22, ఆగస్టు 2012, బుధవారం

మోసం గురూ... కుడి యెడమల దగా..దగా..




కన్యాశుల్కంలో తాను అగ్నిహోత్రావధాన్లు కూతుర్ని లుబ్ధావధాన్లు కిచ్చి వివాహం చేయించడానికి చేస్తున్న ప్రయత్నం అంతా మోసం అని అన్న మధురవాణితో రామప్ప పంతులు,అది మోసం కాదనీ లౌక్యం అనీ దానిని లౌక్యం అని అనమంటాడు. రెండిటికీ ఏమిటో తేడా అని అడిగిన మధురవాణికి నమ్మిన చోట చేస్తే అది మోసమనీ నమ్మని చోట చేస్తే అదిలౌక్యమనీ అంటాడు.దానికి మధురవాణి తాను చేస్తే లౌక్యం మరోడు చేస్తే మోసం అనరాదా? అబధ్ధానికి అర్థమేమిటి?”. అంటుంది. తాను చేసే తప్పుడు పనులకి రామప్ప పంతులు లౌక్యం అనే ముద్దు పేరు పెట్టుకున్నా అది మోసం కాకుండా పోదు. రామప్ప పంతులు పనుపున ఢబ్బుకు కక్కుర్తి పడి,సిధ్ధాంతి లుబ్దావధాన్లుతో పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుంది లేకపోతే మారకం ( చావు) వస్తుందని చెప్పడమూ,దానికి పండా గారు వంత పాడడమూ కూడా మోసం క్రిందకే వస్తాయి.
మనని బాగా తెలిసిన వారిని,మనమీద నమ్మకం ఉన్న వారిని లేదా పూర్తిగా తెలివి తక్కువ వారినీ అవలీలగా మోసం చేయవచ్చు. ఒక షాహుకారు గారిని ఇవాళ లాభాలు ఎలా ఉన్నాయయ్యా అని అడిగితే ఏం పెద్దగా లేవండి.ఇవాళ తెలిసినవారూ తెలివి తక్కువ వాళ్లూ ఎవరూ రాలేదండి అన్నాడుట. తెలివి తక్కువ వాళ్ళని సరే, మనని నమ్మిన వాళ్ళని మోసం చేయడం అంత తేలికన్నమాట.
ఈ విధంగా మోసం చేయడం ఇవాళ్టిదో నిన్నటిదో కాదు. మన భారత యుధ్ధకాలం లోనే ధర్మ రాజు గారు అశ్వథ్థామ హతః కుంజరహః అని పలికి తాను అబధ్ధమాడని సత్య హరిశ్చంద్రుడని నమ్మిన వారిని మోసం చెయ్యలేదా? కుంజరహః అన్నమాట మెల్లగా పలికి తాను అబధ్ధమాడలేదని తనది లౌక్యమేనని తనను తాను రామప్ప పంతులు లాగా సరిపెట్టుకున్నా ధర్మ రాజు చేసింది మోసం కాకుండా పోదు. ధర్మ రాజే కాదు కురు పితామహుడైన భీష్మాచార్యుల వారు కూడా ఇలాంటి లౌక్యానికే (లేక మోసానికే) పాల్పడ్డారు.అదెలాగో కొంచెం వివరిస్తాను.
.దక్షిణ గోగ్రహణం నాటికి 13 సంవత్సరాలు ( 12 ఏళ్లు అరణ్య వాసము+ 1 సంవత్సరం అజ్ఞాత వాసము) పూర్తి కాలేదని దుర్యోధనుని నమ్మకం. నీతి వేత్త యిన భీష్ముని ఈ విషయమయి అడిగితే ఆయన చెప్పిన సమాధానం చూడండి:
రెండవ యేట నొక్కండధిమాసమి
ట్లేతక్కిన యన్నెల లెల్ల గూర్చి
కొనం బదమూఁడు హాయసములు దప్పక
నిన్నఁటి తోడనె నిండెనంత…”
అన్నాడట. సూర్యుని చుట్టూ భూమి (365 రోజుల ఆరు గంటలలో) ఒక ప్రదక్షిణం పూర్తి చేస్తేనే ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. అలా లెక్క చూస్తే అప్పటికి 13 సంవత్సరాలూ పూర్తి కాదు. కాని అధిక మాసాల్ని లెక్కలోకి తీసుకుంటే 13 సంవత్సరాలూ ముందురోజుకే పూర్తయ్యాయిట. చాంద్రమానంలో ఈ అధిక మాసాలనేవి ఈ లెక్కను సరిచేయడానికి ఏర్పడ్డవే గాని వేరు కాదు.అందుచేత అవి లెక్కలోకి రావు కదా? మరి ఈ ఆచార్యుల వారి లెక్క ఏమిటి? పాండవ పక్షపాతంతో పలికిన లౌక్యపు (మోసపు) మాటలే కదా?
ఈ లౌక్యం అనబడే మోసం అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ అన్నిజాతులలోనూ అన్ని వృత్తుల వారిలోనూ ఉంది.అమాయకులైన రోగులు తమను నమ్మి తమ వద్దకు వస్తే వారికి అనవసరమైన పరీక్షలు చేసి శస్త్ర చికిత్సలకు పాల్పడే వైద్యులు ఎందరో కదా? ఇది కొత్తేమీ కాదని మనకు బెర్నాడ్ షా వ్రాసిన The Doctor’s Dilemma అనే ఇంగ్లీషు నాటకం కాని దాని పీఠిక గాని చదివితే అవగతమౌతుంది. న్యాయవాదుల్లో సగం మందికి తాము అన్యాయం పక్షాన వాదిస్తున్నామని తెలిసే ఉంటుంది.అయినా ఆ విషయం వారు తమ కక్షిదార్లకి చెప్పరు కదా? ఒక వృత్తి అని కాదు. మోసం చేయడానికి అవకాశం ఉన్న చోటల్లా అమాయకుల్ని మోసం చేసే పెద్ద మనుషులు ఉండనే ఉంటారు. పుర జనుల హితాన్ని కోరి వారికి సరైన దిశానిర్దేశం చేయవలసిన పురోహితులకి సంబంధించిన రెండు ముచ్చట్లు నేను చదివినవి మీకు మనవి చేస్తాను.
చాలా కాలం క్రితం ఆంధ్ర దేశం లో ఒక జమీందారు గారు ఒక సారి దేవీనవరాత్ర పూజకు సంకల్పించారట. వారి యెస్టేటు లోనే ఉంటూ శ్రౌత స్మార్తాలలో చాలా గట్టివాడయిన ఒక పండితుడిని పిలిచి పూజా విధి విధానాల గురించి అడిగితే ఆయన పూజా కార్యక్రమం జరిగినన్నాళ్లూ మధుమాంసాదులున్నూ స్త్రీ సంబంధమున్నూ విడిచి పెట్టాల్సిఉంటుందని చెబుతూ మహా భోగులయిన రాజా వారికి ఈ చివరి విషయం కష్ట సాధ్యం కనుక జనానా వారితో అయితే దోషం కాని రాజ దాసీ దేవ దాసీలతో సంగమమయితే తప్పులేదని వారికి మార్గాంతరం కూడా చెప్పాడట.( ఏ శాస్త్రాలలో అయినా ఇలాటిది ఉంటుందా?) ఆ విధంగా పూజాదికాలు రాజావారు నిర్వహిస్తున్న రోజుల్లోనే తిరుపతి వేంకట కవులు ఆ ఆస్థానానికి రావడం జరిగింది. అప్పుడా పండితుడు వారిని సమీపించిఅయ్యా నేను తెలిసో తెలియకో రాజుగారితో ఈ విధంగా చెప్పి ఉన్నాను.వారు మిమ్ములను ఈ విషయమయి ప్రశ్నిస్తే నా మర్యాద కాపాడవలసిందని ప్రార్థించాడట. రాజా వారు ఆ విషయమయి వీరిని అడగడము జరుగలేదనుకోండి.అయినా తెలిసి కూడా పండితుడు రాజు గారితో అలా చెప్పడం మోసమే కదా? ఇంత కంటె తమాషా అయిన మరో ముచ్చట మనవి చేస్తాను వినండి:
ఒకప్పుడు ఒక పల్లెటూళ్లో మహా ధనికుడైన పెధ్దమనిషి ఉండేవాడట.ఆయనకు యజ్ఞం చేసి ఆ పుణ్యం కాస్త దక్కించుకోవాలనే ఉద్దేశం కలిగింది.యజ్ఞం చేస్తే గోవులను దానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అతని దగ్గర గోవులు లేవట.అందు చేత ఒక వైదికుని పిలిచి నూరు గేదెలిస్తానని తనచేత యజ్ఞం చేయించవలసిందని అడిగాడట. ఆ వైదికుడు దానికి ఒప్పుకుని ఇద్దరు ముగ్గురు సహాయకులకు హోమకుండంలో సమిధలు ఆజ్యం వేసే పధ్ధతులు నేర్పించి తనతో తెచ్చుకుని యజమానిని హోమగుండం ముందు కూర్చో పెట్టుకుని యజ్ఞం చేయనారంభించాడట. కర్రాయ స్వాహా కంపాయ స్వాహా అని ఈ వైదికుడు ( ఆధ్వర్యునిగా) మంత్రాలు చదువుతుంటే హోతలు చితుకులు వేస్తూ యజ్ఞం చేస్తున్నారట.అంతలో అక్కడికి వచ్చిన పండితుడొకడు అది చూసి ముక్కున వేలేసుకుంటుంటే అప్పుడా పురోహితుడుమహా మూర్ఖస్య యాగోయాం మహిషీ శతదక్షిణాం తవాప్యర్థం మమావ్యిర్థం తూష్ణీం తిష్టస్వ పండితోం స్వాహా అని హోమకుండం లో సమిధ వేసి ఆజ్యం పోసాడుట.ఆ వచ్చిన పండితుడు తాను కూడా ఇంత ఆజ్యం పోసి అషైతే మాభాగా ఇదం న మమ అని అన్నాడట. ఆ విధంగా యజ్ఞం పూర్తి చేసి ఆ బ్రాహ్మలిద్దరూ చెరి యాభై గేదెలనూ పంచుకుని చక్కా పోయారట. ఈ కథ మన ఆంధ్ర దేశం లోనే కాకుండా యావద్భారత దేశం లోనూ ప్రచారం లో ఉందంటారు ఇది మనకు చెప్పిన శ్రీ రాంభట్ల కృష్ణ మూర్తి గారు.
అయ్యా ఇదీ సంగతి.అమాయకంగా కనిపిస్తూ మనం అందరినీ నమ్మేస్తే వారు వారి లౌక్యంతో మనల్ని ముంచేయడం ఖాయం. అందుకే అన్నాడు మహా కవి కుడి యెడమల దగా దగా..అని. తస్మాత్ జాగ్రత..