శ్రీ సాయి నామ మంత్రము
ఆశ్రయ మని మదిని తలచి ఆరాధించన్
ఆసాయి గురుడు భక్తుల
బాసట గా నిలచి పరమ పదమును చేర్చున్
షిరిడీ నాథుని దయకై
కరములు మొగిడిచి మనమును కరుణాత్ముని పై
తిరముగ నిలుపుచు సతతము
పరమాత్మా యనుచు పిలిచి ప్రార్థింపదగున్
ప్రణవ స్వరూప పావన
గుణసాంద్ర సకల మునిగణ ఘోషిత చింతా
మణి, యగణిత సాధుసుజన
గణ వందిత, మా ప్రణతులు గైకౌను స్వామీ
అమృతానంద ప్రదాతా
సమధిక భక్తజన హృదయ సంవాసీ, ఓ
విమలాత్మా విమలచరిత
సమస్త దురితాపతహార సద్గురు సాయీ
శ్రీ పాద వల్లభా,మా
పాపాలన్నియు హరించు బాబా సాయీ
ఓ పావన చరితా, మము
కాపాడగ కోరుకొందు కావుము సాయీ
కోరను కోరికలను, కడ
తేరని నాబాధల కథ తెలియును నీకే
చీరను వేరొక దైవము
కారుణ్యము జూపి నన్ను కావుము సాయీ
గడచిన దినముల నన్నియు
గడపితి నీ సేవ మరచి గరువము తోడన్
కడచితి తిమిరపు సంద్రము
విడువను నీ పాద సేవ వేళెంతైనన్
పిలిచిన పలికే దైవమ
కలలను సాకారపరచు కరుణామయుడా
కొలిచెద నీ పదయుగళము
తలపుల నిన్నే నిలుపుచు ధ్యానము వీడన్
కలుగని సిరులను కోరను
కలలవి నెరవేరకున్న క్రాగుచు నుండన్
కలిగిన కలుముల తృప్తిని
కలిగించిన సద్గురు, గుణ గానము చేతున్
అడుగక నెన్నడు అమ్మయు
కుడువగ బెట్టదు అదెంత కూరిమి యున్నన్
అడుగకనే వరమిచ్చెడి
కడుకరుణామయుడు సాయి కాచెడు జనులన్
సాయిని కొలిచెడి జనులకు
ఏ యాపద కలుగ బోదు యెన్నండైనన్
పాయక భక్తుల గాచెడి
సాయికి జేజేలు పలికి సాగిల బడుదున్
సద్భావన మదినిండగ
సద్భాషణములనె వినుట ఆపై నీపై
సద్భక్తి కలిగియుండుట
మద్భాగ్యము గానె తలతు మదిలో సాయీ !
శుభం.