27, డిసెంబర్ 2012, గురువారం

మన తెలుగు భాష చిరంజీవి..


.
ఈ మధ్య మన బ్లాగుల్లోనూ, ఇతరత్రా కొన్ని చోట్లా తెలుగు భాష అంతరించి పోయే దశలో ఉందనీ భాషాబిమానులందరం దానిని నివారించడానికి నడుంకట్టుకోవాలనీ  పదే పదే  వ్రాయడం వాపోవడం చూస్తున్నాము.నిజంగా తెలుగు భాష అట్లాంటి అవసాన దశకు చేరుకుందా?  అనతి కాలంలోనే ఇంత మధురమైన మన భాష అంతరించి పోబోతున్నాదా?ఇంతకుముందు లేనిది కొత్తగా వచ్చిన ముప్పు ఏమిటి?ఈ భయాలకు కారణాలేమిటి? కొంచం నిదానంగా పరిశీలిద్దాము.
చాలా మంది చెప్పే ముఖ్యమైన విషయం ఈ తరం యువత ఇంగ్లీషు భాషా వ్యామోహంలో పడి మన తెలుగు భాషని అశ్రధ్ధ చేస్తున్నారని. నేను దీనిని ఇంగ్లీషు వ్యామోహం అనను.ఈ రోజుల్లోయువతకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పని సరి.అది లేక పోతే వారికి మనుగడే కష్టమౌతుంది.నిజానికి పల్లెటూళ్లలో చదువుకుని వచ్చే యువకుల్లో చాలా మందికి ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడడం రాకపోవడం వారికి శాపమే అవుతోంది. వారు పట్టణాల్లోమంచి స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకంటె తెలివైన  వారైనా కూడా ఈలోపం వారికి సరైన అవకాశాలు రాకుండా చేస్తోంది. వారిని కృంగదీస్తోంది.అందుచేత ఇంగ్లీషుని పణంగా పెట్టి              మనతెలుగుని ప్రోత్సహించాలని పూనుకోవడం సరికాదు.అటువంటి ప్రయత్నం ఎన్నటికీ సఫలం కానేరదు.ఇంగ్లీషుకివ్వాల్సిన సముచిత స్థానం ఇస్తూనే మన తెలుగు భాషాభివృధ్ది ఎలా చేయగలమో ఆలోచించుకోవాలి. కొంతమంది ఇంగ్లీషు స్థానంలో తెలుగును ప్రథమ భాషగా చేయాలనీ  విద్యాలయాల్లో తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి చేయాలనీ సూచిస్తున్నారు. ఇదీ సమంజసమైనది కాదు.ఈ రోజుల్లో అనేక ప్రాంతాలకు చెందిన వారు అనేక భాషలు మాట్లాడే వారు ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో దేశం నలుమూలలా విస్తరించి ఉన్నారు.ఎక్కడెక్కడనుంచో వచ్చిన ఇతర ప్రాంత విద్యార్థులను తెలుగు తప్పని సరిగా నేర్చుకోవాలనడం సమంజసం కాదు. మన తెలుగు పిల్లలే వేరే రాష్ట్రాలలో చదువుకోవలసి వచ్చినప్పుడు అక్కడి భాష నేర్చుకు తీరాలంటే ఎంత కష్టమో ఊహించుకుంటే ఈ వాదనలోని అసమంజసత్వం బోధ పడుతుంది.తెలుగు రెండవ భాషగా ఎక్కువమంది నేర్చుకోవడం అభిలషణీయమే అయినా,విద్యార్థులకు కలిగించే కష్టాలను దృష్టిలో పెట్టుకుంటే  నిర్బంధం మంచిది కాదని చెప్పక తప్పదు.
భాషాభిమానులైన మరికొందరు మిత్రులు బాధ పడే విషయం తెలుగు మాట్లాడే వారు తరచుగా ఎక్కువగా ఇంగ్లీషు పదాల్ని కలిపి మాట్లాడడం.దీనికి అనేకమైన కారణాలున్నాయి.
ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లోనూ వెలసిన టీవీల్లో స్వఛ్ఛమైన తెలుగు స్థానంలో కలగా పులగపు తెలుగింగ్లీష్ వినిపించడం ఒక కారణం.బళ్లో చేరక ముందునుంచే టీవీ చూడడంనేర్చుకున్న ఈ కాలం పిల్లలు దానినే నేర్చుకుంటున్నారన్నది సత్యం.తెలుగు భాష పట్ల తమకున్న బాధ్యతను టీవీ ఛానెళ్లు విస్మరిస్తున్నాయని చెప్పక తప్పదు. చక్కటి తెలుగు మాటలు చెప్పగలిగే చోట కూడా వారు తమ ప్రసారాల్లో ఇంగ్లీషుని జొప్పిస్తున్నారు.( మన ప్రసార మాధ్యమాల నిర్లక్ష్యాన్నిగురించి చెప్పాలంటే ప్రత్యేక వ్యాసమే వ్రాయాల్సి ఉంటుంది).
పాత రోజుల్లో, స్త్రీలు ఉద్యోగాలు చేయకుండా బయట తిరగకుండా ఉండే రోజుల్లో వారి నోటంట స్వఛ్ఛమైన తెలుగు భాష నుడికారంతో పాటు వినిపించేది. అందువల్ల పిల్లలకూ చక్కటి తెలుగు మాట్లాడడం వచ్చేది.కాని ఈ రోజుల్లో స్త్రీలూ చదువుకుని ఉద్యోగాలు చేస్తుండడంతో  వారి భాషలో కూడా ఇంగ్లీషు పదాలు జొరబడ్డాయి.అందువల్లనే వారు పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇంగ్లీషు పదాలు దొర్లడం అవి పిల్లలకు ఒంటబట్టడం జరిగి పోతున్నాయి. పాతకాలంలో పిల్లలకు అయిదేళ్లు దాటే వరకూ బడిలో వేయకుండా ఇంట్లోనే ఉంచే వారు.ఆసమయంలో వారికి ఇంటిలో పెద్దలు తెలుగు పద్యాలో పాటలో నేర్పించేవారు. ఆ తర్వాత కూడా  వారు చదువుకున్నది తెలుగు బళ్ళలోనే.మరి ఈ రోజుల్లో పిల్లలకు 3 సంవత్సరాలు నిండకుండానే కాన్వెంటు బడుల్లో వేసి, వాళ్లు వచ్చీరాని ఇంగ్లీషు రైమ్స్ చెబుతుంటే మురిసి పోతున్నాము. ఇది ఇంటింటి కథే. మనకి భాషాభిమానం ఉంటే పిల్లలకు చిన్న చిన్న శతక పద్యాలు  ఇంట్లోనే నేర్పించాలి.తెలుగు పద్యాల్లోని మాధుర్యంవారికి ఆ విధంగా ఒంటబడితే పెద్దయ్యాక వారు తప్పకుండా సాహితీ ప్రియులౌతారు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే-తెలుగులో అసలు అన్యభాషాపదాలు చేరకూడదని అందువల్ల తెలుగు మైల పడిపోతుందని భావించడం పెద్ద పొరపాటు. కవులూ భాషాభిమానులూ,రచయితలూ, పాత్రికేయులూ, టీవీల వారూ ఇంగ్లీషు భాషని వీలయినంత పరిహరించి చక్కటి తెలుగు పదాలనే వాడుతూ ఉండాలి. ఆ విధంగా వాడుకలో ఉన్న తెలుగు మాటలు మూలబడిపోయి వాటి స్థానంలో ఇంగ్లీషు పదాలు చోటు చేసుకోకుండా వారు భాషాసేవ చేయవచ్చును. కానీ జన సామాన్యం నిత్య వ్యవహారంలో ఇంగ్లీషు పదాలు దొర్లకుండా మాట్లాడాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది.దీనిని పూర్తిగా ఆపలేము.
ఇవాళ ఇది తెలుగుకి కొత్తగా వచ్చిన ముప్పుకాదు.అధికారంలో ఉన్న భాషల ప్రభావం మిగిలిన భాషల మీద పడడం సర్వత్రా సర్వకాలాల లోనూ ఉన్నదే. తెలుగు భాషకు పెద్ద దెబ్బ సంస్కృతం తోనే వచ్చింది.అదీ ఈ మధ్యన కాదు. వెయ్యేళ్ల కిందటే.ఇవాళ మన తెలుగుభాషలో మన పదకోశాల్లో ఉన్నవి ఎనభై శాతం సంస్కృత పదాలే.నన్నయ మొదలుకొని మన తెలుగు కవులందరూ సంస్కృత  సమాస పద భూయిష్టమైన కవిత్వమే చెప్పారు.రాజాశ్రయం తప్ప వేరే మనుగడలేని పరిస్థితుల్లో అది వారికి తప్పని సరై ఉండవచ్చు. అటువంటి కవిత్వం రాజ్యమేలుతున్నప్పుడు అచ్చతెలుగు కావ్యాలు కనుమరుగవడంలో ఆశ్చర్యమేముంది. 
ఈ రోజు మనకు అచ్చతెలుగు కావ్యాలు చదివితే అర్థంకాని పరిస్థితి నెలకొంది.మంచో చెడో గడచిపోయిన దానిని గురించి విచారించడం (గతజల సేతుబంధనం) నిష్ప్రయోజనం.
సంస్కృతమే కాదు పార్శీ ఉర్దూ పదాలు కూడా మన బాషలో లెక్కకు మిక్కిలిగా చేరాయి.తన కాలంలో జన బాహుళ్యంలో వాడుకలో ఉన్న అనేకమైన పార్శీ  ఉర్దూ పదాలను  శ్రీనాధ మహాకవి నిస్సంకోచంగా ధారాళంగా తన కవిత్వంలో ప్రయోగించాడు.అలాగే మరికొందరు కవులు కూడా. మన తిరుపతి వేంకట కవులు కూడా అన్య దేశ్యాలను (ఇంగ్లీషు పదాలను)  తమ కవిత్వంలోవాడడానికి వెనుదీయ లేదు.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంత మంది ఇంకా ఛాందసంగా కొత్తగా వచ్చి వాడుకలో ఉన్న పరికరాలకు కూడా జనానికి అలవాటైపోయిన ఇంగ్లీషు పేర్లను పరిహరించి తెలుగు పేర్లను సృష్టించి వాడుక లోకి తేవాలని తాపత్రయపడడం, ఆచరణ యోగ్యం కాని ప్రయత్నాలు చేస్తుండడమే.ఇంగ్లీషు మాటలనే మన భాష పధ్ధతిలో అజంతాలుగా మార్చుకుని వాటిని మన తెలుగు పదాలు గానే భావించి స్వీకరించడమే ఉత్తమ పధ్దతి.ఇది నా మాట కాదు. ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు  తెలుగు, ఇప్పటి –భవిష్యత్ అవసరాలను తీర్చే ఆధునిక భాషగా ఎదగాలంటే – సాంకేతిక పదాలను అన్ని భాషలనుంచీ తీసుకుని విస్తృతంగా వాడాలి అన్నారు. ఇంగ్లీషు ప్రపంచ భాషగా ఎదిగిన తీరు అదే.మనం మాత్రం మడిగట్టుక్కూర్చుని ప్రయోజనం లేదు.మనభాష మౌలిక స్వరూపం చెడగొట్టకుండా అవసరమైన అన్యదేశ్యాలను తెలుగు ఉచ్చారణకి అనువుగా మలచుకుని వాడుకో వచ్చు. చిన్న ఉదాహరణ చెబుతాను.మన టీవీ ఏంకర్లు వారికి ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ నుండి కాల్చేస్తున్నారు?” అంటూ ఉంటారు.ఈ కాల్చడం ఎక్కడినుంచి వచ్చింది? ఈ కాన్వెంటు చదువుల అమ్మాయిలు అలా మాట్లాడితే తప్పు అర్థం వస్తుందని సరిదిద్దే వారే ఆ ఛానెళ్లలో లేరా? మీరు ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు?” అనో కనీసం ఎక్కడినుంచి ఫోను చేస్తున్నారు?” అనో అనవచ్చుకదా.మరీ చాదస్తానికి పోయి ఫోను అనే మాటకు శబ్దగ్రహణ యంత్రం అని అనాలని పట్టుబడితే అసలుకే మోసం వస్తుంది. అలాగే ఏంకర్ అనే పదానికి ప్రత్యామ్నాయం వెదుక్కోవడం కూడా. అర్థ శతాబ్దం కిందట, సరదాకే అనుకోండి, తన డిటెక్టివ్ నవల ఒకదానిలో Hearing Aid అనే పరికరానికి విన వీలు పరికరము అని వాడాడు ఆరుద్ర.తెలుగు దేశంలో ఎవరైనా దానిని ఆ పేరుతో పిలవడం ఎన్నడైనా చూడగలమా?కిందటి ఉగాది నాడు ఒక టీవీ ఛానెల్లో కవి వెన్నెలకంటి గారు కంప్యూటర్ కి అన్నీ అని నామకరణం చేస్తున్నానన్నారు.ఇది ఎన్నడైనా వాడుకలోకి వస్తుందా?  భేషజాలకు పోకుండా ఆ ఆంగ్ల పదాలనే మన ఉచ్చరించే రీతిలో వ్రాసుకోవడం ఉత్తమం కదా?
ఈవిధంగా చేస్తే తెలుగు భాషకు ఇప్పట్లో వచ్చే ముప్పేమీ లేదు.ఇంత విశాలమైన భారత దేశంలో హిందీ తరువాత అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే తెలుగు భాష  కనుమరుగైపోయే అవకాశాలు దాదాపు మృగ్యం. తెలుగు భాష ఇప్పుడున్నట్లే ఉండక పోవచ్చు. ఉండదు కూడా.ఏనాడూ వాడుక భాష ఒకే రూపంలో ఉండదు.ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.ఇది వరలో కూడా అలాగే జరిగింది.(దీనిని గురించి మరెప్పుడైనా వివరంగా వ్రాస్తాను). మార్పులూ చేర్పులూ జరిగినా మన భాష మరణించదు. దానికి కారణం మన భాష విస్తారమైన ప్రదేశంలో ఎక్కువ మంది మాట్లాడడమే కాదు, మన ఆంధ్ర దేశం ముప్పాతిక మువ్వీసం గ్రామీణ ప్రాంతంతో అలరారుతోంది.మన పల్లెటూళ్ళు, రైతాంగం, పచ్చగా ఉన్నన్నాళ్ళు తెలుగు బావుటా ఎగురుతూనే ఉంటుంది. మనతెలుగు భాష చిరంజీవి.
ఎనీ డౌట్స్?