26, ఫిబ్రవరి 2012, ఆదివారం

మరో మంచి కథ.. ఆత్మీయబంధం కథ....


                                          బంధుత్వాలనేవి మన ప్రమేయం లేకుండానే మన పుట్టుకతోనే ఏర్పడుతాయి. మరికొన్ని మన జీవిత సహచరి లేక సహచరుని ద్వారా ఏర్పడుతాయి. అందువలన ఈ బంధువులనెవ్వరినీ ఆత్మీయ బంధువులని అనలేం. వీరిలో కొంతమందితో మనకి స్నేహబంధం కూడా ఏర్పడి వారు కూడా మనకు ఆత్మీయులౌతారు కాని మిగిలిన వారి విషయంలో ఆత్మీయత ఏర్పడదు. మనతో చదువుకున్నవారిలో, మనతో ఉద్యోగం చేసిన వారిలో కొద్దిమందితో ఆత్మీయత ఏర్పడినా మిగిలిన వారు సహాధ్యాయులుగానూ సహోద్యోగులుగానే మిగిలి పోతారు. అంతే. ఆత్మీయతా బంధం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలీదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలుసుకున్నవారిలో ఆత్మీయ బంధం కలిగిందంటే దానికి మూలాలు ఏ పూర్వ జన్మలో ఉండి ఉంటాయో? మన ఆదివాసీల ఆత్మబంధువు కథవింటే నాకిలాంటి ఆనుమానమే కలిగింది. ఆకథ చెబుతాను వినండి:
                                                                       ***
మనకి సుదూర ప్రాంతమైన ఆస్ట్రియా దేశంలో రాచరిక వంశంలో 1909 లో పుట్టిన హేమండార్ఫ్ రబీంద్రనాథ్ టాగోర్ రచనలు చదివి మనదేశంపై మక్కువ పెంచుకుని  మానవ పరిణామ శాస్త్ర అథ్యయనానికి మన దేశానికి వచ్చి ఈశాన్య భారతంలోని నాగాలనుగురించి పరిశోధనలను జరిపాడు.అలా మన దేశపు ఆదివాసీలతో మొదలైన బంధం ఆయనను నిజాం కాలంలో గిరిజనుల సంక్షేమానికి గాను ఏర్పరచిన ప్రభుత్వ కార్యనిర్వాహకవర్గం సభ్యునిగా చేసింది. ఈ విధంగా ఆదిలాబాదు ప్రాంతానికి వచ్చిన ఆయన వారితోనే కలిసి జీవిస్తూ వారిజీవన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. ఈ పనిలో ఆయన జీవన సహచరి బెట్టీకూడా ఆయనతోనే పనిచేస్తూ గిరిజనులకి ఎంతో ప్రీతిపాత్రురాలయ్యింది. చెంచులు,గోండులు, కోయలు,కొండరెడ్ల గురించి విస్తృత పరిశోధన చేసి వారి జీవన విధానం,వివాహ పధ్ధతులు, న్యాయపధ్ధతులు,ఆచార వ్యవహారాలగురించి సాధికారకమైన గ్రంధాల్ని వ్రాసేడు. ఈ విధంగా గ్రంధాల్ని వ్రాయడమే కాకుండా వారి అభ్యున్నతికి కావలసిన కార్యాచరణ ప్రణాళికల్ని రచించి వారి న్యాయమైన పోరాటాలకి సహాయాన్నందిచాడు.
మరో ముఖ్యమై విషయం ఏమిటంటే అనునిత్యం తన అనుభవాలను డైరీలో వ్రాసుకుంటూ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుతూ, ఆయా గిరిజన భాషల ప్రత్యేక పదాలను అత్యంత శ్రధ్ధతో నేర్చుకుని ప్రయోగిస్తూ ఉండేవాడు. 1951లోనే లండన్ వెళ్లి పోయినా తరచూ అదిలాబాద్ వచ్చిపోతుండేవాడు. అలా ఆయన అనుబంధం ఆయన జీవితాంతం కొనసాగింది. ఆయనకి ఇక్కడి గిరిజనులతో ఆత్మీయబంధం ఎంతటిదంటే తన కుమారుడు నికొలస్ కు లచ్చూ పటేల్ అని పేరు పెట్టుకున్నాడట. భార్య బెట్టీ ఇక్కడే మరణిస్తే ఆమె కోరికమేరకు అదిలా బాద్ జిల్లా మార్లవాయిగ్రామంలో ఖననం చేసి సమాధి కట్టేరు. హైమండార్ఫ్ కూడా తన  జీవిత కాలంలోనే ఆమె సమాధి ప్రక్కనే తన సమాధి కూడా నిర్మించుకున్నాడు. 1995 లో హైమండార్ఫ్ లండన్ లోమరణిస్తే 17 సంవత్సరాల తర్వాత ఈ రోజు  మార్లవాయిలో ఆదంపతుల సమాధుల వద్ద గిరిజన సంప్రదాయాలతో కర్మకాండ నిర్వహిస్తున్నారట. ఎక్కడి ఆస్ట్రియా? ఎక్కడి అదిలాబాదు? అర్థ శతాబ్ది క్రిందట లండన్ వెళ్లిపోయి 17 సంవత్సరాల క్రిందట చనిపోయిన విదేశీయునికి ఇప్పుడు సంప్రదాయబధ్ధంగా గిరిజనులు కర్మకాండ నిర్వహించడమేమిటి? ఈ ఆత్మీయతా బంధం ఎలా కలిగి కొనసాగింది? నాకైతే చిత్రంగానే తోస్తుంది.
 హైమండార్ఫ్ గురించి నేటి (26.3.2012) సాక్షి దిన పత్రికలో శ్రీ గుమ్మడి లక్ష్మీనారాయణ గారి వ్యాసం, చాలా కాలం క్రిందటి శ్రీమతి  వకుళాభరణం లలిత గారి గిరిజన విజ్ఞాన సర్వస్వంహైమండార్ఫ్అనే వ్యాసం నాకు పై విషయాలను తెలియజేసాయి. అయితే హైమండార్ఫ్ గిరిజనుల్ని ఎంతగా ప్రేమించాడో వారినెంతగా గౌరవించాడో తెలియజేసే ఒక అపురూపమైన ముచ్చట ఒక్కటి చెప్పి ఈ  వ్యాసం ముగిస్తాను.
                                                                         ****
మన రాష్ట్రంలోని సీనియర్ I.A.S.అధికారి శ్రీ ఫణికుమార్ చాలాకాలం క్రితం అదిలాబాదు జిల్లాలో గిరిజన సంక్షేమ సంస్థ అధికారిగా ఉండేవారు. ఆరోజుల్లో వారు పని చేసే  ఊళ్లో ఒకరోజు సాయంత్రం షికారుగా వెళ్తుంటే ఏకాగ్రతతో వడ్రంగి పని చేసుకుంటున్న ఒక గిరిజన వృధ్దుడు కనిపించాడట. ఆయన పనితనానికి ముగ్ధుడైన ఫణికుమార్ గారు ఆయనను తమ కోసం ఒక అందమైన మేజా బల్ల చేయమని అడిగితే అతడు మౌనంగానే తలూపాడట. తర్వాతెప్పుడో ఆ మేజాబల్ల వారి ఆఫీసుకు చేరింది. తర్వాత కొంత కాలానికి హైమండార్ఫ్ గారు ఆ ప్రాంతానికి వస్తున్నట్లు అధికారిక వర్తమానం అందింది. వారి గొప్పతనాన్ని తెలిసి ఉన్న ఫణికుమార్ గారు వారిని సాదర గౌరవాలతో ఆహ్వానించి మర్యాదలు చేసారట. అప్పుడు హైమండార్ఫ్ గారు తాను అక్కడ కలుసుకోవాలనుకుంటున్న వ్యక్తుల పేర్లలో ఈ వడ్రంగి పని చేసే ఆసామీ పేరు ఉండడం చూసి ఫణి కుమార్ గారు అతడిని పిలిపిస్తానని చెప్పారట. దానికి హైమండార్ఫ్ వెంటనే అది చాలా తప్పనీ  అతడు ఆ గిరిజనులకు రాజనీ తామే వెళ్లి అతడిని చూడాలనీ అన్నాడట. అది విన్న ఫణి కుమార్ గారు అవాక్కైపోయారట. కాలం కలిసిరాక  స్వతంత్ర భారతావనిలో ఆ రాజా సాబ్ వడ్రంగి పని చేసుకోవడం, ఆయనను మేజా బల్ల చేసివ్వమని తను అడిగితే మౌనంగానే ఆయన చేసి ఇవ్వడం, ప్రభుత్వ గౌరవాల్ని అందుకునే హైమండార్ఫ్ గారు ఒక గిరిజనునికి అర్హమైన మర్యాదని పాటించడం చూసి ఫణికుమార్ చాలా సిగ్గు పడ్డారట.( ఈ విషయం స్వతహాగా రచయిత అయిన ఫణి కుమార్ గారు తమ గోదావరి కథల్లో ఒక కథగా మలిచి వ్రాసేరు.)
                                                                      ****
ఈ కథ చదివి మనుషులను వారి వేషాడంబరాలను కాకుండా వారి వారి వ్యక్తిత్వాలను గుర్తించి గౌరవించడమనే సంస్కారం మనలో పెంచుకుంటే మనమూ ధన్యులమే కదా?  సెలవు.
                                                                      ****