17, జులై 2013, బుధవారం

పండితులూ..కవులూ... వారి ధిషణాహంకారమూ...


పూర్వ కాలంలో పండితులకీ కవులకీ-కాస్త భూవసతి కలిగి ఉన్నవారి కేమోగాని – మిగిలిన వారందరికీ  భుక్తికోసం  రాజాశ్రయం తప్పని సరి అయ్యేది.ఏదో ఒక రాజుగారి ప్రాపకంలో జీవించడమో లేకపోతే  దేశాటనం చేస్తూ ఎంతో మంది రాజులను సందర్శిస్తూ వారిచ్చే వార్షికాలను స్వీకరించి రోజులు వెళ్లబుచ్చడమో చేసేవారు. ఇందుకోసం వారు తగిన వారినీ తగని వారినీ ఇంద్రుడూ చంద్రుడూ అంటూ మిథ్యాస్తుతులు చేస్తూ పబ్బం గడుపుకునే వారు. అయితే ఇది సామాన్యులైన పండితులూ కవుల సంగతి కానీ ఉద్దండులైన కవి పండితులు మాత్రం  దేహీ అని యాచించక రసజ్ఞులైన రాజులను మెప్పించి వారి మర్యాదలనూ మన్ననలనూ పొంది చాలా హుందాగా జీవనం గడిపేవారు. వారి మరియాదకు లోటురాకుండా  వారి మాటే చెల్లుబడి అయేటట్లు జీవించిన తృణీకృత బ్రహ్మపురంధరు లనదగ్గ వారు కొద్ది మందే అయినా ఉండేవారు. అప్పట్లో వారి ఆభిజాత్యాన్ని, ధిషణాహంకారాన్ని మన్నిస్తూ వారిని సగౌరవంగా చూసుకున్న రసజ్ఞులైన రాజశేఖరులూ ఉండేవారు. అట్టివారిలో విజయనగర, పిఠాపురాధీశులు పేరుపడ్డవారు.ఇటువంటి సంస్థానాదీశులూ వారి మన్ననలకు పాత్రులైన కవుల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాలని పిస్తోంది. ఆసక్తి కల వారు అవధరించండి:

ఇంతకు ముందు నేను దండిభొట్ల వారి దర్జా అనే పోస్టులో దండిబొట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఎంత హుందాగా బ్రతికేరో చెప్పాను. ఆయనొక సారి పిఠాపురం సంస్థానానికి రావడం జరిగిందట. పిఠాపురం రాజు గారికి సంస్కృతంలో కొంత శ్రుత పాండిత్యం ఉందట. అందుచేత ఎవరైనా పండితులు వస్తే వారితో సంస్కృతంలో నే సంభాషించాలని ఉబలాట పడేవారట. దండిభొట్ల వారితో అలాగే సంభాషించడానికి మొదలు పెట్టే సరికి వారు "రాజా నీవు నాతో తెలుగులో మాట్లాడితేనే నేనిక్కడ ఒక్క క్షణమైనా ఉండేది. లేకపోతే నీ రాజ్యం రాసిస్తానన్నా ఒక్క నిముషం కూడా ఇక్కడ ఆగను" అన్నారట. రాజుగారు ఆయన మాట మన్నించి తెలుగులో సంభాషణ మొదలు పెట్టారట. ఇక్కడ గమనించ వలసిన మరో విషయం ఏమిటంటే పిఠాపురం రాజుగారికి కోపం వస్తే అవతలి వాడు ఎంతవాడయేది గమనించక  తానే స్వయంగావాడి పిలక కత్తిరించేవాడట. ఆతర్వాత కోపం తగ్గాక  తానే మళ్ళా వారికేదో పరిహారం సమర్పించుకునే వాడట. అటువంటి రాజు గారు కూడా దండిభొట్ల వారి మాటను మన్నించారంటే వారికి పండితులూ కవుల పట్ల ఉన్న అపార గౌరవమే కారణం కదా.

విజయనగర సంస్థానానికి సంబంధించిన ముచ్చటేమిటంటే  రాజు గారు తమ ఆస్థానానికి రమ్మని శ్రీ పరవస్తు రంగాచార్లయ్యవార్లంగారిని ఆహ్వానిస్తే తన యేర్పాటు ప్రకారం అనుమతిస్తేనే రాగలనని అన్నారుట. ఆ యేర్పాట్లేమిటంటే  1. కోటగుమ్మం వరకూ సవారీలో వెళ్లడం. 2. అక్కడి నుండి పాదుకలతో నడచి సభ వరకూ వెళ్లడం 3. అక్కడ పాదుకలు వదలి చిత్రాసనం పై కూర్చోవడం. దీనికి రాజు గారు తమకేమీ అభ్యంతరం లేకపోయినా సభలో ఆచార్యులవారు చిత్రాసనం పై కూర్చుంటే తమ పండితులకు అవమానంగా ఉంటుంది కనుక వీలు పడదన్నారట. అందుచేత  రంగాచార్యుల వారు ఆ ఆహ్వానాన్ని నిరాకరించారట. తమ ఆస్థాన పండితుల మర్యాదని కాపాడడానికి రాజుగారు ప్రయత్నిస్తే, ఆచార్యులవారు తాము తృణీకృత బ్రహ్మ పురంధరులనిపించుకున్నారు.
పెద్దాపురం ప్రభువులు మాగాపు శరభ కవిగారి పేరు వినడమేగాని ఆయననెప్పుడూ చూసిఉండలేదు. ఒకసారి ఆ రాజుగారు స్వయంగా ముమ్మిడివరం దాపున ఉన్న మాగాం గ్రామానికి వెళ్ళేసరికి అక్కడ పుట్టగోచీ పెట్టుకుని తన అరటితోటలో మొక్కలకు గొప్పులు తవ్వుతున్న శరభ కవిగారు కనిపించారట. రాజు గారికి ఏమనిపించిందో ఏమో గాని కవిగారు వినేటట్లుగానే "ఇతడేనా శరభ కవి"  అన్నాడట. ఈ ఏకవచన ప్రయోగానికి కవిగారికి మనసునొచ్చిందేమో  "వత్సవయి తిమ్మక్ష్మావిభుండీతడా..." అంటూ  తానూ ఏక వచన ప్రయోగం చేస్తూ  ఆశువుగా ఒకటి కాదు రెండుకాదు  ఏకంగా అరవై పద్యాలు చెప్పాడట. ఆ విధంగా రాజుగారు తెలిసో తెలియకో తనను ఒక్కసారి ఏకవచంలో సంబోధిస్తే, కవిగారు ఆయనను 60 సార్లు ఏకవచనంలో సంబోధించి కసి దీర్చుకున్నాడన్నమాట.ఆయన ఎంత విద్వత్కవి కాకపోతే ఉన్నపాటున అనర్గళంగా 60 పద్యాలను ఆశువుగా చెప్పగలడు ? అటువంటి కవిగారికి ధిషణాహంకారం కూడా అలంకారమేకదా.

పంతమంటే పంతమేనని పట్టుక్కూర్చున్న పండితులవారి ఉదంతం ఒకటి మాత్రం చెప్పి ముగిస్తాను.
దాదాపు నూరేళ్ళ క్రితం- 1900-1910 ప్రాంతాల్లో పిఠాపురం రాజావారికి  పండిత సభలు జరిపించి తర్కమూ- వ్యాకరణమూ- వేదాంతమూ- ఈ మూడు శాస్త్రాలలోనూ ఏటేటా పరీక్ష లు నిర్వహించి సంస్కృత పండితులకు వార్షిక సన్మానాలు చేస్తూ ఉండాలనే సదుద్దేశం కలిగింది. ఆవిధమైన పత్రికా ప్రకటన కూడా ఇచ్చారుట. అయితే ఆ విధమైన పరీక్షలు నిర్వహించడానికి సమర్థులైన పండిత శ్రేష్టులెవరని ఆలోచిస్తే ఆరోజుల్లో విజయనగరంలో ఉంటున్న ఉద్దండ పండితులైన శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారు, పేరి కాశీనాథ శాస్త్రులవారు, గుమ్మలూరి సంగమేశ్వరశాస్త్రులవారు, ఆదిభట్ల రామమూర్తి శాస్త్రులవారూ కనిపించారు. వారిని సంప్రదిస్తే వారు తమకు ఎలాంటి పరీక్షలైనా ఉండే పక్షం లో తాము రామని తెలియజేసారు. దానికి రాజుగారు అట్లాంటివేవీ ఉండవని చెప్పి ఒక రోజుముందుగానే వారిని రావలసిందని దీవాను గారి ద్వారా కబురంపేరు. వారు ఆ రీతి గా వచ్చారు. వచ్చి దివాణం హాల్లో కూర్చున్న పండితులలో మొదటగా సుబ్బరాయ శాస్త్రి గారిని లోనికి పిలిపించి రాజుగారు "అయ్యా తమరి మంగళాచరణంతోనే మా పండిత  సభా కార్యక్రమాన్ని తమరు ఆరంభించాలి"  అనగానే శాస్త్రిగారు పాణినీయంలోని  మొదటి సూత్రం " వృధ్దిరాదైచ్ " అని చదివారట. రాజుగారు శుభం అని పలికి, అలాగే గుమ్మలూరి వారినీ ఆదిభట్లవారినీ పిలిపించి అడుగగా వారూ తమ శాస్త్రం లోని మంగళకరమైన శ్లోకభాగాల్నిచదివారట. రాజుగారు భేష్ అని మెచ్చుకుని ఆఖరుగా పేరి వారిని పిలిచి తమరూ  మీశాస్త్రంలోనిది ఒక శబ్దం వినిపిస్తే  పరీక్షకవర్గ నిర్ణయం పూర్తవుతుందని అన్నారుట. దానికి పేరివారు  అది కూడా ఒక పరీక్ష లాంటిదేనని అంగీకరించలేదట. దానికి రాజుగారు "మిగిలిన ముగ్గురు పండితులూ మమ్మల్ని అనుగ్రహించేరు. వారిని పరీక్షకులుగా ఏర్పరచుకున్నాం ..తమరుకూడా తమకు తోచినదేదైనా ఒక్కముక్క చెప్పి ఈ వర్గంలో చేరితే మాకు పరీక్షల సమస్య పూర్తవుతుంది, తమముఖతః ఏదయినా ఒక్కసూత్రం వినాలనుంది" అని  అన్నారుట. దానికి పేరి వారు ససేమిరా అంటూ రాజుగారి కోరిక మరునాడైతే సరే గాని ఆ రోజు ఏంచేసినా అది తమను పరీక్షించడం క్రందే వస్తుందని చెప్పి అక్కడనుండి తిరిగి తమ బసకైనా వెళ్ళ కుండా రైల్వే స్టేషనుకు వెళ్లి అటునుంచటే బొబ్బిలి చేరుకుని తమకు పిఠాపురం లో జరిగిన ఈ అవమానం గురించి ఆ రాజుగారికి తెలియజేసారుట.బొబ్బిలి వారికీ పిఠాపురం వారికీ ఆ రోజుల్లో బధ్ధవైరమట. బొబ్బిలి రాజు గారు మరునాడు  శాస్త్రిగారిని ఏనుగ పై ఊరేగించి సభ ఏర్పాటు చేసి సన్మానించేరుట.శాస్త్రిగారికి ప్రతీ విజయదశమికీ ఏటేటా నూట పదహారు రూపాయలు వార్షికం వారి ఇంటికే పంపే ఏర్పాటు కూడా చేసేరుట. ఆ విధంగా పేరివారు తమపంతాన్ని నెగ్గించుకున్నారన్నమాట. వారి ధిషణాహంకారం వారిని రాజుల్నిసైతం లెక్కచేయనిచ్చేది కాదన్నదానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.

మనం ఈ నాడు ఆత్మ గౌరవం..ఆత్మ గౌరవం.. అని  కేవలం వల్లిస్తుంటాం.అత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించిన  మార్గదర్శులీ మహనీయులు.
                                                                    ****
 ఈ విషయాల్ని నేను శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రుల వారి గ్రంథాలనుండి గ్రహించాను. ఆ కీర్తి శేషులకు నాకృతజ్ఞతలు.