5 ఎప్రిల్ 2014 శనివారం

మా తెలుగు తల్లికీ మల్లె పూదండా...(దండ లోని దారం కథ..)
మనం తెలుగు నేల మీద ఉన్నా దేశాంతరాలలో ఉన్నా , ఏ తెలుగు సాంస్కృతిక కార్యక్రమమైనా మా తెలుగు తల్లికీ మల్లె పూదండా ..మా కన్న తల్లికీ మంగళారతులూ..  అంటూ తెలుగు తల్లికి జేజేలు పలుకుతూ ప్రారంభిస్తాము. తెలుగు తల్లి విగ్రహానికి వేసిన మల్లెల మాల ధవళకాంతులీనుతూ కనిపిస్తూనే ఉంటుంది. ఆ మల్లెల సౌరభాలు దశదిశలా వ్యాపిస్తూనే ఉంటాయి. కానీ తెలుగు తల్లి మెడని మల్లెలు అలంకరించి మనల్ని అలరించడానికి కారణమైన ఆ సూత్రం—అదే- ఆ దారం మాత్రం కన్పించదు. దాని గురించి ఎవరమూ ఏ వేళా ఆలోచించం కూడా. పాట విని రసడోలలో తేలిపోతూ ఎదురుగా నిల్చొని పాడుతున్న గాయకుణ్ణి మెచ్చుకుంటూ మురిసి పోతాం. కాని దండలో దారం లాగా కనిపించని ఆ కవిని మాత్రం పట్టించుకోం. ఎప్పుడో అర్థశతాబ్దికి పూర్వమే, మనకి స్వాతంత్ర్యం రాకపూర్వమే మన తెలుగు తల్లి మెడలో వాడని ఆ మల్లె పూదండ వేసిన కవిగారి గురించి కొంచెం తెలుసుకుందాం.
ఈ గీతాన్ని వ్రాసిన కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్య గారు. వీరిని నేను 1960-70లలో ఒకసారి చూసేను. వీరి అన్న(లేక తమ్ముడు) గారైన కృష్ణమాచారిగారు అప్పట్లో నేను పనిచేసే ఆడిట్ ఆఫీసు (A.G’s Office, Hyderabad) లో అకవుంట్స్ ఆఫీసరుగా పనిచేస్తూ ఉండేవారు. ఒక సాయంత్రం ఆఫీసు పని ముగిసేక మా రంజని గ్రంథాలయంలో శ్రీ సుందరాచారి గారితో ఇష్టాగోష్టి ఏర్పాటు చేసేరు. రంజని గ్రంథాలయానికి కేటాయించబడ్డ ఆ మారుమూల పాతకాలపు హాలులో పట్టుమని పాతికమందిమి కూడా లేమనే నాకు గుర్తు. ఏమయితేనేం అలా ఆ కవిగారిని చూడడం వారితో ముచ్చటించగలగడం నాకింకా లీలగా గుర్తుంది. వారు పొడగరి కాదు. అర్భకంగా అయిదూ అయిదున్నర అంగుళాల ఆసామీ. మిగిలిన వివరాలేమీ నాకిప్పుడు గుర్తు రావడం లేదు. వారి అన్నతమ్ముడైన మా కొలీగ్ శ్రీ కృష్ణమాచారిగారు మాత్రం మన లోక్ సభ స్పీకర్ గా పని చేసిన శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగారి అల్లుడని మాత్రం తెలుసు. 1974లో నేనూ శ్రీ కృష్ణమాచారిగారూ  ఒక ఆడిట్ నిమిత్తం ఒంగోలు వెళ్ళి అక్కడ రహదారి బంగళాలో కలసి ఉండడం ఆయనతో చేసిన సాహితీ గోష్టి కొంచెం కొంచెంగా గుర్తుకొస్తున్నాయి. (ఈ విషయం ఎందుకు చెప్పానంటే సుందరంబాడి వారింట్లోనే సాహితీ వాసనలు గుబాళిస్తూ ఉండి ఉంటాయేమోననే ఊహ రావడం వల్లనే )
సుందరాచారి గారి గురించి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన స్వేఛ్చాలోలుడు. ఎవరినీ లెక్క జేసే మనిషి కాడట. అందువల్లనే ఏదో విషయంలో తన పై అధికారులతో విభేదించి తాను పని చేస్తున్న డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన రచనలమీదే ఆధారపడి జీవించాడట. మతి స్థిమితం లేని ఆయన భార్య కంచిలో ఎవరో బంధువుల ఆశ్రయంలో ఉండేదట. పుస్తకాలు రాసి వాటిని అచ్చేసుకుని ఊరూరా తిరిగి అమ్ముకుంటూ కాలం గడిపే వాడట. ఎన్ని కష్టాలు పడ్డాడో బ్రతుకెలా ఈడ్చుకొచ్చాడో?  ఏ దుర్భర జీవితం ఆయనను పురిగొల్పిందో కాని తాగుడు వ్యసనానికి  పూర్తిగా బానిసైపోయి పూర్తిగా స్పృహ లేని స్థితిలో తిరుపతి వీధుల్లో తనువు చాలించారట. గుణ లేశం ఎక్కడ కనిపించినా మెచ్చుకుంటూ, వెలిగే దివ్వెలకు నూనె పోస్తూ, గట్ల మథ్య
ఇమడలేని వరద వెల్లువలా జీవించిన ఆయన జీవితమనే గంభీర విషాదాంత నాటకానికి ఆవిధంగా తిరుపతి వీధుల్లో తెరపడిందంటారు ఆయన గురించి బాగా తెలిసిన  ప్రఖ్యాత కథకులు కీర్తి శేషులు శ్రీ మధురాంతకం రాజారాం గారు. శ్రీ సుందరాచారి గారికీ,  తన ఈ పై పాటకీ సంబంధించిన ఆసక్తిదాయకమైన ఓ ముచ్చట- శ్రీ రాజారాం గారు చెప్పినదే -అందరూ తెలుసుకోవలసినది ఒక్కటీ చెప్పి ముగిస్తాను.
1976లో ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం  తొలి తెలుగు ప్రపంచ మహా సభలు హైదరాబాదులో ఘనంగా  నిర్వహించారు. ఆ సందర్భంగా మా తెలుగు తల్లికీ మల్లె పూదండా.. గీతాన్ని తెలుగు వారి జాతీయగీతంగా నిర్ణయించడంతో పాటు ఆ పాటని మొదటిసారి గ్రామఫోను రికార్డులో పాడిన విదుషీమణి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారిని ప్రత్యేకంగా లండనునుంచి రప్పించి సభల ప్రారంభగీతంగా పాడించారట. అందుకోసం లండను నుంచి విమానంలో వచ్చిన సూర్యకుమారిగారు నేరుగా  ఫైవ్ స్టార్ హోటల్లో దిగి బస చేసి సభాప్రాంగణానికి కారులో వచ్చి పాట పాడేసి తిరిగి కారులో తెలుగు నేల మట్టైనా కాళ్ళకు అంటుకోకుండా వెళ్లిపోయారట. ఆ సభకు వచ్చిన సాహితీ పరులు కొందరు  మన ఈ రాష్ట్రీయగీతాన్ని రచించిన కవి గారి గురించి ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం గురించి చాలా విచారించారట. అలా విచారిస్తున్న రాజారాం గారికి ఆ రాత్రి పది గంటల సమయంలో  స్టేడియం సోపాన పంక్తుల మీంచి నడుచుకుంటూ ఒక్కడూ వెళ్ళి పోతున్న సుందరాచారిగారు కనిపించారట. రాజారాం గారు పలకరించగానే ఆయనతో   నన్నింత నిర్లక్ష్యం చేస్తారట్రా వీళ్లు? ఊరుకుంటానట్రా? మండలి వేంకట కృష్ణారావుకు కబురు పంపించాను.  రేపు ఉదయం ఆరుగంటలకు కలవమన్నారు అంటూ వెళ్లి జనంలో కలసి పోయారట. మరునాడు ఆయన మండలి కృష్ణా రావు గారిని కలవగానే ఆయన   కవి గారి చిరునామా తెలియకపోవడంతో అలా జరిగిందనీ దానికి చాలా చింతిస్తున్నామనీ చెప్పి మరునాడు మహా సభల్లో  ఆయనను తగురీతిని సత్కరించడంతో పాటు కవిగారికి జీవితాంతం వర్తించేలా జీవనభృతిని కూడా ఏర్పాటు చేసారట. నాటి విద్యాశాఖా మంత్రి   ప్రపంచ తెలుగు మహా సభల నిర్వాహకులు అయిన మండలి వారి సంస్కారం గొప్పది. అయితే ఆయన పెద్ద మనసుతో కవిగారికేర్పాటు చేసిన ఆ జీవన భృతి (ఆ రోజుల్లో నెలకు 250 రూపాయలు) కవి గారికి మంచి కంటే చెడే ఎక్కువ చేసిందనీ అంతకు ముందు చేతిలో పైకం లేక తక్కువగా తాగే కవిగారు చేతిలో సొమ్ము గలగల లాడటంతో విపరీతంగా తాగి  ఆరోగ్యం పాడుచేసుకున్నారంటారు శ్రీ మధురాంతకం రాజారాం గారు. కవిగారు ఎలా కాలం చేసినా కలకాలం మిగిలే పాట ఒకటి మనకి మిగిల్చి పోయారు.
వేద్దాము వేద్దాము మన తెలుగు తల్లికీ మల్లె పూదండలూ...
చేద్దాము చేద్దాము మన కవిగారికీ కోటి దండాలూ...
( కవిగారితో తనకు గల పరిచయాన్ని రికార్డు చేసిన శ్రీ రాజారాం గారికి  కృతజ్ఞతలతో- సెలవు.)  
         

26 ఫిబ్రవరి 2014 బుధవారం

నువ్వూ నేనూ ఒకటే..


నువ్వూ నేనూ ఒకటేనని నేనంటే
కాదంటావు నువ్వు, కసురుకుంటావు, పోపొమ్మంటావు.
నీకూ నాకూ సాపత్తెమేమిటంటావు.
అవున్నిజమే.
నువు సెప్పింది నిజమే దొరా.
మీదేమో మారాజు లాంటి పుట్టుక
మాకేమో మట్టి పిసుకుడే జీవిక
వడ్డించిన ఇస్తరి మీ జీవితం
మేం ఇస్తట్లో మెతుకు కోసం దేవులాడుతం.
అదికారం ఎప్పుడూ మీ అర చేతనే
అందుకనే అందరికీ మీరంటే భయం
అనాద బతుకులు మావి
అందుకే ఎవరన్నా మాకే భయం.
జీవితం మీ అందరికీ దేవుడిచ్చిన వరం
మాకివ్వలేదేమని మేమెన్నడూ బాధ పడం
కానీ,  అకారణంగా మమ్మల్ని చిన్న చూపు చూడకయ్యా
మూణ్ణాళ్ళ ముచ్చట చూసి మురిసి పోకయ్యా
నువ్వూ నేనూ ఒకటయ్యే రోజొకటొస్తది.
అప్పుడు-
నీదైనా నాదైనా ఆ ఆరడుగుల నేలే
నేనైనా నువ్వైనా ఆ పిడికెడు మట్టే  !!

( ఈ కవిత పొరపాటున తొలగించబడడం వలన మళ్ళా పొస్టు చేస్తున్నాను.)


24 జనవరి 2014 శుక్రవారం

కారుణ్యం ఒక కవిత.కారుణ్యం ఒక కవిత.

కాగితాల కట్ట ముందేసుకుని కలం పట్టుక్కూర్చుంటే
కవిత్వం వచ్చి రాలి పడదు.
కలం లోంచి కవిత్వం ఉబికి రాదు.
మస్తిష్కాన్ని మథిస్తే మాటలు పుంఖాను పుఖంగా పుట్టించ వచ్చు.
వాటితో మాటల గారడీలూ చేయవచ్చు.
అయితే కవిత్వం మాత్రం వ్రాయ లేవు.
నిజమైన కవిత్వం కావాలంటే-
వేదనాగ్రస్తమైన లోకాన్ని పరికించి చూడు.
నీ చూపుల్లోంచి ధర్మాగ్రహం  నీ మనస్సును చేరి దాన్ని దహించి వేస్తే
కరిగిన నీ హృదయం కార్చే కన్నీటి ధారల్లో
తడిసిన పదాలు పాటల పల్లవులవుతాయి
పద్యాల పాదాలవుతాయి.
కరుణ రసప్లావితమైన కవిత-అప్రయత్నంగానే-
నీ పెదాలు దాటి దూకుతుంది.
పదిమందినీ చేరుతుంది.
పది కాలాల పాటు బ్రతుకుతుంది.


23 నవంబర్ 2013 శనివారం

ఒక అరుదైన ఫోటోలో మాన్యుడైన సామాన్యుడు

     

ఈ ఫోటో సుమారు 70 సంవత్స రాల క్రిందటిది.  అంత పాత ఫోటోలు మనకు చాలా అరుదు గానే లభిస్తాయి. లభించిన వాటిల్లో కూడా మనుషులను స్పష్టంగా గుర్తు పట్టే విధంగా ఉండేవి చాలా తక్కువ గానే ఉంటాయి. ఇది అటువంటి వాటిల్లో ఒకటి.
ఈ ఫోటో 1940 ప్రాంతాలది. విజయనగరం సంగీత కళాశాలకు సంబంధించినది. 

ఫోటో మధ్యలో కుర్చీలో ఆసీనులై ఉన్నవర్చస్వి శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు. వారు ఆ రోజుల్లో  సంగీత కళాశాల లో గాత్ర పండితుని గా పని చేస్తూ ఉండేవారు. ఆయన మధుర గాయకుడే కాకుండా వాగ్గేయకారుడు కూడా. కర్ణాటక సంగీతంలో దిట్ట అయినా, ఆ దాక్షిణాత్య సంగీతపు పోకడలు పోకుండా కొంత స్వతంత్రించి కమ్మటి తెలుగు మాటలు వినిపించేటట్లుగా పాడడం వలన అవి జనరంజకం గా కూడా ఉండేవి. ఉత్తరాంధ్రలో ఆ రోజుల్లో సంగీత కళా మతల్లి కి ఈయన చేసిన సేవల గురించి వివరంగా కావాలంటే  పట్రాయని వారి బ్లాగ్లో  చూడ వచ్చును.
ఇక్కడ ఈ ఫోటోలో గురువు గారికి ఎడమ ప్రక్కన క్రిందన ( ఫోటోలో క్రింద నేల మీద కూర్చున్న వారిలో ఎడమ వైపు నుండి మూడవ వారు  తరువాతి కాలంలో ఆంధ్ర దేశాన్ని తన గాన మాధుర్యంతో ముంచెత్తిన  మహా గాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు). శ్రీ ఘంటసాల గురించి నేనేం చెప్పినా చర్విత చర్వణమే అవుతుంది కనుక దానికి పూనుకోవడం లేదు. కానీ ఈ నాటి విద్యార్థులు, యువత  ఈ ఫోటోని చూసి గ్రహించ వలసిన ముఖ్య విషయమిటంటే - తామెంత ప్రతిభావంతులమైనా ఆ ప్రతిభ రాణించడానికి, విద్యాసముపార్జనకి వినయ విధేయతలతో సద్గురువులను సేవించుకోవడం అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. శ్రీ ఘంటసాలకి మధురస్వనం భగవద్దత్తమే ఐనా, తాను పెద్దవాడైన తర్వాత  కీర్తనలు పాడినా లలిత సంగీతం పాడినా ఆంధ్ర దేశాన్ని ఉర్రూత లూగించేటట్లు పాడే ఫణితి తన  గురువు గారి వద్ద నేర్చుకున్నదే. అది వారి వరప్రసాదమే. గురువుల పాదాల చెంత కూర్చోవడానికి  నేటి శిష్యులెవరైనా  సిధ్ధ పడతారా?

ఈ ఇద్దరి ప్రముఖుల గురించి చెప్పడం కాదు ఈ నా పోస్టు ఉద్దేశం. వీరి గురించి ఎక్కడో ఒక చోట అందరూ తెలుసుకునే అవకాశం ఉంది కదా? మరెందుకయ్యా మొదలెట్టావు అంటే వినండి మరి.
ఇంతకు ముందు 2011 అక్టోబరు మాసం లో నేను వ్రాసిన  రెండు గొప్ప కథలు అనే పోస్టులో శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడుగారు  విజయనగరం సంగీత కాలేజీలో పని చేస్తుండగా అప్పటి కింకా కీర్తి ప్రతిష్టలు రాక పోవడం వల్ల  ఎక్కువ గా కచేరీలు చేసే అవకాశం కాని, సరైన గౌరవ పురస్కారాలు అందు కోవడం కాని జరుగని రోజుల్లో, ఆ కాలేజీలో బంట్రోతు (ఇప్పుడు మనం ప్యూన్ అని పిలిచే చిరుద్యోగి) తన స్వంత సంపాదనతో ఒక రామాలయం కట్టించి దానిలో విగ్రహ ప్రతిష్ట చేసిన రోజున, శ్రీ నాయుడు గారి కచేరీ చేయించి వారికి అంతకు ముందెవ్వరూ ఇవ్వని విధంగా 116 రూపాయలిచ్చి సన్మానించి తన రామ భక్తినీ సంగీతాభిమానాన్నీ చాటుకున్న సంగతీ,. ఆ తర్వాత శ్రీ రామ ప్రసాదం గా పాయసాన్ని సేవించి నిద్ర లోనే దైవ సాయుజ్యాన్ని పొందిన శ్రీ రామస్వామి అనే వ్యక్తిని గురించి చదివే ఉంటారు. 

అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ కూడా  రామ భక్తి తోనూ సంగీతజ్ఞుల సేవ లోనూ తరించిన ఆ అసామాన్యుని  ఫోటో మీకూ చూపించే అవకాశం దొరకడమే ఈ పోస్టు వ్రాయడానికి కారణం. 

 పైనున్న ఫోటోలో కుడివైపు చివర వినమ్రంగా చేతులు కట్టుకుని డవాలా ధరించి నిల్చున్న ధన్యజీవి  శ్రీ రామస్వామియే.
                                              ******
(ఇంత మంచి ఫొటోని ఇంత చక్కగా భద్రపరచిన  వయో వృధ్ధులు,  శ్రీ పట్రాయని సంగీతరావుగారు (సీతారామ శాస్త్రి గారి జ్యేష్ఠ కుమారులు- అభినందనీయులు.)
                                              
                                                ****8 సెప్టెంబర్ 2013 ఆదివారం

ఆత్మ గౌరవ యాత్ర?

   
                                 
 అయ్యా  ఈ హెడ్డింగు చూసి నేనేదో ఈ పేరుతో జరుగుతున్న రాజకీయ బస్సు యాత్ర గురించి రాస్తున్నానని భ్రమ పడి ఇటు రావద్దు. నాకూ రాజకీయాలకీ ఆమడ దూరం.  అంటే  ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలగురించి నాకు ఏ అభిప్రాయాలు లేవని కాని కలగవని కాని కాదు. వాటిని వేటినీ ఈ నా బ్లాగులో నేను చర్చించను. వాటికిది వేదిక కాదు. కాకూడదు. అయితే ఆత్మ గౌరవ యాత్ర గురించి ఎందుకెత్తుకున్నావయ్యా అంటే  ఆ పేరుతో బస్సు యాత్ర జరుగుతోందని విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఆత్మ గౌరవమంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? అసలు ఆత్మ గౌరవమంటూ ఉన్న వాడెవరైనా ఏ రాజకీయ పార్టీలోనైనా మనగలడా? రాజకీయాల్లో ఉన్న వారిని వారే పార్టీకి చెందిన వారైనా సరే  పొద్దున లేస్తే ఎవరో ఒకరు తిట్టి పోయకుండా ఒక్కరోజైనా గడవదు కదా? మరి అలాంటప్పుడు వాటినన్నిటినీ దిగ మ్రింగు కుంటూ  కాలం గడపాల్సిన రాజకీయవేత్తలకి ఆత్మగౌరమననేది ఎలా ఉంటుంది ?  Politics is the last resort of a scoundrel – ఇంకే గతీ లేని దౌర్భాగ్యులకి రాజకీయాలే గతి – అన్న నానుడి ఉండనే ఉంది కదా?  అందు చేత ఈ ఆత్మ గౌరవానికీ రాజకీయాలకీ ముడి ఎలా పడుతుంది? కావున నేను రాయబోయేది రాజకీయ ఆత్మ గౌరవ బస్సు యాత్ర గురించి కానే కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
                                 ఆత్మ గౌరవంతో జీవన యాత్ర సాగించాలంటే, అది ఏ యాత్రల వల్లా రాదు. అది ఒకరిస్తే వచ్చేది కాదు. అది మన జీవన విధానం వల్ల వస్తుంది. ఏ ప్రలోభాలకీ లోను కాకుండా, ఒకరికి తలవంచ కుండా, తాను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని  సార్లు చెప్పాల్సి వచ్చినా నిస్సంకోచంగా చెప్పగలవాడే ఆత్మ గౌరవం కలవాడు. అటువంటి ఆత్మ గౌరవంతో మన తెలుగు నాట మసలిన ముగ్గురు కవి వర్యుల గురించి ఇంతకుముందు నా కవులూ- వారి ధిషణాహంకారమూ అనే పోస్టులో వ్రాసి ఉన్నాను. అటు వంటివే ఇద్దరు సంగీతజ్ఞుల ముచ్చట్లు చెబుతాను వినండి.
                                               ***
దాదాపు నూరేళ్ళ క్రిందట ఉత్తరాంధ్ర ప్రాంతంలో  మధురాపంతుల పేరయ్య గారనే సంగీత విద్వాంసులుండే వారు. వారు కాస్త భూ వసతి కలిగిన వారేమో భుక్తికి లోటు లేదు.ఆయన  తంజావూరులో సంగీత సాధన చేసి వచ్చిన వారు. సంగీత విద్యలో ఆరి తేరిన వారు కనుక శిష్యులకు సంగీత పాఠాలు చెబుతూ కాలక్షేపం చేసేవారు. కొంచెం కోపిష్టి కూడా కావడంతో శిష్యులు ఏ తప్పు చేసినా సహించే వారు కాదట. ఆయన వద్ద సంగీతం నేర్చుకోవడమే గొప్ప కనుక శిష్యులు వారి కోపాన్ని భరిస్తూ అణకువగా జాగ్రత్తగా మసలుకునే వారట. ఈ సంగీత కళానిధి  విజయనగరాధీశుల మన్ననని కూడా పొందిన వారు. ఆయన ఒక రోజు ఒక ఊళ్ళో సంగీత కచేరీ చేస్తున్నారట. అందరూ శ్రధ్ధగా వింటూంటే సభలో ఒక చోట ఒక ప్రభుత్వాధి కారి ప్రక్కవారితో సంభాషణ పెట్టకోవడం ఆయన కళ్ళ పడ్డది. వెంటనే కచేరీ ఆపేసి కోపంగా అటువైపు చూసేరట. సంగతి గ్రహించిన ఆ అధికారి ఏదో సర్ది చెప్పుకోడానికి ప్రయత్నిస్తుంటే
ఇది నా కచేరీ. నీ కచేరీలో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు లేచి వెళ్ళాకే తిరిగి నా కచేరీ ప్రారంభమవుతుంది. అంతే అన్నారు. ఆ నాడు ఆ అధికారి నిష్క్రమించాకే తిరిగి కచేరీ జరిగిందనుకోండి. అతి తక్కువ మంది ప్రభుత్వోద్యోగులుండే ఆ రోజుల్లో వారి హుకుం నిరంకుశంగా సాగే రోజుల్లో ఇలా తమ గౌరవానికి భంగం కలుగకుండా చూసుకోగలగడం గొప్ప విషయమే కదా? ( ఈ కథ విన్నప్పుడు మీకు శంకరాభరణం శంకర శాస్త్రి గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఆయనా ఇలాంటి వాడే కదా? )
                                              ****

                                          ఈ రెండో ముచ్చట హరికథా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాలుగా ఉంటున్న రోజులలో జరిగినదీ వారికే సంబంధించినదీను. దాసు గారు కొంచెం భోజన పుష్టి కలవారు కనుక భోజనం చేయగానే భుక్తాయాసం వల్ల కొంచెం సేపు కునుకు తీయడం వారికి తప్పని సరయ్యేది. అలా ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎండ మండి పోతూ ఉండగా ( అందులో మా విజయ నగరం ఎండల సంగతి చెప్పేదేముంది )  దాసు గారు వారి ఆఫీసు ( సంగీత కాలేజీ ప్రిన్సిపాలు గది ) లో చిన్న అంగోస్త్రం మాత్రం ధరించిన వారై బెంచీ మీద కునుకు తీస్తూ ఉన్నారట. గాలి ఆడడానికి తలుపులు తీసే ఉన్నాయి. అయ్యగారు నిద్రలో ఉన్నారు కనుక బంట్రోతుకు చుట్టకాల్చుకునే ఆట విడుపు సమయమది. అతడందుకే దూరంగా పోయి ఎక్కడో తన్మయంగా చుట్ట కాల్చుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక విద్యాధికారి వచ్చి ప్రిన్సిపాలు గది తలుపులు తెరిచే ఉండడం చూసి లోపలికి ప్రవేశించాడట. దాసుగారిని ఆఫీసులో ఆ భంగిమలో చూసేసరికి ఆ అధికారికి అవమానంగా తోచి కోప కారణమయ్యిందట. ఆ అధికారి వెంటనే గద్దిస్తూ దాసుగారిని ఏదో అన్నాడట. వెంటనే దాసుగారు ఏయ్ మిష్టర్ నువ్వెవరైనా సరే. ఇది నా ఆఫీసు. ఇందులో నా యిష్టం వచ్చినట్లు ఉంటాను. నా అనుమతి లేకుండా లోపలికి రాకూడదని తెలియదా? నువ్వు ముందు బయటకు నడువు. నేను పిలిపించి నప్పుడు లోపలికి వద్దువు గానివి. అన్నారట. బయటకు నడుస్తున్న ఆ అధికారి ముఖంలో నెత్తురు చుక్కఉండి ఉండదు. ఉద్యోగాలు ఊడిపోతాయేమో నన్నభయంతో పై అధికారుల అడుగులకు మడుగులొత్తేవరెవరైనా అలా మాట్లాడగలరా? అది ఆత్మ గౌరవానికి ప్రతిరూపమైన ఆ ఆదిభట్ల దాసు గారికే సాధ్యం.
                                                ***
ఇవి విన్నాకైనా ఆత్మగౌరవమనేది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో మనకి అర్థమౌతుందా? దానికోసమేమైనా యాత్రలు చేయాలా?
                                                ***