11, మార్చి 2013, సోమవారం

తనపేరు మర్చి పోయిన ఈగ కథ...


                                  .
మీరెప్పుడైనా విన్నారో లేదో కానీ, నా చిన్నప్పుడు మా పెద్దలు చెప్పగా విన్నానీ కధ.
అనగనగా ఒక ఊళ్లో ఉండే ఒక ఈగ ఇల్లలుకుతూ అలుకుతూ ఉండగా తన పేరు మర్చిపోయిందట.ఈగేఁవిటి? ఇల్లలకడఁవేఁవిటి? అని అప్పుడు నేనడగలేదనుకోండి. అడిగినా వాళ్లు చెప్పేవారు కాదు. వెధవా కథకు కాళ్లేఁవిటి ముంతకు చెవులేఁవిటి అంటూ ఎదురు దాడికి దిగే వారు. కథకు కాళ్లు లేకపోతే  ముందుకెలా వెళ్తుందండీ చివరకు కంచికెలా వెళ్తుందండీ అయినా ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తే కథ చెప్పడం మానేస్తారని నోరుమూసుకుని చెవులు చేటలు చేసుకుని వినేవాణ్ణి. అలా ఇల్లలుకుతూ తన పేరు మరచిపోయిన ఈగకు ఎంత తల బద్దలు కొట్టుకున్నా తన పేరు గుర్తుకు రాలేదట.అయినా తలలు బద్దలు కొట్టుకుంటే ఏవైనా గుర్తుకు వస్తాయటండీ?  అలా వస్తాయంటే నేనెన్నిసార్లు తల బద్దలు కొట్టుకోవలసి వచ్చేదో. మరపు మానవ సహజం కదా అని ఊరుకుంటాను. మరపు మానవ సహజమే కాదు ఈగలకు కూడా సహజమే అన్నమాట.అయినా పెళ్లాం పుట్టినరోజో, ఎవరికో తీర్చాల్సిన అప్పో అయితే హాయిగా మరచిపోయి ఊరుకోగలం కాని మన పేరే మనకి గుర్తు లేకపోతే ఎలా చావడం. అందుకని ఆ ఈగ అయ్యలారా తల్లులారా అన్నలారా అక్కలారా నా పేరేమిటని రోదిస్తూ కనిపించిన వాళ్లందరినీ అడిగిందట. దాని భాష అర్థంకాకో, ఇంత చిన్న ప్రాణి అడిగితే మనం జవాబు చెప్పాలా అనే అహంకారంతోనో మనషులెవ్వరూ దానికి సమాధానం ఇవ్వలేదట. ఆ తర్వాత కనిపించిన జంతువులనన్నిటినీ—కుక్కనీ పిల్లినీ ఆవునీ అన్నిటినీ అడిగందట. ఏ వీ దానికి జవాబు చెప్పలేదు.ఆఖరుగా దానికి నిద్ర పోతున్న ఒక గుఱ్ఱం కనిపించిందట. చివరి ప్రయత్నంగా దానినీ అడిగింది. జవాబు లేదట. దానికి సరిగా వినపించలేదేమో అని దాని చెవిలో దూరి రొద చేసి మరీ అడిగిందట. ఈ ఈగ చెవిలో చేసిన రొదకి  గుఱ్ఱం ఒక్కసారిగా నిద్ర లేచి చెవులు విదిలిస్తూ  హిఁహిఁహిఁ.ఈఁ ఈఁ.. ఈఁ.. అంటూగట్టిగా సకిలించిందట. అది విన్న ఈగకు వెంటనే తన పేరు ఈ..గ. . అని గుర్తుకు వచ్చి మనసు తేలికై ఈల వేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ చక్కగా ఎగిరి పోయిందట. ఈగ లెక్కడైనా ఈల వేస్తాయా? డాన్స్ చేస్తాయా? అని నన్నడగకండి. ఈగలు ఈలలూ వేస్తాయి డాన్సులూ చేస్తాయి లవ్వూ ఆడతాయి. విలన్ల మీద ప్రతీకారాలూ తీర్చుకుంటాయి. కావాలంటే రాజమౌళినడగండి.
                                                                 ****
ఇంతవరకూ మా పెద్దలు చెప్పిన కథ. మిగిలింది నేను చెబుతాను వినండి.
ఈ ఈగ అసలు పేరు ఈజ్ఞ్ గ. ఈజ్ఞ్.జ్ఞ్..జ్ఞ్.. అంటూశబ్దం చేస్తుంది కనుక దానిని ఈజ్ఞ్గ అన్నారు. అదే ఈంగ అయింది.ఇప్పటికీ దక్షిణ దేశంలో ఉన్న మన తెలుగు వారు ఈంగ అనే పిలుస్తారు.మథ్యలో ఉండే పూర్ణానుస్వారాన్ని తేలిగ్గా పలకడమో  అసలు పలకక పోవడమో జరుగుతూ అది  నేటికి ఈగ అయింది.ఒకప్పుడు దానిని ఈంగ అని పలికే వారమని గుర్తుగా ఈఁగ అంటూ మధ్యలో అరసున్నాతో తెలియజేస్తారు.ఈ అరసున్నలు నా చిన్నప్పుడు ఉండేవి. కాని ఇప్పుడు ఎవరూ వ్రాయడంలేదు కనుక ఈంగ అనే దాని పూర్వపు నామం ఇప్పటివారికి తెలీదు.ఇలాగే చిన్నగా ఉండి ఎగురుతూ ఉండే వాటిని మన వాళ్లు ఈగలనే అనేవారు.జోరుగా రొదచేస్తూ తిరిగేది జోరీగ.వాటిల్లో కాస్త బొద్దుగా ఉండేది బొద్దు + ఈంగ = బొద్దీంగ ..బొద్దీంగ..బొద్దింక అయ్యింది.. బొద్దింకలో మనకు నిండు సున్నా నేటికీ కనిపిస్తూ ఉంటే, ఈగలో అది మాయమయింది. ఇలా వచ్చిన సున్నలూ అరసున్నలూ అవి మాయమై పోవడాల గురించి మరోసారి చెప్పుకుందాం. సెలవా మరి?