ఇంతకు ముందు నేను వ్రాసిన ( మడి బట్ట కట్టి
తెలుగును కాపాడుకోగలమా? Dtd. 21-2-12,
మడీ తడీ .గోదావరీ..Dtd 7-4-12 ) ,అనే రెండు భాషా వ్యాసాల్లో తెలుగు
భాష ఏ నాడూ మడి కట్టుకుని కూర్చో లేదనీ అనేక మైన అన్య భాషా పదాలు తెలుగులో
అవసరంగానూ,అనవసరంగానూ వచ్చి చేరాయనీ వ్రాసేను. నన్నయగారి భారతాంధ్రీకరణంతో మొదలై
అనేక సంస్కృత పదాలు మన కావ్య భాషలో వచ్చి చేరాయి. అంతటితో ఆగకుండా మన
తెలుగుపండితుల సంస్కృత భాషా దురభిమానం వల్ల అవి మన వ్యవహారిక భాషలో కూడా వచ్చి
చేరాయి. ఆవిధంగా అచ్చ తెలుగు చాలా మట్టుకు
కనుమరుగై మన భాష తత్సమ తద్భవ పద భూయిష్టమై పోయింది. ఆ తర్వాత నవాబుల పాలన తెలుగు
దేశం అంతా విస్తరించి నప్పుడు అంతకు ముందు వాణిజ్య వ్యవహారాల మూలంగా తెలుగులో కొద్ది కొద్దిగా చేరిన పార్శీ
అరబ్బీ పదాల సంఖ్య ఎన్నో రెట్లు
పెరిగింది. 14 వ శతాబ్దంలోని తిక్కన భారతంలోనే త్రాసు అనే పదం కనిపిస్తుంది. ఆ
తర్వాత కాలంలో శ్రీ నాధుని కవిత్వంలో ఎన్నో పార్శీ అరబ్బీ పదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత పాలవేకరి కదరీ
పతి, పొన్నిగంటి తెలగనార్యుడు,గోగుల పాటి కూర్మనాథ కవి .. ఒకరేమిటి... ఎందరో కవులు పారశీక పదాల్నీ,పదబంధాల్ని కూడా నిరభ్యంతరంగా
తమ కవిత్వంలో వాడుకున్నారు. కావ్యాల్లోనే అన్ని అన్య భాషా పదాలు చేరాయంటే జన వ్యవహారంలో మరెన్ని ఉండేవో ఊహించుకోవడం
కష్టం కాదు. అలా తెలుగులో పార్శీ అరబ్బీ పదాలు తిన్నగానూ,ఉర్దూ ద్వారాను తెలుగులో చేరి అవి మన తెలుగు పదాలేనేమో అని
భ్రాంతి కలిగించే విధంగా మనకు అలవాటై పోయాయి. కొన్ని పదాల విషయంలో నైతే వాటికి
సమానార్థకాలైన తెలుగు పదాలు ఏమై ఉంటాయో మనకు వెంటనే తట్టని పరిస్థితి ఏర్పడింది.
ఇలా తెలుగులో చేరిన ఈ పదాలేమిటో చూపిస్తాను చూడండి:
ఈ వ్యాసం శీర్షిక లో ఉన్నట్టు “ నేను అసలు సిసలు
పదహారణాల ఆంద్రుణ్ణి..కల్తీ లేని తెలుగే మాట్లాడతాను ” అని ఎవరైనా అన్నారనుకోండి. ఇందులో అసలు మనది
కాదు సిసలు మనది కాదు అణాలూ మనవి కావు. ఆంధ్ర శబ్దం సంస్కృత భవం. ఇంక కల్తీ కూడా
తెలుగు పదం కాదు. ఎక్కడైనా ఈ పార్శీ (ఉర్దూ) పదాల్ని వాడకుండా మనకి “రోజు”
గడవదు.దినము అనము రోజు అనే అంటాము. “రోజు” మనది కాదు. రోజువారీ వాడుకలో కనిపించే రైతు జమీందారు,ఖర్చు ఖైదు,ఫిర్యాదు,కబురు,బజారు,దుకాణము,గాబరా ,ఖాయం పాగా,అర్జీ,దాఖలా,దావా,ఖాళీ, జాగా,ఖజానా హద్దు లూటీ ఈనాము మేకు నగదు జేబు రుమాలుభరోసా నౌఖరీ దమ్ము గాభరా జులుము అజమాయిషీ బదిలీ సలహా సజావులాంటివి ఎన్నెన్నో
పార్శీ పదాలు.. ఎన్నని చెప్పను.. చాలా ఉన్నాయి కానీ.. సరదాగా మన సినీకవులు వాడినవి చూపిస్తాను చూడండి:
ఖుషీ ఖుషీగా నవ్వుతూ ..చలాకి మాటలు రువ్వుతూ హుషారు
గొలిపేవెందుకే నిషా కనులదానా అంటాడు దాశరథి. ఇందులో ఖుషి చలాకీ హుషారు నిషా ఏవీ
మనవి కావుకదా ?
కార్మిక ధీరుల కన్నుల నిండా కణకణమండే గలగలతొణికే
విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే
షరాబులేడంటాడు శ్రీశ్రీ. ఖరీదు షరాబు పదాలు మనవి కావు.
పైలా పైలా పచ్చీసు.. అంటాడు ఆరుద్ర. వయసుకి హుషారు తెప్పించే మాటలివి.
జోరుగా
హుషారుగా షికారు పోదమా.. అంటే ఇవేవీ మనవికావు.
ఇవన్నీ లేక పోతే మనకి “కులాసా”
లేదు కదా అదీ మనది కాదుకదా?
మన
పండితులు కూడా నిరభ్యంతరంగా అన్య దేశ్యాలని వాడే వారు ఉదాహరణకి వారు ఛప్పన్నదేశాలూ అనే వారు. యాభై ఆరు అని అర్థం వచ్చేఈ ఛప్పన్న పదం మనది కాదు.
ఇక్కడొక
విషయాన్ని చెప్పక తప్పదు. తెలుగు నాట ఆంధ్ర ప్రాంతంలో నివసించే వారికి వారిది
కల్తీ లేని స్వఛ్ఛ మైన తెలుగనీ తెలంగాణ ప్రాంతంలోని తెలుగులో ఉర్దూ మాటలు ఎక్కువ గా
కలిసి ఉంటాయనీ ఒక భావన.ఇది పూర్తి నిజం కాదు. కొంచెం తర తమ భేదా లున్నాయంతే. ఆంధ్రప్రాంతంలో
కూడా 1750 ప్రాంతంలో ఫ్రెం చి వారికి ఐదు పరగణాల్ని ధారా దత్తం చేసే వరకూ నిజాము
ఏలుబడి ఉండడంతో ఆ ప్రాంతంలో కూడా పార్శీ ఉర్దూ పదాలు తెలుగులో ఎక్కువ గానే చేరాయి.
తర్వాత చాలా కాలం నిజాము ఏలుబడిలో ఉండడం వల్ల తెలంగాణ లో ఉర్దూ ప్రభావమూ ఆంద్ర
ప్రాంతంలో ఆంగ్ల బాషా ప్రభావమూ ఎక్కువ గా కనిపిస్తాయి. ఇప్పటికీ వెతుక్కుంటే తెలంగాణ
పల్లెల్లోనే అచ్చ తెలుగు పదాలు మిగిలిన ప్రాంతాల కంటె ఎక్కువగా
దొరుకుతాయి. ఏ ప్రాంతం లోనూ కల్తీ లేని తెలుగంటూ లేదు.
వందేళ్ల క్రిందటే ఉత్తరాంధ్రకి చెందిన గురజాడ వారు
తమ కన్యా శుల్కంలో తమ పాత్రల ద్వారా ఎన్నో ఉర్దూ పదాల్ని పలికించారు. ఆడ వాళ్లని అట్టే "రుకాయించ" కూడదంటాడు కరటక
శాస్త్రులు. రోక్నా అనే పదం నుంచి
వచ్చినదిది. రూపాయల్ని"ఫిరాయించి" ఇస్తానంటాడు రామప్ప పంతులు. ఇంకా జరూరు,మజా,
మగ్దూర్,చాడీకోరు,సిఫారసు, బనాయించడం,నాజూకు లాంటి వెన్నెన్నో కనిపిస్తాయి. పాత్రోచితమైన
భాష అన్న తర్వాత జన బాహుళ్యంలో ఉన్న పదాలే కదా ఇవి?
కొన్నేళ్ల
క్రితం మన ప్రమఖ దిన పత్రిక లో “ పెద్దల
సభలో గలాభా” అంటూ పతాక శీర్షికలో వార్త వచ్చి పత్రికాధిపతిని
సభ వారికి క్షమాపణ చెప్పుకునే టట్లు చేసింది. ఈ గలాభా మన తెలుగు పదం కాదు.పార్శీ
నుంచి వచ్చింది.
బాల వ్యాకరణానికి రమణీయం అనే రమణీయమైన వ్యాఖ్య
వ్రాసిన దువ్వూరి వారు ఆ గ్రంథంలోనే “పసందు” అనే మాటని వాడేరు. తెలుగు మాట కాకపోయినా బలే పసందుగా ఉంది
కదూ?
పండితులకే లేని అభ్యంతరం మనకెందుకు? వారికి లేని మడి
మనకేల?
***
ఉన్నమాట చెప్పితీరాలి. నాకు తెలుగు భాష అంటే చాలా
ఇష్టం. అచ్చతెలుగు పదాలు అంతకు ముందు
తెలియనివి ఎక్కడై నా చూస్తే మురిసి పోతాను. కొత్త పదాలు అచ్చతెలుగువే వస్తే మంచిదే
ఆనంద దాయకమే. ( ఈ మాట లో సం.వెం. రమేశ్ గారి తెలుగు వ్యాసాలు నన్ను మురిపించాయి. ఆయన చెప్పినట్టు తెలుగు ధాతువులతో కొత్తపదాల్ని సృష్టించుకోవచ్చు. కానీ అవి జనానికి పట్టవు. కొత్తగా వస్తున్న పరికరాలకి అంగ్ల భాషా పదాలకి బదులుగా తెలుగు మాటల్ని
సృష్టించాలనే వారు కూడా సంస్కృత మూలాల్ని ఉపయోగించి తయారు చేస్తున్నారు.
వారికి సంస్కృతం దేవబాష. ఆంగ్లం మ్లేఛ్ఛ
భాష. అసలు మ్లేఛ్ఛులంటే ఉచ్చారణ సరిగా రాని వారని అర్థం. సంస్కృత పండితుల దృష్టిలో తెలుగు మ్లేఛ్ఛ భాష అది మాట్లాడే మనమూ మ్లేఛ్ఛులమే. పదాల్ని ఎరువు
తెచ్చుకోవలసి వచ్చినప్పుడు అది అప్పటికే జన బాహుళ్యంలో అలవాటయిన పదాన్నే( అది ఏ
భాషయినా సరే) తెచ్చుకుని అజంతం చేసుకుని తెలుగు పదంగా మార్చుకుందాం. లేని పోని
మాటలు సృష్టించి తెలుగు మాట్లాడ డాన్ని
క్లిష్టతరం చేయవద్దు. ఉదా హరణకి ఇప్పటికే వాడుక లో ఉన్న Pen-drive (పెన్ డ్రైవు) అనే వదానికి తెలుగు మాటని తయారు చేసి
జనామోదంతో దాన్ని వాడుకునేటట్టు చేయగలమా? నాకైతే నమ్మకం లేదు. ఆ అవసరమూ
కన్పించదు.
***
ఇంతకు
ముందు పోస్టులో ఈ పార్శీ ఉర్దూ పదాలగురించి వ్రాస్తానని చెప్పాను. అంటే నేను మీకు
బాకీ ఉన్నట్టు. ఆ బాకీ ఇప్పుడు తీరి పోయింది. (ఈ “బాకీ” కూడా పార్శీ పదమే). సెలవు..
****