12, అక్టోబర్ 2011, బుధవారం

హలో..బాగున్నారా?ఏఁవిటి భోగట్టాలు? అసలీ" భోగట్టాల" కథేఁవిటి?


 అసలేఁవిటీ భోగట్టాల కథ ?

                                       మనం  తెలుగు వారం ఒకర్నొకరు కలుసుకున్నప్పుడు ఏమండీ బాగున్నారా ఏమిటి విశేషాలు అని అడగడం పరిపాటి.  ఈ కుశల ప్రశ్నలు అయ్యాక  ఇంకేమిటి సంగతులు  అంటూ సంభాషణ కొనసాగిస్తాం .శ్రీ కృష్ణుడు కూడా పడక సీనులో దొంగనిద్ర నటిస్తూ పడుకుని ఉన్నప్పుడు సహాయం కోరడానికి దుర్యోధనుడూ, అర్జునుడూ వచ్చినప్పుడు లేచి వారిని చూస్తూనే  బావా యెప్పుడు వచ్చితీవు, ఎల్లరునున్ సుఖులేకదా అంటూ వారి వారందరి కుశలమూ పేరు పేరునా కనుక్కుంటాడు.  ఇదే కాదు పాత కాలంలో ఉత్తరాలు రాసుకునే టప్పుడు కూడా మేము క్షేమం, మీరు క్షేమమని తలుస్తాను. ఉభయకుశలోపరి.. అంటూ రాసిన తర్వాతే మిగిలిన విషయాలలోకి వెళ్ళేవారం.బాగున్నారా అని అడిగిన తరవాత ఇంకేమిటి సంగతులు అని అడగడానికి మా చిన్నప్పుడు ఉత్తరాంధ్ర లో  ఇంకేమిటి భోగట్టాలు.. అని అడుగుతూ ఉండేవారం. ఇదేకాదు, ఎవరి దగ్గరనుంచైనా ఉత్తరం వచ్చిందంటే ఏమిటి భోగట్టాలు రాసేడు అని అడిగే వారు.  భోగట్టాలంటే ఏమిటి?    ఇది మా ఉత్తరాంధ్రలో వినిపించే మాండలికమా లేక వేరే భాషనుంచి మన తెలుగులో చేరిన పదమా అని నాకు సంశయం ఉండేది. మొన్న నీ మధ్య ఈ బ్లాగు లోనే నేను రాసిన  వెచ్చని పచ్చడం లేక పోతే పితలాటకమే అనే పోస్టుకు స్పందిస్తూ  కమనీయం బ్లాగరు తనకు మాండలికాల విషయంలో కొంత గందరగోళం ఉందని చెప్తూ ఒక విషయం రాసేరు. మా ఉత్తరాంధ్రలో వినిపించే భోగట్టాలాంటి మాటలు వారి అనంతపురం జిల్లాలో కూడా వినిపిస్తున్నాయని శ్రీ తూమాటి దొణప్పగారు అన్నారని తెలిపారు. ( కమనీయం బ్లాగు నిర్వహించే డాక్టర్ శ్రీ ముద్దు రమణా రావు గారూ శ్రీ తూమాటి దొణప్పగారూ చిన్నప్పటి సహాధ్యాయులే కాకుండా చిరకాల  మిత్రులు. శ్రీ రమణారావు గారు ప్రసిధ్ధ విశ్రాంత నేత్రవైద్యులు కవీ రచయితానూ, నాకు స్వయానా మేనమామగారు. తూమాటి దొణప్పగారిని ఈ మేనమామ గారింట్లోనే 1963లో ఒకసారి కలిసేను. అప్పట్లో ఆయన ఆంధ్రా యూనివర్శిటీలో తెలుగు వ్యుత్పత్తి పదకోశం తయారు చేయడం పని లోనే ఉండేవారని నాకు గుర్తు.  ఈ భాషా శాస్త్రవేత్త తర్వాత నాగార్జున యూనివర్శిటీ కులపతిగా కూడా పనిచేసి  కీర్తిశేషులైన సంగతి సాహిత్యకారులందరికీ తెలిసే ఉంటుంది).   దీని వల్ల తేలిందేమిటంటే ఈ పదం ఉత్తరాంధ్ర మాండలికం కాదని.  మరి ఇది తెలుగు లోకి వచ్చి చేరిన పార్శీ లేక ఉర్దూ పదమేమైనా అయి ఉంటుందేమో ననుకున్నాను గానీ అదీ కాదని తేలింది.  ( తెలుగు పై ఉర్దూ పారశీకముల ప్రభావము అనే  డా.శ్రీ కే. గోపాలకృష్ణ రావు గారి పరిశోధనా గ్రంథం తరచి చూసేను. నా వద్దనున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు లోనూ శబ్దరత్నాకరంలోనూ ఈ పదం కన్పించ లేదు. ( నా వద్ద ఏ వ్యుత్పత్తి పదకోశమూ లేదు. అందుచేత  ఈ పదం వాటిల్లో ఉందో లేదో ఉంటే ఏ వ్యుత్పత్తి ఇచ్చారో తెలీదు). అయినా నాకు ఇప్పుడు తోచిన విషయం రాస్తున్నాను.  చిత్తగించండి:
భోగః  అనే సంస్కృత పదం తెలుగులో భోగము ఆనే తత్సమ పదంగానూ బోగము అనే వికృతి పదంగానూ కనిపిస్తుంది. దీనికి వేరే అర్థాలున్నా విశేష ప్రాచుర్యం గల అర్థం సుఖము అని.
                           సుఖాలంటే ఈ రోజుల్లో ఎన్నో కార్లు బంగ్లాలు బేంకు ఖాతాలు లాంటివని సామాన్యుల భావన. మరి కొంతమంది  ఇంకొంచెం తెలివైన వారు స్విస్ బేంకు ఖాతాలు సొంత విమానాలూ బంగారపు భోజనపు బల్లలూ కుర్చీలూ
ఉంటేనే సుఖమని పొరబడి ఏవో ఊచలు లెక్కపెడుతున్న సంగతి మనకు తెలిసినదే. అయితే మన సంప్రదాయం ప్రకారం మనకి సుఖాలంటే ఎనిమిది మాత్రమే.  అవి-
గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము.---
ఇంతకుమించిన సుఖాలు లేవు.  ( మనకి కష్టాలు కూడా ఎనిమిదే నండోయ్. అష్ట కష్టాలనే కద అన్నారు)
సరే. భోగట్టాలో భోగమంటే సుఖమని తేలిందికదా. అష్ట   అట్ట అయ్యింది. భోగట్టమంటే ఎనిమిదిసుఖాలూ లేక అష్టసౌఖ్యాలూ అన్నమాట. మీ భోగట్టాలు ఏమిటని అడగడమంటే మీకు ఏ లోటూ లేకుండా అన్ని సుఖాలూ అమిరి ఉన్నాయికదా అని అడగడమే. క్షేమ సమాచారాలు కనుక్కోవడమే. దీని అసలు అర్థం తెలియని వారి వాడుకలో ఇదే రాను రానూ మిగిలిన విషయాలమాటేమిటి అనేఅర్థంలో వాడబడుతూ విస్తృతార్థాన్ని సంతరించుకుంది..
 ( ఇది కేవలం నా ఊహ.బాగుందా? సరైనది కాదని  ఎవరైనా చెబితే దిద్దుకోవడానికి సిధ్ధంగా ఉన్నాను.. సెలవు.