26, ఫిబ్రవరి 2014, బుధవారం

నువ్వూ నేనూ ఒకటే..






నువ్వూ నేనూ ఒకటేనని నేనంటే
కాదంటావు నువ్వు, కసురుకుంటావు, పోపొమ్మంటావు.
నీకూ నాకూ సాపత్తెమేమిటంటావు.
అవున్నిజమే.
నువు సెప్పింది నిజమే దొరా.
మీదేమో మారాజు లాంటి పుట్టుక
మాకేమో మట్టి పిసుకుడే జీవిక
వడ్డించిన ఇస్తరి మీ జీవితం
మేం ఇస్తట్లో మెతుకు కోసం దేవులాడుతం.
అదికారం ఎప్పుడూ మీ అర చేతనే
అందుకనే అందరికీ మీరంటే భయం
అనాద బతుకులు మావి
అందుకే ఎవరన్నా మాకే భయం.
జీవితం మీ అందరికీ దేవుడిచ్చిన వరం
మాకివ్వలేదేమని మేమెన్నడూ బాధ పడం
కానీ,  అకారణంగా మమ్మల్ని చిన్న చూపు చూడకయ్యా
మూణ్ణాళ్ళ ముచ్చట చూసి మురిసి పోకయ్యా
నువ్వూ నేనూ ఒకటయ్యే రోజొకటొస్తది.
అప్పుడు-
నీదైనా నాదైనా ఆ ఆరడుగుల నేలే
నేనైనా నువ్వైనా ఆ పిడికెడు మట్టే  !!

( ఈ కవిత పొరపాటున తొలగించబడడం వలన మళ్ళా పొస్టు చేస్తున్నాను.)


24, జనవరి 2014, శుక్రవారం

కారుణ్యం ఒక కవిత.



కారుణ్యం ఒక కవిత.

కాగితాల కట్ట ముందేసుకుని కలం పట్టుక్కూర్చుంటే
కవిత్వం వచ్చి రాలి పడదు.
కలం లోంచి కవిత్వం ఉబికి రాదు.
మస్తిష్కాన్ని మథిస్తే మాటలు పుంఖాను పుఖంగా పుట్టించ వచ్చు.
వాటితో మాటల గారడీలూ చేయవచ్చు.
అయితే కవిత్వం మాత్రం వ్రాయ లేవు.
నిజమైన కవిత్వం కావాలంటే-
వేదనాగ్రస్తమైన లోకాన్ని పరికించి చూడు.
నీ చూపుల్లోంచి ధర్మాగ్రహం  నీ మనస్సును చేరి దాన్ని దహించి వేస్తే
కరిగిన నీ హృదయం కార్చే కన్నీటి ధారల్లో
తడిసిన పదాలు పాటల పల్లవులవుతాయి
పద్యాల పాదాలవుతాయి.
కరుణ రసప్లావితమైన కవిత-అప్రయత్నంగానే-
నీ పెదాలు దాటి దూకుతుంది.
పదిమందినీ చేరుతుంది.
పది కాలాల పాటు బ్రతుకుతుంది.


23, నవంబర్ 2013, శనివారం

ఒక అరుదైన ఫోటోలో మాన్యుడైన సామాన్యుడు

     

ఈ ఫోటో సుమారు 70 సంవత్స రాల క్రిందటిది.  అంత పాత ఫోటోలు మనకు చాలా అరుదు గానే లభిస్తాయి. లభించిన వాటిల్లో కూడా మనుషులను స్పష్టంగా గుర్తు పట్టే విధంగా ఉండేవి చాలా తక్కువ గానే ఉంటాయి. ఇది అటువంటి వాటిల్లో ఒకటి.
ఈ ఫోటో 1940 ప్రాంతాలది. విజయనగరం సంగీత కళాశాలకు సంబంధించినది. 

ఫోటో మధ్యలో కుర్చీలో ఆసీనులై ఉన్నవర్చస్వి శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు. వారు ఆ రోజుల్లో  సంగీత కళాశాల లో గాత్ర పండితుని గా పని చేస్తూ ఉండేవారు. ఆయన మధుర గాయకుడే కాకుండా వాగ్గేయకారుడు కూడా. కర్ణాటక సంగీతంలో దిట్ట అయినా, ఆ దాక్షిణాత్య సంగీతపు పోకడలు పోకుండా కొంత స్వతంత్రించి కమ్మటి తెలుగు మాటలు వినిపించేటట్లుగా పాడడం వలన అవి జనరంజకం గా కూడా ఉండేవి. ఉత్తరాంధ్రలో ఆ రోజుల్లో సంగీత కళా మతల్లి కి ఈయన చేసిన సేవల గురించి వివరంగా కావాలంటే  పట్రాయని వారి బ్లాగ్లో  చూడ వచ్చును.
ఇక్కడ ఈ ఫోటోలో గురువు గారికి ఎడమ ప్రక్కన క్రిందన ( ఫోటోలో క్రింద నేల మీద కూర్చున్న వారిలో ఎడమ వైపు నుండి మూడవ వారు  తరువాతి కాలంలో ఆంధ్ర దేశాన్ని తన గాన మాధుర్యంతో ముంచెత్తిన  మహా గాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు). శ్రీ ఘంటసాల గురించి నేనేం చెప్పినా చర్విత చర్వణమే అవుతుంది కనుక దానికి పూనుకోవడం లేదు. కానీ ఈ నాటి విద్యార్థులు, యువత  ఈ ఫోటోని చూసి గ్రహించ వలసిన ముఖ్య విషయమిటంటే - తామెంత ప్రతిభావంతులమైనా ఆ ప్రతిభ రాణించడానికి, విద్యాసముపార్జనకి వినయ విధేయతలతో సద్గురువులను సేవించుకోవడం అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. శ్రీ ఘంటసాలకి మధురస్వనం భగవద్దత్తమే ఐనా, తాను పెద్దవాడైన తర్వాత  కీర్తనలు పాడినా లలిత సంగీతం పాడినా ఆంధ్ర దేశాన్ని ఉర్రూత లూగించేటట్లు పాడే ఫణితి తన  గురువు గారి వద్ద నేర్చుకున్నదే. అది వారి వరప్రసాదమే. గురువుల పాదాల చెంత కూర్చోవడానికి  నేటి శిష్యులెవరైనా  సిధ్ధ పడతారా?

ఈ ఇద్దరి ప్రముఖుల గురించి చెప్పడం కాదు ఈ నా పోస్టు ఉద్దేశం. వీరి గురించి ఎక్కడో ఒక చోట అందరూ తెలుసుకునే అవకాశం ఉంది కదా? మరెందుకయ్యా మొదలెట్టావు అంటే వినండి మరి.
ఇంతకు ముందు 2011 అక్టోబరు మాసం లో నేను వ్రాసిన  “రెండు గొప్ప కథలు”  అనే పోస్టులో శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడుగారు  విజయనగరం సంగీత కాలేజీలో పని చేస్తుండగా అప్పటి కింకా కీర్తి ప్రతిష్టలు రాక పోవడం వల్ల  ఎక్కువ గా కచేరీలు చేసే అవకాశం కాని, సరైన గౌరవ పురస్కారాలు అందు కోవడం కాని జరుగని రోజుల్లో, ఆ కాలేజీలో బంట్రోతు (ఇప్పుడు మనం ప్యూన్ అని పిలిచే చిరుద్యోగి) తన స్వంత సంపాదనతో ఒక రామాలయం కట్టించి దానిలో విగ్రహ ప్రతిష్ట చేసిన రోజున, శ్రీ నాయుడు గారి కచేరీ చేయించి వారికి అంతకు ముందెవ్వరూ ఇవ్వని విధంగా 116 రూపాయలిచ్చి సన్మానించి తన రామ భక్తినీ సంగీతాభిమానాన్నీ చాటుకున్న సంగతీ,. ఆ తర్వాత శ్రీ రామ ప్రసాదం గా పాయసాన్ని సేవించి నిద్ర లోనే దైవ సాయుజ్యాన్ని పొందిన శ్రీ రామస్వామి అనే వ్యక్తిని గురించి చదివే ఉంటారు. 

అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ కూడా  రామ భక్తి తోనూ సంగీతజ్ఞుల సేవ లోనూ తరించిన ఆ అసామాన్యుని  ఫోటో మీకూ చూపించే అవకాశం దొరకడమే ఈ పోస్టు వ్రాయడానికి కారణం. 

 పైనున్న ఫోటోలో కుడివైపు చివర వినమ్రంగా చేతులు కట్టుకుని డవాలా ధరించి నిల్చున్న ధన్యజీవి  శ్రీ రామస్వామియే.
                                              ******
(ఇంత మంచి ఫొటోని ఇంత చక్కగా భద్రపరచిన  వయో వృధ్ధులు,  శ్రీ పట్రాయని సంగీతరావుగారు (సీతారామ శాస్త్రి గారి జ్యేష్ఠ కుమారులు- అభినందనీయులు.)
                                              
                                                ****















8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఆత్మ గౌరవ యాత్ర?

   
                                 
 అయ్యా  ఈ హెడ్డింగు చూసి నేనేదో ఈ పేరుతో జరుగుతున్న రాజకీయ బస్సు యాత్ర గురించి రాస్తున్నానని భ్రమ పడి ఇటు రావద్దు. నాకూ రాజకీయాలకీ ఆమడ దూరం.  అంటే  ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలగురించి నాకు ఏ అభిప్రాయాలు లేవని కాని కలగవని కాని కాదు. వాటిని వేటినీ ఈ నా బ్లాగులో నేను చర్చించను. వాటికిది వేదిక కాదు. కాకూడదు. అయితే ఆత్మ గౌరవ యాత్ర గురించి ఎందుకెత్తుకున్నావయ్యా అంటే  ఆ పేరుతో బస్సు యాత్ర జరుగుతోందని విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఆత్మ గౌరవమంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? అసలు ఆత్మ గౌరవమంటూ ఉన్న వాడెవరైనా ఏ రాజకీయ పార్టీలోనైనా మనగలడా? రాజకీయాల్లో ఉన్న వారిని వారే పార్టీకి చెందిన వారైనా సరే  పొద్దున లేస్తే ఎవరో ఒకరు తిట్టి పోయకుండా ఒక్కరోజైనా గడవదు కదా? మరి అలాంటప్పుడు వాటినన్నిటినీ దిగ మ్రింగు కుంటూ  కాలం గడపాల్సిన రాజకీయవేత్తలకి ఆత్మగౌరమననేది ఎలా ఉంటుంది ?  Politics is the last resort of a scoundrel – ఇంకే గతీ లేని దౌర్భాగ్యులకి రాజకీయాలే గతి – అన్న నానుడి ఉండనే ఉంది కదా?  అందు చేత ఈ ఆత్మ గౌరవానికీ రాజకీయాలకీ ముడి ఎలా పడుతుంది? కావున నేను రాయబోయేది రాజకీయ ఆత్మ గౌరవ బస్సు యాత్ర గురించి కానే కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
                                 ఆత్మ గౌరవంతో జీవన యాత్ర సాగించాలంటే, అది ఏ యాత్రల వల్లా రాదు. అది ఒకరిస్తే వచ్చేది కాదు. అది మన జీవన విధానం వల్ల వస్తుంది. ఏ ప్రలోభాలకీ లోను కాకుండా, ఒకరికి తలవంచ కుండా, తాను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని  సార్లు చెప్పాల్సి వచ్చినా నిస్సంకోచంగా చెప్పగలవాడే ఆత్మ గౌరవం కలవాడు. అటువంటి ఆత్మ గౌరవంతో మన తెలుగు నాట మసలిన ముగ్గురు కవి వర్యుల గురించి ఇంతకుముందు నా కవులూ- వారి ధిషణాహంకారమూ అనే పోస్టులో వ్రాసి ఉన్నాను. అటు వంటివే ఇద్దరు సంగీతజ్ఞుల ముచ్చట్లు చెబుతాను వినండి.
                                               ***
దాదాపు నూరేళ్ళ క్రిందట ఉత్తరాంధ్ర ప్రాంతంలో  మధురాపంతుల పేరయ్య గారనే సంగీత విద్వాంసులుండే వారు. వారు కాస్త భూ వసతి కలిగిన వారేమో భుక్తికి లోటు లేదు.ఆయన  తంజావూరులో సంగీత సాధన చేసి వచ్చిన వారు. సంగీత విద్యలో ఆరి తేరిన వారు కనుక శిష్యులకు సంగీత పాఠాలు చెబుతూ కాలక్షేపం చేసేవారు. కొంచెం కోపిష్టి కూడా కావడంతో శిష్యులు ఏ తప్పు చేసినా సహించే వారు కాదట. ఆయన వద్ద సంగీతం నేర్చుకోవడమే గొప్ప కనుక శిష్యులు వారి కోపాన్ని భరిస్తూ అణకువగా జాగ్రత్తగా మసలుకునే వారట. ఈ సంగీత కళానిధి  విజయనగరాధీశుల మన్ననని కూడా పొందిన వారు. ఆయన ఒక రోజు ఒక ఊళ్ళో సంగీత కచేరీ చేస్తున్నారట. అందరూ శ్రధ్ధగా వింటూంటే సభలో ఒక చోట ఒక ప్రభుత్వాధి కారి ప్రక్కవారితో సంభాషణ పెట్టకోవడం ఆయన కళ్ళ పడ్డది. వెంటనే కచేరీ ఆపేసి కోపంగా అటువైపు చూసేరట. సంగతి గ్రహించిన ఆ అధికారి ఏదో సర్ది చెప్పుకోడానికి ప్రయత్నిస్తుంటే
“ ఇది నా కచేరీ. నీ కచేరీలో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు లేచి వెళ్ళాకే తిరిగి నా కచేరీ ప్రారంభమవుతుంది. అంతే ” అన్నారు. ఆ నాడు ఆ అధికారి నిష్క్రమించాకే తిరిగి కచేరీ జరిగిందనుకోండి. అతి తక్కువ మంది ప్రభుత్వోద్యోగులుండే ఆ రోజుల్లో వారి హుకుం నిరంకుశంగా సాగే రోజుల్లో ఇలా తమ గౌరవానికి భంగం కలుగకుండా చూసుకోగలగడం గొప్ప విషయమే కదా? ( ఈ కథ విన్నప్పుడు మీకు శంకరాభరణం శంకర శాస్త్రి గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఆయనా ఇలాంటి వాడే కదా? )
                                              ****

                                          ఈ రెండో ముచ్చట హరికథా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాలుగా ఉంటున్న రోజులలో జరిగినదీ వారికే సంబంధించినదీను. దాసు గారు కొంచెం భోజన పుష్టి కలవారు కనుక భోజనం చేయగానే భుక్తాయాసం వల్ల కొంచెం సేపు కునుకు తీయడం వారికి తప్పని సరయ్యేది. అలా ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎండ మండి పోతూ ఉండగా ( అందులో మా విజయ నగరం ఎండల సంగతి చెప్పేదేముంది )  దాసు గారు వారి ఆఫీసు ( సంగీత కాలేజీ ప్రిన్సిపాలు గది ) లో చిన్న అంగోస్త్రం మాత్రం ధరించిన వారై బెంచీ మీద కునుకు తీస్తూ ఉన్నారట. గాలి ఆడడానికి తలుపులు తీసే ఉన్నాయి. అయ్యగారు నిద్రలో ఉన్నారు కనుక బంట్రోతుకు చుట్టకాల్చుకునే ఆట విడుపు సమయమది. అతడందుకే దూరంగా పోయి ఎక్కడో తన్మయంగా చుట్ట కాల్చుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక విద్యాధికారి వచ్చి ప్రిన్సిపాలు గది తలుపులు తెరిచే ఉండడం చూసి లోపలికి ప్రవేశించాడట. దాసుగారిని ఆఫీసులో ఆ భంగిమలో చూసేసరికి ఆ అధికారికి అవమానంగా తోచి కోప కారణమయ్యిందట. ఆ అధికారి వెంటనే గద్దిస్తూ దాసుగారిని ఏదో అన్నాడట. వెంటనే దాసుగారు “ ఏయ్ మిష్టర్ నువ్వెవరైనా సరే. ఇది నా ఆఫీసు. ఇందులో నా యిష్టం వచ్చినట్లు ఉంటాను. నా అనుమతి లేకుండా లోపలికి రాకూడదని తెలియదా? నువ్వు ముందు బయటకు నడువు. నేను పిలిపించి నప్పుడు లోపలికి వద్దువు గానివి. ” అన్నారట. బయటకు నడుస్తున్న ఆ అధికారి ముఖంలో నెత్తురు చుక్కఉండి ఉండదు. ఉద్యోగాలు ఊడిపోతాయేమో నన్నభయంతో పై అధికారుల అడుగులకు మడుగులొత్తేవరెవరైనా అలా మాట్లాడగలరా? అది ఆత్మ గౌరవానికి ప్రతిరూపమైన ఆ ఆదిభట్ల దాసు గారికే సాధ్యం.
                                                ***
ఇవి విన్నాకైనా ఆత్మగౌరవమనేది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో మనకి అర్థమౌతుందా? దానికోసమేమైనా యాత్రలు చేయాలా?
                                                ***    








6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కూట గురువులూ...కొంగ జపాలూ...


ముందుగా  చిన్నప్పుడు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని ఈ  కథ విని ఉండని వారికి   కొంగజపమంటే ఏమిటో తెలియదు కనుక కొంచెం వివరిస్తాను. ఒక కొంగ వార్థక్యం చేత చేపల్ని వేటాడే శక్తి లేక ఒక యుక్తి పన్ని చెరువు గట్టు మీద ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తున్నట్లు నటిస్తూ ఉండేదట. దాని ఈ చర్యకు ఆశ్చర్య పోయిన చేపలు గట్టు దగ్గరకు చేరి “ ఏమి స్వామీ దేనికీ తపస్సు” అని అడిగాయట. అప్పుడా కొంగ “ నాకిప్పుడే కోరికలూ లేవు కానీ మీగురించే నా బెంగ.కొద్ది రోజుల్లో ఈ చెరువు ఎండిపోనుంది. అప్పుడు  మీరందరూ ఎండి మాడి చచ్చి పోతారన్నదే నా దిగులు ” అంటూ నిట్టూర్చిందట. అప్పుడా చెరువు లోని చేపలూ పీతలూ
“ స్వామీ మరి మాకు దిక్కెవ్వరు . ఆ అపాయం నుంచి తప్పించుకునే మార్గం లేదా ” అని అడిగితే ఆ కొంగ జవాబుగా “ లేకేం ఉంది. కొండకి ఆవలి ప్రక్కన ఎన్నటికీ ఎండిపోని చెరువొకటుంది.అక్కడ మీరు ఎన్నాళ్ళయినా హాయిగా జీవించ వచ్చు”నని చెప్పింది. మరి అక్కడికి చేరే తరుణోపాయం ఏమిటని అడిగిన చేపలకు కొంగ వాటి నక్కడనుంచి రోజుకు కొన్ని చేపల చొప్పున కొండ అవతలి చెరువులోకి తానే చేరుస్తానని చెప్పి రోజూ కొన్ని చేపలను నోటకరచుకు వెళ్ళి దారిలోనే గుటకాయ స్వాహా చేస్తుండేదట. ఆ చెరువులో ఉండే ఒక పీతకెందుకో కొంగ మీద గురి కుదరలేదు. తాను తన చేతులు కొంగ మెడచుట్టూ వేసి పట్టుకుంటాననీ తనని కూడా తీసుకెళ్ళమనీ ప్రాధేయపడితే ,  కొంగ పీతనలాగే తీసుకెళ్తూ ఉండగా, దానికి దారిలో కొండ మీద అంతకు ముందు కొంగ తిని పారేసిన చేపల అవశేషాలు కన్పించి కొంగ మోసం గ్రహించినదై చటుక్కున దాని పీకను నొక్కి చంపేసిందట. అందుకే మనకొంప ముంచాలనే కోరిక తో మనకి సాయం చేస్తున్నట్లు నటించే వారిని  కొంగ జపం చేస్తున్నాడంటారు.
                                                        ****
అలా కొంగ జపం చేస్తూ నమ్మిన శిష్యుల కొంపలు కూల్చే కూట గురువులకి లోకంలో కొదవ లేదు. శిష్యుల బాధలను హరింప చేసి  “ శిష్యహృత్తాపహారులు ” కావలసిన వీరు “ శిష్య విత్తాప హారు” లైన సంఘటనలు కో కొల్లలు. సద్గురువులు లేరని కాదు కాని వారు సకృత్తుగానే ఉంటారు. మిగిలిన వారు కూటగురువులే. అంటే పామర భాషలో దొంగ సన్నాసులే. కామ, క్రోధ లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు గుణాలూ మన  అంతశ్శత్రువులనీ వాటిని జయించ కుండా మనకి ముక్తి రాదనీ నిత్యం బోధించే ఈ గురువులు వీటికి వేటికీ అతీతులు కానే  కారని వారి ప్రవర్తనే చెపుతుంది. ఇప్పుడు వార్తల్లో ఉన్న , తన పేరులో రాముణ్ణీ, మన జాతిపిత బిరుదైన బాపూనీ తగిలించుకున్న ఒక గురూజీ  మైనర్ బాలిక మీద  అత్యాచారం చేసాడనే  అభియోగాన్ని ఎదుర్కుంటూ జైలు పాలయ్యాడు.. తన ఆశ్రమం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడట. ఈయనకు పాద పూజ చేసి మనం తరించాలంటే లక్షా పాతిక వేలు కక్కాల్సిందేనట. ఈయన గారి ఆశ్రమం  వివిధ దేశాలలో ఎన్నో బ్రాంచీలతో  వందల కోట్ల సిరిసంపదలతో వర్థిల్లుతోందట. ఆ మధ్య సినీ తారతో కేళీ విలాసాలలో తులతూగుతున్న
 “ నిత్యానందుల్నీ” మనం చూసాం. ఇలా ఎంతమందో. అయితే చాలా మంది అనుకునేదేమిటంటే  ఇటువంటి స్వాములు మునుపటి కాలంలో లేరేమోనని. మరీ పాత కాలం సంగతుల రికార్డు మనకి దొరకదు కానీ ఓ వందేళ్ళ క్రిందట ఉన్న ఇటువంటి శిష్యవిత్తాపహారుల ముచ్చటలు కొన్ని  విని తీరవలసినవి  నాకు తెలిసినవి చెబుతాను వినండి.
                                                       ****
ఓ వంద సంవత్సరాల క్రిందట పిఠాపురం ప్రభువులైన శ్రీ గంగాధర రామారావు గారు వైష్ణవ సంప్రదాయానుసారులైనందు వలన వారి గురువులైన జీయరు స్వాముల వారిని ఆహ్వానిస్తే వారు వారి జమీందారీ లోని కడియం గ్రామానికి విచ్చేసారట. రాజుగారు వారిని దర్శించుకున్నప్పుడు వారి పాద పూజ చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించమని కోరితే అందుకు పాదకట్నంగా కనీసం లక్ష రూపాయలైనా సమర్పించాల్సి ఉంటుందని స్వామి వారు సెలవిచ్చారట. అందుకు తగిన తాహతు తనకున్నా స్వామి వారి అత్యాశకు ఏవగింపు కలిగిన రాజు గారు యాభైవేలు సమర్పించుకుందుకు సిధ్ధపడ్డారట. కాని దానికి అంగీకరించని స్వాముల వారి వైఖరికి నొచ్చుకున్న రాజా వారు తన  పేరు లోనే శివ కేశవులిద్దరూ ఉన్నారు కనుక తనకు రెండు మతాల్నీ పాటించడం ధర్మమే అవుతుందని అంటూ తన వెనుకనే నిలుచుని ఉన్న తన ఆంతరంగికుని సంచీలో ఉన్న విభూది ఇమ్మని అడిగి ద్వాదశ పుండ్రాలూ ధరించారట. చెయిజారిపోయిన చేపను చూసిన కొంగ లాగా  శిష్యవిత్తాపహారులైన ఆ స్వాముల వారు అవాక్కయిపోయారట.
                                                 ****
అప్పటి కాలానికి చెందినదే మరో ముచ్చటేమిటంటే,  రాజమండ్రిలో ఓ సంపన్న గృహస్తు గృహాన్ని పావనం చేయడానికి విచ్చేసిన ఒకస్వాముల వారి ఆంతరంగికులు గృహస్తుకిచ్చిన   వారికి కావలసిన సామాన్ల లిస్టులో బ్రాందీ కూడా ఉండడం చూసిన గృహస్తు అటువంటివి తాము సేవించము కనుక తెప్పించ లేమని మనవి చేసుకుంటే ఆ స్వాముల వారు తమకే ఎదురు చెప్పేంత వాడవైనావా అంటూ అగ్రహోదగ్రులై శపించబూనితే  ఆ గృహస్తు తల్లిగారు క్షమించమని వేడుకుంటే దానికై ఓ పాతిక రూపాయలు బిల్లు వేసి శాంతించారట.
                                                ****
మరో ముచ్చట కూడా అప్పట్లోనే ఇప్పటి  శ్రీకాకుళం జిల్లా లోని ఓ గ్రామంలో  జరిగింది. ఆ చిన్న గ్రామంలో ఓ పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేదట.కుటుంబమంటే తల్లీ దండ్రులు లేని అయిదుగురు అన్నదమ్ములు పేదరికం వల్ల ఎవరికీ పెళ్ళిళ్ళు కాకపోవడంతో ఎలాగో బ్రతుకీడుస్తూ కలిసి ఉండేవారట. కన్యాశుల్కపు రోజులు కనుక ఎంతో కొంత ధనం లేకపోతే మగ వారికి పెళ్ళిళ్లు జరిగేవి కావు. ఎలాగైనా వారిలో  చిన్న తమ్ముడికైనా  పెళ్లి చేయాలని అయిదు వందల రూపాయలు కష్టపడి దాచుకున్నారట. ఇంతలో వారికో అవాంతరం వచ్చి పడింది. ఒక రోజు ఆ చిన్న వాడు కరణంగారు వీధి అరుగు మీద  కూర్చున్నప్పుడు ఆవీధిలో గేదెను తోలుకెళ్తున్నాడట. కరణంగారేదో అనడం దానికి ఈ కుర్రాడు తల తిక్కగా సమాధానం చెప్పడం లాంటిదేదో జరిగిందట. అప్పుడు కరణం గారి ప్రక్కనే నిల్చున్న వంట బ్రాహ్మడు కరణంగారికే ఎదురు చెప్తావట్రా అంటూ అడ్డురావడంతో ఈ కుర్రాడు చేతిలోని కర్రతో ఒక్క వేటు వేస్తే ఆ అర్భకుడు హరీ మన్నాడట.  ఏదో పోలీసు కేసయిందట గానీ దాని వివరాలు మనకి తెలియవు. అయితే బ్రహ్మ హత్యా దోషమని చెప్పి ఆ కుటుంబాన్ని బ్రాహ్మణ్యం వెలివేసారట. ముందు ఈ వెలినుంచి బయటపడితే కాని వివాహం జరిపించే యోగం లేనందువల్ల  ఆ దగ్గరలోని ఓ స్వాముల వారిని ఆశ్రయిస్తే  వారు ప్రాయశ్చిత్తం చేయించడానికి వెయ్యి రూపా యలు అడిగారట. ఈ పేద బ్రాహ్మలు తమ్ముని పెళ్లికై  దాచి ఉంచిన  సొమ్ము మాత్రం సమర్పించుకో గలమని తమను కృతార్థులను చేయమని వేడుకుంటే అయిష్టంగానో ఏమో ఆయన అంగీకరించి వచ్చాడట. కానీ ప్రాయశ్చిత్తం రోజున బ్రాహ్మణ్యం అంతా భోజనానికి వచ్చి కూర్చున్న తరుణంలో ఆ స్వాముల వారు ఔపోసన పట్టకుండా ఇంకా సొమ్ము కావాలని కొర్రెక్కి కూర్చున్నాడట. అప్పటికి స్వాముల వారి ప్రవర్తనతో విసుగెత్తి పోయిన ఆ బ్రాహ్మణ యువకుడు ఆయన ముందు నిల్చొని అప్పటికే వేళ మించి పోవడం వలన బ్రాహ్మణ్యం అంతా ఆకలితో ఉన్నారనీ వెంటనే ఔపోసన పట్టమనీ లేకుంటే తానిదివరకే ఒక బ్రహ్మ హత్యా పాతకాన్ని చుట్టుకొని ఉన్నాడు కనుక కొత్తగా తనకు  వచ్చే పాపమేమీ ఉండదు కనుక ఆయనను వేటు వేయడానిక వెనుకాడేదేమీ లేదనీ బెదిరించేసరికి ఆ స్వాముల వారు కిమ్మనకుండా ఔపోసన పట్టాడట.
                                                           ****
కథలో పీతకున్నపాటి తెలివితేటలూ, ఆ బ్రాహ్మణ యువకునికున్నపాటి తెగువా తెంపరితనమూ లేకపోతే  కూట గురువులూ వారి కొంగ జపాలూ శతాబ్దాలు దాటినా కొనసాగుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత. సెలవు.
                                                           ****
పై మూడు ముచ్చట్ల లో మొదటి రెండూ కీ.శే. శ్రీ చెళ్ళపిళ్ళ వారు గ్రంథస్తం చేసినవయితే, మూడవది తన చిన్నతనంలో జరిగిన సంఘటనగా విన్నానని నాకు తెలియజేసిన వారు  93 ఏళ్ళ వృధ్ధులు  మా వియ్యంకులు శ్రీ పట్రాయని సంగీత రావు గారు. వారిద్దరికీ కృతజ్ఞతలు.

                                                         **** 

27, ఆగస్టు 2013, మంగళవారం

తెలంగాణా సమస్యకు పరిష్కారం ఉందా?


తెలంగాణా సమస్య జటిలమైనదే. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఎంత జటిలమైన సమస్యకైనా పరిష్కారం లేకుండా పోదు. కాకపోతే సమస్య ఎవరిదో వారే పరిష్కరించుకోవాలి. లేదా వారికి ఉభయులకీ నచ్చిన వారు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. తెలంగాణా సమస్య తెలుగు వారి సమస్య. ఈ సమస్య పరిష్కారంలో కష్టనష్టాలేమైనా వస్తే అవి మన తెలుగువారివే. అసలు సమస్యల్లా ఇది ఒక్క అధికార పార్టీదో లేక ఆ పార్టీ అధినేత్రిదో వారే నిర్ణ యం తీసుకోలేరనీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా మనం వ్యతిరేకించి పబ్బం గడుపుకోవచ్చన్న దురాలోచన పరులైన రాజకీయుల వలన వచ్చినదే. మన తెలుగు వారికి రాజనీతిజ్ఞులైన నాయకులు ఏ పార్టీలోనూ లేరు. నిష్టురమైనా ఇది పచ్చినిజం.ఇది ఏ ఒక్క పార్టీకో కాదు తెలుగు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి వర్తిస్తుంది. ఈ సమస్య మనందరిదీ కనుక ఇరువైపుల వారూ ఒకచోట కూర్చుని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే ఏదో ఒక పరిష్కారం దొరకక పోదు. స్వల్పకాలిక ప్రయోజనాలకన్నా, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారించి సమస్యకు సత్వర శాశ్వత పరిష్కారం కనుగొనడం అత్యవసరం. అయితే అసలు సమస్యల్లా  తాము నడుస్తున్నది తప్పుదారిలోనో సరైనదారిలోనో తెలియకుండా ముందుకు సాగుతున్న జనం ముందుకు తాము ఉరికి వారిని తామే నడిపిస్తున్నామనే భ్రమకలిగించే నాయకులవల్లనే. తాము సరైన మార్గాన్ని ఎంచుకుని ప్రజల్ని అటుమళ్లించగల నాయకులే మనకు లేరు. రోజూ ఎదుటివారికి సిత్త సుద్ది లేదంటూ ఆక్రోశించడమే కాని నిజమైన చిత్తశుధ్ధి గల నాయకులే మనకీనాడు కరువయ్యారు. నాయకులంటే ఎలా ఉండాలో తెలిపే ముచ్చట ఒకటి చెబుతాను వినండి.
                                               ****
1951-52 మధ్య ఒకరోజు మన పార్లమెంటు సభలో జరిగిన ముచ్చట ఇది. సభలో ఒక సభ్యుడు లేచి నిల్చొని ఒక చిన్న కోరిక అంటూ మొదలు పెట్టి  “ భారత ప్రభుత్వం వారు నా సంస్థకుగాని, వేరే ఇతర సంస్థకు గాని, లేక ఏదేని యూనివర్సిటీకి గాని నాలుగుకోట్ల రూపాయలు విరాళమిస్తే నేను ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రమపడి దేశాన్ని అణుశక్తిరంగంలో అభివృధ్ధి చేస్తాను”  అన్నాడు. ఆ సభ్యుడు శాస్త్రవేత్త అయిన మేఘ్ నాథ్ సాహా. ఆ వెంటనే మన ప్రధాన మంత్రి  నెహ్రూ గారు లేచి “అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సంపాదించుకున్న మన ప్రభుత్వం ఇటువంటి ( Foolish)  పిచ్చి తలతిక్కధోరణిని హర్షించదు”  అని కూర్చున్నారట. నెహ్రూ గారు అన్నమాటలకి సభలో ఎవ్వరూ ఎటువంటి అభ్యంతరం తెలుపలేదట. ఆ నిశ్శబ్దం లో సభాపతి తర్వాతి అంశాన్ని ప్రకటించారట. అప్పుడు నెహ్రూ గారు మళ్లా లేచి ఐక్యరాజ్య సమితి కార్యదర్శి మన ప్రభుత్వానికో లేఖ వ్రాసేరనీ, దానిలో ప్రపంచ పంచాంగ రచనకు మనదేశం తరఫున  సారధ్యం వహించేందుకు మేఘ్ నాథ్ సాహా వంటి శాస్త్రవేత్తను పంపాల్సిందిగా కోరారనీ, దానిని  తానుసంతోషంగా బలపరుస్తూ సాహా గారి అంగీకారాన్ని కోరుతున్నాననీ అన్నారుట. కానీ ఆ మాటలు వినడానికి సాహా గారు సభలో లేరు. ఆశ్చర్యపోయిన నెహ్రూగారు సభను నడిపిస్తూ ఉండమని  సభాపతిని కోరి, తాను సాహాగారిని తోడ్కొని వస్తానని బయటకు వెళ్లి ఆయనను వెతికి తీసుకు వచ్చారట.ఆ తర్వాత నెహ్రూ గారు సభలో తన అభ్యర్థనను మరోసారి చేయగా దానికి సాహా గారు లేచి “ ఇంతటి మహత్తరమైన దేశానికి తనవంటి మూర్ఖుడు (Fool)  ప్రాతినిధ్యం వహించడం తగ”దని అంటూ కూర్చున్నాడట. నెహ్రూ గారు వెంటనే లేచి తాను ఆయనను Fool  అన లేదనీ  ఆయన ప్రతిపాదనను మాత్రం  Foolish  అన్నాననీ ఆ మాట  unparliamentary కాదనీ ఒక వేళ తన వంటి పెద్ద మూర్ఖుడు  (Greater Fool)  ఆవేశంలో ఏదో అన్నా సాహా వంటి పెద్దమనిషి దానిని పట్టించుకోవడం అన్యాయం కాదా? అన్నారుట. అప్పుడు సభాపతి గా ఉన్న శ్రీ మవ్లంకర్ గారు “ సాహాగారూ ఇది సభాపతి అభ్యర్థన”  అనడమూ దానికి వెంటనే సాహాగారు లేచి తాను దానిని “శిరసావహిస్తున్నా” ననడమూ టకటకా జరిగిపోయాయట.
                                                                   ****
ఎన్ని సార్లు సభ వెల్ లోకి వచ్చి ఎంత గొడవ సృష్టించారో,  ఎన్ని పత్రాలు చింపిపెట్టారో, ఎన్నిమైకులు విరగ గొట్టారో అన్నది తప్ప ఆ నాటి సభవంటి  సభా దృశ్యాలను గాని  అటువంటి నాయకులని గాని మనమిప్పుడు చూడగలమా?
అందరూ అటువంటి నాయకులే అయితే ఎటువంటి సమస్య అయినా దూది పింజలా తేలిపోవలసినదే కదా?
ఇప్పుడు మనకున్నది తెలంగాణా సమస్య కాదు. మనకున్న నాయకులతో వచ్చిన సమస్య. సమస్యలు రాకుండా మంచినాయకులనే ఎన్నుకుందామా?
                                                                 ****
పార్లమెంటులో జరిగిన ముచ్చటని స్వయంగా చూసి తన స్వీయ చరిత్ర “ విన్నంత  కన్నంత” లో రికార్డు చేసినది శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారు. వారికి  నా ధన్యవాదాలు.

                                                 ****

26, ఆగస్టు 2013, సోమవారం

కందాలూ ... మకరందాలూ ...

నా కందాలూ ... మకరందాలూ ... పుస్తక రూపంలో ఇక్కడ చదవండి. మీ అభిప్రాయం తెలియ జేస్తారు కదూ ?