ఎమెస్కో వారు ప్రచురించిన మను చరిత్ర ప్రబంధానికి పీఠికలో అనుకుంటాను,శ్రీ విశ్వనాథ వారిలా ప్రారంభిస్తారు. మనము ఆంధ్రులము,అనగా తెలుగు వారము—రెండును నొకటియే అని. రెండును నొకటియే అయినచో మనమాంధ్రులము అనుట ఏల? అది వారి శైలి.
తెలుగువారము అంటే తేలికగా ఉంటుంది.ఆంధ్రులము అని ఒత్తి పలికితే లేని గంభీరత వస్తుంది. సామాన్యార్థక పదాలలో తేలిక వాటిని వదిలి పెట్టి కొంచెం క్లిష్టోచ్చారణ కలిగినవి వాడడం పండిత లక్షణం. పండితులే కాదు సామాన్యులు కూడా ఇలా చేస్తూంటారు వారి వారి పరిధిలో వారికున్న భాషా జ్ఞానాన్ని నలుగురికీ తెలియజేయాలన్న తపనతో.ఇటువంటి భాషాడంబరాన్నియెద్దేవా చేయడానికే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో గిరీశం లుబ్దావధాన్లుకి వ్రాసిన ఉత్తరంలో మీరు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను అనడానికి “అమందానంద కందళిత హృదయారవిందుడనైతిని” అనిపిస్తాడు.
ఒకటి రెండు ముచ్చట్లు చెబుతాను.నా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా తాతగారి ఊరికి వెళ్లినప్పుడు మా దొడ్డమ్మ పిల్లలు కూడా వస్తుండే వారు.ఒక సారి మేము అన్నం తింటున్నప్పుడు మా అమ్మమ్మ ఇంకేం కలుపుకుంటావని నన్నడిగితే మరేమీ వద్దు చల్ల పోయి అన్నాను.నాకప్పుడు ఏడెనిమిదేళ్లుంటాయేమో? నాకంటే ఒక యేడాదే పెద్దవాడయిన మా అన్నయ్య (దొడ్డమ్మ కొడుకు) పగల పడి నవ్వుతూ మా మేన మామలతో చూడండి వీడు మజ్జిగని చల్ల అంటున్నాడు అని వెక్కిరించాడు.నాకప్పుడు దానిలో తప్పేమిటో బోధ పడలేదు. మాయింట్లో మా నాయనమ్మ చల్ల అనే అంటుంది.ఆవిడ వడ్డిస్తే తినే వాళ్లం మేము కూడా అలాగే అనడం నేర్చుకున్నాము. వాడికేం జవాబు చెప్పాలో నా కప్పుడైతే ఏమీ తెలియలేదు, కానీ పెద్ద వాడనయినాక తెలిసింది. చల్ల అనే పదమే తెలుగుదనం ఉట్టిపడుతూ తెలుగునాట విస్తారంగా వాడబడే అచ్చతెలుగు పదమనీ మజ్జిగ అనేది మార్జిక అనే సంస్కృత పదానికి వికృతి అనీ.మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లు ఉన్నాయట.1.తక్రం 2.ఉదశ్విత్తు
3. మధితం అనీ. తక్రం హ్యుదశ్విన్మథితం పాదాంబర్థాంబు నిర్జలం అని అమరకోశం చెబుతుంది, అంటే పావు వంతునీరుకలిపి చిలికినది తక్రం-సగానికి సగం నీళ్ళు పోసి చిలికినది.ఉదశ్విత్తు అసలే నీరు కలపకుండా చిలికినది మథితం.మథితం ఆరోగ్యానికి మంచిది కాదట.ఉదశ్విత్తు సగం నీరే కనుక రుచిగా ఉండదు.తక్రం రుచికరమూ శ్రేష్టమూను.( మజ్జిగకి పధ్నాలుగు పర్యాయ పదాలున్నాయి మన నిఘంటువుల్లో. మజ్జిగ చేసే విధానాన్ని బట్టి, దాని చిక్కదనాన్ని బట్టి, ఇలా వేరు వేరు పేర్లతో వ్యవహరింప బడతాయని,అసలు పాలు తోడు పెట్టే విధానం ఏమిటో వివరంగా నవ్య వీక్లీ లో శ్రీ రమణ గారు ఒక సారి రాసేరు.) మన సామెతల్లో చల్లకొచ్చి ముంత దాచడమనే చక్కటి సామెత ఒకటుంది. ఏదో ఉపకారం కోరడానికి వచ్చి,రాగానే అడగడానికి మొహమాటపడి ఆ కబుర్లూ ఈ కబుర్లూ ఆడుతుంటే చల్లకొచ్చి ముంత దాస్తున్నాడంటారు. ఒక పౌరాణిక చిత్రం లో నారదుడు రాక్షసుల చేతుల్లో బాధలు పడుతున్న దేవతల్ని వెంటతీసుకొచ్చి విష్ణుమూర్తిని కాసేపు పొగిడిన తర్వాత చల్లకొచ్చి ముంత దాచనేల అంటూ అసలు విషయానికొస్తాడు.ఆంధ్ర పత్రికలో ఈ సినిమా రివ్యూ రాస్తూ ముళ్లపూడి ఒక ఆట ఆడుకున్నాడు. నారదుల వారికి పాడిలేదా? చల్లకోసం రోజూ విష్ణుమూర్తి గారింటికి వెళ్లడం రివాజా? దానికోసం ముంత పట్టుకు వెళ్లేవాడా? అంటూఏమేమో రాసేడు.శాఖా చంక్రమణం (చూసేరా నేనుకూడా ఎలాంటి పదం వాడేనో—డొంకతిరుగుడు అని ఉండొచ్చుకదా? ఉహూఁ... నాకు చాలా తెలుగు, సంస్కృతం వచ్చని మీకు తెలియాలిగా?) కాకుండా మరో రెండు ముచ్చట్లు చెప్పి ముగిస్తాను.

మేం హైద్రాబాదు వచ్చిన కొత్తల్లో మా యింట్లో పనిచేసే నడివయసు పని మనిషిని మా ఆవిడ అవ్వా అని పిలిచేది.అదేం అలా పిలుస్తావంటే ఇక్కడ చిన్న పిల్లలయినా పని మనుషులందర్నీ అలానే పిలుస్తారని చెప్పింది. అవ్వ అనే పదం సామాన్యంగా వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీలందరికీ వర్తిస్తుంది. మన భారతంలో ప్రబంధాలలో ఈ పదం అదే అర్థంలో వాడబడింది. తెలంగాణా ప్రాంతంలో ఈ పదం ఇప్పటికీ ఆ అర్థంలోనే వాడుకలో మిగిలి ఉంటే మిగిలిన ఆంధ్ర ప్రాంతంలో వయసుడిగిన స్త్రీ అనే అర్థసంకోచం పొందింది.మరో విషయం ఇక్కడ బాలికల్ని పోరి అని పిలుస్తారు. తెలంగాణేతర ప్రాంతాలలో కుమారి అని వ్యవహరిస్తారు.కానీ నేను చాలా పాతకాలపు శిలాశాశనంలో ఒక రాజకుమారి పేరు వసంతపోరి అని చదివేను.ఇప్పుడు వసంతకుమారి అని పెట్టుకున్నట్లన్నమాట. భాష అనేకానేక కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో మార్పులకు లోనవుతుంటుంది.మార్పులకి లోనుగాని రూపాలు కొన్ని ప్రాంతాల్లో అలాగే మిగిలి ఉంటాయి. ఒకే అర్ధాన్నిఇచ్చే వేరు వేరు పదాలు వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంటాయి. అందువల్ల ఏ పదం వాడిన వారినీ మనం సంస్కారహీనులనీ వారి భాషని వెక్కిరించాల్సిన పని లేదు.
ఇక్కడ చివరిగా మరో ముచ్చట చెప్పి తీరాలి. శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఇల్లాలి ముచ్చట్లలో ఒకచోట ఇలా రాస్తారు.“మగాళ్లు భోజనాలు చేస్తే ఆడాళ్లు అన్నాలు తింటా”రని. తేడా ఏముంది? రెండును నొకటియే కదా?
( మహానుభావులుశ్రీ విశ్వనాథ వారి శైలిని ఓ సారి తల్చుకుందామని వారి పేరుతో మొదలెట్టాను కాని వారికీ ఈవ్యాసం లోని విషయాలకీ ఎంత మాత్రం సంబంధం లేదు.)
బ్లాగ్మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలతో..
మరికొన్ని విషయాలు మరోసారి. సెలవు.