17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఓ తాత గారి కథ.....(మన కథేనర్రోయ్..)


                             ఓ తాత గారి కథ.....(మన కథేనర్రోయ్..)

నదీమూలం ఋషి మూలం తెలియ రాదన్నారు.ఏం?ఎందుకని?నన్నడగండి చెబుతాను.నేనెన్నోసార్లు రాజమండ్రి దగ్గర అఖండ గోదావరిని చూసి మైమరచి పోయాను.రెండు మైళ్ల వెడల్పున నిండుగా పారుతున్నఆ సుజలస్రవంతి ఎన్నోవేల ఎకరాల భూములకు నీరందిస్తూ ఆంధ్ర దేశాన్నిఅన్నపూర్ణగా మారుస్తోంది కదా అన్నతలంపు కలుగగానే ఆనదిని మన వారు గోదావరీమాత అని ఎందుకు పిలుస్తారో నాణేలు వేసి భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటారో అర్థమై పులకరించిన మనస్సులోనే నమస్కరించుకున్నాను..అదే నేను ఓసారి నాసికా త్రయంబకం వెళ్లడం తటస్థించింది.త్రయంబకం వద్ద గోదావరి పుట్టిన కొండ ప్రాంతానికి వెళ్లినా ఆ కొండమీదకి పోయి గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూసే సమయం లేక పోయింది. అక్కడే కిందనున్న దేవాలయం లో పుష్కరిణి ఒకటుంది. దాని గట్టుగా ఉన్నగోడలో చిన్నశయనిస్తున్న విష్ణు మూర్తి విగ్రహం ఉంది.ఆ మూర్తి పాదాల దగ్గర కొద్ది కొద్దిగా నీరు ఊరుతూ ఉంది.అదే గోదావరి అని అక్కడి పూజారులు చెప్పారు.తరువాత నాసికా క్షేత్రంలో గోదావరిని చూసేను. చిన్నపిల్లకాలువ లాగాను అత్యంత మురికి గానూ ఉంది.ఎవరికైనా అక్కడి గోదావరిని చూస్తే ఓస్... ఇదా గోదావరి అని ఏహ్య భావం కలుగక మానదు. ఇదిగో ఇటువంటి భావాలు మనకి కలుగకుండా ఆ నదీమతల్లి మీద మన గౌరవభావం  ఇసుమంతైనా సడలకుండా అలాగే ఉండాలనే నదీ మూలం వెతుక్కో వద్దన్నారు. అలాగే మన మహా ఋషులుకూడా.వారు మహాజ్ఞాన సంపన్నులై సమాజ శ్రేయస్సు ధ్యేయంగా జీవించిన వారు. వారిలో కొందరి పుట్టుక జనసామాన్యం ఊహించు కునే రీతిలో గొప్పగా ఉండక పోవచ్చు. వారందరూ అగ్ర వర్ణసంజాతులు కారు. అందు వల్ల వారికొచ్చిన నష్టమేమీ లేదు. కాక పోతే ఆ కారణంగా వారికి సామాన్య జనులు ఇవ్వాల్సిన గౌరవం లో లోపం జరుగ వచ్చు.ఇందు చేతనే ఋషుల మూలాలు వెతికే ప్రయత్నం కూడా చేయ వద్దన్నారు. కానీ  ఎవరికి వారు తమ తమ మూలాల్నితెలుసు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తాము ఎక్కడ పుట్టిందీ ఎలా పెరిగిందీ తెలుసుకుని జీవిత పర్యంతం దానిని గుర్తుంచుకోవడం ప్రతి మనిషికీ కనీస ధర్మం. అదే కాక ఎవరికైనా సరే తాను పుట్టిన ప్రదేశాన్ని ఒకసారైనా చూడాలనే కుతూహలం అత్యంత సహజమైనది కదా? ఇదిగో సరిగ్గా ఇలా తమ మూలాలను తెలుసుకోవాలన్న కుతూహలమే అలక్స్ హైలీ అన్న అమెరికన్ నీగ్రో రచయితకు కలిగి, ఆయన చేత పరిశోధన చేయించి తమకు ఏడు తరాలముందు తమ తాతను ఆఫ్రికానుంచి బలవంతంగా బానిసగా అమెరికాకు ఎత్తుకు వచ్చిన సంగతిని అద్భుతమైన చారిత్రాత్మక నవల (The Roots – తెలుగు లో ఏడు తరాలు) గా  వ్రాయించి ప్రపంచ నవలా సాహిత్యంలో మణి దీపంలా వెలిగేలా చేసింది.

 మన మెవ్వరం పుట్టక పూర్వమే, సరిగ్గా ఇలాంటి కుతూహలమే, మన తాతగారికి  కూడా కలిగింది. మన అంటున్నావేమిటయ్యా మనకందరికీ ఒకడే తాతా? అని ఆశ్చర్య పోకండి.అవును. మనందరికీ ఒకడే తాత. ఆయన మన ప్ర,, ప్ర,,ప్ర..( ఎన్ని ప్ర లు వాడాలో నాకు తెలీదు.అంచేత ప్ర to the power of n అని వేసుకోండి) ప్రపితామహుడైన బ్రహ్మ దేవుడు.(తమాషా ఏమిటంటే తాత అంటే కూడా బ్రహ్మ దేవుడే). ఆయనకి తనకి మూలం ఎక్కడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఆ కథ చెబుతాను వినండి.
                                              *****

      
సృష్ట్యాదికి పూర్వం బ్రహ్మదేవుడు కనులు తెరిచే సరికి తాను పద్మాసనస్థుడై ఉండడం, తన చుట్టూ అనంత వారాశి గోచరిస్తాయి. తానక్కడికి ఎలా వచ్చేడో తెలియదు. ఏం పని చెయ్యాలో తెలీదు. ఎలా చెయ్యాలో తెలీదు. ఎవర్నడగాలో తెలీదు. అడగడానిక్కూడా ఎక్కడా ఒక్క పిట్ట మనిషైనా లేడు.( ఎక్కడినుంచి వస్తాడు సృష్టే ప్రారంభం కాకపోతే? తాతాజీ కనుక తట్టుకున్నాడు కానీ ఎవరికైనా అది పిచ్చెక్కించే సందర్భం కదా?) సరే, తాను పద్మం లోంచి వచ్చాడు కనుక దాని మూలం కనుక్కుంటే సరిపోతుందని ఆ తామర తూడు మొదలెక్కడుందోనని వెతుక్కుంటూ వెళ్తాడు. యోజనాలు పయనించినా దాన్ని కనుక్కో లేక విసిగి వేసారి పోయి మళ్లీ వచ్చి తన స్థానంలో కూర్చుంటాడు. ఏం చేయాలో తోచదు. ఆ సమయంలో ఎక్కడి నుండో రెండు నీటి చుక్కలు జలరాశి మీద పడి తప.. తప.. మని శబ్దం  చేస్తాయి. అది విన్న బ్రహ్మ గారికి ఎవరో తనను తపస్ చేయమని ఉద్బోధించినట్లు తోస్తుంది. వెంటనే తపస్సు ప్రారంభించి వెయ్యి దివ్య సంవత్సరాలు ( అంటే ఎంతని నన్నడక్కండి..ఆ లెక్కలు చాలా కష్టం. .శత కోటి కోట్ల సంవత్స రాలలో ఉంటుందని తెలుసుకుంటే మన కథకి చాలు ) తపస్సు  చేసాడు. అప్పుడు ఆయన ముందర అనంత మైన దివ్య తేజస్సుతో శ్రీ మన్నారాయణ మూర్తి దర్శన మిస్తాడు. ఆ దివ్య మంగళ మూర్తి ఊర్ధ్వ భాగం ఏడు లోకాలు అధో భాగం ఏడు లోకాలుగా పదునాల్గు భువనాలతో విరాజిల్లుతూ ఉంటుంది. భూలోకం కటి ప్రదేశం కాగా ఆ పైన భువర్, సువర్, మహర్, జన తపో, సత్యలోకాలు, కటి ప్రదేశం దిగువున అతల,వితల,సుతల తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు ఉన్నాయి.,.ఆ మూర్తి నాభి లోనుంచి ఉద్భవించిన పద్మమే తన ఆసనంగా బ్రహ్మకు కనిపిస్తుంది. తనకు మూల మెవరో బ్రహ్మకు అర్థమౌతుంది. ఆ తర్వాత శ్రీ మన్నారాయణుడు బ్రహ్మకు సృష్టి ఎలా చేయాలో తెలిపి దానికి కావలసిన శక్తి యుక్తులను ఆయనకు ప్రసాదిస్తాడు.
                                            *****
ఈ విషయాలన్నీ,తానే సృష్టికి మూలకర్త కదా తానెవ్వరిని కొలుస్తాడని అడిగిన తన కుమారుడు నారద మహర్షికి బ్రహ్మ సవివరంగా చెబుతాడు. ఆ నారదుని ద్వారా వ్యాసునికీ తద్వారా లోకానికంతకూ వెల్లడయ్యాయి.
                                                ****
 మన బ్లాగ్ మిత్రుడు శ్రీ రాజ్ కుమార్ గారు అడిగి ఉండక పోతే నేనీ పోస్టు వ్రాసి ఉండే వాణ్ణి కాను. నా చేత ఇది వ్రాయించిన శ్రీ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సెలవు. 
                                                  ***