తెనుగున భారత కావ్యము
మునుపెన్నడు లేని దారి పోవగ నైనన్
తనదగు శైలిని నన్నయ
మన భాగ్యము కలిసి రాగ మనకందించెన్
తిక్కన కవి యొక్కండే
చిక్కని మన తెలుగు భాష చేవను చూపెన్
తక్కిన కవులకు చిక్కని
అక్కజమగు నతని శైలి అనితర సాధ్యం
తీరుగ నన్నయ పోలిక
భారతమందున అరణ్య పర్వపు శేషం
పూరించెను, ఘన కవితా
పారగుడెఱ్ఱన, ప్రబంధ పరమేశ్వరుడై
ఇమ్ముగ చక్కని తెలుగున
కమ్మని కన్నయ్య కథలు కమనీయంగా
ముమ్మరమగు భక్తి కలుగ
బమ్మెర పోతన్న చెప్పె భాగవతంబున్
చవులూరెడు చాటువులను
అవలీలగచెప్పెనతడు ఆశువుగానే
కవిసార్వభౌముడాతడు
శివభక్తి పరాయణుండు శ్రీనాథుండే
ఇంకేదియు సాటి రాని ఇంపగు కావ్యం
శృంగారపు రస శిఖరం
వెంకట కవి చేమకూర విజయ విలాసం
వేమాయను మకుటముతో
వేమన పద్యాల యాట వెలదులు అన్నీ
సామాన్యుల నాల్కలపై
వేమరు నర్తించు చుండు వేయేండ్లయినన్
చిరుత ప్రాయపు పాపల
పరువము సడలిన ముదుసలి బాపల తోడన్
పరిణయముల ఖండించిన
పరశువు గురజాడ యనుట పాడియు గాదే
సరసుల మనసుల దోచియు
కరమగు ఖ్యాతిని బడసిన కన్యా శుల్కం
విరచించె మన మహాకవి
గురజాడను నే నుతింతు గురుభావముతో
ఆది కవులందు తిక్కన
ఆ తదుపరి కవులయందు నా వేమనయున్
ఆధునికులలో గురజా
డే తగుదురు యుగ కవులను యెంపిక చేయన్
తిరుపతి వేంకట కవులును
కురిపించిరి తెలుగువారి గుండెల నిండా
సరసపు కవితా వర్షం
మురిపెము తో తడిసి వారు ముద్దై పోవన్
ఒకశ్రీ నింకొక శ్రీయును
ఒకచో చేర్చుచును పల్కు డొమ్మిక తోడన్
సుకవీంద్రుండే కనపడు
నగణిత ఖ్యాతిని బడసిన యతడే శ్రీశ్రీ
కవి చూడా మణి ఆరుద్ర
కవితా సంద్రము తరచిన కౌశలమెంతేన్
చవి చూడగ వలయును కద
కవులకు నది తప్పని సరి కార్యము కాగా
విధి వంచిత లై వందెడు
విధవల చీకటి బ్రతుకుల వెలుగులు నింపెన్
విధవా వివాహ శుభకా
ర్యధురీణుడు, కందుకూరి యనఘుడు కాడే
ముని మాణిక్యం చూపెను
మనమెరుగని మన కుటుంబ మాధుర్యమునే
తనివార చదివి మీరలు
కనుడా రచనల సొబగులు కాంతం కథలన్
కొంచెపు బుధ్ధులు కొందరు
పంచముడని పరిహసింప పాటింపకనే
మంజుల కవితల మనకం
దించిన జాషువ మనకవి తిలకుడు కాడే
అమృతం కురిసిన రాతిరి
గమనించని జనము నిద్ర క్రమ్మియు నుండన్
తమిగొనుచు సుధను త్రావిన
అమరుడు మనకవి తిలక్కు నభినందింతున్
చిరు చిరు నానీలందున
గురుతర భావాల గూర్చి గొప్పగ చెప్పే
చిరు నానీ కవులతొ నే
కర నిష్పీడన మొనర్తు కంగ్రాట్సంటూ
***