3, జులై 2012, మంగళవారం

పల్లకీలో ఊరేగుదాం..రండి..
 పల్లకీ అనే మాట  ఈ నాటి పిల్లలు ఎవరూ విని ఉండక పోవచ్చు.
విన్న ఏ కొద్ది మంది లో నయినా దానిని చూసిన వారు సకృత్తు గానే ఉంటారు.  ( మన దేవుళ్ళకి నేటికీ ఏదో సమయంలో పల్లకీ సేవలు జరుగుతూనే ఉంటాయి. ఆ సమయం లో వీటిని చూసే అవకాశం ఉంది.) పురాతన కాలం నుంచి దాదాపు పంతొమ్మిదో శతాబ్దం చివరి వరకూ ప్రపంచంలో చాలా చోట్ల పల్లకీలే  చాలా ముఖ్యమైన ప్రయాణ సాధనాలుగా  కొన సాగేయి. ఆ తరువాత కొన్నాళ్లు వివాహాది శుభ కార్యాలలో వధూవరులను ఊరేగించడానికి ఉపయోగ పడినా కాలక్రమంలో దాదాపు అర్థ శతాబ్దం క్రితమే అవి జనజీవనం నుంచి నిష్క్రమించాయి. నేడు పల్లకీలూ లేవు. పల్లకీ బోయీలూ లేరు.
మన భాగవతంలో పల్లకీ ప్రసక్తి జడభరతుని కథలో వస్తుంది. బ్రహ్మ జ్ఞానియై పూర్వ జన్మ జ్ఞానం కూడా కలిగిన జడభరతుడు సింధు దేశపు రాజైన రహూగణుని పల్లకీ కొమ్ముమోస్తాడు. జడభరతుడు తన ముందు జన్మలో భరత దేశాన్ని ఏలిన చక్ర వర్తి. అటువంటి వాడు పల్లకీ ఎందుకు మోసేడనే  కథ ఇప్పుడు చెబితే శాఖా చంక్రమణం అవుతుంది కనుక మరోసారి చెప్పుకుందాం. ఇప్పటికి తెలుసుకోవలసినది ఆ పురాతన కాలం లోనే రాజులు పల్లకీలు ఎక్కి ఊరేగేవారని మాత్రమే. ఆ  తరువాతి కాలంలో మెల్లమెల్లగా రాజ్యాధికారులూ ధనవంతులూ కూడా పల్లకీల్లో ప్రయాణం చేసేవారు. ఈ పల్లకీలు మన దేశం లోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఉండేవి. దేశ కాలాల్ని బట్టి వాటి తీరు తెన్నులు మారుతూ వచ్చాయి. చిన్నవీ, ఒక్కరు  మాత్రం కూర్చొని ప్రయాణం చేయడానికి సరిపోయే వాటితో మొదలై, ఒకరు పూర్తిగా పడుక్కుని సుఖంగా ప్రయాణం చేసేంత విశాలమైనవి గా కూడా రూపాంతరం చెందుతూ వచ్చేయి.  పల్లకీలను యూరోపు దేశాలలో  Sedan chairs అనే వారు. వాటిని మోసే బోయీలను వారు  Chairmen అనే వారు. ఆ దేశాల్లో రాచబాటలు మాత్రమే శకటాలు రధాలు పోవడానికి వీలుగా ఉండేవి. మిగిలిన వీధులన్నీ చక్రాల బండ్లు పోవడానికి తగినంత తీరుగానూ విశాలంగానూ ఉండేవి కావు. ఆ వీధులన్నీ బురద తోనూ ఇళ్లనుంచి కిటికీల గుండా వీధిలోకి గిరవాటేసిన చెత్తతోనూ నానా భీభత్సంగా ఉండేవి. నాగరికులెవరూ కాలుపెట్టి నడవడానికి వీలు లేనంత భయంకరంగా ఉండేవి. అటువంటి దారుల గుండా తమకు  బురద మట్టి అంటకుండా ప్రయాణించడానికి వారికి  పల్లకీలే గతి అయ్యేవి. వీటిలో ఒక చోటినుంచి ఒక చోటికి ఇంత రుసుమని చెల్లిస్తే తీసుకు పోయే పల్లకీలు  ( stages carriers) కూడాఉండేవట. ఇవికాక అధికారులు ధనవంతులు తమకోసం స్వంతంగా అట్టి పెట్టుకునేవీ ఉండేవి. వీటిలో అతి సాధారణంగా ఉండేవి మొదలుకుని అత్యంత వైభవంగా అలంకరించిన  పల్లకీల వరకూ ఉండేవి. కొన్ని రకాల పల్లకీలు, వాటిని మోసే వారి సంఖ్య ఆ పల్లకీలో ప్రయాణించే అధికార్ల హోదాను తెలియజేసేవి గా ఉండేవి. బెంగాలు లో 1758 లో చిన్న పాటి ఉద్యోగులు పల్లకీలు కొనకుండా నిషేధం ఉండేదట. ( రక రకాల అందమైన పల్లకీలను నెట్లో చూడవచ్చు కొన్ని రకాల నిక్కడ చూడండి. వీటిలో ఆఖరుది  రాణులను , స్త్రీలు మాత్రమే మోస్తున్న దృశ్యం )


 


     
అధికార దర్పానికీ, అర్థబలానికీ చిహ్నాలైన ఈ పల్లకీల రూపురేఖల  గురించి మనకెందుకు ?      “   ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరని కదా మన మహాకవి ప్రశ్నించాడు?  కనుక ఈ పల్లకీలను  శ్రమించి మోసిన బోయీల గురించి కొంతైనా తెలుసుకుందాం.
అస్తవ్యస్తంగా ఉన్న దారులలో పల్లకీలను మోసుకు వెళ్ళడం  అందరూ సరిగా చేయలేరు. పల్లకీలో ప్రయాణిస్తున్న వారికి ఏ విధమైన కుదుపూ, ఇబ్బందీ కలుగజేయకుండా పల్లకీని మోయడం ఒక కళే. ఈ పనిని కొన్ని కులాల వారే ఒక హక్కు గానూ సమర్థవంతంగానూ నిర్వహించే వారనీ మిగిలిన కులాల వారు ఈ పనికి ఒప్పుకునే వారు కారనీ తెలుస్తోంది.
 పల్లకీ బోయీలనగానే మనకి తప్పకుండా గుర్తు వచ్చేది సరోజినీ నాయుడు వ్రాసిన  The palanquin bearers అనే అంగ్ల గేయం. చక్కటి పాట పాడుకుంటూ వారు  కొత్త పెళ్ళి కూతుర్ని అత్తవారింటికి తీసుకు వెళ్లే తీరును చిన్న పాటి గేయంలో హృదయంగమంగా మన నైటింగేల్వివరించారు. పని లోని శ్రమ తెలియకుండా ఉండేందుకు వారు ఒహొం..ఒహొంహొం.. అంటూ రకరకాల పాటలు పాడుకునేవారు.
యూరప్ దేశాలలో వీరి సంపాదన బాగుండేదనీ  పొలాలు కొనుక్కునీ ఇల్ళు కట్టుకునీ మర్యాదగా జీవించే వారనీ తెలుస్తోంది.
మన ఆంధ్ర దేశం లో ఈ పనిని అతి సమర్థవంతంగా చేయగలిగిన వారు కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడ బోయీలని  1830 లో మదరాసు నుంచి కాశీ వరకూ పల్లకీలలో ప్రయాణం చేసిన ఏనుగుల వీరాస్వామి గారు వ్రాసేరు. కన్యాకుమారి నుంచి కాశ్మీర దేశం వరకూ ఉప్పాడ బోయీలకు సమానమైన మోత గాండ్లు, చూపరులు బలాఢ్యులు, అలంకార ప్రియులు ప్రయాసకు వోర్చగల వారు, ఆయుధ ధారణ ప్రియులు మరెక్కడా కానరారని చెబుతాడాయన. ఈశ్వరుడు వారిని ఈ పనికోసమే సృష్టించినట్లుందని అంటాడాయన. వారికి మార్గంలో ఎక్కడయినా సుస్తీ చేసినప్పుడు కొంచెం విశ్రాంతి కలుగ జేస్తూ ఉంటే వారితో భూగోళ సంచారమే చేయ వచ్చునని కూడా అంటాడాయన.
ఆ రోజుల్లోకాకినాడకు దగ్గర్లో ఉన్న ఉప్పాడ గ్రామంలో సుమారు 500 ఇళ్ళ బోయీలు నివాసముండేవారట.  వారు సముద్రంలో చేపలు పట్టి వాటిని ఎండ వేసి ఎండు చేపలను అమ్ముకోవడమో, మదరాసు పోయి పల్లకీ బోయీలుగా పనికి కుదురు కోవడమో చేసేవారట. బోయ స్త్రీలు కట్టెలు కొట్టి అమ్ముకోవడం, పొలాల్లో కూలి పని చేయడం ద్వారా జీవనం కొన సాగించేవారట. వీరి ఇళ్లల్లో మగవారు పుడితే చచ్చే వరకూ తలకు ఇంత అని సర్కారుకు పన్ను కట్టాల్సి ఉండేదట. ఈ పన్ను కూడా వారి స్త్రీలే కట్టుకునే వారట. ఇక్కడి మగవారు రూపాయికి సంవత్సరానికి అర్థ రూపాయి ( 50% ) వడ్డీకి అప్పు తెచ్చి తాగడానికి ఖర్చు చేసేసే వారట. ఆ అప్పులు తీర్చడానికి మదరాసు వెళ్లి అక్కడ బోయీలుగా పనిచేసి తిరిగి వచ్చి అప్పులు తీర్చుకునే వారట. అక్కడ కూడా తాగేసి ఏమీ మిగుల్చుకోలేని వారు  సంవత్సరాల తరబడి ఇంటికి రాకుండా అక్కడే ఉండి పోయేవారట. యూరప్ లో బోయీల స్థితిగతులకీ ఇక్కడి మనవారి ఈ జీవనానికీ ఎంత తేడానో కదా? దానికి మన వారి తాగుడు అలవాటే కారణమని వేరే చెప్పనక్కర లేదు.  వీరా స్వామి గారితో వచ్చిన బోయీలలో ఇద్దరు ఇల్లు వదలి చాలా కాలమైనందున వారి భార్యలు వారిని గుర్తు పట్టలేక పోయారనీ, వారికి తాగడానికి కావలసిన పైసలు కూడా తామే సంపాదించి ఇస్తామనీ తిరిగి వెళ్ళ వద్దనీ వారిని వేడుకున్నారని వీరాస్వామిగారు వ్రాసేరు. ఎంతటి దయనీయమైన పరిస్థితి ?
పూర్వం మన రాజుల కాలంలోఈ పల్లకీలెక్కి ఊరేగడానికి  అన్ని కులాల వారికీ అర్హత ఉండేది కాదట. అర్హత లేని కులాల వారు ప్రత్యేక సమయాల్లో పల్లకీలలో ఊరేగాలంటే రాజాజ్ఞ లేక పోతే పల్లకీ మోసే కులాల వారు కూడా మోసే వారు కారట. ఈ విషయాన్ని వివరిస్తూ మా నాటి గత్తర అంటూ ఒక వైనం చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు తన కథలూ గాథలూ లో వ్రాసేరు. ఆ వైనం ఏమిటంటే--
1860 ప్రాంతంలో  కాకినాడ దగ్గర ఉన్న యానాం టవున్లో ఉండే పల్లీయులు (బెస్త వారు) ఒక పెండ్లి సందర్భంగా ఫ్రెంచి పోలీసుల సాయంతో పల్లకీ ఊరేగింపు తీయడానికి తలపెట్టారట. దీనిని తమకు అవమానమని భావించిన ఆ వూరి కాపులు తలుపులు వేసుకుని ఎవరి ఇళ్ళలో వారు ఉండి పోయారట. అందువల్ల ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా సాయంత్రం చీకటి పడేవరకూ ఉరేగింపు జరిగిందట. ఫ్రెంచి పోలీసులు ఇక తమ అవసరం లేదని వెళ్ళి పోయారట. విజయోత్సాహంతో ఉన్న పల్లీయులు అక్కడితో ఆగకుండా మానాటి కాపులు కొంత మంది ఉండే అక్కడికి శివారు గ్రామమైన కనగాల పేటలో కూడా ఊరేగాలని నిశ్చయించుకున్నారట. కనగాల పేటకీ యానాంకీ మధ్యలో చిన్నకోడు (యేరు) ఉందట. అది అట్టే లోతు ఉండని కారణంగా నడచి దాటవచ్చునట.ఈ మత్స్యకారులు ఆ వూరు రానున్నారని తెలిసి ఆ వూరి కాపులు కొన్ని జనపనార తీసిన కట్టెల ( మా ఉత్తరాంధ్రలో వీటిని కటిక కర్రలంటారు) మోపులనుయేటి ఒడ్డునే పేర్చి వాటిపై తెల్లటి గుడ్డలను కప్పివాటిపై వసంతం ( ఎరుపు నీళ్ళు) చల్లి ఉంచి వాటి పక్కనే ఆయుధ పాణులై నిల్చున్నారట.. ముని చీకటిలో అటువైపు బయల్దేరిన బెస్త వారి గుంపులో చాలా మంది అది చూసి తమ వారిని కాపువారు చంపేసిఉంటారని భయపడి  పరుగెత్తి అక్కడికి దక్షిణాన ఉన్న గౌతమీ నది ఈదుకుంటూ బ్రతుకు జీవుడా అంటూ చెల్లాచెదరైపోయారట. అలా పారి పోకుండా మిగిలి పోయిన పెళ్ళి వారినీ వారి బంధువుల్నీ కాపు వారు చితక బాది వారి పల్లకీని విరిచి ధ్వంసం చేసారట. ఆ తరువాత ఆ కులస్థుల ఇళ్లలో జొరబడి కొల్లగొట్టారటకూడా. ఆ విధ్వంసాన్ని ఆపడానికి ఫ్రెంచి పోలీసులకు చేతకాక కాకినాడనుంచి బ్రిటిష్ సైన్యాన్ని సహాయం కోరవలసి వచ్చిందట.  వారి సహాయంతో  కాపు వారి  అరాచకాన్ని అణచి  వారి పెద్దలను జైలు పాలు చేసారట.
ఈ విధంగా రాజరికానికీ, కులీనత్వానికీ ప్రతీకలై మన సాటి మనుషులు మోసే  పల్లకీలు మనకొద్దు గాని-
ఊహల పల్లకీ ఎక్కించి సాహితీ నందనోద్యానవనంలో విహరింప జేస్తుంటాను. మాబ్లాగింటికి విచ్చేస్తూ ఉండండి. సెలవు.