ఈ మధ్య కళింగాంధ్ర మాండలికం..1 అనే పుస్తకం మరోసారి చదివేను. ఈ పుస్తకం 2006 జనవరిలో శ్రీకాకుళ సాహితి వారు ప్రచురించేరు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే శ్రీ జి.ఎస్.చలం గారు దీనిని వ్రాసేరు. ఏ యూనివర్శిటీయో, అకాడమీయో చేయాల్సిన పనిని ఒక్కరూ నెత్తికెత్తుకుని చేసారు. ఆయన కృషి చాలా అభినందనీయం, భాషాభిమానులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. అయితే ఆయన వ్యవహర్తలనుంచీ,ఆ ప్రాంతపు రచయితల పుస్తకాలనుంచీ పదాలు సేకరించి పుస్తకాలలోని మాటలకు తాననుకున్నవీ, ఆయావ్యవహర్తలు చెప్పినవీ అర్థాలు వ్రాసుకోవడంవల్ల కొన్ని పొరపాట్లూ,తప్పుడు అర్థాలూ దొర్లేయనుకుంటాను. వాటిగురించి మరోసారి ముచ్చటిస్తాను గానీ ఇప్పుడు చెప్పబోయేది కళింగాంధ్ర మాండలికాలనడానికి వీల్లేని పదాలు లెక్కకు మిక్కిలిగాఉన్నాయనే. ఒక మంచి కృషిని శ్లాఘించాలి కాని లోటుపాట్లు ఎత్తి చూపకూడదనే సంస్కారంతోనేమో పుస్తకానికి ముందుమాట వ్రాసిన బూదరాజు రాధాకృష్ణ గారు కూడా ఈ విషయాలు విస్మరించారని అనుకుంటాను. ఆ ప్రాంతపు మాండలికాలనడానికి వీలు లేని పదాలకుదాహరణగా రెండు ముక్కలు మనవి చేస్తాను. చూడండి:
పచ్చడం --దుప్పటి (పేజీ 90 ) అర్థం గురించి ఏ తగువూ లేదు కాని ఇది అన్ని నిఘంటువుల కెక్కిన, ఆంధ్ర దేశం అంతా వాడుకలో ఉన్న, కావ్యాలలో కూడా కనుపించే పదం.. సందర్భం వచ్చింది కనుక చక్కటి పద్యమొకటి
ఉటంకిస్తాను. ఇది శ్రీ వినుకొండ వల్లభరాయడు (లేక ఆయన పేరుతో శ్రీనాధమహాకవి ) వ్రాసినది అయిన క్రీడాభిరామము లోనిదని రసజ్ఞులందరికీ తెలుసు కానీ యువతరం వారికోసం:
మాఘమాసంబు పులివలెమలయుచుండ
పచ్చడమ్మమ్ముకొన్నాడు పణములకును
పడతిచన్నులు పొగలేని ముర్మురములు
చలికినొరగే.కేలుండు సైరికుండు.
(భావం తెలిసినవారు తెలియనివారికి తెలియజేయగలరు)
పితలాటకం: (పేజీ 94) దీనికి రచయిత ఇచ్చిన అర్థం—ఎంతకీ తెగకపోవడం—అని .దీన్ని చూస్తేనే తెలుస్తుంది రచయిత ఎవరేంచెప్తే అది వ్రాసుకున్నారని. ధీనికి సరైన అర్థం మోసం అని ఏనిఘంటువైనా చెప్తుంది.అసలిది పిత్తల+హాటకం . పిత్తల అంటే ఇత్తడిని హాటకం అంటే బంగారం అని మోసం చేసి చూపించడం. నిఘంటువులు ఇది అరవ పదమని చెప్తాయి. ప్రముఖ భాషావేత్త వరిశోధకుడూ అయిన ఢా. చల్లా రాధాకృష్ణశర్మ గారు తన మద్రాసు తెలుగు అనే వ్యాసంలో దీనిని పేర్కొన్నారు.
మద్రాసులో పలికే మాట కళింగాంధ్ర మాండలికం ఎలాగవుతుంది? అందుకే బూదరాజుగారు మొహమాటపడ్డారన్నాను. నా ఈ వ్యాసోద్దేశం శ్రీ చలంగారి కృషిని తక్కువ చేయాలని ఎంతమాత్రం లేదని మరోసారి మనవి చేసుకుంటూ బూదరాజు వారిని క్షమాపణలుకోరుకుంటున్నాను. గ్రంథాలలో తప్పులు అలా ఉండిపోకూడదనే సదుద్దేశం మాత్రమే నన్నీ పనికి పురికొల్పింది.
స్వస్తి