అరనవ్వులాంటి అరసున్న కథ...
“అమ్మాయే సన్నగా...అరనవ్వే నవ్వగా...” అంటూ అందంగా పాట వ్రాసేడో సినీకవి. సంస్కృతంలోని మందహాసాలూ దరహాసాల కంటె ఈ
తెలుగు అరనవ్వు చాలా బాగుందనిపిస్తుంది నాకు.అరవిందేక్షణ ముఖారవిందంలోని
మధురాధరాలపై మెరుపులా మెరిసి మాయమయ్యే అరనవ్వులాంటిదే మన అరసున్న కూడా.మన భాషలో
నిలువుగా వ్రాసే ఈ అరసున్నని వెల్లకిలా పడుకోబెడితే నిజంగానే అర నవ్వులాగానే
ఉంటుంది కదా? మన సాహితీ గగనంలో మెరుపులా మెరిసి మాయమైన అరసున్న కథేఁవిటో
తెలుసుకుందాం.అయితే ముందుగా నిండుసున్న పుట్టి ఆ తర్వాతనే అరసున్న వెలిసింది కనుక
ఈ కథ నిండు సున్న కథతోనే ప్రారంభించాల్సి ఉంటుంది.
ఇంతకు ముందు
కొంగలూ..మేఁకలూ..సున్నలూ..అరసున్నలూ అనే పోస్టులో దాదాపు క్రీ.శ. నాలుగో శతాబ్ది
వరకూ మన తెలుగు భాష లో నిండు సున్న కూడా కనిపించదని చెప్పాను కదా.అప్పటి వరకూ ఈ
నిండు సున్న పలకాల్సిన చోట్లల్లా మన కచటతప
వర్గాల్లోని అనునాసికాలనే వ్రాసేవారని తెలుసుకున్నాము.ఉదా హరణకి పండు అని
వ్రాయాల్సిన చోట పణ్డు అని వ్రాసేవారన్న మాట. క్రమేపీ అనునాసికాల స్థానంలో అనుస్వారాల్ని వ్రాయడం
ఆరంభమయింది. అనుస్వారమంటే నిండు సున్నాయే.అచ్చు లేకుండా దానికి ఉనికే లేదు కనుక
దానిని అనుస్వారం అన్నారు.అయితే ఇది ఒక్కసారిగా ఇప్పటి నిండుసున్న రూపాన్ని
సంతరించుకోలేదు.మొదట్లో దీనిని పలకవలసిన చోట అక్షరం మీద ఒక చుక్కలాగా వ్రాసేవారు.
అంటే పం అని వ్రాయాల్సిని చోట ప మీద చుక్క
పెట్టే వారన్నమాట. ఈ చుక్కనే సంస్కృతాభిమానులైన మనవ్యాకరణ పండితులు బిందువు
అన్నారు. అందుకే ఇప్పుడు మనం దాన్ని నిండుసున్నలా వ్రాస్తున్నా కూడా దానిని వారు
బిందువనే వ్యవహరిస్తున్నారు. కుండ,మంద
లాంటి పదాల లోని డకార ద కారాల్ని బిందుపూర్వక డకారమనీ దకారమనీ అనడానకి కారణమిదే.కొన్నాళ్లకి
వ్రాతలో ఈ చుక్క సరిగా కనిపించదనేమో దానిచుట్టూ సున్నలా చుట్టడం
ప్రారంభించేరు.అప్పుడది తలకట్టు లేని ఠకారంలా ఉండేదన్నమాట.కాల క్రమంలో అక్షరం మీద
వ్రాసే ఈ అనుస్వారాన్ని అక్షరం ప్రక్కను వ్రాయడం ఆరంభించేరు.కొన్నాళ్లకు లోపలి
చుక్క పోయి చుట్టూ ఉన్న సున్న మాత్రం మిగిలింది. ఇలా అనునాసికంతో ప్రారంభమై
అనుస్వారం వ్రాయడమనేది కొద్దిగా అటూ ఇటూగా నన్నయ కాలానికే పూర్తయింది.ఇదీ మన
నిండుసున్న రూపుదిద్దుకున్న వృత్తాంతం.అయితే అనునాసికం వ్రాసినా అనుస్వారం
వ్రాసినా కూడా కొన్ని కొన్ని చోట్ల దానిని పూర్తిగా ఒత్తి పలకడం గాని తేల్చి పలకడంగాని
ఉంటూనే ఉండేది.అలా పూర్తిగా ఒత్తి పలికిన చోట అది పూర్ణానుస్వారం. తేల్చిపలికిన
చోట అది అర్థానుస్వారం అన్నమాట.ఎలా పలికినా వ్రాతలో దానిని నిండుసున్నగానే
వ్రాసేవారు.సున్నను పూర్తిగా ఒత్తి పలికితే దాని ముందున్న అక్షరం
గురువవుతుంది.లేకపోతే అది లఘువవుతుంది కదా? రెండు సంజ్ఞలకీ నిండు సున్ననే వ్రాస్తే ఏది ఎలా పలకాలో ఏది గురువో ఏది లఘువో
తెలుసుకోవడం ఎలాగ? అందుకని సున్నని పూర్తిగా పలకాల్సిన చోటుల్లో దాని తర్వాత వచ్చే అక్షరాన్ని
ద్విత్వాక్షరంగా వ్రాసే వారు. ఉదాహరణకి పండు లో సున్నపూర్తిగా పలకాలి కనుక పండ్డు
అని వ్రాసివారన్నమాట. అలాగే మూండు అనే చోట డకారం ద్విత్వాక్షరంగా వ్రాయలేదు కనుక
మధ్యలో సున్నా ఉన్నా దానిని మూఁడు అని తేల్చి పలకాలన్నమాట.ఇలాగ ఎక్కడ నిండు
సున్నగా పలకాలో ఎక్కడ అర సున్నగా పలకాలో నిశ్చయమయిపోయినా మనకి అచ్చు యంత్రాలు
వచ్చే వరకూ పైన చెప్పిన పధ్ధతే కొనసాగింది.మన తాళ పత్ర గ్రంథాలలో కూడా ఈ పధ్ధతే కనుపిస్తుంది.శిథిలం కాకుండా ఉన్నఏ
తాళ పత్ర గ్రంథాలలో నయినా ఇప్పటి అర సున్న రూపం ఉన్నట్టు ఎవరూ చెప్పలేదు. అందుచేత
మనకు అచ్చుయంత్రాలతో పాటే ఈ అరసున్న ఇప్పటి రూపంలో ఆవిర్భవించిందని చెప్పాలి.అంటే
దాదాపు రెండువందల ఏళ్ల క్రిందట ఇది లేదు. ఇప్పటికో యాభై ఏళ్లు పైనే అయింది ఇది మన
వ్రాతల్లో కూడా కనుమరుగైపోయి. అచ్చుకి నోచుకున్న మన పాత ప్రబంధాలూ కావ్యాలూ
సాహిత్యశాస్త్ర గ్రంథాల్లో తప్ప మరెక్కడా ఇప్పుడు కనిపించదు.అమ్మాయి వదనంలో ఇలా
మెరిసి అలా మాయమైన అరనవ్వులాగా ఈ అరసున్న కూడా మన తెలుగు సాహితీ గగనంలో ఇలా మెరిసి
అలా మాయమైంది. పూర్వం అనుస్వారం ఉండే చోట్ల దానికి జ్ఞాపకచిహ్నంగా మన కావ్యాల్లో
మాత్రం ఇది మిగిలి పోయింది.