15, సెప్టెంబర్ 2011, గురువారం

శ్రీవిశ్వనాథ రామప్పంతులు


లౌక్యం అనే పదానికి మన నిఘంటువులిచ్చే అర్థం ప్రపంచ సంబంధమైనది..మనుష్య సంబంధమైనది.. సర్వ సామాన్యమైనది.. వాడుకలోనున్నది..  అని.. .. కానీ మనం ఈనాడు ఏదైనా ఇబ్బందికరమైన సందర్భంలో ప్రదర్శించే దాటవేత  వైఖరిని లౌక్యం అంటున్నాము  పూర్వం కన్యాశుల్కం రచనాకాలానికి  సామాన్య లౌకిక జీవితం గడిపేవారిని  లౌక్యులనే  వ్యవహరించినా లౌక్యం అనే  పదాన్ని దాదాపు ఇప్పుడున్న అర్థంలోనే  వాడేవారనిపిస్తుంది..
 కన్యాశుల్కం  ( చతుర్థాంకం..1 వ స్థలం) లో లుబ్దావధాన్లు పెళ్లి కుదిర్చాక  “  పెద్దిపాలెం  వెళ్లి లౌక్యుల్ని ఎవరు పిలవడం? ” అంటాడు రామప్పపంతులు. ఇక్కడ మనకు నైఘంటికార్థమే కన పడుతుంది. కానీ కన్యాశుల్కం  (ద్వితీయాకం  1వ స్థలం)  లోని మధురవాణి.రామప్పపంతుళ్ల సంభాషణ లో ఆనాటికే  ఈ పదం సంతరించుకున్న ప్రత్యేకార్థం  గోచరిస్తుంది. మధురవాణి సుబ్బిజాతకం కూడా రామప్పపంతులు బనాయింపేనా అని అడిగినప్పుడు అది అగ్నిహోత్రావధాన్లే బనాయించేడనీ ఆనాటి బ్రాహ్మలలో అది మామూలేననీ అంటాడు..మధురవాణి దాన్ని పచ్చిమోసంగా పేర్కొంటే రామప్పపంతులు కాదు దాన్ని లౌక్యం.. లౌక్యం..అనమంటాడు. రెండిటికీ భేదమేమిటని ప్రశ్నిస్తే నమ్మించోట చేస్తే మోసమనీ.. నమ్మంచోటచేస్తే లౌక్యమనీ విశదీకరిస్తాడు. ఈ సంభాషణకి చక్కని  ముక్తాయింపునిస్తూ తాను         చేస్తే లౌక్యం. మరోడు చేస్తే మోసం అనరాదా అంటుంది.   ఆ సీనులోనే మరోచోట లౌక్యమంటే మరేవిటనుకున్నావు ? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడమనీ చెప్తూ తాను మోసపు  మాటలతో లుబ్దావధాన్లని పెళ్లికిఎలా ఒప్పించిందీ వివరిస్తాడు.
 దానా దీనా మనకు తేలేదేమిటంటే .. లౌక్యం అనే దాంట్లో  కించిత్తు మోసం కూడా అప్పుడప్పుడూ ఉండొచ్చుననీ కనీసం నిజాయితీ లోపించవచ్చుననీ. కన్యాశుల్కం సంగతి కాసేపు ప్రక్కని పెట్టి ఉపనిషత్కారుడేమన్నాడో చూద్దాం.    “ సత్యం బ్రూయాత్.. ప్రియంబ్రూయత్.. సత్య.మప్రియం నబ్రూయాత్ అనికదూ?”.ఏమీ?తెలిసినా నిజం చెప్పకూడదా?.. ఎందుచేత? అవతల వాళ్లని నొప్పిస్తామేమోనని ఎందుకొచ్చిన గొడవ అనేకదా?  ఇది లౌక్యానికి నిర్వచనంకాదా?.  ఇదీ వదిలేయండి. సుమతీ శతక కర్త ఏమన్నాడో చూడండి:
ఎప్పటికెయ్యది ప్రస్తుత 
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ ! 
అని. ఇది పక్కా లౌక్యం కాదా ?  పద్యంలో యతిని కాసేపు మరచిపోతే ధన్యుడు అనేచోట  లౌక్యుడు అనేది ఎం త చక్కగా సరిపోతుందో  ? అయితే ఎలాంటి వారికయినా చాలా సందర్భాల్లో   “ గోడమీది పిల్లి ”  ఆదర్శవంతమౌతుంటుంది.   Play it safe ..అన్నది  cat on the wall philosophy.

  సరదాగా ఇక్కడ ఓ ముచ్చట చెప్పబుధ్ధౌతోంది.   1966—67 ప్రాంతంలో నేను ఏజీ ఏఆఫీసులో పని చేసే రోజుల్లో  చాలా సాహితీ సభలు జరుగుతూ ఉండేవి. ఒకసారి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారూ.. మరో ప్రసిధ్ధ కవి పండితుడూ  సాయంత్రం సభజేస్తారని తెలిసింది.  ఎక్కువ మంది రారేమో ననే జంకుతో మీటింగ్ క్లబ్బు హాలులోనే ఏర్పాటు చేసారు.మామూ లుగా అయితే లాకాయి లూకాయి సభలకి  విశ్వనాధ వారు రారు.. అయితే అప్పట్సో ఆయన గవర్నమెటు సర్వీసులో ఉండేవారు. గజెటెడ్ ఆఫీసరు కావడంతో వారి జీతా లన్నీ ఏ జీ ఆపీసు వారు ఆధరైజ్      చేస్తే గానీ వారికి ముట్టేవి కావు.   ఆ కారణం చేతో ఏమో ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చే వారు. ఆ రోజు మరీ అధ్వాన్నం.  సాహితీ సమితి  కార్యవర్గ సభ్యులతో కలిపినా పది పదిహేనుమందికంటే లేము.  మొదటగా ఆయనతో పాటుగా వచ్చిన కవిగారు కొంచంసేపు మాట్లాడి కూర్చు న్నారు. తర్వాత విశ్వనాధ వారు ఏం చెబుతారో నని అందరం ఆశగా ఎదురు చూసేము. ఆయన కూర్చున్న కుర్చీలోంచి లేవకుండానే ఇంగ్లీషులో ఓ కథ చెప్పి ముగించారు. తెలుగులో ఒక్కముక్క మాట్లాడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆకథ నాకు గుర్తు లేదుగానీ సారాంశం మాత్రం బాగా గుర్తుండిపోయింది.  ఆకథ  చెప్పిన వాడూ విన్నవాడూ ఫూల్స్ అని.  ఆ కథ చెప్పడంలో ఆయన ఉద్దేశం “ మీరెంతమంది వస్తారో నని నేను ఎదురు చూసేను. నేనేంచెప్తానో నని మీరు ఎదురు చూసి ఉంటారు. కాని ఉభయులమూ ఫూల్స్ గా మిగిలా”మని కావచ్చు. చూసేరా కవి  సామ్రాట్టు గారి  సమయస్ఫూర్తిన్నీ లౌక్యమున్నూ.   అన్నట్టు ఆయన వయసులో ఉండగా కన్యాశుల్కంలో రామప్పపంతులు వేషం వేసేవారట.  మరింక ఆపాటి లౌక్యం అబ్బకుండా పోతుందా?    అందరం  ఎంతోకొంత లౌక్యులమే కాదా ?

(ఇది సరదాగా వ్రాసినది.శ్రీ విశ్వనాథ వారంటే నాకెంతో గౌరవం)

సెలవు.





8, సెప్టెంబర్ 2011, గురువారం

వెచ్చని పచ్చడం లేకపోతే పితలాటకమే



                                                         ఈ మధ్య  కళింగాంధ్ర మాండలికం..1 అనే పుస్తకం మరోసారి చదివేను. ఈ పుస్తకం 2006 జనవరిలో శ్రీకాకుళ సాహితి వారు ప్రచురించేరు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే శ్రీ జి.ఎస్.చలం గారు దీనిని వ్రాసేరు. ఏ యూనివర్శిటీయో, అకాడమీయో చేయాల్సిన పనిని  ఒక్కరూ నెత్తికెత్తుకుని చేసారు. ఆయన కృషి చాలా అభినందనీయం, భాషాభిమానులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. అయితే ఆయన వ్యవహర్తలనుంచీ,ఆ ప్రాంతపు రచయితల పుస్తకాలనుంచీ  పదాలు సేకరించి పుస్తకాలలోని మాటలకు తాననుకున్నవీ, ఆయావ్యవహర్తలు చెప్పినవీ అర్థాలు వ్రాసుకోవడంవల్ల  కొన్ని పొరపాట్లూ,తప్పుడు అర్థాలూ దొర్లేయనుకుంటాను. వాటిగురించి మరోసారి ముచ్చటిస్తాను గానీ ఇప్పుడు చెప్పబోయేది కళింగాంధ్ర మాండలికాలనడానికి వీల్లేని పదాలు  లెక్కకు మిక్కిలిగాఉన్నాయనే. ఒక మంచి కృషిని శ్లాఘించాలి కాని లోటుపాట్లు ఎత్తి చూపకూడదనే  సంస్కారంతోనేమో పుస్తకానికి ముందుమాట వ్రాసిన బూదరాజు రాధాకృష్ణ గారు కూడా ఈ విషయాలు విస్మరించారని అనుకుంటాను. ఆ ప్రాంతపు మాండలికాలనడానికి వీలు లేని పదాలకుదాహరణగా రెండు ముక్కలు మనవి చేస్తాను. చూడండి:

 పచ్చడం  --దుప్పటి  (పేజీ 90 )   అర్థం గురించి ఏ తగువూ లేదు కాని ఇది అన్ని నిఘంటువుల కెక్కిన,  ఆంధ్ర దేశం అంతా వాడుకలో ఉన్న,  కావ్యాలలో కూడా కనుపించే పదం.. సందర్భం వచ్చింది కనుక చక్కటి పద్యమొకటి
ఉటంకిస్తాను. ఇది శ్రీ వినుకొండ వల్లభరాయడు (లేక ఆయన పేరుతో శ్రీనాధమహాకవి ) వ్రాసినది అయిన క్రీడాభిరామము లోనిదని రసజ్ఞులందరికీ తెలుసు కానీ యువతరం వారికోసం:
                                  మాఘమాసంబు పులివలెమలయుచుండ
                                  పచ్చడమ్మమ్ముకొన్నాడు పణములకును
                                  పడతిచన్నులు పొగలేని ముర్మురములు
                                  చలికినొరగే.కేలుండు సైరికుండు. 
                           (భావం తెలిసినవారు తెలియనివారికి తెలియజేయగలరు)

పితలాటకం:  (పేజీ 94) దీనికి రచయిత ఇచ్చిన అర్థం—ఎంతకీ తెగకపోవడం—అని .దీన్ని చూస్తేనే తెలుస్తుంది రచయిత ఎవరేంచెప్తే అది వ్రాసుకున్నారని.  ధీనికి సరైన అర్థం మోసం అని ఏనిఘంటువైనా చెప్తుంది.అసలిది పిత్తల+హాటకం . పిత్తల అంటే ఇత్తడిని హాటకం అంటే బంగారం అని మోసం చేసి చూపించడం. నిఘంటువులు ఇది అరవ పదమని చెప్తాయి. ప్రముఖ భాషావేత్త వరిశోధకుడూ అయిన ఢా. చల్లా రాధాకృష్ణశర్మ గారు తన మద్రాసు తెలుగు అనే వ్యాసంలో దీనిని పేర్కొన్నారు.
   
మద్రాసులో పలికే మాట కళింగాంధ్ర మాండలికం ఎలాగవుతుంది? అందుకే బూదరాజుగారు మొహమాటపడ్డారన్నాను. నా ఈ వ్యాసోద్దేశం  శ్రీ చలంగారి కృషిని తక్కువ చేయాలని  ఎంతమాత్రం లేదని మరోసారి మనవి చేసుకుంటూ బూదరాజు వారిని  క్షమాపణలుకోరుకుంటున్నాను.  గ్రంథాలలో తప్పులు అలా ఉండిపోకూడదనే సదుద్దేశం మాత్రమే నన్నీ పనికి పురికొల్పింది.

స్వస్తి





కవిగారూ..ఆటవెలదులూ...


కవిగారూ..ఆటవెలదులూ...

ఓ కవిగారికి ఆటవెలదులన్నా తేటగీతములన్నా చాలా ఇష్టమట. ఆయితే ఆటా..పాటా లేకపోయినా మిగిలినవి ఉంటే సర్దుకు పోతాను  ఫర్వాలేదు అన్నాడిలా:
ఆట లేక తేట పాటయులేకున్న
వెలదులున్నచాలు వేవరాలు.... 
            అదీ కవిగారి రసికత.. ఆయన పేరు సరిగా గుర్తులేదు కాని వావిలాల వాసుదేవ శాస్త్రి అనుకుంటాను. ఆయన పేరు కూడా తమాషాగా ఆటవెలది ఆఖరి పాదమై కూర్చుంది చూసేరా? (ఈయన గురించి శ్రీ ఆరుద్ర గారి  సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో  సుబాకవుల విభాగంలో చదువుకొన వచ్చు)

                                                        నాకైతే కంద పద్యాలే ఇష్టం కానీ సరదాకి కొన్ని ఆటవెలదులూ రాసేను. చిత్తగించండి:

       తాను తినక సొమ్ము తనవారికీకుండ
దానమీయకుండ దాచువాడు
గడ్డి వాము చెంత కాపుండు శునకము
నిజమె పలుకు చుంటి నీరజాక్ష   
   
కూటగురుని చేరి కొలువెంత చేసిన
కలుగబోదు ఎపుడు జ్ఞానసిధ్ధి
కుక్క తోక బట్టి గోదావరీదగా
జాలడెవడు వాని జన్మలోన       

కుక్కతోక జూడ కుటిలమై యుండును
దాని శీలమదియు దాచలేదు
తోలలేదు ఎపుడు దోమ ఈగలనైన
వ్యర్ధుడైన వాని వైనమింతె                          *    

మనము నిద్రపోవ మనతోనె నిద్రించు
మనము నడచుచుండ వెనుకె వచ్చు
పూర్వ జన్మ కర్మ పోదు ఫలమునీక
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                          *

తరుణులందరెపుడు తలను దాల్తురుగదా
విరుల సరుల లోని దారమైన
మంచివారి పొందు మాన్యత చేకూర్చు
నిజమె పలుకు చుంటి నీరజాక్ష                     *    

మనసులోనిమాట మర్మమేలేకుండ
పలుక వలయునెపుడు, పలుకెగాదు
చేసిచూపవలయు  చేతలందునుగూడ
నీతిమార్గ మిదియె నీరజాక్ష                 

మట్టిలోన పుట్టి మట్టిలో కలిసేటి
మనుజులందరొకటె మాన్యులార
మతములందు లేదు భేద భావమెపుడు
మానవతనెచాటు మతములన్ని 
  
ప్రేమ ప్రేమ యనుచు ప్రేమిస్తి ననుచును
అందమొకటె జూచి ఆశ పడుచు
పిల్లదాని మనసు పిసరంత తెలియక
వెంటబడెడివాడు వెఱ్ఱి వాడు                

ఆలు మగల మధ్య అనురాగముండియు
ఒకరినొకరు యెపుడు గౌరవింప
కాపురములు సాగు కలతలు లేకుండ
నీతి వాక్య మిదియె నీరజాక్ష               

 కష్టమొచ్చినపుడు కలగిపోకుండుడు
కష్టసుఖములవియు కలిసె వచ్చు
పగలు రాత్రి గడువ పగలు రాకుండునా
నిత్య సత్య మిదియె  నీరజాక్ష                

ఏమిలేని నాడు ఎంగిలికాశించు
కుడువ కూడులేక కుములుచుండు
అన్ని యున్ననాడు అన్నమే తినలేడు
నిత్య సత్య మిదియె నీరజాక్ష                  

ఏరినైన నీవు గౌరవింపదలప
మంచిగుణము,  విద్యలెంచవలయు
కలిమి కులములెపుడు కారాదు కొలబద్ద
నీతి వాక్యమిదియె నీరజాక్ష                  

నమ్మడెవరిమాట నమ్మబోడుసతిని
నమ్మడెపుడు వాని అమ్మనైన
బెమ్మ ఎదుట నిలిచి  నమ్మబల్కిన గూడ
సణుగుచుండు నిత్య శంకితుండు    

చుట్టరికముతోడ చూడనింటికి బోవ
ధనము నడుగ వచ్చిరనుచు తలచి
ఇంటనున్న లోభి లేడని చెప్పించు
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                

ఎవరిసొమ్ము వారికిచ్చుటేమి ఘనము
నిలువుదోపిడిచ్చి నీల్గుచుంద్రు
సకల సంపదలును శర్వునివేకావ
నిజము పలుకుచుంటి నీరజాక్ష                 

జాతకములు వ్రాసి చక్రాలు సరిజూసి
మంచిమూర్త మొకటి యుంచుగాని
పిల్ల లేచి పోయి  పెండ్లి రద్దయి పోవ
పంతులేమి జేయు పద్మనాభ                 

ఆశ పెరుగుచుండు ఆస్తులతో పాటు
ఆశకంతులేదు అవనియందు
ఆశలేని వాడు అదృష్టవంతుడు
నీతి వాక్య మిదియె నీరజాక్ష            

ఫిల్ల కనుటయొకటి  పెండ్లి చేయుటొకటి
ఆడపిల్ల తల్లి తండ్రులకును
కష్ట సాధ్యమైన కార్యమే యెపుడైన
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                 

పాల సంద్రమందు పవ్వళించెడువేళ
పాదసేవ చేసెనాది లక్ష్మి
ద్వాపరమున నీకు దారయై అలుకతో
సత్యభామ కాలు సాచి తన్నె                    

కవియెకాని వాడు కావ్యమ్ము వ్రాయంగ
చదువె రాని వాడు చదువుచుండ
చెవిటివాడొకడు చెవియొగ్గి వినుచుండ
కాశి పారిపోయె  కావ్య రసము             
   
( * ఈగుర్తు గల పద్యాలకు సంస్కృత మూలాలున్నాయి)   

ఇప్పటికి సెలవు...                   


              
           



  










పెండ్లి వారి యింట పేకాట లేకుండ
పెండ్లి యెట్లు జరుగు పెద్ద లార
పెండ్లి వారి కిపుడు పేకల కొని దెచ్చి
పెండ్లి జరుపు కొనుము పెండ్లి పెద్ద           





7, సెప్టెంబర్ 2011, బుధవారం

కక్కూసు కథ హి..లేక..షి...


నేను 1997 లో రిటైర్ అవకముందు హైదరాబాదు  ఏజీ ఆఫీసులో  34 సంవత్సరాలు పని చేసాను.  అప్పట్లో...(.ఇప్పటికీ కూడా) ... మా ఆఫీసు లో సాహితీ పరిమళం గుబాళిస్తూ ఉండేది/ ఉంటోంది. ఎందరో కవులూ సాహిత్యాభిలాషులూ  మరీ ముఖ్యంగా  కథా నాటక రచయితలు  ఎక్కువగా ఉండేవారు. బి.కె.ఎల్.ఎన్ ఆచార్య, ఇసుకపల్లి దక్షిణా మూర్తి, పరుచూరి వెంకటేశ్వర రావు, ఢి.ప్రభాకర్, పమ్మి వీరభద్రరావు గుమ్మా ప్రసన్నకుమార్ కె.కె.మీనన్  శంకరమంచి పార్థసారధి ..ఇలా ఎందరో..  నేను రచయితను కాకపోయినా వాళ్ళలో కొంతమందితో  స్నేహమూ,మిగిలినవారితో ముఖపరిచయమూ ఉండేది. రంజని అనే పత్రిక నేను ఆఫీసులో చేరిన రోజుల్నుంచీ  సాహితీ సేవ  చేస్తూ ఈనాటికీ నడుస్తోంది.మహాకవుల్నీ గొప్ప రచయితల్నీ ( దివాకర్ల వెంకటావధాని , విశ్వనాథ సత్య.నారాయణ ఉత్పల  మొదలైన కవులూ.. రావి శాస్త్రి కాళీపట్నం మొదలైన రచయితల్నీ)  పిలిపించి సభలు చేయడం మంచి పుస్తకాలు ప్రచురించడం వచన కవితా పోటీలు నిర్వహించడం వంటి ఉత్కృష్ట సాహితీ సేవ నేటికీ కొన సాగుతోంది.(తొలినాళ్లలో రంజనిలో నేనూ చిన్న చిన్న గేయాలు వ్రాసిన వాడినే)
ఈ విధంగా  సాహితీ సౌరభాలు విరజిమ్మే  చోటికి  మిత్రులను కలుసుకుందికి అనేకమంది రచయితలు వస్తూండేవారు. వారిలో నేటి నవ్య వార పత్రిక సంపాదకుడు జగన్నాథ శర్మ ఒకరు. శర్మది మా ఊరే కావడం.. మా వీధిలోనే పుట్టి పెరిగిన వాడవటం మాతమ్ములందరితోనూ స్నేహంగా ఉండడంతో  నాకంటే బాగా చిన్నవాడయినా నాకు  బాగా తెలుసు. ఒకసారి అతను సాహితీ మిత్రులను కలుసుకోవడానికి మా ఆపీసుకి వచ్చినప్పుడు అందరం కలసి గేటు దగ్గర ఖాన్ సాబ్ టీ కొట్లో టీ తాగుతున్నాము. ఇంతలో  ఒకాయన  పలానా రచయిత్రి తన కథలో “కక్కూస్”  అనే పదం వాడిందనీ దాని అర్థమేమిటో తెలియదనీ అలాటి పదాలు ఎందుకు రాస్తారో అర్థం కాదనీ అన్నాడు. అక్కడున్న మిగిలిన వారికి కూడా ఆ పదం అర్థం తెలిసినట్టులేదు. తెలియక పోవడంలో విశేషం లేదు. ఎందుచేతంటే వారందరూ చిన్నవారు. బహుశా వారు పుట్టినప్పటికే ఆపదం  వాడుకలో కనుమరుగయిందనుకుంటాను.
నాకు ఆపదం అర్థం తెలుసు కనుక వారికి చెప్పాను. కక్కూస్ అంటే లెట్రిన్ అని.  ఆ పదం తమాషా ఏమిటంటే అది పోర్చుగీసు పదం. వాళ్లు మనదేశానికి  వర్తకానికి వచ్చి స్థావరాలు ఏర్పరచు కున్నప్పుడు. మన భాషలో చేరింది. అసలు ఆపదం  Kak+ House= kakhouse  “ కేక్ హవుస్” జనం పలుకుబడిలో కక్కూస్ గా మారింది.   నేను బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు  కొన్ని రైల్వే స్టేషన్లలో  లెట్రిన్ల నీద కక్కూస్ అని వ్రాసి ఉండడం చూసి ఉన్నాను.ఇప్పుడయితే ఈ పదం ఎక్కడా వినపడడం లేదుగాని ఇప్పటికీ మా ఇళ్లల్లో చిన్న పిల్లలు మల విసర్జన చేస్తే కేక్ వెళ్లాడంటూ ఉంటారు..  శుచి శుభ్రతల్ని పాటించే సంస్కారవంతుల ఇళ్లల్లో  కొన్ని పదాల్ని పలకడం    తప్పుగా భావిస్తారు. అసహ్యమని భావించే పదాలకి బదులుగా వేరే పదాల్ని వాడడం సర్వత్రా ఉన్నదే. అందుకనే  ఒకటికనీ,రెంటికనీ బహిర్భూమికనీ దొడ్డిలోనికనీ వ్యవహరిస్తూ ఉంటారు. (కన్యాశుల్కంలో కోమటాయన గుడ్డి మీద బాహ్యానికి వెళ్లాననడం గుర్తుందా?)  . మా ఇంట్లో మా చిన్నప్పుడు మేము పెట్టుకున్న ముద్దు పేరు
“ లండన్” అని.... బాగుంది కదూ?   ( మేము తెలియకుండా పెట్టుకున్న పేరయినా దానికో సార్థకత  ఉన్నట్టుంది. సుమారు రెండు వందల ఏళ్లక్రితం లండన్ లో ఎవరింట్లోనూ లెట్రిన్లు ఉండేవి కావట.  అప్పుడప్పుడూ మనుషులు తోపుడు బళ్లతో వచ్చి  మల మూత్రాల్ని తీసుకు పోయేవారట. అంటే ఆరోజుల్లో లండన్ నగరమే ఓ పెద్ద కక్కూస్ లా ఉండి ఉంటుదనడం  -- తప్పేమి ఒప్పేయగున్
                                                                ఈ రోజుల్లో  టాయ్ లెట్లమీద  ఏమీ వ్రాసి ఉండదు. హి..ఆర్ షి..అతడు లేక ఆమె అని మాత్రం వ్రాసి ఉంటుంది. అర్థంచేసుకోగలరు. అసలు మన రైల్వే బస్టాండులలో  టాయ్ లెట్ల గురించి ఎక్కడా వ్రాసి ఉండక్కరలేదు.  చాలాదూరం వ్యాపించే వాటి దుర్గంధమే వాటి ఉనికిని చాటుతూ ఉంటుంది.
 (  ఇక్కడో రహస్యం చెప్పాలి. నేను  1957—60 ప్రాంతాలలో  భారతిలో ప్రచురించ బడిన శ్రీ తూమాటి దొణప్ప గారి వ్యాసం “తెలుగులో బుడతకీచు నుడులు”  అనే దాన్ని చదివి ఉన్నాను. కక్కూస్ గురించి ఆయన వ్రాసిందే .  బుడతకీచు అనేది తెలుగు వారు పోర్చ్ గీ సు వారికి పెట్టుకున్న పేరు.ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు).........
  ఇదీ కక్కూస్ ల కథ...
. మళ్లీ కలుద్దాం....సెలవు....
    






వెంకట సుబ్బారావు మేడీజీ....



ఇదెక్కడో విన్నట్టుంది కదా? సాహితీ ప్రియులందరికీ ఇది కన్యాశుల్కం ప్రథమాంకంలో కాపర్సుకి కరువొచ్చినప్పుడు గిరీశం శిష్యుడు వెంకటేశానికి రాసుకోమని చెప్పిన పుస్తకాల లిస్టులోనిదని తెలుసు. సబ్జెక్టు పుస్తకాలు ఎనిమిది చెప్పి తొమ్మిదో పుస్తకంగా దీన్ని రాసుకోమంటాడు. దాని తర్వాత పదీ పూర్తి చెయ్యడానికన్నట్టు కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్టు అనీ రాసుకోమంటాడు. ఆఖరు దాని సంగతి నాకు తెలీదు గాని ఈ వెంకట సుబ్బారావు మేడీజీ మాత్రం గురజాడ వారి సృష్టి కాదు. ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో కూడా (అంటే నూరేళ్ళక్రిందటే )  ప్రతి సబ్జెక్టుకీ గైడ్లు ఉండేవన్నమాట.(మన తాతలందరూ మేము టెక్స్టు పుస్తకాలే చదివి పాసయే వాళ్ళమంటే మనం నమ్మనక్కరలేదు). ఆరోజుల్లో ఇలాంటి గైడ్లు ప్రచురించిన చారిత్రిక పురుషుడు  వెంకట సుబ్బారావు. వారి ఇంటి పేరు రెంటాల. వీరిని గురించి కూపీ లాగితే నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను.

రెంటాల వెంకట సుబ్బారావు కన్యాశుల్కం రచనా కాలానికి జీవించి ఉన్న వ్యక్తి. (అంటే 1890—1910 ) ప్రాంతంలోనన్నమాట.  ఆదిభట్ల నారాయణదాసుగారి మాటల్లో “ఈయన ఆరోజుల్లో చెన్నపట్నం మైలాపూరు చెరువు ఉత్తర గట్టున నివశిస్తూ ఉండేవాడు. ఆరోజుల్లోనే ఈరకమైన మేడీజీ పుస్తకాలు (గైడ్లు) ప్రచురించి రెండు లక్షలార్జించేడట.బియేబియల్ చదువుకున్న విద్యాధికుడు. తెలివితేటలుకలవాడు మిక్కిలి రసికుడున్నూ.కడు ఉదారవంతుడు. తెలుగున గద్యపద్యములు మిక్కిలి చురుకుగనల్లగలడు. దొరలు మెచ్చునట్లింగ్లీషు వ్రాసి మాట్లాడగలడు.”   ఈ వెంకట సుబ్బారావుగారు నారాయణదాసు గారికి కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి ఆయన చేత సంగీత సభలు చేయించినట్టు,హరికథలు చెప్పించినట్లు వ్రాసుకున్నారు. దాసుగారి సభలమీద హిందూ పత్రికలో వ్యాసాలు కూడా వ్రాసేరట.

ఈ రెంటాల వెంకట సుబ్బారావు గారి గురించి మరికొంత సమాచారం నాకు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రజ్ఞాప్రభాకరములో దొరికింది. శాస్త్రిగారు మద్రాసు లోఉన్నప్పుడు కొంత కాలం మైలాపూర్ లోఉంటూ అక్కడల కపాలీశ్వర స్వామి గుడి దగ్గర ఒక పూటకూటింట్లో భోజనం చేసేవారట. అది నిర్వహించే స్త్రీ మూర్తి రెంటాల వారికి దూరపు బంధువనీ కొన్నాళ్లు ఆమెకు ఏ ఆసరా లేకపోతే ఆదుకున్నారనీ ఆవిడ స్వతంత్రంగా జీవించాలనే తలంపుతో పూటకూళ్ళిల్లు నిర్వహించడం మొదలు పెట్టిందనీ వ్రాసేరు. శాస్త్రిగారు సేకరించి సంకలించిన చాటు పద్యమణిమంజరి ప్రచురించడంలో రెంటాల వారు చాలా సహాయము చేసేరట. “వేయి రిప్లై కార్డులమీద (కార్డు వెల కాని) నోటీసు పుస్తక మపేక్షించు వారు వ్రాయుటకు పై అడ్రసుతో అప్లికేషను ఫారము అచ్చు వేయించి అడ్రసులతో పోస్టు చేయించిరి. వెంటనే వేయి పుస్తకములు నమ్ముడుపోయెను.”  అని వ్రాసుకున్నారు.
                                                                    ఈ రెంటాల వెంకట సుబ్బారావు గారిని గురించి మనకి మరికొన్ని విషయాలు శ్రీ వల్లూరి సూర్యనారాయణరావుగారి స్వీయచరిత్రలో దొరుకుతాయి. దీని ద్వారా మనకు శ్రీ రెంటాల వెంకట సుబ్బారావు గారు ఆరోజుల్లోనే ప్రపంచంలో అతి పెద్దదైన ఫోటో స్టుడియోలలో రెండవ స్థానం పొందిన ఫుటో స్టుడియో నిర్వహించే వారని తెలుస్తోంది. ఇదికాక రెంటాలవారు షేక్స్పియర్ నాటకాలను గూర్చి ఇంగ్లీషులో ప్రకటించిన గొప్ప వ్యాఖ్యలు,విమర్శలు, అమెరికన్ విద్వాంసుల ప్రశంసనూ అబ్బురాన్నీ పొందేయట. 
శ్రీ వల్లూరి వారి స్వీయచరిత్రలో ఒక అధ్యాయం అంతా రెంటాల వారిని గురించే ఉందట.  శ్రీ సుబ్బా రావుగారి ఫొటో కూడా చూడవచ్చునట. ఈవిషయాలు శ్రీ అక్కిరాజు రమాపతి రావుగారు  తెలుగులో స్వీయచరిత్రలు జీవిత చరిత్రలు  అన్న వ్యాసంలో వ్రాసేరు. శ్రీ వల్లూరి వారి జీవిత చరిత్ర నాకు దొరకలేదు. దొరికితే ఒక అద్భుత వ్యక్తి గురించి ఇంకా చాలా విషయాలు తెలిసేవి. మిత్రులెవరైనా ఈకృషి చేయగలరని ఆశిస్తున్నాను.

సెలవు.

                                                         





5, సెప్టెంబర్ 2011, సోమవారం

కౌకిలి..కైకిలి..కంగాళీ...


ఈమాటలు మీరెప్పుడైనా విన్నారా? నా చిన్నప్పుడు మా వూళ్ళో  ( పార్వతీవురం-ప్రస్తుతం విజయనగరంజిల్లా) లో ఉన్నప్పుడు  కౌకిలి..కంగాళీ.. అన్న పదాలను విన్నాను.శిష్టేతరుల వ్యవహారాల్లో వాళ్ళకేదైనా కష్టాలొచ్చినప్పుడు  “  మా చెడ్డ కౌకిలి పడిపోనాం బాబూ”  అనడం విన్నాను.  ఆ మాట ఏదో కష్టాన్ని సూచిస్తోందని తెలిసేది. అంతే.  అయితే కొన్నాళ్ల క్రితం  తెలంగాణా మాండలికం లో వచ్చిన కథలు చదువుతున్నప్పుడు  అదే అర్ధంలో కైకిలి అనే పదం వాడడం గమనించేను.అప్పుడు దీని అసలు రూపం నాకు స్ఫురించింది. అది కైకూలి అయి ఉంటుంది. కై+కూలి= కైకూలి.అంటే చేతితో చేసే పని..శారీరక శ్రమ అన్నమాట. శ్రమ జీవుల వ్యవహారాల్లోనే ఈపదం కనిపించడం కాయకష్టం తెలియని అగ్ర వర్ణాల వ్యవహారాల్లో ఈ ప్రయోగం లేక పోవడంలో ఆశ్చర్యం ఏముంది? 
                                                        కంగాళీ..అన్న పదం ఎవరైనా అల్లరి చేస్తున్నప్పుడు వాడేవారు.   “ వాడొచ్చి చాలా కంగాళీ చేసేడ ” నేవారు .ఈ పదం శిష్టుల వ్యవహారాల్లో కూడా ఉన్నా నిఘంటువులలో కనపడదు. దీనర్థం నాకు ఏనుగుల వీరాస్వామిగారి కాశీయాత్ర చదివినప్పుడు గోచరించింది. ఆయన కాశీలో ఉన్నప్పుడు (సుమారు 150 ఏళ్ల క్రితం) అక్కడ కంగాళీలనే జాతి వారుండే వారనీ వారు కాశీ యాత్రకి వచ్చిన యాత్రికులని జలగల్లా పట్టుకు పీడిస్తూ  డబ్బులడుక్కునే వారనీ రాసేరు.ఆంధ్రదేశంనుంచి కాశీయాత్రకి చాలామంది పోయి వచ్చేవారు కనుక  వారందరూ తమనెవరైనా అల్లరి చేస్తే కంగాళీ మనుషులు అంటూఉండే వారనుకుంటాను.
                                                   ఇవి నాకుతోచిన విషయాలు.ఇంతకంటే అర్థవంతంగా ఉండే వివరణ ఎవరికైనా తడితే తెలియజేస్తే సంతోషిస్తాను.

     ముందు ముందు పోస్టుల్లో మరికొన్ని పదాలు వాకు తోచిన వివరణలూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.    సెలవు.

25, ఆగస్టు 2011, గురువారం

నేనూ..ముళ్లపూడీ..బాపూ.మాఅమ్మాయీ..



నాకాలేజీ రోజుల (1957-61) నుంచీ నాకు బాపూ అన్నా ముళ్ళపూడి అన్నా భలే ఇష్టం ఉండేది. ఒకరకంగా వీరాభిమానినే. అయితే వారిని ఎప్పుడూ కలుసుకోవడంగాని ఉత్తర ప్రత్తుత్తరాలు జరపడం గాని జరుగలేదు. ఇలా ఉంటే 1990 లో ఒకసారి ఇన్కమ్ టాక్స్ లో ఆడిట్ ట్రైనింగ్ నిమిత్తం మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఉండగా సరదాగా ముళ్ళపూడి గారికి ఫోన్ చేసాను,కలుసుకోవడానికి వీలు పడుతుందా అని.. తప్పకుండా సాయంత్రం రండి అని ఆహ్వానించేరు. ఆనందంగా మా బావమరది కోటీశ్వర రావుని తీసుకుని ఎల్డామ్స్ రోడ్లో ఉన్న వారి ఆఫీసుకి వెళ్ళాను. మేము వేళ్ళే సరికే లాన్స్ల్ లో ఒక చిన్న రౌండ్ టేబిలూ మూడు కుర్చీలు వేయించి ఉన్నారు. మమ్మల్ని సాదరంగా అహ్వానించి కూర్చోబెట్టారు.ఏదో పది నిమిషాలు మాట్లాడి పంపించేస్తారనుకున్నాను గానీ సుమారు గంటన్నర సేపు మాట్లాడుకున్నాము.మధ్యలో రెండుసార్లు టీలు. టేబిలు మీద టిన్నుతో పెట్టిన సిగరెట్లు కాల్చుకుంటూఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము .అప్పట్లో పెళ్ళి పుస్తకం సినిమా తీయబోతున్నట్టున్నారు. స్క్రిప్ట్ రడీగా ఉందనీ షూటింగ్ హైద్రాబాదులో జరుగుతుందనీ  మేము వచ్చి చూడవచ్చనీ అన్నారు.  నా
అభిమాన రచయితని కలుసుకోవడం అలా జరిగింది.ఆయన సింప్లిసిటీ ఆత్మీయతా
ఇప్పటికీ కళ్ళముందు కదలాడతాయి.  మేం వచ్చేస్తుంటే  శ్రీ రమణ గారిక్కడే ఉన్నారు చూస్తారా అని కూడా అడిగేరు. నాకు ఎం తో ఉత్సాహంగా ఉన్నా  మాకు వేరే పనులుండడంతో అప్పుడది వీలు పడలేదు. బాపూ గారక్కడ లేకపోవడంతో వారిని కలవడం వీలు పడలేదు.
                                      అయితే బావూ గారిని కలవడం మరో పదహారు సంవత్సరాల తర్వాత కుదిరింది. 1996 డిశంబరు 31  --1997 జనవరి 1 లలో ముళ్ళపూడి  బావూల జంట షష్ఠి పూర్తి  వంగూరి చిట్టన్ రాజు ఫౌండేషన్ వారు హైద్రాబాదులో నిర్వహించారు. అక్కడకి నేను మాఅమ్మాయి కలిసి  వెళ్ళడం జరిగింది. లోపల ఏదో సభజరుగుతున్నా  ముళ్లపూడి  బయటే నిల్చుని ఉన్నారు. మేం ఆయనతో మాట్లాడుతుంటే  ఒక ఫొటోగ్రాఫరు కనిపించేడు ఏవో ఫొటోలుతీస్తూ. మా అమ్మాయి ముళ్లపూడి గారిని అడిగింది వారితో కలసి ఫోటో దిగాలనుందని. ఆయన అలాగే అంటూ  కొద్దిదూరంలో ఎవరితోనో మాట్లాడుతున్న బాపూగార్ని రండి మన వాళ్ళొచ్చేరు ఫొటో  దిగుదాం అని పిల్చేరు బాపూ గారు వస్తూనే ప్రక్కకు జరుగుతున్న నన్ను వారి మధ్యలో నిల్చోమన్నారు. కానీ వారిద్దరినీ విడదీయకూడదంటూ వారిద్దరినీ మధ్యన నిల్చోబెట్టి  ఇటునేనూ అటు మా అమ్మాయి నిల్చొని ఫొటో దిగేము.
                       పైనున్నది ఆఫొటోయే. తీపిగుర్తుగా మిగిలింది.

   వారిని గుర్తు చేసుకుంటూ ముచ్చటగా మూడు కంద పద్యాలు



బాపూ-రమణలకు

జేజే—

సుందరి కోసము వెదకుచు
ఎందును గానక విసుగుతొ నేనుండంగా
అందము బొమ్మై నిలిపిన
చందము నీకే తగునది శహబాస్ బాపూ                     

ఎన్నుదు నిన్నే హాస్యము
పన్నును చెన్నుగ కథలను పండించుటలో
నిన్నును మించిన వారల
నెన్నడు నే జూడ లేదు ఎమ్వీ రమణా                        

చాన్నాళ్ళ క్రితము నేన్మీ
చెన్నై లో తమను కలిసి చేసిన ఛాటిం
గిన్నాళ్ళైనా యెన్నడు
సన్నగిలక మది మురియును  సంతోషముతో