27, సెప్టెంబర్ 2012, గురువారం

చరిత్ర చెప్పని కథలు...థగ్గుల కథ..


       
నేను 1957 లో కాలేజీలో ప్రీ యూనివర్శిటీ కోర్సు లో చేరాను.(అదే మొదటి బాచ్). మా అదృష్టమో దురదృష్టమో గాని (మమ్మల్ని సర్వ జ్ఞాన సంపన్నులని చేయాలనే సదుద్దేశం తోనే కావచ్చు)మా సైన్సు విద్యార్థులకు కూడా ఆర్ట్స్ పాఠాలు చెప్పడం ప్రారంభించారు.ఆ విధంగా మేము హిస్టరీ కూడా చదువుకోవలసి వచ్చింది.అప్పుటి మా హిస్టరీ లెక్చరర్ గారు గంటకొడుతూనే వచ్చి కుర్చీలో కూర్చొని కదలకుండా చూపులైనా అటూ ఇటూ మరల్చకుండా( ప్రముఖ గాయని జానకి గారు ఏ మాత్రం కదలకుండా నిల్చుని పాట పాడినట్లు) ఏకబిగిని మళ్లా గంట కొట్టే పరకూ లెక్చర్ దంచి లేచి వెళ్లి పోయేవారు.మేం వింటున్నామో లేదో కూడా ఆయన పట్టించుకునే వారు కాదు.అప్పటికే చరిత్ర పాఠాలంటే సదభిప్రాయం లేని నాకు ఆయన పాఠం చెప్పే తీరుతో విసుగు కూడా కలిగేది.ఇదిగో అలాంటి తరుణం లోనే నేను శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదవడం,దానిలోని దేశ చరిత్రలు గేయం నన్ను విశేషంగా ఆకర్షించడం జరిగాయి.ఏ రాజులు ఎప్పుడు ఏలారో, వారి వంశావళి,ఏ యుధ్ధం ఎప్పుడు జరిగిందో తారీఖులు దస్తావేజులు--ఇవన్నీ అసలైన చరిత్ర కాదు. క్రోమాన్యాన్ గుహా ముఖాల్లో మానవ కథ వికాసమెట్టిది అంటూ నిజమైన చరిత్రకర్థం చెప్పాడు శ్రీశ్రీ. గతంలో జన సామాన్యం ఎట్లా బ్రతికేరు?వాళ్ల కష్ట సుఖాలేమిటి?వారి రక్షణ కోసం ప్రభువులేం చేసారు?ఇలాంటి వన్నీ తెలుసు కోవాలనీ అదే నిజమైన చరిత్ర అనీ అప్పుడు నాకనిపించింది.అందుకే జీవిత చరిత్రలు చదువుతాను. వాటిలో ఏ మాత్రమైనా ఆనాటి సంఘ స్వరూపం కన్పించక పోతుందా అని..అందుకే నాకు చరిత్ర కన్నా చరిత్ర చెప్పని కథలే ఇష్టం.( చరిత్ర చెప్పని కధలెలా ఉంటాయో మీరే చూడండి.)
                                                            ***
దేశ చరిత్రలు గేయం లోనే ఒక చోట పిండారులు థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన అంటాడు శ్రీశ్రీ. ఆ రోజుల్లో ఈ పిండారులు,థగ్గులు ఎవరో నాకు తెలియక పోయినా వారెవరో దోపిడీ దారులై ఉంటారని Context ని బట్టి అర్థం చేసుకుని ఊరుకున్నాను.ఈ మధ్య వరకూ కూడా పిండారులంటే ఆయుధ పాణులై గుంపులు గుంపులుగా ఊళ్ల మీద పడి దోచుకునే దండులని తెలుసుకాని ధగ్గుల గురించే సరిగా తెలియదు.వారు కూడా పిండారుల వంటి వారే అనుకుంటూ ఉండే వాడిని. కాని ధగ్గుల కథ చాలా విచిత్రమైనది.వారి కథ వింటే మనలో ఒకే సారి ఆశ్చర్యమూ అసహ్యమూ క్రోథమూ ముప్పిరి గొంటాయి. వారి కథ వినండి:
                                                               ***
థగ్గులనే వారు మనదేశంలో ఎప్పటినుంచి ఉన్నారో సరిగా తెలియదు గాని,19వ శతాబ్దం నాటికి వారు అనేక వేల సంఖ్యలో ఉన్నట్లు,ఆశేతు హిమాచలం వ్యాపించినట్లు తెలుస్తోంది.అందువల్ల వారు కనీసం అంతకుముందు రెండు మూడు వందల ఏళ్లనుంచయినా మన దేశంలో చాలా చోట్ల ఉండి ఉంటారనిపిస్తోంది. ధగ్గులనే వారు ఒక మతానికో ఒక కులానికో చెందిన వారు కాదు.వారిలో అన్ని మతాల వారూ అన్నికులాల వారూ ఉన్నారు.అయితే వీరి మూల పురుషులెవరో కాని వారు హిందూమతావలంబులైనట్టు తోస్తోంది. కారణం వారు ఏ మతంవారైనా వారి  వారి మతాచారాలను పాటిస్తున్నా,వారందరూ కూడా దుర్గా మాత లేక భవానీ మాత భక్తులు.ఆ మాత యెడల అచంచలమైన విశ్వాసం కలవారు.ఆమెను ప్రార్థించనిదే వారు ఏ పనీ మొదలు పెట్టరు.వారు దోపిడీలతో పాటు హత్యలకు పాల్పడడానికి వారు చెప్పే కారణం చిత్రంగా ఉంటుంది.
వారు చెప్పేదేమిటంటే,భగవంతుడికి రెండు పార్శ్వాలున్నాయనీ ఒక పార్శ్వం సృష్టి కార్యానికి నిర్దేశించబడిందయితే,రెండవ పార్శ్వం సృష్టిని నాశనం చేయడానికి నిర్దేశించబడిందనీను. సృష్టి కార్యం త్వరత్వరగా జరుగుతూ ఉంటే వినాశనం మెల్లగా జరుగుతోందనీ,అందువల్లనే భగవంతుడు మానవులను సంహరించడానికే తమను సృష్టించాడనీ.ఆ విధంగా తాము భగవన్నిర్దేశం ప్రకారమే హత్యలు చేస్తున్నామని భావిస్తారు.అందుచేతనే వారు ఎన్ని హత్యలు చేసినా ఏ మాత్రం బాధ పడరు. పైగా భగవత్కార్యాన్ని నెరవేర్చామని సంతోషిస్తారు.కేవలం దోచుకోవడం వారి అభిమతం కాదు.హత్య చేయడం వారి ప్రధానోద్దేశం.హత్య చేసి దోచుకోవడం వారి లక్ష్యం. కొన్ని వందల సంవత్సరాల పాటు వారు ఈ వృత్తిని నిరాటంకంగా కొనసాగించినా జన సామాన్యానికో ప్రభుత్వాలకో వారి ఆనుపానులన్నీ తెలియకుండా ఉండడానికి వారి కట్టుబాట్లూ రహస్య వ్యవహార శైలీ కారణాలై ఉంటాయి. అక్బరు పాదుషా కాలంలో వీరిలో చాలా మంది పట్టుబడడం శిక్షింపబడడం జరిగిందట.ఈ విధంగా అడపా దడపా వారిలో కొందరు పట్టువడడం శిక్షింప బడడం జరిగినా వారి గురించిన పూర్తి సమాచారం కాని  వారి ఆచార వ్యవహారాలు కాని హత్యలు చేసే పధ్ధతుల గురించి కాని 1830 వరకూ లోకానికి తెలియలేదు. ఈ వ్యవస్థని రూపుమాపడానికి తగిన ప్రయత్నాలూ జరుగ లేదు.
వీరు మామూలు సమయాలలో వ్యాపారాలు చేసుకుంటూనో వారి వారి ఇతర వ్యాపకాలలోనో జనజీవనంలో కలిసి మెలిసే ఉంటారు.ఉన్నట్టుండి వారు నిర్దేశిత సమయాలలో వారి వారి గృహాలనుంచి మాయమై పోతూంటారు.ఎక్కడికి వెళ్లేదీ ఏ పని మీద వెళ్లేదీ తిరిగి ఎప్పుడు వచ్చేదీ ఎవ్వరికీ తెలియనివ్వరు. అలా మాయమైన వారందరూ నిర్దేశిత స్థలంలో కలుసుకుంటారు. ఇలా కొన్నికొన్నిగుంపులు ఒకచోట కలుసుకుంటారు.సాధారణంగా ఇది దసరాల సమయంలో ఉంటుంది.అప్పటికి వర్షాలు కట్టిపెట్టి వారి వృత్తికి అనుకూలంగా ఉంటుందని కాబోలు ఈ సమయాన్ని ఎంచుకుంటారు.వారి ఆరాధ్యదైవం అమ్మవారి పూజాసమయం అనికూడా కావచ్చు.ఆ విధంగా కలుసుకున్నవారందరూ ఏ ఏ గుంపులు ఎటువెళ్లాలో నిర్ణ యించుకుంటారు.ఆ విధంగా నిర్ణయించుకున్న తర్వాత అమ్మవారి పూజ చేసి శకునం కోసం ఎదురు చూస్తారు. వారు ఎదురు చూసిన శకునం కన్పించగానే భవానీ మాత ఆశీస్సులు తమకు లభించాయనే తృప్తి చెంది వేరు వేరు గుంపులుగా బయలు దేరుతారు.ఆతరువాత వీరు ఎవరిని హత్య చేసి దోచుకోవాలో ఎంచుకునే విధానమూ వారిని హత్య చేసే పధ్ధతీ చాలా చిత్రంగా ఉంటాయి, ఒకొక్క గుంపు వారు ఎన్నుకున్న మార్గాన పయనించి ఏదో ఒక ఊరి బయట డేరాలు వేసుకుని మకాం చేస్తారు. అప్పుడువారిలో ఒకరిద్దరు పెద్దమనుషుల్లాగా తయారై ఊళ్లోకి వెళ్తారు. వీళ్ల పని ఆ వూరినుంచి ఎవరైనా పనిమీద గాని వ్యాపారనిమిత్తంగాని ఎక్కడికైనా వెళ్ల బోతున్నారా?ఎప్పుడు బయలు దేరబోతున్నారు? వారిని చంపి దోచుకుంటే లాభసాటిగా ఉంటుందా?మొదలైన పూర్తి వివరాలు సేకరిస్తారు. ఆతరువాత వారితో మాటలు కలిపి తాము సైనికులమనీ తామూ అటే ప్రయాణిస్తున్నామనీ వారికి దారిలో దొంగల భయంలేకుండా రక్షణ కల్పించగలమనీ వారిని నమ్మించి వారిని తమతో ప్రయాణించేటట్లు చేస్తారు.ఈ పని వారు అత్యంత సమర్థవంతంగా చేయగలవారై ఉంటారు.థగ్గులు వీరిని సోథా లని పిలుస్తారు.ఆ విధంగా సోథాలు తీసుక వచ్చిన వారిని మిగిలిన వారు ఏ అనుమానం రాకుండా వారితో సన్నిహితంగా మెలుగుతూ ప్రయాణిస్తూ వారికి నమ్మకాన్ని పెంచుతారు.ఈ విధంగా కొంత దూరం ప్రయాణించాక వారిని ఎక్కడ మట్టు పెట్టాలో ముందే నిర్ణయించుకుని తమలో కొంత మందిని ముందుకు పంపుతారు.వీరి పని హత్య చేయబడిని వారిని పూడ్చడానికి అనువైన ప్రదేశం వెతికి అక్కడ అవసరమైన సైజుల్లో గోతులు తీసి తయారుగా ఉంచడమే. వీరు తీసే గోతులని భిల్లులనీ వీరిని లఘాలనీ అంటారు. ఈ విధమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాక నిర్దేశిత స్థలానికి చేరుకోగానే అక్కడ విడిది చేసి డేరాలు వేసి తమతో వచ్చిన ప్రయాణీకులను కూర్చోపెట్టుకుని పిచ్చాపాటీయో,గానా భజానానో ప్రారంభిస్తారు.తాము చంపదలచుకున్నవారి ప్రక్కనే ముఠాలోని సభ్యులు చేరి కూర్చొని ఉంటారు. వారిని భుట్టోటులంటారు. వీరి చేతుల్లో పొడుగాటి రుమాళ్లు ఒక చివర వెండి కాసు కట్టి ముడి వేసి ఉంటాయి. ఆ విధంగా వీరు సర్వ సిధ్ధంగా  తమ నాయకుడి సైగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.వారి నాయకుడైన జమేదారు వారికి తెలిసిన సంజ్ఞ తంబాకు లావో అనో పాన్ లావో అనో అనగానే భుట్టోటులు తమ చేతిలోని రుమాళ్ళను తమకు నిర్దేశించ బడిన వ్యక్తి మెడచుట్టూ బిగించి లిప్త కాలంలో హతమారుస్తారు.హతునికి నోరు తెరిచి అరిచే అవకాశం కూడా ఇవ్వరు.ఏ కొద్దిమందో కొంచెం సేపు గిలగిల కొట్టుకుని మరణిస్తారట.వారు మరణించగానే వారిబట్టలూడదీసి వారి సంపదనంతా దోచి మూటకట్టుకుంటారు. వారి శవాలను ముందుగా తీసి పెట్టిన గోతుల వద్దకు తీసుకు పోయి వాటిల్లో పూడ్చి పెడతారు.అలా పూడ్చి పెట్టేముందు శవాల పొట్టలను చీల్చుతారట.లేక పోతే పూడ్చిపెట్టిన శవాలు ఉబ్బి ఆ ప్రదేశంలో మట్టి పైకి ఉబ్బినట్లయి నక్కలకీ వాటికీ వాటి ఉనికి తెలిసిపోతుందని ఈ జాగ్రత్త తీసుకుంటారు.ఈ పనయిపోగానే అక్కడనుంచి వెంటనే బిచాణా ఎత్తివేసి మరో చోటికి తరలి పోతారు.తర్వాత తీరిగ్గా దోచుకున్నసోమ్ముని వారి వారి పధ్ధతుల్లో పంచుకుంటారు.అలా కొన్ని హత్యలూ దోపిడీలు చేసాక తిరిగి వారి వారి స్వస్థలాలు చేరుకుని ఎవరికీ ఏ అనుమానం రాకుండా మరలా వారి మామూలు జీవనం కొనసాగిస్తారు. కొన్ని చోట్ల వీళ్లతో ఆ యావూళ్ల జమీందారులూ పటేళ్లూ పెద్దపెద్ద భూస్వాములూ కొంతమంది మిలాఖత్ అయి ఉండేవారు.వారు ధగ్గులకి రక్షణ కల్పించేవారు.అటువంటివారికి ఈ ధగ్గుల దోపిడీల సంపాదనలో వాటా ఉండేది.
ధగ్గులు ఏటా తమ పని మీద బయలు దేరే టప్పుడే కాదు,ఎవరినైనా హత్య చేసాక కూడా కృతజ్ఞతా సూచకంగా వెంటనే దేవిని పూజించడం బెల్లం ప్రసాదంగా పెట్టి దాన్ని స్వీకరించడం చేస్తారు.శకునాలు చూసి కాని బయలు దేరరు.మంచి శకునం కనిపిస్తే భవానీ మాత ఆశీర్వాదాలు లభించినట్లే భావిస్తారు.మంచి శకునం లేక పోతే అడుగు ముందుకు వేయరు. అలాగే బయలు దేరిన తర్వాత ఒక హత్యైనా చేయకుండా ఎవరూ గడ్డం కాని క్షవరం కాని చేసుకోరు. పాన్ వేసుకోరు. వరో విషయమేమిటంటే వీరు స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం గాని వారి మానహరణం చేయడం గాని ఎప్పుడూ చేయరు. ఎప్పుడైనా తప్పని సరి పరిస్థితుల్లో స్త్రీలనూ పిల్లలనూ చంపడం జరిగినా అది వీరి మతం కాదు.అలాగే సంఘంలో కొన్నిజాతులు కులాల వారిని (చాకళ్లు పూజారులు దర్జీలు,వడ్రంగులు,కంసాలులు తెలకులవారు, శిక్కులు,ఫకీర్లు మతప్రచారకులు,నటగాయకులు భంగీలు( Sweepers) మెదలైన వారిని) చంపడం వీరికి నిషిధ్ధమట. చిత్రంగా ఉంది కదా.
ఇంత ఘోరమైన హత్యలు చేసి బ్రతికే వారికి తాము తప్పు చేస్తున్నామని ఎన్నడూ అనిపించక పోవడమే కాకుండా తాము చేస్తున్నది పవిత్రమైన దైవకార్యమనే భావన ఉండడమే చిత్రం. ఒక ధగ్గు తాను 719 హత్యలు చేశాననీ, 12 ఏళ్లపాటు జైలు జీవితం గడపాల్సి రాకపోతే వెయ్యిమందిని సునాయాసంగా చంపగలిగి ఉండేవాడిననీ చెప్పుకున్నాడంటే,వారికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని తెలుస్తుంది. ఈ ధగ్గుల సంగతి కనిపెట్టి బ్రిటిషువారు ప్రత్యేక పోలీసు దళాలతో వీరిని ఎదుర్కొని 1930-36 ప్రాంతంలో కొన్ని వేలమందిని పట్టుకుని మరణ శిక్షలో ఇతర శిక్షలో వేసారు. ఆ విధంగా క్రమేపీ ఈ దుర్మార్గాలకు భరతవాక్యం పలకడం జరిగింది.
                                                            ***
(మెడోస్ టైలర్ వ్రాసి 1839 లో ప్రచురించిన Confessions of A Thug అనేనవల ఆరోజుల్లో Best seller గా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగాచదువబడింది. Dy.Commissioner  గా పని చేసిన టైలర్ మహాశయుడు తమకు బందీలుగా దొరికిన ధగ్గుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వ్రాసిన గ్రంధమిది.దీనిలోని ధగ్గుల ఆచారవ్యవహారాలకు సంబంధించిన కొన్ని విశేషాలను మాత్రం మీముందు ఉంచాను.గతంలో మన తాతలు నిర్భీతిగా హాయిగా జీవించే వారనే అపోహతో ఆరోజులు మళ్లా రావని అనుకుంటారు చాలా మంది. గతమంతా తడిసె రక్తమున.. కాకుంటే కన్నీళులతోఅన్నాడు శ్రీశ్రీ. కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రజలను దుర్మార్గంగా చంపిన ఈకిరాతక ముఠాలనుగురించి గాని వీరినుంచి ప్రజలను రక్షించడానికి ప్రయత్నించని రాజులగురించి కాని ఏ  చరిత్రలు మనకు చెబుతాయి? అందుకే చరిత్ర చెప్పని కథలు అన్నీ ఎక్కడున్నా చదువుకోవాలని నా కోరిక. మిత్రులకీ చెప్పాలని ఆశ. సెలవు.)
                                                           ***