సురపురం సంస్థానానికి వచ్చే సరికి అక్కడి పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. రాజు కృష్ణప్ప నాయక్ చనిపోయాడు.అప్పటికి అతడికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. రాణి ఈశ్వరమ్మ బ్రిటిష్ ప్రతినిధిని కాదని 10000 మంది సాయుధుల్ని సమకూర్చుకుని రాజ్యం దక్కించుకుందికి ప్రయత్నిస్తోంది. కృష్ణప్ప తమ్ముడు పెద్ది నాయక్ యువరాజుకు యుక్త వయసు వచ్చే వరకూ రాజప్రతినిధిగా వ్యవహరించాడానికి గవర్నర్ జనరల్ కు అర్జీ పెట్టుకున్నాడు. సైనిక చర్యతో తప్ప పరిస్థితిని అదుపు చేయలేమన్నాడు అప్పటి బ్రిటిష్ ప్రతినిధి. దానికి గవర్నర్ జనరల్ సుముఖంగా లేక పోవడంతో ఆ ప్రతినిధి రాజీనామా చేయడం. అతడి స్థానంలో టైలర్ రావడం జరిగాయి. టైలర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించి పెద్దినాయక్ ని రాజప్రతినిధిని చేసి రాజకుమారుడికి చదువు సంధ్యలు నేర్పి పెద్దవాడిని చేసే బాధ్యతలు స్వీకరించి కాలక్రమంలో అతడిని పట్టాబిషిక్తుడ్ని చేసాడు. టైలర్ వ్యక్తిత్వాన్నిగురించి,ఆవూరి బాగోగులకి ప్రజలకి అతడు చేసిన సేవలగురించి చెప్పుకో వలసింది చాలానే ఉంది కాని అది ఎప్పుడైనా మరోసారి. ముందు ఈ సురపురం సంస్థానం గురించి కొంచెం తెలుసుకుందాం.
ఈ సంస్థానం కృష్ణా భీమా నదుల మధ్య ప్రదేశంలో కృష్ణా నది కుత్తరాన బిజాపురానికి నైరుతి దిశలోఉండేది.ఈ సంస్థానము నేలిన రాజ వంశీయులు రామ భక్తుడైన నిషద రాజు గుహుని సంతతి వారని,వీరు వేటగాళ్లని తెలుగు కైఫీయతు చెబుతోందట. ముదుగల్లు సీమ     (ఇప్పటిMudgal)లోని కోసల పేట ఒకప్పటి వీరి రాజధాని అనీ అందుచేత వీరిది కోసల వంశమంటారనీ కొందరంటారు. వీరేలిన కోసల దేశమే కోసల్నాడు లేక కాసల్నాడు అనీ ఒక వాదన కూడా ఉందట. వేట జీవనోపాధిగా బ్రతికే వీరిని స్థానికంగా బేడరులంటారు. ఈ సీమలో వీరే అధిక సంఖ్యాకులు. వీరిలో ముఖ్యులకు నాయకులని వ్యవహారమట. పామి నాయక్ అనే వాడు క్రీ.శ.1713 లో ఈ సురపురాన్ని నిర్మించి రాజధాని చేసుకున్నాడట.ఈ పామి నాయకుడు వైష్ణవ మతావలంబి. ఈ పరంపరలో సురపురాన్నేలిన చివరివాడే మన టైలర్ మహాశయుడు పెంచి పెద్ద చేసిన వెంకటప్పనాయక్. ఇతడు బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి చేయూతనివ్వడం ఆ సందర్భంగా బ్రిటిష్ వారు ఇతడిని బందీని చేయడం,టైలర్ కృషి వలన ఇతనికి ఉరిశిక్ష తప్పి నాలుగేళ్లు కారాగార శిక్ష పడడం,అది అమలు కాకుండానే అతడే తనను తాను కాల్చుకుని మరణించడం మనకు తెలిసిందే.
ఈ సంస్థానాధీశుల ఆశ్రయంలో దిగ్దంతుల వంటి పండితులుండేవారట. వారు సంస్కృత భాషాభివృధ్ధికి విశిష్టాద్వైత సిధ్ధాంత ప్రచారానికీ సాగించిన రచనలు కొల్లలుగా ఉన్నాయట.ఈ రాజ వంశంలో 1752 నుంచి 1773 వరకూ పాలించిన రాజా బహిరీ పామ నాయక్  కేవలం కృతి భర్తయే కాక స్వయంగా కవియట.ఇతడు తాను రచించిన భార్గవ పురాణాన్ని వారి కులదైవం సురపురం వేణుగోపాలునికి అంకితమిచ్చాడట.ఈయన కొడుకైన వేంకటనాయకుడు కూడా సాహిత్య పోషకుడే. అభినవ పెద్దన అని బిరుదు పొందిన కాణాదము పెద్దన సోమయాజి కవి,ముమ్మడి వెంకటాచార్యుడు మొదలైన కవులీ ఆస్థానానికి చెందిన వారే. 700 గ్రామాలు కలిగి,ఉత్సవ సమయాల్లో కవి పండిత నర్తక గాయకాదులకు భూరి సంభావనలిచ్చి ఆర్షధర్మాన్ని కళాసంస్కృతులను వికసింపజేసి విశిష్ట ప్రతిపత్తిని గడించిన సంస్థానంగా దీనిని శ్రీ తూమాటి దొణప్ప గారు పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దుల్లో నాగరికతకు నోచుకోని ప్రాంతంలో తెలుగు సాహిత్య పోషణకి నోచుకున్నదీ సంస్థానం. అందుకే ఇదెక్కడుందో తెలుసుకోవాలనీ ఒకసారి చూడాలనీ అనుకున్నాను. నాటి సురపురం కాదు గానీ-- ఈనాటి షోరాపూర్ నీ, అక్కడ శిధిలమైన కోటనీ, టైలర్ మహాశయుడు 1844 లో నిర్మించుకుని నివసించిన అతడి ఇంటినీ చూడగలిగాను. దాని పేరు టైలర్ మంజిల్. ఇప్పటికీ అది నివాస యోగ్యంగానే ఉండి కర్ణాటక ప్రభుత్వ Circuit house గా విరాజిల్లుతోంది.ఈ పని నేను నా కంప్యూటర్ ముందు కూర్చునే చేయగలిగాను. మీకూ ఆసక్తి ఉంటే Shorapur- u tube అని నెట్లో చూడండి.
( ఈ వీడియోని నెట్ లో పెట్టిన వారు CFSI-Azim premji Foundation వారు. సురపురం సంస్థానం వారి సాహిత్య పోషణ గురించి వివరంగా కావాలంటే శ్రీ దొణప్ప గారి ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము అనే గ్రంథం చదవండి.)
ఇప్పటికి సెలవు.  

 

22, ఆగస్టు 2012, బుధవారం

మోసం గురూ... కుడి యెడమల దగా..దగా..




కన్యాశుల్కంలో తాను అగ్నిహోత్రావధాన్లు కూతుర్ని లుబ్ధావధాన్లు కిచ్చి వివాహం చేయించడానికి చేస్తున్న ప్రయత్నం అంతా మోసం అని అన్న మధురవాణితో రామప్ప పంతులు,అది మోసం కాదనీ లౌక్యం అనీ దానిని లౌక్యం అని అనమంటాడు. రెండిటికీ ఏమిటో తేడా అని అడిగిన మధురవాణికి “నమ్మిన చోట చేస్తే అది మోసమనీ నమ్మని చోట చేస్తే అదిలౌక్య”మనీ అంటాడు.దానికి మధురవాణి “తాను చేస్తే లౌక్యం మరోడు చేస్తే మోసం అనరాదా? అబధ్ధానికి అర్థమేమిటి?”. అంటుంది. తాను చేసే తప్పుడు పనులకి రామప్ప పంతులు లౌక్యం అనే ముద్దు పేరు పెట్టుకున్నా అది మోసం కాకుండా పోదు. రామప్ప పంతులు పనుపున ఢబ్బుకు కక్కుర్తి పడి,సిధ్ధాంతి లుబ్దావధాన్లుతో “పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుంది లేకపోతే మారకం ( చావు) వస్తుం”దని చెప్పడమూ,దానికి పండా గారు వంత పాడడమూ కూడా మోసం క్రిందకే వస్తాయి.
మనని బాగా తెలిసిన వారిని,మనమీద నమ్మకం ఉన్న వారిని లేదా పూర్తిగా తెలివి తక్కువ వారినీ అవలీలగా మోసం చేయవచ్చు. ఒక షాహుకారు గారిని “ఇవాళ లాభాలు ఎలా ఉన్నాయయ్యా” అని అడిగితే “ఏం పెద్దగా లేవండి.ఇవాళ తెలిసినవారూ తెలివి తక్కువ వాళ్లూ ఎవరూ రాలేదండి” అన్నాడుట. తెలివి తక్కువ వాళ్ళని సరే, మనని నమ్మిన వాళ్ళని మోసం చేయడం అంత తేలికన్నమాట.
ఈ విధంగా మోసం చేయడం ఇవాళ్టిదో నిన్నటిదో కాదు. మన భారత యుధ్ధకాలం లోనే ధర్మ రాజు గారు “అశ్వథ్థామ హతః కుంజరహః” అని పలికి తాను అబధ్ధమాడని సత్య హరిశ్చంద్రుడని నమ్మిన వారిని మోసం చెయ్యలేదా? కుంజరహః అన్నమాట మెల్లగా పలికి తాను అబధ్ధమాడలేదని తనది లౌక్యమేనని తనను తాను రామప్ప పంతులు లాగా సరిపెట్టుకున్నా ధర్మ రాజు చేసింది మోసం కాకుండా పోదు. ధర్మ రాజే కాదు కురు పితామహుడైన భీష్మాచార్యుల వారు కూడా ఇలాంటి లౌక్యానికే (లేక మోసానికే) పాల్పడ్డారు.అదెలాగో కొంచెం వివరిస్తాను.
.దక్షిణ గోగ్రహణం నాటికి 13 సంవత్సరాలు ( 12 ఏళ్లు అరణ్య వాసము+ 1 సంవత్సరం అజ్ఞాత వాసము) పూర్తి కాలేదని దుర్యోధనుని నమ్మకం. నీతి వేత్త యిన భీష్ముని ఈ విషయమయి అడిగితే ఆయన చెప్పిన సమాధానం చూడండి:
“రెండవ యేట నొక్కండధిమాసమి
ట్లేతక్కిన యన్నెల లెల్ల గూర్చి
కొనం బదమూఁడు హాయసములు దప్పక
నిన్నఁటి తోడనె నిండెనంత…”
అన్నాడట. సూర్యుని చుట్టూ భూమి (365 రోజుల ఆరు గంటలలో) ఒక ప్రదక్షిణం పూర్తి చేస్తేనే ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. అలా లెక్క చూస్తే అప్పటికి 13 సంవత్సరాలూ పూర్తి కాదు. కాని అధిక మాసాల్ని లెక్కలోకి తీసుకుంటే 13 సంవత్సరాలూ ముందురోజుకే పూర్తయ్యాయిట. చాంద్రమానంలో ఈ అధిక మాసాలనేవి ఈ లెక్కను సరిచేయడానికి ఏర్పడ్డవే గాని వేరు కాదు.అందుచేత అవి లెక్కలోకి రావు కదా? మరి ఈ ఆచార్యుల వారి లెక్క ఏమిటి? పాండవ పక్షపాతంతో పలికిన లౌక్యపు (మోసపు) మాటలే కదా?
ఈ లౌక్యం అనబడే మోసం అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ అన్నిజాతులలోనూ అన్ని వృత్తుల వారిలోనూ ఉంది.అమాయకులైన రోగులు తమను నమ్మి తమ వద్దకు వస్తే వారికి అనవసరమైన పరీక్షలు చేసి శస్త్ర చికిత్సలకు పాల్పడే వైద్యులు ఎందరో కదా? ఇది కొత్తేమీ కాదని మనకు బెర్నాడ్ షా వ్రాసిన The Doctor’s Dilemma అనే ఇంగ్లీషు నాటకం కాని దాని పీఠిక గాని చదివితే అవగతమౌతుంది. న్యాయవాదుల్లో సగం మందికి తాము అన్యాయం పక్షాన వాదిస్తున్నామని తెలిసే ఉంటుంది.అయినా ఆ విషయం వారు తమ కక్షిదార్లకి చెప్పరు కదా? ఒక వృత్తి అని కాదు. మోసం చేయడానికి అవకాశం ఉన్న చోటల్లా అమాయకుల్ని మోసం చేసే పెద్ద మనుషులు ఉండనే ఉంటారు. పుర జనుల హితాన్ని కోరి వారికి సరైన దిశానిర్దేశం చేయవలసిన పురోహితులకి సంబంధించిన రెండు ముచ్చట్లు నేను చదివినవి మీకు మనవి చేస్తాను.
చాలా కాలం క్రితం ఆంధ్ర దేశం లో ఒక జమీందారు గారు ఒక సారి దేవీనవరాత్ర పూజకు సంకల్పించారట. వారి యెస్టేటు లోనే ఉంటూ శ్రౌత స్మార్తాలలో చాలా గట్టివాడయిన ఒక పండితుడిని పిలిచి పూజా విధి విధానాల గురించి అడిగితే ఆయన పూజా కార్యక్రమం జరిగినన్నాళ్లూ మధుమాంసాదులున్నూ స్త్రీ సంబంధమున్నూ విడిచి పెట్టాల్సిఉంటుందని చెబుతూ మహా భోగులయిన రాజా వారికి ఈ చివరి విషయం కష్ట సాధ్యం కనుక జనానా వారితో అయితే దోషం కాని రాజ దాసీ దేవ దాసీలతో సంగమమయితే తప్పులేదని వారికి మార్గాంతరం కూడా చెప్పాడట.( ఏ శాస్త్రాలలో అయినా ఇలాటిది ఉంటుందా?) ఆ విధంగా పూజాదికాలు రాజావారు నిర్వహిస్తున్న రోజుల్లోనే తిరుపతి వేంకట కవులు ఆ ఆస్థానానికి రావడం జరిగింది. అప్పుడా పండితుడు వారిని సమీపించి“అయ్యా నేను తెలిసో తెలియకో రాజుగారితో ఈ విధంగా చెప్పి ఉన్నాను.వారు మిమ్ములను ఈ విషయమయి ప్రశ్నిస్తే నా మర్యాద కాపాడవలసిం”దని ప్రార్థించాడట. రాజా వారు ఆ విషయమయి వీరిని అడగడము జరుగలేదనుకోండి.అయినా తెలిసి కూడా పండితుడు రాజు గారితో అలా చెప్పడం మోసమే కదా? ఇంత కంటె తమాషా అయిన మరో ముచ్చట మనవి చేస్తాను వినండి:
ఒకప్పుడు ఒక పల్లెటూళ్లో మహా ధనికుడైన పెధ్దమనిషి ఉండేవాడట.ఆయనకు యజ్ఞం చేసి ఆ పుణ్యం కాస్త దక్కించుకోవాలనే ఉద్దేశం కలిగింది.యజ్ఞం చేస్తే గోవులను దానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అతని దగ్గర గోవులు లేవట.అందు చేత ఒక వైదికుని పిలిచి నూరు గేదెలిస్తానని తనచేత యజ్ఞం చేయించవలసిందని అడిగాడట. ఆ వైదికుడు దానికి ఒప్పుకుని ఇద్దరు ముగ్గురు సహాయకులకు హోమకుండంలో సమిధలు ఆజ్యం వేసే పధ్ధతులు నేర్పించి తనతో తెచ్చుకుని యజమానిని హోమగుండం ముందు కూర్చో పెట్టుకుని యజ్ఞం చేయనారంభించాడట. “కర్రాయ స్వాహా కంపాయ స్వాహా” అని ఈ వైదికుడు ( ఆధ్వర్యునిగా) మంత్రాలు చదువుతుంటే హోతలు చితుకులు వేస్తూ యజ్ఞం చేస్తున్నారట.అంతలో అక్కడికి వచ్చిన పండితుడొకడు అది చూసి ముక్కున వేలేసుకుంటుంటే అప్పుడా పురోహితుడు “మహా మూర్ఖస్య యాగోయాం మహిషీ శతదక్షిణాం తవాప్యర్థం మమావ్యిర్థం తూష్ణీం తిష్టస్వ పండితోం స్వాహా” అని హోమకుండం లో సమిధ వేసి ఆజ్యం పోసాడుట.ఆ వచ్చిన పండితుడు తాను కూడా ఇంత ఆజ్యం పోసి “అషైతే మాభాగా ఇదం న మమ” అని అన్నాడట. ఆ విధంగా యజ్ఞం పూర్తి చేసి ఆ బ్రాహ్మలిద్దరూ చెరి యాభై గేదెలనూ పంచుకుని చక్కా పోయారట. ఈ కథ మన ఆంధ్ర దేశం లోనే కాకుండా యావద్భారత దేశం లోనూ ప్రచారం లో ఉందంటారు ఇది మనకు చెప్పిన శ్రీ రాంభట్ల కృష్ణ మూర్తి గారు.
అయ్యా ఇదీ సంగతి.అమాయకంగా కనిపిస్తూ మనం అందరినీ నమ్మేస్తే వారు వారి లౌక్యంతో మనల్ని ముంచేయడం ఖాయం. అందుకే అన్నాడు మహా కవి కుడి యెడమల దగా దగా..అని. తస్మాత్ జాగ్రత..

18, ఆగస్టు 2012, శనివారం

నాసికోపాఖ్యానం..లేక నాసికా సాముద్రికం..అనబడే..ముక్కు జోస్యం కథ..




“ముక్కుమీది కోపం నీ ముఖానికే అందం” అంటాడో సినీ కవి. కోపం ముక్కుమీద ఉండడమేమిటి? అక్కడేమీ కనిపించదు కదా? కోపం మన కళ్ళల్లో కదా కనిపించేది? అంటే నిజమే. కోపం మన చూపుల్లోనే కనిపిస్తుంది. ఎంతటి శాంతమూర్తులకైనా ఏదో సమయంలో కోపం రాకా తప్పదు. అది వారి కళ్ళల్లో కనిపించకా తప్పదు. కాని ముక్కుమీది కోపం అనే నానుడికి అర్థం వేరు. అతి తొందర గానూ అనవసరంగానూ కోపం తెచ్చుకునే వారి విషయంలోనే ఇలా అంటారు. ఎందుకనంటే ఎవరికైనా తమ శరీర భాగాల్లో అన్నిటి కంటే ముందుకు ఉండేది తమ ముక్కే
.( బొజ్జలు బాగా పెంచుకున్నవారు మాత్రమే దీనికి అపవాదం). అందుచేత ముక్కుమీద కోపం అంటే కోపిష్టులకు వారికంటే ముందే వారికోపం ఉంటుందన్నమాట. ముక్కు మూసుకుని ఘోరమైన తపస్సు చేసి ఎన్నో శక్తులను పొందిన ముని వర్యులలో కూడా తమ కోపాన్ని అణచు కోలేక ఎవరెవరికో శాపాలనిచ్చి తమ తపఃఫలాన్ని వృథా చేసుకున్నవారూ ఉన్నారు. అందులో దూర్వాస మహర్షి అగ్రగణ్యుడు.ఆయనకు కోపం ఆయన ముక్కుమీదే ఉండేది. అయిన దానికీ కాని దానికీ శాపాలిస్తూ ఉండేవాడు. అందుకే మన వాళ్లు కోపిష్టి వాడిని చూస్తే “వాడో దూర్వాసుడు రా” అంటారు.
మన పెద్ద వాళ్లు ఏ పిల్ల అయినా అందంగా ఉందని చెప్పేటప్పుడు కన్ను ముక్కు తీరుగా ఉన్నాయని చెబుతారు. అంటే మిగతా అవయవాలకి ఇవ్వని ప్రాముఖ్యత ఈ రెండిటికి ఇచ్చినట్లే కదా? ( కొంతమందికి మాత్రం ఆ పిల్ల వెనకాల ఉండే ఆస్థి మాత్రమే అందంగా కనిపిస్తుంది ).  సర్వేంద్రియాణాం నయనం ప్రధానం కనుక కళ్ళు,వాటి తర్వాత ముక్కు తీరునే చూస్తారన్నమాట. మనిషి సౌందర్యంలో ముక్కుకు ఉన్న ప్రాధాన్యం అటువంటిది. పంచేంద్రియాలలో ముక్కు స్థానం పదిలం. అందుకే లక్ష్మణస్వామి వారు శూర్పణఖకి ముక్కు చెవులు మాత్రం కోసి పంపించి వేసారు. అదే పెద్ద శిక్ష. 
రోజుల వయసులో ఉన్నలేలేత పిల్లలలో కొందరికి ఒళ్లంతా పచ్చగా ఉంటుంది. ముక్కు మీద చెవుల వెనకా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి పిల్లలకు వచ్చే పచ్చకామెర్లే కారణమట.వారిని
రోజూ ఉదయ కాలపు నీరెండలో కాసేపు ఉంచితే అదే తగ్గి పోతుంది. ఇలా చంటి పిల్లల ముక్కులు పచ్చగా ఉండడం చేతనే మన వారు వారిని ముక్కు పచ్చలారని ముద్దుబిడ్డలన్నారు. ( దీనినే ఇంగ్లీషు వారు కొంచెం వెనక్కివెళ్లి still green behind the ears అన్నారు). ఇక్కడా మన వారు మాత్రం ముక్కునే తలచుకున్నారు.
“ముక్కుకు ముక్కెర అందం” అన్నాడు మరో సినీ కవి. అందమైన ముక్కుకు ఆభరణం ముక్కు పుడక. మంచిరోజు చూసి ఆడ పిల్లకు ముక్కు కుట్టించడం కూడా ఒక పండుగే. ఇప్పుడంటే నవనాగరీకమైపోయారు గానీ,ఆంధ్ర దేశంలో ముక్కుకు ముక్కు పుడక లేని స్త్రీలు ఉండేవారు కాదు. (“ముద్దుకు అది ప్రతిబంధం” అయినా సరే.) మన మగువల సౌందర్యాభిలాష అటువంటిది మరి. వజ్రమో మెరిసే రాళ్లో పొదిగిన ముక్కెర ముదితల ముఖారవిందాలను ముచ్చటగొలిపేలా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  స్త్రీలే కాదు రాధారమణుడూ రాసలీలాలోలుడూ అయిన మన శ్రీ కృష్ణుడు కూడా తన నాసికాగ్రాన నవ మౌక్తికాన్ని ధరించే వాడు. (ఎందుకో మరి మన సినీ కృష్ణుడు మాత్రం ఇది ధరించినట్లు దాఖలాలు లేవు)
నఖశిఖ పర్యంతం స్త్రీల సౌందర్యాన్ని వర్ణించిన మన ప్రబంధ కవులు ఇంత ముఖ్యమైన అంగాన్ని వర్ణించకుండా వదలి పెడతారా? “నువ్వు పువ్వన నవ్వు జవ్వని నాసిక” అని నువ్వు పువ్వుతో సరిపోలుస్తాడు నాయిక ముక్కును చేమకూర వేంకట కవి. మరి నంది తిమ్మన గారైతే ముక్కు మీద పద్యం వ్రాసి ప్రసిధ్ధి చెంది దానినే తన ఇంటి పేరుగా చేసుకున్నాడు. అందమైన ముక్కు మీది అందమైన పద్యాన్ని అడిగినంత ధర ఇచ్చి కొనుక్కుని మరీ తన కావ్యంలో వాడుకున్నాడు వసుచరిత్ర కారుడైన రామ రాజ భూషణుడు. ఆ పద్యాన్నొకసారి ఆస్వాదిద్దాం:
నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం తపం బంది యో
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పొందెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్
(అన్ని రకాల పూవుల వాసనను గ్రోలుచు ఆనందించే తుమ్మెద తనంటే ఎందు కిష్ట పడదని సంపెంగ పూవు ఘోరమైన తపస్సు చేసి నాయిక నాసిక రూపును ధరించి ఆమె చూపులనే తుమ్మెదల బారునే పొందినదని కవి ఉత్ప్రేక్షించాడు. అంటే నాయికయైన గిరికా దేవి ముక్కు సంపెంగ పూవంత అందంగా ఉందని భావం.)
ముక్కు లు అందరివీ ఒకేలా ఉండవు. కొందరివి సన్నగా పొడుగ్గానూ కొసదేరి ఉంటాయి. చివర కొంచెం వంగి ఉండి నాగలిలా ఉండే వాటిని కోటేరేసిన ముక్కులంటారు. (కోటేరంటే నాగలి). చిలక ముక్కు లాఉంటాయి కొందరివి. మరికొంత మందివి పొట్టిగానూ లావు గానూ నొక్కి వేసినట్లుంటాయి. వీటిని చప్పిడి ముక్కులంటారు. అసలే ముక్కు లేని వానిని ముక్కిడి అంటారు. మా చిన్నప్పుడు మా మాష్టరు గారొకాయనకు చాలా లావుగానూ పెద్దగానూ కొట్టొచ్చినట్లు కనిపించే ముక్కు ఉండేది. ఊళ్లో చిన్నా పెద్దా అందరూ ఆయనను ముక్కు మేష్టరుగారనే వ్యవహరించేవారు. ముక్కంటూ ఉన్నాక పడిశం రాకుండా ఉంటుందా? అన్నది సామెత. పడిశం సంగతి ఏమోగాని ఆయన ముక్కు ఆయనకు పెద్ద పేరు తెచ్చిపెట్టింది
మన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారి ముక్కు చూడ ముచ్చటగా ఉండేది. ఆవిడ ఇందిరా “ప్రియదర్శిని” కదా? ముక్కు చక్కగా ఉంటే మేలు కలుగుతుందంటుంది మన సాముద్రిక శాస్త్రం.(ఆమె భారత ప్రధాని కావడంలో ఆమె ముక్కు పాత్ర ఎంతో నాకు తెలియదు మరి). జన్మతః సహజంగా ఉన్నది కాకుండా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందంగా తీర్చి దిద్దుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి రాదట. కానీ అలా ముక్కుకు సర్జరీ చేయించుకుని సినీరంగంలో ధృవతారగా వెలుగు వెలిగిన ఓ “శ్రీ”మంతురాలి కథ మనకు తెలిసినదే.
ముక్కును గురించి సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందో తెలిపే పద్యం చూడండి:
సీ. నాసిక దీర్ఘమై భాసిల్లుచుండిన
మగువ తా గోరిన మగని బొందు,
నాసిక వట్రువై భాసిల్లు చుండిన
సతి యాధికారిక ప్రతిభ గొఱలు,
నాసిక శుకరీతి భాసిల్లు చుండిన
భామిని సుఖరీతి బరిఢవిల్లు,
నాసిక చప్పిడై భాసిల్లుచుండిన
వికటస్వభావయై సకియ బొగులు,
ప్రాగుపార్జిత పుణ్య సౌభాగ్య యైన
లేమ నాసిక గంధపలి వలె వెలయు,
నని చికిత్సదీర్చికొనిన యంతమాత్ర
జక్కదనమబ్బునేమొ ప్రశస్తి రాదు.
( ఈ ముక్కు సాముద్రికాన్ని తన శతావధానం లో చెప్పిన వారు శతావధాని శ్రీ సి.వి. సుబ్బన్న గారు)
మరెందుకాలస్యం? అద్దంలో మీ ముక్కు తీరు చూసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
సెలవు.