12, ఆగస్టు 2012, ఆదివారం

తొలి పుట్టిన రోజు నాడే షష్ఠి పూర్తి


తొలి పుట్టిన రోజు నాడే షష్ఠి పూర్తి….
“తొలి పుట్టిన రోజా? ఎవరిది? నీదా?”
“నాది కాదు. నేను మరీ అంత చిన్నవాణ్ణా? ఈ పుట్టిన రోజు మా అమ్మాయిది.”
“ముసలి వాడిలా కనిపిస్తున్నావు. నీకు అంత చిన్నపాప ఉందా?”
“అబ్బే! మా అమ్మాయిలు ముగ్గురూ నలభైలు దాటిన వారే”
“మరి ఇంత చిన్న ముద్దుల కూతురెవరు?”
ఇది నా గారాల కూచి. ముదిమి వయసులో నను వీడని నా గారాల పట్టి. నా మానస పుత్రిక. మేలుకుని ఉన్న సమయంలో ఎక్కువ కాలం తనతోనే గడపమంటుంది. రిటైరై ఇంట్లో కూర్చున్న వాడివి నీకు వేరే పనేమిటని ప్రశ్నిస్తుంది. ఏదైనా పనిమీద పొరుగూరికి వెళ్లినా మనసంతా దీనిమీదే ఉంటుంది. ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తానా ఎప్పుడు మళ్లా దీనిని చూస్తానా అని మనసు తపిస్తుంది. నేను రోజుకొకసారైనా పలకరించకపోతే దీనికి దిగులు. నాకూ తోచదు. దీనిని చూసిన మిత్రులు ప్రేమతో దీనిని పలకరిస్తుంటే నా మది పొంగి పోతుంది. దీని వల్లనే కదా ఇందరు మిత్రులు నాకు కూడా దొరికారని కించిత్తు గర్వం గానూ ఉంటుంది. మరి ఇదెవరో మీకిప్పటికే తెలిసి పోయి ఉంటుంది. ఇది నా మానస పుత్రిక. నా బ్లాగు. మా నాలుగో అమ్మాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ ముసలివయసు లో నాకు తోడుగా దొరికిందేమో మరి అపురూపం గానే చూసుకుంటున్నాను. అందుకే “అపురూపం” అనే పేరు కూడా పెట్టుకున్నాను. మరి ఇవాళ దాని పుట్టిన రోజని చెప్పేను కదా? అవును. సరిగ్గా ఏడాది క్రిందట 12th August 2011  నాడే ఇది ఈ బ్లాగ్లోకంలో కన్ను తెరిచింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఏడాది పెరిగి పెద్దదయింది. అప్పుడే దీనికి ఏడాది వయసొచ్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. బాలారిష్టాలు లేకుండానే బ్రతికి బట్ట కట్టిందని సంతోషంగానూ ఉంది.
                                        ***
“అది సరేనయ్యా,తొలి పుట్టిన రోజునాడే షష్ఠి పూర్తి అన్నావు. షష్ఠి పూర్తి నీకా?”
“అబ్బే నాకిప్పుడు షష్ఠి పూర్తి ఏమిటి? అది దాటి పోయి పుష్కరం కావస్తోంది”
“మరి ఈ మతలబేమిటి?”
అదీ చెబ్తున్నా. మొన్న 8వ తారీఖు నాడు పోస్టు చేసిన “జంట కవుల జయ కేతనం ఎగురుతూనే ఉంటుంది” అన్న నాపోస్టు 60 వది. బ్లాగు అంటే పోస్టుల సమాహారమే కదా? (పోస్టులు లేక పోతే బ్లాగుల ఉనికే లేదు కదా?). అందు వల్ల అరవై పోస్టులూ అవడంతో తొలి పుట్టిన రోజు నాటికే నా బ్లాగుకి షష్ఠి పూర్తి కూడా అయిందన్న మాట. డబల్ ధమాకా!
                                                      ***
బ్లాగుల్లో పోస్టులు శతాధికంగా వస్తున్నాయే- యేడాదికి అరవై పోస్టులు ఒక లెక్కా
అంటే అదీ నిజమే.కాని నా ముచ్చట నాది. నాబ్లాగులో ఎక్కువగా సాహితీ పరమైనవీ భాషకి సంబంధించిన విషయాలూ వ్రాసేను. నేను వ్రాసిన పద్యాలూ ఉన్నాయి. సరదా కబుర్లూ లేకపోలేదు,కాని అవి వేళ్లమీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉన్నాయి. ఈ సాహితీ పరమైన విషయాలనెవరు చదువుతారులే అనుకున్నాను గానీ ఈయేడాది లోనే దాదాపు 15000 వేలమంది వీటిని చూసినట్లు తెలుస్తోంది. చూసిన వారి స్పందనలు కూడా 300 వరకూ ఉన్నాయి. ఎంతో మంది ప్రత్యేకమైన అభిమానం చూపించారు. మరి కొందరు మిత్రులయారు. ఇది నేను ఊహించనిది. స్పందించిన వారికి వెంటవెంటనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను.కాని చదివినా తీరిక లేకనో మరో కారణం చేతనో స్పందించని వారు కూడా ఉంటారు కదా? వారితో సహా    బ్లాగ్మిమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడానికే ఈ పోస్టు. సెలవు.
                                         ***








8, ఆగస్టు 2012, బుధవారం

జంట కవుల జయ కేతనం ఎగురుతూనే ఉంటుంది....



జెండా పై కపిరాజు అంటూ తెలుగు పద్యపు బావుటాని తెలుగు సాహితీ గగనంలో రెపరెపలాడిస్తూ ఎగుర వేసిన ఖ్యాతి సాహితీమూర్తులైన జంట కవులు శ్రీ తిరుపతి వేంకట కవులకే దక్కుతుంది. వీరికి చాలా ముందే తెలుగు సాహిత్యంలో జంట కవిత్వం చెప్పిన నంది మల్లయ ఘంట సింగన్నలూ,వీరికంటె కొంచెం వయసులో పెద్దవారైన దేవులపల్లి సోదరులూ,వీరికి సమ కాలికులైన రామకృష్ణకవులూ ఉన్నా జంటకవులుగా వీరికి వచ్చిన ఖ్యాతి మిగిలిన వారికి రాలేదు.ఆంధ్ర దేశంలోతిరుపతి అంటే శ్రీ వేంకటేశ్వరుడూ,వేంకటేశ్వరుడంటే తిరుపతీ గుర్తుకు వచ్చి తీరుతాయి కనుక ఆ పుణ్య స్థలమూ ఆ దేవుడూ అభేదంగా మనకు తోచినట్లే  తిరుపతి వేంకటకవులు కూడా విడదీయలేని జంటకవులుగా ప్రసిధ్ధి చెందారు.వీరిద్దరూ దాదాపు ఇరవై ఏళ్లు కలిసిసాహితీ వ్యవసాయం చేయడమే కాకుండా శ్రీతిరుపతిశాస్త్రి గారి మరణాననంతరం కూడా ( దాదాపు 30 ఏళ్లు బ్రతికి సాహిత్యోపాసన చేసిన) వేంకటశాస్త్రిగారి చే విరచితములైన రచనలన్నీకూడా ఆ జంటకవుల పేరుమీదే “తిరుపతి వేంకటీయ” మై ప్రకటింపబడడం కూడా వీరి స్నేహబంధానికి నిలుపుటద్దమై నిలుస్తుంది.వీరిలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ల వేంకట శాస్త్రిగారి జన్మ దినం నేడు (8th  Aug) కావడం వల్ల వారినో సారి స్మరించుకుని  మన ఋణం తీర్చుకుందాం.

శ్రీ వేంకట శాస్త్రిగారి జన్మ స్థలం రాజమండ్రి సమీప గ్రామమైన కడియం. 1870లో జన్మించిన ఆయన తనకు సుమారు 10 సంవత్సరముల వయసు వచ్చేవరకూ అక్కడే ఉన్నాఆ తరువాత వారి మకాం అప్పట్లో ఫ్రెంచి ప్రభుత్వాధీనంలో ఉన్నయానాంకు మారింది. కడియం లోనూ యానాం లోనూ అక్షరాలూ బడిచదువూ ఫ్రెంచి భాషా కొద్దిపాటి సంగీతమూ నేర్చుకున్నారు. యానాంలో ఉన్నప్పుడే అక్కడి వేంకటేశ్వర స్వామి మీద శతకం వ్రాసేరు. దానిలో కొన్ని వ్యాకరణ దోషాలు పెద్దలు చూపించడంతో కడియెద్ద గ్రామంలో ఉంటున్న శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారి వద్ద వ్యాకరణం నేర్చుకుందికి వెళ్లారు.అప్పటికి ఆయనకు 18 ఏళ్లు. అక్కడ అప్పటికే కొద్ది మాసాల క్రితం నుంచీ వ్యాకరణం నేర్చుకుంటున్న శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఆ విధంగా వీరికి సతీర్థులయ్యేరు.  బ్రహ్మయ్య శాస్త్రుల వారి శిష్యరికం చేస్తున్నా చెళ్లపిళ్ల వారికి కాశీ వెళ్లి అక్కడ ఉండి వ్యాకరణం నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. దీనికి ఆ రోజుల్లో వ్యాకరణానికి కాశీ,తర్కానికి నవద్వీపమూ,మీమాంసకు దక్షిణ దేశమూ,వేదానికి మన కృష్ణా గోదావరీ తీరమూ ప్రఖ్యాతి పొంది ఉండడము ఒక కారణం.ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రాల్లో చదువులకి విదేశాలకి వెళ్లిరావడం ఎలాగ గొప్పో అలాగ ఆ రోజుల్లో కాశీలో చదువుకుని వచ్చి మనదగ్గర ఉన్న పండితుల దగ్గర వ్యాకరణం నేర్చుకునే అవకాశం ఉన్నా,కాశీ వెళ్లి అక్కడ చదువుకుని రావడం చాలా గొప్ప. అక్కడ నేర్చుకున్నదాని కన్నా అక్కడ ఎన్నాళ్లు ఉండివచ్చేరన్న దానికే ప్రాముఖ్యత నిచ్చే వారట. కానీ తాను కాశీ వెళ్లడానికి ఇంతకంటె చిత్రమైన కారణం ఒకటి శాస్త్రిగారు చెప్పారు. యానాం లోఉంటూ ఉండగా పట్న వాసం వల్ల తాంబూల చర్వణం అలవాటయిందనీ కడియెద్దలో గురువు గారి సమక్షంలో ఈ అభ్యాసానికి వీలు కుదరక కాశీ వెళ్లడానికి నిర్ణయించుకున్నాననీ వ్రాసేరు. అలా కాశీ వెళ్లడానికి ముహూర్తం పెట్టుకుంటే దైవం వేరొకలా తలచి చిత్రంగా ఆ ముహూర్తానికే శాస్త్రిగారికి వివాహమవడం తటస్థించింది. శాస్త్రిగారు ఆ వివాహానికి అంగీకరించడానికి కారణం అప్పటికా పెళ్లి కూతురికి 5 సంవత్సరాల వయసే ఉండడం. అందువలన వివాహం చేసుకుని తాను కాశీలో పది పన్నెండేళ్లు విద్యాభ్యాసం చేసి వచ్చినా ఇబ్బంది ఉండదనుకున్నారు.అలాగే వివాహానంతరం కొద్దిరోజులకే కాశీ ప్రయాణ సన్నాహం మొదలెట్టారు. కానీ ఆరోజుల్లో బెజవాడనుంచి కాశీకి రైలు ఉన్నాటికట్టుకు కావలసిన రూ.18 కూడా శాస్త్రిగారి వద్ద లేవు. అందుకోసం తొలిసారిగా నిడమర్రు గ్రామంలో అష్టావధానం చేసి తనకీ తనతో కాశీ వస్తున్న తన మిత్రునికీ కావలసిన పైకం సమకూర్చుకున్నారు. ఈ తొలి అష్టావధాన మంటే ఎనిమిది మందినీ ఒకరి తర్వాత ఒకరిని కూర్చో పెట్టుకుని వారికి కావలసిన పద్యాలు చెప్పడమే. ఆ రోజుల్లో అక్కడ అష్టావధాన ప్రక్రియగురించి ఇంకా ఎవరికీ తెలియని రోజులు గనుక  అలా చెల్లిపోయిందంటారు శాస్త్రిగారు. అలా ధనం సమకూర్చుకుని కాశీ వెళ్లి నోరి సుబ్రహ్మణ్య శాస్త్రులవారి వద్ద వ్యాకరణం నేర్చుకుందికి చేరారు. అయితే కాశీలో విద్యాభ్యాసం సరిగా సాగదనీ అనభ్యాసాలే ఎక్కువనీ అంటారు. కాకపోతే శాస్త్రిగారి తాంబూలాధ్యయనానికి కొదవ లేకుండా సాగిందట. అక్కడ తాంబూలమంటే సున్నం పొగాకుతో కలిసి నూరినదే. అది కాక అక్కడ వారూ వీరూ అనకుండా అందరూ భంగు సేవించేవారు కనుక శాస్త్రిగారుకూడా సేవించడం దానివల్ల తిప్పలు పడడం జరిగిందట. ఆ రోజుల్లో కాశీలో స్థిరనివాసమేర్పరచుకున్నవారిలో శ్రీ గంగాధర శాస్త్రుల వారు,శివకుమార పండిట్జీ,కల్లాట సీతారామ శాస్త్రులు,దామోదర శాస్త్రులు ద్రావిడ సుబ్రహ్మణ్య శాస్త్రులు,దండిభొట్ల విశ్వనాధం గారు మున్నగు ప్రముఖులు ఉండేవారు.( వీరిలో దండి భొట్ల విశ్వనాధం గారి గురించిన ముచ్చట్లు దండి భొట్ల వారి దర్జా అనే నా పోస్టులో చూడగలరు). కాశీలో కొన్నాళ్లున్నా,తల్లిదండ్రుల కోరికపై శాస్త్రిగారికి కాశీని విడిచి పెట్టిరాక తప్పలేదు.తిరిగి వచ్చేక మళ్లా బ్రహ్మయ్య శాస్త్రుల వారి వద్దనే వ్యాకరణం నేర్చుకోవడం,అప్పుడే శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు వారికి సహాధ్యాయులవడం,వారి మధ్య మైత్రి చేకూరడం జరిగాయి.
( ఇక్కడ గురువు గారే వీరికి వేంకట శాస్త్రి అని నామకరణం చేశారట.అంతకు ముందు ఆయన అసలు పేరు వెంకటాచలం.యానాంలో ఫ్రెంచి మాస్టరు అతనిని యెంకతాసెలం అనిపిలిచేవారట )
వీరు శ్రీ తిరుపతి శాస్త్రి గారితో కలిసి చేసిన తొలి సంపూర్ణ శతావధానం కాకినాడలో దిగ్విజయంగా జరిగింది.అప్పటికి వారికి 25 ఏళ్ల లోపే.ఆ తరువాత శ్రీ తిరుపతి శాస్త్రిగారు కాకినాడలో పోలవరపు జమీందారు గారి ఆశ్రయంలో ఉండడం వల్ల వీరిద్దిరీకీ కలిసి అవధానాలు చేసే వీలు చిక్కకపోవడం కారణంగా శ్రీ చెళ్లపిళ్లవారు ఒక్కరే ఎన్నో చోట్ల దిగ్విజయంగా అవధానాలు చేస్తూ వచ్చారు. అలా మూడేళ్లు గడిచాక శ్రీ శాస్త్రిగారు కూడా బందరు పాఠ శాల ఉద్యోగంలో చేరడంతో మరో మూడేళ్లపాటు ఇద్దరూ కలిసి అవధానాలు చేసే అవకాశాలు కలిసి రాలేదు. అలా ఆరేళ్ల పాటు ఉన్నారు. ఈ సమయం లో కలిసి అవధానాలు చేయక పోయినా,వేరు వేరు ఊళ్లలో ఉంటున్నా, వారి రచనలు మాత్రం ఎవరు చేసినా తమ జంట పేరుతోనే ప్రచురిస్తూ వచ్చేరు. బాల రామాయణం,ముద్రా రాక్షస, మృఛ్ఛకటిక విక్రమాంకదేవ చరిత్ర,చంద్ర ప్రభ చరిత్రల ఆంధ్రానువాదాలు తిరుపతి శాస్త్రి గారు తన ఒంటి చేతిమీదే చేసినా,అవి తిరుపతి వేంకట కవుల పేరిటనే ప్రచురింప బడ్డాయి.
వీరి రచనా విధానాన్ని గూర్చి వీరే ఇలా చెప్పుకున్నారు:
“ ఇరువురు గూడియే రచన యెప్పుడు చేయుదు రొక్కవేళ నొ
క్కరొకటి యొక్కరింకొకటి కై కొని చేయుదురందు హెచ్చు త
గ్గొరులకు గానరాక, యది యొక్కరు చేసిన భంగినుండు,నొ
క్కరు రచియించిరేనియును కాదగు తిర్పతి వేంకటీయమై”
వీరిద్దిరూ కలిసి చేసిన సాహిత్యకృషి అపారం. పోయినవి పోగా వీరు ప్రచురించిన నాటకాలు ప్రహసనాలూ అనువాదాలు పద్యకావ్యాలూ ప్రబంధాలూ కావ్యఖండికలూ వచన రచనలూ శతకాలూ స్తోత్రాలూ మరెన్నో సంస్కృత గ్రంధాలూ లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీరి రచనల్లో శ్రవణానందం వీరికి అనుకోని పేరు తెచ్చిపెట్టిందంటారు శ్రీ శాస్త్రి గారు.
ఇది సహృదయుల చేత-
“ క. ఒక శ్రవణానందమ్మున
నొక పద్యమునందుఁ గలుగు నొక పాదమునం
దొక యక్కరమున కిచ్చిన
 సకలంబగు రత్న గర్భ చాలునె తూఁపన్.” అన్నంత పొగడికను పొందిందట.
అయితే వారికి మాత్రం వారి పాణిగ్రహీత దానికంటె బాగుంటుందనే అబిప్రాయం ఉండేది.
వీరి కావ్యరచన ఒక ఎత్తయితే వీరు నాడు ఆంధ్రదేశ సంచారం చేసి ఎందరో సంస్థానాధీశులను దర్శించి వారి మెప్పువడసే లాగున కవిత్వం చెప్పడం అనేక సన్మానాలు పొందడం ఇంకొక ఎత్తు. వీరి నానా రాజ సందర్శనం గ్రంధంలో ఈ వివరాలూ వారు చెప్పిన పద్యాలూ చూడవచ్చు. తెలుగు సంస్కృత భాషలలో కవిత్వంలో తమకెదురు లేదన్నధీమాతో వారు చెప్పిన పద్యాలలో
“ ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము” అనేదీ.. “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మటంచు దెల్పగా” అనేదీ చాలా సుప్రసిధ్ధమైనవి.
అవధానాలకు వీరే ఆద్యులు కాకపోయినా,మన తెలుగు భాషకే ప్రత్యేకమైన శతావధాన అష్టావధానాలను అతి నైపుణ్యంతో నిర్వహించి వాటికి తెలుగునాట విశేష ప్రాచుర్యాన్నికలిగించి తమలాగ ఎందరో అవధానులు తయారవడానికి దోహద పడ్డారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఇద్దరూ కలసి రచనలు చేసినట్లే అవధానాలనుకూడా ఇద్దరూ కలిసి నిర్వహించేవారు. తమ అవధాన రచన గురించి
 “ ఒక చరణంబతండు మఱియొక్కటినేను మఱొక్కడాతడున్
 సకల కవీంద్ర సంతతులు సమ్మతిచే దలలూచి మెచ్చగా
బ్రకటత రాశుధార దనరన్ రచియింపగ నేర్తుమయ్య”
అని వారే చెప్పుకున్నారు.
వీరిద్దరూ కవిత్వంలోనూ పాండిత్యంలోనూ ఒకరికొకరు తీసిపోని వారైనా,చెళ్లపిళ్లవారు మహా గడుసువారు. మహాలౌకిక ప్రజ్ఞాదురంధరులు. సభారంజకత్వం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన పద్యాలను చదివే తీరు జనాన్ని విశేషంగా ఆకట్టుకునేది.“శ్రీ వేంకట శాస్త్రి గారు పద్యము చదువుట యనగా శ్రోతలను ముగ్ధులను జేయుట. ఆ రాగము ఆ విఱుపు,ఆ ఉదాత్తానుదాత్తములు,వారి కంఠ మాధుర్యము,వారి మహా వ్యక్తిత్వము-ఇవి యన్నియు కలిసి శ్రోతలను తలక్రిందులు చేయుచుండెడివి” అంటారు వారి శిష్యులు శ్రీ విశ్వనాథ వారు.
అవధానాల్లో వారు తెలుగు పద్యాలనే కాక ఎన్నో లెక్కలేనన్ని సంస్కృత శ్లోకాలనూ చెప్పారు. అటువంటి అవధానాల్లోనే వారు ఆశువుగా చెప్పిన ఎన్నో పద్యాలు రసికులను మురిపించాయి. అవధానాలను వారు నల్లేరు పై బండి నడకలా నడిపించారు.
వీరి నాటకాలు మరీ ముఖ్యంగా పాండవ ఉద్యోగము పాండవ విజయము పేరిట వ్రాసినవి పాండవోద్యోగవిజయాలనే పేరుతో తెలుగు నాట ప్రదర్శింపబడని ఊరే లేదని ఘంటాపథమ్ముగా చెప్పవచ్చును. అదిగో ద్వారక.. బావా ఎప్పుడు వచ్చితీవు..ఆలము సేయనేనని యదార్థమె బల్కితిజుమ్మి.. జెండాపై కపిరాజు..చెల్లియె చెల్లకో తమకు సేసిన యెగ్గులు సైచిరందరున్.. చచ్చిరి సోదరుల్సుతులు చచ్చిరి..ఇలాంటివెన్నని చెప్పను.ఈ పద్యాలలో ఏ కొన్నైనా నోటికి రాని సాహితీ పిపాసులు ఓ యాభై ఏళ్లక్రితం వరకూ ఉండేవారు కారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
( సకృత్తుగానైనా ఈ నాడూ ఉన్నారు ).
చెళ్లపిళ్ల వారి శిష్యులూ కవిసామ్రాట్టూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతా ఐన శ్రీ విశ్వనాథ వారు వానలో తడియని వాడూ..తమ గురువుగారి సాహిత్యంతో తనియని వాడూ ఉండడని అన్నారు.
( అందుకే నేను నా పూర్వకవుల స్తుతిలో-
తిరుపతి వేంకట కవులును
కురిపించిరి తెలుగువారి గుండెలనిండా
సరసపు కవితా వర్షం
మురిపెముతో తడిసి వారు ముద్దై పోవన్--అని వ్రాసుకున్నాను.)
ఇంత చిన్న వ్యాసం లో ఆ మహానుభావుల సమగ్ర సాహితీ స్వరూపాన్ని రేఖా మాత్రంగానైనా దర్శింప జేయడం సాధ్యం కాదు. నాబోటివాడికి ఆ శక్తీ సమర్థతా కూడా లేవు. చెళ్లపిళ్లవారి జన్మదినాన వారినోసారి తలచుకోవడానికి చేసిన చిన్నిప్రయత్నం మాత్రమే ఇది. అయితే ముగించే ముందు ఒకటి రెండు మాటలు మాత్రం చెప్పదలచుకున్నాను.వీరిద్దరూ మహాపండితులై ఉండి కూడా వారి పాండిత్యప్రకర్షా ప్రకటన కోసం కాక సాహిత్యాన్నిజనంలోకి తీసుకెళ్లాలన్నతపనతో రచనలు చేసిన మహానుభావులు. కవికర్ణ రసాయనం లో సంకుసాల నృసింహ కవి చెప్పిన-
“... లోకుల రసనలే
ఆకులుగా నుండునట్టియవి వో కవితల్” అనీ
“ ఆ నీరసపుఁగావ్యశవముల
దూరమునన పరిహరింపుదురు నీతిజ్ఞుల్” అన్నదాన్నీ బలంగా నమ్మిన వారు.కనుకనే తాటాకు కట్టలమధ్య నలిగి కృశించి పోవలసిన పద్యాన్ని రసికుల రసనల మీద నాట్యం చేయించారు.
జన సామాన్యానికి అందుబాటులో ఉండేటట్టు వ్రాయాలనే సంకల్పంతో అవసరమనుకున్నచోట ఔచిత్యాన్నిబట్టి అన్యదేశ్యాలైన ఆంగ్ల పదాలను వాడడానికి కూడా వారు సంకోచించలేదు. వారు సాహితీ వ్యవసాయం ప్రారంభించిన తొలి నాళ్లలోనే చెప్పిన పద్యం చూడండి.
“ఉ. కాలముబట్టి దేశమునుగాంచి ప్రభుత్వమునెంచి దేశభా
షా లలితాంగి మాఱుటది సత్కవి సమ్మతమౌట నన్య దే
శ్యాలును దేశభాష కలవౌటను నౌచితిబట్టి మేము క
బ్బాలను వాడుచుంటి మిది పండితులేగతి నొప్పకుందురో”
కాలంతో మారని వారు కాలగర్భాన కలసిపోక తప్పదు. కావ్యాలైనా అంతే.తిరుపతి వేంకట కవులు ఛాందస పథాన్ని వీడి,పండితుల గాఢపరిష్వంగంలో బందీ అయిన తెలుగు పద్యాన్ని విడిపించి పల్లెటూరి పసుల కాపరి నోటంట కూడా పలికింపజేసారు. (They democratized the telugu poem). అందుచేతనే-                                                            
తెలుగునాట పద్యం బ్రతికి ఉన్నన్నాళ్లూ ఈ జంటకవుల జయకేతనం ఎగురుతూనే ఉంటుంది. స్వస్తి.

28, జులై 2012, శనివారం

పశ్చాత్తాపం,,బహు దొడ్డగుణం.. అవునా ? కాదా?


పశ్చాత్తాపం.. బహుదొడ్డగుణం..
తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తాము. అది మానవ సహజం. కాని చేసిన తప్పును ఒప్పుకోగలిగే దొడ్డగుణం ఏ కొద్దిమందికో ఉంటుంది. ఈ దొడ్డగుణం ఎంతో చదువుకుని సంస్కారవంతులైన వారిలోనే ఉంటుందను కోవడం పొరపాటు. చదువు సంస్కారానికీ ఈ సహజగుణానికీ ఏ సంబంధం లేదు. నిజంగా ఈ గుణం అందరిలో ఉంటే మనకిన్ని లక్షల కేసులూ ఉండేవికాదు. ఇన్ని వేల న్యాయస్థానాలూ అక్కర లేదు. ఈ విషయం గురించి ఇంకా విపులీకరించాలని ఉంది గాని ఇక్కడ స్థలం చాలదు. అందుచేత ఒక మంచి కథ మాత్రం మీకు తెలియజేస్తాను.
మెడోస్ టైలర్ సురపురం సంస్థానంలో నిజాం రాజ్య ప్రతినిదిగా ఉన్నప్పుడు 1856 లో జరిగినదిది.  రాజ ప్రతినిధి గా ఆయన న్యాయవిచారణను కూడా చేపట్టాల్సి వచ్చేది. అప్పుడు విచారణకు వచ్చిన ఒక కేసు ఇది :
ఒక భాగ్యవంతుడైన గొర్ల కాపరి ఉండేవాడు. అతడు వ్యవసాయం కూడా చేసేవాడు. అతడికిద్దరు భార్యలు. పెద్దామెకు వయసు మళ్ళినా పిల్లలు లేకపోవడంతో మరో పెళ్ళి చేసుకున్నాడు. చిన్నామె వయసులో ఉన్నది. సవతులిద్దరికీ పడకపోవడంతో వారిద్దరీనీ ప్రక్క ప్రక్కనే వేరు వేరు ఊళ్లలో ఉంచాడు. ఒక రోజు ఉదయమే అతడి చెరుకు తోటలో అతడు శవమై పడిఉన్నాడు. తల చిట్లి పోయి ఉంది. రాతితో మోది ఎవరో అతడిని రాత్రే చంపివేసారు. ముందు రోజు సాయంత్రం అతడింట్లో ఒక విందు జరిగింది. అతడి మేనల్లుడే మేకను కోశాడు. అతడు చక్కగా భోజనం చేసి పెద్దభార్యతో సరస సల్లాపాలాడి చెరుకుతోటకు వెళ్లి కాపలా పడుకున్నాడు. రాత్రి హత్య జరిగింది. ఇది అతని పెద్ద భార్య అతని మేనల్లుల పనే నని పంచాయతీ దారులు తలచి విచారణ ప్రారంభించేరు. మేనల్లుని భార్య,తన భర్త ఆరాత్రి ఇంట్లో లేడని చెప్పింది. తెల్లవారు ఝామున వచ్చి తన కంబళి ఆమెకు కప్పి పుట్టింటికి పోదాం రమ్మన్నాడట.ఆకంబళి పై రక్తం అంటి ఉన్నది. కానీ చీకట్లో ఆమె చూడలేదు. ఉదయమే పోలీసులు వచ్చి కంబళిని పట్టుకున్నారు.ఆ కంబళిని రక్త పరీక్షకై హైదరాబాదు పంపేరు కానీ అది మనిషి రక్తమో మేక రక్తమో అక్కడ నిర్ధారించలేక పోయేరు .మేనల్లుడేమో అది తను ముందు రోజు కోసిన మేక రక్తమే నంటాడు. వారి తరపు న్యాయవాది ఎంతో దక్షతతో తన క్లయింట్లు నిర్దోషులని వాదించేడు. టైలర్ సాబ్ కి వారే హత్య చేసి ఉంటారని ఎంతో నమ్మకంగా అనిపించినా సాక్ష్యం లేక పోవడం వల్ల వారిని నిర్దోషులుగా తీర్పు వ్రాయడానికి కలం పట్టేడు. ఇంతలో ఆ రైతు పెద్ద భార్య “ ఆగండి స్వామీ! ఆగండి తీర్పు వ్రాయకండి!! మీకు నిజం తెలియదు. తెలియక పోతే తప్పు తీర్పే ఇస్తారు. సాక్షులు చెప్పింది అబధ్ధం. మా న్యాయవాది వాదనా అబధ్ధమే. నేనే హత్య చేశాను. అతడి మేనల్లుడు తోడ్పడ్డాడు. ఇద్దరం కలిసి తల చితక కొట్టాము ”. అంది.
టైలర్ ఆమెతో అలా మాట్లాడితే ఆమెకు ఉరిశిక్ష పడుతుందనీ ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించినా ఆమె “ చెప్పిందంతా నిజమే స్వామీ!” అంది. మేనల్లుడు కూడా “ నేనే అతడి ఆస్థికి వారసుడనౌతాను కదా? మరి చిన్నామెకు బిడ్డలు పుడితే వారికి ఆస్థంతా రాసిస్తాడట. ఎలా ఒప్పకోమంటారు స్వామీ? నా గుండె మండి పోతోంది. ఇప్పుడైనా ఎప్పటికైనా అతడిని చంపే ఉండేవారము” అన్నాడు. ఆమె “ మేం చెప్పినదంతా వ్రాసుకుని ఉరిశిక్ష వేయించండి స్వామీ” అంది.  టైలర్ వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చి ఆమోదం కోసం కలకత్తా లోని సదర్ అదాలత్     ( ప్రధాన న్యాయస్థానం ) కి పంపాడు. ఆమోదం వచ్చాక వారిద్దరూ ఉరితీయబడ్డారు.
                                           ****
ఈ విషయం తన జీవిత చరిత్ర లో వ్రాస్తూ టైలర్ “ న్యాయస్థానంలో తీర్పు వ్రాయవద్దు అంటూ ఆమె వేసిన కేక,ఆతర్వాత ఆమె చెప్పుకున్న ఒప్పుకోలూ నా బుర్రలో చాలా కాలం ప్రతిధ్వనిస్తూనే ఉండిపోయాయి” అంటూ వ్రాసుకున్నాడు.
                                         *****
తమ మీద కేసు నిర్ధారింపబడే సాక్ష్యాలు లేకున్నా. శిక్ష నుండి తప్పించుకునే అవకాశం కళ్ళముందు కనపడుతున్నా,ఉరిశిక్షకు సిధ్ధపడి నిజాన్ని నిర్భయంగా అంగీకరించగలగడం మహా దొడ్డగుణం కాదంటారా?
                                                      ***
( టైలర్ జీవిత చరిత్రనీ అందులోని మరికొన్ని ముచ్చట్లనీ ఇంతకు ముందు "నేను చదివిన ఒక మంచి పుస్తకం..." అనే పోస్టులో పరిచయం చేసాను. కుతూహలం ఉన్నవారు చూడవచ్చు).సెలవు.

25, జులై 2012, బుధవారం

అత్త లేని కాపురం...అద్దె ఇల్లే అమరధామం..


                       

అత్తా లేనీ కోడాలుత్తమురాలూ...ఓయమ్మా..
కోడల్లేని అత్తా గుణవంతూరాలూ..మాయమ్మా..

ఈ పాట తెలియని తెలుగువారుండరు. అత్తా కోడళ్ళ పోరు అతి పురాతన మైనది.  పురాతన కాలంలో బాల్య వివాహాలే జరిగేవి. పురుషులకు వేరే ఉద్యోగాలు లేక పోవడంతో తల్లిదండ్రులతో ఉమ్మడి కుటుంబంలోనే ఉండవలసి వచ్చేది. బెరుకు బెరుకుగా అత్తారింటికి వచ్చిన ఆ లేత వయసు ఆడపిల్లలకు కాపురం కత్తిమీద సామే. అత్తలు పెట్టే ఆరళ్ళకు వారు ఎంత నలిగి పోయే వారో మనం ఊహించుకోలేం. ( ఏది ఏమయినా ఇది ఆడవారి సబ్జెక్టు. దీన్ని గురించి వారే సాధికారికంగా చెప్పగలరు ). అయితే మరి నువ్వెందుకయ్యా ఈవిషయం ఎత్తుకున్నావూ అంటే-  నేను చెప్పబోయే దానికీ దీనికీ చాలా చక్కటి సామ్యం ఉండబట్టే. అదే అద్దె ఇళ్ళ కాపురాల సంగతి. నూటికి ఎనభై మందికి ఏదో సమయంలో అద్దె ఇళ్లలో కాపురం ఉండక తప్పని సరి పరిస్థితులుంటాయి. ఇల్లంటూ లేని వారి సంగతలా ఉండగా,ఉన్న ఊళ్ళో మంచి ఇల్లు ఉన్న వారికైనా ఉద్యోగరీత్యానో మరో కారణం వల్లనో వేరే ఊళ్ళో ఉండాల్సి వస్తుంది కదా? అప్పుడు అద్దె యింటి నివాసం తప్పదుకదా?
మహానగరాల్లో మనకి నివాసయోగ్యంగా ఉన్నా లేకపోయినా ఏదో తల దాచుకుందికి ఒక గూడు కావాలి కనుక అద్దె ఎక్కువనిపించినా ఏదో ఒక ఇంట్లో ఉండడానికి సిధ్ధ పడిపోతాము. వారడిగినంత అడ్వాన్సూ ఇచ్చి వారు పెట్టిన సవాలక్ష కండిషన్లకూ తల ఒగ్గి ఆ ఇంట్లో చేరతాము. అయినా ఆ యింట్లో కంటి నిండా నిద్ర పోతూ ఏ దిగులూ లేకుండా ఉండగలమన్న హామీ ఏ మాత్రం లేదు. ఎప్పుడు అద్దె పెంచమంటారో లేక పోతే ఎప్పుడు ఖాళీ చేయమంటారో అని బితుకు బితుకు మంటూ ఇంటాయనను మంచి మూడ్ లో ఉంచడానికి శాయశక్తులా కృషి చేస్తూ వారు ఏం అన్నా అదే కరెక్టు అంటూ వంత పలుకుతూ వారి కుళ్ళు జోకులకు కూడా పగలబడి నవ్వుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది. మగ వారి భయాలూ బాధలూ ఇలా ఉంటే ఆడవారి బాధలు మరోరకంగా ఉంటాయి. పొద్దున లేచి వీధిలో ముగ్గు ఎవరి పని మనిషి వెయ్యాలన్న దగ్గరనుంచి కుళాయి నీళ్లు వాళ్లు పట్టుకున్న తర్వాతే అద్దెకున్న వారు పట్టుకోవాలన్నంత వరకూ ఉంటాయి. ఇవి ఇక్కడితోనే ఆగవు. అద్దెకున్న వారు కాపురం ఎలా చేసుకోవాలో ఇంటి యజమానురాలు నిర్ణ యించడం వరకూ సాగుతుంది. అద్దెకున్న అమ్మాయికి అత్తగారి పోరు లేని లోటును ఇంటావిడ భర్తీ చేస్తుంటుంది. ( ఇంటియజమానులు దగ్గర లేని యింట్లో అద్దెకుండడం అంటే అత్త లేని ( వేరింటి కాపురం) కాపురం అంత సుఖమైనది ). ఈ రంజైన కధలన్నీ ఏ అద్దెయింటి అభాగ్యురాలినడిగినా చెబ్తుంది కనుక నేను వాటిని గురించి చెప్పబోవడం లేదు. నూటికో కోటికో కోడల్ని తల్లి లాగా చూసుకునే అత్తగార్లున్నట్లే అద్దెకున్న వారిని తలమీద పెట్టుకుని పూజించిన వారు కూడా సకృత్తుగానైనా లేకపోలేదు. అటువంటి మంచి వారి కథే నేనిప్పుడు చెప్పబోయేది. ఇది చాల పాత ముచ్చటైనా విని తీర వలసినదే.

1942 లో రెండవ ప్రపంచ సంగ్రామం రోజులలో విశాఖ పట్టణం మీద బాంబులు పడతాయన్న భయంతో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా అంటూ కొన్నేళ్లపాటు గుంటూరుకు మార్చేరు. మార్చడమైతే మార్చారు గాని యూనివర్శిటీకి గాని దాని ఉద్యోగులకు గాని సరైన వసతి ఎక్కడ దొరుకుతుంది? యూనివర్శిటీని ఎలాగో అక్కడా ఇక్కడా  తలోమూలా సర్దేరు. ఉద్యోగులు మాత్రం ఇళ్ల కోసం నానా యాతనా పడ్డారు. ఇదిగో ఇటువంటి చిక్కుల్లో పడ్డ దువ్వూరి వారికి గుంటూరులో బస ఎలాగురా అనుకుంటుండగా వారికి కొద్దిగా స్నేహమూ దూరపు బంధుత్వమూ ఉన్న సూర్య నారాయణ గారనే ఆయన తటస్థ పడి “ మీరు కాలేజీలు తెరిచే సమయానికి తట్టా బుట్టా పిల్లా జెల్లాతో సహా గుంటూరు వచ్చెయ్యండి. నేను మీకు బస ఏర్పాటు చేసి ఉంచుతా”నన్నారు. మహదానందభరితుడైన శాస్త్రిగారు సెలవులాఖర్న అలాగే గుంటూరులో సూర్యనారాయణ గారి యిల్లుచేరుకున్నారు. సూ.నా. గారు తాను మాట్లాడి పెట్టిన ఇల్లు ఎదురుగా కడుతున్నమేడేననీ ఇంకా పనులు పూర్తి కానందున కొన్నాళ్లు తమ యింట్లోనే సర్దుకోమనీ ఒక వసారా ఖాళీగా ఉన్నది చూపించేరు. చేసేది లేక శాస్త్రిగారు అందులోనే సర్దుకుంటూ కాలక్షేపం చేస్తూ నెలలు గడిచిపోతుండడం చూసి సూ.నా.గారింట్లో ఊరికే ఉండడం ఇష్టం లేక అద్దెమాట ఎంతో చెప్పమంటే సూర్యనారాయణ గారు నెలకు ఓ పది రూపాయలిచ్చేద్దురూ అన్నారుట. ఆ వసారాకి అక్కడ నాలుగు రూపాయలు కూడా యివ్వరని తెలిసినా గతి లేక శాస్త్రిగారు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఒకరోజు సూ.నా.గారు శాస్త్రిగారితో ఎదురింటి కోమటాయన శాస్త్రిగారికి  తమ యిల్లు అద్దెకు ఇవ్వమన్నారనీ వాళ్ల బంధువులకెవరికో ఇచ్చుకుంటామంటున్నారనీ చెప్పారు. అప్పటికి వారు ఆ వూరు వచ్చి దాదాపు 8 నెలలు అయింది. హతాశులైన శాస్త్రిగారు ఎలాగురా భగవంతుడా అనుకుంటుంటే ఒక రోజు రోడ్డు మీద కలిసిన ఎదురింటి షావుకారి గారితో “మాకు అద్దెకు ఇల్లివ్వమన్నారుట కదా” అనగానే అతడు  “ఎంతమాటండీ బాబుగారూ మీలాంటివారు మాయింట్లోకి అద్దెకు రావడం మా అదృష్టంగా భావిస్తాము. మీరే రానని అన్నారని సూర్యనారాయణ గారు నాతో చెప్పారు. మాయింట్లో కింద నాలుగు గదుల పోర్షన్లు రెండున్నాయి. మీరు దేనిలోనైనా ఈ రోజే చేరవచ్చు. మేము మేడమీద నున్న రెండు గదుల్లో ఉంటాము. అద్దె మీరు ఇప్పుడిస్తున్నంతే ఇవ్వవచ్చు. మీ పక్కపోర్షనులో మీకు ఇష్టమైన వారిని మీరే అద్దెకు కుదుర్చుకోండి. అద్దె మీరే నిర్ణయించండి. అంతా మీఇష్టం” అన్నారుట.. ఆ మాటలు వినగానే శాస్త్రిగారికి సూ.నా.గారి కుతంత్రం అర్థమైపోయింది. వెంటనే వారిల్లు ఖాళీ చేసి ఎదురుగానే ఉన్న వెంకటప్పయ్యగారింట్లో చేరి పోయారు. .వెంకటప్పయ్యగారు తమ కోసం చేయించుకున్న కుర్చీలు బల్లలూ కూడా శాస్త్రిగారి వాటాలోనే వేయించి వారినే వాడుకోమన్నారు.
ఆ విధంగా శాస్త్రిగారు ఆ యింట్లో అద్దెకు చేరి సుఖంగా ఉంటూ ఉండగా-
ఒక రోజు శాస్త్రిగారు ఉదయమే ఏదో చదువుకుంటున్నారు. అంతలో వారి ఇంటాయన రెండు మేకులూ సుత్తీ చేత్తో పట్టుకుని కిందకు దిగి వచ్చి “చూసేరా బాబు గారూ,నేనిది 20 వేలు పోసి కట్టించుకున్న ఇల్లు. నేనేదో నా గదిలో చొక్కాలు తగిలించుకుందామని రెండు మేకులు కొట్టుకో బోతే మా ఆవిడ వచ్చి “ కింద బాబుగారున్నారని జ్ఞాపకం లేదా అంది. సరే నేనేదో మెల్లిగా చప్పుడు చేయకుండా మేకులు కొట్టుకుంటానంటే తానే మళ్లా వచ్చి  బాబు గారెప్పుడైనా మేడమీదకి వచ్చి చూసినప్పుడు గోడల మీద అసహ్యంగా ఈ మేకులేమిటి అని కోప్పడరా.. ఆపండి మీ పని.. అంటూ నా మీద కేకలేస్తోందండీ. మీరంటే నాకెంత గౌరవమో అనుకుంటుండే వాడిని. మాఆవిడ కింకెంత గౌరవమో అని తెలిసి మీతో చెప్పి పోదామని వచ్చాను. మీ పనికి ఆటంకం కలిగించి ఉంటే క్షమించండి” అంటూ మేడమీదకి వెళ్లి పోయాడు.
ఆ విధంగా శాస్త్రి గారు ఆ ఉళ్లో ఉన్న నాలుగేళ్లూ తామే ఇంటి వారమైనట్లూ వెంకటప్పయ్య గారే తమ ఇంట్లో అద్దె కుంటున్నారన్నంత హాయిగా గడిపి 1946 లో యూనివర్సిటీ విశాఖపట్టణం మళ్ళా తరలి పోగా తాము ఇల్లుఖాళీ చేసి వెళ్ళి పోతున్నప్పుడు వారికి వెంకటప్పయ్యగారు మద్రాసు నుంచి తెప్పించిన చేతికర్రను బహూకరించి. వారి ఇంటిల్లి పాదీ స్టేషనుకు వచ్చి వీడ్కోలు పలికారు.
                                                        ****
శాస్త్రిగారు ఆవిధంగా గుంటూరు విడిచి పెట్టిన పదేళ్లకు మళ్లా హిందూ కాలేజీ వార్షికోత్సవాలకి ఆ కాలేజీ వారి ఆహ్వానం పై  ఆ వూరు వెళ్ళవలసి వచ్చింది. పాత స్నేహం మరిచిపోలేక శాస్త్రిగారు తాను ఫలానా రోజున గుంటూరు వస్తున్నాననీ ఫలానా నీలకంఠ శాస్త్రిగారింట బస చేస్తాననీ మరునాడు కాలేజీలో ఫంక్షననీ వీలు చూసుకుని ఒక సారి వెంకటప్పయ్యగారింటికి వచ్చి వారినందరినీ చూస్తాననీ వారికి కూడా ఒక కార్డు వ్రాసేరు.
అనుకున్న రోజుకి దువ్వూరి వారు నీలకంఠ శాస్త్రిగారింటికి సాయంత్రం చేరుకునే సరికి వెంకటప్పయ్యగారు వచ్చికూర్చుని శాస్త్రిగారికి మరునాడు వీలు పడుతుందో పడదో అనీ అప్పుడే తమయింటికి రావాలని ప్రాధేయపడి తీసుకువెళ్లారు. అక్కడ కాసేపు గడిపిన తరువాత నీలకంఠం గారు ఇక వెళ్దామా అంటుంటే వెంకటప్పయ్యగారింట్లో కింద వాటాలో అద్దెకున్న బామ్మగారు,వెంకటప్పయ్య గారి భార్య తనను శాస్త్రిగారి కోసం వంట చేయమని కోరగా తాను చేస్తున్నాననీ భోజనం చేసి వెళ్లమనీ అనగా నీలకంఠం గారు శాస్త్రిగారి భోజనం తమ యింట్లోనేననీ వారిని  బలవంతం చేయవద్దనీ అన్నారు. వెంకటప్పయ్యగారి పెద్దమ్మాయి పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె,శాస్త్రిగారు ఆరోజు తమ యింటికి వస్తున్నారని తెలిసి  వారిని చూడ్డానికి ఆవూళ్లోనే ఉన్న తమ అత్తవారింటినుంచి  పుట్టింటికి వచ్చి ఉంది. ఆమె,శాస్త్రులు గార్లు అది సమయం కాదు వద్దంటున్నా పెద్ద కంచు గ్లాసుల నిండా టీ చేసుకుని తీసుకు వచ్చిఇస్తే నీలకఠం గారు పుచ్చుకోలేదు. కాని “ నాకోసం తాగవా నాన్నా” అంటూ ఆమె కోరితే శాస్త్రిగారు కాదన కుండా ఆ టీ అంతా తాగేరు. నాన్నగారు నామాట మన్నించారని కన్నీరు పెట్టకుంటూ ఆమె శాస్త్రిగారి పాదాలు పట్టుకుంది. ఆ ప్రేమకు ఆపుకోలేని కన్నీళ్ళు ధారాపాతంగా కురుస్తుండగా శాస్త్రిగారు ఆమెను లేవదీసి తన కుర్చీలోనే కూర్చోపెట్టుకున్నారు. ఆ తరువాత ఆమె చిన్నప్పుడు ఆమే వారి నాన్నగారూ కలిసి నీళ్లు పోసి కష్టపడి పూలమొక్కలను పెంచుకుంటున్నా శాస్త్రిగారు రోజు కొక్కపువ్వు తప్ప మిగిలినవి కోసుకోనిచ్చే వారు కారనీ అలాంటి ఎన్నో విషయాలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. జన్మాంతర బంధమేదో ఉండక పోతే అటువంటి అత్మీయత కుదరదనుకుంటూ శాస్త్రిగారు వారి నుంచి సెలవు తీసుకున్నారు.
                                                                  ****
తనకు 70 ఏళ్లు దాటిన తర్వాత జీవిత చరిత్ర వ్రాసుకున్న దువ్వూరి వేంకట రమణ శాస్త్రులవారు అంతకుముందెప్పుడో 30 ఏళ్ల క్రిందట తాము అద్దెకున్న యింటి యజమాని కుటుంబం చూపించిన గౌరవాన్ని ఆప్యాయతానురాగాల గురించి వారి మంచితనాన్నిగురించి ప్రత్యేకంగా ఎంతో విపులంగా వ్రాసుకున్నారంటే,వెంకటప్పయ్యగారూ వారి కుటుంబం తమ ఇంట్లో కొద్దికాలం మాత్రం అద్దెకున్న వారి మీద చూపించిన గౌరవాభిమానాలూ ప్రేమా ఎంత గొప్పవో మరి?( నేనిది మీకు చాలాక్లుప్తంగా చెప్పేను కాని శాస్త్రిగారు ఇంకా చాలావివరంగా వ్రాసుకున్నారు )
                                    ****
లోకంలో అతికొద్దిమందైనా కానీండి,మంచి అత్తలూ మంచి ఇంటి యజమానులూ కూడా ఉంటారు. కాకపోతే వారి కథలు వినిపించేవారు కావాలి. అంతే!
సెలవు. 
                                   ***
     

22, జులై 2012, ఆదివారం

పిలుపుల్లో ఆత్మీయత..


                       

ఇంతకుముందు పిలుపులూ..మానవ సంబంధాలూ.. అనే నా పోస్టులో పిలుపుల తీరు తెన్నుల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పేను. మరికొన్నిటి నిప్పుడు ముచ్చటించుకుందాం.
మా యింట్లో మా తాతగారిని వారి సంతానం అందరూ బాబూ అనే పిల్చే వారని చెప్పేను. ఈ బాబు అది తెలుగు పదమేనని దానికి తండ్రి పూజ్యుడు అనే అర్థాలున్నాయని విద్యార్థి కల్ప తరువు చెబుతుంటే,శరన్నిఘంటువు మాత్రం పూజ్యుడు అనే అర్థాన్నిమాత్రమే ఇచ్చి ఇది వైకృత పదమంటుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు మాత్రం ఇది హిందీ పదం బాప్ నించి వచ్చిందనీ దీనికి తండ్రి పూజ్యుడు అనే అర్థాలే కాకుండా పిన తండ్రి అనే అర్థం కూడా ఉందంటుంది. ఇది ఏ సంస్కృత ప్రాకృత మూలాల్లోనుంచి వచ్చిందో కాని  హిందీ లో బాప్ బాపూ బప్పా పప్పా పాపా రూపాలనూ ఒరియాలో బొప్పా అనీ మన తెలుగులో బాబు అనే రూపాలనూ సంతరించుకుంది. గౌరవ వాచకం గానే పెద్దవారిని బాబు అనీ బాబుగారనీ వ్యవహరించడం ఉంది. ఉత్తరాదిని కూడా ఇలాగే గౌరవ వాచకం గానే దీనిని వ్యక్తినామాలకు చేర్చేవారు. (ఉదా. బాబూ రాజేంద్ర ప్రసాద్,బాబూ జగజ్జీవన్ రామ్). అయితే తండ్రిని బాబూ అని పిలవడం నేను మాయింట్లోనే చూసేను . మరెక్కడా వినలేదు. ( ద్రావిళ్లలో ఈ ఆచారం ఉండేదేమో మరి. రాంభట్ల కృష్ణ మూర్తిగారు వారింట్లో ఇలాగే పిలిచే వారని వ్రాసేరు.). ఏమైనా ఈ పిలుపు మా తండ్రుల తరంతోనే సరి. మేమందరం తండ్రిని నాన్నఅనే పిల్చేవారం. మేం ఇతరులతో వ్యవహారంలో తండ్రిని మా నాన్నగారు అనే అన్నా ఆయనను పిలవడం మాత్రం నాన్నా అనే పిలుస్తూ మీరు అని సంబోధించేవారం. మాఅత్తవారి ఇంట్లో  తండ్రిని నాన్నా అనిపిలుస్తూ నువ్వు అని ఏకవచనంలోనే సంబోధించేవారు. .తరువాత ఎప్పుడో చాలా కాలానికి  కొందరి ఇళ్ళలో తండ్రిని నాన్నగారూ అని గౌరవ వాచకం చేర్చి పిలవడం చూసేను.  అంతమాత్రాన అలా పిలిచే వారికి తండ్రి అంటే ఎక్కువ గౌరవముండేదని చెప్పలేం. మేం అలా పిలవక పోయినా మానాన్న గారిపట్ల మాకు చాలా గౌరవం భయం కూడా ఉండేవి.,శిష్టేతర కుటుంబాల వారుమాత్రం తండ్రిని ఒరే నాన్నా అనో ఓరయ్యా (ఓరి+అయ్యా) అనో పిలిచే వారు.

మా యింట్లో అందరికంటె జ్యేష్టుడైన మా నాన్న గారిని వారి తమ్ములందరూ నాన్నాఅనే పిలిచే వారని చెప్పేను. “పితృ సమో జ్యేష్టః” అన్నారు కనుక తండ్రి తరువాత తండ్రి అంత వారు కాబట్టి జ్యేష్ట సోదరుని అలా పిలిచే అలవాటు అయి ఉంటుంది. ఏమయినా ఈ అలవాటు కూడా మాతండ్రుల తరంతోనే అంతరించింది. ఇక్కడొక తమాషాగా అనిపించే విషయం ఒకటి చెప్పాలి. అసలు “ అన్న” అంటేనే తండ్రి అని అర్థమట. ఆ తరువాత కాలగమనంలో తండ్రి తరువాత తండ్రి అంతటి వాడనే గౌరవంతో జ్యేష్ట సోదరుని కూడా అన్న అని వ్యవహరించడం మొదలైనదట. అలా మొదలైన తరువాత తండ్రి అని ప్రత్యేకంగా తెలియడానికి ( నా+అన్నః) నాన్న అని వ్యవహరించడం ప్రారంభమైందట. తండ్రి అనే అసలైన అర్థంలో తండ్రిని అన్నా అని పిలవడం విశాఖ జిల్లాలో చాలా కాలం క్రితం వరకూ మిగిలి ఉండేదట. మహా మహోపాధ్యాయ రాయుడు శాస్త్రిగారి ధర్మ పత్ని మహా పండితులైన పేరి కాశీనాథ శాస్త్రుల వారి కుమార్తె వారి నాన్న గారిని “ఒరే అన్నా” అనే పిలిచేదిట. అంతటి పండితుల వారి యింట అలా పిలుచుకునే వారంటే అది ఆ రోజుల్లో అత్యంత సహజమైనదై ఉండాలి. తండ్రిని కూడా ఒరే అని పిలవడం మనకీ రోజుల్లో కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ తండ్రీ కూతుళ్ల మధ్యనున్న స్నేహబంధానికి గుర్తుగా అలా పిలుచుకోవడం ఆరోజుల్లో నిరాక్షేపణీయమే కాకుండా పండితామోదం కూడా పొందినదనే భావించాలి. చిన్నయ సూరి  “ఓరి ఓసి మైత్రియందు గలవు” అని అంటాడుకదా?
ఇక్కడో చిన్న ముచ్చట. శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు విద్వాన్ పరీక్షకు చదువుకోవడానికి విజయనగరం వచ్చే సరికి వారికి 16 ఏళ్లు. అప్పట్లో ఆ ఊళ్ళో చొప్పల్లి భాగవతార్ గారి తండ్రిగారైన చొప్పల్లి నరసింహంగారు ఉండేవారు. అప్పుడాయన 50 ఏళ్ళ పెద్ద మనిషి. వారు కనిపించినప్పుడు శాస్త్రిగారు వారిని నరసింహంగారూ అని పలకరించేవారట. వారు కోప్పడుతూ “ ఒరే.. గారూ గీరూ ఏమిట్రా ఒరే నరసింహం అని పిలవలేవుట్రా” అనేవారట. అంత పెద్ద వారిని అలాగ పిలవడం ఇబ్బంది గానే ఉన్నా మెల్లగా వారినలాగ పిలవడానికి అలవాటు చేసుకున్నారుట శాస్త్రిగారు. ఆ పిలుపు మిత్రత్వానికి చిహ్నమనీ నరసింహంగారు శాస్త్రిగారి స్నేహాన్ని కోరుకునే వారనీ మనం అర్థం చేసుకోవాలి. కాలగమనంలో పదాలు కొత్త అర్థాలను సంతరించుకున్నట్టే పిలుపులు కూడా దేశకాల పరిస్థితుల్ని బట్టి మార్పులకు గురి అవుతూ ఉంటాయి. అందుకే ఒకనాటి పిలుపులు ఈనాడూ,ఒక ప్రాంతపు పిలుపులు మరో ప్రాంతం వారికీ వింతగా తోచడం జరుగుతుంది. ఎప్పుడైనా అప్పటి సంఘంలో వ్యవహారంలో ఉన్న దేనినీ మనం తప్పు పట్టాల్సిన పని లేదు.
మరికొన్ని ముచ్చట్లు మరోసారి ఎప్పుడైనా. సెలవు.
  



20, జులై 2012, శుక్రవారం

కర్షక వేదన--వ్యథార్త జీవన యథార్థ దృశ్యం



( అతివృష్టో అనావృష్టో ఏదో ఒకటి రైతన్నను ఎప్పుడూ బాధిస్తూనే ఉన్నది. నవంబరు 2010 లో కురిసిన అకాల వర్షాల కారణంగా పండిన పంటను నష్టపోయి పలువురు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. నేను ఈ గేయాన్ని 25.12.2010 న వ్రాసేను.)

 నాడు వర్షపు చినుకు లేకా
పొలము నంతా బీడు పెట్టీ
అప్పు జేసీ  సప్పుజేసీ
ఆకలిని దిగ మ్రింగుకుంటూ
రోజులెట్లో వెళ్లబుస్తూ
మంచి కాలం రాక పోదని
మరల సేద్యం చేయవచ్చని
ఆశవీడక ఎదురు చూసిన
రైతు కీయేడు  చక్కగ
అదను లోనావాన కురిసీ,
ఆశ లెన్నోమొలక లెత్తగ,
ఆడతిరిగీ ఈడతిరిగీ
వారినడిగీ వీరినడిగీ
అందినంతా అప్పుచేసీ
పదునుమీదే విత్తు జల్లేడే...
నారు పోసిన నాటినుండీ
పొలము నుండీ వెలికి పోవక
తిండి తిప్పల మాట మరచీ
అహర్నిశలూ పాటు పడ్డాడే.....
తల్లి పిల్లా తాను కలసీ
కాయకష్టం చేసి యున్నాడే....
తలకు మించిన భారమైనా
ఎరువులెన్నో కొనుక్కొచ్చీ
పొలము జల్లాడే.....
అర్ధరాత్రీ నిద్ర లేకా
నీరు పెట్టీ కాపు కాసేడే.....
పెరుగుతున్నా పైరు చూసీ
కష్టకాలం గడచి పోయీ
మంచికాలం వచ్చెనంటూ
మురిసి పోయేడే...
కలలు కన్నాడే.....
కన్న కలలూ నీరు జేస్తూ
కాపుకొచ్చిన పంట కాస్తా
నీటి పాలై తనను ముంచేస్తే
అప్పులందున పీక లోతున
మునిగి పోయిన బక్క రైతుకు
తీరబోవని కష్టమొచ్చిందే.......

ఆదుకుంటామంటు వచ్చీ
ఆపన్న హస్తం అందీయరెవరూ
రాజ్యమేలే యోచనలతో
రాజకీయం చేసుకుంటూ
రోజు రోజూ వారు వీరూ
తిట్టుకుంటూ తెగడు కుంటూ
ఉండిపోయేరే......
రాజ్యమేలే ప్రభువులేమో
రైతు రాజ్యం మాదె అంటూ
రాజన్న పథమే వీడమంటూ
అన్నలేనీ లోటు నెపుడూ
రానీయమంటూ హామిలిస్తూ
ఒట్టి మాటలతోనె కాలం
గడుపుతున్నారే
ఊరడించే చేతలేవీ
కానరాలేదే.........

విజను ట్వంటీ వీరుడొక్కడు
యెగసాయమెందుకు శుధ్ధ దండగ
పనికి మాలిన పనులవంటూ
నాడు రైతును యెకసక్కెమాడేడే
కంప్యుటర్లో క్లిక్కు చేస్తే
ధారధారగ కనక రాశులు
కురియునన్నాడే ..వాటితోనే
ఆకలంతా తీరునన్నాడే
తనకు అన్నీ తెలుసు నన్నాడే...
నేడు తానే రైతు బంధువు
వేషమేసేడే...
మొసలి కన్నీరు కార్చేడే....

పదుగురొచ్చీ మీద పడినా
కాలరైనా నలగకుండగ
చిత్తు చిత్తుగ వైరి వీరుల
పీచమణిచే తెరవీరుడొక్కడు
తెలిసితెలియని చిలక పలుకులు
పలుకుతున్నాడే....రైతు పక్షం
తానె అన్నాడే..నటన లోనీ
వైదుష్యమంతా ఒలకబోసేడే......

తండ్రి పేరును చెప్పుకుంటూ
తాను గద్దెను ఎక్కవలెనని
తపన పడుతూ కొడుకు ఒక్కడు
ఓదార్పు అంటూ ఊరూరు తిరిగాడే
పనిలొ పనిగా  రైతుకోసం
కన్నీరు కార్చేడే...
ఓట్లకోసం విత్తు జల్లేడే........

వారు వీరూ ఎవరి వలనా
తనకు ఏమీ ఒరగనందున
ఆలు బిడ్డలు ఆకలంటూ
 అలమటిస్తుంటే
దినము గడిచే  తీరు తెలియక
రేపు పైనా ఆశ లేకా
దిక్కు తోచని దీన స్థితిలో
నమ్ముకున్నా నేల తల్లీ
ఒడిని ఒరిగాడే.........

వెతల  సుడిలో బ్రతుక జాలక
కన్నుమూసిన కన్న తండ్రీ
నీవు పోతే లోకమంతా పస్తులుంటుందే
అన్నదాతవు నీవు లేకా
ఆకలేసీ బావురంటూ
అలమటిస్తూ మాడిపోతుందే....

దీనికెవ్వరు బాధ్యు,లీ
పాప మెవ్వరిదంటు మీరూ
వెఱ్ఱి ప్రశ్నలు వేయబోకండీ
నిశ్చయముగా అది నాడు నేడూ
నేల నేలిన ఏలికలదే
నయవంచకత్వపు నాయకులదే..
వారిచేతికి పగ్గమిచ్చిన
మీరు నేనూ హంతకులమే...
              ***

.

























14, జులై 2012, శనివారం

దండిభొట్ల వారి దర్జా..(విద్వాన్ సర్వత్ర పూజ్యతే.)



స్వగృహే పూజ్యతే మూర్ఖః  స్వగ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజా  విద్వాన్సర్వత్ర పూజ్యతే--
అంటే మూర్ఖుడిని వారి ఇంటిలోని వారే గౌరవిస్తారు ( వాని మీద ఆధార పడి బ్రతుకు తారు కనుక తప్పదుకదా ? ). గ్రామాధికారికి తన వూళ్ళోనే మర్యాద ఉంటుంది. రాజుకు తన రాజ్యంలోనే గౌరవం. కానీ విద్వత్తు ఉన్న వాడు  ప్రపంచంలో ఎక్కడైనా గౌరవింపబడుతాడని భావం. ఎంత చక్కటి నిజం!
ఇది ఎరిగిన వారు కనుకనే పండితులైన వారు తమ పాండిత్యాన్ని కాపాడుకుంటూ మర్యాదగా జీవించేవారు. బ్రాహ్మణుడైన వాడు ధనాశను వీడి తనకు లభించిన దానితో సంతృప్తిని చెంది మరునాటి గురించి కూడా ఆలోచించకుండా జీవించాలట. ఇది సనాతన బ్రాహ్మణ ధర్మం. అందువల్లనే  కొందరు బ్రాహ్మణోత్తములైన పండితులు తమ పాండిత్యాన్నే నమ్ముకుని ఎవరి ఆశ్రయం కోసం పాకులాడక స్వతంత్ర ప్రవృత్తితో ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటూ రాజులనైనా లెక్కచేయకుండా మహోన్నత వ్యక్తిత్వంతో జీవించేవారు. ఇలాంటి మహాను భావులగురించి ఇంతకు ముందు పోస్టు ( డబ్బంటే చేదా..) లో చెప్పి ఉన్నాను.  ఆ టపా చదవడం కోసం
( ఇక్కడ నొక్కండి ) ఇటువంటి మహానుభావుడు మరొకరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలాకాలం క్రితం కాశీలో మహాపండితులు కాపురం ఉండేవారు. అలాంటి వారిలో మన తెలుగు వారైన దండిభొట్ల విశ్వనాథశాస్త్రి గారొకరు. వారు తెలుగు వారనే మనకు తెలుసు గాని ఎక్కడి వారో తెలియదు. వారి అత్తవారిది మాత్రం గోదావరి జిల్లాలో నేదునూరి ప్రాంతం. ఆయన తన చిన్నతనం లోనే భార్యతో కలసి కాశీ వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టారు. పిల్లా పీచూ ఎవరూ లేరు. వీరు ఏం దర్జాగా బ్రతికేరో చూడండి:
అప్పట్లో విజయనగర సంస్థానాధీశులైన ఆనందగజపతి రాజుగారు ఏడాది లో కొన్నినెలల పాటు కాశీలో ఉంటూ ఉండేవారు. స్వయంగా పండితులైన ఆనంద గజపతిగారికి సాహిత్యాభిలాష మెండుగా ఉండేది. పాండిత్య సభలు ఏర్పాటు చేసి  కాశీలోని పండితులందరినీ గౌరవిస్తూ ఉండేవారు. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే దండిభొట్ల వారికీ ఆనందగజపతుల వారికీ పరిచయం ఏర్పడి స్నేహంగా వృధ్ధి చెందింది.
ఒకసారి దండిభొట్ల వారు దక్షిణ దేశం  రైల్లోవస్తూ విజయనగరంలో దిగారు. ముతక పంచె మాసిన గడ్డం పొడుగాటి లాంకోటూ ఇదీ వారి వేషం. చేతిలో సంచీ కూడా లేదు. రైలు దిగీ దిగడంతో సరాసరి రాజుగారి కోటకే వెళ్లారు. తాను రాజుగారి మిత్రుడినని అనర్గళంగా హిందీలో చెబుతున్నఈ పండితుణ్ణి నివారించడానికి అక్కడున్నఉత్తరాది సైనికులెవరూ సాహసించేలేక పోయారు. శాస్త్రిగారు నేరుగా రాజమహల్ హల్లో ప్రవేశించి కుర్చీలో కూర్చున్నారు. అక్కడకు వచ్చిన అంతరంగికుడైన పనివాడిని పిలిచి రాజుగారితో దండిభొట్ల విశ్వనాథం వచ్చేడని చెప్పమన్నారు. దానికిది సమయం కాదు బాబూ అంటూ అతడు సంశయిస్తున్నంత లోనే శాస్త్రిగారి గొంతు గుర్తు పట్టి రాజా వారు హాల్లోకి వచ్చి శాస్త్రిగారిని ఎప్పుడు వచ్చేరని అడిగితే దానికాయన తాను ఊరికే దక్షిణాదికి వెళ్ళి వద్దామని బయల్దేరాననీ ఇంతలో రైలు బరం పురం వచ్చే సరికి తన దగ్గర భంగు అయిపోయిందనీ అది విజయనగరం ప్రభువుల వద్దనే దొరుకుతుందని తెలిసి ఇటు వచ్చానని అన్నారు. రాజు గారు పాలు మిఠాయిలూ భంగూ తెప్పిస్తే ఇద్దరూ కలిసి వాటిని సేవించాక  మరికొంత భంగుని పొట్లం కట్టించి జేబులో వేసుకుని ఇక వెళ్ళి వస్తానని రాజుగారిని సెలవడిగారట. రాజుగారు నాలుగు రోజులుండి తమ ఆతిధ్యం స్వీకరించమనీ,  తమ ఆస్థాన పండితుల వారింట బస చేయమని కోరితే  తానెవ్వరి ఇంటా బస చేయనని రైలు స్టేషను దగ్గర మంచుకొండ వారి సత్రం చూసేనని అక్కడ ఆ రోజుకి ఉండి మరునాడు ఉదయం 10 గంటల రైల్లో వెళ్ళిపోతాననీ చెప్పారు. రాజుగారు ఆసాయంత్రం తమ ఆస్థాన పండితుల్ని పిలిచి పండితులందరూ వెళ్ళి సత్రంలో శాస్త్రిగారి దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించేరు.. మరునాడు వారందరూ తమతమ శిష్యగణంతో పాటు శాస్త్రిగారిని దర్శనం చేసుకున్నారు. వారి కోరిక పై  దండిభొట్లవారు వారి శిష్యులను పరీక్ష చేసి వారిలో శేఖరం (వ్యాకరణ గ్రంథం) చదువుకుంటున్న అబ్బాయి చాలా పైకి వస్తాడనీ అయితే ఆ అబ్బాయి వేసుకున్న ఇస్తిరీ బట్టలూ షోకూ శాస్త్రానికి పనికి రావనీ అన్నారు. ( ఆ ఇస్తిరీ బట్టల అబ్బాయి మరెవరో కాదు- తరువాతి కాలంలో మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాయుడు శాస్త్రిగారే). ఆ తర్వాత వారు టిక్కట్టు కొని ఇస్తామన్నా వద్దని వారిస్తూ తమను రైల్లో టికట్టు ఎవరూ అడగరని చెబుతూ రైలెక్కి వెళ్లిపోయారు.  
                                                           ***
మహా వ్యాకరణ పండితులైన విశ్వనాథం గారికి  కాశీలో అనేక మైన పండిత సభల్లో రెండేసి శాలువలను కప్పేవారు. వారు సభానంతరం ఇంటికి వస్తూ వస్తూ దారిలోఇద్దరు వేద వేత్తలైన పండితులను ఇంటికి పిలుచుకు పోయి భార్యతో “ ఏమేవ్ వేదవేత్తలొచ్చారు, వీరు దేవతా స్వరూపులు. వీరికి చెరొక శాలువా ఇచ్చి నమస్కరించుకో ” అనే వారు. తమకోసం ఏనాడూ ఏదీ మిగుల్చుకోలేదు. కప్పుకోవడానికి వారికి మామూలు దుప్పట్లే గతి.
                                                        ***
ఒక సారి  వారి శ్రీమతికి శివరాత్రికి కోటిపల్లి వెళ్ళాలని మనసైంది. ఆవిడ కోరిక తీర్చడం కోసం వారిద్దరూ శివరాత్రికి ఒక వారం ముందరే కాశీలో బయల్దేరి రైల్లో కాకినాడ వరకూ వచ్చారు.
 ( రైల్లో ఏనాడూ ఎవరూ వారిని టికట్టు అడిగే వారు కారట ) . అక్కడినుండి కోటిపల్లికి బండిమీద వెళ్ళడానికి వారి దగ్గర డబ్బులు లేక నడిచే అంచెలంచెలుగా ప్రయాణిస్తూ శివరాత్రి నాడు సూర్యోదయ సమయానికి కోటి పల్లి చేరుకున్నారు. అది శివరాత్రి పర్వదినం కావడంతో చాలారద్దీగా ఉంది, వారు భార్యను ఒడ్డునే తమ సంచీ చూసుకుంటూ ఉండమని తాను గోదావరిలో స్నానం చేసి వచ్చారు. తర్వాత ఆమెనుస్నానం చేసిరమ్మంటే ఆమె తటపటాయిస్తూ “ఎంత సేపు ములిగి రావాలి కాకి స్నానమేగా” అంది. ఆమె చూస్తున్న గోదావరి వైపు ఆయన దృష్టి సారించేసరికి  వారికి అక్కడ స్నానాలు చేస్తూ బ్రాహ్మణులందరికీ రూపాయిలు దానం చేస్తున్న ధనికులైన కమ్మవారి ఆడువారు కనిపించేరు. తమ భార్య మనోగతాన్ని గ్రహించిన వారై “ వారి లాగా దానాలివ్వడానికి డబ్బులేదనేగా నీ సందేహం. జాగ్రత్తగాఇక్కడే ఉండు ఇప్పుడే తెస్తాను” అంటూ  పిఠాపురం రాజావారు శ్రీ హరిశాస్త్రి గారింట బస చేసారని తెలుసుకుని అక్కడకు వెళ్ళారు. అప్పుడే స్నానాదులు ముగించుకుని సోమేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరబోతున్న రాజు గారు వీరినిచూసి ఆగారు. కుశల ప్రశ్నలయేక ఏమిటిలా దయచేశారని రాజుగారడిగితే తాను భార్యాసమేతంగా సోమేశ్వరస్వామి దర్శనానికని ఆవూరు వచ్చాననీ తన భార్య బ్రాహ్మణులకి దానాలివ్వడానికి కొంత సొమ్ము అవసరమై వచ్చాననీ చెప్పారు శాస్త్రిగారు. రాజుగారు వెంటనే ఒక వెండి పళ్ళెంనిండా రూపాయిలు పోయించి తెప్పించి స్వీకరించమన్నారు.. శాస్త్రిగారు రెండు గుప్పిళ్లనిండా రూపాయిలు తీసుకుని అవి చాలని వెళ్ళివస్తానని అన్నారు.. రాజు గారు “ అలాక్కాదు గుడిలో చాలా రద్దీగా ఉంది. మీరు స్నానాలు ముగించుకుని సతీ సమేతంగా వస్తే మాతో తీసుకు వెళ్ళి శీఘ్ర దర్శనం చేయిస్తా” మని అన్నారు. దానికి శాస్త్రిగారు అక్కర లేదనీ తాము అంతకంటే రద్దీలో కాశీలో దర్శనాలు చేసుకున్నామని చెప్పి సెలవుతీసుకుని  గోదావరి ఒడ్డుకు వెళ్ళి ఆ రూపాయిలు తనభార్య చేతిలో పోసి అందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా దానం చేసేయమన్నారు.
                                                       ****

అయ్యా ఇదీ దండిబొట్ల వారి కథ. ఇందులో ఏం పెద్ద విశేషముందని ఈ కథ చెప్పావయ్యా అని ఎవరైనా అని అడగొచ్చు. స్థూలదృష్టితో చూస్తే దీనిలో విశేషం కనిపించక పోవచ్చు. కానీ చేతిలో దమ్మిడీ లేనప్పుడు అనాయాచితంగా అంత ధనం వస్తుంటే తీసుకోకుండా ఉండగలగడం సామాన్యమైన గృహస్తులకు సాధ్యపడే విషయం కాదు. చేతిలో ఏ సొమ్మూ లేకుండా తీర్థ యాత్రకి పత్నీ సమేతంగా బయలు దేరడానికి ఎవ్వరైనా సాహసించగలరా? శాస్త్రిగారు శాలువలు స్వీకరించినా రూపాయిలు తీసుకున్నా అవి ఇతరులకివ్వడానికే గాని తనకోసం ఏమీ తీసుకోలేదు.
మన పెద్దలు ఏమన్నారంటే—
సద్యో దదాతి చతురః సద్యో నాస్తీతి చతురతమః
అంటే (అడగ్గానే) ఆలస్యం చేయకుండా (ధనం) ఇచ్చేవాడు తెలివైన వాడైతే,
( అడక్కుండానే వచ్చే ధనాన్ని)ఆలస్యం చేయకుండానే వద్దనే వాడు అంతకన్న తెలివైన వాడు-అని భావం. ( ఇక్కడ తెలివైన వాడంటే ధర్మం తెలిసినవాడని అర్థం). మరి దండిభొట్ల వారు ఎంత గొప్ప ధర్మపరుడు ? నప్రతిగృహీతృత్వం- అంటే ఎవరి దగ్గర నుంచీ ఏదీ ఉచితంగా తీసుకోరాదన్నది  మనధర్మమని ఇదివరకే చెప్పి ఉన్నాను కదా? దానిని తూ.చ. తప్పకుండా పాటించిన మహాను భావుల్లో దండిభొట్ల వారు కూడా ఒకరన్నమాట. అదీ ఆయన దర్జా.
                                       ***
ఇక్కడితో ఆపేస్తే నా ఈ వ్యాసం ఉద్దేశం పూర్తి గా నెరవేరినట్లుకాదు. ఇటువంటి ధర్మ వర్తనుల సహధర్మచారిణులు కూడా ఎన్ని కష్టాలనోర్చుకుని వారు కూడా తమ సహచరుల ధర్మ దీక్షాయజ్ఞంలో పాలు పంచుకున్నారో మనం తెలుసుకుని వారికీ మన జోహార్లు పలకాలి. ఎంతో కొంత ధనాశని చంపుకుని జీవితాలను గడుపుకుంటే మనంకూడా మన పాఠాలను నేర్చుకున్నట్లే.
( ఈ విషయాలను గ్రంథస్థం చేసి వెలుగులోకి తెచ్చిన శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారికి కృతజ్ఞతలతో—సెలవు.)
                                        ***