31, డిసెంబర్ 2011, శనివారం

కన్యాశుల్కంలో సారాయంగడి సీను....
   

క్రితం సారి కన్యాశుల్కంలో పేకాట సీను శ్రీ గురజాడ ఎందుకు  వ్రాసి ఉంటారనే విషయం చెప్పాను. ఈ సారాయంగడి సీను కూడా అలాంటిదే. నిడివి గురించి పట్టించుకోకుండా నాటక పురోగమనానికి పెద్దగా తోడ్పడని ఈ సీనులు వ్రాయడంలో  మహాకవి ఉద్దేశం సమగ్ర సమాజ జీవన చిత్రణే. ఆంధ్ర దేశంలో ఏ  మారుమూలనైనా సారాయంగడి లేని ఊరులేదు. కప్పు కాఫీయో శుభ్రమైన తాగునీరో దొరకని ఊళ్ళున్నాయేమో కానీ, సారాయి దొరకని ఊరుండదు. నాడూ నేడూ ఇదే పరిస్థితి.(ఇదే విషయాన్ని సరదాగా ఓ కంద పద్యంలో ఇలా చెప్పేను నేను:
నీరే దొరకదుగానీ
సారాయికి లోటులేదు సర్వం సిధ్ధం
ఊరూరా వెలసిన ఆ
సారాయంగళ్లలోన స్టాకులు ఫుల్లే ! )
అందు చేతనే తన నాటకంలో ఈ సారాయంగడి సీను అవసరం ఉందనుకున్నాడు మహాకవి. అంతే కాదు ఈ సీనులో వచ్చే పాత్రలు వ్యవహరించే తీరు ద్వారా వారి సంభాషణల ద్వారా ఎంతో హాస్యాన్ని సృష్టించేడు. ఈ సీను చివర్లో లుబ్దావధాన్లు పెళ్లాడిన మాయగుంట మధురవాణి కంటె తీసుకుని ఎక్కడికో పారిపోయిందనీ వెతికించమనీ పోలీసు హెడ్డుని అడగడానికి  రామప్పపంతులు వస్తాడు తప్పితే నాటకానికి సంబంధించిన ప్రధాన పాత్రలేవీ  దీనిలో రావు. దీనిలో వచ్చే సారాయి దుకాణం యజమాని రాందాసు బైరాగి పాత్రలను దొంగ సాక్ష్యమివ్వడానికి పిలుచుకు పోవడం తప్ప వారికీ నాటక ప్రధాన ఇతివృత్తంతో ఏ మాత్రమూ సంబంధం లేదు. ఈ విధంగా నాటక ప్రయోజనానికి కథాపురోగమనానికీ ఏవిధంగానూ ఉపయోగ పడని ఇంత పెద్దసీనుని, ఇన్ని అప్రధానమైన పాత్రలతో మహాకవి ఎందుకు వ్రాసేడయ్యా అంటే ఆయన హాస్య రసపోషణ సమగ్ర సమాజ జీవన చిత్రణ ధ్యేయంగా కలిగి ఉండడమే తప్ప మరోటి కాదు. శ్రీశ్రీ గారు  కన్యాశుల్కంలో అన్ని రకాల పాత్రలూ ఉన్నాయి కాని ముస్లిం పాత్ర కనిపించ లేదని అనుకున్నాను కానీ , అగ్నిహోత్రావధానులు  రామచంద్ర పురం అగ్రహారం చేరగానే బళ్ళుదింపండి. సాయిబూ ఏనుక్కి కావలసినంతరొడ్డ  అంటాడనీ, ఆవిధంగా తెరపైకి రాక పోయినా సాయిబు  పాత్ర కూడా ఉన్నట్టేనని అంటాడు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఒరిస్సాని ఆనుకుని ఉన్న ఊళ్లలో పండాలు (ఒరియా బ్రాహ్మలు) కూడా ఎక్కువే. అందుచేతనే ఈ నాటకంలో పండా పాత్రకూడా కనిపిస్తుంది. ఈ విధంగా సమాజ సమగ్ర జీవన చిత్రణకి పూనుకున్నందునే ఈసారాయంగడి  సీను కూడా మహాకవి నాటకంలో చేర్చాడు. ఆయన లక్ష్యం ఏ విధంగా నెర వేరిందో చూద్దాము:
ఈ సీను తెర లేచే సరికి  కాళీ మండపంలో  మధ్యలో సారాయిసీసాలు గళాసులుండగా పక్కన యోగ దండమును ఆనుకుని సమాధిలో ఉన్న (ఉన్నట్టు నటిస్తున్న) బైరాగి, చిలుం పీలుస్తున్న మునసబు సోమి నాయుడు, సాతాని మనవాళ్లయ్య, జంగం వీరేశం, దుకాణదారు రాందాసు- వీళ్లందరికీ సారాయి అందిస్తున్న యోగినీ ఉంటారు. మునసబు ఆకాశం ముందు పుట్టిందా? భూమి ముందు పుట్టిందా? అనే ప్రశ్న లేవనెత్తుతాడు. దీనికి సరైన జవాబు చెప్పకుండా  సుత్తి ముందా కారు ముందా అని అడ్డు ప్రశ్న వేస్తాడు మనవాళ్లయ్య. దీనికి మునసబు వెంటనేపంగనావాఁలు ముందా? పట్టె వొర్దనాలు ముందా?  నామాలోడా నా సవాలేటి? నీజవాబేటి? అంటూ వెక్కిరించి ఆకాశానికి మట్టా బూఁవి?  బూఁవికి కప్పా ఆకాశం? సదూకున్నోడెవడో సెప్పండోస్సి- అని రెట్టిస్తాడు. ఇక్కడ  మన వాళ్లయ్య వైష్ణవులకీ, వీరేశం శైవులకీ ప్రతినిధులు కాబట్టి పంగనామాలు పట్టె వర్దనాలలో ఏదిముందని వారిని  వెకసక్కెం ఆడతాడు. ఈ చర్చ కొంత సేపు సాగిన తర్వాత వీరేశం ఆకాశం బొక్కడ్డది అంటారు కదా ? ఆకాశమే లేకుంటే బొక్కడ్డ  వెఁలాగ? అని రీజనింగు తీసే సరికి మన వాళ్లయ్య మాట్లాడడం మానేస్తాడు. వెంటనే వీరేశం శంఖం పూరిస్తాడు. విజయం చేకూరి నప్పుడు శంఖం పూరించడం ఆనవాయితీ. ఈ శబ్దానికి తనసమాధికి భంగం కలిగి నట్టు నటిస్తూ బైరాగి, శివబ్రహ్మం. శివోహం అంటాడు. బైరాగి శివ స్మరణ చేయగానే ఆనందించిన వీరేశం చూడండి అందరూ అన్నట్టు పొంగి పోతాడు.  ఆదొంగ బైరాగి పక్కనున్న మనవాళ్ళయ్యని కూడా చూసేడేమో రామబ్రహ్మం..రామోహం అనికూడా అంటాడు. దీనికి ఆనందించిన మనవాళ్లయ్య మొదటి మాటను రెండవ మాట రద్దు చేస్తుందంటాడు. వీరిద్దరి కాట్లాట చూసిన దుకాణదారు రాముడూ శివుడూ ఇద్దరూ నిజమే నని వారిని సముదాయిస్తాడు. (తన గిరాకీ లలో ఏ ఒక్కరినీ వదులుకోలేడు కదా?)  మరికొంత చర్చ జరిగాక, మునసబు బైరాగిని గురూ ! బంగారం సేస్తారు కదా, అదెట్టి హరిద్దోరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందుకడుగుతారని ఓ చక్కటి ప్రశ్న వేస్తాడు. బంగారం చెయ్యగలగడం అబధ్ధమే కనుక దీనికి జవాబివ్వలేని దొంగ బైరాగి మేం చేశే స్వర్ణం మేమే వినియోగిస్తే తల పగిలిపోతుందని డొంక తిరుగుడు జవాబిస్తాడు. అవి వేరే రహస్యాలు ఊరుకోండి మామా అంటూ హెడ్డుగారు మాట మారుస్తాడు. ఆ తర్వాత తాను ఖేచరీ గమనమ్మీద ఆకాశ మార్గాన పోతూ ఉంటే  ఆ వూరి అమ్మవారి విగ్రహం కింద ఆరు నిలువుల లోతున స్థాపితమైన మహాయంత్రమొకటి కనిపించి అమ్మవారిని సేవించి పోదామనుకుంటుండగా  ఈ భక్తుడు (దుకాణదారు రాందాసు) తనని పోల్చి నిలిపేసాడంటాడు. వెంటనే దుకాణదారు   చూడగానే నేను సిధ్ధుల్ని పోలుస్తాను గురూఅంటాడు. దానికి మునసబు    చుక్కేసే వాళ్లని  మా బాగా పోలుస్తావు అంటూ ఓ చురకేస్తాడు. ఆ తరువాత ఆత్మ శుధ్ధి లేని ఆచారమదియేల అని మా తాతగారు చెప్పలేదా?” అని బైరాగి అన్నప్పుడు హెడ్డు వేమన తమ తాతగారా అని ప్రశ్నిస్తే అవును ఆయన పోయి ఆరు వందల సంవత్సరాలయింది అంటాడు. అయితే తమ వయసెంత అని ప్రశ్నిస్తే ఆదీ అంతూ లేని దానికి లెఖ్ఖేమిటి నాయనా? పరమాత్మ కెన్నేళ్లో అన్నేళ్లు అంటూ బుకాయిస్తాడు. ఈ మాటలు విన్న వారికెవరికైనా బైరాగి మాటలన్నీ పూర్తిగా అబధ్ధాలని తెలిసిపోతుంది.  అయితే అక్కడ ఉన్న వాళ్లెవరికీ ఈ గుర్తింపు ఉండదు. పైపెచ్చు హెడ్డుగారు ఆ బైరాగికున్న సిధ్ధులు స్తానాల్చేసి ముక్కు బిగించే బ్రాహ్మలకి కూడా లేవంటాడు.  ఆ తరువాత బైరాగి రెండు వందల యాభై ఏళ్లక్రితం జరిగిదంటూ తానుగంగను సారాయిగా మార్చిన ఉదంతం చెప్తాడు. అదంతా చాలా హాస్యభరితంగా ఉంటుంది.  రామప్ప పంతులు  అవధాన్లు పెళ్లి చేసుకున్న పిల్ల రెండో పెళ్లి పిల్ల అంటున్నాడనే మాట వచ్చినప్పుడు హెడ్డు ఈరోజుల్లో బ్రాహ్మణ్యం ఎక్కడుంది ఎటుచూసినా పిల్లల్ని ముసలాళ్లకి అమ్ముకోడాలూ రండా గర్భాలే కదాఅని అంటే హవల్దారు వెంటనే   ఎంతచెడ్డా బ్రాహ్మలు మనకి పూజ్యులు అంటాడు. ఆ రోజుల్లో మనుషుల నైతిక ప్రవర్తనకి కాకుండా జన్మించిన కులాన్ని బట్టి గౌరవించబడడం అనేది సూచించే మాటలివి. మనవాళ్లయ్య యోగినిని  మూలకి తీసుకెళ్లి ముద్దెట్టుకుంటున్నాడని మునసబంటే సిగ్గుతో మనవాళ్లయ్య చెయ్యి విడి పించుకొని వచ్చిన యోగిని ఏకాంత ఉపదేశం చేస్తున్నారని అంటుంది. దీనిని పట్టుకుని మునసబు    పిల్లా ఆ ఉప్పుదేశం ఏదో మాక్కూడా కాసింత  చెయ్యరాదాఅంటూ హాస్యమాడుతాడు. ఈ ఉప్పుదేశం అంటూ మునసబు పాత్ర ద్వారా గురజాడ మంచి హాస్యాన్ని అందించేడు. ఆ తరువాత రామప్ప పంతులొచ్చి హెడ్డుగారిని  లుబ్దావధాన్లని బెదిరించి తమ కంటె తమకిప్పించడంలో హెడ్డుగారి సాయంకావాలని కోరినప్పుడు హెడ్డు నోటంట వచ్చిన మొదటి మాటడబ్బేమైనా పేల్తుందా అని. ఎంత సహజంగా ఉందో చూడండి. పోలీసులు నాడూ నేడూ ఇంతే కదా?
ఆతర్వాత బైరాగిని దొంగ సాక్ష్యం చెప్పమని అడిగినప్పుడు సాక్ష్యం అంటే మావంటి వారే
చెప్పాలి .. నిజవేఁవిటి?అబ ధ్ధవేఁవిటి! మేం సిధ్ధులం అబధ్ధం నిజం చేస్తాం. నిజం అబధ్ధం చేస్తాం. లోకవేఁపెద్ద అబధ్ధం. పదండి. అంటూ ముక్తాయిస్తాడు.
ఈసీనులో వచ్చే పాత్రలన్నీ అప్రధానమైనవే ఐనా ప్రతి ఒక్క పాత్రా సజీవమైన పాత్రగా మనకు అనిపించేంత శ్రధ్ధగా వాటిని తీర్చిదిద్దిన మహాకవిని మెచ్చుకోకుండా ఉండలేము. ఈ పాత్రల నోటంట పలికించిన మాటలు ( దేహాన్ని ద్రేహం అనడం, జ్ఞానాన్ని ఘానం అనడం) నవ్వు పుట్టిస్తాయి. ముఖ్యంగా, కాశీ ఉదంతంలో తనతో పాటే తెగతాగిన బ్రాహ్మణునిగురించి బైరాగి చెప్పినప్పుడు బ్రాహ్మల్లో కూడా మహానుభావులుంటారనడం ఒక  Quotable Quote గా మిగిలి పోయింది.
నాటకంలో ఈసీను చదువుతున్నప్పుడు కాని, సమర్థులెవరైనా ప్రదర్శిస్తున్నప్పుడు కాని నాటకంలో ఈ సీను అవసరం గురించి ఎవరికీ ఆలోచనే రాదు. ఈ సీనుకి ఈ సీను మాత్రమే చూసినా ఒక ప్రహసనాన్ని చూసిన రక్తి కలుగుతుంది. నాకైతే , సమాజ చిత్రణా హాస్యోత్పాదనా ధ్యేయంగా తాను రచించిన ఈ సీను విషయంలో గురజాడ పూర్తిగా కృతకృత్యుడయ్యేడనే అనిపిస్తుంది.
ఆఖరుగా ఒక్కమాట చెప్పి ముగిస్తాను. ప్రఖ్యాత రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబ రావు కన్యాశుల్కం గురించి తాను రాసుకున్న నోట్సులో  ఈసారాదుకాణం సీనులు.. ఈ శాల్తీల మధ్య రామప్ప పంతుల్ని కూడా పెట్టి ఒక సీను లేక పోవడం ఎంత దురదృష్టం అన్నాడంటే ఈ సీను రచయితల్నీ రసికుల్నీ ఎంత రంజింప జేసిందో కదా?

వీలయితే కన్యాశుల్కం నాటి సంఘాన్ని తన నాటకంలో గురజాడ చిత్రించిన తీరు గురించి  కొంచెం ముచ్చటించాలని ఉంది. మరోసారి చూద్దాం. ఇప్పటికి సెలవు.

23, డిసెంబర్ 2011, శుక్రవారం

చెయిజారిన మణిపూస...మళ్ళీ దొరికిన వైనం...


     

                    
చెయి జారడమేమిటి? మళ్లీ దొరకడమేమిటి?
నేను అరవయ్యో దశకంలో ఎమెస్కో వాళ్లు ప్రచురించిన పుస్తకాలు కొంటుండేవాడిని. వాళ్లు ఎన్నో  నవలలూ కథల పుస్తకాలే కాకుండా ప్రబంధాలని కూడా అందంగా తక్కువ ధరకే అందిస్తూ ఉండేవారు. అలాంటి ప్రచురణల మధ్య వారు 1974 ( 1964?) లో తాతాచార్లు కథలనే పుస్తకాన్ని కూడా ప్రచురించేరు. ఎంతో ఆసక్తితో కొని చదువుకుని దాచుకున్నా పుస్తకాన్ని భాషాభిమానిని కనుక. అయితే నాదగ్గరనుంచి చదవడానికి పుస్తకాలు తీసుకెళ్ళే మిత్రులెవరో దానిని పట్టుకు పోయేరు. తర్వాత సంగతి మామూలే. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః  మరి నాకది దొరక లేదు.
చిన్న ప్పటినుంచి నా నోట దాని గురించిన కబుర్లు విన్న మా అమ్మాయి  నిన్న పుస్తక ప్రదర్శనలో దొరికిందంటూ ఆ పుస్తకాన్ని కొని తెచ్చి యిచ్చింది. నా ఆనందానికి మేర లేదు. మరి చూడలేమనుకున్న చిన్నప్పటి బాల్య  మిత్రుణ్ణి కలుసుకున్నట్లు  పొంగి పోయేను.

ఎవరీ తాతాచార్లు? ఏమా కథ?
ఈ తాతాచార్లనే పెద్ద మనిషి ,( నిజంగా పెద్దమనిషే- ఈయన గురించి బ్రౌన్ దొరగారు- He was a tall stout man about 50 years of age, a humorist thoroughly versed in sanscrit learning, very learned and eloquent, most modest and humble; He died in my employ అంటారు.) తెలుగు భాషకు మహోపకారం చేసిన సర్.సి.పి,బ్రౌన్ వద్ద ఉద్యోగి గా ఉండే వాడు. యోగ్యుడూ సరసుడూ ఐన ఈయన సంభాషణల్లో సమయోచితమైన చిత్ర విచిత్ర కథలు చెబుతూ వచ్చేవాడట. అలాంటి వాటిల్లో కొన్నిటిని బ్రౌన్ దొరగారు సేకరించి సంకలనంగా 1855 లో మొదటి సారి ముద్రింపించేరు. దరిమిలా 1916 లో వావిళ్ళ శాస్త్రుల వారు గురజాడ అప్పారావుగారి పరిష్కరణతో అచ్చువేయింపించారట. ఇవన్నీ నేను పుట్టక పూర్వం జరిగిన సంగతులు.
అయితే 1974 లో ( 1974లో అని ఇప్పటి ప్రచురణ కర్తలు అంటున్నారు కానీ నా జ్ఞాపకం 1964 అనే)  బంగోరె (అవును. కన్యాశుల్కం మొదటి కూర్పుని వెలుగులోకి తెచ్చి అలక్ నందా నదిలో అకాల మృత్యువు పాలైన ఆ బంగోరే నే) తన ముందు మాటతో వ్యాఖ్యలతో  ఎమెస్కో ద్వారా వెలువరించారు. ఇదిగో ఈ విలువైన పుస్తకాన్నే నేను పోగొట్టుకున్నదీ ,మళ్లా నాకు దొరికినదిన్నీ.
ఇంతకీ ఏమిటయ్యా ఈ పుస్తకం గొప్పతనంఎందుకు చదవాలది?
సుమారు నూట యాభై ఏళ్ల క్రితం సామాన్యజనం  మాట్లాడుకునే వాడుక భాషలో వ్రాయబడ్డదీ గ్రంథం. ఇవి తాతాచారిగారు కూర్చుని వ్రాసిన కథలు కావు. తాను విని లేక చూసిన విషయాల్నే ఆసక్తిదాయకంగా ఆయన బ్రౌన్ దొరగారికి చెప్పినట్టు కనబడుతుంది. అందుచేత ఆనాటి జన జీవన సరళి గురించి మనకు కొంత తెలుస్తుంది. ముఖ్యంగా మనని ఆకట్టుకునేది. ఆనాటి జీవద్భాష. అది మనకు మెకంజీ కైఫీయతుల ద్వారా తెలిసినట్లుగానే ఈ కథల వల్ల కూడా తెలుస్తుంది.అప్పుడు వాడుక లో ఉండి ఇప్పుడు లేకుండా పోయిన లేక రూపు మార్చుకున్న ఎన్నో పదాలు మనకి కనిపిస్తాయి. ఆనాటికే మన భాషలో వచ్చిచేరి సామాన్యులు సైతం వాడుతున్న అనేక ఉర్దూ, పార్శీ పదాలు మనకు దర్శనమిస్తాయి. అందుకే భాషాభి మానులందరూ కొని చదివి దాచుకో వలసిన పుస్తకమిది.
 పుస్తకం మీరే కొనుక్కుని చదువుకోండి. చిన్న ఝలక్ లాగా దీని లోని ఒక చిన్ని వృత్తాంతాన్ని మాత్రం నా మాటల్లో మీకు ఇక్కడ పరిచయం చేస్తాను. అదేమిటంటే
ఒక వూళ్లో ఒక బోగము దానింట్లో ఒక పండితుడు ఉంటూ ఉండగా ఆ వీధి లో ఒక పీనుగని తీసుకెళ్తుంటారు. ఆ బోగముది తన బోనకత్తె (భోజనం వండి పెట్టే దాసి) ని పిలిచి ఆ పీనుగ స్వర్గానికి పొయ్యేదా నరకానికి పొయ్యేదా తెలుసుకుని రమ్మంటుంది. ఆమె వీధిలోనికి పోయి వచ్చి ఆ పీనుగ స్వర్గానికి పోయేదే అని చెబుతుంది. మహా పండితుడైన తనకే ఆ పీనుగ గతి యేమిటో తెలియదే? ఈ దాసి వీధి లోకి పోయి వచ్చినంత మాత్రాన ఆ విషయం ఎలా కనుక్కుందో నని మధన పడి, తెలియజాలక, ఉండబట్టలేక ఆ బోగము దానినే ఆవిషయం అడుగుతాడు. దానికామె, అయ్యో ఇదేమంత పెద్ద విషయం-ఏ పీనుగని చూచి నలుగురూ అయ్యో పుణ్యాత్ముడు పోయేడే అంటారో ఆ పీనుగు నిశ్చయముగ స్వర్గానికే పోతుంది. యే పీనుగును చూచి నలుగురూ పాపిష్టి ముండా కొడుకు పోయేడని అంటారో అతడు తప్పకుండా నరకానికే పోతాడు అన్నదట.
దీని కిందనే    In a jest Book అని చెప్పి ఈ కింది English  పంక్తిని ఉదహరించారు.
 When death puts out our flame, the snuff will tell if we were wax or tallow by the smell !!!

ఈ వృత్తాంతం బాగుంది కదా?
దీన్ని ఇప్పుడు అందంగా ముద్రించడమే కాకుండా మనకు తెలియని పదాలకు అర్థాలు ఇవ్వడం, C.P.Brown Academy వారు చేసిన మంచి పని. బోనస్ గా 1855 లొ ప్రచురించబడిన  తాతాచారి కథలు తొలి పేజీ నకలునీ, తొలి వ్రాత ప్రతిలోని ఒక పేజీ నకలునీ కూడాఅందిచేరు.ఇంతా చేస్తే ఈ పుస్తకం వెల కేవలం 30 రూపాయలు మాత్రమే.  US లో దీని ధర రెండు డాలర్లు.   C.P.Brown Academy, 53 nagarjuna hills, Panajagutta, Hyderabad.500082, India   Phone number 040-23430448, E.Mail-www.cpbrownacademy.org వారు ప్రచురించేరు. ఈమంచిపనికి వారికి అభినందనలు.

సెలవు.
21, డిసెంబర్ 2011, బుధవారం

కన్యాశుల్కం..పేకాట సీను...


  .   

తెలుగు సాహిత్యంలో వందేళ్లకు పైగా సాహిత్యాభిమానుల్నందరినీ అలరిస్తూ చిరంజీవిగా వర్ధిల్లుతున్న ఏకైక సాంఘిక నాటకం మహాకవి గురజాడ రచించిన కన్యాశుల్కం. ఇది ప్రధానంగా ఆనాటి బ్రాహ్మణ సమాజంలో నెలకొన్న (పసిప్రాయపు బాలల్ని కాసులకోసం పండుముసలి వారికి వివాహం పేరుతో అమ్ముకునే) ఒక దురాచారాన్ని అవహేళన చేస్తూ సమాజాన్ని మేలుకొలపడమే ధ్యేయంగా  కలిగినదే అయినా ఆ ఒక్క దానికోసమే అయితే  మహాకవి ఇంతటి బృహన్నాటకాన్ని వ్రాసి ఉండడు.  వీరేశలింగం పంతులుగారు వ్రాసిన బ్రహ్మ వివాహం వంటి  ఏ చిన్న ప్రహసనాన్నో వ్రాసి సరి పెట్టుకునేవాడు. ఆయన ఆశయం వేరే ఉంది.  అది నాటి సమాజ సమగ్ర జీవన చిత్రణ.  అందుకే లెక్కలేనన్ని పాత్రలూ సన్నివేశాలున్నూ. కన్యాశుల్కం మొదటికూర్పు పీఠిక లో ఈ విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పాడు. ఈ నాటక రచనలో తాను హాస్యం, పాత్రల చిత్రీకరణ, జటిలమైనఒక కొత్త సంవిధానం కోసం ప్రయత్నించాననీ ఈ విషయంలో తానెంత వరకూ కృతకృత్యుడనయ్యిందీ ప్రజలే నిర్ణయించాలనీ అన్నాడు.  ఈ సదాశయంతో వ్రాసిన నాటకం కనుకనే నాటకం పురోగతికి పెద్దగా ఉపయోగ పడని సన్నివేశాల్ని కూడా నాటకంలో చేర్చాడు. అలాంటి వాటిల్లో  రామప్ప పంతులింట్లో లేనప్పుడు మధురవాణి నలుగురితో కలిసి పేకాడడం ఒకటి.
పేకాట సీనునే ఎందుకెన్నుకున్నాడయ్యా అంటే నాటికీ నేటికీ ఆంధ్రదేశంలో పేకాట లేని ఊరంటూ లేదు. పేకాటంటే ఒళ్లు మరచి పోయే జనం కో కొల్లలు. పేకాటరాయుళ్ళు ఏపాటి కొద్ది జాగా దొరికినా చాప పరచుకుని సెటిలయిపోతారు. రాత్రీ పగలూ అనిలేదు. కరెంటు లేకపోతే బుడ్డి దీపాల దగ్గర కూడా కూర్చునిఆడతారు. వీరు ఆడే తీరు వారి సెంటిమెంట్లు బహు తమాషాగా ఉంటాయి. మాఆఫీసులో కొంతమంది ఠంచనుగా ఐదు కొట్టగానే ఉరుకులు పడుతూ క్లబ్బువైపు పరుగులు తీసే వారు, క్లబ్బులో సీటెక్కడ దొరకదో అని. వీరిలో కొందరివి ఐరన్ లెగ్గులయితే కొందరివి గోల్డెన్ హాండ్సట. అంటే కొంతమంది ఎప్పుడూ ఓడి పోతూనే ఉంటారని కొంతమంది ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారని. (మనకి తెలీదు కాని ధర్మరాజుగారిది ఐరన్ లెగ్గే అయిఉంటుంది). ఈ పేకాటలో మజా ఏమిటో కాని డబ్బు పోతున్నకొద్దీ ఆట ఆడాలనే పట్టుదల పెరిగి పోతూ ఉంటుంది. ( పారేసుకున్న చోటే వెతుక్కో మన్నారు కదా?). మాచిన్నప్పుడు మాయింటి వీధి వరండాలో మా వాళ్లు కొంత మంది పేకాట ఆడుతుండే వారు. వారిలో ఒక ఎలిమెంటరీ స్కూలు టీచరు ఒకాయన ఉండే వాడు. ఆయన పంచిన పద మూడు ముక్కల్నీ ఏనాడు పేర్చి పట్టుకోగా నేను చూడలేదు. కొంత సేపయాక ముక్కల్ని కింద బోర్లించి ఉంచి  వాటిని తెరిచి చూడకుండానే ఆట  ఆడేవాడు. అంటే తన దగ్గర ఏ ఏ ముక్కలున్నాయో ఏ కార్డు వస్తే ఆట అవుతుందో ఆయన మనస్సులో రికార్డు అయి ఉంటుందన్న మాట. ఇది కూడా ఒక ప్రజ్ఞే కదా.
సరే.  కులగోత్రాలు సినిమాలో అయయో..చేతిలో డబ్బులు పోయెనే .. పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయిందే.. అని రేలంగి పాడిన పాట అంత పాప్యులర్ కావడానికి కారణం ఆంధ్రులందరికీ అటువంటి సన్నివేశాలు సుపరిచితంకావడమే.
ఎక్స్టెన్షన్ రాక ఎకరాలమ్ముకున్నాడన్న సామెత ఇలాంటి చోట పుట్టిందే. పేకాట ఆకర్షణ ఎలాంటిదో చెప్పే ఈ జోక్ చూడండి.. ఒకసారి ఓ పూరి గుడిసె లోకూర్చుని కొంత మంది పేకాడుతుంటే ఆ గుడిసెకు నిప్పంటుకుందట. ఆటగాళ్లకు వంటిమీద తెలివి లేక పోవడంతో ఈ విషయం గ్రహించ లేదు. సరికదా వాళ్లని హెచ్చరించడానికి లోపలికి వెళ్లిన ఆసామీ  ఆడుతున్నాయన ముక్కల్ని చూసి ఆకార్డు కొట్టకూడదంటూ వారితో మాటల్లో పడి తను వెళ్లిన వైనం మరిచాడట. అయ్యా అలాగుంటుంది పేకాట మజా. మరో పేకాట రాయుడు  తండ్రి పోయాడని కబురొస్తే ఇట్నించే తీసుకెళ్తారు కదా అన్నాడట పేకాట లోంచి లేవకుండా.  సందర్భం వచ్చింది కనుక  మరో జోక్
ఒకావిడ తమ పక్కింటావిడతో రాత్రి మా యింటిలో దొంగ దూరాడండీ అని వాపోతే అవునండీ రాత్రి ఎవరో రావడం నేను చూసేను అందిటావిడ.  మరి మాకు చెప్పలేదేం అని అడిగితే, ఏమో బనీను డ్రాయరుతో గోడ దూకి వస్తుంటే మీ ఆయనే క్లబ్బునుంచి తిరిగి వస్తున్నారు కాబోలనుకున్నానందిట పక్కింటావిడ. ఇలాగుంటాయి పేకాటరాయుళ్ల కబుర్లు. ఇలాంటి జోకులెన్నయినా ఉన్నాయి. పేకాటతో ఇళ్లు గుల్లలైన వైనం, అమీరులు బికారులైనవైనం ఆంధ్రదేశానికి తెలియనివి కావు. ఇందు చేతనే నిడివి గురించి పట్టించుకోకుండా, తన నాటకంలో పేకాట సీను ఉండితీరాలనుకున్నాడు గురజాడ.  ఈ పేకాట సీనునీ అక్కడి పాత్రల్నీ వాటి సెంటిమెంట్లనీ గురజాడ చిత్రించిన తీరు ఒకసారి ముచ్చటించుకుందాము.  (ఇక్కడో చిన్న ఇబ్బంది ఉంది. ఈ సీన్లో వాళ్లు ఆడే ఆట పేరు  ఎత్తడం..లేక ..హెత్తురఫు. దీనిని ఉత్తరాంధ్రలో ఈ పేరుతోనే పిలిచేవారు, కొన్ని చోట్ల దీనిని బేస్తు కుదేలు అంటారని తెలిసింది. ఏ మయితేనేం ఈ ఆట ఇప్పుడు ఆంధ్రదేశంలో ఎక్కడా ఆడుతున్నట్టులేదు. ఆంధ్ర దేశంలో యాభయ్యవ దశకంలో అవతరించి విస్తరించిన రమ్మీ మహమ్మారి దీనిని పూర్తిగా తుడిచి పెట్టింది. ఈ ఆట ఆడే తీరు తెలికపోతే ఈ సీను అందాన్ని పూర్తిగా ఆస్వాదించడం కష్టం. ఒకట్లు రెళ్లు అంటూ వాళ్లు  మాట్లాడుకునే మాటలు అర్థం కావు. ఈ ఆటని చిన్నప్పుడు చూసిన వాడిని కనుక నాకు గుర్తున్నంత మట్టుకు ఆ విధానం గురించి  చివర్లో తెలియజేస్తున్నాను. ఆసక్తి ఉన్న వారు చదువుకో వచ్చు). ఆట తీరు జోలికి పోకుండా ఒకటి రెండు ముచ్చట్లు మనవి చేస్తాను.
ఈ సీన్లో పేకాట ఆడకుండా ఊరికే చూస్తూ కూర్చున్న పూజారి గవరయ్య మధుర వాణి మీద ఆశు కవిత్వం చెబుతానంటూ ఈ క్రింది పద్యం చదువుతాడు:
రాణా, డైమను రాణీ?
రాణా, యిస్పేటు రాణి?  రాణి కళావ
ఱ్ఱాణా ఆఠీన్రాణీ?
రాణియనన్మధుర వాణె, రాజుల రాణీ !
ఎంత చక్కటి పద్యంకవి అల్లసాని పెద్దన.. అనే తెనాలి వాని పద్యం గుర్తుకు రావడం లేదూమధుర వాణి పాత్ర మీద తనకున్న మోజుని మహాకవి ఇలా బహిర్గతం చేసాడేమోనని పిస్తుంది.
 ( నాటకంలో మధురవాణి పాత్ర రూపు దిద్దుకుంటున్నతీరు చూస్తుంటే ఆ పాత్ర మీద తనకి వ్యామోహం ( Fascination )  పెరిగి పోతోందని తన మిత్రునికి వ్రాసిన లేఖలో  గురజాడే పేర్కొన్నాడు.) ఈ పద్యం వింటూనే పోలిశెట్టి, గవరయ్య మధుర వాణి దగ్గర రాణీ ఉందని ఈ రకంగా చెప్పేశాడని గగ్గోలు పెడతాడు. పోనీ నీ మీదా ఒక పద్యం చెబుతానంటూ ప్రారంభించేసరికి ఒద్దొద్దు.. పాసం బెట్టి సంపేస్తావా ఏటి? నేను గెలిస్తే కాండబ్బు ఇస్తానూరుకోమంటాడు. ఇక్కడ పోలిశెట్టి అమాయకత్వం భయమే కాకుండా ఆ రోజుల్లో బ్రాహ్మణుల వాక్శుధ్ధి మీద ఇతరులకుండే నమ్మకాన్ని సూచిస్తాడు కవి. గవరయ్య ముణుకు తన దగ్గర పెట్టి కూర్చున్నాడని సణుగుతాడు. పేకాట ఆడే వాళ్లకి చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఎవరైనా పక్కన ముణుకు మీద చెయ్యి ఆన్చి కూర్చుంటే ఆట కలిసి రాదనే ఒక నమ్మకం. ఏదైనా ఒక ఆట గెలిస్తే ఆ కూర్చున్న భంగిమ మారిస్తే అదృష్టం పోతుందని కదలకుండా అలాగే కూర్చుని ఆడతారు.
 మరోచోట గవరయ్య ముక్కల మీద కన్నేసి సిల్లంగెట్టేస్తున్నాడంటాడు. సిల్లంగి లేక చిల్లంగి అంటే బాణామతి లాంటిదన్నమాట. నరశింహ నీ దివ్య నామ మంత్రము చేత అనే ప్రార్థనని తన యాసలో పాడుకుంటూ ఉంటాడు. భుక్తది ఇనప చెయ్యనీ బులబులాగ్గా కలుపుతున్నాడనీ బొమ్మల్లాంతరేశాడనీ. ( బొమ్మల్లాంతరంటే అన్నీ పొల్లు ముక్కలేనని) ఇలా ఏదో గొణుగుతూనే ఉంటాడు. సిధ్ధాంతి ఆట కలిపేస్తానని బెదిరిస్తే నోరు మూసుకుంటాడు.  పేకాట ఆడే వారి తీరుని ఎంతో నిశితంగా పరిశీలించిన వారు కాని ఈ విషయాలు రాయలేరు.
ఆఖరుగా ఒక్క ముచ్చట చెప్పి ముగిస్తాను.  రామప్ప పంతులొస్తున్నాడని అటక మీద దాగోమంటే తాను  జారి పడితే యేటి సాదనం అని పోలిశెట్టి భయం వ్యక్తం చేస్తే  సిధ్ధాంతి నీ కొడుకుది అదృష్టంఅనడం ఎవరికైనా నవ్వు తెప్పిస్తుంది. (పోలిశెట్టికి తప్ప).
నాటక పురోగతికి అవసరం లేని ఈ సీనుని గురజాడ  తాను కోరుకున్న సమాజ చిత్రణకీ హాస్యం పండించడానికే వ్రాసేడని  అందులో కృతకృత్యుడయ్యేడనీ నానమ్మకం.  ఇలాంటిదే అయిన సారాయంగడి సీను గురించి మరో సారి ముచ్చటిస్తాను.
సెలవు.

 బేస్తు కుదేలు,, లేక ఎత్తడం.. అనే ఆట ఆడే విధానం:
ఈ ఆటలో తురుఫు (Trump)  జాకీ అన్నిటి కన్నా పెద్దది. దాని తర్వాత  తురుఫు మణేలా.( తొమ్మిదిని మణేలా అంటారు). వాటి తర్వాత ఆసు, రాజు, రాణి, పది, ఎనిమిది, ఏడు, ఆరు..ఇలా.. తురుఫు కాని రంగుల్లో మామూలు గానే ఆసు రాజు రాణీ అలా వరుసలో వాటి విలువ ఉంటుంది.  నలుగురే ఆడినప్పుడు మిగిలిన చిన్న ముక్కలని పేకలోంచి తీసేస్తారు. ఆట పంచిన వారు నలుగురికీ నాలుగేసి ముక్కలు పంచి మరోనాలుగు ముక్కలు  మధ్యలో మూసి ఉంచుతారు, ఆట మొదలవగానే చేతివరస ఆసామీ( First Hand)కి తురపు చెప్పే అవకాశం మొదట వస్తుంది. ఆయన ఆట బాగా లేక పోతే ఒకటి అంటాడు( అంటే  Pass On  అన్న మాట). ఆ తర్వాత కూర్చున్న వ్యక్తికి అవకాశం వస్తుంది.. అతడూ తురఫు చెప్పలేక పోతే ఆయనా ఒకటి అంటూ Pass on ఛేస్తాడు. మిగిలిన వాళ్లకి వారి వరుసలో అవకాశం వస్తుంది. నలుగురూ ఒకట్లు అన్న తర్వాత రెండో రౌండు ప్రారంభం అవుతుంది. ఈ సారి కూడా ఆట లేకపోతే  చేతి వరస ఆటగాడు రెండు అంటూ  Pass On ఛేస్తాడు.  తురఫు చెప్పలేని వారందరూ రెండు అంటూ ఉంటారు. ఇలా రెండో రౌండ్ లో కూడా ఎవరూ తురఫు చేప్పలేకపోతే  కింద నాలుగు ముక్కలూ చేతివరస ఆసామీ కిచ్చి మిగిలిన వారికి కూడా నాలుగేసి ముక్కలు పంచుతారు. అంటే మూడోరౌండు ప్రారంభమవుతుందన్నమాట. ఈసారి తురఫు చెప్పే వారు ఎనిమిది ముక్కలూ చూసి తురఫు చెప్పవచ్చును.  ఎవరూ తురఫు చెప్పకపోతే ఆట కలిపేసి మళ్లా ముక్కలు పంచుతారు. మొదటి రెండు రౌండ్లలో ఎవరైనా తురపు చెప్తే వాళ్లు కిందనున్న నాలుగు ముక్కలూ తీసుకుని ఆడతారు, మిగిలిన వారికి పేకలోని ముక్కలు నాలుగేసిచొప్పున పంచుతారు. ఒకొక్కఆటగాడి దగ్గరా ఎనిమిదేసి ముక్కలు ఉంటాయి కనుక మొత్తం ఎనిమిది పట్లు అవుతాయి. తురఫు చెప్పిన ఆసామీ ఒక్కడూ ఒకవైపు మిగిలిన వారంతా ఒక టీము అవుతారు. ఆటలో తురపు ముక్కలకి మిగిలిన వాటన్నిటికంటె ఎక్కువ విలువ ఉంటుంది. అంటే తురుఫులో చిన్న ముక్క అయినా వేరే కలరు ఆసు కంటేకూడా పెద్దదన్నమాట. ఈ ఆటలో తురపు చెప్పిన ఆసామీకి మిగిలిన వారందరికంటె ఎక్కువ పట్లు రావాలి. వస్తే గెలిచినట్లు. లేకపోతే ఓడిపోయినట్లు. తురఫు చెప్పిన ఆసామీ గెలిస్తే అందరూ డబ్బులిస్తారు. ఆయన ఓడిపోతే బేస్తు పెడతాడు. అంటే కొంత సొమ్ము డిపాజిట్ చేస్తాడన్నమాట. ఆ తరువాతి ఆటలో గెలిచిన వారు ఈ సొమ్ముకూడా తీసుకుంటారు. అప్పుడు తురఫు చెప్పిన ఆసామీ ఓడిపోతే మళ్లా బేస్తు పెడతాడు. ఆతరువాతి ఆటలో తురుఫు చెప్పిన ఆసామీ గెలిస్తే రెండు బేస్తుల డబ్బులూ తానే తీసుకుంటాడు. అలాగ కాకుండా ఓడిపోతే ఆయన ఇచ్చే డబ్బులతో కలిపి మిగిలిన అందరూ పంచుకుంటారు. దీనినే కుదేలు అంటారు. ఈ ఆట పూర్తిగా జూదంలా కాకుండా ఆటగాళ్ల నైపుణ్యం మీద కూడా ఆధార పడి ఉంటుంది. ఎవరేం ముక్కలేస్తున్నారో ఎన్ని తురఫులయ్యేయో ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో అవి ఎవరి దగ్గర ఉండవచ్చో అన్ని విషయాలూ జాగ్రత్తగా గమనిస్తూ ఆడాలి. తురుఫు చెప్పిన వాడు గెల్చుకోకుండా మిగిలిన వారందరూ ఒక టీం లాగా ఆడాలి. ఏ ఒక్కరు తప్పు ఆడినా మిగిలిన వారు అతడ్ని తిడతారు. ఈ ఆట ఎలా ఆడతారో తెలిసింది కనుక ఇప్పుడు నాటకంలో సీను చదివితే ఆ పాత్రలు మాట్లాడిన మాటలు అర్థం అవుతాయి. ఏదో జ్ఞాపకం ఉన్నంత మట్టుకు చెప్పాను. తప్పులుంటే ఉండ వచ్చు. అయితే నాటకం లో సీను చదువుకోవడానికి అవేమీ అడ్డం కావు. ( అంతరించిన జాతుల్లోకి చేరి పోయిన ఈ ఆట గురించి తెలుసు కోవలసిన అగత్యం ఇప్పుడెవరికీ లేదు.)
                                                               _____

17, డిసెంబర్ 2011, శనివారం

నాలుగు సంస్కృత శ్లోకాలూ.....పుంజీడు తెలుగు కందాలూ...

 ( ఒక నాలుగు ప్రసిధ్ధమైన సంస్కృత శ్లోకాలను తెలుగులో కంద పద్యాలలో చెప్పాను. చిత్తగించండి.)
మూలం:
అసారే  ఖలుసంసారే సారం శ్వశుర మందిరం,
హిమాలయే హరశ్శేతే, హరిశ్శేతే మహోదధౌ

ఈశ్వరుడా హిమగిరిని,
మేశ్వరుడా పాలకడలి మేడలు  కాగా
శాశ్వత నివాస ముండిరి
ఆ శ్వశురుల గృహ సుఖముల నాస్వాదిస్తూ 
(తెలియని వారికోసం- శ్వశురుల గృహములు అంటే మామగారిళ్లు. అచ్చతెలుగులో చెప్పాలంటే-- అత్తారిళ్ళు)


మూలం:
గజానాం మంద బుధ్ధిశ్చ  సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్


అజగరములు అతి నిద్రయు
గజరాజులు మందబుధ్ధి కలిగియు నుంటన్
ద్విజుల లోని అనైక్యత
సుజనుల కుపకారమనుట సూనృత మేగా   
(తెలియని వారికోసం-- అజగరములు అంటే కొండ చిలువ వంటి పెద్ద పాములు)
             
మూలం:
అతి పరిచయాదవజ్ఞా సంతత గమనాదనాదరో ఙవతి
మలయే భిల్ల పురంధ్రీ చందన తరుకాష్ట మింధనంకురుతే
   
అతి సామీప్యమనర్థము
అతి విలువైనట్టి  మంచి గంధపు చెట్లన్
మతియింపక మలయాద్రిని
అతివలు వంట చెరకుగను వాడెదరకటా     
                                          
మూలం:
దుర్జన పరిహర్తవ్యో విద్యయా2లంకృతో2పిసన్
మణినా భూషిత సర్ప కిమసా నభయంకరం

తోరపు మణి యున్నదనుచు
క్రూరపు మిన్నాగు దరికి కూడదు పోవన్
చేరిన కాటేయగలదు
దూరముగానుండవలయు  దుష్టులకెపుడున్            

సెలవు.9, డిసెంబర్ 2011, శుక్రవారం

పిలుపులూ....మానవ సంబంధాలూ......


పిలుపూలూ..మానవ సంబంధాలూ... 
ఒకరినొకరు పిల్చుకోవడంలో ఎన్ని రకాలో? మా చిన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం. మా తాతగారిని  మా నాన్నగారూ వారి తమ్ములూ అందరూ బాబూ అని విలిచేవారు. వారందరిలోకీ పెద్దఅయిన మా నాన్నగారిని వారి తమ్ములు నాన్నా అని పిలిచేవారు. తండ్రి తరువాత తండ్రి అంతటివారని పెద్దన్నగారిని అలా పిలిచే వారేమో?.ఇటువంటి ఆచారం వాళ్ళకుటుంబాలలో కూడా ఉండేదని శ్రీ రాంభట్ల కృష్ణమూర్తిగారు వారి స్వీయ చరిత్రలో రాసేరు.
మా చిన్నప్పుడు ( నాకప్పుడు పదేళ్లలోపే) మా మాతామహుల ఇంటికి ఉరవకొండ  ( అనంతపురం జిల్లా) వెళ్తూ ఉండేవాళ్లం.. వారింటికి ఎదురుగా బస్టాండు ఉండేది స్టాండంటే మరేమీ లేదు. ఓ చెట్టు చుట్టూ బస్సులు ఆగుతుండేవి. అక్కడినుంచి బళ్లారికి పోయే బస్సులు వచ్చినప్పుడల్లా ఎవురప్పా బళ్లారి అనే అరుపులు విని పిస్తుండేవి. ఉత్తరాంధ్ర ప్రాంతంనుండి వెళ్లిన మాకు ఆ పిలుపులు వింతగా తోచేవి.  రాయలసీమలో తండ్రిని అప్పా అని పిలుస్తారని గౌరవ వాచకంగా అందరినీ అప్పా అంటారనీ అప్పుడుతెలిసింది.
అప్ప అనే తెలుగు పదం నిజానికి తల్లి తండ్రులకిద్దరికీ వర్తిస్తుంది.  అందుచేత భేదం సూచించడానికి తండ్రిని అప్పడు అనీ తల్లిని అప్పఅనీ  అనాలి..  లోకంలో అందరికీ తండ్రి అయిన శ్రీ వేంకటేశ్వరుని గురించి అప్పడిని కనుగొంటిఅంటారు శ్రీ అన్నమాచార్య. అయితే లోక వ్యవహారంలో తరువాతికాలంలో డు వర్ణం జారిపోయి అప్ప అనే పిలుపు మిగిలి ఉంటుంది. మా ఉత్తరాంధ్రలో మగవారి పేర్లకి అప్పడనీ అడవారి పేర్లకి అప్ప అనీ తగిలించి వ్యవహరించడం నేటికీ ఉన్న ఆచారమే . మారిషస్ లో తెలుగు మాట్లాడే వారి సంఘానికి అధ్యక్షుల పేరు శ్రీ రామస్వామి అప్పడు. చూడండి ఎన్నో తరాల క్రిందట దేశాంతరాలకు  తరలి పోయిన తెలుగు వారు మన సంస్కృతినీ ఆచార వ్యవహారాలనీ కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుతున్నతీరు.మాతృభూమిలో నివశిస్తున్న తెలుగు వారు    ఇది సిగ్గు పడాల్సిన విషయం. ( నాజూకు పేర్లు, అసలు అర్థమే లేని పేర్లు పెట్టుకోవడం మొదలయ్యాక  అప్పలూ అయ్యలూ మూర్తిలూ రావులూ  శర్మలూ శాస్త్రిలూ ఎక్కడా కనిపించడం మానేశారు. ఇప్పుడు పిలుపులగురించి మాట్లాడుకుంటున్నాం కనుక పేర్లగురించి మరోసారి).
                                                         మా చిన్నప్పుడు ఇంటిపేరుకి ప్రాధాన్యం ఉండేది. తోటి పిల్లలు బళ్లోకి వెళ్తున్నప్పుడు ఒరే పంతులా బళ్లోకి రారా అంటూ ఇంటిపేరు  పెట్టి కేకేసేవారు ఇలా ఇంటిపేరుతో పూర్తిగా వ్యవహరిచడం వల్ల మనకి తెలియని ప్రదేశాల్లో కూడా మన బంధువులని గుర్తించడానికి అవకాశం ఉండేది. ఇంటిపేరుని పొడి అక్షరాలకి పరిమితం చేసుకుని ఈ అవకాశాల్ని చెయిజార్చుకున్నాము.
యుక్త వయసులో స్నేహితులందరం ఒకరినొకరు గురూ..గురూ.. అని పిల్చు కోవడం తమాషాగా ఉండేది. పెద్దగా పరిచయం లేని వారిని పలకరించాల్సి వస్తే మాస్టారూ అని పిలవడం ఆనవాయితీ...( అవతలివారు ఉపాధ్యాయవృత్తిలో లేరని తెలిసినా సరే)
 భారత దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్లలో అందరినీ వరసలు పెట్టి పిలుచుకునే సదాచారం ఒకటి ఉంది. పల్లెటూళ్లలో అది నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. పిన్నిగారూ అనో అత్తయ్యగారూ పక్కింటావిడని పిలిచిన కొత్తకోడలు  వెంటనే వారికి ఆత్మీయురాలై కూర్చుంటుంది. పరాయి మగాళ్లందరినీ అన్నా అని పిలుచుకునే ఆడవారూ, పరాయి స్త్రీలనందరినీ అక్కాఅనో చెల్లెమ్మా అనో పిలుచుకునే సంస్కృతి ఎంత గొప్పదో కదా?                                                                           అయితే పాత కాలంలో అన్నీ మంచి ఆచారాలే ఉండేవా? అంటే లేదనే చేప్పాలిమంచి గతమున కొంచేమేనోయ్ అన్నాడు శ్రీ గురజాడ. రోజుల్లో భార్యని పేరు పెట్టి పిలవడంకూడా తప్పే. అసే, ఒసే, ఏమేవ్ అని పిలుచుకునే వారు. వేసిన తలుపు తీయమనడానికి కూడా తలుపు..తలుపు..అంటూ తలుపు తట్టేవారు. తలుపు తీయడం కాస్త ఆలస్యమయితే నోరు పారేసుకునే వారే గాని పేరు పెట్టి పిలిచిన పాపాన పోయేవారు కాదు. ఇప్పటికీ  ఉత్తర హిందూ స్ధానంలోని ఛాందస కుటుంబాలలో భార్యని ఏ బబ్లూకీ మా అనో పిలుస్తారు తప్ప భార్యపేరు ఉచ్చరించరు.
దేశంలో విద్యాసంస్కారాలు పెరిగాక  ఈమొరటుదనం తగ్గి  చక్కగా భార్యలను వారి పేర్లతో పిలుచుకుంటున్నారుమొగుడు పేరు ఉచ్చరించడానికి సిగ్గు పడే భార్యలిప్పుడిప్పుడు వారిని వారి పేర్లతో పిలుచుకుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉందితమను తాము మరీ నవనాగరీకులమనుకునే భామలు  భర్తల్ని అరే ఒరే అనికూడా అంటున్నారు.   చిన్నప్పుడు ......ఉన్నప్పుడు రాకొట్టడంపాడియేమో గాని నలుగుర్లో ఉన్నప్పుడు ఆపిలుపులు భావ్యమా అన్నది వారికి వారు వేసుకో వలసిన ప్రశ్న
 బాల్యమిత్రులు అరే ఒరే అని పిలుచుకోవడం పాడి. తెలంగాణాలో పిల్లలు రాబే..పోబే.. అనుకుంటారు. చిన్న పిల్లలు కలిసి మెలిసి ఉండేవారు  ఇలా పిలుచుకోవడంలో తప్పు పట్టాల్సిన పనేమీ లేదు. కాకపోతే కొత్తవారిని ఏ విధంగా సంబోధిస్తున్నారో గమనించి వారికి బుధ్ది చెప్పాల్సిన అవసరం ఉంది. యౌవనంలో మిత్రులైన వారు ఓయ్ అని పిలుచుకోవడం అలవాటే.. మరీ పెద్దయ్యాక మిత్రులైన వారు మీరు తమరు అనుకోవడం మరియాద.
బెంగాలీ వారు గౌరవ సూచకంగా మహాశయ్ అని సంబోధిస్తారు. తెలంగాణాలో నీ బాంచన్ కాల్మొక్త అనే పేదవారుకూడా ఎంతవారినైనా నువ్వు అనే సంబోధిస్తారు. ధీనిని అపార్థం చేసుకోవలసిన పని లేదు.ఇక్కడి సంఘం ఆమోదించిన  పిలుపది.
(ఇంగ్లీషు వారి You లాగా).
మన సినిమాల్లోకూడా పాత రోజుల్లో పాటల్లో రావే ప్రేమలతా.. అనో రావె రాధారాణీ.. అనో ఓహో జవరాలా అనో అందంగా పిలుచుకునే వారు. ఈ రోజుల్లో విద్యావంతులైన హీరో హీరోయిన్లుకూడా  “ రాయె రాయె అని పాడు కుంటున్నారు.  ఈ సంబోధనలలోని ఔచిత్యం ఆ సినిమా రచయితలూ దర్శకులే చెప్పాలి.

ఇద్దరు వ్యక్తుల మధ్య వారికున్న చనువును బట్టి వారి ఏకాంత సంభాషణలలో పిలుపులు ఎలాగున్నా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం హుందాగానూ పరస్పరగౌరవాభిమానాలను వ్యక్తపరిచేవిగానూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఆ సమాజం నాగరిక సమాజం అనిపించుకుంటుంది. మానవ సంబంధాలు పరిమళిస్తాయి.
సెలవు..

4, డిసెంబర్ 2011, ఆదివారం

అసలు కంటె వడ్డీ ముద్దు ..కదా..అసలు కంటే వడ్డీ ముద్దంటారు .అది నిజమే కదా? అసలు మనం కష్టపడి సంపాదించుకుంటే అది మనం కష్టపడకుండా మనకి వడ్డీల్ని తెచ్చిపెడుతుంటుంది. ఆ వడ్డీ అసలు కంటె బహు ముద్దుగా ఉంటుంది. అలాగే మనం కష్టపడి పిల్లల్ని కని పెంచితే వారు మనకిచ్చే మనుమలో మనుమరాండ్రో బహు ముద్దొస్తారు. అదీ కాక మనం మన పిల్లల్ని ఎక్కువ ముద్దు చెయ్యం. ఎక్కడ పాడయి పోతారోనని. కొంత వయసు వచ్చాకనే పిల్లల్ని ఎలా ముద్దు చెయ్యాలో తెలుస్తుంది. జీవన సంధ్యలో మనుమలో మనుమరాళ్ళో మనకిచ్చే ఆనందం అనుభవిస్తే కాని తెలియదు. సరదాగా మా చిన్న మనుమడిమీద రాసుకున్న ఓ పుంజీడు  కందాలు మీ ముందు ఉంచుతున్నాను. ఇవి మీ మనుమడికీ వర్తిస్తాయి.

మాచిన్నమనుమడింటను
గోచీ లేకయె తిరుగును గోలను చేస్తూ
పేచీలకు లేదు కొదువ
ఏంచేసిన గాని వాడు ఎపుడున్ ముద్దే                              

బుడి బుడి  తడబడు నడకల
ఎడనెడ లేచుచు పడుచును నిలకడ లేకన్
గడబిడ చేసెడి మా మను
మడి చెయిదము మా మనసుల మక్కువ   పెంచున్                   

హద్దులు మీరిన అల్లరి
పెద్దగ చేస్తూ వదలని పెంకితనంతో
ఒద్దిక లేకయు నున్నను
ముద్దేకద మాకు వాని మోమును చూడన్                         

చిన్నా యని నే పిలువగ
నన్నేనాయని పరుగున నన్నుంజేరే
అన్నెము పున్నెము నెరుగని
కన్నడు మా కనులనింపు కాంతిని వేడ్కన్  

( మొదటి పద్యం నాలుగో పాదంలోప్రాసాభంగం అయిందని భావించే వారు  " ఆ చేష్టలు అన్ని మాకు హాయిని గూర్చున్"  అని చదువుకో వచ్చును)

సెలవా మరి..

30, నవంబర్ 2011, బుధవారం

సరదా..సరదాల కందాలొక రెండు పుంజీలు..


చిక్కని కాఫీ కప్పుతొ
ప్రక్కను చేరిన నిజసతి పాటల గంధిన్
అక్కున చేరిచి సొగసుగ
చెక్కిలి ముద్దాడ వలదె చెలిమి దలిర్పన్               
  
కందర్పుడేయు బాణము
సుందరి నీ వాలుచూపు సూటిగ నాటెన్
డెందము గాయంబాయెను
మందుగ అందీయరాదె  మధురాధరమే           

అందం నీకే సొంతం
సుందరి నీ సాటి దాన్ని  చూడగ లేదే
ఎందుకు ఈ బ్రతుకెందుకు
పొందక నీతోటి పొందు పూర్ణేందు ముఖీ            

పెళ్ళికి ముందరి  వలపులు
పెళ్ళైన పిదప కుదరవు పిసరంతైనా
పెళ్ళము తోడిది సరసము
కాళ్ళా వేళ్ళా పడుటయె కాముని కైనన్             

రాజీవాక్షులతోడను
రోజూ గొడవలు పడుచును రుక్కుట కంటెన్
రాజీ పడుచును మనమే
హాజీయనుచును గులాము లౌటయె మేలౌ       

సిరిమంతుని పెండ్లాడగ
తరుణులు పోటీ పడుదురు తమలో తామే
దొరకరు నిర్భాగ్యునకున్
పరిణయమాడగ పడతులు  పృధ్వీ స్థలిలో  
  
ఎంతయొ చదువులు చదివి మ
రెంతయొ నేర్చిన మగనికి ఏకాంతమునన్       
వింతగ మతి పోగొట్టగ
కాంతామణి చేయు బోధ కర్టెన్ లెక్చర్                 

తనసతి యుండగ వేరొక
వనితను తెచ్చిన యగునది భారము తలకున్
తనసతి గలిగియు శివుడా
మినుగంగను తేగనదియు  మెట్టెను తలపై    

ఇప్పటికింతే...సెలవు...