దూరతరశ్శోభతే మూర్ఖో లంబశాట పటావృత
తావఛ్ఛ శోభతే మూర్ఖో యావత్కించిన్న భాషతే
ఈ సంస్కృత శ్లోకానికి అర్థం-- మంచి దుస్తులు ధరించి ఉన్న మూర్ఖుడు దూరంనుంచి చూసి నప్పుడు చాలా మర్యాదస్తుడిలాగే కన పడినా వాడు నోరు విప్పితే వాని బండారం బయట పడుతుందని. ఇదే అర్థం వచ్చే ఇటాలియన్ స్పానిష్ జాతీయాలు కూడా ఉన్నాయట. మిగిలిన దేశాల్లో కూడా ఉండి ఉంటాయి. అవును ఏ దేశం లోనయినా మూర్ఖుడు నోరు విప్పితే అంతే కదా? దీన్నే నేను ఇంగ్లీషు మాత్రమే అర్థమయ్యే మా మనుమళ్ళకోసం ఇలా చెప్పేను
A well dressed idiot
Gets his due respect
When he keeps his mouth shut.
తెలివి తక్కువ మూర్ఖుల విషయంలోనే కాదు తెలివైన వాళ్లమైనా అనాలోచితంగా మాట్లాడితే లేని పోని ఇబ్బందులొస్తాయి. కాలుజారితే తీసుకోవచ్చుకాని నోరుజారితే తీసుకోలేమంటారు కదా? మనం బ్రతకడానికి కావల్సిన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి వీలుగా తయారుచేసి లోపలకి పంపిస్తూ, మన బ్రతుక్కి అత్యవసరమైన ఈ నోరు.....మన భావాల్ని ఇతరులకి మాటల ద్వారా తెలియజేయడానికి .. మధురంగా పాడుకోవడానికీ ఎంతగానో పనికి వచ్చే ఈనోరు ... దీనిని అదుపులో పెట్టుకోక పోతే వచ్చే చిక్కులెన్నో కదా ?. ఈ నోటికి సంబంధించిన కొన్ని పదబంధాల్ని చూడండి:
నోరుజారడం---- ఫొరపాటునో ఆవేశంలోనో అనకూడని మాటలనడం
నోరు కలపడం—మరోకరి మాటల్లో తానూ పాలుపంచుకోవడం
నోరు పారేసుకోవడం—కావాలని అనకూడని మాటలనడం
నోరు మూసుకోవడం-- మాట్లాడకుండా ఉండడం. వాగ్యుద్ధానికి తెరదించడం
నోట్లో నాలిక లేకపోవడం – తాననుకున్నది చెప్పలేకపోవడం
నోట్లో నోరు పెట్టడం—ఎవరితోనైనా వాగ్విదానికి దిగడం
నోటికి సంబంధించిన కొన్ని సామెతలనిచూడండి:
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది--. ఎవ్వరితోనూ విరోధం రాదని అర్థం
నోరా వీపుకు తేకే--- అనకూడని మాటలంటే దెబ్బలు తినాల్సి వస్తుందని అర్థం
నోటిముత్యాలు రాలి పోతాయా? -- ఏదడిగినా బదులివ్వని వాని ననేది.
నోట్లో ఆవగింజ దాగదు – ఏ రహస్యం దాచుకోలేడని అర్థం
నోట్లో నువ్వుగింజనానదు-- --డిటో—
నోరు కలిగితే బ్రతుకుతాడు-- మాట తీరు గా ఉంటే బ్రతుకు తెరువు దొరుకుతుంది.
చేతికందింది నోటికందదు—దగ్గరకి వచ్చి చెయ్యి జారిన అదృష్టం
ఇలాంటివింకెన్నో కదా?. ( ఎక్కువ మాట్లాడితే వీడికి నోటి దురద ఎక్కువంటారేమో అందుకని .......
సెలవు