6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కూట గురువులూ...కొంగ జపాలూ...


ముందుగా  చిన్నప్పుడు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని ఈ  కథ విని ఉండని వారికి   కొంగజపమంటే ఏమిటో తెలియదు కనుక కొంచెం వివరిస్తాను. ఒక కొంగ వార్థక్యం చేత చేపల్ని వేటాడే శక్తి లేక ఒక యుక్తి పన్ని చెరువు గట్టు మీద ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తున్నట్లు నటిస్తూ ఉండేదట. దాని ఈ చర్యకు ఆశ్చర్య పోయిన చేపలు గట్టు దగ్గరకు చేరి ఏమి స్వామీ దేనికీ తపస్సు అని అడిగాయట. అప్పుడా కొంగ నాకిప్పుడే కోరికలూ లేవు కానీ మీగురించే నా బెంగ.కొద్ది రోజుల్లో ఈ చెరువు ఎండిపోనుంది. అప్పుడు  మీరందరూ ఎండి మాడి చచ్చి పోతారన్నదే నా దిగులు అంటూ నిట్టూర్చిందట. అప్పుడా చెరువు లోని చేపలూ పీతలూ
స్వామీ మరి మాకు దిక్కెవ్వరు . ఆ అపాయం నుంచి తప్పించుకునే మార్గం లేదా అని అడిగితే ఆ కొంగ జవాబుగా లేకేం ఉంది. కొండకి ఆవలి ప్రక్కన ఎన్నటికీ ఎండిపోని చెరువొకటుంది.అక్కడ మీరు ఎన్నాళ్ళయినా హాయిగా జీవించ వచ్చునని చెప్పింది. మరి అక్కడికి చేరే తరుణోపాయం ఏమిటని అడిగిన చేపలకు కొంగ వాటి నక్కడనుంచి రోజుకు కొన్ని చేపల చొప్పున కొండ అవతలి చెరువులోకి తానే చేరుస్తానని చెప్పి రోజూ కొన్ని చేపలను నోటకరచుకు వెళ్ళి దారిలోనే గుటకాయ స్వాహా చేస్తుండేదట. ఆ చెరువులో ఉండే ఒక పీతకెందుకో కొంగ మీద గురి కుదరలేదు. తాను తన చేతులు కొంగ మెడచుట్టూ వేసి పట్టుకుంటాననీ తనని కూడా తీసుకెళ్ళమనీ ప్రాధేయపడితే ,  కొంగ పీతనలాగే తీసుకెళ్తూ ఉండగా, దానికి దారిలో కొండ మీద అంతకు ముందు కొంగ తిని పారేసిన చేపల అవశేషాలు కన్పించి కొంగ మోసం గ్రహించినదై చటుక్కున దాని పీకను నొక్కి చంపేసిందట. అందుకే మనకొంప ముంచాలనే కోరిక తో మనకి సాయం చేస్తున్నట్లు నటించే వారిని  కొంగ జపం చేస్తున్నాడంటారు.
                                                        ****
అలా కొంగ జపం చేస్తూ నమ్మిన శిష్యుల కొంపలు కూల్చే కూట గురువులకి లోకంలో కొదవ లేదు. శిష్యుల బాధలను హరింప చేసి  శిష్యహృత్తాపహారులు కావలసిన వీరు శిష్య విత్తాప హారులైన సంఘటనలు కో కొల్లలు. సద్గురువులు లేరని కాదు కాని వారు సకృత్తుగానే ఉంటారు. మిగిలిన వారు కూటగురువులే. అంటే పామర భాషలో దొంగ సన్నాసులే. కామ, క్రోధ లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు గుణాలూ మన  అంతశ్శత్రువులనీ వాటిని జయించ కుండా మనకి ముక్తి రాదనీ నిత్యం బోధించే ఈ గురువులు వీటికి వేటికీ అతీతులు కానే  కారని వారి ప్రవర్తనే చెపుతుంది. ఇప్పుడు వార్తల్లో ఉన్న , తన పేరులో రాముణ్ణీ, మన జాతిపిత బిరుదైన బాపూనీ తగిలించుకున్న ఒక గురూజీ  మైనర్ బాలిక మీద  అత్యాచారం చేసాడనే  అభియోగాన్ని ఎదుర్కుంటూ జైలు పాలయ్యాడు.. తన ఆశ్రమం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడట. ఈయనకు పాద పూజ చేసి మనం తరించాలంటే లక్షా పాతిక వేలు కక్కాల్సిందేనట. ఈయన గారి ఆశ్రమం  వివిధ దేశాలలో ఎన్నో బ్రాంచీలతో  వందల కోట్ల సిరిసంపదలతో వర్థిల్లుతోందట. ఆ మధ్య సినీ తారతో కేళీ విలాసాలలో తులతూగుతున్న
 నిత్యానందుల్నీ మనం చూసాం. ఇలా ఎంతమందో. అయితే చాలా మంది అనుకునేదేమిటంటే  ఇటువంటి స్వాములు మునుపటి కాలంలో లేరేమోనని. మరీ పాత కాలం సంగతుల రికార్డు మనకి దొరకదు కానీ ఓ వందేళ్ళ క్రిందట ఉన్న ఇటువంటి శిష్యవిత్తాపహారుల ముచ్చటలు కొన్ని  విని తీరవలసినవి  నాకు తెలిసినవి చెబుతాను వినండి.
                                                       ****
ఓ వంద సంవత్సరాల క్రిందట పిఠాపురం ప్రభువులైన శ్రీ గంగాధర రామారావు గారు వైష్ణవ సంప్రదాయానుసారులైనందు వలన వారి గురువులైన జీయరు స్వాముల వారిని ఆహ్వానిస్తే వారు వారి జమీందారీ లోని కడియం గ్రామానికి విచ్చేసారట. రాజుగారు వారిని దర్శించుకున్నప్పుడు వారి పాద పూజ చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించమని కోరితే అందుకు పాదకట్నంగా కనీసం లక్ష రూపాయలైనా సమర్పించాల్సి ఉంటుందని స్వామి వారు సెలవిచ్చారట. అందుకు తగిన తాహతు తనకున్నా స్వామి వారి అత్యాశకు ఏవగింపు కలిగిన రాజు గారు యాభైవేలు సమర్పించుకుందుకు సిధ్ధపడ్డారట. కాని దానికి అంగీకరించని స్వాముల వారి వైఖరికి నొచ్చుకున్న రాజా వారు తన  పేరు లోనే శివ కేశవులిద్దరూ ఉన్నారు కనుక తనకు రెండు మతాల్నీ పాటించడం ధర్మమే అవుతుందని అంటూ తన వెనుకనే నిలుచుని ఉన్న తన ఆంతరంగికుని సంచీలో ఉన్న విభూది ఇమ్మని అడిగి ద్వాదశ పుండ్రాలూ ధరించారట. చెయిజారిపోయిన చేపను చూసిన కొంగ లాగా  శిష్యవిత్తాపహారులైన ఆ స్వాముల వారు అవాక్కయిపోయారట.
                                                 ****
అప్పటి కాలానికి చెందినదే మరో ముచ్చటేమిటంటే,  రాజమండ్రిలో ఓ సంపన్న గృహస్తు గృహాన్ని పావనం చేయడానికి విచ్చేసిన ఒకస్వాముల వారి ఆంతరంగికులు గృహస్తుకిచ్చిన   వారికి కావలసిన సామాన్ల లిస్టులో బ్రాందీ కూడా ఉండడం చూసిన గృహస్తు అటువంటివి తాము సేవించము కనుక తెప్పించ లేమని మనవి చేసుకుంటే ఆ స్వాముల వారు తమకే ఎదురు చెప్పేంత వాడవైనావా అంటూ అగ్రహోదగ్రులై శపించబూనితే  ఆ గృహస్తు తల్లిగారు క్షమించమని వేడుకుంటే దానికై ఓ పాతిక రూపాయలు బిల్లు వేసి శాంతించారట.
                                                ****
మరో ముచ్చట కూడా అప్పట్లోనే ఇప్పటి  శ్రీకాకుళం జిల్లా లోని ఓ గ్రామంలో  జరిగింది. ఆ చిన్న గ్రామంలో ఓ పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేదట.కుటుంబమంటే తల్లీ దండ్రులు లేని అయిదుగురు అన్నదమ్ములు పేదరికం వల్ల ఎవరికీ పెళ్ళిళ్ళు కాకపోవడంతో ఎలాగో బ్రతుకీడుస్తూ కలిసి ఉండేవారట. కన్యాశుల్కపు రోజులు కనుక ఎంతో కొంత ధనం లేకపోతే మగ వారికి పెళ్ళిళ్లు జరిగేవి కావు. ఎలాగైనా వారిలో  చిన్న తమ్ముడికైనా  పెళ్లి చేయాలని అయిదు వందల రూపాయలు కష్టపడి దాచుకున్నారట. ఇంతలో వారికో అవాంతరం వచ్చి పడింది. ఒక రోజు ఆ చిన్న వాడు కరణంగారు వీధి అరుగు మీద  కూర్చున్నప్పుడు ఆవీధిలో గేదెను తోలుకెళ్తున్నాడట. కరణంగారేదో అనడం దానికి ఈ కుర్రాడు తల తిక్కగా సమాధానం చెప్పడం లాంటిదేదో జరిగిందట. అప్పుడు కరణం గారి ప్రక్కనే నిల్చున్న వంట బ్రాహ్మడు కరణంగారికే ఎదురు చెప్తావట్రా అంటూ అడ్డురావడంతో ఈ కుర్రాడు చేతిలోని కర్రతో ఒక్క వేటు వేస్తే ఆ అర్భకుడు హరీ మన్నాడట.  ఏదో పోలీసు కేసయిందట గానీ దాని వివరాలు మనకి తెలియవు. అయితే బ్రహ్మ హత్యా దోషమని చెప్పి ఆ కుటుంబాన్ని బ్రాహ్మణ్యం వెలివేసారట. ముందు ఈ వెలినుంచి బయటపడితే కాని వివాహం జరిపించే యోగం లేనందువల్ల  ఆ దగ్గరలోని ఓ స్వాముల వారిని ఆశ్రయిస్తే  వారు ప్రాయశ్చిత్తం చేయించడానికి వెయ్యి రూపా యలు అడిగారట. ఈ పేద బ్రాహ్మలు తమ్ముని పెళ్లికై  దాచి ఉంచిన  సొమ్ము మాత్రం సమర్పించుకో గలమని తమను కృతార్థులను చేయమని వేడుకుంటే అయిష్టంగానో ఏమో ఆయన అంగీకరించి వచ్చాడట. కానీ ప్రాయశ్చిత్తం రోజున బ్రాహ్మణ్యం అంతా భోజనానికి వచ్చి కూర్చున్న తరుణంలో ఆ స్వాముల వారు ఔపోసన పట్టకుండా ఇంకా సొమ్ము కావాలని కొర్రెక్కి కూర్చున్నాడట. అప్పటికి స్వాముల వారి ప్రవర్తనతో విసుగెత్తి పోయిన ఆ బ్రాహ్మణ యువకుడు ఆయన ముందు నిల్చొని అప్పటికే వేళ మించి పోవడం వలన బ్రాహ్మణ్యం అంతా ఆకలితో ఉన్నారనీ వెంటనే ఔపోసన పట్టమనీ లేకుంటే తానిదివరకే ఒక బ్రహ్మ హత్యా పాతకాన్ని చుట్టుకొని ఉన్నాడు కనుక కొత్తగా తనకు  వచ్చే పాపమేమీ ఉండదు కనుక ఆయనను వేటు వేయడానిక వెనుకాడేదేమీ లేదనీ బెదిరించేసరికి ఆ స్వాముల వారు కిమ్మనకుండా ఔపోసన పట్టాడట.
                                                           ****
కథలో పీతకున్నపాటి తెలివితేటలూ, ఆ బ్రాహ్మణ యువకునికున్నపాటి తెగువా తెంపరితనమూ లేకపోతే  కూట గురువులూ వారి కొంగ జపాలూ శతాబ్దాలు దాటినా కొనసాగుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత. సెలవు.
                                                           ****
పై మూడు ముచ్చట్ల లో మొదటి రెండూ కీ.శే. శ్రీ చెళ్ళపిళ్ళ వారు గ్రంథస్తం చేసినవయితే, మూడవది తన చిన్నతనంలో జరిగిన సంఘటనగా విన్నానని నాకు తెలియజేసిన వారు  93 ఏళ్ళ వృధ్ధులు  మా వియ్యంకులు శ్రీ పట్రాయని సంగీత రావు గారు. వారిద్దరికీ కృతజ్ఞతలు.

                                                         ****