7, జూన్ 2013, శుక్రవారం

ఏమిటీ జీవిత పరమార్థం?

ఏమిటి జీవిత పరమార్థం....?
“ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ మరి యాలజాతికిన్ తిన్నది పుష్టి..”
 తిరుపతి వేంకట కవుల ఈ పద్యం అందరికీ సుపరిచితమే. గోవుల వంటి పశుజాతికి కడుపు నిండితే చాలు అవి సంతృప్తి పడతాయి. మళ్ళా కడుపు నకనకలాడే వరకూ వాటికి ఏ చింతా ఉండదు.హాయిగా బ్రతికేస్తాయి. మరి అన్ని జన్మలలోనూ ఉత్కృష్టమైనది మా మానవ జన్మే అని విర్రవీగే మానవుడు మాత్రం తన తిండికే కాదు తానూ తన కుటుంబమూ జీవితాతం సుఖంగా కాలం గడపడానికి కావలసినంత ఉన్నా కూడా తనివి తీరక ఇంకా ఇంకా సంపాదిచాలనే కోరికతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు. ఎన్నడూ తృప్త్యాస్మి అనడు. ఉన్నంతలో సంతృప్తి చెందుతూ మనశ్శాంతితో హాయిగా గడిపేవారు చాలా అరుదు. నప్రతిగృహీత్వం-అంటే ఊరికే ఎవ్వరేమిచ్చినా అదెంత తమకు అవసరమైనదైనా స్వీకరించకుండా ఉండడం ఒక వ్రతంగా పాటిస్తూ జీవితాల్ని గడిపిన కొద్ది మంది గురించి ఇంతకు ముందు నా పోస్టులలో ప్రస్తావించి ఉన్నాను. తాము జీవిస్తున్న పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, ఎన్నో  ప్రలోభాలను అథిగమించి,  అనాయాచితంగా వస్తున్న సిరులను తృణ ప్రాయంగా భావించి వద్దనగలగడం సామాన్యమైన విషయంకాదు. అయితే జీవితంలో ఐహిక సుఖాలకంటే విలువలకోసం జీవించ దలచుకున్న స్థిరచిత్తులకు మాత్రం ఇది  అసాధ్యంకాదు. ఈ విషయం రుజువు చేసే రెండు కథలను చెప్తాను వినండి.
                                                         ***
చాలా కాలం క్రితం కోనసీమలో అయిన పల్లి అనే గ్రామంలో బులుసు అచ్చయ్యగారనే మహా పండితుడు ఉండేవారుట.వారి తండ్రులూ తాతలూ కొమాళ్ళూ అందరూ మహా పండితులే. అచ్చయ్యగారు వేద శాస్త్ర శ్రౌతాలలో నిష్ణాతుడు.ఆయన ఒకరోజు ఉదయాన్నేగుమ్మం అలుకుతూ ఉన్న తమ అర్ధాంగిని “ ఈ వేళ శాక పాకా లేమిటోయ్” అని సరదాగా ప్రశ్నించారట. అంతటి మహా పండితుడై ఉండీ ఎంతో ధనాన్ని అవలీలగా ఆర్జించగల దక్షత కలిగిన వాడై కూడా ఆ  విషయంలో ఈ షణ్మాత్రమైనా శ్రధ్ధ చూపని తన భర్తగారి ప్రవర్తనతో ఏ కొంచెమైనా విసిగిపోయి ఉందేమో ఆ ఇల్లాలు “ఆఁ ఏముందీ..ఇత్యర్థలు పులుసూ..ఇతిభావలూ కూరానున్నూ..”  అందట. భార్య మాటల్లోని వ్యంగ్యం గ్రహించిన ఆయన  “ నీకేదో ధనాశ ఉన్నట్లుంది.  ఎంత తెస్తే చాలునో చెపితే ఆ ప్రయత్నం చేస్తా” నన్నాడు. అన్నాడు కాని ఈయన అటువంటి ప్రయత్నమేమీ చేసేవాడనే నమ్మకమేమాత్రం లేని ఆవిడ తాను అప్పుడు గుమ్మం  అలకడానికి  నీళ్లు తెచ్చుకున్న నిలువు చెంబు చూపిస్తూ దీనెడు వరహాలు చాలన్నట్టు సంజ్ఞ చేసిందట. అచ్చయ్యగారు ఆ పట్టునే ఆ చెంబు తీసుకుని బయల్దేరి ఊళ్లు తిరుగుతూ హైదరాబాదు చేరుకున్నారట.అక్కడ ఒక బ్రాహ్మడు యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ శ్రౌతులిద్దరు ప్రాయశ్చిత్తం ఎలా చేయించాలనే విషయమై వాదులాడుకుంటున్నారట. అప్పుడు అచ్చయ్యగారు కలుగ జేసుకుని ఇదీ శాస్త్రీయ మైన పద్ధతి అని వివరించేరట.అప్పుడు ఆ వాదనలో ఓడిపోయిన శ్రౌతి “మధ్యలో నీవెవడవయ్యా కలుగజేసుకుని తీర్పివ్వడానికి ..నీ వేమైనా బులుసు అచ్చయ్యగారి ననుకుంటున్నావా” అని హేళనగా మాట్లాడాడట.అందుకాయన “అలాగే అనుకోండి” అని మాత్రం అన్నాడట. తొందరలోనే ఆయనే బులుసు అచ్చయ్యగారనే నిజం గ్రహించిన అక్కడి పెద్దలు వారికి నమస్కరించి సగౌరవంగా అప్పటి హైదరాబాదు నవాబు వద్ద దివాన్జీగా ఉన్న చందూలాల్ గారి దగ్గరకు తీసుకు వెళ్లారట. అప్పటికే అచ్చయ్యగారి ప్రజ్ఞా విశేషాలు ఎరిగి ఉన్నవాడైనందు వల్ల చందూలాల్ గారు అచ్చయ్యగారిని అంత దూరం నుండి వచ్చిన పనేమిటని అడిగారట. విషయం తెలుసుకుని అచ్చయ్యగారికి జాగీరు ఇవ్వడానికి కూడా చందూలాల్ సిధ్ధ పడ్డా, దానిని నిరాకరిస్తూ తన చెంబుతో చెంబెడు వరహాలు మాత్రం పుచ్చుకుని అచ్చయ్యగారు ఇల్లు చేరారట. కేవలం భార్య కోరిక తీర్చడానికైనా సరే, ఏదో నాలుగు చోట్ల యాచించుకోకుండా తన ప్రజ్ఞను గుర్తించి అడక్కుండానే తన అభీష్టాన్ని నెరవేర్చగల యోగ్యుడైన దాత కోసమే అచ్చయ్యగారు ఇంత దూరం రావలసి వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఆయన తన శేషజీవితాన్ని నప్రతిగృహీతలు గానే గడిపారట.
                                                              ***
ఇది వింటే మనలో కొందరికైనా ఆ రోజుల్లో కనుక అలా గడప గలిగారు కాని ఇప్పటి పరిస్థితుల్లో ఎవరికైనా అలా జీవించడం సాధ్యమా? అనే శంక కలిగి తీరుతుంది. నిజమే. ఆ రోజుల్లో ఏ కొద్ది మంది భాగ్యవంతులో తప్పిస్తే మిగిలిన వారందరూ చాలా సాదా సీదా జీవితాల్ని గడిపే వారు కనుక వారి మధ్య ఈ రకమైన నిష్టతో బ్రతకడం ఇప్పటికంటె కొంచెం సులభమే అయి ఉండవచ్చు. కాని అసలు కారణం అది కాదు. మనిషై పుట్టాక మన జీవితం ఎలా గడపాలి జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని మనం నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో వచ్చే సాధక బాధకాల్ని లెక్కచేయకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగగలగడం అనేవి వ్యక్తులకు సంబంధించినవి. కాలానికి సంబంధించినవి కాదు. ఈ విషయాన్ని రుజువు చేసే కథ చెబుతాను వినండి.
                                                                 ***
మనం ఉంటున్న ఈ కాలంలోనే ఢిల్లీలో ఘాజీ పూర్ ప్రాంతంలో రవి సక్సేనా అనే ఆసామీ టీ అమ్ముకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. అలా టీ అమ్ముకుంటూ నెలలో 20 రోజులలో దాదాపు రూ. 8,000  వరకూ సంపాదిస్తాడట. అంతే మరి. ఆ మిగిలిన 10 రోజులూ టీ అమ్మడం బంద్. ఆ పది రోజులూ ఢిల్లీకి చికిత్స నిమిత్తమై   ఎక్కడెక్కడనుంచో వచ్చే వారికి సహాయం చేయడంలో  తలమునకలై ఉంటాడట. అలా ఢిల్లీకి దూర ప్రాంతాలైన పల్లె టూళ్ళనుండి వచ్చి హాస్పిటల్స్ లో ఎలా చేరాలో తెలియక అట్టాడుతున్న రోగుల్ని తీసుకెళ్లి హాస్పిటల్స్ లో చేర్పించడం వారి అవసరాల్ని బట్టి రోజుల తరబడి  వారికి తోడుగా ఉండడం  సేవ జేయడం లాంటివి చేస్తాడట.ఇలా ఆయన ఆరేళ్ళ బట్టి సేవ జేస్తున్నాడట. ఈ పని మానేసి హాయిగా టీ అమ్ముకుంటూ మరికొంచెం సంపాదించుకోవచ్చు కదా అని అతడి కుటుంబ సభ్యులూ స్నేహితులూ ఎవరెన్ని చెప్పినా వినకుండా అతడీ సేవలో అంకితమై పోతున్నాడట. ఢిల్లీ లాంటి మహా నగరంలో 8000 రూపాయల సంపాదనతో బ్రతుకు వెళ్లదీయడం ఎంత కష్టమో మనమెరుగనిది కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక బ్రతికుంటేనే ఏమైనా సాధించగలం కనుక జీవికకు సరిపడా సంపాదించుకుంటూనే ఈ జీవితానికి సార్థకత చేకూర్చుకోవాలనుకున్న రవిసక్సేనా ధన్యజీవియే కదా?
                                                                ***
బులుసు అచ్చయ్య గారిగురించి చెప్పిన వారు శ్రీ చెళ్ళ పిళ్ళ వేంకట శాస్త్రి గారైతే, రవి సక్సేనాను గురించి జూన్ 6, టైమ్స్ ఆఫ్ ఇండియా దిన పత్రికలో చదివాను. ఇలాంటి ముచ్చట్లు వినడం మన జీవితాల్ని సంపూర్ణంగా మార్చి వేయక పోయినా  జీవిత పరమార్థాన్ని గ్రహించడంలో ఏ కొంతైనా సాయపడి ప్రశాంత జీవన సరళిని ప్రసాదిస్తాయేమోనని ఆశ. సెలవు.
                                                               ***          



12, మే 2013, ఆదివారం

అపురూపం..వివాహ స్వర్ణోత్సవం...


అపురూపం...వివాహ   స్వర్ణోత్సవ వేడుక..
“అపురూపం”
“అపురూపమా?”
“అవును. అపురూపమే”
“ఇది నీ బ్లాగు పేరుకదా?”
“అవును. కానీ నేనిప్పుడు చెబుతున్నది దాని గురించి కాదు.”
“మరేమిటి ”
“మా జీవితంలో అపురూపమైన రోజు గురించి.”
“ఏమిటది”.
“ఇవాళ తారీకు 12 మే కదా”.
“అవును. అయితే ఏమిటి విశేషం”
“ఉంది. ఇవాళ మా పెళ్లి రోజు.”
“శుభం. కానీ పెళ్లి రోజులు ప్రతీ సంవత్సరం ఒకసారి వస్తూనే ఉంటాయి కదా.ఇది అంత అపురూపమైన విషయమా”
“అవును మాకిది అపురూపమైన విషయమే. ఎందుకంటే ఇవాళ్టికి మా పెళ్లై యాభై ఏళ్ళైంది. అంటే వివాహ స్వర్ణోత్సవమన్న  మాట. మనిషి పూర్ణాయుష్షు వంద సంవత్సరాలు. కానీ వంద సంవత్సరాలు బ్రతికే వారు లక్షకి ఒక్కరు కూడా ఉండరు కదా. సగటు జీవిత కాలం ఏ  అరవై డభ్భై సంవత్సరాలో.అలాంటప్పుడు యాభై ఏళ్లంటే మన జీవితంలో సగం కంటే ఎక్కువే కదా. అందుచేత యాభై ఏళ్ల దాంపత్యం అంటే జీవితంలో సగ భాగం కంటే ఎక్కువే.కనుక వివాహ స్వర్ణోత్సవమంటే ఎవరికైనా వారికది అపురూపమే.
 ఈ సందర్బంగా మా ఇద్దరికీ ఇంత ఆయుష్షునిచ్చినందుకు  ఆ పరమేశ్వరునికి- నేను కొలిచే సాయిబాబాకి- నమస్కరించుకుంటున్నాను.
మరి నా జీవితంలో సగభాగం పైనే పాలుపంచుకుని జీవితాన్ని సుఖమయం చేసిన
నా జీవిత సహచరిని అభినందిస్తున్నాను. ఆవిడ మీద నేను రాసుకున్న పద్యం

ఇహ సుఖముల నందించగ
అహరహమును పాటు పడుచు అలుపెరుగక నా
గృహమును స్వర్గమొనర్చిన
సహచరి నాకున్  ప్రియ సఖి సాక్షాత్ లక్ష్మీ

ఎన్నడూ పెళ్లి రోజు వేడుకలని జరుపుకోకపోయినా  ఇవాళ మా వాళ్లందరితో సరదాగా జరుపుకుంటున్నాము.తమ్ముళ్ళూ చెల్లెలూ కుటుంబాలతో ఊళ్ళనుండి వస్తున్నారు. బావ మరదులూ మరదళ్లూ అందరూ ఊళ్ళోనే ఉన్నారు. అందరం సాయంత్రం హోటల్లో కలసి సమావేశమై సరదాగా గడుపుతాము.కలసి భోజనం చేస్తాము.
అక్షయ తృతీయకి ఎప్పటిలాగే ఈ సారి కూడా అరతులం బంగారమైనా కొనుక్కోక పోయినా అరకిలో బంగారం కొనుక్కున్నంత ఆనంద పడుతోంది మా ఆవిడ. ఆవిడ ఆనందమే నా ఆనందం కదా?


   

.

6, మే 2013, సోమవారం

చెప్పు దెబ్బలూ... పూల దండలూ...



మన ప్రవర్తనను బట్టే మనకు లోకంలో లభించే గౌరవాభిమానాలు ఉంటాయి. ఈ విషయాన్ని తేటతెల్లం చేసే ఉదంతాలు రెండు,, చాలా కాలం క్రిందటివే అయినా నాకు బాగా గుర్తుండి పోయాయి. అవేమిటో మీకు మనవి చేస్తాను.
                                                       ***    
 చాలా  కాలంక్రిందటి సంగతిది. ఎప్పుడో ఏవో మాటల్లో మా తమ్ముడు ఈ విషయం నాకు చెప్పాడు. అప్పట్లో వాడు సాలూరు జూనియర్ కళాశాల హైస్కూల్లో తెలుగు పండితునిగా పని చేస్తూ ఉండే వాడు. ఒక సారి ఏదో పని మీద దగ్గరలోని రామభద్ర పురం అనే ఊరు వెళ్లి అక్కడి డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వారి ఆఫీసులో ఆ ఇనస్పెక్టరు గారితో పరిచయం ఉండడం వల్ల వారితో పిచ్చాపాటీ మాటలాడుతూ ఉన్నాడట. అది మండు వేసవి కాలం. మధ్యాహ్నం రెండూ.. మూడు.. గంటల సమయం. ఎండ మండి పోతూ ఉందట. అదిగో అలాంటి మండుటెండలో ఒక ఆసామీ ఉస్సురుస్సురంటూ ఆ ఆఫీసుకి వచ్చి  గదిలో మా తమ్ముడూ ఇన్స్పెక్టరు గారూ మాటలాడుకుంటూ ఉండడం చూసి బయటి వరండాలోనే బెంచీ మీద కూర్చున్నాడట.ఆ వ్యక్తి రావడం గమనించినా ఎంత సేపటికీ ఆ ఇన్స్పెక్టరు ఎందుకు వచ్చారని అడగడం కాని పలకరించడం కాని చేయక పోవడంతో  కాసేపటికి మా తమ్ముడే కలుగ జేసుకుని ఎవరో మీ కోసం వచ్చి   ఉన్నట్లుంది అన్నాడట. ఆ సమయం చూసుకొని నమస్కారం బాబూ అంటూ ఆ వ్యక్తి లోపలకు ప్రవేశించాడట. అప్పటికి     తప్పని సరై ముఖానికి కాస్త సీరియస్ నెస్ పులుముకొని “ఏమిటిలా వచ్చేరు” అని ఆ వ్యక్తినడిగాడట ఆ ఇన్స్పెక్టరు గారు. ఆ వ్యక్తి “అదేనండి నా కాగితం గురించి..” అంటూ వినయంగా నిలబడ్డాడట. “అదా…అదింకా రాలేదయ్యా.  హైదరాబాదు నుంచి రావాలి కదా? వచ్చినప్పుడు వస్తాయి తాపీగా... అక్కడ అందరూ మనలాగా పని చేస్తారనుకున్నావా ఏమిటి ?” అన్నాడట. అది విని హతాశుడైన ఆ వ్యక్తి  “ఎలాగో ఏమిటో వచ్చే నెలలో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను కూడాను..వస్తాను బాబూ..” అనుకుంటూ అక్కడినుండి వెళ్ళి పోయాడట. ఆయన అటు వెళ్లగానే, ఆ ఇనస్పెక్టరు మా తమ్ముడితో  “..... ఊళ్లో మేస్టరండీ ఆయన. తన ప్రావిడెంటు ఫండు అకౌంటు స్లిప్పు కోసం వచ్చాడు. ఇంతకు ముందు కూడా వచ్చాడు లెండి”  అన్నాడట. అప్పుడు మా తమ్ముడు “ఆ స్లిప్పులు ఎప్పుడొస్తాయో ఏమో. పాపం అది జత చేస్తే గాని ప్రావిడెంటు ఫండు లోను తీసుకోవడానికి వీలు పడదు కదా?” అన్నాడట. అప్పుడా ఇనస్పెక్టరు “ వచ్చింది లెండి. ఇదిగో వచ్చి పది రోజులయ్యింది.  “ అంటూ తన  డ్రాయరు సొరుగు లోంచి  కాగితం తీసి చూపిస్తూ “వస్తే మాత్రం రాగానే ఇచ్చేస్తామటండీ. తిరగనివ్వండి.ఒకటికి రెండు సార్లు తిరిగితే కాని వీళ్ళకి మన విలువ బోధ పడదు” అన్నాడట నవ్వుతూ. మా తమ్ముడు తనకది దుమ్మరి గుండు నవ్వులా అనిపించిందనీ ఆ అమాయిక బడి పంతుల్ని బాధ పెట్టడంలో ఆ ఇనస్పెక్టరు కొచ్చిన పైశాచికానందం ఏమిటో తనకు బోధ పడలేదనీ, అయినా అది తనకు సంబంధించిన విషయం కాదు కనుకనూ అప్పటికే ఆ బడి పంతులు వెళ్ళి పోయాడు కనుక బాధ పడడం తప్పితే తానేమీ చేయలేక పోయానని  చెప్పాడు. ఇదిలా ఉంటే మరో ఉదంతం వినండి.
                                                            ****
దాదాపు 40 ఏళ్ళ క్రిందట 1975 లో జరిగిందిది. సంవత్సరం సరిగా ఎలా చెప్పగలిగా నంటే అప్పట్లో నేను ఇల్లు కట్టించుకుంటూ ఉండే వాడిని. దానికోసం ఎక్కువగా సెలవులో ఉండేవాడిని.ఒక సారి మధ్యలో ఇంటి పని లేనప్పుడు సెలవు వృథా ఎందుకని ఆపీసులో చేరితే మళ్లా ఎలాగూ సెలవులో వెళ్తానని చెప్పి మా వాళ్లు నాకు రెగ్యులర్ పోస్టింగు ఇవ్వకుండా  ఒక స్పెషల్ సెల్ లో వేసారు.అదీ ప్రావిడెంటు ఫండుకు సంబంధించినదే. మామూలూగా రిటైర్ అయిన వారికి ఇబ్బంది లేకుండా వారి వారి ఖాతాలలో జమ ఉన్న మొత్తాన్ని వారికి చెల్లించడానికి ఆధరైజేషన్ వెంటనే ఇస్తారు.  తరువాత  వారికి సంబంధించిన సొమ్ము  వారి ఖాతాలలో జమ కాకుండా ఉండిపోయిన మొత్తాలు ఎక్కడెక్కడున్నాయో వెతికి  వాటిని వారి ఖాతాకు జమ చేసి తర్వాత విడుదల చేస్తారు.ఇదిగో ఇలాంటి పనే నాకు ఇద్దరు అసిస్టెంట్లనిచ్చి అప్పగించారు. అలా పని చేస్తున్నప్పుడు ఒక రోజు  సాయంత్రం నాలుగు గంటల సమయం లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి తాను విద్యా శాఖలో పని చేస్తున్నానని పలానా జిల్లానుంచి వచ్చానని తన ప్రావిడెంటు ఫండు అకౌంటు స్లిప్పు తనకందలేదనీ ఎవరిని కలవాలో అంటూ అడిగాడు. ఆ రోజు నా వద్ద పని చేస్తున్న ఇద్దరు అసిస్టెంట్లు కూడా ఏదో కారణంతో సెలవులో ఉన్నారు. ఒక్కడినే అప్పటికి రెండు గంటలనుండీ కదలకుండా  తదేక దీక్షతో  పని చేసుకుంటున్నాను.అలా కదలకుండా ఒకే భంగిమ లో ఎక్కువ సేపు కూర్చుంటే వెన్ను నొప్పి లాంటివి వస్తాయని వైద్యులు అంటారు కనుక ఓ అయిదు నిమిషాలు విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి చేస్తున్న పని ఆపి ఆయనను నాతో రమ్మని పక్క సెక్షనుకి వెళ్లాను.ఆ బ్రాంచిలో రెగ్యులర్ గా పని చేస్తున్న వాణ్ణి కాను కనుక  విద్యాశాఖలో ఆ జిల్లాలో  పని చేసేవారి అకౌంట్లు ఏ సెక్షనులో ఉంటాయో తెలుసుకున్నాను..అంత పెద్ద ఆఫీసులో ఆ సెక్షను ఎక్కడుందో తెలియదు కనుక వారినే అడిగి తెలుసుకుని ఆయనను అక్కడికి తీసుకు వెళ్లాను. ఆ సెక్షనాఫీసరు నన్ను గుర్తు పట్టి   “ఏమిటిలా వచ్చారు సార్” అని అడిగాడు. నేను నాతో వచ్చినాయనను చూపించి ఆయనకు కావలసిన సాయం చేయమని చెప్పి తిరిగి నా సీటుకు వచ్చి పని చేసుకుంటున్నాను. ఓ పావుగంట తర్వాత ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి “Many many Thanks Sir, May God Bless you and your Family. ఆ ఏసు ప్రభువు మిమ్మల్ని కలకాలం రక్షించు గాక..God Bless you..God bless you.. అని రెండు చేతులూ ఎత్తి దీవించాడు. నేను ఆయనకు చేసిన సాయం చిటికెన వేలు గోరంతైనా లేకపోయినా ఆయన అలా అంటుంటే నాకు సిగ్గేసి “అంతగా ఏముంది లెండి. నేను రాక పోయినా మీరు ఎలాగో వెళ్లి మీ పని చేసుకో గలిగేవారు కదా” అన్నాను.. దానికాయన “నా పని అవడం కాదు సార్. ఎదుటి వాడికి ఎంతో కొంత మనకు చేతనైనంత సాయం చేయాలనే మీ అభిలాషను అభినందిస్తున్నాను సార్” అని వెళ్లి పోయాడు. ఆ వ్యక్తి తిరిగి వెళ్లాక తనకు తెలిసిన వారికి     “ఏ జీ ఆఫీసులో అంతా మంచి వారేననీ , మర్యాదస్తులనీ, అందరికీ సాయం చేస్తారనీ”  చెప్పి ఉంటాడనడంలో నాకు ఏ మాత్రం అపనమ్మకం లేదు.
                                                     ***  
మనం చేసే పనులు అవి ఎంత చిన్నవైనా మనకీ, మనం పని చేసే సంస్థకీ మంచి పేరో చెడ్డపేరో తెస్తాయి.ఈ విషయం గుర్తుంచుకుని మసలుకోవాలి.ఎవరికైనా మనం చేయగలిగిన సాయం చేయాలి. ఒకప్పుడు సాయం చేయలేక పోయినా  నవ్వుతూ మాట్లాడాలి. ఎందుచేత వారికి సాయం చేయలేక పోతున్నామో చెబితే వారు మనం సాయం చేసినంతగా పొంగి పోతారు. వారి పని మనం చేయలేదే అని బాధ పడరు. జీవితంలో ఇటువంటి దృక్పథం కలిగి ఉంటే మనం ఉన్న ప్రదేశమే నందన వనం అవుతుంది. మనకు లభించేవి చెప్పు దెబ్బలో పూల దండలో మన ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
                                                                        ***

23, ఏప్రిల్ 2013, మంగళవారం

మా ఆవిడ బంగారం...


                         
మా ఆవిడ బంగారం అని నేననగానే అది మీకు రెండు విధాల అర్థమయ్యే అవకాశం ఉంది.మొదటిది నేను మా ఆవిడను బంగారం లాంటి మనిషని మెచ్చుకుంటున్నానని, రెండవది మా ఆవిడకు చెందిన బంగారమనీ.ఇటువంటి విషయాల్లో స్పష్టత కోసమే మన వాళ్లు రెండో అర్థం వచ్చేటట్లు చెప్పాల్సివచ్చినప్పుడు మా ఆవిడ యొక్క బంగారం అని  విభక్తి ప్రత్యయం చేర్చి చెప్పాలనే వారు. ఈ యొక్క అనే విభక్తి ప్రత్యయాన్ని మన వాళ్లు పాత రోజులలో చాలా ధారాళంగా వాడేవారు.ఇది నాయొక్క పుస్తకము, ఈవిడ నా యొక్క భార్య అన్నట్లు.వక్తలూ, రాజకీయవేత్తలూ అయితే మరీని. అవసరం ఉన్నా లేక పోయినా ఆ యొక్క ఈ యొక్క అంటూ మాట్లాడే వారు.ఇప్పుడీ యొక్క అనేది  మాటల్లోనే కాదు వ్రాతల్లోనూ దాదాపు మాయమయి పోయింది. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడమే.. సరే. అదలా ఉంచండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మా ఆవిడ యొక్క ( ఒకప్పుడుండీ ఇప్పుడులేని ) బంగారం కథ.ఇది చదివేక  మా ఆవిడ బంగారమో కాదో మీరే చెబుదురు గాని.
దాదాపు 40 ఏళ్ళ క్రిందట, సరిగా చెప్పాలంటే 1970 లో నేను రెండు నెలలు సెలవు పెట్టాను. ఆ సెలవు నేను  ఇప్పటి శ్రీ రాం సాగర్ (అప్పట్లో దానిని పొచంపాడు ప్రోజెక్టు అనే వారు) లో పని చేస్తుండగా తీసుకోవడం వల్ల ఆ సెలవు జీతం రెండు నెలలకు 1200 రూపాయలు నాకు కొంచెం ఆలస్యంగా అందేయి. ఆ సెలవు కాలంలో ఇంట్లో ఉండే సేవింగ్స్ తోనే పొదుపుగా గడపడం వల్ల ఈ 1200 రూపాయలూ బోనస్ గా వచ్చినట్లనిపింది. అప్పుడు వాటిని పుట్టింటి కెళ్ళిన మా శ్రీమతికి నీ యిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో అంటూ పంపించాను. ఆడబ్బులు పెట్టి అప్పుడు ఆవిడ నాలుగు తులాలు బరువుతూగే నాలుగు పేటల చంద్రహారం ఒకటిన్నీ ఒక జత గాజులూ కొనుక్కుంది.గాజులు నిత్యం వేసుకున్నా చంద్రహారం మట్టుకు పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ వెళ్ళి నప్పుడు మాత్రం వేసుకునేది.ఇలా ఉంటే ఆరోజుల్లో కొన్నాళ్లు హైదరాబాదులో దొంగల భయం ఎక్కువగా ఉండేది. సివారు ప్రాంతాల్లోనే కాదు నగరం నడిబొడ్డున ఉన్న కాలనీలలో కూడా రాత్రుళ్లు కాలనీ వాసులు గస్తీ తిరిగే వారు.మా కోలనీలో కూడా అలాగే కొన్నాళ్లు గస్తీ తిరిగే వాళ్ళలో నా వంతు వచ్చినప్పుడు నేనూ నిద్ర మానుకుని తిరిగే వాడిని. ఇంట్లో కొంచెమైనా బంగారం ఉండబట్టి కదా భయపడడం. లేకపోతే ఎంత మనశ్శాంతితో జనం జీవించగలరో కదా అనుకునే వాడిని. బంగారం మంచి పెట్టుబడి (investment ) అన్న అభిప్రాయం నాకెప్పుడూ లేదు.అందుకనే చంద్రహారం అమ్మేస్తే మంచిదనే ఆలోచన నాకు కలిగింది. మా ఆవిడ కూడా రెండో ఆలోచన లేకుండా అమ్మి పారేయండి అంది. ఆ విధంగా  1980లోఆ నాలుగు పేటల చంద్రహారాన్ని అమ్మేసాను.గ్రాముకు 125 చొప్పున 44 గ్రాముల చంద్రహారానికి 5500 రూపాయలు వచ్చేయి.( ఆ తూకం బిల్లు రశీదు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి). ఇంట్లో ఏ బంగారమూ లేక పోవడం వల్ల నిశ్చింతగా నిద్ర పోతూ హాయిగా ఉండేవాళ్ళం.ఆ తర్వాత ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో వారికి ఏదో ఒకటి కొనడం తప్ప తన కోసం మాత్రం ఎప్పుడూ మా ఆవిడ బంగారం నగలు చేయించుకోలేదు.( నేను రిటైరయ్యాక ఒకటి రెండు జతల గాజుల చేయించుకుందేమో అంతే.) ఎప్పుడైనా ఏ పెళ్ళళ్లలోనో ఫంక్షన్లలోనో మా ఆవిడ మెడలో  పుస్తెలతాడు తప్ప ఏమీ లేకపోవడం చూసి చంద్రహారం ఉండాలిగా వేసుకోలేదేం అడిగిన వారికి మా ఆవిడ సమాధానం చిరునవ్వే అయ్యేది. 
                                                     ****
ఇంతకు ముందెన్నడూ లేనంతగా గడచిన దశాబ్ద కాలంలో పసిడి ధర తారాజువ్వలా ఎగసి తులం (10గ్రాములు) 32,000 తాకినప్పుడు కూడా మా ఆవిడ కాని నేను కాని అయ్యో చాలా చవగ్గా తులం 1250 కే అమ్మేసామే అని బాధ పడలేదు.గడచిన వారంలో బంగారం ధరలు పడిపోయి తులం 26000 కి దిగివచ్చి నప్పుడు  జనం బంగారం షాపుల ముందర క్యూలు కట్టిమరీ బంగారం కొనుక్కోవడం చూస్తే నవ్వుకునే వాళ్ళం. మొన్ననిలాగే క్యూలో నిలబడి  బంగారం వస్తువేదో కొనుక్కొచ్చి మా ఆవిడకు చూపించి “అక్కయ్యగారూ మీరూ గొలుసేదైనా కొనేసుకోండి  మళ్లా ధర పెరిగి పోతుందేమో” అని ఉచిత సలహా ఇచ్చి వెళ్తున్న మిత్రురాలికి అలాగే లెండి అంటూ సమాధానమిస్తూ నా వేపొక సారి చూసి చిరునవ్వు నవ్వింది మా ఆవిడ.
                                                      ****
ఇలా మేమిద్దరం నవ్వుకోవడానికి కారణం లేక పోలేదు. ఎందు చేతనంటే 1980లో మేము చంద్ర హారాన్ని అమ్మగా వచ్చిన 5500 రూపాయలలో 5000 రూపాయలు (40 గ్రాముల ధర) పెట్టి పోస్టాఫీసులో సేవింగ్సు సర్టిఫికెట్లు కొన్నాము.అవి 6 ఏళ్ళలో 1986 నాటికి 10,000 అయేయి.అవి అలా Reinvest  చేస్తూ పోతే 2010 నాటికి అవి 1,28,000 అయేయి. అవి మళ్లా Invest చేసాము.అవి 2016 నాటికి 2 లక్షల పై చిలుకు అవుతాయి. అప్పుడు బంగారం 10 గ్రాముల ధర 50,000 రూపాయలున్నా మాకు బాధలేదు. ఈ రోజైనా మా సేవింగ్స్ సర్టిఫికెట్ల విలువ 160000 ఉంటుంది.అవి Encash చేసుకుని  మా ఆవిడ చంద్రహారం కొనుక్కున్నా ఇంకా నాకో 50000 మిగిలినట్లే కదా? అంచేత మా ఆవిడ చంద్రహారం ఎక్కడికీ పోలేదు. మా పోస్టాఫీసులో భద్రంగా ఉంది. మేము కంటినిండా నిద్ర పోతున్నాము.అమాయకులైన ఆడవాళ్ళు మాత్రం చంద్రహారం అమ్మేసుకున్న మా ఆవిడ మీద జాలి చూపులు ప్రసరిస్తూనే ఉన్నారు.
                                                        ****
మా ఆవిడ మెళ్ళో ఏ నగా లేక పోవడం చూసి  ప్రక్కకు తిరిగి నవ్వుకునే ఆడవాళ్ళకు చిరు నవ్వే సమాధానం ఇచ్చే మా ఆవిడ నిజంగా బంగారమే. కాదంటారా?
                                                                             ****
                   

11, ఏప్రిల్ 2013, గురువారం

జారి పోయిన వింత అక్షరం కథ...






ఆ మధ్య డిశంబరు లో నేను వ్రాసిన ఎవరీ బుడతకీచులు అనే పోస్టులో పోర్చుగీసు వారు మన దేశంలో మొదటగా పశ్చిమ సముద్ర తీరం లోని కోజి కోడ్ లో మొదటగా కాలూనేరని వ్రాసేను. అది చదివిన మన అజ్ఞాత బ్లాగ్మిత్రుడొకరు దానిని కోజి కోడ్ అని కాదని కోళి కోడ్ అని వ్రాయాలని మళయాళీయులు అలాగే పలుకుతారని సూచించారు. దానికి నేను మళయాళీయులు దానిని ఉచ్చరించే విధంగా వ్రాయడానికి మన తెలుగు లిపి లో సరైన అక్షరం లేదనీ, ఇంగ్లీషులో దానిని KoZhikode అని వ్రాసినట్లే మన తెలుగు వారు కూడా కోజి కోడ్ అని వ్రాస్తున్నారని, కీ.శే. శ్రీ తూమాటి దొణప్ప గారు కూడా అలాగే వ్రాసేరని, నేను అదే అనుసరించాననీ వివరించాను. తమిళంలో కూడా ఇలాంటి ఉచ్చారణ కలిగిన శబ్దాన్ని మన వాళ్లు తెలుగులో జ అనే అక్షరంతోనే సూచిస్తున్నారు. నిజానికి తమిళ భాష లోని కజగం చెజియన్ అనే పదాలు వారు ఉచ్చరించే రీతిలో వ్రాయడానికి మనకి సరైన అక్షరం లేదు. అది ళ కాదు ఝ కాదు డ కాదు. ఆ ధ్వని వింత గా ఉంటుంది. అందు కనే కాబోలు సరదాగా మన ఆరుద్ర గారు

తమల పాకులు నములు
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు ఓ కూనలమ్మా అన్నారు.
నోటినిండా తాంబూలం వేసుకుని నములుతూ మాట్లాడితే మన తెలుగైనా తమిళం లాగే వినిపిస్తుంది మరి. సరే, వాళ్ల భాష వాళ్లకిష్టమొచ్చిన రీతిలో మాట్లాడుకుంటారు కాదనడానికి మనమెవరం? కానీ ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. మన తెలుగున్నూ, సోదర భాషలైన తమిళం, మళయాళం, కన్నడం కూడా ఒకే కుదురులోని మూల ద్రావిడ భాష నుంచి పుట్టినప్పుడు, ఈ వింత ధ్వనిని సూచించే అక్షరం మళయాళ తమిళ భాషల్లో ఆ భాషలు పూర్తిగా వేరయిన తర్వాత వచ్చి చేరిందా? లేక మూల ద్రావిడ భాష నుంచే ఆ భాషల్లోకి వచ్చి చేరి నేటికీ నిలచి ఉందా? అలా వచ్చి ఉంటే మన తెలుగు లోకి రాకుండా ఉండి ఉంటుందా? వచ్చి ఉంటే ఇప్పుడదేమయ్యింది? వచ్చిందండీ వచ్చింది. మన తెలుగు లోకీ వచ్చింది. దాని కథే నేనిప్పుడు చెప్పబోయేది.
తమిళ మళయాళ భాషల్లో ఉన్న ఈ వింత ధ్వనిని సూచించే అక్షరం ఆ భాషల్లాగే మన తెలుగు లోకీ, మన సోదర భాష అయిన కన్నడం లోకీ కూడా వచ్చి చేరింది. ప్రాచీన కన్నడంలో ఉండి తరువాత ఆభాషలో మాయమైంది. అలాగే మన తెలుగులో కూడా దాదాపు నన్నయ గారి కాలం వరకూ ఉండి ఆ తర్వాత పూర్తిగా మాయమైంది. నన్నయకు పూర్వపు శిలా శాసనాల్లోనూ, నన్నయ తర్వాత కాలంలో కొన్ని శిలా శాసనాల్లోనూ ఇది మధ్య లో గీత లేని మన బండిరా “ ఱ ” రూపంలో కనిపిస్తోంది. ఇది ఏ విధంగా ఉచ్చరించే వారో తెలుసు కోవడానికి అప్పటి ఉచ్చారణ రికార్డు లేదు కానీ అది కనిపించిన పదాలను బట్టి వాటిని నేడు మనం ఉచ్చరిస్తున్న తీరును బట్టి ఊహించుకోవచ్చు.ఆ అక్షరం స్థానంలో నేడు వివిధ పదాల్లో డ,ద,ళ,ల,ర,ఱ లు వచ్చి చేరాయి కనుక ఈ శబ్దాల మధ్యలో ఏదో ధ్వనితో ఉచ్చరించే వారని ఊహించ వచ్చు.

డా. కాల్డ్వెల్ మహాశయుడు దీనిని ఇంగ్లీషులోని rzh అనే అక్షరాలు కలిపి పలికితే వచ్చే ధ్వనిగా ఉచ్చరించేవారని అన్నాడు. కన్నడ భాషలో ఇప్పుడు లేక పోయినా పాత కన్నడంలో ఉన్న ఈ అక్షరాన్ని వారు “రళ ” మని అంటారుట. తెలుగులో ఇది వెయ్యేళ్లకు పూర్వమే అంతరించి పోవడం వల్ల మన వైయాకరణులు దీనికే పేరూ పెట్టకుండా వింత అక్షరమని మాత్రం వ్యవహరిస్తూ వస్తున్నారు. పూర్వం ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఱెందులూరే నేటి మన దెందులూరు. కోఱి..అన్నదే కోడి గా మారింది. చోఱ అన్నది చోళగా మారింది. ఆ విధంగా ఆ వింత అక్షరం నన్నయనాటికే డ,ద,ళ,ల,ర,ఱ లలో ఏదో ఒక ధ్వనిగా మారి స్థిర పడుతూ వచ్చింది.నన్నయ తన భారతంలో ఈ అక్షరాన్ని ఉపయోగించక పోవడం వలన, ఆ తరువాత కొద్ది శిలా శాసనాల్లో మాత్రమే ఇది కనిపించడాన్నిబట్టి చూస్తే, ఇది కనీసం ఏ ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల క్రిందటే మన వర్ణ మాల నుంచి జారి పోయిందని తెలుస్తోంది.అదీ ఈ వింత అక్షరం కథ. ఇలాగే కాలగమనంలో మన వర్ణమాలనుంచి జారి పోయిన, పోతున్న మరికొన్ని అక్షరాల గురించి మరోసారి ముచ్చటించుకుందాం.


బ్లాగ్మిత్రులందరికీ విజయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలతో —సెలవు. విజయ ఉగాది.11.4.13.


1, ఏప్రిల్ 2013, సోమవారం

అరనవ్వులాంటి అర సున్న కథ...




అరనవ్వులాంటి అరసున్న కథ...
“అమ్మాయే సన్నగా...అరనవ్వే నవ్వగా...” అంటూ అందంగా పాట వ్రాసేడో సినీకవి. సంస్కృతంలోని మందహాసాలూ దరహాసాల కంటె ఈ తెలుగు అరనవ్వు చాలా బాగుందనిపిస్తుంది నాకు.అరవిందేక్షణ ముఖారవిందంలోని మధురాధరాలపై మెరుపులా మెరిసి మాయమయ్యే అరనవ్వులాంటిదే మన అరసున్న కూడా.మన భాషలో నిలువుగా వ్రాసే ఈ అరసున్నని వెల్లకిలా పడుకోబెడితే నిజంగానే అర నవ్వులాగానే ఉంటుంది కదా? మన సాహితీ గగనంలో మెరుపులా మెరిసి మాయమైన అరసున్న కథేఁవిటో తెలుసుకుందాం.అయితే ముందుగా నిండుసున్న పుట్టి ఆ తర్వాతనే అరసున్న వెలిసింది కనుక ఈ కథ నిండు సున్న కథతోనే ప్రారంభించాల్సి ఉంటుంది.
ఇంతకు ముందు కొంగలూ..మేఁకలూ..సున్నలూ..అరసున్నలూ అనే పోస్టులో దాదాపు క్రీ.శ. నాలుగో శతాబ్ది వరకూ మన తెలుగు భాష లో నిండు సున్న కూడా కనిపించదని చెప్పాను కదా.అప్పటి వరకూ ఈ నిండు సున్న పలకాల్సిన చోట్లల్లా  మన కచటతప వర్గాల్లోని అనునాసికాలనే వ్రాసేవారని తెలుసుకున్నాము.ఉదా హరణకి పండు అని వ్రాయాల్సిన చోట పణ్డు అని వ్రాసేవారన్న మాట. క్రమేపీ  అనునాసికాల స్థానంలో అనుస్వారాల్ని వ్రాయడం ఆరంభమయింది. అనుస్వారమంటే నిండు సున్నాయే.అచ్చు లేకుండా దానికి ఉనికే లేదు కనుక దానిని అనుస్వారం అన్నారు.అయితే ఇది ఒక్కసారిగా ఇప్పటి నిండుసున్న రూపాన్ని సంతరించుకోలేదు.మొదట్లో దీనిని పలకవలసిన చోట అక్షరం మీద ఒక చుక్కలాగా వ్రాసేవారు. అంటే పం అని వ్రాయాల్సిని చోట  ప మీద చుక్క పెట్టే వారన్నమాట. ఈ చుక్కనే సంస్కృతాభిమానులైన మనవ్యాకరణ పండితులు బిందువు అన్నారు. అందుకే ఇప్పుడు మనం దాన్ని నిండుసున్నలా వ్రాస్తున్నా కూడా దానిని వారు బిందువనే వ్యవహరిస్తున్నారు.  కుండ,మంద లాంటి పదాల లోని డకార ద కారాల్ని బిందుపూర్వక డకారమనీ దకారమనీ అనడానకి కారణమిదే.కొన్నాళ్లకి వ్రాతలో ఈ చుక్క సరిగా కనిపించదనేమో దానిచుట్టూ సున్నలా చుట్టడం ప్రారంభించేరు.అప్పుడది తలకట్టు లేని ఠకారంలా ఉండేదన్నమాట.కాల క్రమంలో అక్షరం మీద వ్రాసే ఈ అనుస్వారాన్ని అక్షరం ప్రక్కను వ్రాయడం ఆరంభించేరు.కొన్నాళ్లకు లోపలి చుక్క పోయి చుట్టూ ఉన్న సున్న మాత్రం మిగిలింది. ఇలా అనునాసికంతో ప్రారంభమై అనుస్వారం వ్రాయడమనేది కొద్దిగా అటూ ఇటూగా నన్నయ కాలానికే పూర్తయింది.ఇదీ మన నిండుసున్న రూపుదిద్దుకున్న వృత్తాంతం.అయితే అనునాసికం వ్రాసినా అనుస్వారం వ్రాసినా కూడా కొన్ని కొన్ని చోట్ల దానిని పూర్తిగా ఒత్తి పలకడం గాని తేల్చి పలకడంగాని ఉంటూనే ఉండేది.అలా పూర్తిగా ఒత్తి పలికిన చోట అది పూర్ణానుస్వారం. తేల్చిపలికిన చోట అది అర్థానుస్వారం అన్నమాట.ఎలా పలికినా వ్రాతలో దానిని నిండుసున్నగానే వ్రాసేవారు.సున్నను పూర్తిగా ఒత్తి పలికితే దాని ముందున్న అక్షరం గురువవుతుంది.లేకపోతే అది లఘువవుతుంది కదా? రెండు సంజ్ఞలకీ నిండు సున్ననే వ్రాస్తే ఏది ఎలా పలకాలో ఏది గురువో ఏది లఘువో తెలుసుకోవడం ఎలాగ? అందుకని సున్నని పూర్తిగా పలకాల్సిన చోటుల్లో దాని తర్వాత వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరంగా వ్రాసే వారు. ఉదాహరణకి పండు లో సున్నపూర్తిగా పలకాలి కనుక పండ్డు అని వ్రాసివారన్నమాట. అలాగే మూండు అనే చోట డకారం ద్విత్వాక్షరంగా వ్రాయలేదు కనుక మధ్యలో సున్నా ఉన్నా దానిని మూఁడు అని తేల్చి పలకాలన్నమాట.ఇలాగ ఎక్కడ నిండు సున్నగా పలకాలో ఎక్కడ అర సున్నగా పలకాలో నిశ్చయమయిపోయినా మనకి అచ్చు యంత్రాలు వచ్చే వరకూ పైన చెప్పిన పధ్ధతే కొనసాగింది.మన తాళ పత్ర గ్రంథాలలో కూడా  ఈ పధ్ధతే కనుపిస్తుంది.శిథిలం కాకుండా ఉన్నఏ తాళ పత్ర గ్రంథాలలో నయినా ఇప్పటి అర సున్న రూపం ఉన్నట్టు ఎవరూ చెప్పలేదు. అందుచేత మనకు అచ్చుయంత్రాలతో పాటే ఈ అరసున్న ఇప్పటి రూపంలో ఆవిర్భవించిందని చెప్పాలి.అంటే దాదాపు రెండువందల ఏళ్ల క్రిందట ఇది లేదు. ఇప్పటికో యాభై ఏళ్లు పైనే అయింది ఇది మన వ్రాతల్లో కూడా కనుమరుగైపోయి. అచ్చుకి నోచుకున్న మన పాత ప్రబంధాలూ కావ్యాలూ సాహిత్యశాస్త్ర గ్రంథాల్లో తప్ప మరెక్కడా ఇప్పుడు కనిపించదు.అమ్మాయి వదనంలో ఇలా మెరిసి అలా మాయమైన అరనవ్వులాగా ఈ అరసున్న కూడా మన తెలుగు సాహితీ గగనంలో ఇలా మెరిసి అలా మాయమైంది. పూర్వం అనుస్వారం ఉండే చోట్ల దానికి జ్ఞాపకచిహ్నంగా మన కావ్యాల్లో మాత్రం ఇది మిగిలి పోయింది.

                                                                              



                                                                              



24, మార్చి 2013, ఆదివారం

కొంగలూ..మేఁకలూ..నిండు సున్నలూ..అరసున్నలూ..


               కొంగలూ..మేఁకలూ...నిండుసున్నలూ..అరసున్నలూ..
నేను బాగా చిన్నప్పుడు, అంటే అక్షరాలూ గుణింతాలూ నేర్చుకునే వయసులో వేసవి సెలవుల్లో మా యింట్లో పిల్లల అల్లరి భరించలేక మా పెద్దవాళ్లు మా పిల్లలందరినీ మా యింటికి నాలుగిళ్ల తర్వాత ఉన్న యింట్లో పిల్లలకి పాఠాలు చెప్పే కాంభుక్త మేష్టారు గారింటికి చదువు నేర్చుకోమని తోలే వారు, ఆ విధంగా నైనా ఓ గంట సేపు మా అల్లరి తప్పుతుందేమోనని.ఆ విధంగా చాలా చిన్నప్పుడు వారి దగ్గర కొద్ది రోజులు చదువుకోవడానికి వెళ్లడం తప్పిస్తే నేనెప్పుడూ ప్రయివేటుకి వెళ్లలేదు. ఈ రోజుల్లో ట్యూషను చెప్పించుకోవడాన్ని ఆ రోజుల్లో ప్రయివేటు  అనేవారు. ముళ్లపూడి ఈ ప్రయివేటు అన్నదానికి వేరే అర్ధం చెప్పడం వేరేకథ.ఇలా నేను కాంభొట్ల వారి దగ్గర గుణింతాలు నేర్చుకుంటున్న రోజుల్లో వారి దగ్గర ప్రయివేటు చదువుకుంటూ ఉండేవారిలో ఒకబ్బాయి మా అందరికంటే ఒకటి రెండేళ్లు పెద్ద వాడో ఏమో గాని చాలా పొడుగ్గా కొంగ లాగా ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా మాతో పాటే గుణింతాలు నేర్చుకుంటూ ఉండేవాడు. అసలు విషయమేమిటంటే, ఆ అబ్బాయి ఎప్పుడు పుస్తకం తీసి చదవమన్నా కొంగ అనే పదాన్ని కొజ్ఞ్ జ్ఞ్ గ అనే చదివే వాడు. మా వేసవి సెలవులూ ప్రయివేట్లూ అయిపోయాయి కానీ మేం అక్కడ ఉన్నన్నాళ్లూ కాంభొట్ల వారు ఎంత ప్రయత్నించినా ఆ కొజ్ఞ్ జ్ఞ్గ బాబు చేత కొంగ అనిపించ లేక పోయారు.
                                                        ***
ఈ కథ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే..వచ్చింది మరి.ఇప్పుడంటే మనం కొంగ అని మధ్యలో పూర్ణానుస్వారం  అనబడే నిండు సున్నతో వ్రాసి కొమ్.. మ్.. గ అనేటట్లు పలుకు తున్నాము గానీ, మన తెలుగు భాష పూర్తిగా స్థిర పడని తొలి రోజుల్లో దాదాపు క్రీ.శ. నాలుగో శతాబ్దం వరకూ తెలుగు భాషలో ఈ అనుస్వారం లేదు. అందు చేత ఆ ధ్వని పలుక వలసిన పదాలన్నిటిలోనూ అక్కడ అనునాసికాన్నే వాడేవారు. అనునాసికమంటే మన కచటతప వర్గాల్లో వర్గపు చివరి అక్షరాలన్నమాట. ఉదాహరణకి, పంకజము అనే మాటని అప్పుడు పజ్ఞ్కజము అని వ్రాసేవారన్నమాట. త వర్గంలో చివరి అక్షరం న.అందుచేత కాంత అనే పదాన్ని కాన్త అని వ్రాసేవారు.  పండుని  పణ్డు అని వ్రాసేవారు.  ఇలాగే అన్నీ. మరి అనునాసికమనే పదమే చెబుతుంది అది ముక్కుతో పలికే ధ్వని అని. మరి అలా టప్పుడు కొంగ ని కొజ్ఞ్ గ అనే వ్రాసి ముక్కుతో అలాగే పలికే వారన్న మాట. మరి మన కొంగ బాబు ఆ రోజుల్లో పుట్టి ఉంటే అతడి ఉచ్చారణని ఎవరూ తప్పు పట్టేవారు కారన్నమాటే కదా?  
                                                       ***
కొంగ అనే పదంలో నిండుసున్న అలాగే ఉండగా, మేఁక అనే పదంలో నిండుసున్న లేదు గానీ అరసున్న కనిపిస్తుంది.దీని గురించి కొచెం వివరంగా చెప్పాల్సి ఉంది. ఇంతకు ముందు తన పేరు మరచి పోయిన ఈఁగ కథ అనే పోస్టులో ఈగని మొదట్లో ఈజ్ఞ్గ అనీ .. ఆ తర్వాత ఈంగ అనీ తరువాత ఈఁగ అనీ ప్రస్తుతం అరసున్న కూడా విడచి పెట్టి ఈగ అని అంటున్నామనీ వ్రాసేను.ఇది  చదివిన బ్లాగ్మిత్రులొకరు చిన్నయ సూరి తన బాల వ్యాకరణము లో దీర్ఘము మీద సాధ్య పూర్ణ బిందువు రాదన్నాడనీ అందు చేత ఈఁగ ఎప్పటికీ ఈంగ కానేరదనీ వ్రాసేరు.చిన్నయ సూరి చెప్పినది నిజమే. ఆయన చాలా అర్వాచీనుడు. ఆయనకు ముందే ఎన్నో శతాబ్దాలకు పూర్వమే దీర్ఘము మీది పూర్ణానుస్వారాన్ని తేల్చి పలకడంతో అది మాయమై పోయి దాని స్థానంలో దాని గుర్తుగా అరసున్న మిగిలింది. అంతే గాని  దీర్ఘము మీద పూర్ణ బిందువు  ఎన్నడూ  లేదనడం సమంజసం కాదు.దీనికి ఉదాహరణగా కూతురనే అర్థంలో కూంతు అనే శిలా శాసన ప్రయోగమూ, వీడు అనే అర్థంలో నన్నెచోడుడు వాడిన వీండు అనే ప్రయోగమూ శ్రీ బూదరాజు వారు చూపించారు. “పదాది   వర్ణము పయినే ఊనిక యుండి యది గురువగుటవలనను ప్రక్కనున్న యనుస్వారము పయిని ఊనిక పూర్తిగా బ్రష్టమగుటను, దీర్ఘము పయినుండిన యనుస్వారము సార్వత్రికముగా బ్రష్టమయినది”అని తేల్చి చేప్పారు శ్రీ గంటి జోగి సోమయాజి గారు.అందు వలన ఈఁగ మొదటి రూపము ఈంగ అనీ,  దక్షిణాది తెలుగు వారు దానిని ఇప్పటికీ అలాగే ఉచ్చరిస్తారనీ  శ్రీ తిరుమల రామచంద్ర గారు చెప్పిన దానిని మనం అంగీకరించవలసే వస్తుంది. నా ఈఁగ కథ పోస్టులో చెప్పని విషయం ఒకటుంది. ఈఁగలు అనే బహువచన రూపమే మొదట వచ్చి దానినుంచి ఈగ అనే ఏక వచన రూపం వచ్చిందంటారు శ్రీ సోమయాజి గారు. అదెలాగంటే ఈజ్ఞ్ అనే మూల ద్రావిడ శబ్దానికి ఆ భాషలోని బహువచన ప్రత్యయమైన కళ్ అనేది చేరి ఈజ్ఞ్+కళ్ ఈంకళ్ ఈంగళ్ ఈంగలు అయిందనీ, మన తెలుగు భాషలో లు బహువచన ప్రత్యయంగా స్థిరపడిన తర్వాత ఈంగలు లోని లు ని మాత్రమే బహువచన ప్రత్యమనుకొని దానిని విడచి పెట్టి ఈంగ అనే ఏక వచన రూపం  అనుచిత విభాగం వలన ఏర్పడ్డదనీ సోమయాజిగారు తెలిపారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే-
 ఈఁగలు లాగే మేఁకలు అనే బహువచన రూపమే మొదట ఏర్పడి దానినుండి మేఁక అనే ఏక వచన రూపం ఏర్పడి ఉండి ఉండ వచ్చునని నా కనిపించడమే.ఈఁగలు ఈజ్ఞ్..అని శబ్దం చేయడం వల్ల వాటికి  ఈగలు అని పేరు వచ్చినట్లే మేజ్ఞ్..మేజ్ఞ్.. అని అరిచే వాటికి మేజ్ఞ్+కళ్ మేంకళ్ మేంకలు అని పేరు వచ్చి ఉండవచ్చును.
ఈఁగలు లో లాగానే మేంకలు లోని దీర్ఘము మీది పూర్ణానుస్వారము మీద ఊనిక తగ్గించి పలకడంతో మేఁకలు అయి ఉండవచ్చును. అయితే  మూల ద్రావిడ భాషలో ఏ రూపం ఉండేదో నాకు తెలియదు కనుక  మేఁకలు ఈగలు లాగే అనుచిత విభాగం వల్ల ఏర్పడిందో కాదో నిర్ధారించలేను. అది ఏ రకంగా ఏర్పడినా ముందు మేంకలు అనే రూపం ఉండేదనీ, దాని నుంచే మేఁకలు  అనే రూపం ఏర్పడి ఉంటుందనడానికి  మేఁకలు లోని అర్థానుస్వారమే సాక్ష్యం. కొంగలూ  మేఁకలూ లో నిండు సున్న అరసున్నల కథ ఇది. ఈ నిండు సున్న అరసున్నల గురించి చెప్పుకోవలసిన విశేషాలు మరికొన్ని ఉన్నాయి. అవి మరోసారి చెప్పుకుందాం.సెలవు.