24, సెప్టెంబర్ 2011, శనివారం

శ్రీ విశ్వనాథ గిరీశం....హైదరాబాదీ గిరీశం...

( కన్యాశుల్కం నాటకాన్ని విశ్వనాథ వారు వ్రాసి ఉంటే ఎలాగుండేదో ఊహించి సరదాకి చేసిన ప్రయోగం. అలాగే గిరీశం హైద్రాబాదులో పుట్టి ఉంటే  ఆ హైద్రాబాదు  గిరీశం ఎలా మాట్లాడే వాడో అని  మరో చిన్నఊహ... )

ఒకరోజు సాయంత్రం  విశ్వనాథ వారి గిరీశం విజయనగరం బొంకులదిబ్బమీద నిల్చుని  ఇలా స్వగతం చెప్పుకుంటూ ఉంటాడు:

వి.గిరీశం:సాయం సమయమైనది. దీనినే కవులు గోధూళి వేళయని యందురు   అదియొక చమత్కారము. వారేదియును దిన్నగా జెప్పరు.కవులు నిరంకుశులని గదా లోకోక్తి. అయిననేమి? తిన్నగాజెప్పిన వారిసొమ్మేమి బోయియుండును? వారినట్లుండనిండు. వారిది కడుపునిండిన బేరమైయుండును. నాసంగతియే యేమియునుదోఁచకున్నది. నెల దినములక్రిందట విపణికి బోయి సరకులను గొనిదెత్తునన్ననెపమున పూటకూటియామెనుండి ఇరువది రూప్యములను బుచ్చుకొని వచ్చి నాట్యగత్తెకు నర్పించుకొనియుంటిని. ఈదినము ప్రత్యూషముననే నాకునూ ఆమెకునూ పెద్ద జగడమే జరిగినది. కపాల మోక్షము చేయుదమన్నంత కోపమావహించినదిగాని, ఓరిమి లేక ఎవడునూ లోకమును గెలువజాలడని రిచర్డు మహాశయుడు ఆంగ్లమున నుడివియుండుట జ్ఞప్తికి వచ్చుటచే  శమించియుంటిని. పూర్వమున నేనెన్ని పర్యాయములు ఇట్లు ధనము కాజేసినను ఏమియూ ననక యూరకుండెడిదిగాదా? ఇప్పుడీ నాట్యగత్తె విషయము  ఎవడైన తుంటరియొకండు ఆమె చెవిలోనూదియుండును. మన ప్రాభవమును జూచి ఓర్వలేక అతడీ పని చేసియుండును. ప్రొద్దుటి సంఘటన వలన మరి నేటినుండి మనకు నిచ్చట భోజనము లభించు తీరు మృగ్యము. ఇచటనందరకునూ ఋణగ్రస్తుడనైయుంటిని. శ్రీ పంతులుగారి కోడలుకి నేను వ్రాసియున్న ప్రేమలేఖ సంగతి బహిర్గతమైనచో నాకు దేహశుధ్ధి జరుగుట అనివార్యము. అతిశీఘ్రమే ఈయూరినుండి నిష్క్రమించుటత్యావశ్యకమని మదినిదోచెడిని....కాని మధుర వాణిని వీడి వెళ్లుటకు మనసు ఇచ్చగించదే? నేనేదైన నుద్యోగము జేసి యామెకు వైభవమును జేకూర్చగలనను ఆశతోడనున్నది. పాపమమాయకురాలు.

ఆఁ.. ఎవరా వచ్చుచున్నది.... నా ప్రియశిష్యుడగు వెంకటేశము వలె దోచుచున్నది. వీనికీ దినమునుండి  క్రిష్టమసు శలవులిచ్చి యుందురు. వీని ముఖమున విషాదఛాయ దృగ్గోచరమగుచున్నది.  పరీక్ష దప్పియుండును. మంచిది. వీనికి చదువుచెప్పుదునని వీనితోడ వీని యూరికి బోయినయెడల ప్రస్తుత సంకటము నివారించుకొనవచ్చును. తరువాత సంగతి యాతరువాత జూచుకొనవచ్చును. నందో రాజా భవిష్యతి యని గదా
(ఇట్లుకొనసాగును.)
                                               ****
                              
గిరీశం హైద్రాబాదులో పుట్టి ఉంటే......
హై.గిరీశం:   పొద్నూకింది...ఒక మయిన పయిల వొటేలమ్మతాన యిరువై రూపాలు దీస్కొని సామాన్దెస్తనన్జెప్పి చపాయించిన.  గాపైసల్గిట్ట డాన్సు గర్లుకి కరుసైపోయుండె. ఇయ్యాల పొద్దుగాల గామె లడాయి శురూజేసె..  నాకెంత గుస్సయ్యందంటే గామెను సంపేద్దామనుకున్నగాని గంత గుస్సపన్కిరాదని గా రిచర్డుగాడు జెప్పింది యాదికొచ్చి జర్రంత తమాయించిన. గామె గూడ మంచిదే. గిదేమి పైలిబారుగాదు,  గామెతాన పైసల్దీసుకున్నది. గప్పుడల్ల  సప్పుడు జైకుంట
 ఊకునేదిగాదె. గిప్పుడేమొ గామెకి డాన్సుగర్లు కత ఎవుడైన జెప్పిండో  ఏందోకత. గెట్లైన గిప్పటి సంది మనకీడ బువ్వబుట్టే కతలేదు. పంతుల్కోడల్కి చిట్టి రాసినంద్కు గాల్లకెవురికైన ఎరికైతె గెప్పుడైన మన సెమ్డాలెక్కదియ్యొచ్చు. గింక లేట్జెయ్యకుండ గీడనుంచి  బైలెల్లడమే దిమాకున్నోడు జేసేపని. గాని ఆ సాన్ది మదురవోణ్ణి ఇడిసిపెట్టెల్లాల్నంటె మనసైత లేదు. నేనేదైన కొలువు జేసి గామెను సుకబెట్తనని కలలుగంటన్నది. ఎర్రి మొకంది.

  ఆఁ...ఎవురది... గిట్నే ఉర్కొస్తండు? మన యెంకటేనా? గీడికిప్పుడు కిస్మిస్సెలవులిచ్చుంటరు. గీడు దప్పకుంట పరీచ్చ ఫెయిలయ్యుంటడు. గీడి మొగమే జెప్తందా ముచ్చట. గీణ్ణి జర్ర సమ్జాయించి గీడికి  సదువు సెప్తనని గీన్తో గీని ఊర్కి ఉడాయిస్తే గిప్పటికి మనం బచాయించినట్లయితది. పరేశాన్ ఖతమ్. గానక ముచ్చట గానక.....        (ఇలా నడుస్తుంది...)

( ఇది శ్రీ గురజాడ 150వ జయంతోత్సవ సంవత్సరం అందుకే ఈ యత్నం...సెలవు)