24, మార్చి 2013, ఆదివారం

కొంగలూ..మేఁకలూ..నిండు సున్నలూ..అరసున్నలూ..


               కొంగలూ..మేఁకలూ...నిండుసున్నలూ..అరసున్నలూ..
నేను బాగా చిన్నప్పుడు, అంటే అక్షరాలూ గుణింతాలూ నేర్చుకునే వయసులో వేసవి సెలవుల్లో మా యింట్లో పిల్లల అల్లరి భరించలేక మా పెద్దవాళ్లు మా పిల్లలందరినీ మా యింటికి నాలుగిళ్ల తర్వాత ఉన్న యింట్లో పిల్లలకి పాఠాలు చెప్పే కాంభుక్త మేష్టారు గారింటికి చదువు నేర్చుకోమని తోలే వారు, ఆ విధంగా నైనా ఓ గంట సేపు మా అల్లరి తప్పుతుందేమోనని.ఆ విధంగా చాలా చిన్నప్పుడు వారి దగ్గర కొద్ది రోజులు చదువుకోవడానికి వెళ్లడం తప్పిస్తే నేనెప్పుడూ ప్రయివేటుకి వెళ్లలేదు. ఈ రోజుల్లో ట్యూషను చెప్పించుకోవడాన్ని ఆ రోజుల్లో ప్రయివేటు  అనేవారు. ముళ్లపూడి ఈ ప్రయివేటు అన్నదానికి వేరే అర్ధం చెప్పడం వేరేకథ.ఇలా నేను కాంభొట్ల వారి దగ్గర గుణింతాలు నేర్చుకుంటున్న రోజుల్లో వారి దగ్గర ప్రయివేటు చదువుకుంటూ ఉండేవారిలో ఒకబ్బాయి మా అందరికంటే ఒకటి రెండేళ్లు పెద్ద వాడో ఏమో గాని చాలా పొడుగ్గా కొంగ లాగా ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా మాతో పాటే గుణింతాలు నేర్చుకుంటూ ఉండేవాడు. అసలు విషయమేమిటంటే, ఆ అబ్బాయి ఎప్పుడు పుస్తకం తీసి చదవమన్నా కొంగ అనే పదాన్ని కొజ్ఞ్ జ్ఞ్ గ అనే చదివే వాడు. మా వేసవి సెలవులూ ప్రయివేట్లూ అయిపోయాయి కానీ మేం అక్కడ ఉన్నన్నాళ్లూ కాంభొట్ల వారు ఎంత ప్రయత్నించినా ఆ కొజ్ఞ్ జ్ఞ్గ బాబు చేత కొంగ అనిపించ లేక పోయారు.
                                                        ***
ఈ కథ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే..వచ్చింది మరి.ఇప్పుడంటే మనం కొంగ అని మధ్యలో పూర్ణానుస్వారం  అనబడే నిండు సున్నతో వ్రాసి కొమ్.. మ్.. గ అనేటట్లు పలుకు తున్నాము గానీ, మన తెలుగు భాష పూర్తిగా స్థిర పడని తొలి రోజుల్లో దాదాపు క్రీ.శ. నాలుగో శతాబ్దం వరకూ తెలుగు భాషలో ఈ అనుస్వారం లేదు. అందు చేత ఆ ధ్వని పలుక వలసిన పదాలన్నిటిలోనూ అక్కడ అనునాసికాన్నే వాడేవారు. అనునాసికమంటే మన కచటతప వర్గాల్లో వర్గపు చివరి అక్షరాలన్నమాట. ఉదాహరణకి, పంకజము అనే మాటని అప్పుడు పజ్ఞ్కజము అని వ్రాసేవారన్నమాట. త వర్గంలో చివరి అక్షరం న.అందుచేత కాంత అనే పదాన్ని కాన్త అని వ్రాసేవారు.  పండుని  పణ్డు అని వ్రాసేవారు.  ఇలాగే అన్నీ. మరి అనునాసికమనే పదమే చెబుతుంది అది ముక్కుతో పలికే ధ్వని అని. మరి అలా టప్పుడు కొంగ ని కొజ్ఞ్ గ అనే వ్రాసి ముక్కుతో అలాగే పలికే వారన్న మాట. మరి మన కొంగ బాబు ఆ రోజుల్లో పుట్టి ఉంటే అతడి ఉచ్చారణని ఎవరూ తప్పు పట్టేవారు కారన్నమాటే కదా?  
                                                       ***
కొంగ అనే పదంలో నిండుసున్న అలాగే ఉండగా, మేఁక అనే పదంలో నిండుసున్న లేదు గానీ అరసున్న కనిపిస్తుంది.దీని గురించి కొచెం వివరంగా చెప్పాల్సి ఉంది. ఇంతకు ముందు తన పేరు మరచి పోయిన ఈఁగ కథ అనే పోస్టులో ఈగని మొదట్లో ఈజ్ఞ్గ అనీ .. ఆ తర్వాత ఈంగ అనీ తరువాత ఈఁగ అనీ ప్రస్తుతం అరసున్న కూడా విడచి పెట్టి ఈగ అని అంటున్నామనీ వ్రాసేను.ఇది  చదివిన బ్లాగ్మిత్రులొకరు చిన్నయ సూరి తన బాల వ్యాకరణము లో దీర్ఘము మీద సాధ్య పూర్ణ బిందువు రాదన్నాడనీ అందు చేత ఈఁగ ఎప్పటికీ ఈంగ కానేరదనీ వ్రాసేరు.చిన్నయ సూరి చెప్పినది నిజమే. ఆయన చాలా అర్వాచీనుడు. ఆయనకు ముందే ఎన్నో శతాబ్దాలకు పూర్వమే దీర్ఘము మీది పూర్ణానుస్వారాన్ని తేల్చి పలకడంతో అది మాయమై పోయి దాని స్థానంలో దాని గుర్తుగా అరసున్న మిగిలింది. అంతే గాని  దీర్ఘము మీద పూర్ణ బిందువు  ఎన్నడూ  లేదనడం సమంజసం కాదు.దీనికి ఉదాహరణగా కూతురనే అర్థంలో కూంతు అనే శిలా శాసన ప్రయోగమూ, వీడు అనే అర్థంలో నన్నెచోడుడు వాడిన వీండు అనే ప్రయోగమూ శ్రీ బూదరాజు వారు చూపించారు. పదాది   వర్ణము పయినే ఊనిక యుండి యది గురువగుటవలనను ప్రక్కనున్న యనుస్వారము పయిని ఊనిక పూర్తిగా బ్రష్టమగుటను, దీర్ఘము పయినుండిన యనుస్వారము సార్వత్రికముగా బ్రష్టమయినదిఅని తేల్చి చేప్పారు శ్రీ గంటి జోగి సోమయాజి గారు.అందు వలన ఈఁగ మొదటి రూపము ఈంగ అనీ,  దక్షిణాది తెలుగు వారు దానిని ఇప్పటికీ అలాగే ఉచ్చరిస్తారనీ  శ్రీ తిరుమల రామచంద్ర గారు చెప్పిన దానిని మనం అంగీకరించవలసే వస్తుంది. నా ఈఁగ కథ పోస్టులో చెప్పని విషయం ఒకటుంది. ఈఁగలు అనే బహువచన రూపమే మొదట వచ్చి దానినుంచి ఈగ అనే ఏక వచన రూపం వచ్చిందంటారు శ్రీ సోమయాజి గారు. అదెలాగంటే ఈజ్ఞ్ అనే మూల ద్రావిడ శబ్దానికి ఆ భాషలోని బహువచన ప్రత్యయమైన కళ్ అనేది చేరి ఈజ్ఞ్+కళ్ ఈంకళ్ ఈంగళ్ ఈంగలు అయిందనీ, మన తెలుగు భాషలో లు బహువచన ప్రత్యయంగా స్థిరపడిన తర్వాత ఈంగలు లోని లు ని మాత్రమే బహువచన ప్రత్యమనుకొని దానిని విడచి పెట్టి ఈంగ అనే ఏక వచన రూపం  అనుచిత విభాగం వలన ఏర్పడ్డదనీ సోమయాజిగారు తెలిపారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే-
 ఈఁగలు లాగే మేఁకలు అనే బహువచన రూపమే మొదట ఏర్పడి దానినుండి మేఁక అనే ఏక వచన రూపం ఏర్పడి ఉండి ఉండ వచ్చునని నా కనిపించడమే.ఈఁగలు ఈజ్ఞ్..అని శబ్దం చేయడం వల్ల వాటికి  ఈగలు అని పేరు వచ్చినట్లే మేజ్ఞ్..మేజ్ఞ్.. అని అరిచే వాటికి మేజ్ఞ్+కళ్ మేంకళ్ మేంకలు అని పేరు వచ్చి ఉండవచ్చును.
ఈఁగలు లో లాగానే మేంకలు లోని దీర్ఘము మీది పూర్ణానుస్వారము మీద ఊనిక తగ్గించి పలకడంతో మేఁకలు అయి ఉండవచ్చును. అయితే  మూల ద్రావిడ భాషలో ఏ రూపం ఉండేదో నాకు తెలియదు కనుక  మేఁకలు ఈగలు లాగే అనుచిత విభాగం వల్ల ఏర్పడిందో కాదో నిర్ధారించలేను. అది ఏ రకంగా ఏర్పడినా ముందు మేంకలు అనే రూపం ఉండేదనీ, దాని నుంచే మేఁకలు  అనే రూపం ఏర్పడి ఉంటుందనడానికి  మేఁకలు లోని అర్థానుస్వారమే సాక్ష్యం. కొంగలూ  మేఁకలూ లో నిండు సున్న అరసున్నల కథ ఇది. ఈ నిండు సున్న అరసున్నల గురించి చెప్పుకోవలసిన విశేషాలు మరికొన్ని ఉన్నాయి. అవి మరోసారి చెప్పుకుందాం.సెలవు.

11, మార్చి 2013, సోమవారం

తనపేరు మర్చి పోయిన ఈగ కథ...


                                  .
మీరెప్పుడైనా విన్నారో లేదో కానీ, నా చిన్నప్పుడు మా పెద్దలు చెప్పగా విన్నానీ కధ.
అనగనగా ఒక ఊళ్లో ఉండే ఒక ఈగ ఇల్లలుకుతూ అలుకుతూ ఉండగా తన పేరు మర్చిపోయిందట.ఈగేఁవిటి? ఇల్లలకడఁవేఁవిటి? అని అప్పుడు నేనడగలేదనుకోండి. అడిగినా వాళ్లు చెప్పేవారు కాదు. వెధవా కథకు కాళ్లేఁవిటి ముంతకు చెవులేఁవిటి అంటూ ఎదురు దాడికి దిగే వారు. కథకు కాళ్లు లేకపోతే  ముందుకెలా వెళ్తుందండీ చివరకు కంచికెలా వెళ్తుందండీ అయినా ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తే కథ చెప్పడం మానేస్తారని నోరుమూసుకుని చెవులు చేటలు చేసుకుని వినేవాణ్ణి. అలా ఇల్లలుకుతూ తన పేరు మరచిపోయిన ఈగకు ఎంత తల బద్దలు కొట్టుకున్నా తన పేరు గుర్తుకు రాలేదట.అయినా తలలు బద్దలు కొట్టుకుంటే ఏవైనా గుర్తుకు వస్తాయటండీ?  అలా వస్తాయంటే నేనెన్నిసార్లు తల బద్దలు కొట్టుకోవలసి వచ్చేదో. మరపు మానవ సహజం కదా అని ఊరుకుంటాను. మరపు మానవ సహజమే కాదు ఈగలకు కూడా సహజమే అన్నమాట.అయినా పెళ్లాం పుట్టినరోజో, ఎవరికో తీర్చాల్సిన అప్పో అయితే హాయిగా మరచిపోయి ఊరుకోగలం కాని మన పేరే మనకి గుర్తు లేకపోతే ఎలా చావడం. అందుకని ఆ ఈగ అయ్యలారా తల్లులారా అన్నలారా అక్కలారా నా పేరేమిటని రోదిస్తూ కనిపించిన వాళ్లందరినీ అడిగిందట. దాని భాష అర్థంకాకో, ఇంత చిన్న ప్రాణి అడిగితే మనం జవాబు చెప్పాలా అనే అహంకారంతోనో మనషులెవ్వరూ దానికి సమాధానం ఇవ్వలేదట. ఆ తర్వాత కనిపించిన జంతువులనన్నిటినీ—కుక్కనీ పిల్లినీ ఆవునీ అన్నిటినీ అడిగందట. ఏ వీ దానికి జవాబు చెప్పలేదు.ఆఖరుగా దానికి నిద్ర పోతున్న ఒక గుఱ్ఱం కనిపించిందట. చివరి ప్రయత్నంగా దానినీ అడిగింది. జవాబు లేదట. దానికి సరిగా వినపించలేదేమో అని దాని చెవిలో దూరి రొద చేసి మరీ అడిగిందట. ఈ ఈగ చెవిలో చేసిన రొదకి  గుఱ్ఱం ఒక్కసారిగా నిద్ర లేచి చెవులు విదిలిస్తూ  హిఁహిఁహిఁ.ఈఁ ఈఁ.. ఈఁ.. అంటూగట్టిగా సకిలించిందట. అది విన్న ఈగకు వెంటనే తన పేరు ఈ..గ. . అని గుర్తుకు వచ్చి మనసు తేలికై ఈల వేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ చక్కగా ఎగిరి పోయిందట. ఈగ లెక్కడైనా ఈల వేస్తాయా? డాన్స్ చేస్తాయా? అని నన్నడగకండి. ఈగలు ఈలలూ వేస్తాయి డాన్సులూ చేస్తాయి లవ్వూ ఆడతాయి. విలన్ల మీద ప్రతీకారాలూ తీర్చుకుంటాయి. కావాలంటే రాజమౌళినడగండి.
                                                                 ****
ఇంతవరకూ మా పెద్దలు చెప్పిన కథ. మిగిలింది నేను చెబుతాను వినండి.
ఈ ఈగ అసలు పేరు ఈజ్ఞ్ గ. ఈజ్ఞ్.జ్ఞ్..జ్ఞ్.. అంటూశబ్దం చేస్తుంది కనుక దానిని ఈజ్ఞ్గ అన్నారు. అదే ఈంగ అయింది.ఇప్పటికీ దక్షిణ దేశంలో ఉన్న మన తెలుగు వారు ఈంగ అనే పిలుస్తారు.మథ్యలో ఉండే పూర్ణానుస్వారాన్ని తేలిగ్గా పలకడమో  అసలు పలకక పోవడమో జరుగుతూ అది  నేటికి ఈగ అయింది.ఒకప్పుడు దానిని ఈంగ అని పలికే వారమని గుర్తుగా ఈఁగ అంటూ మధ్యలో అరసున్నాతో తెలియజేస్తారు.ఈ అరసున్నలు నా చిన్నప్పుడు ఉండేవి. కాని ఇప్పుడు ఎవరూ వ్రాయడంలేదు కనుక ఈంగ అనే దాని పూర్వపు నామం ఇప్పటివారికి తెలీదు.ఇలాగే చిన్నగా ఉండి ఎగురుతూ ఉండే వాటిని మన వాళ్లు ఈగలనే అనేవారు.జోరుగా రొదచేస్తూ తిరిగేది జోరీగ.వాటిల్లో కాస్త బొద్దుగా ఉండేది బొద్దు + ఈంగ = బొద్దీంగ ..బొద్దీంగ..బొద్దింక అయ్యింది.. బొద్దింకలో మనకు నిండు సున్నా నేటికీ కనిపిస్తూ ఉంటే, ఈగలో అది మాయమయింది. ఇలా వచ్చిన సున్నలూ అరసున్నలూ అవి మాయమై పోవడాల గురించి మరోసారి చెప్పుకుందాం. సెలవా మరి?


4, మార్చి 2013, సోమవారం

పద్యం పురి విప్పి నాట్యమాడిన ఊరు...


                             
                                                ఓ  పదిహేను పదహారు సంవత్సరాలకు పూర్వం నేను రిటైరు కాకముందు ఉద్యోగ రీత్యా కృష్ణా జిల్లా లోని నూజివీడు వెళ్లాను. అక్కడ రోడ్లు భవనాలు శాఖ ఇంజనీరు వారి కార్యాలయంలో పద్దులు తనిఖీ చేస్తుండగా వారు  నిర్మాణం పూర్తిగావించిన ఒక వంతెన ఖర్చుల వివరాలు చూస్తుండగా ఆ ఇంజనీరు గారు మీరో సారి ఆ వంతెన చూడాలి బాగుంటుంది అని అన్నారు.ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా నేను ఆ వంతెనను చూడాల్సి లేకపోయినా, వారి కోరిక మేరకు ఒక ఆదివారం వారు తీసుకు వెళ్లగా దానిని చూడడానికి వెళ్లాను. ఆ వంతెన ఇటు కృష్ణా జిల్లాను అటు ఖమ్మం జిల్లానూ కలుపుతోంది. ఇప్పుడు సరిగా గుర్తు లేదు కాని ఆ నది పేరు వైరా అనుకుంటాను. ఇటువైపు ఆ వంతెన మొదలయ్యే ఊరు కృష్ణా జిల్లాలోని  ఒక చాలా చిన్నగ్రామం. ఇప్పుడది పెరిగిందో ఏమో మరి? అప్పుడా చిన్నగ్రామంలో ఒక చిన్న దేవాలయం. దానిలో కొలువై ఉన్నాడు శిఖి పింఛమౌళి. ఆ చిన్ని కృష్ణుని దర్శించుకుని  తిరిగి వస్తూ దారిలో మరో చోట వెంకటేశ్వరుని కూడా  సేవించుకుని  తిరిగి మా కార్యస్థానాన్ని చేరుకున్నాను. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ ఊరికి సంబంధించిన విశేషం ఒకటి నా చెవిన బడి అప్పటి నా జ్ఞాపకాల్ని తట్టి లేపింది.  ఆ విశేషం కొంచెం విన్న వించుకుంటాను.
                                                            ..... 
                                                         దాదాపు ఇప్పటికి నలభై ఏళ్ళక్రితం ఆ ఊళ్లో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాథ్యాయులు ఉండేవారు.చాలీ చాలని సంపాదనే అయినా గుట్టుగా కాలక్షేపం చేసుకుంటూ నెట్టుకొచ్చేవారు. ఆయన తన పిల్లలను  ఒళ్లో కూర్చో పెట్టుకుని  అమర కోశం వురాణనామ సంగ్రహం వంటి గ్రంథాలనూ అనేక పద్యాలనూ వారిచేత వల్లె వేయించేవారు. ఆ విధంగా వారికి అక్షరాలు నేర్వకమునుపే అనేకమైన పద్యాలూ అవీ కంఠస్థమయేవి.వారి పిల్లలలో ఒక అబ్బాయి మరీ చురుకైన వాడు.అతడిని వారింటికి వచ్చిన మేనమామలూ ఇతర బంధువులూ  ఏదిరా అబ్బాయి ఒక రూపాయి ఇస్తాం పద్యం చదువరా అంటే గళగ్రాహిగా చదివేసేవాడు. వారు మురిసిపోతూ మరిన్ని పద్యాలు చదివించుకుని డబ్బులయిపోతూ ఉంటే అర్థ రూపాయి, పావలా ఇస్తా నన్నా ఆ అబ్బాయి వారికి కావలసినన్ని పద్యాలు అప్పజెప్పే వాడు. అసలా ఊరిలోనే పిల్లలందరికీ అనేకమైన పద్యాలు కంఠతా వచ్చేవట.తండ్రి గొప్ప పండితుడైనా కుటుంబభారం వహించడానికి పడే కష్టాలు  ఆ బుడుతడి మనస్సుకును కష్టం కలిగించి అతడిలో ఎలాగైనా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలనే పట్టుదలని పెంచాయి.ఆ విధంగానే అతడు కష్టపడి చదివి   పెద్దయ్యాక  I.A.S. Officer  అయాడు.అయితే ఇలా పేద కుటుంబంనుంచి వచ్చి పెద్ద పెద్ద పదవులనలంకరించిన వారు  కొందరైనా లేకపోలేదు కనుక మరీ ఆశ్చర్యపడిపోవలసిన అవసరం లేదు. కానీ ఈ బుడుతడి విషయం వేరు. కసితో చదివి I.A.S  సాధించినా తనకు ప్రాణ ప్రదమైన సాహిత్యోపాసన మాన లేదు. చిన్న నాడే మొదలు పెట్టి పెద్దయ్యే సరికి దాదాపు వెయ్యికి పైగా అవధానాలు చేసాడు. 18 కవితాసంకలనాలను ప్రచురించాడు. . పాతిక వేలకు పైగా పద్యాలు వ్రాసేడు. అవధాన విద్య  దాని పుట్టు పూర్వోత్తరాలు.. అనే సిధ్దాంత గ్రంథం వ్రాసి డాక్టరేటు సంపాదించాడు. ఈయన ప్రస్తుతం మన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు గా వ్యవహరిస్తున్నారు. ఇంత చెప్పేక మీకే అర్థమై పోయి ఉంటుంది. ఈ శేముషీ ఖని పేరు రాళ్లబండి కవితా ప్రసాద్. ఈ మధ్యనే జాలంలో భక్తి టీవీలో వచ్చిందని చెప్పి ఆయనతో ఇంటర్వ్యూ ఒకటి పెట్టారు.అందులో ఆయన అనేకమైన విషయాలు చెప్పారు. తన చిన్నప్పటి ముచ్చట ఇలా చెప్పినదే. తనకే కాదు తమ ఊళ్లో పిల్లలందరికీ చాలా పద్యాలు కంఠతా వచ్చి ఉండేవని చెప్పారు.అందుకే ఆ వూళ్లో పద్యం పురివిప్పి నాట్యమాడిందన్నాను. ఇంతకీ ఆ ఊరి పేరు చెప్పనే లేదు కదూ?  ఆ ఊరి పేరు నెమలి. నేను వంతెన చూసే మిషతో  బాల శిఖి పింఛమౌళిని దర్శిం చుకు వచ్చిన ఊరూ అదే..నెమలి.
                                                     ......
కష్టపడి I.A.S  సాధించిన వారూ ఉన్నారు. అలాగే శతావధానాలూ, సహస్రావధానాలూ చేసిన ధీ మణులూ ఉన్నారు. అయితే రెండిటినీ సాధించినా  తనకు  I.A.S. ఆఫీసరుగా ఉండడం కంటె ఉపాధ్యాయునిగా ఉండడమే ఇష్టమని చెప్పిన ఆయనను అబినందిస్తున్నాను. ఈ కాలంలో తెలుగు సాహిత్యం చదువుకుంటే  తమ పిల్లలు I.A.S. లాంటివి సాధించ లేరేమోననే భయంతో పిల్లలను  తెలుగు సాహిత్యానికి దూరం చేసే తల్లదండ్రులకు కనువిప్పు కావాలన్నదే ఈ వ్యాసోద్దేశం.
                                                 ....
సెలవు.                                                                                         4.03.2013