21, ఫిబ్రవరి 2012, మంగళవారం

మడిబట్టకట్టి తెలుగును కాపాడుకోగలమా?


                                       
నా చిన్నతనంలో నేనో కథవిన్నాను. ఓ అమాయిక ఛాందస బ్రాహ్మణ వితంతువు తన పెరట్లోని కొబ్బరి చెట్ల కాయలు దొంగలు కోసుకు పోతుండడాన్ని ఆపడానికి, తన పంచ తడిపి మడిగా కొబ్బరి చెట్ల చుట్టూ కట్టిందట. మడి బట్టనెవ్వరూ ముట్టుకోరని ఆవిధంగా కాయలు దక్కుతాయని ఆశ పడ్డది. కానీ మర్నాడు చూస్తే కొబ్బరికాయలూ లేవు. మడిబట్టా లేదట. దొంగలు కొబ్బరి కాయల్ని మడిబట్టలోమూట కట్టుకుని చక్కా పోయారట. ఏ విషయంలోనూ ఛాందసత్వం సమస్యలకి పరిష్కారం కాదని తెలిపే కథ ఇది.
                                                       ***
 నేడు మాతృభాషా దినోత్సవం. మన తెలుగు వారందరం తెలుగుని పరిరక్షించుకోవడానికి కావలసిన ప్రయత్నాలు చేద్దాం.తెలుగు వచ్చిన వారందరం తెలుగు లోనే మాట్లాడడానికీ వ్రాయడానికీ ప్రయత్నిద్దాం.మన పిల్లలందరికీ విధిగా తెలుగు చదవడం వ్రాయడం నేర్పిద్దాం.వీలయితే తెలుగు సామెతల్ని తెలుసుకుని విరివిగా వాడడానికి ప్రయత్నిద్దాం.ఎందుకంటే ఏ భాషకైనా సామెతలే అందాన్ని చేకూరుస్తాయి. పిల్లలకి సామెతల్ని చెప్పి వాటి అర్థాల్ని వివరించి ఏ సందర్భంలోఎలా వాడాలో తెలియజేయండి. కనీసం మనమైనా వాటిని తరచూ వాడుతుంటే కుతూహలంతో వారే అర్థం తెలుసుకుని వాడుతారు. తెలుగు ఉద్గ్రంధాలుకాదు కానీ తెలుగు కథలైనా వారిచేత చదివింపజేయండి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగార్ల తెలుగువచనం చదివితే తెలుగు తీయందనం తెలుసుకుంటారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విషయంలో ఛాందసత్వం పనికి రాదు.ఎక్కడా ఇంగ్లీషు పదం దొర్లకూడదనే నియమం పెట్టుకోవద్దు. అది జరగని పని. అందరికీ అర్థమై ఇప్పటికే జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలను పరిహరించి తెలుగు పదాలను సృష్టించి వాడుకలోకి తేవాలనే వృధా ప్రయాస మానుకోవాలి. ఏదేశంలోనూ ఏ కాలం లోనూ ఈ పరిశుధ్ధతా వాదం అసాధ్యంగానే మిగిలింది. నేడు ప్రపంచ భాషగా వెలుగొందుతున్న ఆంగ్ల భాష అనేకమైన లాటిన్, గ్రీక్,ఫ్రెంచి పదాలను తనలో చేర్చుకోవడం వల్లనే సుసంపన్నమైంది. మన తెలుగు కూడా ప్రత్యేకమైన భాషే అయినా సంస్కృతం నుంచి వేలకొలది పదాలను తనలో చేర్చుకుంది. మొదట్లో రాజాశ్రయం కోసమే పండితులూ, కవులూ సంస్కృతాన్ని ఆశ్రయించినా ఆ తరువాత తరువాత తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి  ఎన్నో సంస్కృత పదాలను తెలుగులోకి తీసుకు వచ్చి మన సాహిత్యాన్ని చాలా వరకూ సంస్కృత పదభూయిష్టం చేసారు. దీని వల్ల కొంత మేలు జరిగినా ఎక్కువగా అచ్చ తెలుగు కనుమరుగవడానికి కారణమైంది. కాని దీనినెవరైనా ఆపగలిగారా?.అలాగే ఆ తరువాత కూడా అనేక రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల పార్శీ ఉర్దూ ఆంగ్ల భాషా పదాలు లెక్కకు మిక్కిలి గా తెలుగులో చేరాయి. వీటిలో కొన్ని చాలా కాలం క్రితమే కావ్యగౌరవాన్ని కూడా పొందాయి. ఫలానాది తెలుగు పదం కాదు పార్శీ లేక ఉర్దూ నుంచి మన భాషలో వచ్చి చేరిందని చెబితే జనం ఆశ్చర్యపోయేంతగా అవి తెలుగులో కలిసి పోయాయి (వాటి ముచ్చట మరోసారి చెబుతాను). ఇన్ని వందలూ వేల పదాలు తెలుగులో వచ్చి చేరినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వస్తున్న  ఆంగ్ల పదాలకు మాత్రం ఎందుకు?  రోడ్డు ఫోను రేడియో,టీవీ వంటి పదాలకు తెలుగు పదాలు సృష్టించి వాడడం నిష్ప్రయోజనం. అటువంటిదే హాస్పిటల్ అనే పదానికి అపభ్రంశ రూపమైన ఆసుపత్రి అనేది. ఈ రెండూ కాకుండా వైద్యాలయం అనేపదం ఏ తెలుగు వాడూ ఎప్పుడూ వాడగా నేను విన లేదు. అందు చేత భాషా పరిరక్షణోద్యమంలో ఛాందసత్వం కూదని తెలుసుకుని మసలుకుంటే అసలుకు మోసం రాదని చెప్పడమే నా ధ్యేయం. ఓ రెండు ముచ్చట్లు చెప్పి ముగిస్తాను:
నేను కాలేజీలో డిగ్రీ చదువుతుండగా (1958-61) మాకు తెలుగు రెండవ పేపరులో వ్యాకరణంతో పాటు ఆంగ్లంనుంచి తెలుగు అనువాదం చేయాల్సిన ప్రశ్న కూడా ఒకటుండేది. ఒకసారి ఆ అనువాదంలో సినిమా అనే పదం వచ్చింది. నా అనువాదంలో దానిని మార్చకుండా సినిమా అనే వ్రాసేను. ఆ పేపరులో నాకు ఫస్టు మార్కు ఇచ్చిన మా  ఆంధ్రోపన్యాసకులు శ్రీ రమణ గారు నన్ను పిలిచి సినిమాకు బదులు చలన చిత్రము అని వ్రాయనందుకు రెండు మార్కులు తగ్గించి నట్లు చెప్పారు. అప్పుడు నేనాయన్ని అయ్యా మీరు ఇంట్లో వాళ్లతో  చలన చిత్రమునకు పోవుదమా అంటారా? లేక సినిమాకు వెళ్దామా అంటారా? అని అడిగాను. దాని ఆయన అది సరేనయ్యా ఇది పరీక్ష కదా? అని అన్నారు. ఆయన చెప్పింది రైటే అయినా యాభై ఏళ్ల తర్వాత ఇవాళ కూడా జనం సినిమాని చలన చిత్రం అని పిలుచుకోవడం లేదుకదా? భేషజాలు మాని ఇటువంటి పదాల్ని తెలుగు వదాలుగా పరిగణిస్తే పోయేదేముంది?
ఆ రోజుల్లోనే  రైల్వేలో పని చేస్తుండే మా బాబాయి ఒకరు చెప్పిన విషయం. రైల్వేలకు సంబంధించి హిందీలో పారి భాషిక పదాల్ని తయారు చేసి ప్రభుత్వం ఇచ్చిన పట్టిక లో రైల్వే సిగ్నల్ కి సూచించిన పదంధూమ్ శకట్ కా ఆవక్ జావక్ సూచక్ యంత్ర్అనిట. ఏం సొగసుగా ఉంది? నాటికీ నేటికీ హిందీ మాట్లాడే ప్రాంతంలో కూడా దానిని సిగ్నల్ అనో దాని అపభ్రంశ రూపమైన సింగల్ అనో అంటారు కానీ  ధూమ్ శకట్ కా... అనే చాంతాడు మాటని ఎవ్వరూ ఉపయోగించరు. (ఇప్పుడైతే ధూమశకటాలే లేవు ఎలక్ట్రికల్ లేక డీసెల్ ఇంజన్లే కాని )
విశాఖ పట్నంలో పోర్టులో సముద్రపు పాయలో పేరుకు పోయే ఇసుకని తవ్వి తీయడానికి డ్రెడ్జర్ వచ్చిన కొత్తలో దానిని అక్కడి పోర్టు కూలీలు తవ్వోడ అని పిలిచేవారట. చాలా చక్కటి మాట. అయినా అదీ జనం వాడుకలో నిలబడకుండా జారిపోయింది. ఏ పదాలు నిలుస్తాయి ఏవి నిలవవు అనేది. వాటి వాడుకలో ఉండే సౌలభ్యాన్ని బట్టి కాలమే నిర్ణయిస్తుంది.
మనం మడి బట్ట కట్టి భాషని కాపాడలేం.
సెలవు.

                                                                           
36 వ్యాఖ్యలు:

రాజ్ కుమార్ చెప్పారు...

బాగుంది సార్.
నాకొకటి చెప్పాలని అనిపిస్తుందండీ. తెలుగు మీడియం స్కూల్స్ లో మ్యాత్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా అన్నిటిలోనూ చాలా వరకూ ఇంగ్లీష్ పదాలకి ఇలాగే తెలుగులో చిత్ర విచిత్రమయిన అనువాదాలు చేసి ఉంటాయ్. పెద్ద చదువులకి వెళ్ళినతర్వాత ఎందుకూ పనికి రావు అవి.
అలా ట్రాన్స్లేట్ చేసిన తెలుగు పదాలు ఇవ్వటం తప్పుకాదుగానీ బ్రాకెట్లో ఆ ఇంగ్లీష్ పదం కూడా ఇస్తే ఉపయోగకరం గా ఉంటుంది.

puranapandaphani చెప్పారు...

ఎవరూ పుట్టించకపోతే పదాలెలా పుడతాయి అంటాడు కదా మాయాబజార్‌లో. :) లాటిన్, గ్రీక్‌ల నుంచి ఇంగ్లీషు పదాలను ఎరువు తెచ్చుకోడమూ... సంస్కృతం నుంచి తెలుగు పద సంపద పెంచుకోడమూ ఒకటేనంటారా? :) మడి బట్ట వ్యాఖ్య మాత్రం పచ్చి నిజం

G.V. Subrahmanyam చెప్పారు...

చాల చక్కగా చెప్పారు.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

రాజ్ కుమార్ గారికి, మీతో నేను నూరుశాతం ఏకీభవిస్తాను. ఈ శాస్త్రాలలోవచ్చే పదాలకి కొత్త పదాలు సృష్టించి వాడడం వల్ల మనవాళ్లు కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్టు అన్నట్టు ఇటు విద్యార్థులకీ అటు బోధనాథ్యాపకులకీ లేని పోని కష్టాలు తెచ్చి పెట్టారు.పోనీ దాని వల్ల ఏదైనా ప్రయోజనం సిధ్దించిందా అంటే అదీ లేదు.Technical terms ని యధాతధంగానే తెలుగులో వాడుకుని ఉంటే ఎంతో ప్రయోజనం చేకూరి ఉండేది.ఇప్పుడు దానిగురించి మాట్లాడుకోవడం వల్ల లాభం లేదు.జరగాల్సిన నష్టం జరిగే పోయింది. ఈ నా పోస్టు ప్రయోజనం అదే. మడి కట్టుక్కూర్చోకుండా కొత్తగా వచ్చే పదాల్ని అలాగే స్వీకరిద్ేదాం. దాని వల్లమేలేకాని నష్టం ఏమీ లేదు.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

జి.వి.ఎస్ గారికీ ఫణి గారికీ కృతజ్ఞతలు.ఫణిగారూ- లాటిన్ గ్రీకు పదాలను స్వీకరించడం వల్ల ఇంగ్లీషు భాషకు జరిగిన లాభ నష్టాల సంగతి నాకు తెలీదు కానీ తెలుగుకు మాత్రం కొంత మేలూ ఎక్కువ కీడూ జరిగేయనేది నా భావన.సంస్కృత పదబంధాల్నిగుప్పించి తెలుగు ప్రబంధాల్ని మనలాంటి చదువుకున్న వారికి కూడా అర్థం కాకుండా చేసారు. అదే సంస్కృత ప్రభావం లేకుండా ఉంటే మన తెలుగు కబ్బాలు ఎన్నో అందరికీ అర్థమయ్యే భాషలో వచ్చిఉండేవి కదా?

లలిత (తెలుగు4కిడ్స్) చెప్పారు...

ఈ టపాలో విషయంతో చాలా మటుకు ఏకీభవించాలనే అనిపిస్తుంది. ఇక సంస్కృతం తెలుగులో కలవడం గురించి నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. మంచం వంటి పదాలు కూడా సంస్కృత మూలాలు కలవే ఐనప్పుడు అచ్చ తెనుగు పదాలు ఏవి? అచ్చతెనుగు సాహిత్యం అనబడే వాటిల్లో అచ్చ తెలుగు పదాలు ఎన్ని? భారతీయ భాషలకి సంస్కృతం మూలం కాదని రూఢీగా ఎలా చెప్పగలరు? నాకు తెలిసినంతమటుకు వాక్య నిర్మాణంలో తెలుగుకీ సంస్కృతానికీ చాలా తేడా ఉంటుంది అనిపిస్తుంది. ఐతే సంస్కృతం మూలంగా ఉద్భవించిన భాషలో ఇలాంటి తేడా ఎలా ఏర్పడింది అని ఆలోచించబుద్ధి వేస్తుంది కానీ ఆ తేడా వల్ల తెలుగు భాష మూలాలు వేరు అనిపించదు. నేను భాషా శాస్త్రవేత్తను కాదు కాబట్టి, ఒక వేళ సంస్కృతం విడిగా ఉండి ఉన్నా నేను పుట్టే సరికే ఎన్నో వందల ఏళ్ళ క్రితమే (కనీసం) తెలుగు, సంస్కృతం విడదీయరాననంత కలిసిపోయాయి కాబట్టి నాకు అలా అనిపిస్తోందేమో? సరే ఈ మడి పరాయి భాషల దగ్గరే ఎందుకు మానుకోవాలి. సంస్కృతాన్ని అంటరాని భాషగా ఎందుకు చూడాలి, అని అనిపించింది నాకు ఈ టపా చదివాక.
ఈ నాడు అటు అచ్చ తెనుగు అనబడేవీ, ఇటు సంస్కృతం అనబడేవీ, ఇంకా తెలుగులోనే మాండలికాలు అనబడేవీ అనేఏక పదాలు "చదువుకున్న" వారికి తెలియవు అన్న మాటతో ఏకీభవిస్తూనే ఆంగ్లంలో కూడా తెలియని ఎన్నో మాటలు ప్రతి రోజూ కనిపిస్తుంటాయి. వాటి అర్థాలు మనం వెతికి తెలుసుకుంటూ ఉంటాం. అందుకు చాలా ఉపకరణాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. తెలుగు దగ్గరికి వచ్చే సరికి తెలిసే ఉండాలి అనుకుంటాం. నేర్చుకోవాలి, తెలుగు వారైనంత మాత్రాన తెలుగు పదకోశం అంతా కంఠతా వచ్చి ఉండాలన్న నియమం లేదని ఎందుకు అంగీకరించడానికి కష్టంగా ఉంటుంది అని కూడా ఒక ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉంటుంది.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

లలిత గారికి స్పందనకి కృతజ్ఞతలు.తెలుగు సంస్కృత జన్యమా మూలద్రావిడ భాషనుంచి వచ్చిందా అనేది భాషా శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ణయించేరు.అయినా ఆ విషయంలో మాట్లాడడానికి భాషా శాస్త్రవేత్తను కాను కనుక నాకు ఏ మాత్రం ఆధికారం లేదు. ఆ విషయం ఇక్కడ చర్చకు రాలేదు. నేను చెప్పేదల్లా ఒక్కటే, సంస్కృతం నుండి స్వీకరించి నట్లే అవసరమైన పదాలు ఆంగ్లంనుంచో మరో భాషనుండి వచ్చి చేరినప్పుడు వాటిని అంగీకరించడంలో తప్పులేకపోవడమే కాదు మంచిది కూడా అని.మరో విషయం.ఛాందసులెంత గీపెట్టినా అవసరం జనం చేత వాటిని అంగీకరింపజేస్తుంది.ఇంత వరకూ జరిగిందదే. ఇకముందు జరుగబోయేదీ అదే.

Narayanaswamy S. చెప్పారు...

ఆలోచించాల్సిన విషయాలే. కానీ కొత్త పదాల సృష్టి, ఇదివరకే ఉండి మరుగున పడిపోతున్న పదాల వాడుక పునరుద్ధరణ కూడా ముఖ్యాంశాలే భాషని అభివృద్ధి చేసుకోవడంలో. బాగా ప్రాచీన భాషలయి ఉండి ఇప్పుడు అధునాతన జీవితానికి కూడా ఉపయోగపడుతున్న హీబ్రూ, చైనీస్, జపనీస్ భాషల్ని గమనించండి.

పంతుల జోగారావు చెప్పారు...

బాగుంది. ఏ భాషయినా ఆదాన ప్రదానాల వలనే కదా
పదజాలాన్ని మరింత వృద్ధి పరచు కునేది. అచ్చ తెనుగు కను మరుగవడనికి సంస్కృతమే కారణం అనడం సరి కాదు. కేవలం అచ్చ తెలుగులో రాసిన యయాతి చరిత్ర మొదలయిన గ్రంథాలు ( ఉన్నవే ఒకటో, రెండో ) అవి కూడా ఎప్పుడో అట కెక్కి పోయాయి. సంస్కృత సమాస పద భూయిష్ఠమైన ఆముక్త మాల్యద ,శ్రీనాథుని కాశీ ఖండాలు మొదలయినవి చదవాలనే కుతూహలం కొంత మంది లోనయినా సజీవంగా ఉంది. అందు చేత, ఏ మాట అయినా ఉచ్చారణా సౌలభ్యం ఉంటేనే అది మన గలుగుతుంది. లేదా కా గర్భంలో కలిసి పోతుంది. ఆసు పత్రి అనే మాట మీరన్నట్టు కాల గర్భంలో కలిసి పోలేదు. పిచ్చాసు పత్రి అనే వింటాం కానీ పిచ్చి హాస్పటల్ అని వినం.

ఇక, గొప్ప గొప్ప ( ?) ఆంగ్ల పదాలను వాడితే, చెమటోడ్చి, డక్షనరీలు వెతికి అర్ధాలు తెలుసు కొని, వాడిదేం ఇంగ్లీషురా బాబూ. అద్భుతం చాలా గొప్పగా రాస్తాడు అంటూ కితాబు ఇచ్చే వాళ్ళే కఠిన మయిన
తత్సమ పదం ఏదయినా కన బడితే నొసలు చిట్లించడం ఆశ్చర్యం.
అన్య దేశ్య పదాల కృతకానువాదాల జాడ్యాన్ని అందరూ ముక్త కంఠంతో నిరసించడం ఎప్పుడో జరిగి పోయింది.

ఇప్పుడు తెలుగును ఎలా కాపాడు కోవాలా అన్నదే మన ముందున్న ప్రశ్న. మీ సూచనలు బాగున్నాయి. ముఖ్యంగా శతక పద్యాలను విధిగా వల్లె వేయించాలి. వాటి అర్ధ తాత్పర్యాలు చెప్ప గలిగేలా తీర్చి దిద్దాలి. ఈ పునాది మీద భాషాభి మానపు సౌధాలు లేస్తాయి. చని పోయిన అవ్వ నగలు మన కాలేజీ అమ్మాయి ఎప్పుడూ పెట్టు కోదు.
కానీ, వాటి విలువ ఏమిటో మనమే సున్నితంగా వివరించాలి.

SNKR చెప్పారు...

బాగా చెప్పారు. ఇంగ్లీషు కూడా లాటిన్, గ్రీకు, ఫ్రెంచ్, లాంటి ఎన్నో భాషల్లోని పదాలను కలుపుకుంటూ విస్తరించినట్టు, తెలుగు కూడా విస్తరించాలి.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

స్వామి గారికీ పంజో గారికీ SNKR గారికీ కృతజ్ఞతలు.స్వామి గారు చెప్పినట్టు మరుగున పడిపోయిన తెలుగు పదాల్ని వెలికి తీయడం, కొత్తపదాల సృష్టి కూడా ముఖ్యమే.ఈ పని రచయితలు చేయాలి.నేననేది కేవలం ఆంగ్ల భాష మ్లేఛ్ఛ భాష అనే ఈసడింపుతో ఆ భాషా పదాల్ని తృణీకరించి కృతకమైన పదాల్ని సృష్టించుకోవ డానికి ప్రయత్నించ వద్దని మాత్రమే.అలా చేసినా కాల పరీక్షకు అవి నిలిచే అవకాశంలేదు. పంజో గారికి -- నేను చెప్పింది హాస్పిటల్, ఆసుపత్రి అనే మాటలు నిలిచాయి కానీ వైద్యాలయం అనేది వాడుక లోకి రాలేదనే. ఫిల్లల లందరి చేత శతక పద్యాలు వల్లె వేయించాలన్నది మంచి సూచన. పిల్లలే కాదు పెద్దలకి కూడా చాలా మందికి శతక పద్యాలు రావు.అవి చదివి నేర్చుకుందికి వయసు ఆటంకం కాదు.ముందుగా పెద్దలే ఈ పని మొదలు పెడితే మంచిదేమో ఆలోచించండి.

ఆ.సౌమ్య చెప్పారు...

మంచి చర్చ. కొత్త పదాలను కలుపుకుంటూ పోవడం ఎంత అవ్సరమో, పాత పదాలను వెలికి తీయడం కూడా అంతే అవసరమేమో. వాడుతుంటేనే కదా పదాలు అలావటయ్యేది, చిరస్థాయిగా నిలిచేదీను. ఈ సందర్భంగా నిన్నటి ఈనాడులో ప్రచురింపబడిన ఉపాధ్యాయుల నరసింహమూర్తి మేషారి వ్యాసం వీలైతే చదవండి.

ఆ.సౌమ్య చెప్పారు...

లలితగారు తెలుగు సంస్కృత జన్యం కాదని, మూల ద్రవిడ భాష నుండి పూట్టిన తియ్యని భాషని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిరూపించారు. వాటిని సంబంధించి సురేశ్ కొలిచాల గారు రాసిన రెండు మంచి వ్యాసాలను ఇక్కడ ఇస్తున్నాను. వీలైతే చదవండి. మీకు వచ్చిన సందేహాలు చాలామటుకు నివృత్తి అవుతాయని ఆశిస్తున్నాను.

http://www.eemaata.com/em/issues/200511/43.html

http://www.eemaata.com/em/issues/200701/1049.html

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

సౌమ్య గారికి కృతజ్ఞతలు. ఉ.నరసింహమూర్తిగారి వ్యాసం తప్పక చదువుతాను.మారు మూల తెలుగు పదాలు ఏవైనా తెలిస్తే వ్రాస్తూ ఉండండి. మీరు నిడదవోలు మాలతి గారి బ్లాగులో వారి బుచ్చినాన్నగారి కథ ఉంది.ఓ సారి చదవండి.విజీనారం వెళ్లివచ్చినట్టుంటుంది.

lalithag చెప్పారు...

సౌమ్య గారూ,
Thanks. మంచి లంకెలు ఇచ్చారు.
నాకు సురేష్ కొలిచాల గారి వ్యాసాలు చాలా ఇష్టం.
చర్చ కూడా బావుంది. ఎంత చక్కగా తెలుగులో చర్చించుకున్నారో. తెలుగులో అంత స్పష్టంగా అభిప్రాయాలు చెప్పగలగడం చూస్తుంటే ఎంత బావుందో. తెలుగు సరిగా రాక, వేరే భాషలూ పూర్తిగా మనసులో ఉన్నది చెప్పడానికి సహకరించక అన్నిటినీ కలిపి మాట్లాడేసే నాలాంటి వాళ్ళకి తెలుగులో ఎంత బాగా వ్యక్తీకరించుకోవచ్చో అన్నదానికి ఈ చర్చలు మంచి ఉదాహరణలు.ఈ చర్చలు నిరంతరం నడుస్తూ ఉండేలా చెయ్యడం వల్ల ప్రయోజనం ఎంతైనా ఉంటుంది. ఎంత ఆసక్తి ఉన్నా, ఎన్ని ప్రశ్నలున్నా పని కట్టుకుని వెతికి చదువుకునే వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. కానీ అదే పనిగా కనిపిస్తుంటే ఆ extra mile వెళ్ళని వారు కూడా మెల్లగానైనా వాళ్ళ ఆలోచనలని పెంచుకునే అవకాశం ఉంటుంది. హారంలో వ్యాఖ్యలు, టపాలు అదే పనిగా refresh అవుతాయి. ఐనా తృప్తినిచ్చే చర్చలు కనిపించడం చాలా అరుదు. ఐనా చూడడం మానం నా లాంటి వాళ్ళం. అప్పుడు ఇటువంటి చర్చలు తరచూ కనిపిస్తుంటే ఎక్కువ సార్లు ఎక్కువ మందిమి చదువుతామేమోనని ఆశ.
ఇక సౌమ్య గారూ, ప్రశ్నలకి సమాధానలు దొరికిపోతే ఇక అందులో మజా ఏముంది? కొన్నిటికి దొరికినట్లనిపించాయి. కొన్ని విషయాలు ఆలోచింపచేస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ చదవాలి ఈ వ్యాసాలు. ఎందుకంటే కొంచెం చదివాక ఆలోచనలు పెరిగి అర్థం చేసుకోవడం తగ్గుతుంది. మళ్ళీ చదవాలి మళ్ళీ కొత్త ప్రశ్నలను, సమాధానాలను ఎదుర్కోవాలి. నిజంగా ఎవరో అన్నట్టు (వాళ్ళు research అన్నారు) మళ్ళీ తరగతి గదిలో కూర్చుని ఈ విషయాలు వింటే బావుంటుందనిపిస్తుంది. ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం కష్టం. ఎందుకంటే ప్రశ్న అడిగే వాళ్ళ మనసు లోతుల్లో అప్పటికే సమాధానం ఉంటుంది అనిపిస్తుంది. ఎవరి ప్రశ్నలకి వాళ్ళే సమాధానాలు వెతుక్కోవాలి. ఐతే ఇటువంటి వ్యాసాల గొప్పదనం ఏంటంటే ఆ వెతుక్కోవడానికి సహాయం చేసేలా ఆలోచనలను ప్రోత్సహిస్తాయి.
ఇలా వ్రాస్తూ పోతే సాగుతూనే ఉంటుంది. ఇప్పటికి ఇంతే.
Thanks again.

प्रवीण् शर्मा చెప్పారు...

తెలుగులో ఇతర భాషల పదాలు కలపడానికి నేను వ్యతిరేకం కాదు. తెలుగులో ఇంగ్లిష్ పదాలు కలపకుండా సంస్కృత పదాలో, మూల ద్రవిడ భాష పదాలో కలిపి మాట్లాడితే సత్తె కాలపు సత్తెయ్య అనే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అలాగే హిందీలో ఉర్దూ పదాలు కలపకుండా సంస్కృత, ప్రాకృత పదాలు కలిపినా అలాగే చూసేవాళ్ళు ఉన్నారు. మనకి వచ్చిన భాష మనం మాట్లాడడమే అవమానం అయిపోయింది ఈ దేశంలో.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
.ఈ మడిబట్ట కధ చాలా బాగుంది. ఇది చదువు తుంటే నాకు నేను చేసిన ఒక వె~ఱ్ఱి పని గుర్తు కొస్తోంది . ఒకసారి ఒక చిన్న ఇత్తడి గిన్నెలో పాలు పోసి కుక్క పిల్లకి పెట్టాను .అల్లాగే రోజూ పోసేదాన్ని . ఒకరోజు నేను బయటికి వెళ్ళ వలసి వచ్చింది అప్పుడు " ఇది కుక్క పాలు తాగిన గిన్ని కదా ! దీన్ని ఎవరు తెసుకేడతారులే " అని బయట వదిలేసాను .ఇంతే సంగతులు .[ అప్పుడు మాఇంటికి చుట్టు గోడ లేదు ] కొన్ని అనుభవాలు తమాషాగా ఉంటాయి.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

రాజేశ్వరిగారికి, మీ అనుభవాన్ని కూడా చెప్పినందుకు సంతోషం.నీతి నియమబధ్ధులెవరూ దొంగలు కాలేరు.ఏ విషయంలోనైనా సరే,ఛాందసత్వం మనని సరైన ఆలోచనని చేయనివ్వదు.అందుకే ఆ కథ చెప్పి వ్యాసం మొదలెట్టాను.

lalithag చెప్పారు...

అనుకోకుండా బూదరాజు రాధాకృష్ణ గారి "తెలుగు సంగతులు" పుస్తకం కినిగే లో చూడడం తటస్థించింది. ఈ చర్చ, ఈమాటలో వ్యాసాలూ చదివిన తర్వాత ఈ పుస్తకం preview చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. కొని చదివి వీలైతే మళ్ళీ ఏమైనా ఆలోచనలు పంచుకుంటాను.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

లలిత గారూ,సంతోషం.నలుగురం కలిసి మన మన అభిప్రాయాల్నీ ఊహలనీ కలబోసుకున్నప్పుడే మన భాషా జ్ఞానం పెరుగుతుంది.ఒకరికి అందుబాటులో ఉన్న పుస్తకాలు మరొకరికి దొరకకపోవచ్చు.దొరికి చదివినా ఒకరికి తట్టిన ఆలోచన మరొకరికి తట్టకపోవచ్చ్దుకదా?. exchange of views certainly enhances our perceiving capacity.క్రొత్త ఆలోచనలనీ చర్చలనీ స్వాగతిస్తూనే ఉంటాను.

Sanghamithra చెప్పారు...

మీరు చెప్పిన మడి బట్ట ఉపమానం బాగున్నా, దొంగ తనం ఆపడానికి వేరే మార్గాలు వెతకాలి, ముళ్ళ కంచ వేయడమో, విద్యుత్ తీగ తగిలించాడమో, వగైరా. ఒక దారి మూసుకు పోతే ఇంకొక దారి వెతకాలి. ఇప్పటికే తెలుగు నీరు గారి పోతోంది, ఇతర భాషలతో పోల్చి చూస్తే (పొరుగున ఉన్న కన్నడ, తమిళ్). వారికీ మన లాంటి సమస్యే ఉంది, 'ఇంగ్లీష్'. ఐన వారి వంతు ప్రయత్నం వారు చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, రోబోట్ సినిమా ను తెలుగు లో రోబో అన్నారు, తమిళ్ తో యంత్రాన్ (తెలుగు dubbing పాట లో 'యంత్రుడు' అని కూడ విన వచ్చు) అన్నారు. అక్కడ ఇంగ్లీష్ సినిమా టైటిల్స్ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్త మైనందున. తెలుగు భాష మీద ఇప్పటికే చాలా అలసత్వం, నిర్లిప్తత తెలుగు వారి లో చోటు చేసు కున్నాయి. ఏప్పటికైన చావు తప్పదని ముందే నిర్వీర్యులం కాముగా. దానిని దూరం చేయడానికే ప్రయత్నిష్టాం. అలాగే తెలుగు భవిష్యత్తు అగమ్యగోచరం గా వుండిన వుండ వచ్చు గాక, కాని తెలుగు వెలిగేందుకు మన వంతు ప్రయత్నం మనం చేద్దాం.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

సంఘమిత్రగారికి,స్పందనకి కృతజ్ఞతలు.నా వ్యాసంలో నేను చెప్పిందల్లా ఛాందసత్వం తెలుగును కాపాడదనే.పరభాషా పదాలు కొన్ని మన భాషలో వచ్చి చేరితే భాష మైల పడిపోతుందనే ఛాందసత్వంతో ఉంటే అసలుకే మోసం వస్తుందని చెప్పాను. భాష మౌలిక స్వరూపం దెబ్బతినకుండా కాపాడుకుంటూ జన బాహుళ్యం వాడుక లోకి వచ్చి చేరిన అన్యదేశాల్ని అంగీకరిస్తూ ముందుకు సాగాలి.ఇది ఎవరు ఒద్దనుకున్నా జరిగిన జరుగుతున్న విషయం.విపులీకరిస్తూ మరో వ్యాసం త్వరలోనే వ్రాస్తాను.

p.vijay చెప్పారు...

'మంచం' లాంటి పదాలకు కూడ సంస్కృత మూలాలున్నాయని అంటున్నరు. ఆ మాటకొస్తె సంస్కృతమెమి స్వర్గం నుంచి ఇప్పుడున్నట్టుగా ఊడిపడ్దది కాదు. పెక్కు పలుకు ద్రావిడ భాషల్నుండి అందులొకి పొయాయి. మన భాష మనకె సరిగ్గా తెలియనపుడు వాటిని సంస్కృతమ్లొ చదివినప్పుడు ఎలా గుర్తు పట్టగట్టగలం?

p.vijay చెప్పారు...

కొత్త పదాల ఎలుపు అనెది నిలుపు చేసి ఇతరుల పదాలను అరువు తెచ్చుకుంటూ పోతే, రేప్పొద్దున తెలుగు కూడా చుట్టు పక్కలున్న అన్ని బాసల సంకరమే అన్నా మన వాళ్ళు తేలిగ్గ నమ్మేస్తారు. ఇప్పుదనుకోవడంలెద తెలుగు సంస్కృతం నుండే వచ్చినదని. అంతెందుకు మా సంస్కృతం సారు అలగే చెప్పారు 'ఎల్ల భాషలకు తల్లి సంస్కృతంబె ' అని. నేనూ అవుననుకున్నాను మరి మొన్నటిదాక. మనం తెలుగు పదాల ఎలుపు పేరుతో మళ్ళీ పాత సంస్కృతానే పట్టుకునే వెళ్ళాడుతున్నం.అలాంటి మాటలు ఎప్పటికీ జనాల వాడుకలోకి రాలేవు. అందుకే తెలుగు పదాలు అంటె, వీలయినంతవరకు తెలుగు పదాలు, లేదా ద్రావిడ భాషా లక్షణాలు కలిగిన మాటలు కల్పించాలి.చదువుకున్నమనే పేరు పెట్టుకుని, మనమెల్లప్పెడూ సంస్కృతం నుంచి అరగతీసి తీసిన పదాలనే గౌరం అనుకుంతాం. అంతెందుకు, 'మచ్చు ' = ఉదాహరణ. చక్కగా ఉన్న 'మచ్చు ' అనే పదాన్ని వదిలేసి 'ఉదాహరణ ' అని ఊదరగొట్టల్సిన పని ఎముంది? ఇదెనా మన ఇతర భాషల మాటలను కలుపుకుపొవడమంటే. మచ్చుకు, 'జాలాడి ' నే మాట ఇప్పటికీ తెలంగాణా ప్రాంతంలో వినిపిస్తుంది. అంటే ఎంటో ఎరకెనా?='bath room '. ఈ రెంటిలో ఏది తెలిగ్గ ఉందొ మీరే చెప్పండి.ఇతర భాషల మీద మోజు తగ్గించుకుని మనదాన్ని మెరుగు పరుచుకొవటం మంచిది.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

విజయ్ గారూ మీరు చెప్పినది నిజమే. ఈ విషయంలో ఇంకా మరికొన్ని విషయాలు చెప్పాలి.తొందరలోనే విపులంగా మరో పోస్టుతో మీ ముందుకు వస్తాను.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పండితులు గొప్పలకు బోయి , బాధ్యతలను
మరచి , గీర్వాణమెంచి , ఏమార రెపుడు ,
ప్రజలు మాటాడు భాష చేపట్టి నపుడె
రచన చదువరి కర్థమై రాణ కెక్కు

బ్లాగు : సుజన-సృజన

కమనీయం చెప్పారు...

డియర్ కృష్ణా,మోహన్ చెప్తే పై బ్లాగుని చదివాను.వ్రాయాలంటే చాలా ఉంది.ఇక్కడ సాధ్యం కాదు .క్లుప్తం గా సమీక్షిస్తాను.1.తెలుగు ద్రావిడమూలభాషా జన్యమని ఎప్పుడో భాషా శాస్త్ర వేత్తలు నిర్ధారించారు.2.కాని సంస్కృత ,ప్రాకృత భాషాప్రభావం తెలుగుమీద ఎక్కువ.కావ్యాల్లోనేకాదు.సామాన్యభాషమీదకూడా.అలాగే కన్నడం,మళయాళం మీదకూడా .తమిళం మీద సంస్కృతప్రభావం ఉన్నా తక్కువ .తర్వాత ఉర్దూ ప్రభావం ,ఇప్పుడు ఇంగ్లీషు ప్రభావం ఉన్నది.3,అందువలన కావ్యభాషకాక,సామాన్యులు మాట్లాడే భాషలోకి వచ్చిన అన్య భాషాపదాలను ఇముడ్చుకోవచ్చును.4.ఇంగ్లిష్ లో కూడా నూటికి 70 పదాలు ఆంగ్లోశాక్జన్ కాదు .లాతిన్ ,ఇంకా ఇతర యూరపియన్ ,ప్రపంచ భాషలెన్నిటి నుంచో అరువు తెచ్చుకొన్నవే.జపాంభాష కూడా అంతే.ఐనా అవి తమ స్వంత ప్రత్యేకతను నిలబెట్టుకున్నవి కదా 5.తెలుగుకూడా అన్య పదాలను ( ఇంగ్లిష్ తో సహా ) చెర్చుకొని తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి6.పత్రికలు చాల తెలుగుపదాల్ని వాడుకలోకి తెచ్చాయికదా.సైన్సు ,టెక్నాలజీ లో ఎక్కువ ఆంగ్లపదాలని వాడినా,చరిత్ర,పౌరవిషయాలు ,రాజకీయాలు,కళలు విషయంలో తెలుగుపదాలే వాడవచ్చును.7.ఇంగ్లిష్ లో ఎంత ప్రావీణ్యం సంపాదించినా తెలుగువారందరూ,తెలుగు మాట్లాడడం ,వ్రాయడం ,చదవడం నేర్చుకొని ఉండాలి.8.తెలుగులో పత్రికల్లో వైద్యం గురించి వ్యాసాలు వస్తున్నాయికదా,నేను రచించిన ఇంగ్లిష్- తెలుగు వైద్యనిఘంటువు కాపీలు అన్నీ అమ్ముడు పోయాయి.అనేక ఇతర శాస్త్రాలు,కళలు గురించి తెలుగులో పుస్తకాలు రావాలి.9.ఐతే మీరన్నట్లు మడికట్టుకు కూర్చో కూడదు.అవసరమైనంతవరకూ ఇంగ్లిష్ పదాలు వాడవచ్చును.10.మాట్లాడినప్పుడుకన్నా రాసినప్పుడు తెలుగు ఎక్కువగా వాడవచ్చును.

కమనీయం చెప్పారు...

డియర్ కృష్ణా,మోహన్ చెప్తే పై బ్లాగుని చదివాను.వ్రాయాలంటే చాలా ఉంది.ఇక్కడ సాధ్యం కాదు .క్లుప్తం గా సమీక్షిస్తాను.1.తెలుగు ద్రావిడమూలభాషా జన్యమని ఎప్పుడో భాషా శాస్త్ర వేత్తలు నిర్ధారించారు.2.కాని సంస్కృత ,ప్రాకృత భాషాప్రభావం తెలుగుమీద ఎక్కువ.కావ్యాల్లోనేకాదు.సామాన్యభాషమీదకూడా.అలాగే కన్నడం,మళయాళం మీదకూడా .తమిళం మీద సంస్కృతప్రభావం ఉన్నా తక్కువ .తర్వాత ఉర్దూ ప్రభావం ,ఇప్పుడు ఇంగ్లీషు ప్రభావం ఉన్నది.3,అందువలన కావ్యభాషకాక,సామాన్యులు మాట్లాడే భాషలోకి వచ్చిన అన్య భాషాపదాలను ఇముడ్చుకోవచ్చును.4.ఇంగ్లిష్ లో కూడా నూటికి 70 పదాలు ఆంగ్లోశాక్జన్ కాదు .లాతిన్ ,ఇంకా ఇతర యూరపియన్ ,ప్రపంచ భాషలెన్నిటి నుంచో అరువు తెచ్చుకొన్నవే.జపాంభాష కూడా అంతే.ఐనా అవి తమ స్వంత ప్రత్యేకతను నిలబెట్టుకున్నవి కదా 5.తెలుగుకూడా అన్య పదాలను ( ఇంగ్లిష్ తో సహా ) చెర్చుకొని తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి6.పత్రికలు చాల తెలుగుపదాల్ని వాడుకలోకి తెచ్చాయికదా.సైన్సు ,టెక్నాలజీ లో ఎక్కువ ఆంగ్లపదాలని వాడినా,చరిత్ర,పౌరవిషయాలు ,రాజకీయాలు,కళలు విషయంలో తెలుగుపదాలే వాడవచ్చును.7.ఇంగ్లిష్ లో ఎంత ప్రావీణ్యం సంపాదించినా తెలుగువారందరూ,తెలుగు మాట్లాడడం ,వ్రాయడం ,చదవడం నేర్చుకొని ఉండాలి.8.తెలుగులో పత్రికల్లో వైద్యం గురించి వ్యాసాలు వస్తున్నాయికదా,నేను రచించిన ఇంగ్లిష్- తెలుగు వైద్యనిఘంటువు కాపీలు అన్నీ అమ్ముడు పోయాయి.అనేక ఇతర శాస్త్రాలు,కళలు గురించి తెలుగులో పుస్తకాలు రావాలి.9.ఐతే మీరన్నట్లు మడికట్టుకు కూర్చో కూడదు.అవసరమైనంతవరకూ ఇంగ్లిష్ పదాలు వాడవచ్చును.10.మాట్లాడినప్పుడుకన్నా రాసినప్పుడు తెలుగు ఎక్కువగా వాడవచ్చును.

Pantula gopala krishna rao చెప్పారు...

కమనీయం గారికి, మీరు నా భావాలతో ఏకీభవిస్తున్నందుకు సంతోషం. మీ వంటి పెద్దలు ఓపిగ్గా నా బ్లాగు చదువుతున్నందుకు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. వ్యవహారికంలో మడికట్టుకోవద్దని చెప్పినా మన కావ్యభాషని మనం కాబాడుకోవాలన్నదే నా ఆశయం కూడాను.భాషకి సంబంధించి నేను తర్వాత వ్రాసిన వ్యాసాలని కూడా మీరు చదవాసని నా కోరిక.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

బూదరాజు రాధాకృష్ణ గారు(మా గురువు గారు)ఒకమాట చెప్పేవారు, ‘మారుమూల పదాలు వాడితే పండితుడివి అనిపించుకోవచ్చు గానీ ప్రజలకు(పాఠకులకు ఒక్కనాటికీ దగ్గర కాలేవూ ’అని.గొప్పల కోసం తప్ప పెద్దపెద్ద మాటలు ఎందుకువాడతారో తెలీని సందర్భాలున్నాయి చాలా.

Pantula gopala krishna rao చెప్పారు...

రాజేంద్ర కుమార్ గారికి,స్పందనకు కృతజ్ఞతలు.

bondalapati చెప్పారు...

గోపాల కృష్ణ గారు,
ఈ టపా మరియూ ఇందులోని లంకెల వలన చాలా తెలియని విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.
నాకు నచ్చని విషయం ఏమిటంటే, ఓ పదేళ్ళ క్రితం, "నగరాలలోని దుమ్మూ పొగని తట్టుకొనటం కష్టం", అనే వాళ్ళం.
ఇప్పుడు అదే వాక్యాన్ని ఇలా అంటున్నాం, "సిటీల లోని పొల్యూషన్ లో సర్వైవ్ అవ్వటం కష్టం".
ఈ మార్పు అవసరమా?

Pantula gopala krishna rao చెప్పారు...

బొందలపాటి వారికి,టపా చదివి నందుకు ధన్యవాదాలు.మీరు చెప్పిన "సిటీలోని పొల్యూషన్ లో సర్వైవ్ అవడం కష్టం" అనే వాళ్లు తెలుగు మాట్లాడే వాళ్లలో10 శాతం కూడా ఉండరు.పల్లెటూళ్లలోనూ,స్త్రీల సంభాషణలలోనూ ఈ జబ్బుఅంత తొందరలో రాదు.మరేం ఫరవాలేదు.సిటీ,పొల్యూషను,అనే మాటలు కొన్నాళ్లకి చాలా ఎక్కువమంది వాడే అవకాశం ఉంది.దానిని మీరు ఏవిధంగానూ ఆపలేరన్నదే నా అబిప్రాయం.తెలుగు భాష ఇటువంటి పదాలనన్నిటినీ తనలో చేర్చుకుంటూనే వృధ్ధి చెందుతుంది.ఏ చట్టాలూ ఎవరి ప్రయత్నాలూ దీనినాపలేవు.ఈ మార్పు నాకు గాని మీకు గాని ఇష్టమా లేదా అన్నది అప్రస్తుతం.

buddha murali చెప్పారు...

బాగుంది మడి కట్టుకోవడం ద్వారా క్రమంగా అంతరించి పోతారో ... మడిని పక్కన పెట్టి జీవ భాషగా ఉంటారో తేల్చుకోవాలి

Pantula gopala krishna rao చెప్పారు...

మురళి గారికి, చాల కాలం క్రిందట వ్రాసిన ఈ పోస్టు ఇప్పటికైనా మీ కళ్ల బడింది.ధన్యోస్మి.

అజ్ఞాత చెప్పారు...

నమస్కారం-
మీ అభిప్రాయాలు చాలా మటుకు బాగున్నాయి. కొన్ని పదాలను అవసరాన్ని బట్టి హాయిగా ఎరువు తెచ్చేసుకోవచ్చు. నిజమే. కానీ ఎంతవరకు అనేదగ్గర వస్తుంది సమస్య. వాడుకలో ఉన్న వాటిని కూడా మనం ఫ్యాషన్ కోసం, ఆధునికత గుర్తింపు కోసం తీసిపారేస్తుంటాం కదా. అయితే అన్ని పదాలకూ అచ్చ తెలుగులోనే సమానార్థకాలు కావాలనుకోవడం అత్యాశే. దేశ-కాలాల మార్పుతో పాటు ఎన్నో వస్తువులు వాడకంలోకి వచ్చాయి. పదాల అవసరం పెరిగింది. కాలం పరిణామదశలో పదాల మీద, భాషమీద తగినంత దృష్టి సారించి ఉంటే భాషకు ఇంత అన్యాయం జరిగేది కాదేమో. మధ్యలో సంస్కృతం గురించిన చర్చ అనవసరం. సంస్కృతం మనది. ఆంగ్లం బయటి నుంచి వచ్చి మన మీద రుద్దబడింది. ఆ తేడా మర్చిపోయి ఇట్లగే ఇప్పుడు జరిగినట్టే అప్పట్లో జరిగిందని నిర్ధారించటం తప్పు.
ఇక్కడ అదంతా అప్రస్తుతం అనుకోండి- అయితే రెండు మాటలు చెప్పదలిచాను-
1. రైల్వే సిగ్నల్ కి సూచించిన పదం—ధూమ్ శకట్ కా ఆవక్ జావక్ సూచక్ యంత్ర్—అనిట. ఏం సొగసుగా ఉంది? ...అనే చాంతాడు మాటని ఎవ్వరూ ఉపయోగించరు.
రైల్వే సిగ్నల్ ని మనం వాడుకలో కేవలం సిగ్నల్ అంటాం. కనక- సూచక్, లేదా సూచికా అంటే సరిపోయేది. చాంతాడులా చేసింది హ్రస్వదృష్టీ, తొందరపాటే కానీ వేరే కాదు. పదానికి బదులు వాక్యాన్ని సృష్టించి, మళ్ళీ అదెటూ వాడుకకు సరిపోదు కనక దాన్ని తిట్టి, ఇది కుదరని పని అని నిశ్చయించి, మంచి సమానార్థక పదం మన భాషలో లేదని, రాదని నిర్ధారించి, ఆ శ్రమ నుంచి తప్పించుకోవటం వల్లే ఇంత అనర్థం జరిగిందేమో.

2. మడి- దానికి మడి తడి అంటూ పద్దతులను తప్పుపట్టటం వల్ల ప్రయోజనం లేదు. ఆ నష్టం కేవలం భాషకే కాదు, చాలా సంస్కృతి సంప్రదాయాలకు కూడా జరిగింది. వాటిని అర్థం లేనివిగా తీసిపారేసే ముందు కనీసం ఒక్కసారైనా ఆలోచించి ఉంటే బాగుండేది.
ఉదాహరణకు- ప్రాణిక్ హీలింగ్ అనే ఒక శారీరక మానసిక బాధానివారణ పద్ధతి ఉంది. అక్కడ నేను మొదటిసారి తెలుసుకున్నాను - ఉప్పు తిప్పటం వెనక ఉద్దేశం. అప్పటిదాకా నేనూ (దాని ప్రయోజనం ఒక వంక పొందుతూనే) అది మూఢనమ్మకమని భావించేదాన్ని.
అట్లగే మడితో వంట చేయటం వెనక ఉన్న వైజ్ఞానిక కారణాలు చాలా తెలిశాయి ఈ మధ్య.
మడి అనేది పూజకు, వంటకు కావాల్సిన వైద్యపరమైన, ఆధ్యాత్మిక పరమైన జాగ్రత్తలకు సంబందించిన ఒక కట్టడి. దాన్ని అక్కడే ఉపయోగించాలి.
దొంగతనం నివారించటం వంటి తప్పుడు (లేదా మిస్ ప్లేస్డ్) ప్రయోజనాలకు మడి లాంటివాటిని ఉపయోగించి, అది ఉపయోగపడాల్సిన అసలు చోట కూడా పనికి రానిదని తేల్చి చెప్పటం హాస్యాస్పదం.

ప్రతీదానికి వెనక ఆలోచిస్తే చాలా లోతైన కారణాలుంటాయి. అది ఆలోచించే సహృదయం మనకు ఉండాలి. అంతే. అన్నింటినీ, అవి తప్పు అని నిర్ధారితమయ్యే లోపే, కేవలం పాతవి కనక తీసి పారేయటం విజ్ఞత అనిపించుకోదు.
మీ వ్యాసం ప్రారంభం (ఎత్తుగడ), మీ వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాలకు సరిగ్గ సరిపోయింది. అక్కడ జరిగిన అన్యాయమే ఇక్కడా జరిగింది.
దేని ఉద్దేశం ఎక్కడో దానిని అక్కడ అప్లై చేయాలి అని చెప్పటమే నా ఉద్దేశం.
ధన్యవాదాలు
ఉష