12, అక్టోబర్ 2011, బుధవారం

హలో..బాగున్నారా?ఏఁవిటి భోగట్టాలు? అసలీ" భోగట్టాల" కథేఁవిటి?


 అసలేఁవిటీ భోగట్టాల కథ ?

                                       మనం  తెలుగు వారం ఒకర్నొకరు కలుసుకున్నప్పుడు ఏమండీ బాగున్నారా ఏమిటి విశేషాలు అని అడగడం పరిపాటి.  ఈ కుశల ప్రశ్నలు అయ్యాక  ఇంకేమిటి సంగతులు  అంటూ సంభాషణ కొనసాగిస్తాం .శ్రీ కృష్ణుడు కూడా పడక సీనులో దొంగనిద్ర నటిస్తూ పడుకుని ఉన్నప్పుడు సహాయం కోరడానికి దుర్యోధనుడూ, అర్జునుడూ వచ్చినప్పుడు లేచి వారిని చూస్తూనే  బావా యెప్పుడు వచ్చితీవు, ఎల్లరునున్ సుఖులేకదా అంటూ వారి వారందరి కుశలమూ పేరు పేరునా కనుక్కుంటాడు.  ఇదే కాదు పాత కాలంలో ఉత్తరాలు రాసుకునే టప్పుడు కూడా మేము క్షేమం, మీరు క్షేమమని తలుస్తాను. ఉభయకుశలోపరి.. అంటూ రాసిన తర్వాతే మిగిలిన విషయాలలోకి వెళ్ళేవారం.బాగున్నారా అని అడిగిన తరవాత ఇంకేమిటి సంగతులు అని అడగడానికి మా చిన్నప్పుడు ఉత్తరాంధ్ర లో  ఇంకేమిటి భోగట్టాలు.. అని అడుగుతూ ఉండేవారం. ఇదేకాదు, ఎవరి దగ్గరనుంచైనా ఉత్తరం వచ్చిందంటే ఏమిటి భోగట్టాలు రాసేడు అని అడిగే వారు.  భోగట్టాలంటే ఏమిటి?    ఇది మా ఉత్తరాంధ్రలో వినిపించే మాండలికమా లేక వేరే భాషనుంచి మన తెలుగులో చేరిన పదమా అని నాకు సంశయం ఉండేది. మొన్న నీ మధ్య ఈ బ్లాగు లోనే నేను రాసిన  వెచ్చని పచ్చడం లేక పోతే పితలాటకమే అనే పోస్టుకు స్పందిస్తూ  కమనీయం బ్లాగరు తనకు మాండలికాల విషయంలో కొంత గందరగోళం ఉందని చెప్తూ ఒక విషయం రాసేరు. మా ఉత్తరాంధ్రలో వినిపించే భోగట్టాలాంటి మాటలు వారి అనంతపురం జిల్లాలో కూడా వినిపిస్తున్నాయని శ్రీ తూమాటి దొణప్పగారు అన్నారని తెలిపారు. ( కమనీయం బ్లాగు నిర్వహించే డాక్టర్ శ్రీ ముద్దు రమణా రావు గారూ శ్రీ తూమాటి దొణప్పగారూ చిన్నప్పటి సహాధ్యాయులే కాకుండా చిరకాల  మిత్రులు. శ్రీ రమణారావు గారు ప్రసిధ్ధ విశ్రాంత నేత్రవైద్యులు కవీ రచయితానూ, నాకు స్వయానా మేనమామగారు. తూమాటి దొణప్పగారిని ఈ మేనమామ గారింట్లోనే 1963లో ఒకసారి కలిసేను. అప్పట్లో ఆయన ఆంధ్రా యూనివర్శిటీలో తెలుగు వ్యుత్పత్తి పదకోశం తయారు చేయడం పని లోనే ఉండేవారని నాకు గుర్తు.  ఈ భాషా శాస్త్రవేత్త తర్వాత నాగార్జున యూనివర్శిటీ కులపతిగా కూడా పనిచేసి  కీర్తిశేషులైన సంగతి సాహిత్యకారులందరికీ తెలిసే ఉంటుంది).   దీని వల్ల తేలిందేమిటంటే ఈ పదం ఉత్తరాంధ్ర మాండలికం కాదని.  మరి ఇది తెలుగు లోకి వచ్చి చేరిన పార్శీ లేక ఉర్దూ పదమేమైనా అయి ఉంటుందేమో ననుకున్నాను గానీ అదీ కాదని తేలింది.  ( తెలుగు పై ఉర్దూ పారశీకముల ప్రభావము అనే  డా.శ్రీ కే. గోపాలకృష్ణ రావు గారి పరిశోధనా గ్రంథం తరచి చూసేను. నా వద్దనున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు లోనూ శబ్దరత్నాకరంలోనూ ఈ పదం కన్పించ లేదు. ( నా వద్ద ఏ వ్యుత్పత్తి పదకోశమూ లేదు. అందుచేత  ఈ పదం వాటిల్లో ఉందో లేదో ఉంటే ఏ వ్యుత్పత్తి ఇచ్చారో తెలీదు). అయినా నాకు ఇప్పుడు తోచిన విషయం రాస్తున్నాను.  చిత్తగించండి:
భోగః  అనే సంస్కృత పదం తెలుగులో భోగము ఆనే తత్సమ పదంగానూ బోగము అనే వికృతి పదంగానూ కనిపిస్తుంది. దీనికి వేరే అర్థాలున్నా విశేష ప్రాచుర్యం గల అర్థం సుఖము అని.
                           సుఖాలంటే ఈ రోజుల్లో ఎన్నో కార్లు బంగ్లాలు బేంకు ఖాతాలు లాంటివని సామాన్యుల భావన. మరి కొంతమంది  ఇంకొంచెం తెలివైన వారు స్విస్ బేంకు ఖాతాలు సొంత విమానాలూ బంగారపు భోజనపు బల్లలూ కుర్చీలూ
ఉంటేనే సుఖమని పొరబడి ఏవో ఊచలు లెక్కపెడుతున్న సంగతి మనకు తెలిసినదే. అయితే మన సంప్రదాయం ప్రకారం మనకి సుఖాలంటే ఎనిమిది మాత్రమే.  అవి-
గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము.---
ఇంతకుమించిన సుఖాలు లేవు.  ( మనకి కష్టాలు కూడా ఎనిమిదే నండోయ్. అష్ట కష్టాలనే కద అన్నారు)
సరే. భోగట్టాలో భోగమంటే సుఖమని తేలిందికదా. అష్ట   అట్ట అయ్యింది. భోగట్టమంటే ఎనిమిదిసుఖాలూ లేక అష్టసౌఖ్యాలూ అన్నమాట. మీ భోగట్టాలు ఏమిటని అడగడమంటే మీకు ఏ లోటూ లేకుండా అన్ని సుఖాలూ అమిరి ఉన్నాయికదా అని అడగడమే. క్షేమ సమాచారాలు కనుక్కోవడమే. దీని అసలు అర్థం తెలియని వారి వాడుకలో ఇదే రాను రానూ మిగిలిన విషయాలమాటేమిటి అనేఅర్థంలో వాడబడుతూ విస్తృతార్థాన్ని సంతరించుకుంది..
 ( ఇది కేవలం నా ఊహ.బాగుందా? సరైనది కాదని  ఎవరైనా చెబితే దిద్దుకోవడానికి సిధ్ధంగా ఉన్నాను.. సెలవు.

5, అక్టోబర్ 2011, బుధవారం

ఆరుద్ర చెప్పిన డబ్బింగ్ పితామహుడు శ్రీశ్రీ ముచ్చట

                                  

            ఆరుద్ర                                                                            శ్రీశ్రీ                       



ఈ ముచ్చట ఓ యాభై ఏళ్ల కిందటిది. ఆప్పుడు నేను విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలో చదువుకుంటున్నాను. ఆ కాలేజీకి నేను చదువుకుంటున్నరోజుల లోనే సెంటినరీ ఉత్సవాలు జరిగాయి. క్రితం సంవత్సరం 150 సంవత్సరాల వేడుక కూడా జరిగిందట. ఆఖరి నిమిషంలో తెలియడంతో నేను వెళ్లి పాల్గొన లేక పోయాను. అంతటి ఘన చరిత్ర గల కాలేజీలో చాలా చాలా మంది పెద్దలు చదువుకున్నారట. నోబుల్ బహుమతి పొందిన సర్. సివిరామన్ లాంటి మహామహులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మనకి కావలసింది మహాకవి శ్రీశ్రీ కూడా అక్కడి కాలేజీ హైస్కూలు లోనే చదువుకున్నాడన్నది. ఆరుద్ర కూడా ఆవూరి వాడే. చిన్నప్పుడు ఆస్కూల్లో చదువుకున్నాడనుకుంటాను. ఏమయితేనేం వారిద్దరికీ ఆ కాలేజీ స్కూళ్లతో మంచి  సంబంధం ఉంది. ఆ కారణంచేతనే కావచ్చు నేను చదువుకుంటున్నరోజుల్లో ఒకసారి (బహుశ 58లేక59 లో అనుకుంటాను) ఆరుద్రని పిలిచి సభ పెట్టేరు. అప్పటికే ఆ యిద్దరూ ( వారిద్దరూ మేనమామ మేనల్లుళ్ళవుతారు) తెలుగు సినీరంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు. సభానిర్వాహకులు సినిమాలగురించో శ్రీశ్రీ గురించో మాట్లాడ మన్నట్లున్నారు.
ఆరోజు ఆరుద్ర శ్రీశ్రీ గురించి మాట్లాడేడు.  మిగిలిన విషయాలు నాకు గుర్తులేవు కానీ ఆరుద్ర శ్రీశ్రీని డబ్బింగ్ పితామహుడనడమూ,  అప్పట్లో డబ్బింగ్ చేయడంలోని కష్టాలన్నీ వివరంగా విశదపరచడమూ గుర్తుంది. అప్పటికే ఆరుద్ర రాజ్ కపూర్ ప్రేమలేఖలుకి డబ్బింగ్  రచన చేసాడు.
                                    హిందీలోని నీర్ ఔర్ నందా తెలుగులోకి   ఆహుతి పేరుతో డబ్ చేయబడ్డ తొలితెలుగు సినిమా. దీనికి  తెలుగులో మాటలూ పాటలూ రాసింది శ్రీశ్రీ. ఆరోజుల్లో ఇప్పటిలా డబ్బింగ్ ధియేటర్లు లేవట. మూల భాష లోని సినిమాని చూస్తూ  పాత్రధారుల హావభావాలనూ పెదవుల కదలికలను చూస్తూ డబ్బింగ్ చెప్పే సదుపాయంకూడా లేదంటే ఎంతకష్టపడే వారో ఊహించుకోవచ్చు. ఈకష్టాల్నీ తన అనుభవాలనీ ఆచిత్రంలో ఒక పాత్రకి డబ్బింగ్ చెప్పిన, తరువాతి కాలపు కేరక్టర్ యాక్టర్, శ్రీ వల్లం నరసింహా రావుగారు               డబ్బింగూ దాని పుట్టపూర్వోత్తరాలూ అనే వ్యాసంలో రాసేరట.  టెక్నికల్ సాధక బాధకాలటుంచి రచనలో వచ్చే ఇబ్బందులగురించి ఆరుద్ర ఓ ముచ్చట చెప్పేరు. అదీఇది :
                                     ఢబ్బింగ్ రచనలో  చాలాముఖ్యమైన ఇబ్బంది.
మూలభాషలో కాని అనువదిస్తున్న భాషలో కాని ఔష్ఠ్యాలు వచ్చినప్పుడు వస్తుంది. ప ఫ బ భ మ లు పలికి నప్పుడు పెదవులు కలిసి నోరు మూసుకున్నట్లవడం మిగిలినప్పుడు నోరు తెరిచే ఉచ్చరించడం. మరీ ముఖ్యంగా క్లోజప్  షాట్లలో వస్తుందీ ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందే ఒకసారి వచ్చిందట. ఓ హిందీ సినిమాలో హీరోయిన్ హీరోతో తాను గర్భవతి నయ్యానని తెలియజేస్తూ మై మా హూఁ   అంటుందట. ఖర్మంకొద్దీ అది హీరోయిన్ ముఖంమీద క్లోజప్ షాట్లో తీయబడింది.  ఈ చిన్ని డైలాగ్ కి తెలుగులో నేను గర్బవతిని అని ఎలా చెప్పించాలని రచయిత తలపట్టుక్కూర్చున్నాడట. అప్పుడు  శ్రీశ్రీ గారిని ఆశ్రయిస్తే ఆయన ఆగండం గట్టెక్కే ఉపాయం చెప్పాడట. మై మాహూఁ అనే చోట పాపాయి అని రాసుకోమన్నాడట. తరవాత హీరో హీరోయిన్ల  డైలాగుల్లో తనకడుపులో ఆతని పాపాయి పెరుగుతోందని  హీరోయిన్ చేత అనిపించేరట. అలా ఆ గండం గడిచిందట. అదీ కథ.  ఎంతైనా ఆయన డబ్బింగ్ పితామహుడుకదా?
( పైన ఉదాహరించిన వల్లంనరసింహారావు వ్యాసం గురించీ మరికొన్ని కబుర్లూ చెప్పిన మిత్రుడు శ్రీ వోలేటి శ్రీనివాసభానుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను....)
సెలవు....

1, అక్టోబర్ 2011, శనివారం

రెండు గొప్ప కథలు...




కథలెక్కడనుంచి వస్తాయి?  ఆకాశం నుంచి ఊడి పడవు కదా?  ఈ నేల మీద పుట్టి పెరిగిన మనుషుల్లోంచి వస్తాయి. వాటిని రాసే వాడూ మనిషే. వాటిల్లోని పాత్రలూ మనుషులే.. జరిగిన ఏదో ఒక సంఘటనను చూసో లేక ఇలా కూడా జరిగి ఉండొచ్చునని ఊహించో రచయితలు కథలు రాస్తారు. ఆ కథలు చెప్పడానికి కూడా  నిజ జీవితంలోంచే పాత్రల్ని ఎన్నుకుంటారు. కాకపోతే తాము చెప్పదల్చుకున్న విషయానికి అవసరమైన కల్పనల్ని జోడిస్తారు. ఒక్కోసారి ఏ కల్పనలూ అక్కర లేకుండా జరిగిన సంఘటనలే అద్భుతమైన కథా రూపాన్ని సంతరించుకుంటాయి. వాటిల్లో రచయిత పైత్యం జొప్పించకుండా జరిగింది జరిగి నట్లు చెబితే చాలు మనకో గొప్ప కథ చదివిన అనుభూతి కలుగుతుంది. అదిగో అలాంటి అనుభూతిని నాకు కలిగించిన ఓ రెండు గొప్ప కథల్ని గురించి మీకు చెప్పబోతున్నాను.

( ఈ రెండు కథలూ కళలకి కాణాచియైన విజయనగరంలోనే జరిగాయి. మన మొట్టమొదటి తెలుగు కథ  దిద్దుబాటు కూడా ఇక్కడే పుట్టింది కదా?)

1919 లో విజయనగరం రాజు విజయరామ గజపతి సంగీత కళాశాలను స్థాపించేరు.( ఇది ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ.) దీని మొదటి ప్రిన్సిపాలు హరికథా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. వారితో పాటు ద్వారం వెంకట స్వామి నాయుడుగారు వాసా వారు మొదలైన హేమా హేమీలుండేవారు.  ఇదిగో ఇటువంటి  సంగీత కళాశాలలో దాసుగారికి సేవ చెయ్యడానికి  రామస్వామి అనే వ్యక్తిని  రాజుగారు నియమించేరు. ఈ రామస్వామి మరీ సామాన్యుడు కాడు. అతడు అంత వరకూ శ్రీ విజయరామ గజపతికి ఆంతరంగిక సేవకుడుగా ఉన్నవాడు.అతని ఉద్యోగం రాజు గారికి  వారి అభిరుచిమేరకు రకరకాల వైన్స్ కలిపి ఇవ్వడం. ఈ సేవలో రాజు గారితో పాటు అతడు అనేక ఉత్తరాది సంస్థానాలకి కూడా వెళ్లి వచ్చిన వాడు. ఇటువంటి ఆంతరంగిక సేవకుడ్ని సంగీత కళాశాలలో ముఖ్యంగా దాసుగారి సేవలకి రాజుగారు ఎందుకు నియమించేరో తెలీదు. బహుశః  రాజుగారితో తనకున్న చనువు మేరకు రామస్వామి అడిగితే నియమించేరేమో?. ఈ రామస్వామి మాత్రం సంగీత కళాశాలకూ అక్కడి విద్వాంసులైన వారికీ సేవలు చేసుకుంటూ ఉండే వాడు.
 రామస్వామి పరమ రామ భక్తుడు. తను దాచుకున్న కొద్దిపాటి సొమ్ముతోనూ ఆ ఊళ్లో ఒక రామ మందిరం కట్టించేడు.రోజూ తెల్లారకనే లేచి స్నానపానాదులయ్యేక గుడికి వెళ్లి పూజ చేసుకుని ప్రసాదం పంచుతూ కాలేజీకి వచ్చేవాడు.
 రామస్వామికి ఫిడేలునాయుడుగారంటే పంచప్రాణాలు. ఆయన సంగీతం కాలేజీ ప్రిన్సిపాలై రిటైరయ్యే వరకూ ఆయనదగ్గరే పనిచేసాడు.
ఈ ఫిడేలు నాయుడుగారింట్లో గురుకుల వాసం చేసుకుంటూ చాలామంది విద్యార్థులు ఉండేవారు. రోజూ శిష్యుల్లో ఒకరు బజారుకెళ్లి  నాయుడుగారింటికి కావల్సిన కూరగాయలు తెచ్చేవారు. వారు తెచ్చిచ్చిన చిల్లర సరిగా ఉందో లేదో సరి జూసుకొని కాని మరీ వాళ్లను వెళ్లమనేవారు కారు నాయుడుగారు. అయితే ఎప్పుడైనా రామస్వామిని పంపి కూరలు తెప్పించుకున్నప్పుడు మాత్రం  అతడిచ్చిన చిల్లర లెక్కజూసుకోకుండానే జేబులో వేసుకునే వారు. తమ మీద లేని విశ్వాసం రామస్వామి మీద నాయుడుగారికెందుకుందో తెలియక విద్యార్థులు ఈర్ష్య పడుతూ ఉండే వారు. ఉండబట్టలేక ఓ రోజు నాయుడుగార్నే ఈ సంగతి అడిగేసారు. అయితే వినండి అంటూ నాయుడుగారు వారికి చెప్పిన జవాబు ఇది:
ఎంత బాగా వాయించినా ఎంత పేరొచ్చినా (తగిన పారితోషికం లేక) బాధ పడుతుంటే రామస్వామి నన్నూరడించేవాడోయ్బాధ పడకండయ్యగారూ! మీకు స్వర్ణాభిషేకాలు జరిగే రోజులొస్తాయండీ అనేవాడోయ్--ఒక రోజున వచ్చి నన్ను అడిగాడుకదా-అయ్యగారూ-నేను చిన్నరాములోరి గుడి కట్టించానండి. రేపటి ఉదయం విగ్రహాలు పెడుతున్నారు. మధ్యాహ్నం సంతర్పణ జరుగుతుంది.. సాయంత్రం తమరు కచేరీ చేస్తే ధన్యుణ్ణవుతానన్నాడోయ్-- పరమానందంతో నేను కచేరీ చేసేను కచేరీ అయిన తర్వాత రామస్వామి నాకు నూట పదహార్లు తాంబూలం పెట్టి నమస్కరించేడుఅంత గొప్ప సన్మానం మొదటిసారిగా చేసిన వాడిని చిల్లర లెఖ్ఖ అడగమంటారోయ్? ” 
ఈ రామస్వామి 80 ఏళ్లు పైగా  ఆరోగ్యంగా జీవించి ఒక సాయంత్రం రాముల వారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి పాయసం సేవించి సుఖనిద్రలో రాముని సన్నిధి చేరుకున్నాడు. అతడు మాన్యుడా ? సామాన్యుడా?  అతని సంస్కారం ఈ నేల లోంచి వచ్చిందా? నెనరులోంచి వచ్చిందాఆతని నిమ్మళం మనకుందా?
                                          ***

    ఇక రెండో కథ చూడండి: ఇదీ విజయనగరంలోనే జరిగింది. కాకపోతే పైన చెప్పిన కథ జరిగిన చాలా ఏళ్ల తర్వాత
ఓ రోజు రాత్రి  ద్వారం దుర్గా ప్రసాద రావుగారూ కవిరాయని జోగారావుగారూ, కాట్రావులపల్లి వీరభద్రరావు గారూ కాలేజీ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. రోడ్డు చీకటిగా ఉంది- ఏదో మంచి కచేరీయే జరిగింది. దాని గురించి కచేరీ బాగుందని మాట్లాడుకుంటూ వస్తున్నారు- అంతలో వెనుక నుండి ఇలా విన పడ్డది:
 మా గొప్ప కచేరీయే లెండి. మీరు యినడం- బాగుందనడఁవున్నూ-మేఁవూ ఇన్నాం కచేరీలు-సంగీతవఁటే అలాగుండాలి ఆ రోజులు పోనాయి.
ఈ మాటలు విని ఆ ముగ్గురూ నిర్ఘాంత పోయి-వెనక్కి తిరిగి చూస్తే- అతడో బికారిలాగున్నాడు. కొంచెం పట్టు మీద తూల్తున్నాడు. అతడిని పోలిక పట్టేరు. ఊళ్లో రోజూ గొడుగులు బాగు చేస్తూ తిరుగుతుంటాడు. సాయంత్రం వచ్చిన డబ్బుల్తో పూటుగా తాగి రాత్రికి మాదాకబళం తల్లీ అంటూ ఆడుక్కుంటూ ఉంటాడు. నువ్వు విన్న కచేరీ ఏదోయ్ అని వారడిగితే- కాకినాడ సరస్వతీ గాన సభలోనండీ- తిరుచ్చి గోవింద స్వామి పిళ్ళె ఫిడేలు వాయిస్తేనండీ ఆ నాదమండి జడివోనలో తడిసినట్టుండేదండి. పల్లడం సంజీవ రావు ఫ్లూటు ఇన్నారా తమరు- గొప్ప తీపండి
 వోయిద్యం. కాని ఒకటే స్పీడండి, నాయుడుగోరి వోయిద్యం సరేనండి-ఆరి ఇంట్లో రోజూ యినేవోడినండి. రోజూ అమృతమేగదండీ అయండీ సంగీతాలంటే  అంటూ గొణుక్కుంటూ వెళ్లి పోయేడు.
మళ్లా కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి ప్రసాదరావు గారూ వారి మేనత్త ద్వారం మంగ తాయారు గారూ వారింట్లో కూర్చుని ఈమని శంకర శాస్త్రి గారి వీణ టేపు వింటున్నారు. శంకర శాస్త్రిగారికి ప్రక్కవాద్యంగా కోలంక వెంకటరాజుగారు మృదంగం వాయిస్తున్నారు. వారు తన్మయంగా వింటుంటే అదండీ మృదంగం అంటేఅని వీధరుగు మీంచి వినిపించింది. తలుపు తీసి చూస్తే ఆగొడుగుల బికారే.
మంగ తాయారుగారు అన్నం పెట్టి అతని పేరేమిటని అడిగితే సన్యాసండి అని చెప్పి అతడు వెళ్లి పోయేడు.
ఆ తర్వాత కొంత కాలానికి  ఆవిడ మద్రాసు వెళ్లినప్పుడు వాళ్ల అమ్మగారిని ఎవరీ సన్యాసి అని అడిగితే అయ్యో తల్లీ వాడు మాదాకవళం చేసుకుంటున్నాడా వాడికి బట్టలిచ్చి రోజూ భోజనం పెట్టండి తల్లీ అంటూ సన్యా సి కథ చెప్పిందావిడ.

విజయనగరం రాజు విజయరామ గజపతి వారు వారి ఆంతరంగ కార్యదర్శి గారి పుత్రుడు అంధుడైన చాగంటి గంగ బాబు కోసమే 1919లో విజయనగరంలో సంగీత కళాశాల ప్రారంభించేరు. గంగబాబుని గుర్రబ్బండిలో కాలేజీకి తీసుకు వెళ్లి తీసుకు రావడానికిగాను అతడికి ఎస్కార్టుగా ఉండడానికి సన్యాసిని నియమించేరు.
గంగబాబుని 15 సంవత్సరాలు కాలేజీకి, ద్వారం నాయుడు గారింటికీ, కచేరీలకీ సన్యాసే తీసుకు వెళ్లేవాడు. నాయుడు గారి కచేరీలలో గంగబాబు ప్రక్కవాద్యం వాయించేవారు. సన్యాసి నిరంతరం వారితోనే ఉంటూ సంగీత కచేరీలు వింటూ ఉండేవాడు. కొన్నాళ్లకి  గంగబాబు గారు పెద్ద విద్వాంసులయ్యేసరికి వారి ఆస్తులన్నీ హరించుకు పోయేయి. గుర్రబ్బళ్లు పోవడం, తోడుగా శిష్యులుండడం చేత ఎస్కార్టు అవసరం లేక సన్యాసి ఉద్యోగం ఊడింది. తర్వాత ఏమేం పనులు చేసే వాడో కానీ గొడుగులు బాగు చెయ్యడంలో స్థిర పడ్డాడన్నమాట”.

ఉండడానికి తగిన నీడ నిచ్చే గొడుగు కరువైనా, జీవిక గురించి పట్టించుకోకుండా నిత్యం నాదామృతంలో తడిసి ముద్దైన వానికి  సన్యాసి సార్థక నామధేయమే కదా?
                                                       ***

 ఈ కథల్లోని రామస్వామి, సన్యాసి పాత్రలు సృష్టించింది వారి జీవిత కథలకు కర్తా ఆ విధాతే అయినా ఈ అపురూపమైన వ్యక్తుల కథలు కాలగర్భంలో కలిసిపోకుండా రికార్డు చేసి మనకి అందించిన, ఈ రెండో కథలో ఒక పాత్ర అయిన శ్రీ ద్వారం దుర్గా ప్రసాద రావుగారు ధన్యులు.
                            ఈ జీవిత గాథలు నా హృదయాన్ని తాకిన గొప్ప కథలు. మరి మీ సంగతి?
                                           ****

28, సెప్టెంబర్ 2011, బుధవారం

సోఁవులప్పకి జేజేలు.. ఎవురీ సోఁవులప్ప? .




ఆ మధ్యని ఏదో పెళ్ళికని విశాఖ పట్నం వెళ్లి అంత  దూరం ఎలాగూ వెళ్లేను కనుక  చిన్నప్పుడు పుట్టి పెరిగిన మా వురు ఎలాగుందో ఒక సారి చూసి వద్దామని పార్వతీ పురం వెళ్లేను. అక్కడ మేం పుట్టి పెరిగిన పెద్ద ఇల్లూ అవీ ఉండేవి. (ఇప్పుడూ ఉన్నాయి కాని ఇప్పుడవి మావి కావు). మా వాళ్లు కూడా ఎవ్వరూ లేరు.   మేనత్త కొడుకు ఒక్కడు మాత్రం ఆ ఊరు విడవకుండా వాళ్ల సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ల ఇంటికే వెళ్లాను. ఎప్పటి నుంచో రమ్మని పిలుస్తున్నాడేమో చాలా ఆనందించేడు. ఊరంతా ఒకసారి చూసి  రావాలనే నా కోరికని చెప్పగానే తప్పకుండా చూపిస్తానని అన్నాడు. 
              ఆ సాయంత్రం వాడి స్కూటరు మీదే బయల్దేరి ముందుగా టౌన్ స్టేషన్  వైపు వెళ్లేము. మా వూరు  చిన్న వూరయినా మాచిన్నప్పటినుండి రెండు రైల్వే స్టేషన్లున్నాయి. టౌన్ స్టేషను చాలా చిన్నది. ఇప్పుడంటే బుకింగాఫీసు , ప్లాటుఫారమ్మీద షెడ్డులాంటివి ఉన్నాయి గాని మాచిన్నప్పుడు ఉట్టి ప్లాటుఫారము మాత్రమే ఉండేది.  టిక్కట్లమ్మే బుకింగ్ క్లర్కు పాపారావు గారు ట్రెయినొచ్చే గంట ముందర వచ్చి దగ్గర లోని సీతా రామస్వామి కోవిల్లో కూర్చుని టిక్కట్లమ్మి వెళ్లిపోయే వాడు. మా చిన్నప్పుడు మా వూళ్లో అందరికీ సాయంత్రం విహార స్థలం ఆ ఓపెన్ ప్లాట్ ఫారమే. ( ఆ మధ్య  నవ్య నీరాజనం శీర్షికలో రచయితల పరిచయాల లో  ఇప్పటి ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పరిచయంలో ఎడిటర్ జగన్నాథ శర్మ తానూ వంశీ ఆరోజుల్లో ఆ ప్లాట్ ఫారమ్మీద సిమెంటు బెంచీల మీద కూర్చుని కన్న కలలూ కథల డిస్కషన్లగురించి రాసేడు. ) అదిగో ఆ ప్లాట్ఫారమ్మీద కొచ్చేసరికి ఒకబ్బాయి మాకెదురై నమస్కారం చేస్తూ పలకరించేడు. మా బావ అతణ్ణి ఏఁవోయ్ రాఁవి నాయుడూ బాగున్నావా ఏఁవిటిలా వచ్చేవని ఆడిగేడు. మా అమ్మమ్మకి కళ్లు కొంచం మసకేసాయండి కళ్లడాక్టరుకి ఓపాలి సూపిద్దాఁవని వొయిజాగ్ తీసిగెల్తన్నానండి...  ఇయ్యేల బండి గంట లేటట. బండికోసం సూస్తన్నాఁవండి అన్నాడు.. ఆవిడేదీ అంటే అదో ఆ బల్లమీద కూకునుంది అన్నాడు. మా బావ వెంటనే బావా నువ్వు వెతకబోతున్న తీగ కాలికి తగిలింది. సోఁవులప్పని చూడాలనీ ఆమెతో మాట్లాడాలనీ ఉందని ఆన్నావుకదా?.  నువ్వు సోఁవులప్పతో మాట్లాడుతూ ఉండు. నేనిప్పుడే చిన్న రాచకార్యం చక్కబెట్టుకుని అరగంటలో వచ్చేస్తానని వెళ్లేడు. నేను రామి నాయుడుతో సోఁవులప్ప కూర్చున్న సిమెంటు బెంచీ వేపు నడిచేను.
                              ( బ్రాహ్మలలో యజ్ఞం చేసిన వారిని సోమయాజులనీ ఆయన భార్యని సోమిదేవమ్మ అనీ ఆంటారు, వారి పేరున వారి పరంపరలో సోమమ్మలూ సోమిదేవమ్మలూ రావడం ఉంది. మరీ నాయురాలికీ పేరెట్లా వచ్చి ఉంటుందనుకుంటే అప్పుడు తట్టింది. మా ఊరికి దగ్గరలో గుంప అనే ఊళ్లో రెండు నదుల సంగమంలో(అవి నాగావళి జంఝావతి అనుకుంటాను. నాకు సరిగా తెలీదు) సోమేశ్వరాలయం ఉంది. అక్కడ శివరాత్రికి పెద్ద తిరుణాల జరుగుతుంది. ఆ సోమేశ్వరుడి పేరిట ఇక్కడి వాళ్లు సోమేశ్వర రావులూ సోమనాథాలూ సోమమ్మలూ చాలామంది ఉన్నారు. అలాగే ఈవిడ  తల్లిదండ్రులు ఈవిడపేరు సోమమ్మ అని  పెట్టుకుని ఉంటారు. ఈ ప్రాంతంలో అక్కని అప్ప అని గౌరవంగా పిల్చుకుంటారు కనుక ఈవిడ అందరికీ సోఁవప్ప అయిఉంటుంది.)

                                    మేం దగ్గరకి వెళ్లగానే రామి నాయుడు అమ్మమ్మా ఎవురొచ్చేరో సూడు అన్నాడు. కళ్ల మీద చెయ్యి అడ్డం పెట్టుకుని చూస్తూ ఏమో ఎవురో నాకేటేరుక నానెప్పుడూ సూసినట్టు నేదు. పొల్తి పట్నేక పోతన్నాను అంది. ఈన మన పంతులు మేష్ట్రుగారి పెద్దన్నయ్యగారి అబ్బాయి అని చెప్పేడు. ఎవురు నారానమూర్తిగోరి పెద్దబ్బాయా. అత్తలెక్కడో అయిద్రాబాదులోనో ఎక్కడో  ఉండాల గావాల అంది. ఎప్పుడొచ్చేవు బావూ?” అని అంది. మా ఆవిడా పిల్లలూ బావున్నారా అనీ అడిగింది. మా అమ్మనీ నాన్ననీ తల్చుకుంది. ఆ ఆప్యాయతకి నాకు కళ్లు చెమర్చేయి. ( నాకావిడ తెలీదు.  తెలీదంటే నా చిన్నప్పుడు యాభై యేళ్ల క్రిందట ఆవిడని  ఒక్కసారే చూసేను. అంతే. అంతకుమించి తెలీదు. నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి. హైస్కూల్లో చదువుకుంటూ ఉండే వాణ్ణి. పొలం నూర్పులకని మా నాన్నగారు ఆ పల్లెకి వెళ్తుంటే  ఆయనతో వెళ్లాను. అప్పుడు మారైతు ఫలానా వారి కోడలని మా నాన్నగారికి పరిచయం చేస్తుంటే  చూడ్డమే. పసిడిరంగు ఛాయ  లేత ముఖం లేడికళ్లూ చాలా సిగ్గుతో అణకువగా నిల్చుంది. నానూ పట్టిడా వేసుకొని, చెవులకిఎత్తు గొలుసులు పెట్టుకొని,బుటాల కోక కట్టుకొని పసుపు రాసిన మొకాన రూపాయికాసంత బొట్టుపెట్టుకోని  నాయిరాళ్లందరిలాగే ఉంది.)   ఇదిగో మళ్లా ఇప్పుడు చూడ్డమే..  ఇప్పుడేమో బాగా ముసిల్దై పోయింది. పచ్చటి పసిమిరంగు ఒళ్లు కాంతివంతంగానే ఉన్నా ముఖమూ ఒళ్లూ అంతా ముడతలు పడి ఈనెలు తేరిన పండుటాకులా ఉంది. అయినా అనారోగ్యం  ఎక్కడా కనబడ్డంలేదు. కళ్లు మసగబారేయంటున్నాడు కనుక కాటరాక్టు వచ్చి ఉండొచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి. చల్లటి డ్రింక్స్ తీసుకొస్తానని చెప్పి నాయుడు బయల్దేరబోయేడు. నేనొద్దన్నా వినకుండా. ఎల్నీ బావు దగ బెట్తుంది గద. కాతంత  తాగితే సల్లబడతావు అంటూనే ఒరే నాయిన నువు తాగి పంతులుగారికి తే.. పో.. నాకొద్దు నేన్తాగను. నానీల్లు నాకున్నాయి గావా అంది.
    రామినాయుడటెళ్లగానే నేను తేరుకుని అంతా బాగున్నామమ్మా. నువ్వెట్లాగున్నావు అని అడిగేను. నాకేంటి నోపం బావూ..ఏ ఇబ్బందీ నేదు. బతుకు సుకంగా ఎల్లిపోతోంది అంది. ఎవర్నైనా పలకరిస్తే చాలు సవాలక్ష ఇబ్బందుల్నివర్ణించడం చూసిన నాకు సోఁవులప్పమాటలు ఆశ్చర్యం కలిగించేయి. సోఁవులప్ప ఈ వయసులో కూడా పల్లెటూళ్లో ఒక్కత్తీ ఉంటోంది. ఎలా రోజులు
గడుస్తున్నాయంటే నాకేటి కావాల బావూ..రెండు పూట్లకీ రెండు పిడికిళ్లముద్దలు. కట్టుకోనానికో గుడ్డముక్కుంతే సాల్దా అంది. రెండు గేదలున్నాయి. ఆట్ని సాక్కుంటూ పాలు పిండుకోని  సెంటరుకి తోల్తాను. ఆ వొచ్చే రాళ్లే నాకు శాన అంది.  అదీ గాక ఈ మనవడు ఒకట్రెండురోలు సెలవు దొరికినా ఒచ్చి సూసి ఎల్తుంటాడనీ ఒచ్చినప్పుడల్లా పదో పరకో ఒద్దన్నా ఇనకుండా ఇంట్లో పెట్టి పోతుంటాడనీ చెప్పింది. అప్పుడప్పుడూ సీరలూ అవీ ఇచ్చి ఎల్తుంటాడనీ తన కవేవీ అక్కర్లేదు కనక లేనోల్ల కెవులకేన ఇచ్చేస్తుంటాననీ చెప్పింది. ఒక్కత్తెవీ ఎందుకా పల్లెటూళ్లో ఉండడం అంటే రాఁవినాయుడెప్పుడూ ఒచ్చేసి తన్తోనె ఉండిపొమ్మంటాడనీ కానీ తానే రానని మెడ్డేస్తూ ఉంటాననీ అంది. ఎందుకు బావూ ఆ వొయిజాగ్లో ఏటుంది. ఈడేమో అగ్గి పెట్టెలాంటి ప్లాటో అదేదో అందల ఉంతన్నాడు. పొద్దుగూకులా వెలట్రీ దీపాలెలిగించుకుని కూకుంతారు. గాలా? పాడా? అని అంది. ఈడి గోస పడ్నేక ఓ పాలెల్లి నాల్రోలు ఉండొచ్చినా బావూ. ఇరుగా? పొరుగా? మాటా? మంతా?  సీ..అక్కడుంతేటి సుకం బావు, జైల్ల ఉన్నట్టుంటాది. నానుండ లేన్ర బావని చెప్పి తిరిగొచ్చీసిన. మరెప్పుడెల్లలే.. ఇదిగిప్పుడే ఒక్కత్తివీ ఊళ్లో ఉంతావు కల్లు కూడ సరిగ కా పడప్పోతే ఎలగుంతావని బైల్దేరదీసిండు. నాన్రాన్ర దేఁవుడా అని మొత్తుకున్న ఇన్లే. సర్లె పోనీ ఓ పాలి ఎల్లొచ్చెస్తే ఈడూ మనుసు కట్టపెట్టుకోడూ..ఆడి పిల్లల్నికూడ సూసొచ్చినట్టుగుంతాదని ఎల్తన్నాను బావు. నీనక్కడుండన్నే. తొందరగానే ఎలిపోయొచ్చెత్తాను. ఆడేటి సుకం. మనూర్లొ ఉంతె ఆల్లూ ఈల్లూ పలకరిత్తుంటారు. సోఁవులప్ప..సోఁవులప్ప అని గౌరవంగ సూసుకుంతారు. అయినా నా సంగతి నీకు తెల్సు కద బావు. కాల్నిలవదు ..నోరూర్కోదు...ఈదులన్నీ తిరుగుతుండాల..అడిగినోడికీ అడగనోడికీ సలాలు సెబ్తుండాల.. ఆల్లు ఇన్నీ ఇనకపోనీ..నాకుతోసిందేదో నాను సెబ్తుండాల. నాకు తెల్సుబావూ నా మాటెవ్వరిన్రని. నా పిల్లలే ఇన్రు. ఇదిగిదిగో ఈ మనవడు మాత్రం ఇంటాడు. నామీ ద  కసింత గౌరవం, బెమా. ఇంకెవుల్లిన్రు. కాని సిన్నప్పటి కాణ్ణించి   అలవాటైపోనాది  గదా. ఇప్పుడు గమ్మునుండమంటే  గమ్మున కూకోగల్నా? అయితొకటి బావు. అందరంతారు ఊలోల్ల సంగతులన్నీ నీకేల  కిష్టా రాఁవా అనుకుంత పల్లక తిని తొంగోరాదా అని. కల్లెదురుగ్గ అన్నేయం జరుగుతుంతె అది నీకు అన్నేయమనిపించినప్పుడు ఆ మాట సెప్పడానికి బయ్యిఁవేల.  ఓ పాలి మా యీదిల శివున్నాయుడు నేడా ఆడు పీకలమొయ్య తాగొచ్చి పెల్లాన్నిసితక బాదీసేడు బావు. అంతేన.. అవి బూతులు కావు బావు..  నానోటికి రావు... అసియ్యం అసియ్యం మాటలంటూ కొప్పట్టుకోని ఈదిలోకి తోస్సేడు బావు. ఆయమ్మి ఎసుమంటి మనిసో ఈదిలందరికి దెల్సు. అయ్నా అందరలాగ నిలబడిపోయి సినేమా జూసినట్టు సూస్తుండి పోనారు. ఒక్కల్లకి నోరు పెగల్లేదు. నాకు మాత్రం ఉండబట్టలేదు బావు. ఎల్లి జలగడిగీసేను. ఒక్కమాటంతె ఒక్కమాట మారు పలక్కుంత నాయుడు లోనికెల్లిపోయేడు బావు. ఆడకూతురికంత అన్నేయం జరూతుంతె పల్లకెలగుంతాము? నేన్సేసింది తప్పా? సెప్మి అంది.  నేను మాట్లాడే లోపే మళ్లాతనే..అయితింకోటుందిబావు.  దరమ్ము నీకాడుంతె నువ్వు  దెయిర్నంగ ముందు నిల్సుంతె నీ యెనకాలందరొస్తారు బావు.. మన సత్తిమే మన్ని కాస్ది. మొన్నీ మద్దిని అజారేవో ఎవురో గాని ఆ పెద్దమనిసి అయినీతి తుడిసి పెట్టాలని  ముందు నిల్సుని యుద్దానికి రడీ యంతే అందరాయన ఎనకాలె నిలబడ్డారు కారా?  దేనికైనా ముందు నిల్సునే మొగోల్లే కరువై పోయేరు బావు. మొగోల్లని నేనిలగంతన్ననని ఏఁవనుకోకు బావు. నేను సెప్పింది నిజిఁవా? అపద్దఁవా సెప్మి..సెప్మి..అంది.
నేనేమనగల్ను? ఊరికొక్కరైనా సోఁవులప్పలాంటివాళ్లుండాలని కోరుకోవడం తప్ప.
అయినా అన్నాను సోఁవులప్పా నీ మాటలెవరు వింటారని నువ్వు ఆనుకుంటున్నావుగానీ, నువ్వూ నీ కబుర్లూ నువ్వు చెప్పే తిత్తవలూ, సామెతలూ అన్నీ గౌర్నాయుడు పుస్తకం రాసి అచ్చేసిన సంగతి నీకు తెలుసా? ఎక్కడెక్కడున్నోళ్లో అవన్నీ చదివే ఉంటారు కదా అన్నాను. ఓ అదెప్పటిమాట. అవునో పుస్కరం అయి ఉంటది. గంటేడాల్ల బొట్టిడా పన్జేసి. నాకూ సెప్పినాడునే.
బొట్టిడంతన్నాననేటనుకోకు. సిన్నప్పటి కాణ్ణించి ఎరిగినోడుగదా. నాకంతె  సాల సిన్నోడు. మావూల్లో మేష్ట్రు పని జేసీవోడు గాద. ఇప్పుడేదొ పెనసనుదీసుకుంట  ఇదిగీ ఊల్లోనె ఉంతన్నాడని ఇన్నాను. నువుగాని కలిత్తె అడిగినానని సెప్మి.. అంది.. ఇంతలో రామినాయుడు డ్రింకులు తీసుకొని రావడంతో మా సంభాషణ అక్కడికాగింది. డ్రింకు తాగుతూ రామినాయుడడిగేడు. ఏంటి సార్..మాముసిల్దాయి మీకు బోరుకొట్టిందా.. వాక్కుండా ఒక్క సిటం ఉండలేదు. అందుకనే ఊళ్లో అంతా కళింగోర..కళింగోర..అంటూ ఉంటారు అన్నాడు. బోరేఁవిటి. అసలా కళింగోర మాటలు విందామనే ఇంత దూరమొచ్చింది. నాకోరిక నెరవేరింది. అదే చేప్పేను. ఇంతలో మాబావ వచ్చి వెళ్దామంటుంటే  వాళ్ల ట్రైన్ కూడా వచ్చే సంకేతం అందింది. మర్నేనుంతాను బావూ.. అందర్నీ అడిగేనని చెప్పు ముసిల్దాయిని మర్సిపోకండి అంది. ఎలా మరచి పోగలను?  
                                                       ***
ఈ సోఁవులప్ప ఎవరని కదూ ప్రశ్న?  ఈవిడ శ్రీ గంటేడ గౌరు నాయుడు రాసిన
కళింగోర పుస్తకం లోని కల్పిత పాత్ర. ఈ పుస్తకం డిశంబరు 1998 నుండి ఆగష్టు1999 మధ్యలో ఆంధ్ర ప్రభ దిన పత్రికలో యాసపీఠం శీర్షిక క్రింద వచ్చిన  64 ప్రాసంగిక వ్యాసాల సంపుటి. అక్షర జ్ఞానం లేని ఒక గ్రామీణ స్త్రీ పాత్రని సృష్టించి ఆమె నోటిద్వారా తాను చేయదల్చుకున్న సామాజిక వ్యాఖ్యల్ని  సమర్థవంతంగా చేసిన గౌరునాయుడు అభినందనీయుడు.
ఉత్తరాంధ్ర పలుకుబడిలోని జవం జీవం తెలుసుకోవాలంటే అక్కడి సామెతల సౌరు తిలకించాలంటే శ్రీ గంటేడ గౌరు నాయుడు రాసిన కళింగోర పుస్తకాన్ని భాషాభిమానులందరూ తప్పని సరిగా చదవాలి. ఈ వుస్తకం ప్రచురింపబడి పుష్కరం దాటింది. అయినా బ్లాగుల పుణ్యమా అని ఇప్పటికైనా నలుగురికీ దీన్నిగురించి చెప్పే అవకాశం దొరికింది. ఈ పుస్తకాన్ని స్నేహ కళాసమితి  నాయుడు వీధి కురుపాం..  535524  వారు  ప్రచురించేరు.
                   
ఇంత మంచి పుస్తకాన్ని రాసినందుకూ, పది కాలాల పాటు తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే ఒక  సోఁవులప్పని సృష్టించినందుకూ శ్రీ గౌరునాయుణ్ణి అభినందించకుండా ఉండలేకపోతున్నాను. (ఇంతకూ కళింగోర అంటే ఆప్రాంతంలో ఎప్పుడూ అరుస్తూ తిరిగే పిట్టట.)
సోఁవులప్ప ఓ కల్పిత పాత్ర అని మీకు చెప్పేసాక నేను ఆవిణ్ణి కలవడం ముచ్చట్లాడడం అన్నీ కల్పితమేనని వేరే చెప్పక్కర లేదు కదా. 
  
తెలుగులో సాహిత్యంలోని ఒక పాత్ర (కన్యాశుల్కం లోని మధురవాణి) చేత తెలుగు నేలపై పుట్టి పెరిగి కవులై కీర్తిశేషులైన మహానుభావులని (విశ్వనాథ జాషువా మున్నగు  వారిని) స్వర్గంలోఇంటర్వ్యూలు చేయించిన ఘనుడు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు.  అదొక అద్భుతమైన ప్రయోగం. ఇదేమో సాహిత్యంలోని ఒక పాత్రతో రచయిత ముచ్చటించడం. ఇదీ ఒక ప్రయోగమే. నచ్చితే సంతోషం...సెలవు..

24, సెప్టెంబర్ 2011, శనివారం

శ్రీ విశ్వనాథ గిరీశం....హైదరాబాదీ గిరీశం...

( కన్యాశుల్కం నాటకాన్ని విశ్వనాథ వారు వ్రాసి ఉంటే ఎలాగుండేదో ఊహించి సరదాకి చేసిన ప్రయోగం. అలాగే గిరీశం హైద్రాబాదులో పుట్టి ఉంటే  ఆ హైద్రాబాదు  గిరీశం ఎలా మాట్లాడే వాడో అని  మరో చిన్నఊహ... )

ఒకరోజు సాయంత్రం  విశ్వనాథ వారి గిరీశం విజయనగరం బొంకులదిబ్బమీద నిల్చుని  ఇలా స్వగతం చెప్పుకుంటూ ఉంటాడు:

వి.గిరీశం:సాయం సమయమైనది. దీనినే కవులు గోధూళి వేళయని యందురు   అదియొక చమత్కారము. వారేదియును దిన్నగా జెప్పరు.కవులు నిరంకుశులని గదా లోకోక్తి. అయిననేమి? తిన్నగాజెప్పిన వారిసొమ్మేమి బోయియుండును? వారినట్లుండనిండు. వారిది కడుపునిండిన బేరమైయుండును. నాసంగతియే యేమియునుదోఁచకున్నది. నెల దినములక్రిందట విపణికి బోయి సరకులను గొనిదెత్తునన్ననెపమున పూటకూటియామెనుండి ఇరువది రూప్యములను బుచ్చుకొని వచ్చి నాట్యగత్తెకు నర్పించుకొనియుంటిని. ఈదినము ప్రత్యూషముననే నాకునూ ఆమెకునూ పెద్ద జగడమే జరిగినది. కపాల మోక్షము చేయుదమన్నంత కోపమావహించినదిగాని, ఓరిమి లేక ఎవడునూ లోకమును గెలువజాలడని రిచర్డు మహాశయుడు ఆంగ్లమున నుడివియుండుట జ్ఞప్తికి వచ్చుటచే  శమించియుంటిని. పూర్వమున నేనెన్ని పర్యాయములు ఇట్లు ధనము కాజేసినను ఏమియూ ననక యూరకుండెడిదిగాదా? ఇప్పుడీ నాట్యగత్తె విషయము  ఎవడైన తుంటరియొకండు ఆమె చెవిలోనూదియుండును. మన ప్రాభవమును జూచి ఓర్వలేక అతడీ పని చేసియుండును. ప్రొద్దుటి సంఘటన వలన మరి నేటినుండి మనకు నిచ్చట భోజనము లభించు తీరు మృగ్యము. ఇచటనందరకునూ ఋణగ్రస్తుడనైయుంటిని. శ్రీ పంతులుగారి కోడలుకి నేను వ్రాసియున్న ప్రేమలేఖ సంగతి బహిర్గతమైనచో నాకు దేహశుధ్ధి జరుగుట అనివార్యము. అతిశీఘ్రమే ఈయూరినుండి నిష్క్రమించుటత్యావశ్యకమని మదినిదోచెడిని....కాని మధుర వాణిని వీడి వెళ్లుటకు మనసు ఇచ్చగించదే? నేనేదైన నుద్యోగము జేసి యామెకు వైభవమును జేకూర్చగలనను ఆశతోడనున్నది. పాపమమాయకురాలు.

ఆఁ.. ఎవరా వచ్చుచున్నది.... నా ప్రియశిష్యుడగు వెంకటేశము వలె దోచుచున్నది. వీనికీ దినమునుండి  క్రిష్టమసు శలవులిచ్చి యుందురు. వీని ముఖమున విషాదఛాయ దృగ్గోచరమగుచున్నది.  పరీక్ష దప్పియుండును. మంచిది. వీనికి చదువుచెప్పుదునని వీనితోడ వీని యూరికి బోయినయెడల ప్రస్తుత సంకటము నివారించుకొనవచ్చును. తరువాత సంగతి యాతరువాత జూచుకొనవచ్చును. నందో రాజా భవిష్యతి యని గదా
(ఇట్లుకొనసాగును.)
                                               ****
                              
గిరీశం హైద్రాబాదులో పుట్టి ఉంటే......
హై.గిరీశం:   పొద్నూకింది...ఒక మయిన పయిల వొటేలమ్మతాన యిరువై రూపాలు దీస్కొని సామాన్దెస్తనన్జెప్పి చపాయించిన.  గాపైసల్గిట్ట డాన్సు గర్లుకి కరుసైపోయుండె. ఇయ్యాల పొద్దుగాల గామె లడాయి శురూజేసె..  నాకెంత గుస్సయ్యందంటే గామెను సంపేద్దామనుకున్నగాని గంత గుస్సపన్కిరాదని గా రిచర్డుగాడు జెప్పింది యాదికొచ్చి జర్రంత తమాయించిన. గామె గూడ మంచిదే. గిదేమి పైలిబారుగాదు,  గామెతాన పైసల్దీసుకున్నది. గప్పుడల్ల  సప్పుడు జైకుంట
 ఊకునేదిగాదె. గిప్పుడేమొ గామెకి డాన్సుగర్లు కత ఎవుడైన జెప్పిండో  ఏందోకత. గెట్లైన గిప్పటి సంది మనకీడ బువ్వబుట్టే కతలేదు. పంతుల్కోడల్కి చిట్టి రాసినంద్కు గాల్లకెవురికైన ఎరికైతె గెప్పుడైన మన సెమ్డాలెక్కదియ్యొచ్చు. గింక లేట్జెయ్యకుండ గీడనుంచి  బైలెల్లడమే దిమాకున్నోడు జేసేపని. గాని ఆ సాన్ది మదురవోణ్ణి ఇడిసిపెట్టెల్లాల్నంటె మనసైత లేదు. నేనేదైన కొలువు జేసి గామెను సుకబెట్తనని కలలుగంటన్నది. ఎర్రి మొకంది.

  ఆఁ...ఎవురది... గిట్నే ఉర్కొస్తండు? మన యెంకటేనా? గీడికిప్పుడు కిస్మిస్సెలవులిచ్చుంటరు. గీడు దప్పకుంట పరీచ్చ ఫెయిలయ్యుంటడు. గీడి మొగమే జెప్తందా ముచ్చట. గీణ్ణి జర్ర సమ్జాయించి గీడికి  సదువు సెప్తనని గీన్తో గీని ఊర్కి ఉడాయిస్తే గిప్పటికి మనం బచాయించినట్లయితది. పరేశాన్ ఖతమ్. గానక ముచ్చట గానక.....        (ఇలా నడుస్తుంది...)

( ఇది శ్రీ గురజాడ 150వ జయంతోత్సవ సంవత్సరం అందుకే ఈ యత్నం...సెలవు)                        

21, సెప్టెంబర్ 2011, బుధవారం

యావత్ తైలం తావద్ వ్యాఖ్యానం

                                    దీని కథ ఏమిటయ్యా అంటే పూర్వం రోజుల్లో రాత్రి పూట పురాణ కాలక్షేపం చేసేవారు. ఏగుళ్లోనో పెద్దింటి వారి వాకిట్లోనో పౌరాణికులు  భారత రామాయణాలో లేక ఏ పురాణాలో చదువుతూ వాటికి తమ వ్యాఖ్యానం  జోడించి వినిపించేవారు.  ఆ రోజుల్లో విద్యుద్దీపాలు లేవు. అంచేత ఏ కాగడాలో వెలిగించి ఆ వెలుగులో పురాణ పఠనం జరిగేది. కొంతసేపటికి నూనె అయిపోయి కాగడాలు ఆరిపోవడం మొదలిడితే ఇంక ఆరోజుకి పురాణ పఠనం వ్యాఖ్యానం సమాప్తం. అందు చేతనే తైలం (నూనె) ఉన్నంత వరకే వ్యాఖ్యానం అనే ఈ సామెత పుట్టింది.
                                     తైలం అంటే తిలల నుండి వచ్చినది. తిలలు అంటే నువ్వులు. నువ్వులనూనె అన్నమాట.
మా చిన్నప్పుడు తెలకలి ఆయన గానుగ ఆడిన నువ్వులనూనె ఇంటికి తెచ్చి అమ్మే వాడు. ఆరోజుల్లో ఆ నూనె అడ్డలు, తవ్వలతో కొలిచే వారు. ఇప్పటిలా కిలోల లెక్క కాదు.  మాయింట్లో వంటలకి వేరుశనగ నూనే వాడినా చేతిమీదికి (అంటే అన్నం లో కూరలూ పచ్చళ్లూ కలుపు కున్నప్పుడు వేసుకునేది) ఈ నువ్వుల నూనెనే వాడే వారు. ఎక్కువ కొలెష్ట్రాల్ ఉండదనీ మంచిదనీ  ఈ మధ్యనే ఎక్కడో చదివాను. మా ఆవిడైతే ఆవకాయలు పెట్టినప్పుడు ప్రశస్తమైన  ( అంబటి సుబ్బయ్య సామర్లకోట) వారి ఏ. యస్. బ్రాండు నువ్వులనూనెనే వాడుతుంది. ఆవకాయరుచిగా ఉంటుందని.ఆవకాయ గుర్తొస్తే తెలుగువాళ్లం మై మరచి పోతాంగనుక  విషయాతరంలోకి పోకుండా  జాగ్రత్తపడదాం.
                             తైలం అనే పదం నువ్వుల నూనెనే సూచించినా క్ర మేపీ వాడుకలో ఏదైనా నూనె  అనే అర్థంలో స్థిరపడింది. తలకు రాసుకునే వాసన నూనెలు, కీళ్లనొప్పులకి వాడే నూనెలూ మొదలైన వాటన్నిటికీ తైలాలనే పదంవాడుకలోనికొచ్చింది. (కన్యాశుల్కం లో  కాపర్సుకి కరువొచ్చి కొన్నాళ్లు కాలక్షేపంకోసం వెంకటేశంతో పల్లెటూరికి వచ్చిన  గిరీశానికి అగ్నిహోత్రావధాన్లింట్లో ఓ బ్యూటిఫుల్ యంగ్ విడో కనిపిస్తే ఆమె ఎవరని అడిగినప్పుడు వెంకటేశం తన అక్క అనీ జుత్తుకి చముర్రాసుకోదనీ 
అంటాడు.  చమురంటే నూనె అది రాసుకోవడానికీ రాసుకోకపోవడానికీ సౌభాగ్యానికీ వై
ధవ్యానికీ ఉన్నంత తేడా ఉందన్నమాట ).
ఈతైలాలువృక్షసంబంధమైనవీ,జంతుసంబంధమైన వీ (వెజ్,నాన్ వెజ్) ...ఆహారంలో ఉపయోగించేవీ ఇతరత్రా వాడేవీ కూడా ఉన్నాయి. వీటి సంగతి అలాఉంచి అసలు విషయానికి వస్తున్నాను.
                                       మీరు మిస్సమ్మ సినిమా చూసేరోలేదో.. అందులో రేలంగి డబ్బుని తైలం..తైలం..అంటూ ఉంటాడు. మాచిన్నప్పుడు ఈ పదం చాలా వాడుకలో ఉండేది. అలాడబ్బుని తైలం అని ఎందుకన్నారోగానీ తైలంమాత్రం డబ్బే.. డబ్బేమిటి బంగారం.. అదెలాగో మనవి చేస్తాను. నాచిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తోంది....
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపలేము.
అసాధ్యాల్ని సుసాధ్యాలు చేయవచ్చు కాని మూర్ఖుల మనసుల్ని మార్చలేమంటూ చెప్పిన పద్యమిది. ఇక్కడ కవి ఇసుకలో తైలం తీయవచ్చని చెప్పాడు కదా? నాకు చిన్నప్పుడు ఇసుకలోంచి తైలమెలాతీస్తారని చాలా సందేహంగా ఉండేది. ఒకప్పుడు  నివాసయోగ్యంకాకుండా ఉండే ఎడారులైన అరబ్బు దేశాల పంటపండిఇసుకలో తైలంతీయబట్టే కదా ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించ గలిగే స్థితి కవి ఎదిగాయి. పెట్రోలంటే శిలాతైలమే కదా? ద్రవరూపంలో ఉన్న బంగారంకదా?(Liquid gold). అందుచేతనే శిలాతైలం ఉన్న దేశాలే సంపన్నదేశాలు. ప్రపంచం అంతా డబ్బుచుట్టే తిరుగుతోంది.డబ్బుంటేనే ఏదయినా. అంటే తైలం ఉండాలి.
తైలం ఉంటేనే పనిజరుగుతుంది.....
యావత్తైలం తావద్వ్యాఖ్యానం....
సెలవు.

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

గురజాడను నే నుతింతు గురుభావముతో...


        

                 1862 సెప్టెంబరు 21వ తేదీ. తెలుగు సాహితీ గగనంలో వేగుచుక్కపొడిచింది. మన సాహితీ ప్రాంగణంలో అలుముకున్న చీకట్లను తొలగించి ఒక నూతన  శకావిర్భావానికి  నాంది పలుకబోయే  యుగకర్త విశాఖజిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో పుట్టాడు. జననం మాతామహుల ఇంట్లో రాయవరం గ్రామంలోనే అయినా పెరిగిందీ కళలు నేర్చిందీ ఉద్యోగించిందీ కళలకు కాణాచి అయిన విజయనగరంలోనే. అతడు తన హైస్కూలు చదువుల రోజులలోనే శ్లోకాలు వ్రాసేవాడట. కాలేజీ లో అడుగు పెట్టిన కొత్తల్లోనే (21వ ఏట) సారంగధర అన్న ఇంగ్లీషు పద్యకావ్యాన్ని ప్రచురించిన ధీశాలి.అప్పట్లోనే చంద్రహాస అన్న మరో ఇంగ్లీషు కావ్యాన్నికూడా వ్రాసేడు. సారంగధర కావ్యం ఎంత పేరుపొందిందంటే ఆ ప్రచురిత కావ్యాన్ని  ప్రముఖ కలకత్తా పత్రిక తిరిగి తమ పత్రికలో ప్రచురించేటంత. అయితే వీటినీ, ఆతరువాత కొన్ని సంస్కృత నాటకాలకి ఆంగ్లంలో వ్రాసిన పీఠికలనుగానీ ఆ కవిశేఖరుని ఆంగ్ల భాషా వైదుష్యానికి  మచ్చుతునకలనవచ్చునేమో గానీ ఆయనకి చిరకీర్తిని తెచ్చి పెట్టినది మాత్రం తెలుగు లో మాగ్నమ్ ఆపస్ ( Magnum opus  )అనదగ్గ  కన్యాశుల్క నాటక రచన మాత్రమే.
          ఈనాటకం మొదటి ప్రదర్శన 1892 లో జరిగి విశేష జనాదరణకి నోచుకుంది. దానికి కారణం అంతవరకూ తమకు అర్థంకాని మరఠ్వాడా సంస్థల వారి  హిందీ నాటకాలు చూసిమొహం మొత్తిన తెలుగు వారికి వారి నిత్యజీవితంలోకనిపించే పాత్రలు వారి జీవద్భాషలో మాట్లాడుతూ కనిపించడమే.  కన్యాశుల్క రచనోద్దేశం  ప్రధానంగా  సంఘసంస్కరణ అయినా అది ప్రజల హృదయాలలో నాటుకునేట్టు చేయగల బలమైన సాధనం వారి జీవ భాషలో రచింపబడే నాటకమే అని కవి నమ్మడమే. ఆనమ్మకం నిజమని రుజువు చేస్తూ ఆనాటకం పొందిన  బహుళ జనాదరణ, పత్రికల ప్రశంసలూ కవిని ముగ్ధుణ్ణి చేశాయి. ఆనాటివరకూ తెలుగు దేశం కనీవినీ ఎరుగని ..నాటి సాహిత్యంలో ఎటికెదురీతలాంటి తన ప్రయోగం విజయవంతమవడంతోనూ మొదటి కూర్పు  (1897)  ప్రచురించిన నాటినుండి గడచిన పుష్కర కాలంలో వ్యావహారిక భాషకి లభించిన సమాజ, సాహితీపరుల ఆమోదపు ప్రోత్సాహంతోనూ కన్యా శుల్కం నాటకాన్నితిరగ రాసి 1909 లో ప్రచురించారు. ఈ ప్రచురణ మొదటి కూర్పులో ఉండిపోయిన గ్రాంధిక పదజాలపు వాసనలు పూర్తిగా తొలగించుకొని అసలైన తెలుగు నుడికారపు సొబగులతో గుబాళించింది. గత నూరేళ్లుగా తెలుగు సాహితీ పిపాసులు మరీ మరీ చదువుకుంటూ మురిసిపోతున్న  ప్రచురణ యిదే.

                                   తెలుగు సాహిత్యంలోమణిపూస అనదగ్గ కన్యాశుల్కం నాటకమే కాకుండా ఆయన రాసిన దేశ భక్తి గేయం ముత్యాలసరాలూ ఆయనని అజరామరుణ్ణిచేశాయి.
 దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
వట్టిమాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్
పూని యేదైనాను ఒక కార్యం
చేసి జనులకు చూపవోయ్..  
 అంటూ దేశజనుల్ని ఉద్బోధిస్తూ ఆయన రాసిన గేయం  ఏదేశప్రజలైనా పాడుకో దగ్గది. ఇటువంటి దేశభక్తి గేయం మరో బాషలో ఉండి ఉంటుందని నేననుకోను.
ఆయన సమాజంలో ఉన్న మూఢవిశ్వాసాల్ని డంబాచారాల్ని కడిగివేశాడు.  తోకచుక్క అనే గేయంలో
అరుదుగా మిను చప్పరంబున
చొప్పుతెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుధ్ధులు
బెదరి యెంచిరి కీడుగా...      అంటూ
తలతునేనిది సంఘసంస్కరణ ప్రయాణ పతాకగాన్ అనీ అన్నాడు.
మన సమాజానికి పెద్ద చీడయైనటువంటి కుల వ్యవస్థని అసహ్యించుకుంటూ
లోకమందున యెంచి చూడగ
మంచి చెడ్డలు రెండె కులములు
మంచియన్నది మాలయైతే
మాలనే యగుదున్     అనగలిగిన సంస్కరణాబిలాషిఅతడు.
వాడుక భాషని ఈసడించే శుధ్ధ గ్రాంధికవాదులకు
కొయ్య బొమ్మలె మెచ్చు కనులకు
కోమలుల సౌరెక్కునా అంటూ చురక పెట్టేడు.
ఈ మహాకవిని గురించి చెప్పుకోవడానికి  ఎంతైనా ఉందిగానీ  ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మన మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్నిక్కడ గుర్తు చేసుకోవాలి. ఆయన మనకి ముగ్గురే యుగకవులనీ వారు ఆది కవులలో తిక్కన మధ్యయుగంలో వేమన ఆధునికులలో గురజాడ అని నిష్కర్షగా చెప్పాడు. 
అనారోగ్యంతో బాధ పడుతూ చాలాతక్కువ కాలం (53 సంవత్సరాలు) మాత్రమే జీవించినా ఆధునికాంధ్ర సాహిత్యానికి దిశా నిర్దేశం చేస్తూ
దీపధారియై ముందు నడుస్తూ  అడుగు జాడ గురజాడది--  ది భావికి బాట ”    అనిపించుకున్న గురజాడ సాహితీపరులందరికీ
చిరస్మరణీయుడు.
                         నేటికి గురజాడ జన్మించి నూట నలభై తొమ్మిది సంవత్సరాలు గడిచి 150 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో   నా నివాళి నీవిధంగా సమర్పిస్తున్నాను

సరసుల మనసులదోచియు
కరమగు ఖ్యాతిని బడసిన కన్యాశుల్కం
విరచించె మన మహాకవి
గురజాడను నే నుతింతు గురుభావముతో...

(మరికొన్ని విషయాలు మరోసారి ---సెలవు.