జెండా పై కపిరాజు అంటూ తెలుగు పద్యపు బావుటాని తెలుగు
సాహితీ గగనంలో రెపరెపలాడిస్తూ ఎగుర వేసిన ఖ్యాతి సాహితీమూర్తులైన జంట కవులు శ్రీ
తిరుపతి వేంకట కవులకే దక్కుతుంది. వీరికి చాలా ముందే తెలుగు సాహిత్యంలో జంట
కవిత్వం చెప్పిన నంది మల్లయ ఘంట సింగన్నలూ,వీరికంటె కొంచెం వయసులో పెద్దవారైన
దేవులపల్లి సోదరులూ,వీరికి సమ కాలికులైన రామకృష్ణకవులూ ఉన్నా జంటకవులుగా వీరికి
వచ్చిన ఖ్యాతి మిగిలిన వారికి రాలేదు.ఆంధ్ర దేశంలోతిరుపతి అంటే శ్రీ వేంకటేశ్వరుడూ,వేంకటేశ్వరుడంటే తిరుపతీ గుర్తుకు
వచ్చి తీరుతాయి కనుక ఆ పుణ్య స్థలమూ ఆ దేవుడూ అభేదంగా మనకు తోచినట్లే తిరుపతి వేంకటకవులు కూడా విడదీయలేని జంటకవులుగా
ప్రసిధ్ధి చెందారు.వీరిద్దరూ దాదాపు ఇరవై ఏళ్లు కలిసిసాహితీ వ్యవసాయం చేయడమే
కాకుండా శ్రీతిరుపతిశాస్త్రి గారి మరణాననంతరం కూడా ( దాదాపు 30 ఏళ్లు
బ్రతికి సాహిత్యోపాసన చేసిన) వేంకటశాస్త్రిగారి చే విరచితములైన రచనలన్నీకూడా ఆ జంటకవుల పేరుమీదే “తిరుపతి
వేంకటీయ” మై ప్రకటింపబడడం కూడా వీరి
స్నేహబంధానికి నిలుపుటద్దమై నిలుస్తుంది.వీరిలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ల వేంకట శాస్త్రిగారి జన్మ దినం నేడు (8th Aug) కావడం వల్ల వారినో సారి
స్మరించుకుని మన ఋణం తీర్చుకుందాం.
శ్రీ వేంకట శాస్త్రిగారి జన్మ స్థలం రాజమండ్రి సమీప
గ్రామమైన కడియం. 1870లో జన్మించిన
ఆయన తనకు సుమారు 10 సంవత్సరముల వయసు వచ్చేవరకూ అక్కడే ఉన్నాఆ తరువాత వారి మకాం
అప్పట్లో ఫ్రెంచి ప్రభుత్వాధీనంలో ఉన్నయానాంకు మారింది. కడియం లోనూ యానాం లోనూ
అక్షరాలూ బడిచదువూ ఫ్రెంచి భాషా కొద్దిపాటి సంగీతమూ నేర్చుకున్నారు. యానాంలో
ఉన్నప్పుడే అక్కడి వేంకటేశ్వర స్వామి మీద శతకం వ్రాసేరు. దానిలో కొన్ని వ్యాకరణ
దోషాలు పెద్దలు చూపించడంతో కడియెద్ద గ్రామంలో ఉంటున్న శ్రీ చర్ల బ్రహ్మయ్య
శాస్త్రిగారి వద్ద వ్యాకరణం నేర్చుకుందికి వెళ్లారు.అప్పటికి ఆయనకు 18 ఏళ్లు.
అక్కడ అప్పటికే కొద్ది మాసాల క్రితం నుంచీ వ్యాకరణం నేర్చుకుంటున్న శ్రీ దివాకర్ల
తిరుపతి శాస్త్రిగారు ఆ విధంగా వీరికి సతీర్థులయ్యేరు. బ్రహ్మయ్య శాస్త్రుల వారి శిష్యరికం చేస్తున్నా చెళ్లపిళ్ల వారికి కాశీ వెళ్లి
అక్కడ ఉండి వ్యాకరణం నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. దీనికి ఆ రోజుల్లో
వ్యాకరణానికి కాశీ,తర్కానికి నవద్వీపమూ,మీమాంసకు దక్షిణ దేశమూ,వేదానికి మన కృష్ణా గోదావరీ
తీరమూ ప్రఖ్యాతి పొంది ఉండడము ఒక కారణం.ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రాల్లో చదువులకి
విదేశాలకి వెళ్లిరావడం ఎలాగ గొప్పో అలాగ ఆ రోజుల్లో కాశీలో చదువుకుని వచ్చి మనదగ్గర ఉన్న పండితుల
దగ్గర వ్యాకరణం నేర్చుకునే అవకాశం ఉన్నా,కాశీ వెళ్లి అక్కడ చదువుకుని రావడం చాలా
గొప్ప. అక్కడ నేర్చుకున్నదాని కన్నా అక్కడ ఎన్నాళ్లు ఉండివచ్చేరన్న దానికే
ప్రాముఖ్యత నిచ్చే వారట. కానీ తాను కాశీ వెళ్లడానికి ఇంతకంటె చిత్రమైన కారణం ఒకటి
శాస్త్రిగారు చెప్పారు. యానాం లోఉంటూ ఉండగా పట్న వాసం వల్ల తాంబూల చర్వణం
అలవాటయిందనీ కడియెద్దలో గురువు గారి సమక్షంలో ఈ అభ్యాసానికి వీలు కుదరక కాశీ
వెళ్లడానికి నిర్ణయించుకున్నాననీ వ్రాసేరు. అలా కాశీ వెళ్లడానికి ముహూర్తం
పెట్టుకుంటే దైవం వేరొకలా తలచి చిత్రంగా ఆ
ముహూర్తానికే శాస్త్రిగారికి వివాహమవడం తటస్థించింది. శాస్త్రిగారు ఆ వివాహానికి
అంగీకరించడానికి కారణం అప్పటికా పెళ్లి కూతురికి 5 సంవత్సరాల వయసే ఉండడం. అందువలన
వివాహం చేసుకుని తాను కాశీలో పది పన్నెండేళ్లు విద్యాభ్యాసం చేసి వచ్చినా ఇబ్బంది ఉండదనుకున్నారు.అలాగే వివాహానంతరం కొద్దిరోజులకే కాశీ ప్రయాణ సన్నాహం మొదలెట్టారు. కానీ ఆరోజుల్లో
బెజవాడనుంచి కాశీకి రైలు ఉన్నాటికట్టుకు కావలసిన రూ.18 కూడా శాస్త్రిగారి వద్ద లేవు.
అందుకోసం తొలిసారిగా నిడమర్రు గ్రామంలో అష్టావధానం చేసి తనకీ తనతో కాశీ వస్తున్న తన మిత్రునికీ
కావలసిన పైకం సమకూర్చుకున్నారు. ఈ తొలి అష్టావధాన మంటే ఎనిమిది మందినీ ఒకరి తర్వాత
ఒకరిని కూర్చో పెట్టుకుని వారికి కావలసిన పద్యాలు చెప్పడమే. ఆ రోజుల్లో అక్కడ అష్టావధాన ప్రక్రియగురించి ఇంకా ఎవరికీ తెలియని
రోజులు గనుక అలా చెల్లిపోయిందంటారు
శాస్త్రిగారు. అలా ధనం సమకూర్చుకుని కాశీ వెళ్లి నోరి సుబ్రహ్మణ్య శాస్త్రులవారి
వద్ద వ్యాకరణం నేర్చుకుందికి చేరారు. అయితే కాశీలో విద్యాభ్యాసం సరిగా సాగదనీ అనభ్యాసాలే
ఎక్కువనీ అంటారు. కాకపోతే శాస్త్రిగారి తాంబూలాధ్యయనానికి కొదవ లేకుండా సాగిందట.
అక్కడ తాంబూలమంటే సున్నం పొగాకుతో కలిసి నూరినదే. అది కాక అక్కడ వారూ వీరూ అనకుండా
అందరూ భంగు సేవించేవారు కనుక శాస్త్రిగారుకూడా సేవించడం దానివల్ల తిప్పలు పడడం
జరిగిందట. ఆ రోజుల్లో కాశీలో స్థిరనివాసమేర్పరచుకున్నవారిలో శ్రీ గంగాధర
శాస్త్రుల వారు,శివకుమార పండిట్జీ,కల్లాట సీతారామ శాస్త్రులు,దామోదర శాస్త్రులు
ద్రావిడ సుబ్రహ్మణ్య శాస్త్రులు,దండిభొట్ల విశ్వనాధం గారు మున్నగు ప్రముఖులు
ఉండేవారు.( వీరిలో దండి భొట్ల విశ్వనాధం గారి గురించిన ముచ్చట్లు దండి భొట్ల వారి దర్జా అనే నా పోస్టులో చూడగలరు).
కాశీలో కొన్నాళ్లున్నా,తల్లిదండ్రుల కోరికపై శాస్త్రిగారికి కాశీని విడిచి
పెట్టిరాక తప్పలేదు.తిరిగి వచ్చేక మళ్లా
బ్రహ్మయ్య శాస్త్రుల వారి వద్దనే వ్యాకరణం నేర్చుకోవడం,అప్పుడే శ్రీ దివాకర్ల
తిరుపతి శాస్త్రిగారు వారికి సహాధ్యాయులవడం,వారి మధ్య మైత్రి చేకూరడం జరిగాయి.
( ఇక్కడ గురువు గారే వీరికి వేంకట శాస్త్రి అని నామకరణం చేశారట.అంతకు ముందు ఆయన అసలు పేరు వెంకటాచలం.యానాంలో ఫ్రెంచి మాస్టరు అతనిని యెంకతాసెలం అనిపిలిచేవారట )
( ఇక్కడ గురువు గారే వీరికి వేంకట శాస్త్రి అని నామకరణం చేశారట.అంతకు ముందు ఆయన అసలు పేరు వెంకటాచలం.యానాంలో ఫ్రెంచి మాస్టరు అతనిని యెంకతాసెలం అనిపిలిచేవారట )
వీరు శ్రీ తిరుపతి శాస్త్రి గారితో కలిసి చేసిన తొలి
సంపూర్ణ శతావధానం కాకినాడలో దిగ్విజయంగా జరిగింది.అప్పటికి వారికి 25 ఏళ్ల లోపే.ఆ
తరువాత శ్రీ తిరుపతి శాస్త్రిగారు కాకినాడలో పోలవరపు జమీందారు గారి ఆశ్రయంలో ఉండడం
వల్ల వీరిద్దిరీకీ కలిసి అవధానాలు చేసే వీలు చిక్కకపోవడం కారణంగా శ్రీ చెళ్లపిళ్లవారు
ఒక్కరే ఎన్నో చోట్ల దిగ్విజయంగా అవధానాలు చేస్తూ వచ్చారు. అలా మూడేళ్లు గడిచాక
శ్రీ శాస్త్రిగారు కూడా బందరు పాఠ శాల ఉద్యోగంలో చేరడంతో మరో మూడేళ్లపాటు ఇద్దరూ
కలిసి అవధానాలు చేసే అవకాశాలు కలిసి రాలేదు. అలా ఆరేళ్ల పాటు ఉన్నారు. ఈ సమయం లో
కలిసి అవధానాలు చేయక పోయినా,వేరు వేరు ఊళ్లలో ఉంటున్నా, వారి రచనలు మాత్రం ఎవరు
చేసినా తమ జంట పేరుతోనే ప్రచురిస్తూ
వచ్చేరు. బాల రామాయణం,ముద్రా రాక్షస,
మృఛ్ఛకటిక విక్రమాంకదేవ చరిత్ర,చంద్ర ప్రభ చరిత్రల ఆంధ్రానువాదాలు తిరుపతి
శాస్త్రి గారు తన ఒంటి చేతిమీదే చేసినా,అవి తిరుపతి వేంకట కవుల పేరిటనే ప్రచురింప
బడ్డాయి.
వీరి రచనా విధానాన్ని గూర్చి వీరే ఇలా చెప్పుకున్నారు:
“ ఇరువురు గూడియే రచన యెప్పుడు చేయుదు రొక్కవేళ నొ
క్కరొకటి
యొక్కరింకొకటి కై కొని చేయుదురందు హెచ్చు త
గ్గొరులకు గానరాక,
యది యొక్కరు చేసిన భంగినుండు,నొ
క్కరు
రచియించిరేనియును కాదగు తిర్పతి వేంకటీయమై”
వీరిద్దిరూ కలిసి చేసిన సాహిత్యకృషి అపారం. పోయినవి పోగా
వీరు ప్రచురించిన నాటకాలు ప్రహసనాలూ అనువాదాలు పద్యకావ్యాలూ ప్రబంధాలూ
కావ్యఖండికలూ వచన రచనలూ శతకాలూ స్తోత్రాలూ మరెన్నో సంస్కృత గ్రంధాలూ లెక్కకు
మిక్కిలిగా ఉన్నాయి. వీరి రచనల్లో శ్రవణానందం వీరికి
అనుకోని పేరు తెచ్చిపెట్టిందంటారు శ్రీ శాస్త్రి గారు.
ఇది సహృదయుల చేత-
“ క. ఒక శ్రవణానందమ్మున
నొక పద్యమునందుఁ గలుగు నొక పాదమునం
దొక యక్కరమున కిచ్చిన
సకలంబగు రత్న గర్భ చాలునె తూఁపన్.” అన్నంత పొగడికను పొందిందట.
అయితే వారికి మాత్రం వారి పాణిగ్రహీత దానికంటె బాగుంటుందనే
అబిప్రాయం ఉండేది.
వీరి కావ్యరచన ఒక ఎత్తయితే వీరు నాడు ఆంధ్రదేశ సంచారం చేసి
ఎందరో సంస్థానాధీశులను దర్శించి వారి మెప్పువడసే లాగున కవిత్వం చెప్పడం అనేక
సన్మానాలు పొందడం ఇంకొక ఎత్తు. వీరి నానా రాజ సందర్శనం గ్రంధంలో ఈ వివరాలూ వారు
చెప్పిన పద్యాలూ చూడవచ్చు. తెలుగు సంస్కృత భాషలలో కవిత్వంలో తమకెదురు లేదన్నధీమాతో వారు చెప్పిన పద్యాలలో
“ ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము” అనేదీ.. “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మటంచు దెల్పగా” అనేదీ చాలా సుప్రసిధ్ధమైనవి.
“ ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము” అనేదీ.. “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మటంచు దెల్పగా” అనేదీ చాలా సుప్రసిధ్ధమైనవి.
అవధానాలకు వీరే ఆద్యులు కాకపోయినా,మన తెలుగు భాషకే
ప్రత్యేకమైన శతావధాన అష్టావధానాలను అతి
నైపుణ్యంతో నిర్వహించి వాటికి తెలుగునాట విశేష ప్రాచుర్యాన్నికలిగించి తమలాగ
ఎందరో అవధానులు తయారవడానికి దోహద పడ్డారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఇద్దరూ
కలసి రచనలు చేసినట్లే అవధానాలనుకూడా ఇద్దరూ కలిసి నిర్వహించేవారు. తమ అవధాన రచన
గురించి
“ ఒక
చరణంబతండు మఱియొక్కటినేను మఱొక్కడాతడున్
సకల
కవీంద్ర సంతతులు సమ్మతిచే దలలూచి మెచ్చగా
బ్రకటత రాశుధార
దనరన్ రచియింపగ నేర్తుమయ్య”
అని వారే చెప్పుకున్నారు.
వీరిద్దరూ కవిత్వంలోనూ పాండిత్యంలోనూ ఒకరికొకరు తీసిపోని
వారైనా,చెళ్లపిళ్లవారు మహా గడుసువారు. మహాలౌకిక ప్రజ్ఞాదురంధరులు. సభారంజకత్వం
ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన పద్యాలను చదివే తీరు జనాన్ని విశేషంగా
ఆకట్టుకునేది.“శ్రీ వేంకట శాస్త్రి గారు పద్యము చదువుట యనగా
శ్రోతలను ముగ్ధులను జేయుట. ఆ రాగము ఆ విఱుపు,ఆ ఉదాత్తానుదాత్తములు,వారి కంఠ
మాధుర్యము,వారి మహా వ్యక్తిత్వము-ఇవి
యన్నియు కలిసి శ్రోతలను తలక్రిందులు చేయుచుండెడివి”
అంటారు వారి శిష్యులు శ్రీ విశ్వనాథ వారు.
అవధానాల్లో వారు తెలుగు పద్యాలనే కాక ఎన్నో లెక్కలేనన్ని సంస్కృత శ్లోకాలనూ చెప్పారు. అటువంటి
అవధానాల్లోనే వారు ఆశువుగా చెప్పిన ఎన్నో పద్యాలు రసికులను మురిపించాయి. అవధానాలను వారు నల్లేరు పై బండి నడకలా నడిపించారు.
వీరి నాటకాలు మరీ ముఖ్యంగా పాండవ ఉద్యోగము పాండవ విజయము
పేరిట వ్రాసినవి పాండవోద్యోగవిజయాలనే పేరుతో తెలుగు నాట ప్రదర్శింపబడని ఊరే లేదని
ఘంటాపథమ్ముగా చెప్పవచ్చును. అదిగో ద్వారక.. బావా ఎప్పుడు వచ్చితీవు..ఆలము సేయనేనని యదార్థమె బల్కితిజుమ్మి..
జెండాపై కపిరాజు..చెల్లియె చెల్లకో తమకు సేసిన యెగ్గులు సైచిరందరున్.. చచ్చిరి
సోదరుల్సుతులు చచ్చిరి..ఇలాంటివెన్నని చెప్పను.ఈ పద్యాలలో ఏ కొన్నైనా నోటికి
రాని సాహితీ పిపాసులు ఓ యాభై ఏళ్లక్రితం వరకూ ఉండేవారు కారంటే ఏ మాత్రం అతిశయోక్తి
లేదు.
( సకృత్తుగానైనా ఈ నాడూ ఉన్నారు ).
( సకృత్తుగానైనా ఈ నాడూ ఉన్నారు ).
చెళ్లపిళ్ల వారి శిష్యులూ కవిసామ్రాట్టూ జ్ఞానపీఠ అవార్డు
గ్రహీతా ఐన శ్రీ విశ్వనాథ వారు వానలో తడియని వాడూ..తమ గురువుగారి సాహిత్యంతో
తనియని వాడూ ఉండడని అన్నారు.
( అందుకే నేను నా పూర్వకవుల స్తుతిలో-
తిరుపతి వేంకట కవులును
కురిపించిరి తెలుగువారి గుండెలనిండా
సరసపు కవితా వర్షం
మురిపెముతో తడిసి వారు ముద్దై పోవన్--అని
వ్రాసుకున్నాను.)
ఇంత చిన్న వ్యాసం లో ఆ మహానుభావుల సమగ్ర సాహితీ స్వరూపాన్ని
రేఖా మాత్రంగానైనా దర్శింప జేయడం సాధ్యం కాదు. నాబోటివాడికి ఆ శక్తీ సమర్థతా కూడా లేవు. చెళ్లపిళ్లవారి జన్మదినాన వారినోసారి తలచుకోవడానికి చేసిన చిన్నిప్రయత్నం మాత్రమే
ఇది. అయితే ముగించే ముందు ఒకటి రెండు మాటలు మాత్రం చెప్పదలచుకున్నాను.వీరిద్దరూ మహాపండితులై ఉండి
కూడా వారి పాండిత్యప్రకర్షా ప్రకటన కోసం కాక సాహిత్యాన్నిజనంలోకి తీసుకెళ్లాలన్నతపనతో రచనలు చేసిన మహానుభావులు. కవికర్ణ రసాయనం లో సంకుసాల నృసింహ కవి చెప్పిన-
“... లోకుల రసనలే
ఆకులుగా నుండునట్టియవి వో కవితల్” అనీ
“ ఆ
నీరసపుఁగావ్యశవముల
దూరమునన పరిహరింపుదురు నీతిజ్ఞుల్” అన్నదాన్నీ
బలంగా నమ్మిన వారు.కనుకనే తాటాకు కట్టలమధ్య నలిగి కృశించి పోవలసిన పద్యాన్ని
రసికుల రసనల మీద నాట్యం చేయించారు.
జన సామాన్యానికి అందుబాటులో ఉండేటట్టు వ్రాయాలనే సంకల్పంతో
అవసరమనుకున్నచోట ఔచిత్యాన్నిబట్టి అన్యదేశ్యాలైన ఆంగ్ల పదాలను వాడడానికి కూడా వారు
సంకోచించలేదు. వారు సాహితీ వ్యవసాయం ప్రారంభించిన తొలి నాళ్లలోనే చెప్పిన పద్యం చూడండి.
“ఉ. కాలముబట్టి దేశమునుగాంచి ప్రభుత్వమునెంచి దేశభా
షా లలితాంగి మాఱుటది సత్కవి సమ్మతమౌట నన్య దే
శ్యాలును దేశభాష కలవౌటను నౌచితిబట్టి మేము క
బ్బాలను వాడుచుంటి మిది పండితులేగతి
నొప్పకుందురో”
కాలంతో మారని వారు కాలగర్భాన కలసిపోక తప్పదు. కావ్యాలైనా
అంతే.తిరుపతి వేంకట కవులు ఛాందస పథాన్ని
వీడి,పండితుల గాఢపరిష్వంగంలో బందీ అయిన తెలుగు పద్యాన్ని విడిపించి పల్లెటూరి
పసుల కాపరి నోటంట కూడా పలికింపజేసారు. (They democratized the telugu
poem). అందుచేతనే-
తెలుగునాట పద్యం బ్రతికి ఉన్నన్నాళ్లూ ఈ జంటకవుల జయకేతనం ఎగురుతూనే ఉంటుంది. స్వస్తి.