10, జులై 2013, బుధవారం

ఈ కవి గారి కలానికి రెండు వైపులా పాళీలే..


ఘటనాఘటన సమర్థులని కొందరుంటారు. అంటే వారు ఏపనినైనా చేయించాగలరు, లేకపోతే పని జరుగకుండా ఆపనూ గలరన్నమాట. ఇలాంటి వారి విషయంలోనే వారి కత్తికి రెండువైపులా పదునే అనే నానుడి వచ్చింది. శూరుల విషయంలో కత్తి ఎటువంటిదో  కవుల విషయంలో కలం అటువంటిదే కదాతన కలం పోటుతో ఒక పని జరిగేటట్లుకాని జరుగకుండా ఆపేటట్లు గాని చేసే కవిగారి కలానికి కూడా రెండువైపులా పదునే కదాఇలాంటి  ఘటనా ఘటన సమర్థుడైన ఒక కవిగారి ముచ్చట ఒకటి మీకు చెప్పాలనిపిస్తోంది. వినండి.
                                                                        ****
భగవదనుగ్రహం వలన  ఆగ్రహానుగ్రహ శక్తిని పొందిన పొందిన కవులు కొందరుండేవారు. వారిలో అందరికీ తెలిసి తిట్టు కవిగా  ప్రఖ్యాతి పొందిన వాడు  వేములాడ భీమకవి కాగా,  అంతగా కాకపోయినా అటువంటి శక్తి కలిగిన వాడుగా పేరుపొందిన మరొక కవి శ్రేష్టుడు తురగా రామకవి. ఈయన స్వగ్రామం  తూర్పు గోదావరి జిల్లా లోని తుని లేక దగ్గర లోని ఏదో గ్రామం. తరచుగా దేశాటనం వెళ్లి వస్తూ ఉండేవాడు. అతడికి అక్కడి చాలా ఆస్థానాల్లో వార్షికాశనాలు ఉండేవి. వార్షికాశనాలంటే  యేడాదికొక్కసారి   సంస్థానానికి వెళ్లి  అయిదో పదో రోజులు రాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన ధనాదికములను స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట. కవి గారొక సారి పిఠాపురాన్ని ఏలుతున్న వత్సవాయి తిమ్మరాజు గారి దర్శనం కోరి వారి కోటకు వచ్చాడట. అంతకుముందే అతడు వచ్చి తన వార్షికాన్ని స్వీకరించి వెళ్లి ఉండడం చేత, మళ్ళీ ఏం కోరి వచ్చాడోనని, రాజు గారు దర్శనమివ్వక అనాదరించారట. అందుకు కోపగించిన కవిగారు ఆతని కోట గోడమీదో తలుపు మీదో  మసి బొగ్గుతోపెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్.. అని వ్రాసేడట. పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మి లక్ష్మీ దేవి  అదృష్ట దేవతైతేఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట. కవిగారు అగ్రహించి చేసిన పని గురించి తెలుసు కున్న రాజుగారు, కవిగారి ఆగ్రహానుగ్రహ శక్తి  ఎరిగిన వాడు కనుక  స్నానం చేస్తున్న వాడు కాస్తా తడి బట్టలతోనే వచ్చి కవిగారిని శాంతింపజేసి, వారు వచ్చిన కార్యం కనుక్కున్నారట. కవిగారి కోరిక సమంజసమైనది కాక పోయినప్పటికీ రాజుగారు ఎంతో కొంత సంతృప్తి పరచడంతో మోమోటం చెందిన కవిగారు తన పద్యం లో ముందు భాగాన్ని ఇలా పూరించారట.
అద్దిర, శ్రీ , భూ, నీళలు
ముద్దియలా హరికి గలరు, ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడెను
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్
చూడండి కవి గారి చాతుర్యం. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది కదా? అయితే మొదట కవిగారికి జరిగిన నిరాదరణ వల్ల కవి వాక్కు పూర్తిగా వృథా పోలేదనీ  తిమ్మరాజు గారి కాలంలో కాకపోయినా ఆయన మనుమల కాలంలో జమీందారీ కష్టాలపాలై నశించిందన్నదీ ఐతిహ్యం.
                                                                         ****
తా..- అంటే తాజా కలమన్న మాటకు ఇవి  పొడి అక్షరాలన్నమాట. ఇది ఇంగ్లీషు భాషలోని  Post Script కి సమానమైనది. ముందు వ్రాసిన వ్రాతలో మరచి పోయిన విషయాన్నో మరీ ముఖ్యమైన దాన్ని గుర్తు చేయడానికో చివర్లో తాజా కలం  అంటూ వ్రాసేవారు. అయితే నేనీ తా.. అనే తోక ని తగిలించడానికి కారణం అది కాదు. బాల్ పెన్నులు తప్ప సిరాతో వ్రాసే కలాలగురించి ఈనాటి యువతలో కొందరికైనా తెలిసి ఉండక పోవచ్చునన్నసంశయమే. మేము మరీ చిన్నగా ఉన్నప్పుడు సిరా బుడ్డి కలం విడి విడిగా పట్టుకుని పాఠశాలలకు వెళ్ళే వారు. సిరా బుడ్డిలో కలం ముంచి వ్రాయాల్సి వచ్చేదన్న మాట.కరక్కాయతో చేసిన సిరా అయితే ఎన్నటికీ చెరగకుండా ఉండేది. అయితే మేము స్కూల్లో చేరినప్పటికే ఫౌంటెన్ పెన్నులు వాడుకలోకి రావడం వల్ల మాకా బాధ తప్పింది. ఇలాంటి ఇంకు పెన్నులు చూచిన వారైనా రెండు వైపుల నుంచి రెండు రంగుల సిరా పోసుకుని వాడుకునే వీలున్న Fancy కలాలలని చూసి ఉండక పోవచ్చు. సకృత్తుగా నైనా ఇలాంటివీ ఉండేవి. ఒకవైపు నీలం సిరా రెండవ వైపు ఎర్రరంగు సిరా  పోసుకునే వారు. నీలం సిరాతో వ్రాయడానికీ ఎర్రసిరాతో తప్పులు దిద్దడానికీ వాడే వారు. మరి మన కవిగారి కలం అలాంటిదే కదా? అయన కలానికి రెండు వైపులా పాళీలే.

                                                                          ****