రసగంగా ఝరి.... గగన గంగావతరణం
సౌజన్య మూర్తి శ్రీ విశ్వనాథ అనే క్రిందటి నా పోస్టులో శ్రీ విశ్వనాథ వారు శ్రీ శివశక్తి దత్తా గారు
రచించిన గగన గంగావతరణం కావ్యాన్ని ఎంతగా మెచ్చుకున్నారో చెబుతూ ఆ కావ్యం సాహితీ మిత్రులందరూ తప్పకుండా చదివి తీరవలసిన గ్రంథమనీ దానిని పరిచయం చేస్తాననీ చెప్పి ఉన్నాను. ముందుగా
గంగావతరణం కథ తెలియని ఈ నాటి యువత కోసం ఆ
కథ చెబుతాను.
( గంగావతరణ గాథ అంతా తెలిసిన వారు ఇది వదిలి పెట్టి గ్రంథ పరిచయం చూడ వచ్చును.)
( గంగావతరణ గాథ అంతా తెలిసిన వారు ఇది వదిలి పెట్టి గ్రంథ పరిచయం చూడ వచ్చును.)
గంగావతరణం కథ:
ఇక్ష్వాకు వంశపు రాజైన సగరమహారాజుకు ఇద్దరు భార్యలు.పెద్ద
భార్య కేశిని .రెండవ భార్య సుమతి.వీరికి సంతానం కలుగక పోవడంతో సగరుడు నూరు సంవత్సరాలు తపస్సు చేస్తాడు.
అప్పుడు భృగు మహర్షి వచ్చి వారి పూజలను
మెచ్చి వారు అడుగ కుండానే వరమిస్తాడు. ఒక భార్యకు అరువది వేల మంది పుత్రులు రెండవ
వారికి వంశకారకుడు పుడతారని చెబుతాడు. ఎవరికి ఎవరు పుడతారను ప్రశ్నకు వారి వారి
కోరికలను బట్టి కలుగుతారని చెబుతాడు. కొన్నాళ్లకు కేశినికి అసమంజసుడనే కుమారుడు
పుట్టగా,సుమతికి ఒక సొరకాయ పుడుతుంది. దానిని ఊరవతల పారవేయబోగా ఆకాశ వాణి భృగు
మహర్షి వాక్కు ఫలిస్తుందనీ ఆ సొరకాయ విత్తులను నేతికుండలలో దాచమనీ చెబుతుంది. రాజు
అలాగే చేయగా వాటినుండి అరవై వేలమంది
పుత్రులు కలుగుతారు. అసమంజసుడు అయోధ్యానగరం లోని పిల్లలనందరినీ సరయూ నదిలో పడవేసి
చంపడం వంటి దుర్మార్గపు పనులు చేస్తుంటాడు.దానిని పుర జనులందరూ ఏవగించుకోగా అతడు
గత జన్మలోయోగ భ్రష్టుడైన కారణంగా తిరిగి తన నిజ మహిమలను పొంది వారందరినీ మళ్లా
బ్రతికిస్తాడు. సగరుడు వరుసగా అశ్వమేథ
యాగాలు తలపెట్టి చేస్తుండగా అందులో ఒక
యజ్ఞాశ్వమును ఇంద్రుడు దొంగిలించి తీసుకు పోయి పాతాళంలో తపస్సు
చేసుకుంటున్న కపిల ముని ఎదుట కట్టి వేస్తాడు.యజ్ఞాశ్వమును వెతికి తీసుకు రమ్మని సగరుడు
తన అరవై వేల మంది కొడుకులనూ పంపిస్తాడు. వారు భూతలమంతా వెతికి అశ్వమెక్కడా
కనిపించక తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి
రావద్దని ఆజ్ఞాపిస్తాడు. వారు యజ్ఞాశ్వాన్ని వెతుకుకుంటూ దాని జాడ చెప్పమని కనిపించిన వారినందరనూ హింసిస్తూ
భూమి నాలుగు చెరగులా త్రవ్వి పోస్తూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ కపిలముని చెంతనే
కట్టబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్నిదొంగిలించి తెచ్చాడని తిట్టి
పోస్తూ హింసించడానికి తలపడతారు. అప్పుడు కనులు తెరచిన కపిల ముని కోపాగ్ని జ్వాలలకు
వారందరూ భస్మీ పటలమైపోతారు. ఈ విషయం నారద మునీంద్రుల వలన తెలుసుకున్న సగరుడు
అసమంజసుని కొడుకూ తన మనుమడూ అయిన అంశుమంతుని వారిని వెదికి రమ్మని పంపిస్తాడు.
అంశుమంతుడు తన పిన తండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిల బిలం చేరి అక్కడతన పిన
తండ్రుల భస్మ రాశులనూ ఆ ప్రక్కనే కపిలమునినీ ఆయన ప్రక్కనే కట్టబడి ఉన్న
యాగాశ్వాన్నీ కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ
ప్రార్థన చేస్తాడు. కపిలుడు సంతోషించి యాగాశ్వాన్ని తీసుకు పోవచ్చని అనుమతిస్తూ
ఆతని పిన తండ్రుల బూడిద ప్రోవుల మీద సురగంగ ప్రవహింపజేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని
తెలియజేస్తాడు. అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్లాక సగరుడు యాగం పూర్తి
చేస్తాడు.సగరుడూ ఆయన తరువాత అంశుమంతుడూ చాలా కాలం రాజ్యం చేస్తారు.అంశుమంతుడు తన పిన తండ్రులకు సద్గతులను
కలిగించడానికి అడవికి పోయి తపస్సు చేస్తూ
సురగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే స్వర్గస్తుడౌతాడు. అతడి వలెనే అతని
కుమారుడు దిలీపుడు కూడాప్రయత్నించి కోరిక తీరకుండానే తనువు చాలిస్తాడు.
దిలీపుని కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని
మంత్రులకప్పగించి గోకర్ణ క్షేత్రానికి
పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ ఘోరమైన తపస్సు చేస్తాడు.తపస్సు ఫలించి బ్రహ్మ
ప్రత్యక్షమై అతని కోరిక తెలుసుకుని గంగను అతనితో వెళ్లమంటాడు. మొదట సంశయించిన గంగ
బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించడానికి అంగీకరిస్తుంది. కానీ తాను భూమి మీదకు దిగినప్పుడు
భూమి కృంగి పోకుండా ఎవ్వరాపగలరని ప్రశ్నిస్తుంది. దానికి శంకరుడే తగినవాడని బ్రహ్మ
పలుకగా భగీరథుడు తిరిగి మళ్ళా అంత తపస్సూ చేసి శంకరుని మెప్పించి గంగను
భరించడానికి ఒప్పిస్తాడు.ఆ విధంగా గంగ బ్రహ్మ లోకం నుండి జాలువారుతుండగా తన
శిరోజాలతో ఆకాశమంతా కప్పి వేసిన శివుడు
గంగనంతా అందులో బంధించి ముడి వేస్తాడు.ఆ తరువాత శివుడు భగీరథునికి ఒక
బంగారు రధాన్ని ఇచ్చి అతడు ముందు దారి చూపిస్తుండగా గంగ అతని వెంట రాగలదని
ఆనతిచ్చి తన జటా జూటం నుండి ఒక పాయను తీసి గంగను విడిచి పెట్టగా అది భగీరథుని రథము
వెంట పర్వులెత్తుతూ ప్రవహిస్తుంది .గంగ భాగీరథుని వెంట భూమార్గం గుండా పాతాళ లోకం లోని కపిల బిలం ప్రవేశించి అక్కడ ఉన్న సగర కుమారుల బూది
ప్రోవుల మీదుగా ప్రవహిస్తుంది. దానితో సగర
కుమారుల ఆత్మలు స్వర్లోకాలకు చేరుకుంటాయి. భగీరథుని ప్రయత్నం సఫలీ కృతమవుతుంది.
క్లుప్తంగా గంగావతరణం కథ ఇది.
***
గగన గంగావతరణం—కావ్య
పరిచయం
గంగావతరణం కథ సగర మహారాజు, ఆయన కొడుకులు ముని మనవడితో
ముడివడి ఉంటుంది. సగర మహారాజు ఇక్ష్వాకు వంశస్థుడు.అందుచేత ఇక్ష్వాకు వంశం ఎలా
ఉద్భవించిందో నాలుగు ద్విపదలలో చెబుతూ కావ్యారంభం కావించాడు కవి.
శ్రీ దేవికి పుట్టిల్లగు క్షీరాంబుధి తరగలపై
పన్నగ పతి పాన్పు పైన పవళించెను విష్ణుమూర్తి
విష్ణు నాభి కమలమ్మున విరించి జన్మించినాడు
విరించి మానస పుత్రుడు మరీచి యను మహాత్ముడు
అతని సుతుడు కశ్యప ప్రజాపతి అతని సతి అదితి
అదితీ కశ్యపుల తనయులాదిత్యులు పన్నిద్దరు
వివస్వంతుడను ఇనునకు వైవస్వత మనువు బుట్టె
అతని తనయుడిక్ష్వాకుడయోధ్యానగరాధీశుడు
ఈ ఇక్ష్వాకు
వంశస్థుడైన సగరునికి పుట్టిన అరవై వేలమంది పుత్రులూ ఎటువంటి వారో ఆరు ద్విపదలలో
వర్ణిస్తాడు కవి.మచ్చుకి రెండు ద్విపదలు చూడండి:
గగన వాణి చెప్పినట్లె సగరుడు కావించి కనెన్
అసమాన బలోధ్ధతులన్ అరువది వేవుర సుతులన్
ఉద్దండుల దుర్దండుల దోర్దండ బలోద్దండుల
దుర్ధర్షుల దుర్భేద్యుల దుర్నిరీక్ష్య తేజస్కుల
దుర్వారుల దుష్కర్ముల దుర్వ్యాపారుల దూష్యుల
దుర్మార్గుల దురాగతుల దురాచార పరాయణుల
సగరుని పంపున యజ్ఞాశ్వాన్ని వెతకడానికి సగరకుమారులు
వెళ్లడాన్ని, అశ్వం కానరాక వారు చేసిన దుష్కృత్యాలనూ 28 ద్విపదలలో రసవత్తరంగా
వర్ణించాడు కవి. కొన్ని మచ్చు చూడండి:
యాగాశ్వం
కోసం ఎంత వెదకినా
“ కీకారణ్యమ్ములందు కీకటము లభించలేదు
ఘోరారణ్యముల నెందు ఘోటకమగుపించలేదు
కోటల పేటల బాటల తోటల ఘోటమ్ము లేదు
చెరువుల దొరువుల తెరువుల గరువులనెట ఖరువు లేదు
కుహరములన్ విహారముల జుహురాణము జాడ లేదు
కందకముల కందరముల కంఖాణము గుర్తు లేదు”
అప్పుడు వారు--
“ గ్రామస్థుల సీమస్థుల క్రమ్మర వాన
ప్రస్థుల
మార్గస్థుల మర్దించిరి మా జన్నపు మా వేదని
పిశాచముల నిశాచరుల విషోరగుల వియచ్చరుల
గరుత్మతుల గర్జించిరి మరుద్రథము మాటేమని
దిక్కులెల్ల చీరాడిరి దీవులెల్ల పారాడిరి
ఎక్కడ గుఱ్ఱము గానక కుతలమెల్ల కోరాడిరి”
ఆఖరుకు వారు పాతాళానికి వచ్చి కపిల ముని చెంత కట్టబడి ఉన్న
యాగాశ్వాన్ని చూచి --
“ తంతు
హుమాయిని దెచ్చిన మంతర మాయావి వీడె
మన తేజిని మఖవాజిని మరగించిన ముచ్చు వీడె” -- అంటూ కపిలుని తూలనాడడం, కపిలుని కోపానల జ్వాలలలో వారు భస్మమై పోవడం చక్కగా
వర్ణిస్తాడు కవి.
ఆ తరువాత బ్రహ్మను గూర్చి భగీరథుడు చేసిన భీకర తపస్సును 12 ద్విపదలలో వర్ణించాడు కవి. ఓ
రెండు ద్విపదలు చూడండి:
“ జడి వానల కడల లేదు వడగండ్లకు సడల లేదు
ప్రళయకాల పర్జన్య ప్రబల ఘోష కడర లేదు
కుంభీకర వినిర్ముక్త కుంభవృష్టి కరగ లేదు
జంభారి కర నిర్ముక్త దంభోళుల కెరగ లేదు.”
భగీరథునితో భూమి మీదకు వెళ్ళడానికి ఇష్ట పడని గంగకు బ్రహ్మ
నచ్చ చెప్పినప్పటి పలుకులు చూడండి:
“ దివి నుండి భువికి చన్నను దివి నుందువు
భువి నుందువు
భూతలమును వీడి మరి రసాతలమున కేగిననూ
ఆతలముల రెంటనొకే రీతిను ప్రవహించెదు
త్రిభువనముల పయనించెదు
త్రిపథగవై విలసిలెదవు
నర కోటుల దురితవ్రజ పరిమార్జన నీ ధర్మం
పరమ పతివ్రతల యశస్మరణములే నీకు ధనం ”
భగీరథుని తపమునకు మెచ్చి గంగను భరించడానికి సిధ్దమైన శివుడు తన జటలను నింగినిండా పరచిన తీరును విపులముగా కవి వర్ణించిన తీరు అమోఘము. మచ్చు
చూడండి:
“ హరుడు మెచ్చి వచ్చినాడు ముని
కభయమ్మిచ్చినాడు
తన జటాకలాపమున గగనమంతా గప్పినాడు
చదలంతా తన జడలే నభమంతా తన నెరులే
అంతరిక్షమంతా తనకుంతలముల మయమే
శక్ర శమన వరుణ ధనద దిశలన్ తన కేశములే
అగ్ని నిఋతి వాయు రుద్ర విదిశల్ తత్పాశముల ”
తనను భరించడానికి సిధ్ధ పడిన శివుని జూసి గంగ “ఇతడేనటె స్మర
హరుడు? ఇతడేనటె పురహరుండు?ఇతడేనటె హిమవన్నగనందినీ మనోహరుండు? ” అనుకున్నదట. గంగను చూసిన శివుడు “స్ఫురత్ శుభ్ర
సుందర తర దరస్మేర ముఖము శరద్యామినీ రాకా
చంద్రకోటి సఖము ” అనుకున్నాడట.
వియద్గంగ దూకుడు ధాటికి కులగిరులే కదిలాయట. కానీ ధృతి చెడని హరుని తీరు కవి వర్ణించిన విధము
చూడండి;
“ దిక్కులు గడగడ వడకెను దిక్కరులున్
ఘూర్ణిల్లెను
చుక్కలు జలజల రాలెను శివుడు చెక్కు చెదర లేదు
శతకోటి తటిల్లతలన్ దశదిశలన్ పెఠిల్లుమనెన్
ధరణి గుండె ఝల్లుమనెన్ హరుడు రెప్పలార్చలేదు
శతసహస్ర పర్జన్యము లతితీవ్రత గర్జించెను
గతి తప్పెను గ్రహ కోటులు ధృతి ధూర్జటి వీడ లేదు
కులనగ పంక్తులు సడలెను కువలయమండల మడలెను
కూర్మరాజు సర్దుకొనె కపర్ది కాలు కదుప లేదు.”
ఆ విధంగా నిల్చున్న శివుడు “
సత్యలోక వీధి వీడి స్వర్గసీమ నధిగమించి
మహర్వాటి పరిధి మీటి రోదసీకుహరము దాటి ” ఉరికే గంగను తన జటాజూటంలో బంధిస్తే ఒక్క చుక్క
గంగ కూడా నేలను రాల లేదట.
“శివజటా కలాపభరం చెలరేగెను మింటి మీద
లవలేశం సలిలకణం
పడనీయదు మంటిమీద”
గంగ మొత్తం శివుని జటాజూటంలో చిక్కుకుని కనిపించకుండా పోయిందట-.
“తుంగత్ గురు భంగవారి పెంగురులన్ మ్రింగువడెను
రంగత్ శృంగార లహరి
ముంగురులన్ భంగ పడెను
కురులన్నియు వడి ముచ్చట ముడి చుట్టుక పోయె
కుంతముల వెలి నెచ్చట గంగదోపదాయె
ఏదేదీ దివిషద్విష? ఏ దనిమిష
కూలంకష?
ఏది త్రివిష్టపవాహిని? ఏది
వియత్తటిని ?” అని అందరూ వెతుక్కుంటారు.
ఆతరువాత గంగ పరమేశ్వరునితో “నేను
నీదాననే” అని చెబుతూ
భగీరథునికోసం తనను విడువమని వేడుకునే తీరు చూడండి:
“ పరమ పురుష నీ దానను పరమేశ్వర నీ చానను
బంధించగ దగునా నను మన్నించగ దగదా నను
పురుషోత్తమ! నీ నారిని
వృషవాహన నీ వారిని
దయగనుమీ జడదారిని నను విడు మీతని దారి ”
శివుని ఆనతిని భగీరథుని రధము వెనుక ఉరుకులిడే గంగను చూడండి:
“ క్రిందరయక మీదరయక ముందర అదుగదుగో తేరు
తొందర తొందర నడకల వెను వెన్కనే వేల్పుటేరు
ముందర తన ప్రియవత్సము నందిని క్రేళ్లురుకుచుండ
వెనువెంటనె తరలి వచ్చు వైహాయస సురభి వోలె ”
ఎంత సుందరమైన ఉపమానం
!
“మునుముంగట పరుగులెత్తి ముని అరదం పోతున్నది
వెనువెంటనే గంగ వరద ముంచెత్తుక వస్తున్న”దట.
ఇలా ఇలకేతెంచిన గంగను చూసిన జనం ఏం చేశారట?
“ సర్వాధివ్యాధి హరం స్వర్వేణి పవిత్ర
జలం
అనుచున్ అంజలులబట్టి ఆత్రమ్మున త్రావువారు
సర్వ పాప హారిణి ఇది సకలాఘ విదారిణి ఇది
అని పశ్చాత్తాప వహ్నిసమన నిమగ్ను లగువారు
పావనమని విష్ణుమూర్తి పాదోదక మీ వనమని
కేవల మతిభక్తిని శిరసావహించు మరికొందరు
శ్రీకరమని పరమపదవశీకర మీ శీకరమని
కొంకక తద్వేలోధ్ధతి క్రుంకులిడుదు రింకొందరు”
ఆ పిదప గంగ
సగరకుమారుల భస్మరాశులపై ప్రవహింపగా వారు “ సురనిమ్నగ
నీరువారి సగరేయుల గీటు మారి చిరతర శాపమ్ము దీరి నడచిరి స్వర్గమ్ము దారి” అంటాడు
కవి.
గంగను తీసుక వచ్చి తన తాతలకు సద్గతులను కలిగించిన భగీరథుని
చూసి కపిలుడు--
“ కమలాసను నొప్పించితి వలికాక్షుని
మెప్పించితి
వమరారామ తరంగిణి నిలకిటకున్ రప్పించితి
నీ యత్నము నిరుపమ్ము నీ ప్రయత్నమసమానము
నీ జతనము సాటి లేదు నూ పూనిక పరుల గాదు
అసమాన ప్రయత్నమునకు భగీరథ ప్రయత్నమనే
నుడి ఇటుపై వ్యాప్తి చెందు నీ చరితము ఖ్యాతినొందు” అని మెచ్చుకుంటాడు.
భగీ రథుడు “ స్వర్గంగను
మున్కలనిడి స్వపితరులకు జలములనిడి
స్వర్ణరథమునెక్కి
సాగి” స్వస్థలమున కేగగా
“ గంగ మాత్రమీనాటికి మంగళ వరదాయనియై
పొంగారుచు భూతలమున బంగారము పండించును ” అంటూ
కావ్యం ముగిస్తాడు కవి.
****
ఈ గంగావతరణ కావ్యాన్ని
త్రిశ్రగతి ద్విపదులలో చెప్పబూనుకోవడం లోనే కవి ప్రతిభ మనకు గోచరిస్తుంది. ఇది మరో ఛందస్సులో
అయితే ఇంతగా రాణించేది కాదేమోనని నాకనిపిస్తుంది. ఆయా చోట్ల
భావ వ్యక్తీకరణకి అవసరమైన ప్రౌఢ పద ప్రయోగాలున్నా, దీర్ఘ సమాసాలేమీ లేక
పోవడం వల్లా, అన్వయ క్లిష్టత లేక పోవడం వల్లా భావం సులభ గ్రాహ్యమే. నేను చెప్పినవే
కాకుండా ఈ కావ్యంలో ఇంకా గంగ విష్ణు పాదోదకం ఎలాఅయిందీ, అగస్త్యుడు సముద్రాన్నిఏ
విధంగా త్రాగి వేసిందీ...వంటి వెన్నో విషయాలున్నాయి . కానీ గ్రంథ పరిచయంలో కావ్యం లోని రసవంతము లైన బాగాలన్నిటినీ
ఉటంకించడం సాధ్యం కాదు కదా? రస ప్లావితమైన ఈ కావ్యాన్ని మీకు మీరే పూర్తిగా
చదువుకుని ఆనందించండి.( అందిరికీ లభ్యం
కాదేమో నని కొంతైనా రుచి చూడగలరని కొన్ని ద్విపదులను మచ్చు చూపించాను ). కవి శ్రీ
శివశక్తి దత్తా గారికి అంజలి ఘటిస్తున్నాను. మరో విషయం.ఈ కవి గారు ప్రఖ్యాత సినీ
సంగీత దర్శకులు కీరవాణి తండ్రిగారని చెప్పాను కదా?సినీ సంగీత
దర్శకురాలు శ్రీ లతకు వీరు పెదనాన్నగారవుతారు. ఆమె ఈ గగన గంగావతరణాన్ని ఎప్పటికైనా ప్రజలకు తన
స్వరకల్పనలో కాసెట్ రూపంలో అందించాలనుకుంటున్నానని తెలిపారు. ఆ రసగంగకు ఆహ్వానం
పలుకుదాం.సెలవు.