4, మే 2012, శుక్రవారం

నరసింహ..నీ దివ్య నామము..2(నృసింహ జయంతి సందర్భంగా)                                 నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత....2

 నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత  అనే క్రిందటి వ్యాసంలో  శ్రీ ధర్మపురి శేషప్ప గారిని,  వారి నరసింహ శతకం లోని కొన్ని పద్యాలనూ పరిచయం చేసాను. శ్రీ శేషప్పగారి గురించి మనకు ఎక్కువ వివరాలు తెలియక పోయినా అతడు అమాయకుడనీ, పెద్దగా గ్రంథాలు చదువుకున్నవాడు కాడనీ అందరూ అతని దైన్యాన్ని చూసి అపహసించేవారనీ అయినా  అతడవేమీ పట్టించుకోకుండా ధర్మపురి నరసింహ స్వామికి వీర భక్తుడై  మెలిగే వాడనీ అతని రచన వల్లనే మనకు తెలుస్తుంది.  అతడు  నరసింహ శతకం కాకుండా ఇంకేమైనా రచనలు చేసి ఉండి ఉంటే ఆ వివరాలు మనకు తెలియవు.   ఈ రోజు ( 4.5.2012) నృసింహ  జయంతి సందర్భంగా
 ఈ శతకం లోని చక్కని ధారాశుధ్ది కలిగిన ఆయన పద్యాలు మరికొన్ని  పరిచయం చేస్తున్నాను.

ఈ కవికి ఇహసౌఖ్యాలమీద మనసులేదు. మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదనీ అలాగే వెళ్లేటప్పుడుకూడా ఏమీ తీసుకుపోలేమనీ ధర్మం చేయకుండా దాచిన సొమ్ము దొంగలపాలో లేక రాజుల పాలో అవుతుందనీ ఎలా చెప్పాడో చూడండి:
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జనముచేసి విఱ్ఱవీగుటెగాని కూడబెట్టిన సోమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమిలోపలబెట్టి దానధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగల కిత్తురో దొరలకగునొ  తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణవికాస శ్రీధర్మపురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర
(తెరువరులు =బాటసారులు)

ఈ కవిగారికి సామాన్య భక్తులు చూపించే వేషభాషాటోపముల మీద నమ్మకం లేదు. సద్గురుని సేవించడం తప్ప వేరే ముక్తిమార్గం లేదని నిక్కంగా నమ్మిన వాడు. ఆవిషయం ఎలా చెప్పాడో చూడండి:

జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీ చూర్ణ గురురేఖలిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసుకొనిన నేమి శంభు నొందక కాడు శైవజనుడు
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి యాశ పోవక కాడు యతివరుండు
ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జెందక సన్ముక్తి దొరకబోదు
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర
(యతి వరుడు=ముని శ్రేష్టుడు)
ఆరోగ్యంగా వయసులో ఉన్నప్పుడు సమయమంతా ధనార్జనలోనూ భోగ లాలసతోనూ గడిపేస్తే మరణకాల మాసన్నమైనప్పుడు దైవ నామ స్మరణ చేయాలనుకున్నా శరీరం సహకరించక పోవచ్చునంటూ అతడు చెప్పిన పద్యం చూడండి ( ఇది కంచెర్ల గోపన్న దాశరథీ శతకం లోని ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ కల్గునొ కల్గదో నాఁటి కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణా పయోనిధీఅన్న పద్యాన్ని గుర్తుకు తెస్తుంది.

బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పనుగాని మరణ కాలమునందు మరతునేమొ
ఆ వేళ యమదూతలాగ్రహంహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్ గప్పగా భ్రమ చేత గంపముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచు బిలుతునో శ్రమ చేత బిలువ లేనొ
నాటి కిప్పుడె చేసేద నీ నామ భజన తలచెదను జెవిని వినవయ్య ధైర్యముగను
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర

అనంత జీవకోటికీ బ్రతుకుతెరువు చూపించిన దయామయుడైన నారాయణుణ్ణి పొగిడే
 ( నీటిలోని చేప కెవడు ఈత నేర్పెనూ.. అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెనూ.. అన్న మన సినీ కవి గారికి స్పూర్తి నిచ్చిన ) ఈ క్రింది పద్యం చూడండి:

అడవి పక్షుల కెవ్వ డాహార మిచ్చెను మృగజాతి కెవ్వడు మేత బెట్టె
జలచరాదులకు భోజన మెవ్వడిప్పించె చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసె
స్త్రీల గర్భంబులన్ శిశుల నెవ్వడు పెంచె ఫణుల కెవ్వడు పోసె బరగ పాలు
మధుపాళి కెవ్వండు మకరంద మొనరించె బసుల కెవ్వడొనరించె బచ్చి పూరి
జీవకోట్లను బోషింప నీవె కాని వేఱె యొక దాత లేడయ్యె వెదికి చూడ
 భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర
( పచ్చి పూరి= పచ్చ గడ్డి)
ఇలా ఎన్నో మంచి మంచి పద్యాలు ఇంకా ఉన్నాయి గాని  భక్తి పారవశ్యంతో భగవంతునితో తాదాత్మ్యం చెందిన
భక్త శిఖామణి ఆయనతో తగవు లాడడానికైనా సిధ్ధపడతాడని తెలియ జేసే ఈ రెండు పద్యాలూ చూడండి:

 మా లాంటి వారికే పూట గడవడం కష్టం గాని, నీకూ నీ పరివారానికీ ఏ ఖర్చూ లేకుండా హాయిగా మంది సొమ్ముతో  బ్రతికేస్తావంటూ శ్రీమన్నారాయణుణ్ణి ఎకసక్కెమాడే పద్యం:
హరి నీకు పర్యంకమైన శేషుడు చాల పవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనంబైన ఖగరాజు గొప్ప పామును నోట గొఱుకుచుండు
నదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుంద్రు
స్వస్థముగ నీకు గ్రాసమ్ము జరుగుచుండ గాసు నీ చేతదొకటైన గాదు వ్యయము
భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము ..ఎవడబ్బ సొమ్మని కులుకుతూ ఉన్నావు..” అంటూ శ్రీ రామచంద్రుణ్ణి గోపన్న దండించినట్లుగా, ఇన్నాళ్ళూ నీ సేవ లోనే జీవిత మంతా గడిపేను  అందుకు నాకు ప్రతిఫలంగా జీతమేమీ ఎందుకివ్వలేదంటూ  నిలదీసే ఈ పద్యం చూడండి:
కువలయశ్యామ నీ కొలువుజేసిన నాకు జీతమెందుకు ముట్టజెప్పవైతి
మంచిమాటల చేత గొంచె మియ్యగ లేవు కలహమౌనిక జుమ్మి ఖండితముగ
నీవు సాధువుగాన నింత పర్యంతంబు చనువుచే నిన్నాళ్లు జరుప వలసె
నిక నేను సహియింప నిపుడు నన్నేమైన శిక్ష జేసిన సేయు సిధ్ధమయితి
నేడు కరుణించకుంటివా నిశ్చయముగ దెగబడెద జూడు నీతోటి జగడమునకు
భూషణ వికాస శ్రీ దర్మవురనివాస దుష్టసంహార నరసింహ దురిత దూర

( భక్తి మార్గం వినా ముక్తి మార్గం లేదంటూ చాటి చెప్పే మన భక్తి శతకాలలో  శేషప్ప నరసింహ శతకం కూడా బహుళ ప్రచారం పొందినదే.  ఇది సరళమైన భాషలో వ్రాయబడడం చేత  సామాన్యులకు సైతం  సుబోధకమై అలరారింది.)

                                                                 ****