31, డిసెంబర్ 2011, శనివారం

కన్యాశుల్కంలో సారాయంగడి సీను....
   

క్రితం సారి కన్యాశుల్కంలో పేకాట సీను శ్రీ గురజాడ ఎందుకు  వ్రాసి ఉంటారనే విషయం చెప్పాను. ఈ సారాయంగడి సీను కూడా అలాంటిదే. నిడివి గురించి పట్టించుకోకుండా నాటక పురోగమనానికి పెద్దగా తోడ్పడని ఈ సీనులు వ్రాయడంలో  మహాకవి ఉద్దేశం సమగ్ర సమాజ జీవన చిత్రణే. ఆంధ్ర దేశంలో ఏ  మారుమూలనైనా సారాయంగడి లేని ఊరులేదు. కప్పు కాఫీయో శుభ్రమైన తాగునీరో దొరకని ఊళ్ళున్నాయేమో కానీ, సారాయి దొరకని ఊరుండదు. నాడూ నేడూ ఇదే పరిస్థితి.(ఇదే విషయాన్ని సరదాగా ఓ కంద పద్యంలో ఇలా చెప్పేను నేను:
నీరే దొరకదుగానీ
సారాయికి లోటులేదు సర్వం సిధ్ధం
ఊరూరా వెలసిన ఆ
సారాయంగళ్లలోన స్టాకులు ఫుల్లే ! )
అందు చేతనే తన నాటకంలో ఈ సారాయంగడి సీను అవసరం ఉందనుకున్నాడు మహాకవి. అంతే కాదు ఈ సీనులో వచ్చే పాత్రలు వ్యవహరించే తీరు ద్వారా వారి సంభాషణల ద్వారా ఎంతో హాస్యాన్ని సృష్టించేడు. ఈ సీను చివర్లో లుబ్దావధాన్లు పెళ్లాడిన మాయగుంట మధురవాణి కంటె తీసుకుని ఎక్కడికో పారిపోయిందనీ వెతికించమనీ పోలీసు హెడ్డుని అడగడానికి  రామప్పపంతులు వస్తాడు తప్పితే నాటకానికి సంబంధించిన ప్రధాన పాత్రలేవీ  దీనిలో రావు. దీనిలో వచ్చే సారాయి దుకాణం యజమాని రాందాసు బైరాగి పాత్రలను దొంగ సాక్ష్యమివ్వడానికి పిలుచుకు పోవడం తప్ప వారికీ నాటక ప్రధాన ఇతివృత్తంతో ఏ మాత్రమూ సంబంధం లేదు. ఈ విధంగా నాటక ప్రయోజనానికి కథాపురోగమనానికీ ఏవిధంగానూ ఉపయోగ పడని ఇంత పెద్దసీనుని, ఇన్ని అప్రధానమైన పాత్రలతో మహాకవి ఎందుకు వ్రాసేడయ్యా అంటే ఆయన హాస్య రసపోషణ సమగ్ర సమాజ జీవన చిత్రణ ధ్యేయంగా కలిగి ఉండడమే తప్ప మరోటి కాదు. శ్రీశ్రీ గారు  కన్యాశుల్కంలో అన్ని రకాల పాత్రలూ ఉన్నాయి కాని ముస్లిం పాత్ర కనిపించ లేదని అనుకున్నాను కానీ , అగ్నిహోత్రావధానులు  రామచంద్ర పురం అగ్రహారం చేరగానే బళ్ళుదింపండి. సాయిబూ ఏనుక్కి కావలసినంతరొడ్డ  అంటాడనీ, ఆవిధంగా తెరపైకి రాక పోయినా సాయిబు  పాత్ర కూడా ఉన్నట్టేనని అంటాడు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఒరిస్సాని ఆనుకుని ఉన్న ఊళ్లలో పండాలు (ఒరియా బ్రాహ్మలు) కూడా ఎక్కువే. అందుచేతనే ఈ నాటకంలో పండా పాత్రకూడా కనిపిస్తుంది. ఈ విధంగా సమాజ సమగ్ర జీవన చిత్రణకి పూనుకున్నందునే ఈసారాయంగడి  సీను కూడా మహాకవి నాటకంలో చేర్చాడు. ఆయన లక్ష్యం ఏ విధంగా నెర వేరిందో చూద్దాము:
ఈ సీను తెర లేచే సరికి  కాళీ మండపంలో  మధ్యలో సారాయిసీసాలు గళాసులుండగా పక్కన యోగ దండమును ఆనుకుని సమాధిలో ఉన్న (ఉన్నట్టు నటిస్తున్న) బైరాగి, చిలుం పీలుస్తున్న మునసబు సోమి నాయుడు, సాతాని మనవాళ్లయ్య, జంగం వీరేశం, దుకాణదారు రాందాసు- వీళ్లందరికీ సారాయి అందిస్తున్న యోగినీ ఉంటారు. మునసబు ఆకాశం ముందు పుట్టిందా? భూమి ముందు పుట్టిందా? అనే ప్రశ్న లేవనెత్తుతాడు. దీనికి సరైన జవాబు చెప్పకుండా  సుత్తి ముందా కారు ముందా అని అడ్డు ప్రశ్న వేస్తాడు మనవాళ్లయ్య. దీనికి మునసబు వెంటనేపంగనావాఁలు ముందా? పట్టె వొర్దనాలు ముందా?  నామాలోడా నా సవాలేటి? నీజవాబేటి? అంటూ వెక్కిరించి ఆకాశానికి మట్టా బూఁవి?  బూఁవికి కప్పా ఆకాశం? సదూకున్నోడెవడో సెప్పండోస్సి- అని రెట్టిస్తాడు. ఇక్కడ  మన వాళ్లయ్య వైష్ణవులకీ, వీరేశం శైవులకీ ప్రతినిధులు కాబట్టి పంగనామాలు పట్టె వర్దనాలలో ఏదిముందని వారిని  వెకసక్కెం ఆడతాడు. ఈ చర్చ కొంత సేపు సాగిన తర్వాత వీరేశం ఆకాశం బొక్కడ్డది అంటారు కదా ? ఆకాశమే లేకుంటే బొక్కడ్డ  వెఁలాగ? అని రీజనింగు తీసే సరికి మన వాళ్లయ్య మాట్లాడడం మానేస్తాడు. వెంటనే వీరేశం శంఖం పూరిస్తాడు. విజయం చేకూరి నప్పుడు శంఖం పూరించడం ఆనవాయితీ. ఈ శబ్దానికి తనసమాధికి భంగం కలిగి నట్టు నటిస్తూ బైరాగి, శివబ్రహ్మం. శివోహం అంటాడు. బైరాగి శివ స్మరణ చేయగానే ఆనందించిన వీరేశం చూడండి అందరూ అన్నట్టు పొంగి పోతాడు.  ఆదొంగ బైరాగి పక్కనున్న మనవాళ్ళయ్యని కూడా చూసేడేమో రామబ్రహ్మం..రామోహం అనికూడా అంటాడు. దీనికి ఆనందించిన మనవాళ్లయ్య మొదటి మాటను రెండవ మాట రద్దు చేస్తుందంటాడు. వీరిద్దరి కాట్లాట చూసిన దుకాణదారు రాముడూ శివుడూ ఇద్దరూ నిజమే నని వారిని సముదాయిస్తాడు. (తన గిరాకీ లలో ఏ ఒక్కరినీ వదులుకోలేడు కదా?)  మరికొంత చర్చ జరిగాక, మునసబు బైరాగిని గురూ ! బంగారం సేస్తారు కదా, అదెట్టి హరిద్దోరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందుకడుగుతారని ఓ చక్కటి ప్రశ్న వేస్తాడు. బంగారం చెయ్యగలగడం అబధ్ధమే కనుక దీనికి జవాబివ్వలేని దొంగ బైరాగి మేం చేశే స్వర్ణం మేమే వినియోగిస్తే తల పగిలిపోతుందని డొంక తిరుగుడు జవాబిస్తాడు. అవి వేరే రహస్యాలు ఊరుకోండి మామా అంటూ హెడ్డుగారు మాట మారుస్తాడు. ఆ తర్వాత తాను ఖేచరీ గమనమ్మీద ఆకాశ మార్గాన పోతూ ఉంటే  ఆ వూరి అమ్మవారి విగ్రహం కింద ఆరు నిలువుల లోతున స్థాపితమైన మహాయంత్రమొకటి కనిపించి అమ్మవారిని సేవించి పోదామనుకుంటుండగా  ఈ భక్తుడు (దుకాణదారు రాందాసు) తనని పోల్చి నిలిపేసాడంటాడు. వెంటనే దుకాణదారు   చూడగానే నేను సిధ్ధుల్ని పోలుస్తాను గురూఅంటాడు. దానికి మునసబు    చుక్కేసే వాళ్లని  మా బాగా పోలుస్తావు అంటూ ఓ చురకేస్తాడు. ఆ తరువాత ఆత్మ శుధ్ధి లేని ఆచారమదియేల అని మా తాతగారు చెప్పలేదా?” అని బైరాగి అన్నప్పుడు హెడ్డు వేమన తమ తాతగారా అని ప్రశ్నిస్తే అవును ఆయన పోయి ఆరు వందల సంవత్సరాలయింది అంటాడు. అయితే తమ వయసెంత అని ప్రశ్నిస్తే ఆదీ అంతూ లేని దానికి లెఖ్ఖేమిటి నాయనా? పరమాత్మ కెన్నేళ్లో అన్నేళ్లు అంటూ బుకాయిస్తాడు. ఈ మాటలు విన్న వారికెవరికైనా బైరాగి మాటలన్నీ పూర్తిగా అబధ్ధాలని తెలిసిపోతుంది.  అయితే అక్కడ ఉన్న వాళ్లెవరికీ ఈ గుర్తింపు ఉండదు. పైపెచ్చు హెడ్డుగారు ఆ బైరాగికున్న సిధ్ధులు స్తానాల్చేసి ముక్కు బిగించే బ్రాహ్మలకి కూడా లేవంటాడు.  ఆ తరువాత బైరాగి రెండు వందల యాభై ఏళ్లక్రితం జరిగిదంటూ తానుగంగను సారాయిగా మార్చిన ఉదంతం చెప్తాడు. అదంతా చాలా హాస్యభరితంగా ఉంటుంది.  రామప్ప పంతులు  అవధాన్లు పెళ్లి చేసుకున్న పిల్ల రెండో పెళ్లి పిల్ల అంటున్నాడనే మాట వచ్చినప్పుడు హెడ్డు ఈరోజుల్లో బ్రాహ్మణ్యం ఎక్కడుంది ఎటుచూసినా పిల్లల్ని ముసలాళ్లకి అమ్ముకోడాలూ రండా గర్భాలే కదాఅని అంటే హవల్దారు వెంటనే   ఎంతచెడ్డా బ్రాహ్మలు మనకి పూజ్యులు అంటాడు. ఆ రోజుల్లో మనుషుల నైతిక ప్రవర్తనకి కాకుండా జన్మించిన కులాన్ని బట్టి గౌరవించబడడం అనేది సూచించే మాటలివి. మనవాళ్లయ్య యోగినిని  మూలకి తీసుకెళ్లి ముద్దెట్టుకుంటున్నాడని మునసబంటే సిగ్గుతో మనవాళ్లయ్య చెయ్యి విడి పించుకొని వచ్చిన యోగిని ఏకాంత ఉపదేశం చేస్తున్నారని అంటుంది. దీనిని పట్టుకుని మునసబు    పిల్లా ఆ ఉప్పుదేశం ఏదో మాక్కూడా కాసింత  చెయ్యరాదాఅంటూ హాస్యమాడుతాడు. ఈ ఉప్పుదేశం అంటూ మునసబు పాత్ర ద్వారా గురజాడ మంచి హాస్యాన్ని అందించేడు. ఆ తరువాత రామప్ప పంతులొచ్చి హెడ్డుగారిని  లుబ్దావధాన్లని బెదిరించి తమ కంటె తమకిప్పించడంలో హెడ్డుగారి సాయంకావాలని కోరినప్పుడు హెడ్డు నోటంట వచ్చిన మొదటి మాటడబ్బేమైనా పేల్తుందా అని. ఎంత సహజంగా ఉందో చూడండి. పోలీసులు నాడూ నేడూ ఇంతే కదా?
ఆతర్వాత బైరాగిని దొంగ సాక్ష్యం చెప్పమని అడిగినప్పుడు సాక్ష్యం అంటే మావంటి వారే
చెప్పాలి .. నిజవేఁవిటి?అబ ధ్ధవేఁవిటి! మేం సిధ్ధులం అబధ్ధం నిజం చేస్తాం. నిజం అబధ్ధం చేస్తాం. లోకవేఁపెద్ద అబధ్ధం. పదండి. అంటూ ముక్తాయిస్తాడు.
ఈసీనులో వచ్చే పాత్రలన్నీ అప్రధానమైనవే ఐనా ప్రతి ఒక్క పాత్రా సజీవమైన పాత్రగా మనకు అనిపించేంత శ్రధ్ధగా వాటిని తీర్చిదిద్దిన మహాకవిని మెచ్చుకోకుండా ఉండలేము. ఈ పాత్రల నోటంట పలికించిన మాటలు ( దేహాన్ని ద్రేహం అనడం, జ్ఞానాన్ని ఘానం అనడం) నవ్వు పుట్టిస్తాయి. ముఖ్యంగా, కాశీ ఉదంతంలో తనతో పాటే తెగతాగిన బ్రాహ్మణునిగురించి బైరాగి చెప్పినప్పుడు బ్రాహ్మల్లో కూడా మహానుభావులుంటారనడం ఒక  Quotable Quote గా మిగిలి పోయింది.
నాటకంలో ఈసీను చదువుతున్నప్పుడు కాని, సమర్థులెవరైనా ప్రదర్శిస్తున్నప్పుడు కాని నాటకంలో ఈ సీను అవసరం గురించి ఎవరికీ ఆలోచనే రాదు. ఈ సీనుకి ఈ సీను మాత్రమే చూసినా ఒక ప్రహసనాన్ని చూసిన రక్తి కలుగుతుంది. నాకైతే , సమాజ చిత్రణా హాస్యోత్పాదనా ధ్యేయంగా తాను రచించిన ఈ సీను విషయంలో గురజాడ పూర్తిగా కృతకృత్యుడయ్యేడనే అనిపిస్తుంది.
ఆఖరుగా ఒక్కమాట చెప్పి ముగిస్తాను. ప్రఖ్యాత రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబ రావు కన్యాశుల్కం గురించి తాను రాసుకున్న నోట్సులో  ఈసారాదుకాణం సీనులు.. ఈ శాల్తీల మధ్య రామప్ప పంతుల్ని కూడా పెట్టి ఒక సీను లేక పోవడం ఎంత దురదృష్టం అన్నాడంటే ఈ సీను రచయితల్నీ రసికుల్నీ ఎంత రంజింప జేసిందో కదా?

వీలయితే కన్యాశుల్కం నాటి సంఘాన్ని తన నాటకంలో గురజాడ చిత్రించిన తీరు గురించి  కొంచెం ముచ్చటించాలని ఉంది. మరోసారి చూద్దాం. ఇప్పటికి సెలవు.