23, ఏప్రిల్ 2013, మంగళవారం

మా ఆవిడ బంగారం...


                         
మా ఆవిడ బంగారం అని నేననగానే అది మీకు రెండు విధాల అర్థమయ్యే అవకాశం ఉంది.మొదటిది నేను మా ఆవిడను బంగారం లాంటి మనిషని మెచ్చుకుంటున్నానని, రెండవది మా ఆవిడకు చెందిన బంగారమనీ.ఇటువంటి విషయాల్లో స్పష్టత కోసమే మన వాళ్లు రెండో అర్థం వచ్చేటట్లు చెప్పాల్సివచ్చినప్పుడు మా ఆవిడ యొక్క బంగారం అని  విభక్తి ప్రత్యయం చేర్చి చెప్పాలనే వారు. ఈ యొక్క అనే విభక్తి ప్రత్యయాన్ని మన వాళ్లు పాత రోజులలో చాలా ధారాళంగా వాడేవారు.ఇది నాయొక్క పుస్తకము, ఈవిడ నా యొక్క భార్య అన్నట్లు.వక్తలూ, రాజకీయవేత్తలూ అయితే మరీని. అవసరం ఉన్నా లేక పోయినా ఆ యొక్క ఈ యొక్క అంటూ మాట్లాడే వారు.ఇప్పుడీ యొక్క అనేది  మాటల్లోనే కాదు వ్రాతల్లోనూ దాదాపు మాయమయి పోయింది. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడమే.. సరే. అదలా ఉంచండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మా ఆవిడ యొక్క ( ఒకప్పుడుండీ ఇప్పుడులేని ) బంగారం కథ.ఇది చదివేక  మా ఆవిడ బంగారమో కాదో మీరే చెబుదురు గాని.
దాదాపు 40 ఏళ్ళ క్రిందట, సరిగా చెప్పాలంటే 1970 లో నేను రెండు నెలలు సెలవు పెట్టాను. ఆ సెలవు నేను  ఇప్పటి శ్రీ రాం సాగర్ (అప్పట్లో దానిని పొచంపాడు ప్రోజెక్టు అనే వారు) లో పని చేస్తుండగా తీసుకోవడం వల్ల ఆ సెలవు జీతం రెండు నెలలకు 1200 రూపాయలు నాకు కొంచెం ఆలస్యంగా అందేయి. ఆ సెలవు కాలంలో ఇంట్లో ఉండే సేవింగ్స్ తోనే పొదుపుగా గడపడం వల్ల ఈ 1200 రూపాయలూ బోనస్ గా వచ్చినట్లనిపింది. అప్పుడు వాటిని పుట్టింటి కెళ్ళిన మా శ్రీమతికి నీ యిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో అంటూ పంపించాను. ఆడబ్బులు పెట్టి అప్పుడు ఆవిడ నాలుగు తులాలు బరువుతూగే నాలుగు పేటల చంద్రహారం ఒకటిన్నీ ఒక జత గాజులూ కొనుక్కుంది.గాజులు నిత్యం వేసుకున్నా చంద్రహారం మట్టుకు పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ వెళ్ళి నప్పుడు మాత్రం వేసుకునేది.ఇలా ఉంటే ఆరోజుల్లో కొన్నాళ్లు హైదరాబాదులో దొంగల భయం ఎక్కువగా ఉండేది. సివారు ప్రాంతాల్లోనే కాదు నగరం నడిబొడ్డున ఉన్న కాలనీలలో కూడా రాత్రుళ్లు కాలనీ వాసులు గస్తీ తిరిగే వారు.మా కోలనీలో కూడా అలాగే కొన్నాళ్లు గస్తీ తిరిగే వాళ్ళలో నా వంతు వచ్చినప్పుడు నేనూ నిద్ర మానుకుని తిరిగే వాడిని. ఇంట్లో కొంచెమైనా బంగారం ఉండబట్టి కదా భయపడడం. లేకపోతే ఎంత మనశ్శాంతితో జనం జీవించగలరో కదా అనుకునే వాడిని. బంగారం మంచి పెట్టుబడి (investment ) అన్న అభిప్రాయం నాకెప్పుడూ లేదు.అందుకనే చంద్రహారం అమ్మేస్తే మంచిదనే ఆలోచన నాకు కలిగింది. మా ఆవిడ కూడా రెండో ఆలోచన లేకుండా అమ్మి పారేయండి అంది. ఆ విధంగా  1980లోఆ నాలుగు పేటల చంద్రహారాన్ని అమ్మేసాను.గ్రాముకు 125 చొప్పున 44 గ్రాముల చంద్రహారానికి 5500 రూపాయలు వచ్చేయి.( ఆ తూకం బిల్లు రశీదు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి). ఇంట్లో ఏ బంగారమూ లేక పోవడం వల్ల నిశ్చింతగా నిద్ర పోతూ హాయిగా ఉండేవాళ్ళం.ఆ తర్వాత ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో వారికి ఏదో ఒకటి కొనడం తప్ప తన కోసం మాత్రం ఎప్పుడూ మా ఆవిడ బంగారం నగలు చేయించుకోలేదు.( నేను రిటైరయ్యాక ఒకటి రెండు జతల గాజుల చేయించుకుందేమో అంతే.) ఎప్పుడైనా ఏ పెళ్ళళ్లలోనో ఫంక్షన్లలోనో మా ఆవిడ మెడలో  పుస్తెలతాడు తప్ప ఏమీ లేకపోవడం చూసి చంద్రహారం ఉండాలిగా వేసుకోలేదేం అడిగిన వారికి మా ఆవిడ సమాధానం చిరునవ్వే అయ్యేది. 
                                                     ****
ఇంతకు ముందెన్నడూ లేనంతగా గడచిన దశాబ్ద కాలంలో పసిడి ధర తారాజువ్వలా ఎగసి తులం (10గ్రాములు) 32,000 తాకినప్పుడు కూడా మా ఆవిడ కాని నేను కాని అయ్యో చాలా చవగ్గా తులం 1250 కే అమ్మేసామే అని బాధ పడలేదు.గడచిన వారంలో బంగారం ధరలు పడిపోయి తులం 26000 కి దిగివచ్చి నప్పుడు  జనం బంగారం షాపుల ముందర క్యూలు కట్టిమరీ బంగారం కొనుక్కోవడం చూస్తే నవ్వుకునే వాళ్ళం. మొన్ననిలాగే క్యూలో నిలబడి  బంగారం వస్తువేదో కొనుక్కొచ్చి మా ఆవిడకు చూపించి అక్కయ్యగారూ మీరూ గొలుసేదైనా కొనేసుకోండి  మళ్లా ధర పెరిగి పోతుందేమో అని ఉచిత సలహా ఇచ్చి వెళ్తున్న మిత్రురాలికి అలాగే లెండి అంటూ సమాధానమిస్తూ నా వేపొక సారి చూసి చిరునవ్వు నవ్వింది మా ఆవిడ.
                                                      ****
ఇలా మేమిద్దరం నవ్వుకోవడానికి కారణం లేక పోలేదు. ఎందు చేతనంటే 1980లో మేము చంద్ర హారాన్ని అమ్మగా వచ్చిన 5500 రూపాయలలో 5000 రూపాయలు (40 గ్రాముల ధర) పెట్టి పోస్టాఫీసులో సేవింగ్సు సర్టిఫికెట్లు కొన్నాము.అవి 6 ఏళ్ళలో 1986 నాటికి 10,000 అయేయి.అవి అలా Reinvest  చేస్తూ పోతే 2010 నాటికి అవి 1,28,000 అయేయి. అవి మళ్లా Invest చేసాము.అవి 2016 నాటికి 2 లక్షల పై చిలుకు అవుతాయి. అప్పుడు బంగారం 10 గ్రాముల ధర 50,000 రూపాయలున్నా మాకు బాధలేదు. ఈ రోజైనా మా సేవింగ్స్ సర్టిఫికెట్ల విలువ 160000 ఉంటుంది.అవి Encash చేసుకుని  మా ఆవిడ చంద్రహారం కొనుక్కున్నా ఇంకా నాకో 50000 మిగిలినట్లే కదా? అంచేత మా ఆవిడ చంద్రహారం ఎక్కడికీ పోలేదు. మా పోస్టాఫీసులో భద్రంగా ఉంది. మేము కంటినిండా నిద్ర పోతున్నాము.అమాయకులైన ఆడవాళ్ళు మాత్రం చంద్రహారం అమ్మేసుకున్న మా ఆవిడ మీద జాలి చూపులు ప్రసరిస్తూనే ఉన్నారు.
                                                        ****
మా ఆవిడ మెళ్ళో ఏ నగా లేక పోవడం చూసి  ప్రక్కకు తిరిగి నవ్వుకునే ఆడవాళ్ళకు చిరు నవ్వే సమాధానం ఇచ్చే మా ఆవిడ నిజంగా బంగారమే. కాదంటారా?
                                                                             ****