10, జులై 2013, బుధవారం

ఈ కవి గారి కలానికి రెండు వైపులా పాళీలే..


ఘటనాఘటన సమర్థులని కొందరుంటారు. అంటే వారు ఏపనినైనా చేయించాగలరు, లేకపోతే ఆ పని జరుగకుండా ఆపనూ గలరన్నమాట. ఇలాంటి వారి విషయంలోనే వారి కత్తికి రెండువైపులా పదునే అనే నానుడి వచ్చింది. శూరుల విషయంలో కత్తి ఎటువంటిదో  కవుల విషయంలో కలం అటువంటిదే కదా?  తన కలం పోటుతో ఒక పని జరిగేటట్లుకాని జరుగకుండా ఆపేటట్లు గాని చేసే కవిగారి కలానికి కూడా రెండువైపులా పదునే కదా?  ఇలాంటి  ఘటనా ఘటన సమర్థుడైన ఒక కవిగారి ముచ్చట ఒకటి మీకు చెప్పాలనిపిస్తోంది. వినండి.
                                                                        ****
భగవదనుగ్రహం వలన  ఆగ్రహానుగ్రహ శక్తిని పొందిన పొందిన కవులు కొందరుండేవారు. వారిలో అందరికీ తెలిసి తిట్టు కవిగా  ప్రఖ్యాతి పొందిన వాడు  వేములాడ భీమకవి కాగా,  అంతగా కాకపోయినా అటువంటి శక్తి కలిగిన వాడుగా పేరుపొందిన మరొక కవి శ్రేష్టుడు తురగా రామకవి. ఈయన స్వగ్రామం  తూర్పు గోదావరి జిల్లా లోని తుని లేక ఆ దగ్గర లోని ఏదో గ్రామం. తరచుగా దేశాటనం వెళ్లి వస్తూ ఉండేవాడు. అతడికి అక్కడి చాలా ఆస్థానాల్లో వార్షికాశనాలు ఉండేవి. వార్షికాశనాలంటే  యేడాదికొక్కసారి  ఆ సంస్థానానికి వెళ్లి  అయిదో పదో రోజులు ఆ రాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన ధనాదికములను స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట. ఈ కవి గారొక సారి పిఠాపురాన్ని ఏలుతున్న వత్సవాయి తిమ్మరాజు గారి దర్శనం కోరి వారి కోటకు వచ్చాడట. అంతకుముందే అతడు వచ్చి తన వార్షికాన్ని స్వీకరించి వెళ్లి ఉండడం చేత, మళ్ళీ ఏం కోరి వచ్చాడోనని, రాజు గారు దర్శనమివ్వక అనాదరించారట. అందుకు కోపగించిన కవిగారు ఆతని కోట గోడమీదో తలుపు మీదో  మసి బొగ్గుతో “ పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్..” అని వ్రాసేడట. పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మి లక్ష్మీ దేవి  అదృష్ట దేవతైతే,  ఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట. కవిగారు అగ్రహించి చేసిన ఈ పని గురించి తెలుసు కున్న రాజుగారు, కవిగారి ఆగ్రహానుగ్రహ శక్తి  ఎరిగిన వాడు కనుక  స్నానం చేస్తున్న వాడు కాస్తా ఆ తడి బట్టలతోనే వచ్చి కవిగారిని శాంతింపజేసి, వారు వచ్చిన కార్యం కనుక్కున్నారట. కవిగారి కోరిక సమంజసమైనది కాక పోయినప్పటికీ రాజుగారు ఎంతో కొంత సంతృప్తి పరచడంతో మోమోటం చెందిన కవిగారు తన పద్యం లో ముందు భాగాన్ని ఇలా పూరించారట.
“ అద్దిర, శ్రీ , భూ, నీళలు
ముద్దియలా హరికి గలరు, ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడెను
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్ ”
చూడండి కవి గారి చాతుర్యం. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది కదా? అయితే మొదట కవిగారికి జరిగిన నిరాదరణ వల్ల కవి వాక్కు పూర్తిగా వృథా పోలేదనీ  తిమ్మరాజు గారి కాలంలో కాకపోయినా ఆయన మనుమల కాలంలో జమీందారీ కష్టాలపాలై నశించిందన్నదీ ఐతిహ్యం.
                                                                         ****
తా.క.- అంటే తాజా కలమన్న మాటకు ఇవి  పొడి అక్షరాలన్నమాట. ఇది ఇంగ్లీషు భాషలోని  Post Script కి సమానమైనది. ముందు వ్రాసిన వ్రాతలో మరచి పోయిన విషయాన్నో మరీ ముఖ్యమైన దాన్ని గుర్తు చేయడానికో చివర్లో ఈ తాజా కలం  అంటూ వ్రాసేవారు. అయితే నేనీ తా.క. అనే తోక ని తగిలించడానికి కారణం అది కాదు. బాల్ పెన్నులు తప్ప సిరాతో వ్రాసే కలాలగురించి ఈనాటి యువతలో కొందరికైనా తెలిసి ఉండక పోవచ్చునన్నసంశయమే. మేము మరీ చిన్నగా ఉన్నప్పుడు సిరా బుడ్డి కలం విడి విడిగా పట్టుకుని పాఠశాలలకు వెళ్ళే వారు. సిరా బుడ్డిలో కలం ముంచి వ్రాయాల్సి వచ్చేదన్న మాట.కరక్కాయతో చేసిన సిరా అయితే ఎన్నటికీ చెరగకుండా ఉండేది. అయితే మేము స్కూల్లో చేరినప్పటికే ఫౌంటెన్ పెన్నులు వాడుకలోకి రావడం వల్ల మాకా బాధ తప్పింది. ఇలాంటి ఇంకు పెన్నులు చూచిన వారైనా రెండు వైపుల నుంచి రెండు రంగుల సిరా పోసుకుని వాడుకునే వీలున్న Fancy కలాలలని చూసి ఉండక పోవచ్చు. సకృత్తుగా నైనా ఇలాంటివీ ఉండేవి. ఒకవైపు నీలం సిరా రెండవ వైపు ఎర్రరంగు సిరా  పోసుకునే వారు. నీలం సిరాతో వ్రాయడానికీ ఎర్రసిరాతో తప్పులు దిద్దడానికీ వాడే వారు. మరి మన కవిగారి కలం అలాంటిదే కదా? అయన కలానికి రెండు వైపులా పాళీలే.

                                                                          ****

3, జులై 2013, బుధవారం

జగమే మాయ...


జగమే మాయ.. బ్రతుకే మాయ.. అంటాడు మన దేవదాసు. ఊరికే అనడం కాదు. వేదాల్లోని  “ సారా ”  న్నంతా త్రాగేసి జీర్ణించుకోని చెబ్తున్నానంటాడు. ఈ పాట పాడుతున్నప్పుడు అతడు ఒక వీధి లాంతరు క్రీనీడలో చెత్త కుండీ ప్రక్కన మాసిపోయి చిరిగి పోయిన బట్టలేసుకుని ఉంటాడు.జమీందారు బిడ్డడు.  భోగ బాగ్యాలు అనుభవిస్తూ హంసతూలికా తల్పాలమీద పవ్వళించాల్సిన వాడు ఇలా వీధిలో మురుగు కాల్వ ప్రక్కన—తన ప్రక్కనున్నది  తన ప్రేయసి పార్వతో వీధి కుక్కో తెలియని స్థితిలో ఉన్నాడు. కడుపు లో చుక్క పడితే వేదాంతం తన్నుకొస్తుందేమో? మరి వేదాంతులకి హంస తూలికా తల్పాలూ, కుళ్ళు కాలువలూ ఒకటే కదా? వారి దృష్టి లో అంతా మాయే కదా ? ఇది త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన  ప్రేలాపన అని సరి పెట్టుకుందాము. కానీ మన అద్వైత పండితులేమన్నారు? ఈ చరాచర సృష్టి మొత్తం మాయే అనలేదా?  కనిపించనివి సరే. కళ్ళముందర కనిపిస్తూ స్పర్శకి  తగులుతూ ఉండేవి కూడా మాయే అంటారు కదా?అంత స్ఫష్టంగా కనిపిస్తున్నవి నిజం కాదని నమ్మడమెలా? ఎలాగంటే మనం కలకంటున్నంత సేపూ అన్నీ మనకు నిజమే. కలలో బాధలూ సుఖాలూ కూడా అనుభవిస్తాము.నవ్వులూ, ఏడుపులూ, కోపాలూ, ఒకటేమిటి  జాగ్రదవస్థలో ఉన్నవన్నీ కలలో కూడాఉంటాయి. కాని కల నిజం కాదుగా? మెలకువ వచ్చిన మరుక్షణం అది మన కలే అని మాయే అని తెలిసి పోతుంది. కాని స్వప్నావస్థలో ఉన్నంత సేపూ అది మనకు నిజమే కదా? అందు చేత కళ్ళకు కనపడేదంతా నిజమే  అనుకో నక్కరలేదు కదా? కలల సంగతి సరే, మనం జాగ్రదవస్తలో చూస్తున్నదంతా కూడా కల లాంటి మాయే అంటారే  అద్వైతులైన వేదాంతులు. కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే అని పాడుకుంటూ ఉండి పోవాలేమో? 
 అద్వైతుల ప్రస్తావన వచ్చింది కనుక ఈ పిట్టకథ చెబుతాను వినండి:
.
రాజులు రాజ్యాలేలే రోజుల్లో ఒక ఊళ్లో ఒక పండితుల వారు అందరికీ అద్వైతం బోధిస్తూ ఉండేవాడట.ఈ అద్వైతం తలకెక్కించుకున్న ఆ వూళ్లోని చాలా మంది ఏది శాశ్వతం లే అనుకుంటూ పనులు మానుకుని ఆయన చుట్టే తిరుగుతూ ఉండే వారట.  ఇలా గైతే తన రాజ్యం ఎందుకూ పనికి రాకుండా పోతుందనిపించిన ఆ ఊరి రాజుగారు  కోపం తో ఒక మదించిన ఏనుగుని వాళ్ళమీదికి ఉసిగొల్పాడట. అది రావడం అల్లంత దూరం లోనే చూసిన మన అద్వైతుల వారు అందరి కంటే ముందే పుంజాలు తెంపుకొని పరుగు లంకించు కున్నారట. ఆ తరువాత పరిస్థితిని చక్కదిద్దిన రాజుగారు పండితుల వారిని పిలిచి " ఏనుగు రావడం మాయే కదా, ఎందుకు భయపడ్డావయ్యా ? " అని అడిగితే అతడు చెప్పిన సమాధానం చూడండి :
“నేను బోధించే అద్వైతం నిజమే. ఏనుగు రావడం మిధ్యే. అలాగే నేను పరుగెట్టి పారిపోయానన్నది కూడా మిధ్యే” నన్నాడుట. దీనికి బదులేముంది?  దీనినే మనవాళ్లు “ గజం మిథ్య.. పలాయనం మిథ్య..” అంటారు.

వేదాంతులే కాదు సామాన్యులు కూడా అప్పుడప్పుడూ .. అంటే ఏ ప్రసూతి వైరాగ్యమో.. స్మశాన వైరాగ్యమో కలిగి నప్పుడు .. అన్నమైతే నేమిరా.. మరి సున్నమైతే నేమిరా అనుకుంటూనే.. కానీ అన్నమే తిందామురా..అని సెటిలైపోతారు. స్మశాన  వైరాగ్యమనగానే నాకు కాటి సీనులోని హరిశ్చంద్రుని ఈ క్రింది  
పద్యమే గుర్తుకొస్తుంది

" మాయామేయ జగంబె నిత్యమని సంభావించిమోహంబునన్
  నాయిల్లాలని నా కుమారుడని  ప్రాణంబుండునందాక ఎం
  తో అల్లాడిన ఈ శరీరమిపుడిందున్ కట్టెలన్ కాలుచో
  ఆ ఇల్లాలును రాదు, ఆ కుమారుడును రాడు తోడై..."  వాపోతాడు
.
 ఇక్కడే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. మనకు కనిపించని ఆ పరమాత్మ ఒక్కడే సత్యమని, ఈ చరాచర ప్రకృతి యావత్తూ అసత్యమని నమ్మిన వాడైతే, ఒక్క అబధ్ధం ఆడితే తప్పేమిటట? పెళ్ళాన్నీ, పిల్లాడినీ అమ్ముకోవలసిన దుర్గతీ తప్పేది, తనకీ వారికీ ఈ కష్టాలూ తప్పేవి కదా? సృష్టే అసత్యమైతే మాట సత్యమెలా అవుతుంది ? అదీ కాక బొంకడం తప్పుకాదని చెప్పిన సందర్భాలు, బొంక రాని సమయాలకంటె  వెయ్యి రెట్లు ఎక్కువ కదా.( చూ. వారిజాక్షులందు...) .ఈ జగత్తంతా మాయ అని హరిశ్చంద్రునికి కాటి సీను లోనే గుర్తొచ్చిందనుకోవాలి)
                                                     ***

చుక్క ఎక్కువైన దేవదాసు అంతా మాయే అన్నా.. చుక్కేసుకుని కవిత్వం చెప్పే మన మహాకవి మాత్రం స్థిమితం కోల్పో లేదు.
 “మాయంటావా.. అంతా మిథ్యంటావా.. నా ముద్దుల వేదాంతీ..  లోకం మాయంటావూ..జమీందారు రోల్సు కారు,, మహారాజు మనీ పర్సు.. మర ఫిరంగి.. విష వాయువు.. పాలి కాపు నుదుటి చెమట.. కూలి వాని గుండె చెరువు.. బిచ్చగాని కడుపు కరువు.. తుఫానులూ.. భూకంపం.. తిరుగు బాట్లు.. సంగ్రామం... ఇవన్నీ మాయేనా? ఏయ్ నా ముద్దుల వేదాంతీ ఏమంటావు? ” అని నిలదీసి గద్దించాడు. ఏమనగలం ?

ఇంతకీ నేను ఈ పోస్టు వ్రాయడం.. మీరు చదవడం.. కూడా  మాయేనా?

  ఏది సత్యం ?  ఏదసత్యం?  ఓ మహాత్మా !  ఓ మహర్షీ !





21, జూన్ 2013, శుక్రవారం

ఈ బంధం ఏనాటిదో?


“ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా..” అన్నారు మన పెద్దలు. ఈ ఋణం ఈ జన్మలోదో ఇంతకు ముందరి ఏ జన్మ లోదో కూడా మనకు తెలియదు. మనం ఏ జన్మలోనో చేసుకున్న పాప పుణ్యాల ఫలితం గానే  ఈ జన్మలో మనకు  భార్యా బిడ్డలు కానీ ఇల్లూ వాకిలి గానీ పశు సంపద కానీ ఒనగూరుతాయన్నది దీని  తాత్పర్యం. పూర్వకాలంలో పశువులనే సంపద గా భావించిన రోజులలో చెప్పినది కనుక పశు పత్నీ సుతాలయా అని మాత్రమే అన్నా, దీని విస్తృతార్థం ఏమిటంటే మనకు లభించే సమస్త సంపదలూ స్నేహితులూ ఇరుగూ పొరుగూ బంధు వర్గం పరిచయస్తులూ పని మనుషులూ..ఒకటేమిటి సమస్తమూ ఈ ఋణానుబంధ రూపేణా మాత్రమే ఏర్పడతాయని. ఈ విషయాన్ని తేటపరిచే ఈ కథ చదవండి.
                                                                             ***
గుజరాత్ లోని అహ్మదాబాదు నగరంలో నివసిస్తున్న నిరంజన్ భగత్ గారికి ఇప్పుడు 88 ఏళ్ళు. ఇతడు
ఆజన్మబ్రహ్మచారి. స్వతహాగా కవి. స్థితిమంతుడు. దయార్ద్ర హృదయుడన్నూ. దాదాపు 30 సంత్సరాల క్రితం ఈయన ఇంట్లో పనిచేసే పనిమనిషి ద్వారా ఆమె ఊరికి చెందిన ఓ 8 ఏళ్ళ కుర్రాడు ఊళ్లో తిండికి గడవక ఈయన ఇంటికి వచ్చి చేరాడు. తనకు చేతనైనంత పని చేస్తూ భగత్ గారి అభిమానాన్ని చూరగొన్నాడు.భగత్ గారు కూడా ఈ అబ్బాయి- పేరు జగత్- ని పని వాడుగా కాకుండా ఇంట్లో మనిషి గానూ- ఇంకా చెప్పాలంటే తన స్వంత కొడుకు లాగే చూసుకున్నాడు. వారి ఈ బంధం బాగా గట్టి పడే సందర్బం 2000 సంవత్సరం లో తటస్థించింది. అప్పుడు భగత్ గారి తల్లి గారికి విపరీతమైన జబ్బు చేసి మరణ శయ్యమీద ఉంటే  ఆమెకు జగత్ చేసిన సేవ ఏ పని మనిషి గాని ఆఖరుకు కన్న కొడుకు గాని చేసి ఉండరంటాడు భగత్ గారు. ఈ విధంగా జగత్ తన యజమాని కుటుంబానికి మరచిపోలేని సేవ చేస్తుంటే, భగత్ గారు మాత్రం తక్కువ తిన లేదు. జగత్ పిల్లలిద్దరూ-15 ఏళ్ళ అమర్, 11 ఏళ్ల జయధీర్ లకు చదువు చెప్పించాడు. జగత్ కి తన స్వంత ఊరు దుంగార్ పూర్ లో ఉన్న స్వంత ఇల్లు బాగు చేయించు కోవడానికి తగిన ఆర్థిక సహాయం చేసాడు. తమ అమ్మ గారికి జగత్ చేసిన సేవ మరచిపోలేని భగత్, జగత్ కోసం ఏమైనా చేస్తానంటారు. అనడమే కాదు ఆయన జగత్ పై చూపించే ప్రేమాభిమానా లెటువంటి వంటే వేసవి కాలంలో జగత్ కుటుంబం అహ్మదాబాదులో గడపడానికి వచ్చి నప్పుడు తన ఫ్లాట్ లోని ఏర్ కండిషన్డ్ మాస్టర్ బెడ్ రూమ్ ని ఖాళీ చేసి వారిని వాడుకోమంటారు.

88 ఏళ్ళ భగత్ “ తాను నూరేళ్ళు బ్రతకాల్సి వచ్చినా నిశ్చింతగా బ్రతుకుతానని తనని చూసుకోవడానికి కొడుకు కంటె ఎక్కువైన జగత్ ఉన్నాడన్నదే తన ధైర్య” మని అంటారు.

 తమ కెంత సంపదలున్నా-నలుగురు కొడుకులున్నా వారందరూ కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాకూడా –తమ జీవిత చరమాంకం ఎట్లా గడుస్తుందో నని సతతం దిగులు చెందుతూ బిక్కు బిక్కుమంటూ జీవితాలు గడిపే వృధ్ధ జంటలు లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ రోజుల్లో పై మాటలనగలిగే దైర్యం ఎవరికుంది?
అయితే ఈ కథకు కొస మేరుపేమిటంటే- కవిగారు- శ్రీ నిరంజన్ భగత్ గారు  తన యావదాస్తి నీ- అంటే అహ్మదాబాద్ లోని శ్రీ మంతుల పేట లోని కోటి రూపాయలకు పైగా విలువ జేసే తన ప్లాట్ నీ, 9 లక్షల రూపాయల బాంక్ డిపాజిట్లనీ- ఇంకా ఇన్స్యూరెన్స్ పాలసీలనూ తనతదనంతరం జగత్ కి చెందేటట్లు వీలునామా వ్రాసేరట. ఆయనకు ఇద్దరు మేనల్లుళ్లున్నాసరే.

వీరి ఈ బంధానికి మూలం ఏ జన్మ లోదో ?


ఈ కథలో మనం తప్పక గమనించాల్సిన మరొక కోణం- యజమానులూ పనివారల సంబంధం ఎలా ఉండాలన్నది.మరీ ముఖ్యంగా ఇళ్ళల్లో పనిచేసేవారి విషయంలో మనవైఖరి ఎలా ఉండాలన్నది ప్రతి స్త్రీ గమనించాలి. మనం ఏదో వెయ్యి రూపాయలిస్తున్నాం కదా ఏ నాగాలు పెట్టకుండా పని చెయ్యవచ్చు కదా అనే అమ్మలే ఎక్కువ మంది. నిజానికి మనమిచ్చే డబ్బులు రోజూ వాళ్లయింటినుండి మన యింటికి రావడానికయ్యే బస్ ఛార్జీలకు కూడా సరిపోవు.వారికి గడవక వేరే పనులు చేతకాక మన యిళ్ళలో పని చేస్తుండవచ్చు.మన ఆర్థిక పరిస్థితుల బట్టి వారికి మనం ఎక్కువ ఇవ్వలేక పోయినా వారి కష్టం సుఖం గమనిస్తూ తోటి మనుష్యులకివ్వాల్సిన గౌరవాన్ని వారికిస్తూ మన గౌరవాన్ని నిలుపుకుందాం. సెలవు.

ఈ కథనానికి మూలం నేటి- 21 జూన్ -  టైమ్స్  దిన పత్రిక లోని వ్యాసం.  పత్రిక వారికి కృతజ్ఞతలు.    

16, జూన్ 2013, ఆదివారం

టెలిగ్రాం సార్....

.
కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేసిందని తెలుగులో సామెత. ఏటిలోనూ నదుల్లోనూ నిలచి ఉన్న నీటిని నిత్యం వచ్చి చేరే కొత్త నీరు తొలగించి నట్లే, కాల ప్రవాహంలో కూడా సమాజంలో పెను మార్పులు  జరుగుతూ ఉంటాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన పురోభివృధ్ధి వల్ల జనుల నిత్యజీవితంలో కూడా నిరంతరం ఎన్నో కొత్త కొత్త విషయాలు చోటు చేసుకుంటుంటాయి. మిక్సీలు గ్రైండర్లు వచ్చి రుబ్బురోళ్ళూ పచ్చడి బండలూ మాయమైనట్లే, మన సమాచార రంగంలో కూడా పెను విప్లవం వచ్చిమన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేసింది.
ఆది మానవుడు  నివసించిన అనాగరిక సమాజాల్లో సమాచారాన్ని ఒక చోటినుండి వేరొక చోటికి చేర వెయడానికి ఎత్తైన ప్రదేశాలనుండి జెండాలు ఎగుర వేయడం డప్పులు కొట్టి రకరకాల ధ్వనులు చేయడం ద్వారా ఒక ఊరి నుండి ప్రక్క ఊరికి సందేశాలను అందించేవారట.ఇంకా ఎక్కువ  ముఖ్యమైన సమాచారాన్ని పంపాలంటే వార్తా హరులు దూతలే శరణ్యం.ఇంకా కొంచం నాగరికత సంతరించుకున్నాక తాటాకులమీదో భూర్జ పత్రాల మీదో మరికొన్నాళ్లకి కాగితాల మీదో వ్రాయడం నేర్చుకున్నాక  లేఖలను పంపడం మొదలైంది. పోస్టల్ వ్యవస్థ రూపు దిద్దుకున్నాక సమాచారం పంపడం సులువై ప్రజాసామాన్యానికి కూడా అందుబాటులోకి వచ్చింది.1950 లలో వచ్చిన సంసారం సినిమాలో అనుకుంటాను సూర్యకాంతమ్మ ఎన్నో ఊళ్లు తిరిగొచ్చిన దానినని గొప్పలు పోతుంటే, “దాన్దేముందత్తా మూడు కాన్ల కార్డు ముక్క కూడా ఆ పని చేస్తుం” దంటాడు నాగేశ్వర్రావు. తోక లేని పిట్ట తొంభై ఊళ్లు తిరిగిందనే మన పొడుపు కథ లోని తోక లేని పిట్ట ఈ కార్డు ముక్కే.  అయితే ఆనాటికి కూడా మన పల్లె టూళ్ల పరిస్థతి ఎలాగుండేదంటే కార్డులో ఉన్న విషయాలు కూడా ఉత్తరం బట్వాడా చేయడానికి వచ్చిన పోస్ట్ మేన్ కాని వేరే చదువు వచ్చిన వాళ్లని వెతుక్కుని వాళ్ల చేత చదివించుకోవలసిన దుర్భరమైన పరి స్థితులుండేవి. ఆ కార్డు చదవ గల మనిషి దొరికే వరకూ వాళ్లకి దానిలోని వర్తమానం తెలిసేది కాదు. అయితే,  పిల్లలు  పుట్టడమో వివాహాది శుభ కార్యాలకో సంబంధించినవైతే వాటికి పసుపు బొట్లు పెట్టే వారు కనుక అది మోసుకొచ్చింది శుభ వార్తే అని స్థిమిత పడేవారు. ఏ మరణ వార్తో అయితే ఆ కార్డుకు  నలు మూలలా సిరాతో నల్లగా పూసే వారు కనుక అది దుర్వార్తే అని గ్రహించే వారు. ఈ ఉత్తరాలు కూడా చిరునామా దారునికి చేరడానికి కొన్ని రోజులూ అప్పుడప్పుడూ కొన్ని వారాలు కూడా పట్టేవి. టెలిఫోన్లు ఉపయోగం లోకి రాక ముందు, ఉత్తరాల బట్వాడాలో జరిగే ఆలస్యాన్ని అధిగమించడానికి  సత్వర సమాచారాన్ని అందించడానికి 1844 లో మోర్స్ మహానుభావుడు కనిపెట్టిన మోర్స్ కోడ్, తర్వాత ఉపయోగం లోకి  వచ్చిన టెలిగ్రాములే గతి అయ్యేవి.
ఈ కాలపు పిల్లలకి పోస్టలు డిపార్టుమెంటు ఎట్లా పని చేస్తుందో తెలియనట్లే, ఈ టెలిగ్రాము అంటే ఏమిటో అదెలా పని చేస్తుందో కూడా తెలియక పోవడంలో ఆశ్చర్యం లేదు. టెలి ఫోన్ లో లాగే దీనిలో కూడా శబ్ద తరంగాలను  విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి తీగెల ద్వారా ప్రసరింప జేసి  తిరిగి రెండో కొసలో వాటిని శబ్ద తరంగాలు గా మార్చడం ద్వారా వర్తమానాల్ని ప్రసారం చేసేవారు. అయితే ఫోన్ లో లాగా మన మాటల్ని యథాతథంగా ప్రసారం చేయడానికి అప్పటికి అవకాశం లేక పోవడంతో వార్తల్ని మోర్స్ కోడ్ లో ప్రసారం చేసేవారు.టెలిగ్రాముల్ని ప్రసారం చేసే విధానం తమాషాగా ఉంటుంది. ఒక చిన్న బల్ల చెక్కమీద ఇత్తడి రాడ్ ని స్ప్రింగుతో అమర్చబడి ఉంటుంది. అది నొక్కి వదలి నప్పుడల్లా కట్ట..కడ.. అనే శబ్దాలు చేస్తుంటుంది. వీటినే డాట్.. డాష్..గా వ్యవహరిస్తారు. చుక్క ఒక ఇంగ్లీషు అక్షరానికి సంకేతమైతే గీత మరొక అక్షరానికి సంకేతమన్న మాట. అలాగే కొన్ని గీతలూ కొన్ని చుక్కలూ ఒక్కొక్క ఇంగ్లీషు అక్షరానికి  సంకేతమై ఉండి ,  ఇంగ్లీషులో వ్రాసిన వార్తలను  ఈ మోర్స్ కోడ్ ద్వారా పంపిస్తారన్నమాట. మా చిన్నప్పుడు రైల్వే లో పని చేసే మా బాబాయి తీసుకు వస్తే ఈ టెలిగ్రాఫ్ పరికరం ద్వారా మోర్స్ కోడ్ లోకి వార్తల్నిఅనువదిచడం కొంచెం నేర్చుకున్నాను.ఆ పరికరం ఇలా ఉండేది.



కార్డులూ ఇతర ఉత్తరాలకంటె సత్వరమే వార్తల్ని చేరవేయడానికి టెలిగ్రాఫ్ ఉపయోగంలోకి వచ్చినా చాలా ఎక్కువ మంది పేదవాళ్లుండే మన దేశంలో మాత్రం ఇది అత్యవసరమైన  సమాచారం పంపవలసి నప్పుడు మాత్రమే ఉపయోగించే వారు.  మా చిన్నతనం లో  ఎవరికైనా టెలిగ్రామ్  వచ్చిందంటే కంపించి పోయే వారు  అది ఏ దుర్వార్తో  మోసుకు వచ్చిందమోనని. అదీ ఇంగ్లీషు లోనే ఉండడంతో ఆ భాష తెలిసిన వారు చదివి విషయం చెప్పే వరకూ  ఉత్కంఠ తోనే ఉండే వారు.ఎవరో ఒకరు మరణించారనో, మరణ శయ్య మీద ఉన్నారనో వెంటనే బయల్దేరి రావాల్సిందిగా వచ్చే టెలిగ్రాములే అధికంగా ఉండేవి. కొంచెం నాగరికుల్లోనూ ధన వంతుల్లోనూ శుభ వర్తమానాలకి కూడా టెలిగ్రాములను ఇచ్చుకునే వారు. ఈ వ్యవస్థ బాగా ప్రాచుర్యం లోకి వచ్చేక గ్రీటింగ్ టెలిగ్రాములని ఉండేవి. సందర్భానికి తగిన సందేశాలు ఆంగ్లంలో ఉండేవి. వాటి నంబర్లను మాత్రం మనం టెలిగ్రాములో పంపిస్తే  అవతలి వారికి అది పూర్తి సందేశంగా టైపు చేసి గ్రీటింగ్ కవర్లలో బట్వాడా చేసే వారు. ఆ రోజుల్లో ఏ పెళ్లిళ్ళకు వెళ్లడానికి వీలు కుదరక పోయినా గ్రీటింగ్ టెలిగ్రామ్ ఇవ్వడం తప్పని సరి. పదానికింత రుసుమని ఛార్జి చేసే వారు కనుక సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా పని జరిగి పోయేది. గ్రీటింగులే కాదు మిగిలిన టెలిగ్రాముల్లో కూడా ఎంత సంక్షిప్తంగా సందేశాన్ని పంపగలమో అని  ప్రయత్నించేవారు. ఈ రోజుల్లో సెమ్మెస్ భాష లాగే ఆరోజుల్లో టెలిగ్రాముల భాష కూడా క్రియలు లేకుండా  "Arriving 16th Godavari  receive station"  అంటే పదహారవ తారీఖు గోదావరి రైల్లో దిగుతాను. స్టేషనుకు వచ్చి తీసుకెళ్ళమని ..  తమాషాగా ఉండేది.  అత్యంత సంక్షిప్తమైన టెలిగ్రామంటే ఆస్కార్ వైల్డ్ అనే రచయిత  తన పబ్లిషరుకి పంపించిందనే చెప్పుకోవాలి. తన కొత్త పుస్తకం విక్రయాలు ఎలాగున్నాయని పబ్లిషరుని అడగడానికి అతడు  “ ?  ”   అని టెలిగ్రామిచ్చాడట.  దానికి ఆ పబ్లిషరు మహాశయుడు  “   !  ” అని సమాధానం ఇచ్చేడట.. బాగుందా?
 నేను మరిచి పోలేని టెలిగ్రాము  నేను 1968 జనవరి లో ఒక అర్థరాత్రి అందుకున్నాను. అది మా అమ్మ గారి
అకాల మరణ వార్త. నేను మూడవ రోజుకి కాని మాఊరు చేరుకో లేక పోయాను. ఇలాంటి దుర్వార్తలను కాని శుభ వార్తలను కాని ఆ రోజుల్లో సత్వరమే జనానికి చేరవేస్తూ - 160 సంవత్సరాలు బ్రతికిన-- ఈ టెలిగ్రాఫు వ్యవస్థ మరి కొద్ది (ఒక నెల) రోజుల్లోనే మూత పడబోతోందని వార్త. మనుషులకే మరణం తప్పనప్పుడు అతడు సృష్టించిన పరికరాలు మరణిండంలో విశేషం ఏముంది?

.

     

7, జూన్ 2013, శుక్రవారం

ఏమిటీ జీవిత పరమార్థం?

ఏమిటి జీవిత పరమార్థం....?
“ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ మరి యాలజాతికిన్ తిన్నది పుష్టి..”
 తిరుపతి వేంకట కవుల ఈ పద్యం అందరికీ సుపరిచితమే. గోవుల వంటి పశుజాతికి కడుపు నిండితే చాలు అవి సంతృప్తి పడతాయి. మళ్ళా కడుపు నకనకలాడే వరకూ వాటికి ఏ చింతా ఉండదు.హాయిగా బ్రతికేస్తాయి. మరి అన్ని జన్మలలోనూ ఉత్కృష్టమైనది మా మానవ జన్మే అని విర్రవీగే మానవుడు మాత్రం తన తిండికే కాదు తానూ తన కుటుంబమూ జీవితాతం సుఖంగా కాలం గడపడానికి కావలసినంత ఉన్నా కూడా తనివి తీరక ఇంకా ఇంకా సంపాదిచాలనే కోరికతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు. ఎన్నడూ తృప్త్యాస్మి అనడు. ఉన్నంతలో సంతృప్తి చెందుతూ మనశ్శాంతితో హాయిగా గడిపేవారు చాలా అరుదు. నప్రతిగృహీత్వం-అంటే ఊరికే ఎవ్వరేమిచ్చినా అదెంత తమకు అవసరమైనదైనా స్వీకరించకుండా ఉండడం ఒక వ్రతంగా పాటిస్తూ జీవితాల్ని గడిపిన కొద్ది మంది గురించి ఇంతకు ముందు నా పోస్టులలో ప్రస్తావించి ఉన్నాను. తాము జీవిస్తున్న పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, ఎన్నో  ప్రలోభాలను అథిగమించి,  అనాయాచితంగా వస్తున్న సిరులను తృణ ప్రాయంగా భావించి వద్దనగలగడం సామాన్యమైన విషయంకాదు. అయితే జీవితంలో ఐహిక సుఖాలకంటే విలువలకోసం జీవించ దలచుకున్న స్థిరచిత్తులకు మాత్రం ఇది  అసాధ్యంకాదు. ఈ విషయం రుజువు చేసే రెండు కథలను చెప్తాను వినండి.
                                                         ***
చాలా కాలం క్రితం కోనసీమలో అయిన పల్లి అనే గ్రామంలో బులుసు అచ్చయ్యగారనే మహా పండితుడు ఉండేవారుట.వారి తండ్రులూ తాతలూ కొమాళ్ళూ అందరూ మహా పండితులే. అచ్చయ్యగారు వేద శాస్త్ర శ్రౌతాలలో నిష్ణాతుడు.ఆయన ఒకరోజు ఉదయాన్నేగుమ్మం అలుకుతూ ఉన్న తమ అర్ధాంగిని “ ఈ వేళ శాక పాకా లేమిటోయ్” అని సరదాగా ప్రశ్నించారట. అంతటి మహా పండితుడై ఉండీ ఎంతో ధనాన్ని అవలీలగా ఆర్జించగల దక్షత కలిగిన వాడై కూడా ఆ  విషయంలో ఈ షణ్మాత్రమైనా శ్రధ్ధ చూపని తన భర్తగారి ప్రవర్తనతో ఏ కొంచెమైనా విసిగిపోయి ఉందేమో ఆ ఇల్లాలు “ఆఁ ఏముందీ..ఇత్యర్థలు పులుసూ..ఇతిభావలూ కూరానున్నూ..”  అందట. భార్య మాటల్లోని వ్యంగ్యం గ్రహించిన ఆయన  “ నీకేదో ధనాశ ఉన్నట్లుంది.  ఎంత తెస్తే చాలునో చెపితే ఆ ప్రయత్నం చేస్తా” నన్నాడు. అన్నాడు కాని ఈయన అటువంటి ప్రయత్నమేమీ చేసేవాడనే నమ్మకమేమాత్రం లేని ఆవిడ తాను అప్పుడు గుమ్మం  అలకడానికి  నీళ్లు తెచ్చుకున్న నిలువు చెంబు చూపిస్తూ దీనెడు వరహాలు చాలన్నట్టు సంజ్ఞ చేసిందట. అచ్చయ్యగారు ఆ పట్టునే ఆ చెంబు తీసుకుని బయల్దేరి ఊళ్లు తిరుగుతూ హైదరాబాదు చేరుకున్నారట.అక్కడ ఒక బ్రాహ్మడు యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ శ్రౌతులిద్దరు ప్రాయశ్చిత్తం ఎలా చేయించాలనే విషయమై వాదులాడుకుంటున్నారట. అప్పుడు అచ్చయ్యగారు కలుగ జేసుకుని ఇదీ శాస్త్రీయ మైన పద్ధతి అని వివరించేరట.అప్పుడు ఆ వాదనలో ఓడిపోయిన శ్రౌతి “మధ్యలో నీవెవడవయ్యా కలుగజేసుకుని తీర్పివ్వడానికి ..నీ వేమైనా బులుసు అచ్చయ్యగారి ననుకుంటున్నావా” అని హేళనగా మాట్లాడాడట.అందుకాయన “అలాగే అనుకోండి” అని మాత్రం అన్నాడట. తొందరలోనే ఆయనే బులుసు అచ్చయ్యగారనే నిజం గ్రహించిన అక్కడి పెద్దలు వారికి నమస్కరించి సగౌరవంగా అప్పటి హైదరాబాదు నవాబు వద్ద దివాన్జీగా ఉన్న చందూలాల్ గారి దగ్గరకు తీసుకు వెళ్లారట. అప్పటికే అచ్చయ్యగారి ప్రజ్ఞా విశేషాలు ఎరిగి ఉన్నవాడైనందు వల్ల చందూలాల్ గారు అచ్చయ్యగారిని అంత దూరం నుండి వచ్చిన పనేమిటని అడిగారట. విషయం తెలుసుకుని అచ్చయ్యగారికి జాగీరు ఇవ్వడానికి కూడా చందూలాల్ సిధ్ధ పడ్డా, దానిని నిరాకరిస్తూ తన చెంబుతో చెంబెడు వరహాలు మాత్రం పుచ్చుకుని అచ్చయ్యగారు ఇల్లు చేరారట. కేవలం భార్య కోరిక తీర్చడానికైనా సరే, ఏదో నాలుగు చోట్ల యాచించుకోకుండా తన ప్రజ్ఞను గుర్తించి అడక్కుండానే తన అభీష్టాన్ని నెరవేర్చగల యోగ్యుడైన దాత కోసమే అచ్చయ్యగారు ఇంత దూరం రావలసి వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఆయన తన శేషజీవితాన్ని నప్రతిగృహీతలు గానే గడిపారట.
                                                              ***
ఇది వింటే మనలో కొందరికైనా ఆ రోజుల్లో కనుక అలా గడప గలిగారు కాని ఇప్పటి పరిస్థితుల్లో ఎవరికైనా అలా జీవించడం సాధ్యమా? అనే శంక కలిగి తీరుతుంది. నిజమే. ఆ రోజుల్లో ఏ కొద్ది మంది భాగ్యవంతులో తప్పిస్తే మిగిలిన వారందరూ చాలా సాదా సీదా జీవితాల్ని గడిపే వారు కనుక వారి మధ్య ఈ రకమైన నిష్టతో బ్రతకడం ఇప్పటికంటె కొంచెం సులభమే అయి ఉండవచ్చు. కాని అసలు కారణం అది కాదు. మనిషై పుట్టాక మన జీవితం ఎలా గడపాలి జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని మనం నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో వచ్చే సాధక బాధకాల్ని లెక్కచేయకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగగలగడం అనేవి వ్యక్తులకు సంబంధించినవి. కాలానికి సంబంధించినవి కాదు. ఈ విషయాన్ని రుజువు చేసే కథ చెబుతాను వినండి.
                                                                 ***
మనం ఉంటున్న ఈ కాలంలోనే ఢిల్లీలో ఘాజీ పూర్ ప్రాంతంలో రవి సక్సేనా అనే ఆసామీ టీ అమ్ముకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. అలా టీ అమ్ముకుంటూ నెలలో 20 రోజులలో దాదాపు రూ. 8,000  వరకూ సంపాదిస్తాడట. అంతే మరి. ఆ మిగిలిన 10 రోజులూ టీ అమ్మడం బంద్. ఆ పది రోజులూ ఢిల్లీకి చికిత్స నిమిత్తమై   ఎక్కడెక్కడనుంచో వచ్చే వారికి సహాయం చేయడంలో  తలమునకలై ఉంటాడట. అలా ఢిల్లీకి దూర ప్రాంతాలైన పల్లె టూళ్ళనుండి వచ్చి హాస్పిటల్స్ లో ఎలా చేరాలో తెలియక అట్టాడుతున్న రోగుల్ని తీసుకెళ్లి హాస్పిటల్స్ లో చేర్పించడం వారి అవసరాల్ని బట్టి రోజుల తరబడి  వారికి తోడుగా ఉండడం  సేవ జేయడం లాంటివి చేస్తాడట.ఇలా ఆయన ఆరేళ్ళ బట్టి సేవ జేస్తున్నాడట. ఈ పని మానేసి హాయిగా టీ అమ్ముకుంటూ మరికొంచెం సంపాదించుకోవచ్చు కదా అని అతడి కుటుంబ సభ్యులూ స్నేహితులూ ఎవరెన్ని చెప్పినా వినకుండా అతడీ సేవలో అంకితమై పోతున్నాడట. ఢిల్లీ లాంటి మహా నగరంలో 8000 రూపాయల సంపాదనతో బ్రతుకు వెళ్లదీయడం ఎంత కష్టమో మనమెరుగనిది కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక బ్రతికుంటేనే ఏమైనా సాధించగలం కనుక జీవికకు సరిపడా సంపాదించుకుంటూనే ఈ జీవితానికి సార్థకత చేకూర్చుకోవాలనుకున్న రవిసక్సేనా ధన్యజీవియే కదా?
                                                                ***
బులుసు అచ్చయ్య గారిగురించి చెప్పిన వారు శ్రీ చెళ్ళ పిళ్ళ వేంకట శాస్త్రి గారైతే, రవి సక్సేనాను గురించి జూన్ 6, టైమ్స్ ఆఫ్ ఇండియా దిన పత్రికలో చదివాను. ఇలాంటి ముచ్చట్లు వినడం మన జీవితాల్ని సంపూర్ణంగా మార్చి వేయక పోయినా  జీవిత పరమార్థాన్ని గ్రహించడంలో ఏ కొంతైనా సాయపడి ప్రశాంత జీవన సరళిని ప్రసాదిస్తాయేమోనని ఆశ. సెలవు.
                                                               ***          



12, మే 2013, ఆదివారం

అపురూపం..వివాహ స్వర్ణోత్సవం...


అపురూపం...వివాహ   స్వర్ణోత్సవ వేడుక..
“అపురూపం”
“అపురూపమా?”
“అవును. అపురూపమే”
“ఇది నీ బ్లాగు పేరుకదా?”
“అవును. కానీ నేనిప్పుడు చెబుతున్నది దాని గురించి కాదు.”
“మరేమిటి ”
“మా జీవితంలో అపురూపమైన రోజు గురించి.”
“ఏమిటది”.
“ఇవాళ తారీకు 12 మే కదా”.
“అవును. అయితే ఏమిటి విశేషం”
“ఉంది. ఇవాళ మా పెళ్లి రోజు.”
“శుభం. కానీ పెళ్లి రోజులు ప్రతీ సంవత్సరం ఒకసారి వస్తూనే ఉంటాయి కదా.ఇది అంత అపురూపమైన విషయమా”
“అవును మాకిది అపురూపమైన విషయమే. ఎందుకంటే ఇవాళ్టికి మా పెళ్లై యాభై ఏళ్ళైంది. అంటే వివాహ స్వర్ణోత్సవమన్న  మాట. మనిషి పూర్ణాయుష్షు వంద సంవత్సరాలు. కానీ వంద సంవత్సరాలు బ్రతికే వారు లక్షకి ఒక్కరు కూడా ఉండరు కదా. సగటు జీవిత కాలం ఏ  అరవై డభ్భై సంవత్సరాలో.అలాంటప్పుడు యాభై ఏళ్లంటే మన జీవితంలో సగం కంటే ఎక్కువే కదా. అందుచేత యాభై ఏళ్ల దాంపత్యం అంటే జీవితంలో సగ భాగం కంటే ఎక్కువే.కనుక వివాహ స్వర్ణోత్సవమంటే ఎవరికైనా వారికది అపురూపమే.
 ఈ సందర్బంగా మా ఇద్దరికీ ఇంత ఆయుష్షునిచ్చినందుకు  ఆ పరమేశ్వరునికి- నేను కొలిచే సాయిబాబాకి- నమస్కరించుకుంటున్నాను.
మరి నా జీవితంలో సగభాగం పైనే పాలుపంచుకుని జీవితాన్ని సుఖమయం చేసిన
నా జీవిత సహచరిని అభినందిస్తున్నాను. ఆవిడ మీద నేను రాసుకున్న పద్యం

ఇహ సుఖముల నందించగ
అహరహమును పాటు పడుచు అలుపెరుగక నా
గృహమును స్వర్గమొనర్చిన
సహచరి నాకున్  ప్రియ సఖి సాక్షాత్ లక్ష్మీ

ఎన్నడూ పెళ్లి రోజు వేడుకలని జరుపుకోకపోయినా  ఇవాళ మా వాళ్లందరితో సరదాగా జరుపుకుంటున్నాము.తమ్ముళ్ళూ చెల్లెలూ కుటుంబాలతో ఊళ్ళనుండి వస్తున్నారు. బావ మరదులూ మరదళ్లూ అందరూ ఊళ్ళోనే ఉన్నారు. అందరం సాయంత్రం హోటల్లో కలసి సమావేశమై సరదాగా గడుపుతాము.కలసి భోజనం చేస్తాము.
అక్షయ తృతీయకి ఎప్పటిలాగే ఈ సారి కూడా అరతులం బంగారమైనా కొనుక్కోక పోయినా అరకిలో బంగారం కొనుక్కున్నంత ఆనంద పడుతోంది మా ఆవిడ. ఆవిడ ఆనందమే నా ఆనందం కదా?


   

.

6, మే 2013, సోమవారం

చెప్పు దెబ్బలూ... పూల దండలూ...



మన ప్రవర్తనను బట్టే మనకు లోకంలో లభించే గౌరవాభిమానాలు ఉంటాయి. ఈ విషయాన్ని తేటతెల్లం చేసే ఉదంతాలు రెండు,, చాలా కాలం క్రిందటివే అయినా నాకు బాగా గుర్తుండి పోయాయి. అవేమిటో మీకు మనవి చేస్తాను.
                                                       ***    
 చాలా  కాలంక్రిందటి సంగతిది. ఎప్పుడో ఏవో మాటల్లో మా తమ్ముడు ఈ విషయం నాకు చెప్పాడు. అప్పట్లో వాడు సాలూరు జూనియర్ కళాశాల హైస్కూల్లో తెలుగు పండితునిగా పని చేస్తూ ఉండే వాడు. ఒక సారి ఏదో పని మీద దగ్గరలోని రామభద్ర పురం అనే ఊరు వెళ్లి అక్కడి డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వారి ఆఫీసులో ఆ ఇనస్పెక్టరు గారితో పరిచయం ఉండడం వల్ల వారితో పిచ్చాపాటీ మాటలాడుతూ ఉన్నాడట. అది మండు వేసవి కాలం. మధ్యాహ్నం రెండూ.. మూడు.. గంటల సమయం. ఎండ మండి పోతూ ఉందట. అదిగో అలాంటి మండుటెండలో ఒక ఆసామీ ఉస్సురుస్సురంటూ ఆ ఆఫీసుకి వచ్చి  గదిలో మా తమ్ముడూ ఇన్స్పెక్టరు గారూ మాటలాడుకుంటూ ఉండడం చూసి బయటి వరండాలోనే బెంచీ మీద కూర్చున్నాడట.ఆ వ్యక్తి రావడం గమనించినా ఎంత సేపటికీ ఆ ఇన్స్పెక్టరు ఎందుకు వచ్చారని అడగడం కాని పలకరించడం కాని చేయక పోవడంతో  కాసేపటికి మా తమ్ముడే కలుగ జేసుకుని ఎవరో మీ కోసం వచ్చి   ఉన్నట్లుంది అన్నాడట. ఆ సమయం చూసుకొని నమస్కారం బాబూ అంటూ ఆ వ్యక్తి లోపలకు ప్రవేశించాడట. అప్పటికి     తప్పని సరై ముఖానికి కాస్త సీరియస్ నెస్ పులుముకొని “ఏమిటిలా వచ్చేరు” అని ఆ వ్యక్తినడిగాడట ఆ ఇన్స్పెక్టరు గారు. ఆ వ్యక్తి “అదేనండి నా కాగితం గురించి..” అంటూ వినయంగా నిలబడ్డాడట. “అదా…అదింకా రాలేదయ్యా.  హైదరాబాదు నుంచి రావాలి కదా? వచ్చినప్పుడు వస్తాయి తాపీగా... అక్కడ అందరూ మనలాగా పని చేస్తారనుకున్నావా ఏమిటి ?” అన్నాడట. అది విని హతాశుడైన ఆ వ్యక్తి  “ఎలాగో ఏమిటో వచ్చే నెలలో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను కూడాను..వస్తాను బాబూ..” అనుకుంటూ అక్కడినుండి వెళ్ళి పోయాడట. ఆయన అటు వెళ్లగానే, ఆ ఇనస్పెక్టరు మా తమ్ముడితో  “..... ఊళ్లో మేస్టరండీ ఆయన. తన ప్రావిడెంటు ఫండు అకౌంటు స్లిప్పు కోసం వచ్చాడు. ఇంతకు ముందు కూడా వచ్చాడు లెండి”  అన్నాడట. అప్పుడు మా తమ్ముడు “ఆ స్లిప్పులు ఎప్పుడొస్తాయో ఏమో. పాపం అది జత చేస్తే గాని ప్రావిడెంటు ఫండు లోను తీసుకోవడానికి వీలు పడదు కదా?” అన్నాడట. అప్పుడా ఇనస్పెక్టరు “ వచ్చింది లెండి. ఇదిగో వచ్చి పది రోజులయ్యింది.  “ అంటూ తన  డ్రాయరు సొరుగు లోంచి  కాగితం తీసి చూపిస్తూ “వస్తే మాత్రం రాగానే ఇచ్చేస్తామటండీ. తిరగనివ్వండి.ఒకటికి రెండు సార్లు తిరిగితే కాని వీళ్ళకి మన విలువ బోధ పడదు” అన్నాడట నవ్వుతూ. మా తమ్ముడు తనకది దుమ్మరి గుండు నవ్వులా అనిపించిందనీ ఆ అమాయిక బడి పంతుల్ని బాధ పెట్టడంలో ఆ ఇనస్పెక్టరు కొచ్చిన పైశాచికానందం ఏమిటో తనకు బోధ పడలేదనీ, అయినా అది తనకు సంబంధించిన విషయం కాదు కనుకనూ అప్పటికే ఆ బడి పంతులు వెళ్ళి పోయాడు కనుక బాధ పడడం తప్పితే తానేమీ చేయలేక పోయానని  చెప్పాడు. ఇదిలా ఉంటే మరో ఉదంతం వినండి.
                                                            ****
దాదాపు 40 ఏళ్ళ క్రిందట 1975 లో జరిగిందిది. సంవత్సరం సరిగా ఎలా చెప్పగలిగా నంటే అప్పట్లో నేను ఇల్లు కట్టించుకుంటూ ఉండే వాడిని. దానికోసం ఎక్కువగా సెలవులో ఉండేవాడిని.ఒక సారి మధ్యలో ఇంటి పని లేనప్పుడు సెలవు వృథా ఎందుకని ఆపీసులో చేరితే మళ్లా ఎలాగూ సెలవులో వెళ్తానని చెప్పి మా వాళ్లు నాకు రెగ్యులర్ పోస్టింగు ఇవ్వకుండా  ఒక స్పెషల్ సెల్ లో వేసారు.అదీ ప్రావిడెంటు ఫండుకు సంబంధించినదే. మామూలూగా రిటైర్ అయిన వారికి ఇబ్బంది లేకుండా వారి వారి ఖాతాలలో జమ ఉన్న మొత్తాన్ని వారికి చెల్లించడానికి ఆధరైజేషన్ వెంటనే ఇస్తారు.  తరువాత  వారికి సంబంధించిన సొమ్ము  వారి ఖాతాలలో జమ కాకుండా ఉండిపోయిన మొత్తాలు ఎక్కడెక్కడున్నాయో వెతికి  వాటిని వారి ఖాతాకు జమ చేసి తర్వాత విడుదల చేస్తారు.ఇదిగో ఇలాంటి పనే నాకు ఇద్దరు అసిస్టెంట్లనిచ్చి అప్పగించారు. అలా పని చేస్తున్నప్పుడు ఒక రోజు  సాయంత్రం నాలుగు గంటల సమయం లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి తాను విద్యా శాఖలో పని చేస్తున్నానని పలానా జిల్లానుంచి వచ్చానని తన ప్రావిడెంటు ఫండు అకౌంటు స్లిప్పు తనకందలేదనీ ఎవరిని కలవాలో అంటూ అడిగాడు. ఆ రోజు నా వద్ద పని చేస్తున్న ఇద్దరు అసిస్టెంట్లు కూడా ఏదో కారణంతో సెలవులో ఉన్నారు. ఒక్కడినే అప్పటికి రెండు గంటలనుండీ కదలకుండా  తదేక దీక్షతో  పని చేసుకుంటున్నాను.అలా కదలకుండా ఒకే భంగిమ లో ఎక్కువ సేపు కూర్చుంటే వెన్ను నొప్పి లాంటివి వస్తాయని వైద్యులు అంటారు కనుక ఓ అయిదు నిమిషాలు విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి చేస్తున్న పని ఆపి ఆయనను నాతో రమ్మని పక్క సెక్షనుకి వెళ్లాను.ఆ బ్రాంచిలో రెగ్యులర్ గా పని చేస్తున్న వాణ్ణి కాను కనుక  విద్యాశాఖలో ఆ జిల్లాలో  పని చేసేవారి అకౌంట్లు ఏ సెక్షనులో ఉంటాయో తెలుసుకున్నాను..అంత పెద్ద ఆఫీసులో ఆ సెక్షను ఎక్కడుందో తెలియదు కనుక వారినే అడిగి తెలుసుకుని ఆయనను అక్కడికి తీసుకు వెళ్లాను. ఆ సెక్షనాఫీసరు నన్ను గుర్తు పట్టి   “ఏమిటిలా వచ్చారు సార్” అని అడిగాడు. నేను నాతో వచ్చినాయనను చూపించి ఆయనకు కావలసిన సాయం చేయమని చెప్పి తిరిగి నా సీటుకు వచ్చి పని చేసుకుంటున్నాను. ఓ పావుగంట తర్వాత ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి “Many many Thanks Sir, May God Bless you and your Family. ఆ ఏసు ప్రభువు మిమ్మల్ని కలకాలం రక్షించు గాక..God Bless you..God bless you.. అని రెండు చేతులూ ఎత్తి దీవించాడు. నేను ఆయనకు చేసిన సాయం చిటికెన వేలు గోరంతైనా లేకపోయినా ఆయన అలా అంటుంటే నాకు సిగ్గేసి “అంతగా ఏముంది లెండి. నేను రాక పోయినా మీరు ఎలాగో వెళ్లి మీ పని చేసుకో గలిగేవారు కదా” అన్నాను.. దానికాయన “నా పని అవడం కాదు సార్. ఎదుటి వాడికి ఎంతో కొంత మనకు చేతనైనంత సాయం చేయాలనే మీ అభిలాషను అభినందిస్తున్నాను సార్” అని వెళ్లి పోయాడు. ఆ వ్యక్తి తిరిగి వెళ్లాక తనకు తెలిసిన వారికి     “ఏ జీ ఆఫీసులో అంతా మంచి వారేననీ , మర్యాదస్తులనీ, అందరికీ సాయం చేస్తారనీ”  చెప్పి ఉంటాడనడంలో నాకు ఏ మాత్రం అపనమ్మకం లేదు.
                                                     ***  
మనం చేసే పనులు అవి ఎంత చిన్నవైనా మనకీ, మనం పని చేసే సంస్థకీ మంచి పేరో చెడ్డపేరో తెస్తాయి.ఈ విషయం గుర్తుంచుకుని మసలుకోవాలి.ఎవరికైనా మనం చేయగలిగిన సాయం చేయాలి. ఒకప్పుడు సాయం చేయలేక పోయినా  నవ్వుతూ మాట్లాడాలి. ఎందుచేత వారికి సాయం చేయలేక పోతున్నామో చెబితే వారు మనం సాయం చేసినంతగా పొంగి పోతారు. వారి పని మనం చేయలేదే అని బాధ పడరు. జీవితంలో ఇటువంటి దృక్పథం కలిగి ఉంటే మనం ఉన్న ప్రదేశమే నందన వనం అవుతుంది. మనకు లభించేవి చెప్పు దెబ్బలో పూల దండలో మన ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
                                                                        ***