నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు మానాన్నగారు తరచూ మాఊరినుంచి
శ్రీకాకుళం వెళ్ళి వస్తూండేవారు. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా మర్నాడు కమాను
వెళ్ళాలి అంటూ ఉండే వారు. తిరిగి వచ్చేక కూడా ఎవరైనా మీరు నిన్న ఊళ్లో లేరా అని
అడిగితే కమాను వెళ్లి వచ్చేను అంటూ ఉండేవారు. కమాను వెళ్లడమంటే ప్రయాణమై వెళ్లడమని
అప్పుడు నాకర్థమైంది. కానీ తర్వాత ఈ మాట ఎక్కువ మంది నోటంట విని ఉండలేదు. నాకు కొంచెం
వయసొచ్చేక, నేను కన్యాశుల్కం చదువుతున్నప్పుడు మళ్ళీ ఈ మాట నా కళ్లబడింది. గిరీశం
వెంకటేశాన్ని జామచెట్టెక్కి పళ్లు కోసుకు రమ్మన్నప్పుడు, అగ్నిహోత్రావధాన్లు
అదేమిటని అడిగితే అది దొరల విద్యలో ఒక భాగమనీ, పెద్దయ్యాక వెంకటేశానికి గుణుపురం
లో తాసీల్దారీ అయితే కమాన్లు వెళ్లాల్సి ఉంటుందనీ, అడవుల్లో ప్రయాణించేటప్పుడు
చెట్లక్కడం నేర్చి ఉంటే పనికి వస్తుందనీ అంటాడు. ఎందుకో నాకీ పదం తెలుగు పదంలా
అనిపించేది కాదు. నిఘంటువులు చూస్తే సూర్యరాయాంధ్ర నిఘంటువులో కమాను అంటే విల్లు
ధనుస్సు అని మాత్రమే ఉంది. శ.ర. నిఘంటువు లో మాత్రం ఇది అన్య దేశ్యమనీ ప్రయాణము విల్లు అనే అర్థాలున్నాయనీ తెలిసింది.
విద్యార్థి కోశమనే నిఘంటువులో మాత్రం విల్లు అనీ ఫిడేలు వాయించు కొడుపు ( ఫిడేలు
వాయించు సాధనం) అనీ ఉంది. హిందీ కమాన్ నుంచి వచ్చిన ఈ పదానికి ప్రయాణమనే అర్థం
లేదు. మరి ప్రయాణ మనే అర్థమున్న కమాను అనే పదం ఏ అన్యదేశ భాష నుంచి వచ్చి ఉంటుంది? అని
ఆలోచిస్తే నా ఊహకి తట్టిన విషయమేమిటంటే దొరల ఏలుబడిలో వారు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తమ గుమస్తాలనో బంట్రోతులనో వారితో
రమ్మనడానికి Come On అటూ ఉండే వారేమో అలా ప్రయాణ మవడాన్ని
దొర కమానంటే వెళ్లడం వలన కమానంటే ప్రయాణమని అనుకుని ప్రయాణానికి అది ఇంగ్లీషు మాటగా వారి మాటల్లో
స్థిర పడిఉంటుందనుకుంటాను. లేక పోతే ఏ పరభాషా పదం ఈ అర్థంతో ఉన్నదీ నాకు తట్టలేదు.
మరో మంచి వ్యుత్పత్తి దొరికే వరకూ ఈ ఊహ బాగానే ఉంటుందనుకుంటాను.
కన్యాశుల్కం నాటకంలోనే ద్వితీయాంకం ప్రథమ స్థలంలో వెంకటేశం
తల్లి, వెంకటేశం రాక కోసం ఎదురు చూస్తున్నప్పుడు, అగ్ని హోత్రావధాన్లు తాను
వద్దంటూంటే వెంకమ్మ కొడుకుని ఇంగ్లీషు చదువులో పెట్టిందనీ, ఇంగ్లీషు చదువు తమకు
అచ్చిరాదనీ తన పెద్దన్నదిబ్బావధాన్లు కొడుకుని ఇంగ్లీషు చదువుకి పార్వతీపురం
పంపించే సరికి వూష్టం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేసిందనీ, బుచ్చబ్బి కొడుక్కి
ఇంగిలీషు చెప్పిద్దామనుకుంటుండగానే చచ్చినంత ఖాయిలా చేసిందనీ అన్నప్పుడు వెంకమ్మ“
మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంటూ వుంటా”రని
అంటుంది. అగ్రహారపు ఛాందస బ్రాహ్మణ స్త్రీ అయిన వెంకమ్మనోటంట ఓఘాయిత్యమనే
వినిపించినా ఇది అఘాయిత్యం అనే మాటే. అయితే ఈ అఘాయిత్యం అనే మాట కూడా మన నిఘంటువుల్లో
ఎక్కడా కనిపించదు. మొదట్లో ఇది అగత్యం అనే మాట అయి ఉంటుందనీ అగత్యం అంటే గత్యంతరం
లేక పోవడం కనుక అలాంటి పరిస్థితుల్లో చేసే పనిని అఘాయిత్యం అంటారనీ అనుకునే
వాడిని. కానీ ఈ ఊహ నాకు సంతృప్తి కలిగించ లేదు. తర్వాత ఆలోచించగా తట్టిందేమిటంటే
ఇది అఘాయితము అయి ఉంటుందని. అఘము అనే పదానికి పాపము దుఃఖము అనే అర్థాలున్నాయి.ఇతము
అనే ప్రత్యయానికి పొందినది కూడుకున్నది అనే అర్థం ఉంది.(నిందితుడు, బాధితుడు వంటి
మాటలు చూడండి). పాపము లేక దుఃఖము కలిగినది లేక కూడుకున్నది. అఘాయితము. ఇదే
అఘాయిత్యము లేక వెంకమ్మగారు చెప్పిన ఓఘాయిత్తం. ఇంగిలీషు చదువులకి పిల్లల్ని
పంపిస్తే చనిపోతారని అగ్నిహోత్రావధాన్లనడం ఓఘయిత్తపు మాటలే కదా మరి?
నా దగ్గర ఏ వ్యుత్పత్తి పదకోశాలూ లేవు. ఈ రెండూ నా ఊహలు
మాత్రమే. ఎక్కడైనా ఇంతకంటే సరియైనవీ ప్రామాణికమైనవీ వ్యుత్పత్తులు ఉంటే ఎవరైనా
తెలియజేస్తే సంతోషిస్తాను. సెలవు.