7, జూన్ 2013, శుక్రవారం

ఏమిటీ జీవిత పరమార్థం?

ఏమిటి జీవిత పరమార్థం....?
ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ మరి యాలజాతికిన్ తిన్నది పుష్టి..”
 తిరుపతి వేంకట కవుల ఈ పద్యం అందరికీ సుపరిచితమే. గోవుల వంటి పశుజాతికి కడుపు నిండితే చాలు అవి సంతృప్తి పడతాయి. మళ్ళా కడుపు నకనకలాడే వరకూ వాటికి ఏ చింతా ఉండదు.హాయిగా బ్రతికేస్తాయి. మరి అన్ని జన్మలలోనూ ఉత్కృష్టమైనది మా మానవ జన్మే అని విర్రవీగే మానవుడు మాత్రం తన తిండికే కాదు తానూ తన కుటుంబమూ జీవితాతం సుఖంగా కాలం గడపడానికి కావలసినంత ఉన్నా కూడా తనివి తీరక ఇంకా ఇంకా సంపాదిచాలనే కోరికతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు. ఎన్నడూ తృప్త్యాస్మి అనడు. ఉన్నంతలో సంతృప్తి చెందుతూ మనశ్శాంతితో హాయిగా గడిపేవారు చాలా అరుదు. నప్రతిగృహీత్వం-అంటే ఊరికే ఎవ్వరేమిచ్చినా అదెంత తమకు అవసరమైనదైనా స్వీకరించకుండా ఉండడం ఒక వ్రతంగా పాటిస్తూ జీవితాల్ని గడిపిన కొద్ది మంది గురించి ఇంతకు ముందు నా పోస్టులలో ప్రస్తావించి ఉన్నాను. తాము జీవిస్తున్న పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, ఎన్నో  ప్రలోభాలను అథిగమించి,  అనాయాచితంగా వస్తున్న సిరులను తృణ ప్రాయంగా భావించి వద్దనగలగడం సామాన్యమైన విషయంకాదు. అయితే జీవితంలో ఐహిక సుఖాలకంటే విలువలకోసం జీవించ దలచుకున్న స్థిరచిత్తులకు మాత్రం ఇది  అసాధ్యంకాదు. ఈ విషయం రుజువు చేసే రెండు కథలను చెప్తాను వినండి.
                                                         ***
చాలా కాలం క్రితం కోనసీమలో అయిన పల్లి అనే గ్రామంలో బులుసు అచ్చయ్యగారనే మహా పండితుడు ఉండేవారుట.వారి తండ్రులూ తాతలూ కొమాళ్ళూ అందరూ మహా పండితులే. అచ్చయ్యగారు వేద శాస్త్ర శ్రౌతాలలో నిష్ణాతుడు.ఆయన ఒకరోజు ఉదయాన్నేగుమ్మం అలుకుతూ ఉన్న తమ అర్ధాంగిని ఈ వేళ శాక పాకా లేమిటోయ్ అని సరదాగా ప్రశ్నించారట. అంతటి మహా పండితుడై ఉండీ ఎంతో ధనాన్ని అవలీలగా ఆర్జించగల దక్షత కలిగిన వాడై కూడా ఆ  విషయంలో ఈ షణ్మాత్రమైనా శ్రధ్ధ చూపని తన భర్తగారి ప్రవర్తనతో ఏ కొంచెమైనా విసిగిపోయి ఉందేమో ఆ ఇల్లాలుఆఁ ఏముందీ..ఇత్యర్థలు పులుసూ..ఇతిభావలూ కూరానున్నూ.. అందట. భార్య మాటల్లోని వ్యంగ్యం గ్రహించిన ఆయన  “ నీకేదో ధనాశ ఉన్నట్లుంది.  ఎంత తెస్తే చాలునో చెపితే ఆ ప్రయత్నం చేస్తానన్నాడు. అన్నాడు కాని ఈయన అటువంటి ప్రయత్నమేమీ చేసేవాడనే నమ్మకమేమాత్రం లేని ఆవిడ తాను అప్పుడు గుమ్మం  అలకడానికి  నీళ్లు తెచ్చుకున్న నిలువు చెంబు చూపిస్తూ దీనెడు వరహాలు చాలన్నట్టు సంజ్ఞ చేసిందట. అచ్చయ్యగారు ఆ పట్టునే ఆ చెంబు తీసుకుని బయల్దేరి ఊళ్లు తిరుగుతూ హైదరాబాదు చేరుకున్నారట.అక్కడ ఒక బ్రాహ్మడు యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ శ్రౌతులిద్దరు ప్రాయశ్చిత్తం ఎలా చేయించాలనే విషయమై వాదులాడుకుంటున్నారట. అప్పుడు అచ్చయ్యగారు కలుగ జేసుకుని ఇదీ శాస్త్రీయ మైన పద్ధతి అని వివరించేరట.అప్పుడు ఆ వాదనలో ఓడిపోయిన శ్రౌతి మధ్యలో నీవెవడవయ్యా కలుగజేసుకుని తీర్పివ్వడానికి ..నీ వేమైనా బులుసు అచ్చయ్యగారి ననుకుంటున్నావా అని హేళనగా మాట్లాడాడట.అందుకాయన అలాగే అనుకోండి అని మాత్రం అన్నాడట. తొందరలోనే ఆయనే బులుసు అచ్చయ్యగారనే నిజం గ్రహించిన అక్కడి పెద్దలు వారికి నమస్కరించి సగౌరవంగా అప్పటి హైదరాబాదు నవాబు వద్ద దివాన్జీగా ఉన్న చందూలాల్ గారి దగ్గరకు తీసుకు వెళ్లారట. అప్పటికే అచ్చయ్యగారి ప్రజ్ఞా విశేషాలు ఎరిగి ఉన్నవాడైనందు వల్ల చందూలాల్ గారు అచ్చయ్యగారిని అంత దూరం నుండి వచ్చిన పనేమిటని అడిగారట. విషయం తెలుసుకుని అచ్చయ్యగారికి జాగీరు ఇవ్వడానికి కూడా చందూలాల్ సిధ్ధ పడ్డా, దానిని నిరాకరిస్తూ తన చెంబుతో చెంబెడు వరహాలు మాత్రం పుచ్చుకుని అచ్చయ్యగారు ఇల్లు చేరారట. కేవలం భార్య కోరిక తీర్చడానికైనా సరే, ఏదో నాలుగు చోట్ల యాచించుకోకుండా తన ప్రజ్ఞను గుర్తించి అడక్కుండానే తన అభీష్టాన్ని నెరవేర్చగల యోగ్యుడైన దాత కోసమే అచ్చయ్యగారు ఇంత దూరం రావలసి వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఆయన తన శేషజీవితాన్ని నప్రతిగృహీతలు గానే గడిపారట.
                                                              ***
ఇది వింటే మనలో కొందరికైనా ఆ రోజుల్లో కనుక అలా గడప గలిగారు కాని ఇప్పటి పరిస్థితుల్లో ఎవరికైనా అలా జీవించడం సాధ్యమా? అనే శంక కలిగి తీరుతుంది. నిజమే. ఆ రోజుల్లో ఏ కొద్ది మంది భాగ్యవంతులో తప్పిస్తే మిగిలిన వారందరూ చాలా సాదా సీదా జీవితాల్ని గడిపే వారు కనుక వారి మధ్య ఈ రకమైన నిష్టతో బ్రతకడం ఇప్పటికంటె కొంచెం సులభమే అయి ఉండవచ్చు. కాని అసలు కారణం అది కాదు. మనిషై పుట్టాక మన జీవితం ఎలా గడపాలి జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని మనం నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో వచ్చే సాధక బాధకాల్ని లెక్కచేయకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగగలగడం అనేవి వ్యక్తులకు సంబంధించినవి. కాలానికి సంబంధించినవి కాదు. ఈ విషయాన్ని రుజువు చేసే కథ చెబుతాను వినండి.
                                                                 ***
మనం ఉంటున్న ఈ కాలంలోనే ఢిల్లీలో ఘాజీ పూర్ ప్రాంతంలో రవి సక్సేనా అనే ఆసామీ టీ అమ్ముకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. అలా టీ అమ్ముకుంటూ నెలలో 20 రోజులలో దాదాపు రూ. 8,000  వరకూ సంపాదిస్తాడట. అంతే మరి. ఆ మిగిలిన 10 రోజులూ టీ అమ్మడం బంద్. ఆ పది రోజులూ ఢిల్లీకి చికిత్స నిమిత్తమై   ఎక్కడెక్కడనుంచో వచ్చే వారికి సహాయం చేయడంలో  తలమునకలై ఉంటాడట. అలా ఢిల్లీకి దూర ప్రాంతాలైన పల్లె టూళ్ళనుండి వచ్చి హాస్పిటల్స్ లో ఎలా చేరాలో తెలియక అట్టాడుతున్న రోగుల్ని తీసుకెళ్లి హాస్పిటల్స్ లో చేర్పించడం వారి అవసరాల్ని బట్టి రోజుల తరబడి  వారికి తోడుగా ఉండడం  సేవ జేయడం లాంటివి చేస్తాడట.ఇలా ఆయన ఆరేళ్ళ బట్టి సేవ జేస్తున్నాడట. ఈ పని మానేసి హాయిగా టీ అమ్ముకుంటూ మరికొంచెం సంపాదించుకోవచ్చు కదా అని అతడి కుటుంబ సభ్యులూ స్నేహితులూ ఎవరెన్ని చెప్పినా వినకుండా అతడీ సేవలో అంకితమై పోతున్నాడట. ఢిల్లీ లాంటి మహా నగరంలో 8000 రూపాయల సంపాదనతో బ్రతుకు వెళ్లదీయడం ఎంత కష్టమో మనమెరుగనిది కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక బ్రతికుంటేనే ఏమైనా సాధించగలం కనుక జీవికకు సరిపడా సంపాదించుకుంటూనే ఈ జీవితానికి సార్థకత చేకూర్చుకోవాలనుకున్న రవిసక్సేనా ధన్యజీవియే కదా?
                                                                ***
బులుసు అచ్చయ్య గారిగురించి చెప్పిన వారు శ్రీ చెళ్ళ పిళ్ళ వేంకట శాస్త్రి గారైతే, రవి సక్సేనాను గురించి జూన్ 6, టైమ్స్ ఆఫ్ ఇండియా దిన పత్రికలో చదివాను. ఇలాంటి ముచ్చట్లు వినడం మన జీవితాల్ని సంపూర్ణంగా మార్చి వేయక పోయినా  జీవిత పరమార్థాన్ని గ్రహించడంలో ఏ కొంతైనా సాయపడి ప్రశాంత జీవన సరళిని ప్రసాదిస్తాయేమోనని ఆశ. సెలవు.
                                                               ***