5, సెప్టెంబర్ 2011, సోమవారం

కౌకిలి..కైకిలి..కంగాళీ...


ఈమాటలు మీరెప్పుడైనా విన్నారా? నా చిన్నప్పుడు మా వూళ్ళో  ( పార్వతీవురం-ప్రస్తుతం విజయనగరంజిల్లా) లో ఉన్నప్పుడు  కౌకిలి..కంగాళీ.. అన్న పదాలను విన్నాను.శిష్టేతరుల వ్యవహారాల్లో వాళ్ళకేదైనా కష్టాలొచ్చినప్పుడు   మా చెడ్డ కౌకిలి పడిపోనాం బాబూ  అనడం విన్నాను.  ఆ మాట ఏదో కష్టాన్ని సూచిస్తోందని తెలిసేది. అంతే.  అయితే కొన్నాళ్ల క్రితం  తెలంగాణా మాండలికం లో వచ్చిన కథలు చదువుతున్నప్పుడు  అదే అర్ధంలో కైకిలి అనే పదం వాడడం గమనించేను.అప్పుడు దీని అసలు రూపం నాకు స్ఫురించింది. అది కైకూలి అయి ఉంటుంది. కై+కూలి= కైకూలి.అంటే చేతితో చేసే పని..శారీరక శ్రమ అన్నమాట. శ్రమ జీవుల వ్యవహారాల్లోనే ఈపదం కనిపించడం కాయకష్టం తెలియని అగ్ర వర్ణాల వ్యవహారాల్లో ఈ ప్రయోగం లేక పోవడంలో ఆశ్చర్యం ఏముంది? 
                                                        కంగాళీ..అన్న పదం ఎవరైనా అల్లరి చేస్తున్నప్పుడు వాడేవారు.   వాడొచ్చి చాలా కంగాళీ చేసేడ నేవారు .ఈ పదం శిష్టుల వ్యవహారాల్లో కూడా ఉన్నా నిఘంటువులలో కనపడదు. దీనర్థం నాకు ఏనుగుల వీరాస్వామిగారి కాశీయాత్ర చదివినప్పుడు గోచరించింది. ఆయన కాశీలో ఉన్నప్పుడు (సుమారు 150 ఏళ్ల క్రితం) అక్కడ కంగాళీలనే జాతి వారుండే వారనీ వారు కాశీ యాత్రకి వచ్చిన యాత్రికులని జలగల్లా పట్టుకు పీడిస్తూ  డబ్బులడుక్కునే వారనీ రాసేరు.ఆంధ్రదేశంనుంచి కాశీయాత్రకి చాలామంది పోయి వచ్చేవారు కనుక  వారందరూ తమనెవరైనా అల్లరి చేస్తే కంగాళీ మనుషులు అంటూఉండే వారనుకుంటాను.
                                                   ఇవి నాకుతోచిన విషయాలు.ఇంతకంటే అర్థవంతంగా ఉండే వివరణ ఎవరికైనా తడితే తెలియజేస్తే సంతోషిస్తాను.

     ముందు ముందు పోస్టుల్లో మరికొన్ని పదాలు వాకు తోచిన వివరణలూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.    సెలవు.