10, జులై 2013, బుధవారం

ఈ కవి గారి కలానికి రెండు వైపులా పాళీలే..


ఘటనాఘటన సమర్థులని కొందరుంటారు. అంటే వారు ఏపనినైనా చేయించాగలరు, లేకపోతే ఆ పని జరుగకుండా ఆపనూ గలరన్నమాట. ఇలాంటి వారి విషయంలోనే వారి కత్తికి రెండువైపులా పదునే అనే నానుడి వచ్చింది. శూరుల విషయంలో కత్తి ఎటువంటిదో  కవుల విషయంలో కలం అటువంటిదే కదా?  తన కలం పోటుతో ఒక పని జరిగేటట్లుకాని జరుగకుండా ఆపేటట్లు గాని చేసే కవిగారి కలానికి కూడా రెండువైపులా పదునే కదా?  ఇలాంటి  ఘటనా ఘటన సమర్థుడైన ఒక కవిగారి ముచ్చట ఒకటి మీకు చెప్పాలనిపిస్తోంది. వినండి.
                                                                        ****
భగవదనుగ్రహం వలన  ఆగ్రహానుగ్రహ శక్తిని పొందిన పొందిన కవులు కొందరుండేవారు. వారిలో అందరికీ తెలిసి తిట్టు కవిగా  ప్రఖ్యాతి పొందిన వాడు  వేములాడ భీమకవి కాగా,  అంతగా కాకపోయినా అటువంటి శక్తి కలిగిన వాడుగా పేరుపొందిన మరొక కవి శ్రేష్టుడు తురగా రామకవి. ఈయన స్వగ్రామం  తూర్పు గోదావరి జిల్లా లోని తుని లేక ఆ దగ్గర లోని ఏదో గ్రామం. తరచుగా దేశాటనం వెళ్లి వస్తూ ఉండేవాడు. అతడికి అక్కడి చాలా ఆస్థానాల్లో వార్షికాశనాలు ఉండేవి. వార్షికాశనాలంటే  యేడాదికొక్కసారి  ఆ సంస్థానానికి వెళ్లి  అయిదో పదో రోజులు ఆ రాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన ధనాదికములను స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట. ఈ కవి గారొక సారి పిఠాపురాన్ని ఏలుతున్న వత్సవాయి తిమ్మరాజు గారి దర్శనం కోరి వారి కోటకు వచ్చాడట. అంతకుముందే అతడు వచ్చి తన వార్షికాన్ని స్వీకరించి వెళ్లి ఉండడం చేత, మళ్ళీ ఏం కోరి వచ్చాడోనని, రాజు గారు దర్శనమివ్వక అనాదరించారట. అందుకు కోపగించిన కవిగారు ఆతని కోట గోడమీదో తలుపు మీదో  మసి బొగ్గుతో “ పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్..” అని వ్రాసేడట. పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మి లక్ష్మీ దేవి  అదృష్ట దేవతైతే,  ఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట. కవిగారు అగ్రహించి చేసిన ఈ పని గురించి తెలుసు కున్న రాజుగారు, కవిగారి ఆగ్రహానుగ్రహ శక్తి  ఎరిగిన వాడు కనుక  స్నానం చేస్తున్న వాడు కాస్తా ఆ తడి బట్టలతోనే వచ్చి కవిగారిని శాంతింపజేసి, వారు వచ్చిన కార్యం కనుక్కున్నారట. కవిగారి కోరిక సమంజసమైనది కాక పోయినప్పటికీ రాజుగారు ఎంతో కొంత సంతృప్తి పరచడంతో మోమోటం చెందిన కవిగారు తన పద్యం లో ముందు భాగాన్ని ఇలా పూరించారట.
“ అద్దిర, శ్రీ , భూ, నీళలు
ముద్దియలా హరికి గలరు, ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడెను
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్ ”
చూడండి కవి గారి చాతుర్యం. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది కదా? అయితే మొదట కవిగారికి జరిగిన నిరాదరణ వల్ల కవి వాక్కు పూర్తిగా వృథా పోలేదనీ  తిమ్మరాజు గారి కాలంలో కాకపోయినా ఆయన మనుమల కాలంలో జమీందారీ కష్టాలపాలై నశించిందన్నదీ ఐతిహ్యం.
                                                                         ****
తా.క.- అంటే తాజా కలమన్న మాటకు ఇవి  పొడి అక్షరాలన్నమాట. ఇది ఇంగ్లీషు భాషలోని  Post Script కి సమానమైనది. ముందు వ్రాసిన వ్రాతలో మరచి పోయిన విషయాన్నో మరీ ముఖ్యమైన దాన్ని గుర్తు చేయడానికో చివర్లో ఈ తాజా కలం  అంటూ వ్రాసేవారు. అయితే నేనీ తా.క. అనే తోక ని తగిలించడానికి కారణం అది కాదు. బాల్ పెన్నులు తప్ప సిరాతో వ్రాసే కలాలగురించి ఈనాటి యువతలో కొందరికైనా తెలిసి ఉండక పోవచ్చునన్నసంశయమే. మేము మరీ చిన్నగా ఉన్నప్పుడు సిరా బుడ్డి కలం విడి విడిగా పట్టుకుని పాఠశాలలకు వెళ్ళే వారు. సిరా బుడ్డిలో కలం ముంచి వ్రాయాల్సి వచ్చేదన్న మాట.కరక్కాయతో చేసిన సిరా అయితే ఎన్నటికీ చెరగకుండా ఉండేది. అయితే మేము స్కూల్లో చేరినప్పటికే ఫౌంటెన్ పెన్నులు వాడుకలోకి రావడం వల్ల మాకా బాధ తప్పింది. ఇలాంటి ఇంకు పెన్నులు చూచిన వారైనా రెండు వైపుల నుంచి రెండు రంగుల సిరా పోసుకుని వాడుకునే వీలున్న Fancy కలాలలని చూసి ఉండక పోవచ్చు. సకృత్తుగా నైనా ఇలాంటివీ ఉండేవి. ఒకవైపు నీలం సిరా రెండవ వైపు ఎర్రరంగు సిరా  పోసుకునే వారు. నీలం సిరాతో వ్రాయడానికీ ఎర్రసిరాతో తప్పులు దిద్దడానికీ వాడే వారు. మరి మన కవిగారి కలం అలాంటిదే కదా? అయన కలానికి రెండు వైపులా పాళీలే.

                                                                          ****

3, జులై 2013, బుధవారం

జగమే మాయ...


జగమే మాయ.. బ్రతుకే మాయ.. అంటాడు మన దేవదాసు. ఊరికే అనడం కాదు. వేదాల్లోని  “ సారా ”  న్నంతా త్రాగేసి జీర్ణించుకోని చెబ్తున్నానంటాడు. ఈ పాట పాడుతున్నప్పుడు అతడు ఒక వీధి లాంతరు క్రీనీడలో చెత్త కుండీ ప్రక్కన మాసిపోయి చిరిగి పోయిన బట్టలేసుకుని ఉంటాడు.జమీందారు బిడ్డడు.  భోగ బాగ్యాలు అనుభవిస్తూ హంసతూలికా తల్పాలమీద పవ్వళించాల్సిన వాడు ఇలా వీధిలో మురుగు కాల్వ ప్రక్కన—తన ప్రక్కనున్నది  తన ప్రేయసి పార్వతో వీధి కుక్కో తెలియని స్థితిలో ఉన్నాడు. కడుపు లో చుక్క పడితే వేదాంతం తన్నుకొస్తుందేమో? మరి వేదాంతులకి హంస తూలికా తల్పాలూ, కుళ్ళు కాలువలూ ఒకటే కదా? వారి దృష్టి లో అంతా మాయే కదా ? ఇది త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన  ప్రేలాపన అని సరి పెట్టుకుందాము. కానీ మన అద్వైత పండితులేమన్నారు? ఈ చరాచర సృష్టి మొత్తం మాయే అనలేదా?  కనిపించనివి సరే. కళ్ళముందర కనిపిస్తూ స్పర్శకి  తగులుతూ ఉండేవి కూడా మాయే అంటారు కదా?అంత స్ఫష్టంగా కనిపిస్తున్నవి నిజం కాదని నమ్మడమెలా? ఎలాగంటే మనం కలకంటున్నంత సేపూ అన్నీ మనకు నిజమే. కలలో బాధలూ సుఖాలూ కూడా అనుభవిస్తాము.నవ్వులూ, ఏడుపులూ, కోపాలూ, ఒకటేమిటి  జాగ్రదవస్థలో ఉన్నవన్నీ కలలో కూడాఉంటాయి. కాని కల నిజం కాదుగా? మెలకువ వచ్చిన మరుక్షణం అది మన కలే అని మాయే అని తెలిసి పోతుంది. కాని స్వప్నావస్థలో ఉన్నంత సేపూ అది మనకు నిజమే కదా? అందు చేత కళ్ళకు కనపడేదంతా నిజమే  అనుకో నక్కరలేదు కదా? కలల సంగతి సరే, మనం జాగ్రదవస్తలో చూస్తున్నదంతా కూడా కల లాంటి మాయే అంటారే  అద్వైతులైన వేదాంతులు. కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే అని పాడుకుంటూ ఉండి పోవాలేమో? 
 అద్వైతుల ప్రస్తావన వచ్చింది కనుక ఈ పిట్టకథ చెబుతాను వినండి:
.
రాజులు రాజ్యాలేలే రోజుల్లో ఒక ఊళ్లో ఒక పండితుల వారు అందరికీ అద్వైతం బోధిస్తూ ఉండేవాడట.ఈ అద్వైతం తలకెక్కించుకున్న ఆ వూళ్లోని చాలా మంది ఏది శాశ్వతం లే అనుకుంటూ పనులు మానుకుని ఆయన చుట్టే తిరుగుతూ ఉండే వారట.  ఇలా గైతే తన రాజ్యం ఎందుకూ పనికి రాకుండా పోతుందనిపించిన ఆ ఊరి రాజుగారు  కోపం తో ఒక మదించిన ఏనుగుని వాళ్ళమీదికి ఉసిగొల్పాడట. అది రావడం అల్లంత దూరం లోనే చూసిన మన అద్వైతుల వారు అందరి కంటే ముందే పుంజాలు తెంపుకొని పరుగు లంకించు కున్నారట. ఆ తరువాత పరిస్థితిని చక్కదిద్దిన రాజుగారు పండితుల వారిని పిలిచి " ఏనుగు రావడం మాయే కదా, ఎందుకు భయపడ్డావయ్యా ? " అని అడిగితే అతడు చెప్పిన సమాధానం చూడండి :
“నేను బోధించే అద్వైతం నిజమే. ఏనుగు రావడం మిధ్యే. అలాగే నేను పరుగెట్టి పారిపోయానన్నది కూడా మిధ్యే” నన్నాడుట. దీనికి బదులేముంది?  దీనినే మనవాళ్లు “ గజం మిథ్య.. పలాయనం మిథ్య..” అంటారు.

వేదాంతులే కాదు సామాన్యులు కూడా అప్పుడప్పుడూ .. అంటే ఏ ప్రసూతి వైరాగ్యమో.. స్మశాన వైరాగ్యమో కలిగి నప్పుడు .. అన్నమైతే నేమిరా.. మరి సున్నమైతే నేమిరా అనుకుంటూనే.. కానీ అన్నమే తిందామురా..అని సెటిలైపోతారు. స్మశాన  వైరాగ్యమనగానే నాకు కాటి సీనులోని హరిశ్చంద్రుని ఈ క్రింది  
పద్యమే గుర్తుకొస్తుంది

" మాయామేయ జగంబె నిత్యమని సంభావించిమోహంబునన్
  నాయిల్లాలని నా కుమారుడని  ప్రాణంబుండునందాక ఎం
  తో అల్లాడిన ఈ శరీరమిపుడిందున్ కట్టెలన్ కాలుచో
  ఆ ఇల్లాలును రాదు, ఆ కుమారుడును రాడు తోడై..."  వాపోతాడు
.
 ఇక్కడే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. మనకు కనిపించని ఆ పరమాత్మ ఒక్కడే సత్యమని, ఈ చరాచర ప్రకృతి యావత్తూ అసత్యమని నమ్మిన వాడైతే, ఒక్క అబధ్ధం ఆడితే తప్పేమిటట? పెళ్ళాన్నీ, పిల్లాడినీ అమ్ముకోవలసిన దుర్గతీ తప్పేది, తనకీ వారికీ ఈ కష్టాలూ తప్పేవి కదా? సృష్టే అసత్యమైతే మాట సత్యమెలా అవుతుంది ? అదీ కాక బొంకడం తప్పుకాదని చెప్పిన సందర్భాలు, బొంక రాని సమయాలకంటె  వెయ్యి రెట్లు ఎక్కువ కదా.( చూ. వారిజాక్షులందు...) .ఈ జగత్తంతా మాయ అని హరిశ్చంద్రునికి కాటి సీను లోనే గుర్తొచ్చిందనుకోవాలి)
                                                     ***

చుక్క ఎక్కువైన దేవదాసు అంతా మాయే అన్నా.. చుక్కేసుకుని కవిత్వం చెప్పే మన మహాకవి మాత్రం స్థిమితం కోల్పో లేదు.
 “మాయంటావా.. అంతా మిథ్యంటావా.. నా ముద్దుల వేదాంతీ..  లోకం మాయంటావూ..జమీందారు రోల్సు కారు,, మహారాజు మనీ పర్సు.. మర ఫిరంగి.. విష వాయువు.. పాలి కాపు నుదుటి చెమట.. కూలి వాని గుండె చెరువు.. బిచ్చగాని కడుపు కరువు.. తుఫానులూ.. భూకంపం.. తిరుగు బాట్లు.. సంగ్రామం... ఇవన్నీ మాయేనా? ఏయ్ నా ముద్దుల వేదాంతీ ఏమంటావు? ” అని నిలదీసి గద్దించాడు. ఏమనగలం ?

ఇంతకీ నేను ఈ పోస్టు వ్రాయడం.. మీరు చదవడం.. కూడా  మాయేనా?

  ఏది సత్యం ?  ఏదసత్యం?  ఓ మహాత్మా !  ఓ మహర్షీ !





21, జూన్ 2013, శుక్రవారం

ఈ బంధం ఏనాటిదో?


“ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా..” అన్నారు మన పెద్దలు. ఈ ఋణం ఈ జన్మలోదో ఇంతకు ముందరి ఏ జన్మ లోదో కూడా మనకు తెలియదు. మనం ఏ జన్మలోనో చేసుకున్న పాప పుణ్యాల ఫలితం గానే  ఈ జన్మలో మనకు  భార్యా బిడ్డలు కానీ ఇల్లూ వాకిలి గానీ పశు సంపద కానీ ఒనగూరుతాయన్నది దీని  తాత్పర్యం. పూర్వకాలంలో పశువులనే సంపద గా భావించిన రోజులలో చెప్పినది కనుక పశు పత్నీ సుతాలయా అని మాత్రమే అన్నా, దీని విస్తృతార్థం ఏమిటంటే మనకు లభించే సమస్త సంపదలూ స్నేహితులూ ఇరుగూ పొరుగూ బంధు వర్గం పరిచయస్తులూ పని మనుషులూ..ఒకటేమిటి సమస్తమూ ఈ ఋణానుబంధ రూపేణా మాత్రమే ఏర్పడతాయని. ఈ విషయాన్ని తేటపరిచే ఈ కథ చదవండి.
                                                                             ***
గుజరాత్ లోని అహ్మదాబాదు నగరంలో నివసిస్తున్న నిరంజన్ భగత్ గారికి ఇప్పుడు 88 ఏళ్ళు. ఇతడు
ఆజన్మబ్రహ్మచారి. స్వతహాగా కవి. స్థితిమంతుడు. దయార్ద్ర హృదయుడన్నూ. దాదాపు 30 సంత్సరాల క్రితం ఈయన ఇంట్లో పనిచేసే పనిమనిషి ద్వారా ఆమె ఊరికి చెందిన ఓ 8 ఏళ్ళ కుర్రాడు ఊళ్లో తిండికి గడవక ఈయన ఇంటికి వచ్చి చేరాడు. తనకు చేతనైనంత పని చేస్తూ భగత్ గారి అభిమానాన్ని చూరగొన్నాడు.భగత్ గారు కూడా ఈ అబ్బాయి- పేరు జగత్- ని పని వాడుగా కాకుండా ఇంట్లో మనిషి గానూ- ఇంకా చెప్పాలంటే తన స్వంత కొడుకు లాగే చూసుకున్నాడు. వారి ఈ బంధం బాగా గట్టి పడే సందర్బం 2000 సంవత్సరం లో తటస్థించింది. అప్పుడు భగత్ గారి తల్లి గారికి విపరీతమైన జబ్బు చేసి మరణ శయ్యమీద ఉంటే  ఆమెకు జగత్ చేసిన సేవ ఏ పని మనిషి గాని ఆఖరుకు కన్న కొడుకు గాని చేసి ఉండరంటాడు భగత్ గారు. ఈ విధంగా జగత్ తన యజమాని కుటుంబానికి మరచిపోలేని సేవ చేస్తుంటే, భగత్ గారు మాత్రం తక్కువ తిన లేదు. జగత్ పిల్లలిద్దరూ-15 ఏళ్ళ అమర్, 11 ఏళ్ల జయధీర్ లకు చదువు చెప్పించాడు. జగత్ కి తన స్వంత ఊరు దుంగార్ పూర్ లో ఉన్న స్వంత ఇల్లు బాగు చేయించు కోవడానికి తగిన ఆర్థిక సహాయం చేసాడు. తమ అమ్మ గారికి జగత్ చేసిన సేవ మరచిపోలేని భగత్, జగత్ కోసం ఏమైనా చేస్తానంటారు. అనడమే కాదు ఆయన జగత్ పై చూపించే ప్రేమాభిమానా లెటువంటి వంటే వేసవి కాలంలో జగత్ కుటుంబం అహ్మదాబాదులో గడపడానికి వచ్చి నప్పుడు తన ఫ్లాట్ లోని ఏర్ కండిషన్డ్ మాస్టర్ బెడ్ రూమ్ ని ఖాళీ చేసి వారిని వాడుకోమంటారు.

88 ఏళ్ళ భగత్ “ తాను నూరేళ్ళు బ్రతకాల్సి వచ్చినా నిశ్చింతగా బ్రతుకుతానని తనని చూసుకోవడానికి కొడుకు కంటె ఎక్కువైన జగత్ ఉన్నాడన్నదే తన ధైర్య” మని అంటారు.

 తమ కెంత సంపదలున్నా-నలుగురు కొడుకులున్నా వారందరూ కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాకూడా –తమ జీవిత చరమాంకం ఎట్లా గడుస్తుందో నని సతతం దిగులు చెందుతూ బిక్కు బిక్కుమంటూ జీవితాలు గడిపే వృధ్ధ జంటలు లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ రోజుల్లో పై మాటలనగలిగే దైర్యం ఎవరికుంది?
అయితే ఈ కథకు కొస మేరుపేమిటంటే- కవిగారు- శ్రీ నిరంజన్ భగత్ గారు  తన యావదాస్తి నీ- అంటే అహ్మదాబాద్ లోని శ్రీ మంతుల పేట లోని కోటి రూపాయలకు పైగా విలువ జేసే తన ప్లాట్ నీ, 9 లక్షల రూపాయల బాంక్ డిపాజిట్లనీ- ఇంకా ఇన్స్యూరెన్స్ పాలసీలనూ తనతదనంతరం జగత్ కి చెందేటట్లు వీలునామా వ్రాసేరట. ఆయనకు ఇద్దరు మేనల్లుళ్లున్నాసరే.

వీరి ఈ బంధానికి మూలం ఏ జన్మ లోదో ?


ఈ కథలో మనం తప్పక గమనించాల్సిన మరొక కోణం- యజమానులూ పనివారల సంబంధం ఎలా ఉండాలన్నది.మరీ ముఖ్యంగా ఇళ్ళల్లో పనిచేసేవారి విషయంలో మనవైఖరి ఎలా ఉండాలన్నది ప్రతి స్త్రీ గమనించాలి. మనం ఏదో వెయ్యి రూపాయలిస్తున్నాం కదా ఏ నాగాలు పెట్టకుండా పని చెయ్యవచ్చు కదా అనే అమ్మలే ఎక్కువ మంది. నిజానికి మనమిచ్చే డబ్బులు రోజూ వాళ్లయింటినుండి మన యింటికి రావడానికయ్యే బస్ ఛార్జీలకు కూడా సరిపోవు.వారికి గడవక వేరే పనులు చేతకాక మన యిళ్ళలో పని చేస్తుండవచ్చు.మన ఆర్థిక పరిస్థితుల బట్టి వారికి మనం ఎక్కువ ఇవ్వలేక పోయినా వారి కష్టం సుఖం గమనిస్తూ తోటి మనుష్యులకివ్వాల్సిన గౌరవాన్ని వారికిస్తూ మన గౌరవాన్ని నిలుపుకుందాం. సెలవు.

ఈ కథనానికి మూలం నేటి- 21 జూన్ -  టైమ్స్  దిన పత్రిక లోని వ్యాసం.  పత్రిక వారికి కృతజ్ఞతలు.