23, ఏప్రిల్ 2013, మంగళవారం

మా ఆవిడ బంగారం...


                         
మా ఆవిడ బంగారం అని నేననగానే అది మీకు రెండు విధాల అర్థమయ్యే అవకాశం ఉంది.మొదటిది నేను మా ఆవిడను బంగారం లాంటి మనిషని మెచ్చుకుంటున్నానని, రెండవది మా ఆవిడకు చెందిన బంగారమనీ.ఇటువంటి విషయాల్లో స్పష్టత కోసమే మన వాళ్లు రెండో అర్థం వచ్చేటట్లు చెప్పాల్సివచ్చినప్పుడు మా ఆవిడ యొక్క బంగారం అని  విభక్తి ప్రత్యయం చేర్చి చెప్పాలనే వారు. ఈ యొక్క అనే విభక్తి ప్రత్యయాన్ని మన వాళ్లు పాత రోజులలో చాలా ధారాళంగా వాడేవారు.ఇది నాయొక్క పుస్తకము, ఈవిడ నా యొక్క భార్య అన్నట్లు.వక్తలూ, రాజకీయవేత్తలూ అయితే మరీని. అవసరం ఉన్నా లేక పోయినా ఆ యొక్క ఈ యొక్క అంటూ మాట్లాడే వారు.ఇప్పుడీ యొక్క అనేది  మాటల్లోనే కాదు వ్రాతల్లోనూ దాదాపు మాయమయి పోయింది. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడమే.. సరే. అదలా ఉంచండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మా ఆవిడ యొక్క ( ఒకప్పుడుండీ ఇప్పుడులేని ) బంగారం కథ.ఇది చదివేక  మా ఆవిడ బంగారమో కాదో మీరే చెబుదురు గాని.
దాదాపు 40 ఏళ్ళ క్రిందట, సరిగా చెప్పాలంటే 1970 లో నేను రెండు నెలలు సెలవు పెట్టాను. ఆ సెలవు నేను  ఇప్పటి శ్రీ రాం సాగర్ (అప్పట్లో దానిని పొచంపాడు ప్రోజెక్టు అనే వారు) లో పని చేస్తుండగా తీసుకోవడం వల్ల ఆ సెలవు జీతం రెండు నెలలకు 1200 రూపాయలు నాకు కొంచెం ఆలస్యంగా అందేయి. ఆ సెలవు కాలంలో ఇంట్లో ఉండే సేవింగ్స్ తోనే పొదుపుగా గడపడం వల్ల ఈ 1200 రూపాయలూ బోనస్ గా వచ్చినట్లనిపింది. అప్పుడు వాటిని పుట్టింటి కెళ్ళిన మా శ్రీమతికి నీ యిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో అంటూ పంపించాను. ఆడబ్బులు పెట్టి అప్పుడు ఆవిడ నాలుగు తులాలు బరువుతూగే నాలుగు పేటల చంద్రహారం ఒకటిన్నీ ఒక జత గాజులూ కొనుక్కుంది.గాజులు నిత్యం వేసుకున్నా చంద్రహారం మట్టుకు పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ వెళ్ళి నప్పుడు మాత్రం వేసుకునేది.ఇలా ఉంటే ఆరోజుల్లో కొన్నాళ్లు హైదరాబాదులో దొంగల భయం ఎక్కువగా ఉండేది. సివారు ప్రాంతాల్లోనే కాదు నగరం నడిబొడ్డున ఉన్న కాలనీలలో కూడా రాత్రుళ్లు కాలనీ వాసులు గస్తీ తిరిగే వారు.మా కోలనీలో కూడా అలాగే కొన్నాళ్లు గస్తీ తిరిగే వాళ్ళలో నా వంతు వచ్చినప్పుడు నేనూ నిద్ర మానుకుని తిరిగే వాడిని. ఇంట్లో కొంచెమైనా బంగారం ఉండబట్టి కదా భయపడడం. లేకపోతే ఎంత మనశ్శాంతితో జనం జీవించగలరో కదా అనుకునే వాడిని. బంగారం మంచి పెట్టుబడి (investment ) అన్న అభిప్రాయం నాకెప్పుడూ లేదు.అందుకనే చంద్రహారం అమ్మేస్తే మంచిదనే ఆలోచన నాకు కలిగింది. మా ఆవిడ కూడా రెండో ఆలోచన లేకుండా అమ్మి పారేయండి అంది. ఆ విధంగా  1980లోఆ నాలుగు పేటల చంద్రహారాన్ని అమ్మేసాను.గ్రాముకు 125 చొప్పున 44 గ్రాముల చంద్రహారానికి 5500 రూపాయలు వచ్చేయి.( ఆ తూకం బిల్లు రశీదు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి). ఇంట్లో ఏ బంగారమూ లేక పోవడం వల్ల నిశ్చింతగా నిద్ర పోతూ హాయిగా ఉండేవాళ్ళం.ఆ తర్వాత ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో వారికి ఏదో ఒకటి కొనడం తప్ప తన కోసం మాత్రం ఎప్పుడూ మా ఆవిడ బంగారం నగలు చేయించుకోలేదు.( నేను రిటైరయ్యాక ఒకటి రెండు జతల గాజుల చేయించుకుందేమో అంతే.) ఎప్పుడైనా ఏ పెళ్ళళ్లలోనో ఫంక్షన్లలోనో మా ఆవిడ మెడలో  పుస్తెలతాడు తప్ప ఏమీ లేకపోవడం చూసి చంద్రహారం ఉండాలిగా వేసుకోలేదేం అడిగిన వారికి మా ఆవిడ సమాధానం చిరునవ్వే అయ్యేది. 
                                                     ****
ఇంతకు ముందెన్నడూ లేనంతగా గడచిన దశాబ్ద కాలంలో పసిడి ధర తారాజువ్వలా ఎగసి తులం (10గ్రాములు) 32,000 తాకినప్పుడు కూడా మా ఆవిడ కాని నేను కాని అయ్యో చాలా చవగ్గా తులం 1250 కే అమ్మేసామే అని బాధ పడలేదు.గడచిన వారంలో బంగారం ధరలు పడిపోయి తులం 26000 కి దిగివచ్చి నప్పుడు  జనం బంగారం షాపుల ముందర క్యూలు కట్టిమరీ బంగారం కొనుక్కోవడం చూస్తే నవ్వుకునే వాళ్ళం. మొన్ననిలాగే క్యూలో నిలబడి  బంగారం వస్తువేదో కొనుక్కొచ్చి మా ఆవిడకు చూపించి అక్కయ్యగారూ మీరూ గొలుసేదైనా కొనేసుకోండి  మళ్లా ధర పెరిగి పోతుందేమో అని ఉచిత సలహా ఇచ్చి వెళ్తున్న మిత్రురాలికి అలాగే లెండి అంటూ సమాధానమిస్తూ నా వేపొక సారి చూసి చిరునవ్వు నవ్వింది మా ఆవిడ.
                                                      ****
ఇలా మేమిద్దరం నవ్వుకోవడానికి కారణం లేక పోలేదు. ఎందు చేతనంటే 1980లో మేము చంద్ర హారాన్ని అమ్మగా వచ్చిన 5500 రూపాయలలో 5000 రూపాయలు (40 గ్రాముల ధర) పెట్టి పోస్టాఫీసులో సేవింగ్సు సర్టిఫికెట్లు కొన్నాము.అవి 6 ఏళ్ళలో 1986 నాటికి 10,000 అయేయి.అవి అలా Reinvest  చేస్తూ పోతే 2010 నాటికి అవి 1,28,000 అయేయి. అవి మళ్లా Invest చేసాము.అవి 2016 నాటికి 2 లక్షల పై చిలుకు అవుతాయి. అప్పుడు బంగారం 10 గ్రాముల ధర 50,000 రూపాయలున్నా మాకు బాధలేదు. ఈ రోజైనా మా సేవింగ్స్ సర్టిఫికెట్ల విలువ 160000 ఉంటుంది.అవి Encash చేసుకుని  మా ఆవిడ చంద్రహారం కొనుక్కున్నా ఇంకా నాకో 50000 మిగిలినట్లే కదా? అంచేత మా ఆవిడ చంద్రహారం ఎక్కడికీ పోలేదు. మా పోస్టాఫీసులో భద్రంగా ఉంది. మేము కంటినిండా నిద్ర పోతున్నాము.అమాయకులైన ఆడవాళ్ళు మాత్రం చంద్రహారం అమ్మేసుకున్న మా ఆవిడ మీద జాలి చూపులు ప్రసరిస్తూనే ఉన్నారు.
                                                        ****
మా ఆవిడ మెళ్ళో ఏ నగా లేక పోవడం చూసి  ప్రక్కకు తిరిగి నవ్వుకునే ఆడవాళ్ళకు చిరు నవ్వే సమాధానం ఇచ్చే మా ఆవిడ నిజంగా బంగారమే. కాదంటారా?
                                                                             ****
                   

11, ఏప్రిల్ 2013, గురువారం

జారి పోయిన వింత అక్షరం కథ...


ఆ మధ్య డిశంబరు లో నేను వ్రాసిన ఎవరీ బుడతకీచులు అనే పోస్టులో పోర్చుగీసు వారు మన దేశంలో మొదటగా పశ్చిమ సముద్ర తీరం లోని కోజి కోడ్ లో మొదటగా కాలూనేరని వ్రాసేను. అది చదివిన మన అజ్ఞాత బ్లాగ్మిత్రుడొకరు దానిని కోజి కోడ్ అని కాదని కోళి కోడ్ అని వ్రాయాలని మళయాళీయులు అలాగే పలుకుతారని సూచించారు. దానికి నేను మళయాళీయులు దానిని ఉచ్చరించే విధంగా వ్రాయడానికి మన తెలుగు లిపి లో సరైన అక్షరం లేదనీ, ఇంగ్లీషులో దానిని KoZhikode అని వ్రాసినట్లే మన తెలుగు వారు కూడా కోజి కోడ్ అని వ్రాస్తున్నారని, కీ.శే. శ్రీ తూమాటి దొణప్ప గారు కూడా అలాగే వ్రాసేరని, నేను అదే అనుసరించాననీ వివరించాను. తమిళంలో కూడా ఇలాంటి ఉచ్చారణ కలిగిన శబ్దాన్ని మన వాళ్లు తెలుగులో జ అనే అక్షరంతోనే సూచిస్తున్నారు. నిజానికి తమిళ భాష లోని కజగం చెజియన్ అనే పదాలు వారు ఉచ్చరించే రీతిలో వ్రాయడానికి మనకి సరైన అక్షరం లేదు. అది ళ కాదు ఝ కాదు డ కాదు. ఆ ధ్వని వింత గా ఉంటుంది. అందు కనే కాబోలు సరదాగా మన ఆరుద్ర గారు

తమల పాకులు నములు
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు ఓ కూనలమ్మా అన్నారు.
నోటినిండా తాంబూలం వేసుకుని నములుతూ మాట్లాడితే మన తెలుగైనా తమిళం లాగే వినిపిస్తుంది మరి. సరే, వాళ్ల భాష వాళ్లకిష్టమొచ్చిన రీతిలో మాట్లాడుకుంటారు కాదనడానికి మనమెవరం? కానీ ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. మన తెలుగున్నూ, సోదర భాషలైన తమిళం, మళయాళం, కన్నడం కూడా ఒకే కుదురులోని మూల ద్రావిడ భాష నుంచి పుట్టినప్పుడు, ఈ వింత ధ్వనిని సూచించే అక్షరం మళయాళ తమిళ భాషల్లో ఆ భాషలు పూర్తిగా వేరయిన తర్వాత వచ్చి చేరిందా? లేక మూల ద్రావిడ భాష నుంచే ఆ భాషల్లోకి వచ్చి చేరి నేటికీ నిలచి ఉందా? అలా వచ్చి ఉంటే మన తెలుగు లోకి రాకుండా ఉండి ఉంటుందా? వచ్చి ఉంటే ఇప్పుడదేమయ్యింది? వచ్చిందండీ వచ్చింది. మన తెలుగు లోకీ వచ్చింది. దాని కథే నేనిప్పుడు చెప్పబోయేది.
తమిళ మళయాళ భాషల్లో ఉన్న ఈ వింత ధ్వనిని సూచించే అక్షరం ఆ భాషల్లాగే మన తెలుగు లోకీ, మన సోదర భాష అయిన కన్నడం లోకీ కూడా వచ్చి చేరింది. ప్రాచీన కన్నడంలో ఉండి తరువాత ఆభాషలో మాయమైంది. అలాగే మన తెలుగులో కూడా దాదాపు నన్నయ గారి కాలం వరకూ ఉండి ఆ తర్వాత పూర్తిగా మాయమైంది. నన్నయకు పూర్వపు శిలా శాసనాల్లోనూ, నన్నయ తర్వాత కాలంలో కొన్ని శిలా శాసనాల్లోనూ ఇది మధ్య లో గీత లేని మన బండిరా “ ఱ ” రూపంలో కనిపిస్తోంది. ఇది ఏ విధంగా ఉచ్చరించే వారో తెలుసు కోవడానికి అప్పటి ఉచ్చారణ రికార్డు లేదు కానీ అది కనిపించిన పదాలను బట్టి వాటిని నేడు మనం ఉచ్చరిస్తున్న తీరును బట్టి ఊహించుకోవచ్చు.ఆ అక్షరం స్థానంలో నేడు వివిధ పదాల్లో డ,ద,ళ,ల,ర,ఱ లు వచ్చి చేరాయి కనుక ఈ శబ్దాల మధ్యలో ఏదో ధ్వనితో ఉచ్చరించే వారని ఊహించ వచ్చు.

డా. కాల్డ్వెల్ మహాశయుడు దీనిని ఇంగ్లీషులోని rzh అనే అక్షరాలు కలిపి పలికితే వచ్చే ధ్వనిగా ఉచ్చరించేవారని అన్నాడు. కన్నడ భాషలో ఇప్పుడు లేక పోయినా పాత కన్నడంలో ఉన్న ఈ అక్షరాన్ని వారు “రళ ” మని అంటారుట. తెలుగులో ఇది వెయ్యేళ్లకు పూర్వమే అంతరించి పోవడం వల్ల మన వైయాకరణులు దీనికే పేరూ పెట్టకుండా వింత అక్షరమని మాత్రం వ్యవహరిస్తూ వస్తున్నారు. పూర్వం ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఱెందులూరే నేటి మన దెందులూరు. కోఱి..అన్నదే కోడి గా మారింది. చోఱ అన్నది చోళగా మారింది. ఆ విధంగా ఆ వింత అక్షరం నన్నయనాటికే డ,ద,ళ,ల,ర,ఱ లలో ఏదో ఒక ధ్వనిగా మారి స్థిర పడుతూ వచ్చింది.నన్నయ తన భారతంలో ఈ అక్షరాన్ని ఉపయోగించక పోవడం వలన, ఆ తరువాత కొద్ది శిలా శాసనాల్లో మాత్రమే ఇది కనిపించడాన్నిబట్టి చూస్తే, ఇది కనీసం ఏ ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల క్రిందటే మన వర్ణ మాల నుంచి జారి పోయిందని తెలుస్తోంది.అదీ ఈ వింత అక్షరం కథ. ఇలాగే కాలగమనంలో మన వర్ణమాలనుంచి జారి పోయిన, పోతున్న మరికొన్ని అక్షరాల గురించి మరోసారి ముచ్చటించుకుందాం.


బ్లాగ్మిత్రులందరికీ విజయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలతో —సెలవు. విజయ ఉగాది.11.4.13.


1, ఏప్రిల్ 2013, సోమవారం

అరనవ్వులాంటి అర సున్న కథ...
అరనవ్వులాంటి అరసున్న కథ...
అమ్మాయే సన్నగా...అరనవ్వే నవ్వగా...అంటూ అందంగా పాట వ్రాసేడో సినీకవి. సంస్కృతంలోని మందహాసాలూ దరహాసాల కంటె ఈ తెలుగు అరనవ్వు చాలా బాగుందనిపిస్తుంది నాకు.అరవిందేక్షణ ముఖారవిందంలోని మధురాధరాలపై మెరుపులా మెరిసి మాయమయ్యే అరనవ్వులాంటిదే మన అరసున్న కూడా.మన భాషలో నిలువుగా వ్రాసే ఈ అరసున్నని వెల్లకిలా పడుకోబెడితే నిజంగానే అర నవ్వులాగానే ఉంటుంది కదా? మన సాహితీ గగనంలో మెరుపులా మెరిసి మాయమైన అరసున్న కథేఁవిటో తెలుసుకుందాం.అయితే ముందుగా నిండుసున్న పుట్టి ఆ తర్వాతనే అరసున్న వెలిసింది కనుక ఈ కథ నిండు సున్న కథతోనే ప్రారంభించాల్సి ఉంటుంది.
ఇంతకు ముందు కొంగలూ..మేఁకలూ..సున్నలూ..అరసున్నలూ అనే పోస్టులో దాదాపు క్రీ.శ. నాలుగో శతాబ్ది వరకూ మన తెలుగు భాష లో నిండు సున్న కూడా కనిపించదని చెప్పాను కదా.అప్పటి వరకూ ఈ నిండు సున్న పలకాల్సిన చోట్లల్లా  మన కచటతప వర్గాల్లోని అనునాసికాలనే వ్రాసేవారని తెలుసుకున్నాము.ఉదా హరణకి పండు అని వ్రాయాల్సిన చోట పణ్డు అని వ్రాసేవారన్న మాట. క్రమేపీ  అనునాసికాల స్థానంలో అనుస్వారాల్ని వ్రాయడం ఆరంభమయింది. అనుస్వారమంటే నిండు సున్నాయే.అచ్చు లేకుండా దానికి ఉనికే లేదు కనుక దానిని అనుస్వారం అన్నారు.అయితే ఇది ఒక్కసారిగా ఇప్పటి నిండుసున్న రూపాన్ని సంతరించుకోలేదు.మొదట్లో దీనిని పలకవలసిన చోట అక్షరం మీద ఒక చుక్కలాగా వ్రాసేవారు. అంటే పం అని వ్రాయాల్సిని చోట  ప మీద చుక్క పెట్టే వారన్నమాట. ఈ చుక్కనే సంస్కృతాభిమానులైన మనవ్యాకరణ పండితులు బిందువు అన్నారు. అందుకే ఇప్పుడు మనం దాన్ని నిండుసున్నలా వ్రాస్తున్నా కూడా దానిని వారు బిందువనే వ్యవహరిస్తున్నారు.  కుండ,మంద లాంటి పదాల లోని డకార ద కారాల్ని బిందుపూర్వక డకారమనీ దకారమనీ అనడానకి కారణమిదే.కొన్నాళ్లకి వ్రాతలో ఈ చుక్క సరిగా కనిపించదనేమో దానిచుట్టూ సున్నలా చుట్టడం ప్రారంభించేరు.అప్పుడది తలకట్టు లేని ఠకారంలా ఉండేదన్నమాట.కాల క్రమంలో అక్షరం మీద వ్రాసే ఈ అనుస్వారాన్ని అక్షరం ప్రక్కను వ్రాయడం ఆరంభించేరు.కొన్నాళ్లకు లోపలి చుక్క పోయి చుట్టూ ఉన్న సున్న మాత్రం మిగిలింది. ఇలా అనునాసికంతో ప్రారంభమై అనుస్వారం వ్రాయడమనేది కొద్దిగా అటూ ఇటూగా నన్నయ కాలానికే పూర్తయింది.ఇదీ మన నిండుసున్న రూపుదిద్దుకున్న వృత్తాంతం.అయితే అనునాసికం వ్రాసినా అనుస్వారం వ్రాసినా కూడా కొన్ని కొన్ని చోట్ల దానిని పూర్తిగా ఒత్తి పలకడం గాని తేల్చి పలకడంగాని ఉంటూనే ఉండేది.అలా పూర్తిగా ఒత్తి పలికిన చోట అది పూర్ణానుస్వారం. తేల్చిపలికిన చోట అది అర్థానుస్వారం అన్నమాట.ఎలా పలికినా వ్రాతలో దానిని నిండుసున్నగానే వ్రాసేవారు.సున్నను పూర్తిగా ఒత్తి పలికితే దాని ముందున్న అక్షరం గురువవుతుంది.లేకపోతే అది లఘువవుతుంది కదా? రెండు సంజ్ఞలకీ నిండు సున్ననే వ్రాస్తే ఏది ఎలా పలకాలో ఏది గురువో ఏది లఘువో తెలుసుకోవడం ఎలాగ? అందుకని సున్నని పూర్తిగా పలకాల్సిన చోటుల్లో దాని తర్వాత వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరంగా వ్రాసే వారు. ఉదాహరణకి పండు లో సున్నపూర్తిగా పలకాలి కనుక పండ్డు అని వ్రాసివారన్నమాట. అలాగే మూండు అనే చోట డకారం ద్విత్వాక్షరంగా వ్రాయలేదు కనుక మధ్యలో సున్నా ఉన్నా దానిని మూఁడు అని తేల్చి పలకాలన్నమాట.ఇలాగ ఎక్కడ నిండు సున్నగా పలకాలో ఎక్కడ అర సున్నగా పలకాలో నిశ్చయమయిపోయినా మనకి అచ్చు యంత్రాలు వచ్చే వరకూ పైన చెప్పిన పధ్ధతే కొనసాగింది.మన తాళ పత్ర గ్రంథాలలో కూడా  ఈ పధ్ధతే కనుపిస్తుంది.శిథిలం కాకుండా ఉన్నఏ తాళ పత్ర గ్రంథాలలో నయినా ఇప్పటి అర సున్న రూపం ఉన్నట్టు ఎవరూ చెప్పలేదు. అందుచేత మనకు అచ్చుయంత్రాలతో పాటే ఈ అరసున్న ఇప్పటి రూపంలో ఆవిర్భవించిందని చెప్పాలి.అంటే దాదాపు రెండువందల ఏళ్ల క్రిందట ఇది లేదు. ఇప్పటికో యాభై ఏళ్లు పైనే అయింది ఇది మన వ్రాతల్లో కూడా కనుమరుగైపోయి. అచ్చుకి నోచుకున్న మన పాత ప్రబంధాలూ కావ్యాలూ సాహిత్యశాస్త్ర గ్రంథాల్లో తప్ప మరెక్కడా ఇప్పుడు కనిపించదు.అమ్మాయి వదనంలో ఇలా మెరిసి అలా మాయమైన అరనవ్వులాగా ఈ అరసున్న కూడా మన తెలుగు సాహితీ గగనంలో ఇలా మెరిసి అలా మాయమైంది. పూర్వం అనుస్వారం ఉండే చోట్ల దానికి జ్ఞాపకచిహ్నంగా మన కావ్యాల్లో మాత్రం ఇది మిగిలి పోయింది.