22, జులై 2012, ఆదివారం

పిలుపుల్లో ఆత్మీయత..


                       

ఇంతకుముందు పిలుపులూ..మానవ సంబంధాలూ.. అనే నా పోస్టులో పిలుపుల తీరు తెన్నుల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పేను. మరికొన్నిటి నిప్పుడు ముచ్చటించుకుందాం.
మా యింట్లో మా తాతగారిని వారి సంతానం అందరూ బాబూ అనే పిల్చే వారని చెప్పేను. ఈ బాబు అది తెలుగు పదమేనని దానికి తండ్రి పూజ్యుడు అనే అర్థాలున్నాయని విద్యార్థి కల్ప తరువు చెబుతుంటే,శరన్నిఘంటువు మాత్రం పూజ్యుడు అనే అర్థాన్నిమాత్రమే ఇచ్చి ఇది వైకృత పదమంటుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు మాత్రం ఇది హిందీ పదం బాప్ నించి వచ్చిందనీ దీనికి తండ్రి పూజ్యుడు అనే అర్థాలే కాకుండా పిన తండ్రి అనే అర్థం కూడా ఉందంటుంది. ఇది ఏ సంస్కృత ప్రాకృత మూలాల్లోనుంచి వచ్చిందో కాని  హిందీ లో బాప్ బాపూ బప్పా పప్పా పాపా రూపాలనూ ఒరియాలో బొప్పా అనీ మన తెలుగులో బాబు అనే రూపాలనూ సంతరించుకుంది. గౌరవ వాచకం గానే పెద్దవారిని బాబు అనీ బాబుగారనీ వ్యవహరించడం ఉంది. ఉత్తరాదిని కూడా ఇలాగే గౌరవ వాచకం గానే దీనిని వ్యక్తినామాలకు చేర్చేవారు. (ఉదా. బాబూ రాజేంద్ర ప్రసాద్,బాబూ జగజ్జీవన్ రామ్). అయితే తండ్రిని బాబూ అని పిలవడం నేను మాయింట్లోనే చూసేను . మరెక్కడా వినలేదు. ( ద్రావిళ్లలో ఈ ఆచారం ఉండేదేమో మరి. రాంభట్ల కృష్ణ మూర్తిగారు వారింట్లో ఇలాగే పిలిచే వారని వ్రాసేరు.). ఏమైనా ఈ పిలుపు మా తండ్రుల తరంతోనే సరి. మేమందరం తండ్రిని నాన్నఅనే పిల్చేవారం. మేం ఇతరులతో వ్యవహారంలో తండ్రిని మా నాన్నగారు అనే అన్నా ఆయనను పిలవడం మాత్రం నాన్నా అనే పిలుస్తూ మీరు అని సంబోధించేవారం. మాఅత్తవారి ఇంట్లో  తండ్రిని నాన్నా అనిపిలుస్తూ నువ్వు అని ఏకవచనంలోనే సంబోధించేవారు. .తరువాత ఎప్పుడో చాలా కాలానికి  కొందరి ఇళ్ళలో తండ్రిని నాన్నగారూ అని గౌరవ వాచకం చేర్చి పిలవడం చూసేను.  అంతమాత్రాన అలా పిలిచే వారికి తండ్రి అంటే ఎక్కువ గౌరవముండేదని చెప్పలేం. మేం అలా పిలవక పోయినా మానాన్న గారిపట్ల మాకు చాలా గౌరవం భయం కూడా ఉండేవి.,శిష్టేతర కుటుంబాల వారుమాత్రం తండ్రిని ఒరే నాన్నా అనో ఓరయ్యా (ఓరి+అయ్యా) అనో పిలిచే వారు.

మా యింట్లో అందరికంటె జ్యేష్టుడైన మా నాన్న గారిని వారి తమ్ములందరూ నాన్నాఅనే పిలిచే వారని చెప్పేను.పితృ సమో జ్యేష్టఃఅన్నారు కనుక తండ్రి తరువాత తండ్రి అంత వారు కాబట్టి జ్యేష్ట సోదరుని అలా పిలిచే అలవాటు అయి ఉంటుంది. ఏమయినా ఈ అలవాటు కూడా మాతండ్రుల తరంతోనే అంతరించింది. ఇక్కడొక తమాషాగా అనిపించే విషయం ఒకటి చెప్పాలి. అసలు అన్న అంటేనే తండ్రి అని అర్థమట. ఆ తరువాత కాలగమనంలో తండ్రి తరువాత తండ్రి అంతటి వాడనే గౌరవంతో జ్యేష్ట సోదరుని కూడా అన్న అని వ్యవహరించడం మొదలైనదట. అలా మొదలైన తరువాత తండ్రి అని ప్రత్యేకంగా తెలియడానికి ( నా+అన్నః) నాన్న అని వ్యవహరించడం ప్రారంభమైందట. తండ్రి అనే అసలైన అర్థంలో తండ్రిని అన్నా అని పిలవడం విశాఖ జిల్లాలో చాలా కాలం క్రితం వరకూ మిగిలి ఉండేదట. మహా మహోపాధ్యాయ రాయుడు శాస్త్రిగారి ధర్మ పత్ని మహా పండితులైన పేరి కాశీనాథ శాస్త్రుల వారి కుమార్తె వారి నాన్న గారిని ఒరే అన్నా అనే పిలిచేదిట. అంతటి పండితుల వారి యింట అలా పిలుచుకునే వారంటే అది ఆ రోజుల్లో అత్యంత సహజమైనదై ఉండాలి. తండ్రిని కూడా ఒరే అని పిలవడం మనకీ రోజుల్లో కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ తండ్రీ కూతుళ్ల మధ్యనున్న స్నేహబంధానికి గుర్తుగా అలా పిలుచుకోవడం ఆరోజుల్లో నిరాక్షేపణీయమే కాకుండా పండితామోదం కూడా పొందినదనే భావించాలి. చిన్నయ సూరి  ఓరి ఓసి మైత్రియందు గలవు అని అంటాడుకదా?
ఇక్కడో చిన్న ముచ్చట. శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు విద్వాన్ పరీక్షకు చదువుకోవడానికి విజయనగరం వచ్చే సరికి వారికి 16 ఏళ్లు. అప్పట్లో ఆ ఊళ్ళో చొప్పల్లి భాగవతార్ గారి తండ్రిగారైన చొప్పల్లి నరసింహంగారు ఉండేవారు. అప్పుడాయన 50 ఏళ్ళ పెద్ద మనిషి. వారు కనిపించినప్పుడు శాస్త్రిగారు వారిని నరసింహంగారూ అని పలకరించేవారట. వారు కోప్పడుతూ ఒరే.. గారూ గీరూ ఏమిట్రా ఒరే నరసింహం అని పిలవలేవుట్రా అనేవారట. అంత పెద్ద వారిని అలాగ పిలవడం ఇబ్బంది గానే ఉన్నా మెల్లగా వారినలాగ పిలవడానికి అలవాటు చేసుకున్నారుట శాస్త్రిగారు. ఆ పిలుపు మిత్రత్వానికి చిహ్నమనీ నరసింహంగారు శాస్త్రిగారి స్నేహాన్ని కోరుకునే వారనీ మనం అర్థం చేసుకోవాలి. కాలగమనంలో పదాలు కొత్త అర్థాలను సంతరించుకున్నట్టే పిలుపులు కూడా దేశకాల పరిస్థితుల్ని బట్టి మార్పులకు గురి అవుతూ ఉంటాయి. అందుకే ఒకనాటి పిలుపులు ఈనాడూ,ఒక ప్రాంతపు పిలుపులు మరో ప్రాంతం వారికీ వింతగా తోచడం జరుగుతుంది. ఎప్పుడైనా అప్పటి సంఘంలో వ్యవహారంలో ఉన్న దేనినీ మనం తప్పు పట్టాల్సిన పని లేదు.
మరికొన్ని ముచ్చట్లు మరోసారి ఎప్పుడైనా. సెలవు.