21, నవంబర్ 2012, బుధవారం

తెలుగులో కుప్పుసామయ్యర్లు...


  
కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశానికి రాసుకోమని చెప్పిన పుస్తకాల లిస్టులో చివరిది కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్. ఈ కుప్పుసామయ్యర్ ఎవరో పిల్లలకోసం ఆయన ఏం పుస్తకాలు వ్రాసేడో అవెలా ఉండేవో ఇవాళ మనకు తెలీదు.వెంకటసుబ్బారావుగారి మేడీజీ పుస్తకాలలా కాకుండా అవి అసలు పాఠాన్ని క్లిష్టతరం చేసేవిగా ఉండేవేమో? ద్రావిడ ప్రాణాయామం గురించి విని ఉన్నాం కదా. ప్రాణాయామం చేసేటప్పుటు అందరూ మామూలు పధ్ధతిలో ముక్కుమూసుకుంటే వారి పధ్ధతిలో వారు చేతిని తల వెనుకవైపునుండి తిప్పి ముక్కుపట్టుకుని మూసుకుంటారుట.అంత కష్టం ఎందుకో. ఎందుకేమిటి.కొంతమందికి అందరిలా కాకుండా తాము ప్రత్యేకమని, గొప్ప వారమని చాటుకోవాలని ఉంటుంది.ఈ విషయంలో ఎవరినో తప్పు పట్టనక్కర లేదు.మన తెలుగు వారిలోనే పండితమ్మన్యులలోనూ, శిష్టాచార పరాయణులలోనూ ఇది చాలా ఎక్కువ. భాషా విషయంలో వీరి డాంబికత్వం యెలాఉండేదో చూపిస్తాను చూడండి.
భాషయొక్కమౌలికమైన ఉపయోగం మన భావాలను అందరికీ సులభంగా అర్థమయ్యేలా వ్యక్తపరచడమేకదా. వీరు పిల్లి అంటే అందరికీ తెలిసి పోతుందని మార్జాలం అనే బాపతన్న మాట. ఈనాడు ఎక్కడైనా మిగిలి ఉందో లేదో నాకు తెలీదు కాని ఒకనాడు శిష్టాచార పరాయణులైన వైదీకి బ్రా హ్మణ కుటుంబాలలోని భాష ఏలాగుండేదో మనకు చూపించే ఈ పద్యాన్ని ఆస్వాదించండి.
అస్సే!  చూస్సివషే ! వొషే ! చెముడషే ! అష్లాగషే? యేమిషే?
విస్సావఝ్ఝలవారి బుఱ్ఱినష? ఆ విస్సాయి కిస్సారుషే
విస్సండెంతిటివాడె యేళ్ళు పదషే? వేయేళ్ళకౌ మంచి వ
ర్చస్సే?  అందురు వైదికోత్తమ కులస్త్రీలాంధ్ర దేశమ్మునన్
 (తంజావూరు యక్షగానాల్లో ఇలాంటి భాషా ప్రయోగాలు మనకు లెక్కకు మిక్కిలిగా దొరుకుతాయి.) వేదోచ్చారణలో ఎక్కువగా వచ్చే శ,ష,లకు అలవాటు పడిపోయి అయిన వాటికీ కానివాటికీ కూడా వీటిని చేర్చి పలకడం వారికి అలవాటై పోయి ఉంటుంది. కన్యా శుల్కంలో అగ్ని హోత్రావధాన్లు గారి ధర్మ పత్ని వెంకమ్మ గారు  అంటూ ఉంటారు అనడానికి అంఛూ వుంఛారు అని అంటుంది. ఏ వ్యాకరణం ఏ విధంగా వీటిని సమర్థిస్తుంది? పండితుల వారి ఇంట్లో ఇటువంటి భాష ఎలా మనగలిగేది? పామరుడైన పడవవాడు నాపాట నీ నోట పలకాల సిలకా అంటే సిలకా కాదు చిలకా అనాలి అని సరిదిద్దుతాము (చూ.మూగ మనసులు సినిమా).వారి ఉచ్చారణని ఎగతాళి చేస్తూ ఎకసక్కేలాడతాము.( ఎకసక్కములనేదే సరైన పదమట. పండితులు దీనిని వెకసక్కెములని పలుకుతారు).
ఈ భాషా భేషజం ఎక్కువగా ఉన్నకుటుంబాలలోని వారు ప్రాచీన సాంప్రదాయాలను పునరుధ్ధరించాలనే కంకణం కట్టుకున్న వారైనందున భాష విషయంలో కూడా వారికి తెలియకుండా తప్పులు చేసేవారు.మచ్చుకి కొన్ని చూడండి- క్రొత్త, బ్రతుకు,మ్రొక్కుమొదలైన చాలా పదాలలో  పదాదిని ఉండే రేఫము జారి పోయి కొత్త,బతుకు, మొక్కు అనేవి వాడుకలోనికి వచ్చాయి.అన్ని విషయాలలోనూ ఇలాగే జరిగిఉంటుందనే భ్రాంతితో పదాది వర్ణానికి లేని రేఫను చేర్చి ప్రయోగించిన కవులూ  పండితూలూ ఉన్నారు.ఇటువంటి
భ్రమాదానికి గురైన వారిలో లాక్షణిక చక్రవర్తియైన చిన్నయసూరిగారు కూడా ఉండడం విశేషం. స్థానమనే అర్థమిచ్చే తావు అనే పదాన్ని త్రావు అని నీతిచంద్రికలో ప్రయోగించారు.అలాగే తెగు, తెంచు అనే పదాలను త్రెగు, త్రెంచు అని ప్రయోగించారు.మురికి వదలగొట్టడానికి రుద్దడాన్ని తోమడం అనే మన లాంటి సామాన్యులందరం అంటాము. భోజరాజీయ కవి దీనిని త్రోమడం అన్నాడట. పార్శ్వము అనే అర్థం వచ్చే సంస్కృత పదం పక్ష- ప్రాకృత పదం పక్ఖ లనుంచి వచ్చిన తెలుగు పదం పక్క అనేది, మీద చెప్పిన భ్రాంతివలన ప్రక్క అని ప్రయోగించారు.అలాగే దిండుని ద్రిండు, దుడ్డుని ద్రుడ్డు చెసారు. అందుకే వైదీకుల ఇంట్లో పిల్లి కూడామ్రావు మ్రావుమంటుందని చమత్కరిస్తారు కొందరు. ఈ విధంగా భ్రాంతితో పదాలను ప్రామాణీకరించాలనే తపనలో తప్పులు చేయడాన్ని కృతక ప్రామాణీకరణము (Hyper or Super standardized Form) అన్నారు భాషా శాస్త్ర కారులు.    
ఇలాగే నిర్దుష్టంగా పలకాలనే తపనతో – పామరులు సరిగా ఉచ్చరించడం లేదనే భ్రాంతితో లేని మహాప్రాణాల్ని చేర్చి పలుకుతారు మరి కొందరు. మచ్చుకి చూడండి.జగదీశ, జనార్దన,మధుసూదన, మల్లికార్జున సుదేష్ణ  లను తాము శిష్టులమనుకునే వారు జగధీశ, జనార్ధన,మధుసూధన, మల్లిఖార్జున, సుధేష్ణ అని ఉచ్చరించడంవ్రాయడం కూడా జరుగుతోంది. మన టీవీ ఛానెళ్ళలో స్పష్టమైన ఉఛ్ఛారణ కలిగిన వారు వార్తలు చదవడానికి కావాలనే వార్త స్క్రోలింగులో చూడడం వినడం మనకు తెలిసిందే.
ఇలాంటి భేషజమే తెలుగు గ్రామనామాల్నిసంస్కృతీకరించడం కూడా. పాలకొల్లుని దుగ్ధోవన పురం న్నారు. రెంటచింతలని ద్వితింత్రిణీ పురమన్నారు. కడియంగ్రామాన్ని చెళ్లపిళ్లకవిగారి ముత్తాత గారు వలయ పురం అన్నారుట. ముని మనుమడు గారేం తక్కువ తినకుండా తనకావ్యంలో దానిని కంకణంగా మార్చి కంకణ గ్రామంబు మా కాపురంబు అన్నారు.ఎందుకొచ్చిన తిప్పలు. ఊళ్ళ పేర్లను మార్చే అధికారం మనకెవ్వరిచ్చారు?   
ఇలాగ ఎన్నో ఉన్నాయికాని ఇప్పటికిది చాలు.ముగించేముందు చెప్పదలచుకున్న మాట ఒక్కటీ చెప్పి ముగిస్తాను. భాష సజీవ స్రవంతి. ఇంతకు ముందు నా మడీ..తడీ..గోదావరీ.. అనే పోస్టులో చెప్పినట్లు నన్నయ గారు భారతాంధ్రీకరణం సమయంలో క్రుంకులిడినదీ, మనమిప్పుడు స్నానం చేసేదీ రాజమండ్రి దగ్గర గోదావరిలోనే.నన్నయగారు తానమాడినప్పటి నీళ్లు ఇప్పుడు దానిలో లేక పోయినా అది గోదావరే. అప్పటి భాషలా ఇప్పుడు లేక పోయినా మనం మాట్లాడేది తెలుగే. కుప్పుసామయ్యర్ల లాగా మనం ఏదో చేయబోయి ఏదో చేయవద్దు. ఈ సుజల స్రవంతినిలాగే కొనసాగనిద్దాం.
(ఇందులో ఉదాహరించిన పద్యం దాసు కవిగారిది. కృతక ప్రామాణీకరణం గురించి దొణప్ప గారి వ్యాసం నుంచి గ్రహించాను. వారికికృతజ్ఞతలు తెలుపుకోవడం నా విధి.)