ఓ పదిహేను పదహారు సంవత్సరాలకు
పూర్వం నేను రిటైరు కాకముందు ఉద్యోగ రీత్యా కృష్ణా జిల్లా లోని నూజివీడు వెళ్లాను.
అక్కడ రోడ్లు భవనాలు శాఖ ఇంజనీరు వారి కార్యాలయంలో పద్దులు తనిఖీ చేస్తుండగా
వారు నిర్మాణం పూర్తిగావించిన ఒక వంతెన
ఖర్చుల వివరాలు చూస్తుండగా ఆ ఇంజనీరు గారు “మీరో
సారి ఆ వంతెన చూడాలి బాగుంటుంది” అని అన్నారు.ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా నేను
ఆ వంతెనను చూడాల్సి లేకపోయినా, వారి కోరిక మేరకు ఒక ఆదివారం వారు తీసుకు వెళ్లగా
దానిని చూడడానికి వెళ్లాను. ఆ వంతెన ఇటు కృష్ణా జిల్లాను అటు ఖమ్మం జిల్లానూ
కలుపుతోంది. ఇప్పుడు సరిగా గుర్తు లేదు కాని ఆ నది పేరు వైరా అనుకుంటాను. ఇటువైపు
ఆ వంతెన మొదలయ్యే ఊరు కృష్ణా జిల్లాలోని
ఒక చాలా చిన్నగ్రామం. ఇప్పుడది పెరిగిందో ఏమో మరి? అప్పుడా చిన్నగ్రామంలో ఒక చిన్న దేవాలయం. దానిలో
కొలువై ఉన్నాడు శిఖి పింఛమౌళి. ఆ చిన్ని కృష్ణుని దర్శించుకుని తిరిగి వస్తూ దారిలో మరో చోట వెంకటేశ్వరుని
కూడా సేవించుకుని తిరిగి మా కార్యస్థానాన్ని చేరుకున్నాను. మళ్లీ
ఇన్నేళ్ల తర్వాత ఆ ఊరికి సంబంధించిన విశేషం ఒకటి నా చెవిన బడి అప్పటి నా
జ్ఞాపకాల్ని తట్టి లేపింది. ఆ విశేషం
కొంచెం విన్న వించుకుంటాను.
.....
దాదాపు ఇప్పటికి నలభై ఏళ్ళక్రితం ఆ ఊళ్లో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాథ్యాయులు
ఉండేవారు.చాలీ చాలని సంపాదనే అయినా గుట్టుగా కాలక్షేపం చేసుకుంటూ
నెట్టుకొచ్చేవారు. ఆయన తన పిల్లలను ఒళ్లో
కూర్చో పెట్టుకుని అమర కోశం వురాణనామ
సంగ్రహం వంటి గ్రంథాలనూ అనేక పద్యాలనూ వారిచేత వల్లె వేయించేవారు. ఆ విధంగా వారికి
అక్షరాలు నేర్వకమునుపే అనేకమైన పద్యాలూ అవీ కంఠస్థమయేవి.వారి పిల్లలలో ఒక అబ్బాయి
మరీ చురుకైన వాడు.అతడిని వారింటికి వచ్చిన మేనమామలూ ఇతర బంధువులూ “ఏదిరా అబ్బాయి ఒక రూపాయి ఇస్తాం పద్యం చదువరా” అంటే గళగ్రాహిగా చదివేసేవాడు. వారు మురిసిపోతూ
మరిన్ని పద్యాలు చదివించుకుని డబ్బులయిపోతూ ఉంటే అర్థ రూపాయి, పావలా ఇస్తా నన్నా ఆ
అబ్బాయి వారికి కావలసినన్ని పద్యాలు అప్పజెప్పే వాడు. అసలా ఊరిలోనే పిల్లలందరికీ
అనేకమైన పద్యాలు కంఠతా వచ్చేవట.తండ్రి గొప్ప పండితుడైనా కుటుంబభారం వహించడానికి
పడే కష్టాలు ఆ బుడుతడి మనస్సుకును కష్టం
కలిగించి అతడిలో ఎలాగైనా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలనే పట్టుదలని
పెంచాయి.ఆ విధంగానే అతడు కష్టపడి చదివి పెద్దయ్యాక I.A.S. Officer అయాడు.అయితే
ఇలా పేద కుటుంబంనుంచి వచ్చి పెద్ద పెద్ద పదవులనలంకరించిన వారు కొందరైనా లేకపోలేదు కనుక మరీ ఆశ్చర్యపడిపోవలసిన
అవసరం లేదు. కానీ ఈ బుడుతడి విషయం వేరు. కసితో చదివి I.A.S
సాధించినా తనకు
ప్రాణ ప్రదమైన సాహిత్యోపాసన మాన లేదు. చిన్న నాడే మొదలు పెట్టి పెద్దయ్యే సరికి
దాదాపు వెయ్యికి పైగా అవధానాలు చేసాడు. 18 కవితాసంకలనాలను ప్రచురించాడు. . పాతిక వేలకు పైగా
పద్యాలు వ్రాసేడు. అవధాన విద్య దాని
పుట్టు పూర్వోత్తరాలు.. అనే సిధ్దాంత గ్రంథం వ్రాసి డాక్టరేటు సంపాదించాడు. ఈయన
ప్రస్తుతం మన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు గా వ్యవహరిస్తున్నారు. ఇంత చెప్పేక
మీకే అర్థమై పోయి ఉంటుంది. ఈ శేముషీ ఖని పేరు రాళ్లబండి కవితా ప్రసాద్. ఈ మధ్యనే
జాలంలో భక్తి టీవీలో వచ్చిందని చెప్పి ఆయనతో ఇంటర్వ్యూ ఒకటి పెట్టారు.అందులో ఆయన
అనేకమైన విషయాలు చెప్పారు. తన చిన్నప్పటి ముచ్చట ఇలా చెప్పినదే. తనకే కాదు తమ
ఊళ్లో పిల్లలందరికీ చాలా పద్యాలు కంఠతా వచ్చి ఉండేవని చెప్పారు.అందుకే ఆ వూళ్లో
పద్యం పురివిప్పి నాట్యమాడిందన్నాను. ఇంతకీ ఆ ఊరి పేరు చెప్పనే లేదు కదూ? ఆ ఊరి
పేరు నెమలి. నేను వంతెన చూసే మిషతో బాల
శిఖి పింఛమౌళిని దర్శిం చుకు వచ్చిన ఊరూ అదే..నెమలి.
......
కష్టపడి I.A.S
సాధించిన వారూ
ఉన్నారు. అలాగే శతావధానాలూ, సహస్రావధానాలూ చేసిన ధీ మణులూ ఉన్నారు. అయితే
రెండిటినీ సాధించినా తనకు I.A.S. ఆఫీసరుగా ఉండడం కంటె ఉపాధ్యాయునిగా ఉండడమే ఇష్టమని చెప్పిన ఆయనను
అబినందిస్తున్నాను. ఈ కాలంలో తెలుగు సాహిత్యం చదువుకుంటే తమ పిల్లలు I.A.S. లాంటివి
సాధించ లేరేమోననే భయంతో పిల్లలను తెలుగు
సాహిత్యానికి దూరం చేసే తల్లదండ్రులకు కనువిప్పు కావాలన్నదే ఈ వ్యాసోద్దేశం.
....
సెలవు.
4.03.2013