17, సెప్టెంబర్ 2011, శనివారం

మా ఆవిడ నోట్లో నువ్వుగింజ నానదు...

ఒకణ్ణి తలలో నాలిక లాంటి వాడంటారు. అంటే అతడు అందరితో కలసిపోయి మంచిగా ఉండే వాడన్న మాట. మరొకడికి నో'టిలో నాలిక లేదంటారు. నోట్లో నాలిక లేకపోవడ మేమిటి ?. ఉండేఉంటుంది. ఉండడమే కాదు మాటలు రాని మూగ వాడై కూడా ఉండడు. కాని చాలా బిడియస్తుడై ఉండి తన మనసులోని మాట నలుగురిలో ధైర్యంగా నోరువిప్పి చెప్పలేని వాడై ఉంటాడు. ఇంకోడి నాలిక్కి నరంలేదంటారు. అంటే వాడు నోటికేదొస్తే అది జంకూగొంకూ సిగ్గూ శరమూ లేకుండా వాగుతాడన్నమాట. చిత్రమైన నోరూ.చిత్రమైన మనుషులున్నూ.. ఇలాంటివిషయాలు చాలా ఉన్నాయి గానీ వాటన్నిటినీ ప్రక్కని పెట్టి అసలు విషయానికి వస్తున్నాను.నా చిన్నప్పుడు మా వూళ్ళో మాపని మనిషి కూతురి నోటంట ఓ మాట విన్నాను. ఒక విషయం (చిన్నపాటిరహస్యం) మీ అమ్మతో చెప్పావా అని అడిగితే " సీ.. దాన్నోట్లో నువ్వుగింజ నానదు" అని అంది. అంటే అప్పటికి నాకర్థమైన విషయం వాళ్ళమ్మ ఆవిషయం ఎవరికైనా చేప్పేస్తుందని. అయితే ఇవాళ ఆలోచిస్తే నాకో విషయం తడుతోంది. కొంత మంది నిర్వరామంగా అలా మాట్లాడుతూనే ఉంటారు కదా. చాలా సభల్లో వక్తలు రెండు ముక్కలు చెబుతామంటూ రెండు గంటలకి కూడా ఇంటర్వెల్ తీసుకోరు. గొంతు తడారిపోతున్నా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ల అదృష్టం (మన దురదృష్టం) కొద్దీ ఈ రోజుల్లో ప్రతీ వక్తకీ ప్రక్కనే ఒక మినరల్ వాటర్ బాటిలు పెడుతున్నారు సభానిర్వాహకులు. రెండు గుక్కలు త్రాగి మహానుభావుడు మళ్ళీ మొదలెడతాడు. ఇలాంటి వాళ్లనే నేడు ముద్దుగా మనం మైకాసురులని పిలుచుకుంటున్నాము. ఇదిగో ఇక్కడే నాకు సామెత బోధ పడింది. ఆమైకాసురుడికి మనం మంచి నీళ్లే ఇవ్వలేదనుకోండి. ఏమౌతుంది?. కొంతసేపటికి నోరు ఆర్చుకు పోయి మాట బైటికి పెగలదు. తప్పక చప్పున కూర్చుంటాడు . మరి ఆనోట్లో ఏం వేసినా నానదు కదా. నువ్వు గింజ చాలా చిన్నదిగా ఉంటుంది. అది నానడానికి కావల్సిన తడి కూడా ఉండదన్న మాట. నువ్వుగింజ నానడానికి కావల్సినంత తడి కూడా నోట్లో మిగలనీకుండా మాట్లాడేవారు ఏ విషయమైనా బయటకి కక్కకుండా ఉండలేరన్నమాట. ఏ రహస్యమూ వారినోటదాగదని తాత్పర్యం. సామెతలోని సౌందర్యం గమనించండి మాయింటి టెలిఫోనుకి ఒక సౌకర్యం ఉంది. నెలకి నాలుగువందలు కడితే ఊళ్లో ఏ బి.యస్.ఎల్.ఎన్. లేండ్ లైన్ కైనా ఫోన్ చేసి ఎంత సేపయినా మాట్లాడుకోవచ్చు. మా ఆవిడ తరఫు వాళ్లంతా ఈవూళ్లోనే ఉండడంతో మొదట్లో ఇది మంచి సదుపాయమనే అనుకున్నానుగాని తర్వాత్తర్వాత దాని సాధక బాధకాలు తెలిసాయి. రోజూ ఇంట్లో రేడియో స్టేషన్ ఉందన్నట్లుగా తెల్లవారిందగ్గరనుంచీ రాత్రి పదకొండు గంటలవరకూ నిర్విరామంగా ప్రసారాలు సాగుతూనే ఉంటాయి. అవతలి వారు కూడా ఆడవాళ్లే (చెల్లెళ్లో మరదళ్లో) కావడంతో ఫోన్ పెట్టేసే ప్రసక్తే ఉండదు. అవి నా చెవులకి ఉద్దేశించిన ప్రసారాలు కావు కనుక నాకు సుఖంగానేఉంది. కానీ ఎవరైనా మాయింటికి అర్జంటుగా ఫోన్ చేయాలనుకుంటే కుదరదుగదా అదొక్కటే బాధ .రిటైరై కూర్చున్న వాణ్ణి కనక నాకే ఫోన్లూ రావు. ఎవరైనా చేయాలనుకున్నా మా లేండ్ లైన్ ఎప్పుడూ ఎం గేజ్డ్ గానే ఉంటుంది. తప్పని సరై నాతో మాట్లాడాల్సి వస్తే నా సెల్ కి చేయండి. గుర్తుంచుకోండి. ఇంతకీ మా ఆవిడ నోట్లో నువ్వుగింజ నానుతుందో లేదో చూద్దామనే ఉంది గాని ఆవిడ పోన్ పెట్టేసి నప్పటి సంగతి కదా?...ఇప్పటికి సెలవు.+