21, ఫిబ్రవరి 2012, మంగళవారం

మడిబట్టకట్టి తెలుగును కాపాడుకోగలమా?


                                       
నా చిన్నతనంలో నేనో కథవిన్నాను. ఓ అమాయిక ఛాందస బ్రాహ్మణ వితంతువు తన పెరట్లోని కొబ్బరి చెట్ల కాయలు దొంగలు కోసుకు పోతుండడాన్ని ఆపడానికి, తన పంచ తడిపి మడిగా కొబ్బరి చెట్ల చుట్టూ కట్టిందట. మడి బట్టనెవ్వరూ ముట్టుకోరని ఆవిధంగా కాయలు దక్కుతాయని ఆశ పడ్డది. కానీ మర్నాడు చూస్తే కొబ్బరికాయలూ లేవు. మడిబట్టా లేదట. దొంగలు కొబ్బరి కాయల్ని మడిబట్టలోమూట కట్టుకుని చక్కా పోయారట. ఏ విషయంలోనూ ఛాందసత్వం సమస్యలకి పరిష్కారం కాదని తెలిపే కథ ఇది.
                                                       ***
 నేడు మాతృభాషా దినోత్సవం. మన తెలుగు వారందరం తెలుగుని పరిరక్షించుకోవడానికి కావలసిన ప్రయత్నాలు చేద్దాం.తెలుగు వచ్చిన వారందరం తెలుగు లోనే మాట్లాడడానికీ వ్రాయడానికీ ప్రయత్నిద్దాం.మన పిల్లలందరికీ విధిగా తెలుగు చదవడం వ్రాయడం నేర్పిద్దాం.వీలయితే తెలుగు సామెతల్ని తెలుసుకుని విరివిగా వాడడానికి ప్రయత్నిద్దాం.ఎందుకంటే ఏ భాషకైనా సామెతలే అందాన్ని చేకూరుస్తాయి. పిల్లలకి సామెతల్ని చెప్పి వాటి అర్థాల్ని వివరించి ఏ సందర్భంలోఎలా వాడాలో తెలియజేయండి. కనీసం మనమైనా వాటిని తరచూ వాడుతుంటే కుతూహలంతో వారే అర్థం తెలుసుకుని వాడుతారు. తెలుగు ఉద్గ్రంధాలుకాదు కానీ తెలుగు కథలైనా వారిచేత చదివింపజేయండి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగార్ల తెలుగువచనం చదివితే తెలుగు తీయందనం తెలుసుకుంటారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విషయంలో ఛాందసత్వం పనికి రాదు.ఎక్కడా ఇంగ్లీషు పదం దొర్లకూడదనే నియమం పెట్టుకోవద్దు. అది జరగని పని. అందరికీ అర్థమై ఇప్పటికే జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలను పరిహరించి తెలుగు పదాలను సృష్టించి వాడుకలోకి తేవాలనే వృధా ప్రయాస మానుకోవాలి. ఏదేశంలోనూ ఏ కాలం లోనూ ఈ పరిశుధ్ధతా వాదం అసాధ్యంగానే మిగిలింది. నేడు ప్రపంచ భాషగా వెలుగొందుతున్న ఆంగ్ల భాష అనేకమైన లాటిన్, గ్రీక్,ఫ్రెంచి పదాలను తనలో చేర్చుకోవడం వల్లనే సుసంపన్నమైంది. మన తెలుగు కూడా ప్రత్యేకమైన భాషే అయినా సంస్కృతం నుంచి వేలకొలది పదాలను తనలో చేర్చుకుంది. మొదట్లో రాజాశ్రయం కోసమే పండితులూ, కవులూ సంస్కృతాన్ని ఆశ్రయించినా ఆ తరువాత తరువాత తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి  ఎన్నో సంస్కృత పదాలను తెలుగులోకి తీసుకు వచ్చి మన సాహిత్యాన్ని చాలా వరకూ సంస్కృత పదభూయిష్టం చేసారు. దీని వల్ల కొంత మేలు జరిగినా ఎక్కువగా అచ్చ తెలుగు కనుమరుగవడానికి కారణమైంది. కాని దీనినెవరైనా ఆపగలిగారా?.అలాగే ఆ తరువాత కూడా అనేక రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల పార్శీ ఉర్దూ ఆంగ్ల భాషా పదాలు లెక్కకు మిక్కిలి గా తెలుగులో చేరాయి. వీటిలో కొన్ని చాలా కాలం క్రితమే కావ్యగౌరవాన్ని కూడా పొందాయి. ఫలానాది తెలుగు పదం కాదు పార్శీ లేక ఉర్దూ నుంచి మన భాషలో వచ్చి చేరిందని చెబితే జనం ఆశ్చర్యపోయేంతగా అవి తెలుగులో కలిసి పోయాయి (వాటి ముచ్చట మరోసారి చెబుతాను). ఇన్ని వందలూ వేల పదాలు తెలుగులో వచ్చి చేరినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వస్తున్న  ఆంగ్ల పదాలకు మాత్రం ఎందుకు?  రోడ్డు ఫోను రేడియో,టీవీ వంటి పదాలకు తెలుగు పదాలు సృష్టించి వాడడం నిష్ప్రయోజనం. అటువంటిదే హాస్పిటల్ అనే పదానికి అపభ్రంశ రూపమైన ఆసుపత్రి అనేది. ఈ రెండూ కాకుండా వైద్యాలయం అనేపదం ఏ తెలుగు వాడూ ఎప్పుడూ వాడగా నేను విన లేదు. అందు చేత భాషా పరిరక్షణోద్యమంలో ఛాందసత్వం కూదని తెలుసుకుని మసలుకుంటే అసలుకు మోసం రాదని చెప్పడమే నా ధ్యేయం. ఓ రెండు ముచ్చట్లు చెప్పి ముగిస్తాను:
నేను కాలేజీలో డిగ్రీ చదువుతుండగా (1958-61) మాకు తెలుగు రెండవ పేపరులో వ్యాకరణంతో పాటు ఆంగ్లంనుంచి తెలుగు అనువాదం చేయాల్సిన ప్రశ్న కూడా ఒకటుండేది. ఒకసారి ఆ అనువాదంలో సినిమా అనే పదం వచ్చింది. నా అనువాదంలో దానిని మార్చకుండా సినిమా అనే వ్రాసేను. ఆ పేపరులో నాకు ఫస్టు మార్కు ఇచ్చిన మా  ఆంధ్రోపన్యాసకులు శ్రీ రమణ గారు నన్ను పిలిచి సినిమాకు బదులు చలన చిత్రము అని వ్రాయనందుకు రెండు మార్కులు తగ్గించి నట్లు చెప్పారు. అప్పుడు నేనాయన్ని అయ్యా మీరు ఇంట్లో వాళ్లతో  చలన చిత్రమునకు పోవుదమా అంటారా? లేక సినిమాకు వెళ్దామా అంటారా? అని అడిగాను. దాని ఆయన అది సరేనయ్యా ఇది పరీక్ష కదా? అని అన్నారు. ఆయన చెప్పింది రైటే అయినా యాభై ఏళ్ల తర్వాత ఇవాళ కూడా జనం సినిమాని చలన చిత్రం అని పిలుచుకోవడం లేదుకదా? భేషజాలు మాని ఇటువంటి పదాల్ని తెలుగు వదాలుగా పరిగణిస్తే పోయేదేముంది?
ఆ రోజుల్లోనే  రైల్వేలో పని చేస్తుండే మా బాబాయి ఒకరు చెప్పిన విషయం. రైల్వేలకు సంబంధించి హిందీలో పారి భాషిక పదాల్ని తయారు చేసి ప్రభుత్వం ఇచ్చిన పట్టిక లో రైల్వే సిగ్నల్ కి సూచించిన పదంధూమ్ శకట్ కా ఆవక్ జావక్ సూచక్ యంత్ర్అనిట. ఏం సొగసుగా ఉంది? నాటికీ నేటికీ హిందీ మాట్లాడే ప్రాంతంలో కూడా దానిని సిగ్నల్ అనో దాని అపభ్రంశ రూపమైన సింగల్ అనో అంటారు కానీ  ధూమ్ శకట్ కా... అనే చాంతాడు మాటని ఎవ్వరూ ఉపయోగించరు. (ఇప్పుడైతే ధూమశకటాలే లేవు ఎలక్ట్రికల్ లేక డీసెల్ ఇంజన్లే కాని )
విశాఖ పట్నంలో పోర్టులో సముద్రపు పాయలో పేరుకు పోయే ఇసుకని తవ్వి తీయడానికి డ్రెడ్జర్ వచ్చిన కొత్తలో దానిని అక్కడి పోర్టు కూలీలు తవ్వోడ అని పిలిచేవారట. చాలా చక్కటి మాట. అయినా అదీ జనం వాడుకలో నిలబడకుండా జారిపోయింది. ఏ పదాలు నిలుస్తాయి ఏవి నిలవవు అనేది. వాటి వాడుకలో ఉండే సౌలభ్యాన్ని బట్టి కాలమే నిర్ణయిస్తుంది.
మనం మడి బట్ట కట్టి భాషని కాపాడలేం.
సెలవు.