12, ఆగస్టు 2012, ఆదివారం

తొలి పుట్టిన రోజు నాడే షష్ఠి పూర్తి


తొలి పుట్టిన రోజు నాడే షష్ఠి పూర్తి….
తొలి పుట్టిన రోజా? ఎవరిది? నీదా?”
నాది కాదు. నేను మరీ అంత చిన్నవాణ్ణా? ఈ పుట్టిన రోజు మా అమ్మాయిది.
ముసలి వాడిలా కనిపిస్తున్నావు. నీకు అంత చిన్నపాప ఉందా?”
అబ్బే! మా అమ్మాయిలు ముగ్గురూ నలభైలు దాటిన వారే
మరి ఇంత చిన్న ముద్దుల కూతురెవరు?”
ఇది నా గారాల కూచి. ముదిమి వయసులో నను వీడని నా గారాల పట్టి. నా మానస పుత్రిక. మేలుకుని ఉన్న సమయంలో ఎక్కువ కాలం తనతోనే గడపమంటుంది. రిటైరై ఇంట్లో కూర్చున్న వాడివి నీకు వేరే పనేమిటని ప్రశ్నిస్తుంది. ఏదైనా పనిమీద పొరుగూరికి వెళ్లినా మనసంతా దీనిమీదే ఉంటుంది. ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తానా ఎప్పుడు మళ్లా దీనిని చూస్తానా అని మనసు తపిస్తుంది. నేను రోజుకొకసారైనా పలకరించకపోతే దీనికి దిగులు. నాకూ తోచదు. దీనిని చూసిన మిత్రులు ప్రేమతో దీనిని పలకరిస్తుంటే నా మది పొంగి పోతుంది. దీని వల్లనే కదా ఇందరు మిత్రులు నాకు కూడా దొరికారని కించిత్తు గర్వం గానూ ఉంటుంది. మరి ఇదెవరో మీకిప్పటికే తెలిసి పోయి ఉంటుంది. ఇది నా మానస పుత్రిక. నా బ్లాగు. మా నాలుగో అమ్మాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ ముసలివయసు లో నాకు తోడుగా దొరికిందేమో మరి అపురూపం గానే చూసుకుంటున్నాను. అందుకే అపురూపం అనే పేరు కూడా పెట్టుకున్నాను. మరి ఇవాళ దాని పుట్టిన రోజని చెప్పేను కదా? అవును. సరిగ్గా ఏడాది క్రిందట 12th August 2011  నాడే ఇది ఈ బ్లాగ్లోకంలో కన్ను తెరిచింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఏడాది పెరిగి పెద్దదయింది. అప్పుడే దీనికి ఏడాది వయసొచ్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. బాలారిష్టాలు లేకుండానే బ్రతికి బట్ట కట్టిందని సంతోషంగానూ ఉంది.
                                        ***
అది సరేనయ్యా,తొలి పుట్టిన రోజునాడే షష్ఠి పూర్తి అన్నావు. షష్ఠి పూర్తి నీకా?”
అబ్బే నాకిప్పుడు షష్ఠి పూర్తి ఏమిటి? అది దాటి పోయి పుష్కరం కావస్తోంది
మరి ఈ మతలబేమిటి?”
అదీ చెబ్తున్నా. మొన్న 8వ తారీఖు నాడు పోస్టు చేసిన జంట కవుల జయ కేతనం ఎగురుతూనే ఉంటుంది అన్న నాపోస్టు 60 వది. బ్లాగు అంటే పోస్టుల సమాహారమే కదా? (పోస్టులు లేక పోతే బ్లాగుల ఉనికే లేదు కదా?). అందు వల్ల అరవై పోస్టులూ అవడంతో తొలి పుట్టిన రోజు నాటికే నా బ్లాగుకి షష్ఠి పూర్తి కూడా అయిందన్న మాట. డబల్ ధమాకా!
                                                      ***
బ్లాగుల్లో పోస్టులు శతాధికంగా వస్తున్నాయే- యేడాదికి అరవై పోస్టులు ఒక లెక్కా
అంటే అదీ నిజమే.కాని నా ముచ్చట నాది. నాబ్లాగులో ఎక్కువగా సాహితీ పరమైనవీ భాషకి సంబంధించిన విషయాలూ వ్రాసేను. నేను వ్రాసిన పద్యాలూ ఉన్నాయి. సరదా కబుర్లూ లేకపోలేదు,కాని అవి వేళ్లమీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉన్నాయి. ఈ సాహితీ పరమైన విషయాలనెవరు చదువుతారులే అనుకున్నాను గానీ ఈయేడాది లోనే దాదాపు 15000 వేలమంది వీటిని చూసినట్లు తెలుస్తోంది. చూసిన వారి స్పందనలు కూడా 300 వరకూ ఉన్నాయి. ఎంతో మంది ప్రత్యేకమైన అభిమానం చూపించారు. మరి కొందరు మిత్రులయారు. ఇది నేను ఊహించనిది. స్పందించిన వారికి వెంటవెంటనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను.కాని చదివినా తీరిక లేకనో మరో కారణం చేతనో స్పందించని వారు కూడా ఉంటారు కదా? వారితో సహా    బ్లాగ్మిమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడానికే ఈ పోస్టు. సెలవు.
                                         ***