5, జనవరి 2013, శనివారం

రాయల వారు చెప్పక చెప్పిన పిట్ట కథ...శ్రీ కృష్ణ దేవరాయల వారి దిన చర్య  చాలా చిత్రంగా ఉండేది. దానిలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే-  రోజూ పొద్దున్న లేవగానే  నీతి పద్యాలు చదివించుకుని వింటూండే వారట. ఆ విధంగా సంజయనీతి, విదుర నీతి, చాణుక్య నీతి, భర్తృహరి నీతి శతకం మొదలైనవి రోజూ చదివించుకుని వింటూ, వాటి సారాన్ని ఒంట పట్టించుకుంటూ ఉండేవారట. అలా తాను తెలుసు కున్న నీతుల్ని ఆచరించడమే కాదు తన ఆముక్త మాల్యద కావ్యంలో కూడా అక్కడక్కడా చెబుతూ వచ్చారు. ఆయన వ్రాసిన ఆముక్త మాల్యద కావ్యం లోని ఈ క్రింది పద్యం చూడండి:
లాలన నారక్షుల గమి-నేలి తెలిసి మ్రుచ్చునాజ్ఞయిడ కతడు చెరం
బో లాతి నిడనయశమెం- తే లేవదె శూలపృథువణిజ్ఞ్న్యాయమునన్.
దీని భావం-- ప్రభుత్వంలో ఉన్న వారు, ఏదైనా నేరం జరిగి నప్పుడు వెంటనే స్పందించి, రక్షక భటులను లాలించి ఏలుకుంటూ నేరస్థులెవరో తెలుసుకుని వారిని వెంటనే శిక్షించాలి. అలాక్కాకుండా ఆలస్యం చేస్తే నేరస్థుడు తప్పించుకు పారి పోయే ప్రమాదం ఉంది. అప్పుడు రక్షక భటులు తమ ఉద్యోగాలు నిలబెట్టుకునేందుకు ఎవరినో ఒకర్ని నేరస్థులని తీసుకు రావడం ప్రభువులు శూల పృథువణిజ్ఞ్న్యాయం ప్రకారం- అంటే  లావు పాటి శూలం- లావుపాటి శెట్టి గారి కథలో లాగా ఆ అమాయకుల్ని శిక్షించడం జరుగుతుందని. రాయల వారు చెప్పకనే చెప్పిన ఈ పిట్టకథ ఏమిటో కొంచెం వివరిస్తాను.
పూర్వం పంచ మహాపాతక పట్టణాన్ని అవకతవక రాజు ఏలుతున్న రోజుల్లో ఒక పౌరుడు వచ్చి వారితో తాను మట్టిగోడ కట్టుకుంటే వర్షం కురిసి అది కూలి పోయిందని తనకు న్యాయం చేయమని మొర పెట్టుకున్నాడట.  రాజు గారు వెంటనే దానికి బాధ్యులెవరని తన అవివేకపు ప్రధానిని అడిగితే అతడు వర్షం కురిపించిన మేఘునిదే ఆ తప్పు అని చెప్పాడు. రాజుగారు మేఘుణ్ణి తీసుకు వచ్చి కొరత వేయమన్నారు. వర్షం కురిసేసిన తర్వాత మేఘ మెక్కడుంటుంది? అందుకని మేఘానికి కారణమైన వారెవరంటే పొగ అని ఒక సభ్యుడు చెబితే పొగకి కొరత వేయమన్నారు రాజుగారు. ఆ పొగా ఇప్పుడు లేదు కనుక దానికి కారణ మెవరంటే కుమ్మరి వాని ఆవము అని చెప్పారు. ఆ శిక్ష ఆవానికి వేయమన్నారు రాజుగారు. రక్షక భటులు వెళ్లి చూస్తే అక్కడ ఆవమిప్పుడు లేదు గాని, దానిని పెట్టిన కుమ్మరి ఉంటే వాడిని పట్టుకుని రాజు గారి వద్దకు తీసుకు వచ్చారు. వాడు రాజు గారితో  తన తప్పేమీ లేదనీ అయ్యవారింట్లో పెళ్లికి ఆరణి కుండలు కావాలంటే అవి కాల్చడానికే ఆవం పెట్టాననీ, కనుక ఆ శిక్షేదో ఆ పెళ్ళి కొడుక్కే వేయమని మొర పెట్టుకున్నాడు. రాజు గారు సమ్మతించి అలాగే శిక్ష వేయగా, ఆరెకులు( రక్షక భటులు) పెండ్లి కుమారుని పట్టుకు వచ్చి కొరత వేయ బోయారు. అంతలో అర్భకుడైన పెళ్లి కొడుకు తాను చాలా సన్నంగా ఉన్నానీ కొరత వేసే కొర్రు చాలా లావు గా ఉందనీ అదేమి న్యాయమనీ మొర పెట్టుకున్నాడు. ఈ విషయం ఆరెకులు రాజుగారికి విన్నవిస్తే అట్లైతే కొర్రుకు సరిపడా లావుగా ఉన్న ఎవరినైనా తీసుకు వచ్చి కొరత వేయమని అది తన తుది నిర్ణయమనీ మరి తన వద్దకు రావద్దనీ అన్నాడట. రక్షక భటులు కొర్రుకు సరిపడా లావు గా ఉన్న వర్తక ప్రముఖుడొకణ్ణి పట్టుకు వచ్చి కొరత వేసారట.
అయ్యా- ఇదీ శూల పృథువణిజ్ఞ్న్యాయమనబడే – లావుపాటి కొర్రు- లావు పాటి శెట్టిగారి కథ.
కథలో హాస్యం సంగతలా ఉంచితే- రాయల వారు చెప్పదలచుకున్నది, నేరం జరిగి నప్పుడు ప్రభువులు వెంటనే స్పందించి సత్వర న్యాయం చేయాలని.
ఇది ప్రభుత్వంలో ఉన్నవారు ఏ కాలంలో అయినా గుర్తు పెట్టకో వలసిన నీతి. మొన్ననీ మధ్య మన దేశ రాజధానిలో ఒక బస్సులో జరిగిన అమానుష కృత్యం సంగతే చూడండి.అదే బస్సులో అంతకు ముందే ఒక ప్రయాణీకుడి దగ్గరనుంచి విలువైన వస్తువులు ధనాన్ని దోచుకున్న విషయం ఆ ప్రయాణీకుడు పోలీసులకు విన్నవించుకుంటే వారు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకున్నారట. అదే వారు సత్వరమే స్పందించి బస్సువారిని నిర్భంధంలోకి తీసుకువి ఉంటే ఒక అమాయకురాలి శీలహరణం మరణం సంభవించకుండా ఆప గలిగే వారు కదా? 
(శ్రీ రాయల వారు చెప్పక చెప్పిన ఈ కథని మనకు విడమరిచి చెప్పిన వారు ఆముక్త మాల్యదకు ప్రతిభా వంతమైన వ్యాఖ్య వ్రాసిన శ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారని ఆరుద్ర గారి ఉవాచ.ఆ మహనీయుల్ని తలచుకుంటూ ఈ నీతిని మననం చేసుకుందాం. సెలవు.)