16, జూన్ 2013, ఆదివారం

టెలిగ్రాం సార్....

.
కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేసిందని తెలుగులో సామెత. ఏటిలోనూ నదుల్లోనూ నిలచి ఉన్న నీటిని నిత్యం వచ్చి చేరే కొత్త నీరు తొలగించి నట్లే, కాల ప్రవాహంలో కూడా సమాజంలో పెను మార్పులు  జరుగుతూ ఉంటాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన పురోభివృధ్ధి వల్ల జనుల నిత్యజీవితంలో కూడా నిరంతరం ఎన్నో కొత్త కొత్త విషయాలు చోటు చేసుకుంటుంటాయి. మిక్సీలు గ్రైండర్లు వచ్చి రుబ్బురోళ్ళూ పచ్చడి బండలూ మాయమైనట్లే, మన సమాచార రంగంలో కూడా పెను విప్లవం వచ్చిమన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేసింది.
ఆది మానవుడు  నివసించిన అనాగరిక సమాజాల్లో సమాచారాన్ని ఒక చోటినుండి వేరొక చోటికి చేర వెయడానికి ఎత్తైన ప్రదేశాలనుండి జెండాలు ఎగుర వేయడం డప్పులు కొట్టి రకరకాల ధ్వనులు చేయడం ద్వారా ఒక ఊరి నుండి ప్రక్క ఊరికి సందేశాలను అందించేవారట.ఇంకా ఎక్కువ  ముఖ్యమైన సమాచారాన్ని పంపాలంటే వార్తా హరులు దూతలే శరణ్యం.ఇంకా కొంచం నాగరికత సంతరించుకున్నాక తాటాకులమీదో భూర్జ పత్రాల మీదో మరికొన్నాళ్లకి కాగితాల మీదో వ్రాయడం నేర్చుకున్నాక  లేఖలను పంపడం మొదలైంది. పోస్టల్ వ్యవస్థ రూపు దిద్దుకున్నాక సమాచారం పంపడం సులువై ప్రజాసామాన్యానికి కూడా అందుబాటులోకి వచ్చింది.1950 లలో వచ్చిన సంసారం సినిమాలో అనుకుంటాను సూర్యకాంతమ్మ ఎన్నో ఊళ్లు తిరిగొచ్చిన దానినని గొప్పలు పోతుంటే, దాన్దేముందత్తా మూడు కాన్ల కార్డు ముక్క కూడా ఆ పని చేస్తుందంటాడు నాగేశ్వర్రావు. తోక లేని పిట్ట తొంభై ఊళ్లు తిరిగిందనే మన పొడుపు కథ లోని తోక లేని పిట్ట ఈ కార్డు ముక్కే.  అయితే ఆనాటికి కూడా మన పల్లె టూళ్ల పరిస్థతి ఎలాగుండేదంటే కార్డులో ఉన్న విషయాలు కూడా ఉత్తరం బట్వాడా చేయడానికి వచ్చిన పోస్ట్ మేన్ కాని వేరే చదువు వచ్చిన వాళ్లని వెతుక్కుని వాళ్ల చేత చదివించుకోవలసిన దుర్భరమైన పరి స్థితులుండేవి. ఆ కార్డు చదవ గల మనిషి దొరికే వరకూ వాళ్లకి దానిలోని వర్తమానం తెలిసేది కాదు. అయితే,  పిల్లలు  పుట్టడమో వివాహాది శుభ కార్యాలకో సంబంధించినవైతే వాటికి పసుపు బొట్లు పెట్టే వారు కనుక అది మోసుకొచ్చింది శుభ వార్తే అని స్థిమిత పడేవారు. ఏ మరణ వార్తో అయితే ఆ కార్డుకు  నలు మూలలా సిరాతో నల్లగా పూసే వారు కనుక అది దుర్వార్తే అని గ్రహించే వారు. ఈ ఉత్తరాలు కూడా చిరునామా దారునికి చేరడానికి కొన్ని రోజులూ అప్పుడప్పుడూ కొన్ని వారాలు కూడా పట్టేవి. టెలిఫోన్లు ఉపయోగం లోకి రాక ముందు, ఉత్తరాల బట్వాడాలో జరిగే ఆలస్యాన్ని అధిగమించడానికి  సత్వర సమాచారాన్ని అందించడానికి 1844 లో మోర్స్ మహానుభావుడు కనిపెట్టిన మోర్స్ కోడ్, తర్వాత ఉపయోగం లోకి  వచ్చిన టెలిగ్రాములే గతి అయ్యేవి.
ఈ కాలపు పిల్లలకి పోస్టలు డిపార్టుమెంటు ఎట్లా పని చేస్తుందో తెలియనట్లే, ఈ టెలిగ్రాము అంటే ఏమిటో అదెలా పని చేస్తుందో కూడా తెలియక పోవడంలో ఆశ్చర్యం లేదు. టెలి ఫోన్ లో లాగే దీనిలో కూడా శబ్ద తరంగాలను  విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి తీగెల ద్వారా ప్రసరింప జేసి  తిరిగి రెండో కొసలో వాటిని శబ్ద తరంగాలు గా మార్చడం ద్వారా వర్తమానాల్ని ప్రసారం చేసేవారు. అయితే ఫోన్ లో లాగా మన మాటల్ని యథాతథంగా ప్రసారం చేయడానికి అప్పటికి అవకాశం లేక పోవడంతో వార్తల్ని మోర్స్ కోడ్ లో ప్రసారం చేసేవారు.టెలిగ్రాముల్ని ప్రసారం చేసే విధానం తమాషాగా ఉంటుంది. ఒక చిన్న బల్ల చెక్కమీద ఇత్తడి రాడ్ ని స్ప్రింగుతో అమర్చబడి ఉంటుంది. అది నొక్కి వదలి నప్పుడల్లా కట్ట..కడ.. అనే శబ్దాలు చేస్తుంటుంది. వీటినే డాట్.. డాష్..గా వ్యవహరిస్తారు. చుక్క ఒక ఇంగ్లీషు అక్షరానికి సంకేతమైతే గీత మరొక అక్షరానికి సంకేతమన్న మాట. అలాగే కొన్ని గీతలూ కొన్ని చుక్కలూ ఒక్కొక్క ఇంగ్లీషు అక్షరానికి  సంకేతమై ఉండి ,  ఇంగ్లీషులో వ్రాసిన వార్తలను  ఈ మోర్స్ కోడ్ ద్వారా పంపిస్తారన్నమాట. మా చిన్నప్పుడు రైల్వే లో పని చేసే మా బాబాయి తీసుకు వస్తే ఈ టెలిగ్రాఫ్ పరికరం ద్వారా మోర్స్ కోడ్ లోకి వార్తల్నిఅనువదిచడం కొంచెం నేర్చుకున్నాను.ఆ పరికరం ఇలా ఉండేది.కార్డులూ ఇతర ఉత్తరాలకంటె సత్వరమే వార్తల్ని చేరవేయడానికి టెలిగ్రాఫ్ ఉపయోగంలోకి వచ్చినా చాలా ఎక్కువ మంది పేదవాళ్లుండే మన దేశంలో మాత్రం ఇది అత్యవసరమైన  సమాచారం పంపవలసి నప్పుడు మాత్రమే ఉపయోగించే వారు.  మా చిన్నతనం లో  ఎవరికైనా టెలిగ్రామ్  వచ్చిందంటే కంపించి పోయే వారు  అది ఏ దుర్వార్తో  మోసుకు వచ్చిందమోనని. అదీ ఇంగ్లీషు లోనే ఉండడంతో ఆ భాష తెలిసిన వారు చదివి విషయం చెప్పే వరకూ  ఉత్కంఠ తోనే ఉండే వారు.ఎవరో ఒకరు మరణించారనో, మరణ శయ్య మీద ఉన్నారనో వెంటనే బయల్దేరి రావాల్సిందిగా వచ్చే టెలిగ్రాములే అధికంగా ఉండేవి. కొంచెం నాగరికుల్లోనూ ధన వంతుల్లోనూ శుభ వర్తమానాలకి కూడా టెలిగ్రాములను ఇచ్చుకునే వారు. ఈ వ్యవస్థ బాగా ప్రాచుర్యం లోకి వచ్చేక గ్రీటింగ్ టెలిగ్రాములని ఉండేవి. సందర్భానికి తగిన సందేశాలు ఆంగ్లంలో ఉండేవి. వాటి నంబర్లను మాత్రం మనం టెలిగ్రాములో పంపిస్తే  అవతలి వారికి అది పూర్తి సందేశంగా టైపు చేసి గ్రీటింగ్ కవర్లలో బట్వాడా చేసే వారు. ఆ రోజుల్లో ఏ పెళ్లిళ్ళకు వెళ్లడానికి వీలు కుదరక పోయినా గ్రీటింగ్ టెలిగ్రామ్ ఇవ్వడం తప్పని సరి. పదానికింత రుసుమని ఛార్జి చేసే వారు కనుక సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా పని జరిగి పోయేది. గ్రీటింగులే కాదు మిగిలిన టెలిగ్రాముల్లో కూడా ఎంత సంక్షిప్తంగా సందేశాన్ని పంపగలమో అని  ప్రయత్నించేవారు. ఈ రోజుల్లో సెమ్మెస్ భాష లాగే ఆరోజుల్లో టెలిగ్రాముల భాష కూడా క్రియలు లేకుండా  "Arriving 16th Godavari  receive station"  అంటే పదహారవ తారీఖు గోదావరి రైల్లో దిగుతాను. స్టేషనుకు వచ్చి తీసుకెళ్ళమని ..  తమాషాగా ఉండేది.  అత్యంత సంక్షిప్తమైన టెలిగ్రామంటే ఆస్కార్ వైల్డ్ అనే రచయిత  తన పబ్లిషరుకి పంపించిందనే చెప్పుకోవాలి. తన కొత్త పుస్తకం విక్రయాలు ఎలాగున్నాయని పబ్లిషరుని అడగడానికి అతడు   ?    అని టెలిగ్రామిచ్చాడట.  దానికి ఆ పబ్లిషరు మహాశయుడు  “   !  అని సమాధానం ఇచ్చేడట.. బాగుందా?
 నేను మరిచి పోలేని టెలిగ్రాము  నేను 1968 జనవరి లో ఒక అర్థరాత్రి అందుకున్నాను. అది మా అమ్మ గారి
అకాల మరణ వార్త. నేను మూడవ రోజుకి కాని మాఊరు చేరుకో లేక పోయాను. ఇలాంటి దుర్వార్తలను కాని శుభ వార్తలను కాని ఆ రోజుల్లో సత్వరమే జనానికి చేరవేస్తూ - 160 సంవత్సరాలు బ్రతికిన-- ఈ టెలిగ్రాఫు వ్యవస్థ మరి కొద్ది (ఒక నెల) రోజుల్లోనే మూత పడబోతోందని వార్త. మనుషులకే మరణం తప్పనప్పుడు అతడు సృష్టించిన పరికరాలు మరణిండంలో విశేషం ఏముంది?

.